Update 08

అభిజిత్, అంకితలు వేసుకున్న దుస్తులు మారిపోయాయి. అక్కడి ప్రాంగణం అంతా చీకటిగా మారిపోయింది. అభిజిత్, అంకితలకు అసలు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఎన్నో నక్షత్రాలు చుట్టూ కనబడుతున్నాయి. 27 నక్షత్రాలున్నాయి. దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కుమార్తెలు ఆ 27 నక్షత్రాలు. దక్షుడు చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చెయ్యటం అభిజిత్, అంకితల కళ్ళ ముందు కనబడుతోంది. చంద్రుడు రోహిణీకి బాగా దగ్గరయ్యి మిగతా 26 మందినీ దూరం పెట్టడం, ఆ 26 మందీ దక్షుని దగ్గరికి వెళ్లి తమ బాధను మొరపెట్టుకోవడం, దక్షుడు చంద్రుని దగ్గరకొచ్చి హెచ్చరించటం ఇవన్నీ ఒక దాని తర్వాత మరొకటి అభిజిత్, అంకితల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దక్షుడి శాపంతో చంద్రుడు ఒక చోట కూర్చుని రోదిస్తూ ఉండటం కనిపించింది అభిజిత్, అంకితలకు. వారి కళ్ళ ముందే చంద్రుడు అలా బాధపడటం చూసి చలించిపోయారు. ఓదార్చటానికి దగ్గరకి వెళ్లే లోపు చంద్రుని దగ్గరికి బ్రహ్మ వచ్చాడు.

"అదిగో అటు వైపు చూడు", అంటూ బ్రహ్మ చూపిస్తున్న దిశగా చూసిన చంద్రుడు ఆశ్చర్యపోయాడు. అభిజిత్, అంకితలు కూడా అటు వైపు చూసారు. వారి కళ్ళను వారే నమ్మలేనట్టుగా ఉందా అద్భుతం.

అదొక పాల సముద్రం. ఆ పాల సముద్రంలో ఎగసి పడే అలలు. ఎవరో కవ్వముతో చిలుకుతున్నట్టుగా అక్కడ ఆ పాల సముద్ర మథనము జరుగుతోంది. పాల సముద్రములో ఎగసి పడే ప్రతీ అల వల్ల అక్కడ పాల నురుగు అంతకు అంత పెరుగుతూ పోతోంది. పెరుగుతున్న ఆ పాల నురుగు చిక్కగా తయారవుతోంది. అలా కొంతసేపు ఆ పాలసముద్రంలో జరిగే మథనాన్నే చూస్తూ ఉన్నారు అభిజిత్, అంకితలు. ఆ పాల నురుగు చిక్కదనం ఎక్కువవుతూ పోగా అందులో నుండి ఉద్భవించాడు చంద్రుడు. ఇదంతా బ్రహ్మ చంద్రుడికి చూపించాడు. బ్రహ్మ చంద్రుడితో ఇలా అన్నాడు.

"అది నీ పుట్టుక, చంద్రమా. అలాంటి నువ్వు ఇలాంటి స్థితిలో ఉండటం లోకానికే అమితమైన బాధ. దక్షుడు నీకిచ్చిన ఈ క్షయ వ్యాధి పోవాలంటే నీ మనసును ఆ పరమశివుని యందే లగ్నం చేసి ఉంచు. కఠినమైన తపస్సును ఆచరించు. ఆ పరమశివుడే నీకు దారి చూపిస్తాడు. విజయోస్తు", అని అంతర్ధానమయ్యాడు.

