Update 01

అదృశ్య మందిరం

అదొక పెద్ద సౌధము. రాతి కట్టడం. మొదటి సారి చూడగానే ఇంద్రభవనమేమో అనిపించక మానదు. ఆ భవనానికి అభిముఖంగా రోడ్డు మీద నిలబడి చూస్తే అదొక వెండితెరలా రోడ్డుకి ఇరువైపులా పరుచుకుని అనంతంగా వ్యాపించి ఉందేమో అనిపిస్తుంది. రాత్రుళ్ళు అయితే ఆకాశంలోని నక్షత్రాలని చూడాలో ఈ భవంతి గోడలను చూడాలో అర్థం కాని సందిగ్ధంలో పడిపోతారు ఎవరైనా. అంతలా మిరుమిట్లు గొలుపుతాయి ఆ రాతిగోడలు. చూసేవారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. కొన్ని సార్లు ఆకాశం నుండి నక్షత్రాలు రాలినట్టు అప్పటిదాకా మెరుస్తూ ఉన్న ఆ గోడలు అమాంతం తమ వెలుగును కోల్పోయి కిందకు పడిపోవటం 8వ వింతే. అలాంటి విచిత్ర దృశ్యాన్ని చాలా సార్లు కళ్లారా వీక్షించామని చూపరులు చెప్పటం రాజవరం ప్రజలకు కొత్తేమీ కాదు. పైగా అలా చెప్పగానే ఫక్కున నవ్వేసి వెళ్ళిపోయేవారు. ఈ భవంతికి కూతవేటు దూరంలో వుంది రాజవరం. రాజవరంలో మొత్తం కలిపినా 20 మందే ఉంటారు. ఆ 20 మందీ గతిలేక, దిక్కుతోచక అక్కడుంటున్నారనే విషయం వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. వారి తీరుతెన్నులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. పైకి పెద్దగా మాట్లాడినట్టు కనబడరు. లోలోపల ఎన్నో మంతనాలు జరుపుతారు. ఏదో అర్థం కాని భాషొకటి మాట్లాడుకుంటూ ఉండటం చూశామని వీళ్ళని గమనించిన కొందరు పాదచారులు చెబుతూ ఉంటారు. ఈ కట్టడం వెనక ఉన్న అదృశ్య శక్తులేంటో తెలుసుకుందామని ప్రతీ ఒక్కరికి ఆసక్తి ఉండేది. అవును. అది ఒకప్పటి మాటే. ఇప్పుడు కాదు. అంతక్రితం ఈ భవనంలో ఏముందో తెలుసుకుందామని వెళ్లిన ఐదుగురి ఆచూకి ఇప్పటికీ తెలియలేదు. అందుకే అప్పటి నుండి 'అదృశ్య మందిరం' అన్న పేరొచ్చింది. 'అదృశ్య మందిరం' గురించి ప్రతి ఒక్కరిలో ఉత్సుకత ఉన్నా సరే అంతే మోతాదులో భయం కూడా ఉండటంతో ఆ ఐదుగురి తరువాత ఆ మందిరంలోకి అడుగు పెట్టగలిగే దమ్మూ, ధైర్యం ఉన్న మగాడు ఆరో వాడు ఇంకొకడు కనిపిస్తే ఒట్టు.

--------------------------------------------------------------------

అదృశ్య మందిరం

అంతులేని పయనాలెన్నింటికో....ఆరంభమిది


అదృశ్య మందిరంలో ఏముందో తెలుసుకుందామని రాజవరం గ్రామానికి వెళ్లిన ముగ్గురు సి.బి.ఐ. ఆఫీసర్ లు అభిజిత్, అంకిత మరియు సంజయ్ అక్కడ జరిగే పరిణామాల వల్ల వారికి సిద్ధపురుషుడు తారసపడతాడు.

ఘోర కలి తన చీకటి రాజ్యాలు అన్నింటినీ విడుదల చేస్తాడు.

ప్రపంచంలోని అన్ని దేశాల నాయకులనూ భయపెడతాడు. తన చీకటి రాజ్యాలను విస్తరించుకుంటూ పోతాడు.

ముందు ముందు ఘోర కలి వల్ల జరగబోయేఎన్నో పెను ప్రమాదాల నుండి ప్రపంచాన్ని రక్షించటానికి సిద్ధపురుషుని నేతృత్వంలో అభిజిత్, అంకిత, సంజయ్ లు శంభల రాజ్యానికి పయనమవుతారు.