చంద్రుడు నిష్ఠగా శివుణ్ణి పూజిస్తే, శివుడు ప్రత్యక్షం అయ్యి శుక్ల పక్షంలో చంద్రుడు క్రమక్రమంగా వృద్ధి చెందేలా, కృష్ణ పక్షంలో మాత్రం క్షీణిస్తూ ఉండేలా దక్షుడిచ్చిన శాపాన్ని సడలించాడు. పూర్తిగా ఆ శాపాన్ని తొలగిస్తే దక్ష ప్రజాపతి వాక్కుకు అర్థం లేకుండా పోతుంది. అందుకే శివుడు చంద్రుని ప్రార్థన మేరకు ఆ చంద్రుణ్ణి శిరస్సున ధరించాడు. చంద్రుడు పార్వతీ దేవి భక్తుడయిపోయాడు. పన్నెండు మంది అమ్మవారి మహాభక్తులలో ఒకడయ్యాడు.

ఆ రోజు నుండి చంద్రుడు మహాశివభక్తుడిగా గొప్ప పేరు పొందాడు. తన దోషాన్ని సైతం అధిగమించాడు.

ఇదంతా ఒక కథలా వారి కళ్ళముందు జరుగుతున్నట్టు అనిపించింది. అది ముగిసిపోగానే వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి అంతక్రితం ఉన్న ప్రాంగణం కనిపించింది.

మునుపటిలా అక్కడ ఎంతో మంది అందమైన జంటలు కనిపించారు. సంజయ్ వారి పక్కనే ఉన్నాడు. అంకిత మాత్రం అభిజిత్ పక్కన ఉంది. శంఖినీ జాతి స్త్రీ వాళ్లకు ఎదురుగానే ఉన్నది.

“మనసు చేసే మాయ తొలగిపోవాలంటే భక్తి ఒక్కటే ఏకైక మార్గం. ఎంత కష్టపడైనా సరే మనసుని భక్తి మార్గము నందే ప్రవేశ పెట్టాలి. మీకు చంద్రుని కథంతా కళ్ళ ముందు కనిపించటానికి కారణం ఏంటో తెలుసా?" అని అడిగింది ఆ శంఖినీ జాతి స్త్రీ.

తెలియదు అన్నట్టుగా అభిజిత్, అంకితలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

"అయితే మీతో వచ్చిన మీ స్నేహితుడిని అతనికి ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారో ఒకసారి అడిగి చూడండి", అంది శంఖినీ జాతి స్త్రీ.

"సంజయ్, నీకు ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు?" అడిగాడు అభిజిత్.

"అదేం ప్రశ్న. బాగా వయసు మళ్ళిన వృద్ధ దంపతులు ఒకరిని ఒకరు చూసుకుంటూ పసి పిల్లలలా కలిసిపోయి తిరుగుతూ ఉన్నారు కదా. వాళ్ళే కనిపిస్తున్నారు.అయినా ఎందుకలా అడుగుతున్నావు?" అన్నాడు సంజయ్.

"అంటే నీకిక్కడ యువతీ, యువకులు ఎవ్వరూ కనిపించటం లేదా?" అని అడిగాడు అభిజిత్.

"లేదు", అటు వైపు నుండి సంజయ్ జవాబు.

"మరి శంఖినీ జాతి స్త్రీ కనిపిస్తోందా?" అడిగాడు అభిజిత్.

"లేదు", అటు వైపు నుండి సంజయ్ జవాబు.

సంజయ్ చెప్పిన జవాబులు విని నిర్ఘాంతపోయారు ఇద్దరూ. అభిజిత్, అంకిత ఇటు తిరిగి చూసే లోపు ఆ శంఖినీ జాతి స్త్రీ మాయమైపోయింది.

అప్పుడు అభిజిత్ కి అందులోని అంతరార్థం బోధపడింది. ఆమె ఒక దేవతని అర్థం అయ్యింది. అభిజిత్, అంకితల మనసు ఇంకా మాయకు వశం అయ్యి ఉండటం వల్లే వాళ్లకు అక్కడ ఎంతో మంది యువతీ, యువకులు జంటగా కనిపించారు. ఆ మాయను దూరం చేసి ఇందుః ప్రాకారంలోని చంద్రుని గురించి చెబుతూ తమకు జ్ఞానోదయం కలిగించటానికి వచ్చిన దేవత అని అభిజిత్ కు అనిపించింది. అంకిత ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉంది. అసలేం జరిగిందో అర్థం అయ్యే స్థితిలో తను లేదు.