ఘోర కలి బారి నుండి ప్రపంచాన్ని వారెలా కాపాడారో తెలుసుకోవాలంటే ఈ"అదృశ్య మందిరం"లోకి మీరు

అదృశ్యమైపోయిచదవాల్సిందే.

సి.బి.ఐ. స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ – ముంబై

సి.బి.ఐ. ఈ కేసు విచారణని ముంబైకి మళ్లించింది. డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయ్యి, చురుకుగా పనిచేస్తూ 'యంగ్ అండ్ ఎనర్జెటిక్' అని పేరు తెచ్చుకుంటున్న అభిజిత్, అంకితలకు ఈ కేసుని అప్పగించారు.

రాజవరానికి బయలుదేరి వెళ్లే ముందు సుపీరియర్ ఆఫీసర్ అశుతోష్ వాళ్ళని ఇలా హెచ్చరించాడు.

"అభిజిత్...అంకిత మీ మీద మాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంతకముందు ఆ రాజమహల్లో అడుగుపెట్టిన ఐదుగురు కనిపించకుండా పోయారు. మీరు ఉండాల్సింది రాజవరంలో. మీతో పాటుగా సంజయ్ వస్తున్నాడు. అక్కడ మీరుండటానికి స్పెషల్ పెర్మిషన్స్ తో మంచి లాడ్జింగ్ ఏర్పాటు చేశాను.

నాకు ఎప్పటికప్పుడు మీ నుండి అప్డేట్స్ కావాలి. నాకు పై ఆఫీసర్స్ నుండి ప్రెషర్స్ ఎక్కువవుతున్నాయి.

లాస్ట్ గా, వన్ థింగ్. స్టే సేఫ్. ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. ఇది మీ వెల్ విషర్ గా చెబుతున్న మాట."

అభిజిత్,"అసలు ఏముంది సర్ ఆ 'అదృశ్య మందిరం' లో? అందరూ మమ్మల్ని తెగ భయపెడుతున్నారు ! ఆత్మలున్నాయా? నేనసలు నమ్మను అలాంటి వాటిని. ఈ కేసుని ఎవ్వరూ ఊహించనంత త్వరగా సాల్వ్ చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్."

సంజయ్,"పాతాళలోకాల గురించి ఐడియా ఉందా అభిజిత్?"

అభిజిత్,"లేదు సర్. నేను హిస్టరీలో చదువుకోలేదెప్పుడు. ఇదే మొదటిసారి వినటం."

సంజయ్,"అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాల్ని సప్త పాతాళలోకాలు అంటారు. ఆ లోకాల్లో ఉండేవాళ్ళని కళ్లారా చూసినట్టుగా చెప్పాడు రాజభవనంలో తప్పిపోయిన ఆ ఐదుగురిలో ఒకరైన రాధాకృష్ణన్. చివరి నిమిషాల్లో ఆయన తన బ్లాగ్లో పెట్టిన పోస్టులో ఉందిది."

అంకిత,"నేనిది చదివాను కానీ నమ్మలేదు. ఆయన అకౌంట్ నుండి వేరే ఎవరైనా అలా పోస్ట్ చేసుంటారు అనుకున్నా. ఆ ఐదుగురితో పాటు ఆయన మిస్సింగ్ అని తెలిసి అప్పటికే రెండేళ్లు అయింది కదా."

సంజయ్,"ఆయన ఆ పోస్ట్ మొబైల్ నుండి పెట్టారు. ఒక ఫోటో కూడా అప్లోడ్ చేశారు. అదేంటో అర్థం కాట్లేదు. లొకేషన్ ట్రేస్ చేసి చూసాం కోఆర్డినెట్స్ అన్నీ విచిత్రమైన టైం జోన్ ఒకటి చూపిస్తున్నాయి. ఇది ప్రస్తుతానికి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఆయన తన అకౌంట్ డీటెయిల్స్ వేరే ఎవ్వరితోను షేర్ చెయ్యలేదు. సో, ఖచ్చితంగా ఆ పోస్ట్ ఆయనదే. త్వరలోనే హ్యాకింగ్ డేటాబేస్ లో ఆయన తనతో పాటు తీసుకెళ్లిన సీక్రెట్ కెమెరా ఫుటేజ్ బయట పడుతుంది. అప్పుడు మరిన్ని విషయాలు బయటికొస్తాయ్. ఇన్ని రోజులూ ఆ ఫుటేజ్ కి యాక్సెస్ ని ప్రైవేట్ మోడ్ లో ఉంచారు. లాగిన్ అవ్వాలంటే సెక్యూరిటీ కోడ్స్ తన మొబైల్ కే వచ్చేలా పెట్టుకున్నాడు. ఇప్పుడు మనవాళ్ళు దాన్ని బ్రేక్ చేశారు. తొందర్లోనే మనం 'అదృశ్య మందిరం' లోపలి విజువల్స్ చూడబోతున్నాం."

అభిజిత్,"మీరు చాలా స్టడీ చేసినట్టున్నారు. గ్రేట్. బట్, ఈ మైథాలజీని మీరు నమ్ముతారా? నేను అవేవి చదవలేదు కాబట్టి ఎవిడెన్స్ లేకుండా దేన్నీ నమ్మలేను."

అంకిత,"అందుకే నేనూ నమ్మలేదు."

సంజయ్,"వినటానికి ఇంటరెస్టింగ్ గా ఉంది కదా. కొన్ని రోజులు నమ్మేద్దాం. మైథాలజీ రిఫర్ చేసినట్టు కూడా ఉంటుంది. ఏమో ఏదైనా క్లూ దొరకచ్చేమో."

అభిజిత్,"కరెక్ట్ గా చెప్పారు. నేను మైథాలజీ చదవలేను బాబోయ్. ఇందులో మాకు ఏ డౌట్ వచ్చినా, ఇక నుంచి మీరే మమ్మల్ని గైడ్ చెయ్యాలి."

అశుతోష్," సంజయ్ ని మీకు తోడుగా ఎందుకు పంపిస్తున్నానో ఇప్పుడర్థం అయ్యిందా? సంజయ్ కి ఈ కేసులో స్పెషల్ ఇంటరెస్ట్ ఉంది. చాలా ఎక్కువ తెలుసుకున్నాడు ఈ రెండేళ్లలో. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాడు.

విష్ యు ఆల్ ది బెస్ట్.

హ్యాపీ జర్నీ టు 'అదృశ్య మందిరం'.

క్షేమంగా వెళ్లి మాయమైపోకుండా తిరిగిరండి."

---------------------------------------------------

శంభల రాజ్యం

ఇచట రాజభోగాల కంటే.....రాచకార్యాలకే విలువెక్కువ


ప్రభూ అంటూ పరుగు పరుగున తరలి వచ్చాడు వేగు.

"ఏమిటా వేగిరపాటు? ఏమైంది?"

"శంభల రాజ్యం యుద్ధానికి సంసిద్ధం అవ్వాల్సిన తరుణం త్వరలోనే రానుంది."

"మరో 300 ఏళ్ళ వరకు అసంభవం అది."

"లేదు, అనిరుద్ధా. మీరిది విన్నారంటే తత్ క్షణమే సైన్యాన్ని సమాయత్తమవని ఆదేశాలు ఇచ్చెదరు."

"అదేమిటో వివరంగా చెప్పండి."

"ప్రపంచంలో పలు చోట్ల చీకటి రాజ్యాలు తమ ఉనికిని చాటుతున్నాయి. పరిస్థితి తీవ్రతరం అవ్వకమునుపే వాటిని మనం హతమార్చాలి. లేనిచో ఎప్పుడో జరగాల్సిన 'మహా ప్రళయ సంగ్రామము' మీ కాలచక్రంలోనే సంభవించును."

"శంభల రాజ్యానికి ...శంభుడు రాజాధిరాజు ఒక్కడే - కల్కి.

ఆయన మాత్రమే ముందుండి నడిపించగలడు ఆ మహా ప్రళయ సంగ్రామాన్ని. నేను ఆయన ఆజ్ఞాకారిని మాత్రమే."

కొంతసేపు మౌనం ఆవహించింది ఆస్థానంలో.

"మీరు చెప్పిన ఆ చీకటి రాజ్యాల గురించి నాకెప్పటికప్పుడు భూలోకంలోని దలై లామాల నుండి సమగ్రమైన సమాచారం అందుతూనే ఉంది. భూలోకంలో మా కోసం పని చేసేవారు కొందరున్నారు. వారిని నియమించటంలో ప్రముఖ పాత్ర పోషించింది దలై లామాలే.