ఆ అసిధారావ్రతం అనే ప్రాంగణం నుండి బయటికి వచ్చేసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.

"స్వామి, ఈ ప్రాంగణానికి అన్న పేరెందుకు పెట్టారో చెప్పగలరా?" అని ఆత్రంగా అడిగాడు అభిజిత్.

" అసిధారావ్రతం అనగా స్త్రీపురుషులిద్దరూ ఒకే శయనంపై నిదురిస్తూ బ్రహ్మచర్య దీక్షతో ఉండుట. అతి కష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించేవారు మీకు ఈ ప్రాంగణంలో కనబడతారు కాబట్టే ఆ వ్రతం పేరే ఈ ప్రాంగణానికి పెట్టారు", అని బదులిచ్చాడా సిద్ధపురుషుడు.

"అంటే మాకు అక్కడ కనిపించిన వాళ్ళు కూడా ముముక్షువులేనా స్వామి?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు సంజయ్.

సిద్ధపురుషుడు నవ్వుతూ,"అంతే కదా", అన్నాడు.

సిద్ధపురుషుడు, ఆ ఇద్దరు సైనికులూ ముందుకెళ్తూ ఉండగా వారిని అనుసరిస్తూ అభిజిత్, అంకిత, సంజయ్ లు ఇందుః ప్రాకారం నుండి శివుని ఆలయానికి బయలుదేరారు.

శంభలలోని ఈ శివుని ఆలయం ఉండే ప్రాకారానికి ఏ పేరూ లేదు. అందరూ ఆ ప్రాకారాన్ని శివుని ఆలయం అనే పిలుస్తారు. అక్కడంతా శివ మయమే.

ఓం నమః శివాయ

---------------------------------------------------------

శంభల నగరం – 10

శివుని ఆలయం


అక్కడ విభూతి ధరించని మోము మనకు కనబడదు. శివ నామస్మరణ చెయ్యని గొంతు మనకు వినబడదు.

సుగంధ ద్రవ్యాల నుండి వచ్చే సువాసనలు మైకాన్ని కలిగిస్తాయి. కానీ అక్కడ అణువణువులో ఉన్న భస్మం యొక్క పరిమళాలు మాత్రం మనకు బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తాయి.

అక్కడ మాట్లాడితే శివుడు. ఆట ఆడితే శివుడు. పాట పాడితే శివుడు.

ఏది చెయ్యాలన్నా అక్కడ శివుడే. ఏదీ చెయ్యకపోయినా అక్కడ శివుడే.

అక్కడ అడుగుపెట్టక ముందు వరకూ మనకు కనిపించేదో ప్రపంచం. అడుగుపెట్టాక ఆ శివుడే ప్రపంచం.

మన శిరస్సు పైకెత్తి చూస్తే కానీ కనిపించనంత ఎత్తులో ఉంటాడు శివుడు. హిరణ్యము అనగా మేలిమి బంగారంతో చెయ్యబడ్డ మూర్తీభవించిన ఈశ్వరత్వము అక్కడ మనకు కనిపిస్తుంది.

56 అడుగుల ఎత్తున్న ఆ శివుడు తన రెండు కళ్ళనూ మూసివేసి ధ్యానంలో ఉంటాడు. రెండు చేతులనూ చిన్ముద్రతో ఉంచి పద్మాసనంలో ధ్యానం చేస్తున్న ఆ శివుడు అంత ఎత్తులో మనకు కనిపిస్తాడు.

అక్కడున్న శివుణ్ణి చూస్తే 56 అడుగుల ఎత్తున్న పరమశివుడే సాక్షాత్తుగా అక్కడికొచ్చి ధ్యానం చేస్తున్నాడు అన్నట్టుంటుంది కానీ శివుని విగ్రహంలా ఎక్కడా అనిపించదు.