వీరు శంభల రాజ్యానికి, బాహ్య ప్రపంచానికి మధ్య వారధి వంటివారు.

అక్కడ ఎవ్వరు, ఏ కీడు తలపెట్టాలని చూసినా మొదటిగా తెలిసేది మాకే."

------------------------------------------------

రాజవరానికి స్వాగతం

ఇక్కడ స్తంభించి పోయింది కాలం


అశుతోష్ చేసిన ఎన్నో సూచనలను మైండ్ లో పెట్టుకుని రకరకాల ఆలోచనలతో రాజవరం చేరుకున్నారు అభిజిత్, అంకిత మరియు సంజయ్.

రాజవరం ఒక విచిత్రమైన గ్రామం. తిప్పి కొడితే 20 మంది ఉండరు. కానీ అక్కడ వారిదే రాజ్యం. వాళ్ళు చెప్పేదే నిజం. వారిదే పెత్తనం.

నీళ్లు కావాలన్నా వాళ్ళే తేవాలి. పాలు కావాలన్నా వారినే అడగాలి. అలాంటి పరిస్థితి అక్కడెందుకు ఏర్పడిందో వాళ్ళకీ, ఆ దేవుడికీ తప్ప మరొక వ్యక్తికి తెలీదు. అశుతోష్ సరైన లాడ్జింగ్ అయితే ఏర్పాటు చేయగలిగాడు కానీ, భోజనం ఇతరత్రా విషయాల్లో ఆ ఊరి ప్రజలే దిక్కైపోయారు.

టు స్టోరీ బిల్డింగ్ ఒకటి స్పెషల్ గా సి.బి.ఐ. తరఫున అశుతోష్ అడగటంతోదొరికింది. లేకపోతే అదీ కష్టమే.

మొదటి ఫ్లోర్ సంజయ్, అభిజిత్ లకు రెండో ఫ్లోర్ అంకితకు కేటాయించారు. అంకిత తన రూమ్ కిటికీ నుండి చూస్తే రాజవరం కాస్త దగ్గరగా, అదృశ్య మందిరం దూరంగా కనిపిస్తుంది.

అంకిత రాజవరం ప్రజలను స్టడీ చేద్దామని మనసులో అనుకుంది. అభిజిత్ తనకు ఈ కేసు అసలు పట్టనట్టు పైకి నటిస్తున్నాడు. మైథాలజీ మీద తనకు పట్టు లేకపోవటాన్ని ఒక మైనస్ పాయింట్ లా ఫీల్ అవుతున్నాడన్న విషయం అర్థం అయిపోయింది అంకితకు. బేసిక్ గా ఇన్వెస్టిగేటివ్ మైండ్ అవ్వటం వల్ల అవతలి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్న ట్రాక్ ఒకటి మైండ్లోరన్ అవుతూనే ఉంటుంది తనకు. అభిజిత్ విషయంలో అది ఇంకాస్త ఎక్కువే అని చెప్పొచ్చు.

ఊహ తెలిసినప్పటి నుండి అంకితకు పర్టికులర్ గా ఏ అబ్బాయి నచ్చలేదు. తనింట్లో మిలిటరీ డిసిప్లిన్ తో పెరిగింది. తమ్ముడు కానీ, చెల్లెలు కానీ లేరు. తనొక్కత్తే కూతురు. ఫ్రెండ్స్ లో అబ్బాయిలను ఎంటర్టైన్ చెయ్యలేదు వాళ్ళ నాన్నగారు. ఆయనకి అబ్బాయిలంటేనే సదభిప్రాయం లేదు.

మీరూ ఒకప్పుడు కుర్రవాడే కదా డాడీ ఎందుకంత కోపం అబ్బాయిలంటే ? అని తిరిగి క్వశ్చన్ చేసిందో రోజు.

చెంప చెళ్లుమన్న శబ్దం వాళ్ళుండే క్వార్టర్స్ చివరి దాకా ప్రతిధ్వనించింది, ఎమర్జెన్సీ టైములో వినబడే సైరన్ ధ్వనిలా. ఆరోజు నుండి అబ్బాయిల టాపిక్ ఇంట్లోనే కాదు,తన మనసులో కూడాతేవటం మానేసింది. మరీ అంతలా కొడితే టీనేజ్ లో బలంగా ముద్రపడిపోతుంది. నాన్నే కదా కొట్టింది అనుకునేంత మెచూరిటీ ఉండని వయసది.