ఒక దృశ్యం అద్భుతంగా ఉంటే కళ్లప్పగించి చూస్తాం. కానీ ఆ శివుని ఆలయములో ఏది చూసినా ఒక అద్భుతమే. అప్పుడు రెప్పార్పకుండా చూస్తాం. రెప్పపాటులేని స్థితినే అనిమిషత్వం అంటారు. అనిమిషత్వానికున్న మరొక పేరే ఈశ్వరత్వము. ఆ ఈశ్వరత్వమే కాల స్వరూపం. కాలం రెప్పపాటైనా సరే ఆగదు. అలాంటి కాలస్వరూపుడైన ఆ శివుణ్ణి మనం చూడాలంటే రెప్పార్పకుండానే చూడాలి. ఎప్పుడు ఏ అద్భుతం మన కంటికి అందకుండా పోతుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది ఆ శివుని ఆలయంలో. అంత అద్భుతంగా ఉంటుందక్కడి శివుని వైభవం.

శివునికి ఎదురుగా ఉన్న నంది 26 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ నంది కూడా సువర్ణముతోనే రూపకల్పన చేయబడ్డది.

శివునికి అభిషేకం జరుగుతున్నప్పుడే అక్కడున్న నందికి కూడా అభిషేకం జరుపుతారక్కడ.

ఆ ఆలయంలోనే ఒక బంగారు ఉన్నది. ఆ సింహాసనం 36 అడుగుల ఎత్తు ఉంటుంది. అక్కడున్న 56 అడుగుల శివుడికి తగ్గట్టుగా ఉంటుందా సింహాసనం.

అక్కడ వాళ్ళ దినచర్య శివపంచాక్షరితో మొదలవుతుంది.

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ.... భస్మాంగరాగాయ మహేశ్వరాయ అంటూ మొదలయ్యే ఆ శివపంచాక్షరీ స్తోత్రాన్ని వినటం, చూడటం జన్మ జన్మల పుణ్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ శివపంచాక్షరి చెప్పే సమయానికి ఎందరో యోగులు, దేవతలు, యక్షులు, అఘోరీలు, ముముక్షువులు, నాగసాధువులు ఇలా శంభల నగర ప్రాకారాలలో లేని వారు ఎంతో మంది మనకు కనబడతారక్కడ. యక్షస్వరూపాయ జటాధరాయ....పినాక హస్తాయ సనాతనాయ అంటున్నప్పుడు డమరుకం మోగుతూ ఉంటుందక్కడ.

అభిజిత్, అంకిత, సంజయ్ లు శివుణ్ణి చూస్తూ మైమరచిపోయి ఉన్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు ఆలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

అభిజిత్, అంకిత, సంజయ్ లు నిలబడి శివుణ్ణి తదేకముగా చూస్తూ ఉన్న ఆ చోటికి ఒక నాగసాధువు వచ్చాడు. వీరితో ఇలా అన్నాడు.

“ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై

ఎవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబు

ఎవ్వడాదిమధ్యలయుండెవ్వడు సర్వంబు తానై యున్నవాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్”

మీరే పని మీద ఇక్కడికొచ్చారో నాకు తెలుసు. మీరు కోరుకునే ఆ ప్రపంచ శాంతి కోసమే మేమిక్కడ రోజూ శివునికి పూజలు చేస్తున్నాము. శంభల రాజ్యంలో మీరు నేర్చుకునే విద్యలు ఘోర కలిని అంతం చెయ్యటానికి ఉపయోగపడతాయి. కానీ మీకు భవిష్యత్తులో మా నాగసాధువుల అవసరం ఉంటుంది. అందుకే ఈ తాళంచెవిని మీ దగ్గర ఉంచుకోండి”, అని చెప్పేసి తాళంచెవిని సంజయ్ చేతికిచ్చి ఆ నాగసాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఆ నాగసాధువు వెళ్తున్న వైపే ఆశ్చర్యంగా చూసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు ముగ్గురూ.