జాబ్ లో జాయిన్ ఐన ఇన్నాళ్లకు అభిజిత్ అనే యువకుడితో కలిసి పని చెయ్యటం. అభిజిత్ ఏ రోజూ ఆర్డినరీ గా అనిపించలేదు. అఫ్ కోర్స్ కనిపించలేదు కూడా.

అలా అభిజిత్ గురించిన ఆలోచనల్లో ఉండగానేబయటనుండి కనిపించినఒక దృశ్యంతోతనుఅలర్ట్ అయింది. ఒక గుర్రం మీద సైనికుడు స్వారీ చేసుకుంటూ తనుండే బిల్డింగ్ వైపుగా వస్తున్నాడు. ఆ సైనికుడి చూపులు తనమీదే ఉండటం అంత దూరం నుంచే గమనించగలిగింది. వెంటనే ఇంటర్ కామ్ లో అభిజిత్ కి కాల్ చేసి చెప్పింది.

అభిజిత్, అంకిత, సంజయ్ ముగ్గురూ కిందికొచ్చేశారు.

గుర్రం సరిగ్గా ఆ బిల్డింగ్ ఎదురుగా వచ్చిఆగింది. ఆ సైనికుడు నడుచుకుంటూ వీళ్ళ వైపే వస్తున్నాడు. వీళ్ళను చూడగానే నమస్కారం అన్నట్టు చేతులు జోడించి లోపలికెళ్ళి మాట్లాడుకుందామా అన్నట్టు సైగ చేసాడు. నలుగురూ లోపలికి కదిలారు.

"ఈ రాజవరం మొత్తం మీద మీరు మాట్లాడే భాష మాట్లాడగలిగిన వాణ్ణి నేనొక్కడినే. నాకు మీలా ఇంగ్లీష్ భాష రాదు. ఏవో కొన్ని పదాలు తెలుసంతే. రోజూవారీ ఉపయోగించేవి.

ఇకపోతే, మీ పైవాళ్ళు ఇక్కడ మీకుబస ఏర్పాటు చెయ్యటానికి కొద్ది రోజుల క్రితమేవచ్చారు. వాళ్లకూ ఇదే చెప్పాను. ఇప్పుడు మీకూ ఇదే చెబుతున్నాను.

'అదృశ్య మందిరం' గురించి మరిచిపోండి. అది మీ కంటికి కనబడేది కాదు. అక్కడ చాలా జరుగుతాయి. అవి ఎందుకు జరుగుతాయో అతి కొద్ది మందికి మాత్రమే అర్థం అవుతాయి. నాకు అర్థం అవుతాయి అని నేనను కానీ మీలా పరిశోధనలు మాత్రం చెయ్యను. అంత మాత్రం ఇంగితం ఉంది నాకు."

సంజయ్, "చూడండి. మేమెలాంటి పరిశోధనలూ చెయ్యట్లేదు. ఇక్కడికొచ్చింది తప్పిపోయిన ఆ ఐదుగురిని కనిపెట్టటానికి. అది మా బాధ్యత. వారి కుటుంబాలకు మేమేం చెప్పుకోవాలి? . వాళ్ళు దొరకటానికి వున్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తాం"

"వాళ్ళు దొరకరు", తడుముకోకుండా వచ్చిన జవాబులా అనిపించింది.

అభిజిత్,"వాళ్ళు దొరికే వరకు మేము ఇక్కడి నుంచి కదలము."

"అయితే రాజవరంలో మా భాష నేర్చుకుని మాతోనే ఉండిపోరాదు ఇక్కడే", అంటూ గట్టిగా నవ్వాడు అతను.

"మీరు సైనికుడా?" అడిగింది అంకిత.

"ఒకప్పుడు", అటు నుండి జవాబు.

"మరిప్పుడు?" అడిగాడు సంజయ్.

"రాజవరం గ్రామానికి అన్నీ నేనే. నా పేరు అధిష్ఠా"

"అధిష్ఠా అంటే ఏంటి అర్థం?", అడిగాడు అభిజిత్.

"నేను పుట్టిన ఊరి పేరది.కొన్ని కారణాల వల్ల అక్కడి నుండి బానిసగా ఇంద్రప్రస్థానికి వచ్చాను. అక్కడే నన్ను సైన్యంలోకి తీసుకున్నారు."

"ఇంద్రప్రస్థము అంటే ఢిల్లీ ఆ?" అడిగాడు సంజయ్.

సమాధానము లేదు.

"ఈ ఊరికి రాజవరం అనే పేరెలా వచ్చింది?" అడిగింది అంకిత.

"ఈ ఊరిపేరు రాజవ్రణము. వ్రణము అనగా పుండు. ప్రాణాంతకమైన పుండు. కాలక్రమేణా రాజవరం అని పిలవబడుతోంది."

"ఏంటో....ఏం అర్థం కావట్లేదు. ఢిల్లీ ని ఇంద్రప్రస్థము అంటారు. ఇప్పుడిది రాజవరం కాదంటున్నారు. అసలు ఏ కాలం మనిషండి మీరు?" ఉన్నదున్నట్టు అడిగేశాడు అభిజిత్.

"కాలాతీత శాపగ్రస్తులం మేము. సమయం వచ్చినప్పుడు మా గురించి మీకే తెలుస్తుంది. దయచేసి ఇంతకంటే ఎక్కువ అడగకండి.

మీకు తినటానికి, కావాల్సినవి తేవటానికి పక్కనే ఉన్న పల్లెలోంచి ఒక కుర్రాడొస్తాడు. చిన్నా అంటారు అతన్ని. మీకేది కావాలన్నా అతన్నే అడగండి. మాకు చెప్పకుండా వేరే ఇంకెవర్ని మీరు కలవకూడదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. వుంటాను మరి. సెలవు", అనేసి అక్కడినుండి వెళ్ళిపోయాడు అధిష్ఠా.

తను వెళ్తున్న వైపే చూస్తూ రోడ్డు మీద నిల్చున్నారు అభిజిత్, అంకిత, సంజయ్.

కొంతసేపటికి దూరం నుండి అదృశ్య మందిరం తళుక్కున మెరుస్తూ కనిపించింది వాళ్ళ కళ్ళకి.

ముగ్గురూ ఆ భవనం వైపుకు పరుగులు తీశారు.

--------------------------------------

చీకటి రాజ్యం

ఇక్కడ కనిపించే ప్రతీది అబద్ధమే


చుట్టూచీకటి అలుముకోవటంతో తళతళ మెరుస్తున్న ఆ భవనపు కాంతులు రెట్టింపు అయ్యి కనబడుతూ కంటికి ఒక అద్భుతంలా అనిపిస్తున్నాయి.

పరిగెడుతూ ఆ అదృశ్య మందిరం ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.

చూసే కొద్దీ ఏదో లోకం తమని అటు వైపుగా ఆహ్వానిస్తున్నట్టు బలంగా అనిపించింది ముగ్గురికీ.

వాళ్ళని కాస్త దూరం నుంచే చూసిన అధిష్ఠా, విస్తుపోయి వారి వద్దకే నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడికి చేరుకొని వాళ్ళతో ఇలా అన్నాడు.

"ఈ సమయంలో మీరు ఇక్కడికి రాకూడదు. సాయం సంధ్యా సమయమిది. ఇప్పుడు మీరా అదృశ్య మందిరం కాంతిని అస్సలు చూడకూడదు. మాయకు గురవుతారు", అన్నాడు అధిష్ఠా.

ఆ రాజభవంతినేచూస్తూ,

"చూస్తూంటే నమ్మేలా లేదు.....ఇంత పెద్ద భవనం నేను సినిమాల్లో కూడా చూడలేదు.....సెల్ఫీ తీసుకోనివ్వు బాసు ముందు",అన్నాడు అభిజిత్.

"మీకు చెబుతుంటేఅర్థం కావట్లేదా? ఏదైతే అద్భుతం అని మీరు అనుకుంటున్నారో అది లేదక్కడ"

అధిష్ఠా ఆ మాట అనగానే ముగ్గురూ ఒకేసారి అతని వైపు తిరిగి చూసారు ఏమీ అర్థం కానట్టు.

అంకిత సెల్ఫీ ఒకటి తీసుకుంది. ఆ సెల్ఫీ చూడగానే వణికిపోయి మొబైల్ కిందపడేసింది. సెల్ఫీలో బాక్గ్రౌండ్ లో ఉన్నట్టు కాంతులు విరజిమ్మే పెద్ద భవంతికి బదులుగా ఏవేవో వికృతమైనగుర్తులతో వున్న చీకటి రాజ్యం ఒకటి కనిపించింది. చూడటానికే భయమేసేలా ఉందది.

అధిష్ఠా వెంటనే వాళ్ళని అక్కడి నుండి కదలండి అన్నట్టు సైగ చేసాడు.

"ఇక్కడ జరిగిన దాని గురించి నేనుమీతో రేపు చర్చిస్తాను. ఇప్పుడు సరైన సమయం కాదు", అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు.

ముగ్గురూ ఎంత ఫాస్ట్ గా అక్కడికొచ్చారో అంత కంటే ఫాస్ట్ గా వాళ్ళుండే లాడ్జింగ్ కి చేరిపోయారు. ముగ్గురికీ రాత్రంతా నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు అధిష్ఠా వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ కూడా తొందరగా ముగించారు.

పొద్దున్న 8 .30కి అధిష్ఠా వాళ్ళుండే చోటుకు చేరుకున్నాడు.

తనకోసమే ఎదురుచూస్తున్నట్టు వాళ్ళని చూడగానే అర్థం అయిపోయింది.

కొంచెం సేపు ఆగి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు.

"నిన్న మీరు ఆ చిత్రంలో చూసింది ఈ లోకంలో ఉండే మందిరం కాదు.

అదొక చీకటి రాజ్యం. రౌరవాది అతి భయంకరమైన నరకంలో కష్టాలు అనుభవించినా పాపం తీరని క్రూరులు కొంతమంది

ఇక్కడికొచ్చి కట్టుకున్న సామ్రాజ్యం అది. పాతాళలోకాల్లో దిగువన ఉంటుందిది."

"పాతాళలోకం కింద ఉందంటున్నారుకదా. వాళ్ళు ఇక్కడికి ఎలా రాగలిగారు?" అడిగాడు సంజయ్.

"వాళ్ళు ఎన్నో ఏళ్ళు శిక్షలు అనుభవించారు. చేసిన పాపాలు అలాంటివి. ఇక్కడికి ఎంత మంది వచ్చారో ఎవ్వరికీ తెలీదు. గురుత్వకేంద్రం లేని ప్రదేశాలు కొన్ని ఉంటాయి ఈ భూమ్మీద. వాటి ద్వారా ఆ లోకాల వాళ్ళు రాగలిగే అవకాశం ఉంటుందని నేనెప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను. నేనెప్పుడూ నమ్మలేదు. ఈ అదృశ్య మందిరంలోకి అడుగుపెట్టాక నమ్మాల్సి వచ్చింది."

"వాట్!" ఆశ్చర్యపోయింది అంకిత.

"అదృశ్య మందిరంలోకి మీరెప్పుడు అడుగుపెట్టారు?" అంది.

"ఒక 50 సంవత్సరాల కిందట. నేనే కాదు. నాతో పాటు ఈ రాజవరంలోఉండే 20 మంది కూడా."

"వెయిట్....అసలు ఈ గురుత్వ కేంద్రం అంటే ఏమిటి?" అడిగాడు అభిజిత్

"సెంటర్ అఫ్ గ్రావిటీ", బదులిచ్చాడు సంజయ్.

"గ్రావిటీ లేని ప్రదేశమా ఆ అదృశ్య మందిరం !"

ఆశ్చర్యపోయారు అభిజిత్, అంకిత లు.

"గ్రావిటీ లేకపోవటం అంటే మన భూమ్మీద ఉండే గ్రావిటేషనల్ కాన్స్టాంట్ అప్లై కాదు అని....అసలు గ్రావిటీ నే లేదు అని కాదు....గ్రావిటీ లేకుండా ఏది నిలబడలేదు కదా" అన్నాడు సంజయ్.

"కరెక్టే అనుకో", అన్నాడు అభిజిత్.

"బట్ ఇదంతా నమ్మటం ఎలా?" అంది అంకిత.

"నాకు తెలిసింది చెబుతాను. నమ్మటం, నమ్మకపోవటం మీ మీద ఆధారపడి వుంది.

ఈ సృష్టి చేయకముందు అంటే కొన్ని యుగాల ముందు భూమి సముద్రగర్భంలో అడుగున రసాతలంలో ఉండేది. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలని 7 ఉన్నాయి", అని అధిష్ఠా చెబుతుండగా

"హా....ఇక్కడికొచ్చే ముందే సంజయ్ చెప్పాడు మాకు ఈ పాతాళ లోకాల గురించి", వాటి గురించి ముందే విన్నట్టు అనిపించి తనూ గొంతు కలిపాడు అభిజిత్.

అధిష్ఠా చెబుతుంటే మధ్యలోడిస్టర్బ్ చేసినందుకు అభిజిత్ వంకచిరాకుగా చూసారు సంజయ్, అంకితలు.

"సారీ....యు గో ఎహెడ్ అధిష్ఠా" అన్నాడు అభిజిత్ తన రెండు చేతులతో థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ.

"ఆ పాతాళ లోకాలలో ఒకటైన రసాతలంలో ఉన్న భూమిని వరాహమూర్తి పైకి తీసుకొచ్చాడు అని చెబుతుంది మన విష్ణు పురాణం. పాతాళలోకం నుంచి పైకి రావటం అన్నదానికి మన దగ్గరున్న ఏకైక నిదర్శనం ఇదొక్కటే.అందుకే మా గురువుగారు పాతాళలోకం వాళ్ళు పైకొస్తారు అని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాని విషయమది అని నవ్వుకునే వాడిని.

ఇప్పుడు ఈ చీకటి రాజ్యాన్ని చూసాక నమ్మాల్సి వస్తోంది.

నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పిదం అదృశ్య మందిరంలోకి అడుగుపెట్టడం. నాతో పాటు ఇంత మంది జీవితాల్ని బలిచేయ్యటం.

ఏదైనా విధిలిఖితం అని మన పెద్దలు ఊరికే అనలేదు. వాళ్ళు ఏదైనా చెబుతున్నప్పుడు మనం వినిపించుకోము. ఏదైనా కీడు జరిగినప్పుడు వాళ్ళు చెప్పింది గుర్తుకొచ్చి బాధపడతాం."

"మేమంటే ఈ సైన్స్, టెక్నాలజీ లో పెరిగినోళ్ళం.....మేము పెద్దవాళ్ళ మాట వినట్లేదంటే నమ్మొచ్చు....మిమ్మల్ని చూస్తుంటే యుద్ధాలు చేసిన బ్యాచ్ లా ఉన్నారు. మీరు కూడా వినేవారు కాదా?" లాజిక్ తీసాడు అభిజిత్.

"మేము అలా ఉన్నాం కాబట్టే కదా....మీరిలా ఉన్నారిప్పుడు", అని గట్టిగా నవ్వాడు అధిష్ఠా.

"అయినా మాకంటే మీరు మంచోళ్ళే బాబు.....అమ్మాయి కనిపిస్తే చాలు మా కళ్ళు అటే వెళ్లిపోయేవి....", అంటూ సిగ్గుపడ్డాడు అధిష్ఠా.

"తప్పు మాట్లాడుంటే క్షమించమ్మా", అని అడిగాడు అంకితను.

అధిష్ఠా ఇలా కూడా జోక్ లు పేలుస్తాడా అని ఒక్క నిమిషం షాక్ అయ్యారు ముగ్గురూ.

వెంటనే నవ్వేశారు.

అంతలోనే బయట నుండి నగారా వినబడటంతో అందరూ కిటికీ లోంచి చూసారు.

విచిత్రం.

అదృశ్య మందిరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అన్ని రోజుల నుండి చూసిన భవంతిలా లేదిప్పుడు.

స్వర్గంలోని దేవతల నివాసస్థానంలా ఇంకా వెలిగిపోతోంది. పొద్దున్న 10 గంటలకు ఏ చీకటీ లేకపోయినా సూర్యుని తేజస్సుతో పోటీ పడుతూ

ధగ ధగా మెరుస్తోంది ఆ అదృశ్య మందిరం.

అభిజిత్, అంకిత, సంజయ్ లతో పాటు అధిష్ఠా కూడా విస్తుపోయి చూస్తున్నాడు ఆ అద్భుత దృశ్యాన్ని.​
Next page: Update 02