అంతలో అక్కడికి ఒక ముముక్షువు వచ్చాడు.

"ఇక్కడి శివాలయ చరిత్ర ఏంటో మీకు తెలుసా?" అని అడిగాడు.

"తెలీదు స్వామి", అన్నారు ముగ్గురూ ముక్తకంఠంతో.

"అయితే మీరు తప్పకుండా తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ శివాలయంలో మీరు చూసే ఆ శివుడు శాంతస్వరూపుడు కాడు. సతీదేవి అగ్నికి ఆహుతైన రోజున ఇదే చోట ఆయన శివతాండవం చేసాడు.

ప్రతీ సంవత్సరం ఒక్కసారి ఆ శివతాండవాన్ని చూసే అదృష్టం శంభల నగర వాసులకు దక్కుతుంది. ఆ శివ తాండవాన్ని చూడటం అదృష్టమే అయినా చూసి తట్టుకోవటం అంత తేలిక కాదు. ఆయనని అలా చూస్తే కన్నీటి గంగ ధారగా ప్రవహిస్తుంది. మంగళస్వరూపుడైన ఈ శివుడేనా ఇలా రుద్ర తాండవం చేస్తోంది అని భయం వేస్తుంది. ఆ రోజు ఆయనను శాంతింపచెయ్యటానికి ఇక్కడ స్తోత్రాలు, సూక్తాలు ఎన్నింటినో పఠిస్తారు.

ఇక్కడున్న భక్తులకు ఆ రోజు నిజమైన పరీక్ష. ఎవ్వరైతే మనసారా శివుణ్ణి ప్రార్థిస్తారో అప్పుడే ఆయన శాంతిస్తాడు. ఆ భక్తుని కోరికలను నెరవేరుస్తాడు.

ఇక్కడ మీరు చూస్తున్న ఆ 56 అడుగుల శివుణ్ణి రూపకల్పన చేసింది దేవశిల్పి విశ్వకర్మ. సూర్యమండలంలోని సూర్య గణాలు లెక్కలేనంత బంగారాన్ని తెచ్చి ఇచ్చాయి. ఆ మేలిమి బంగారంతోనే ఇక్కడున్న శివుణ్ణి, నందిని, సింహాసనాన్ని రూపకల్పన చేసాడు విశ్వకర్మ”, అన్నాడా ముముక్షువు.

------------------------------------------------------------

"స్వామి, శివుడు ఎక్కడి నుండి వస్తాడు?" అడిగాడు అభిజిత్

ఆ ముముక్షువు అభిజిత్ ను ఎగాదిగా ఒక్కసారి చూసి గట్టిగా నవ్వాడు. అభిజిత్ గుండెను తన చేత్తో బలంగా తాకుతూ,"నీ హృదయం అనే పద్మంలో నుండి వస్తాడు", అన్నాడు.

"ఇక్కడ ధ్యాన రూపంలో ఉన్న ఆ 56 అడుగుల బంగారు శివుణ్ణి కేవలం విగ్రహస్వరూపం అనుకుంటున్నావా?" అని అభిజిత్ ను గట్టిగా అడిగాడు.

“సూర్య గణాలు తెచ్చిన ఆ బంగారం సూర్యప్రభకు నిదర్శనం. ఆ సూర్యుని ద్వారానే ఇక్కడ శివుణ్ణి మనం దర్శించుకుంటున్నాం. బంగారానికి ఉన్న గుణాలలో జ్వలించే శక్తి ప్రథమమైనది. ఎంతగా జ్వలిస్తే అంతగా మెరిసిపోతుంది. సతీదేవి అగ్నికి ఆహుతి కావటం జ్వలనమే కదా. అందుకే ఆ రోజున ఇక్కడ మీకు కనిపించే ఈ హిరణ్య తేజమైన శివుడు ధ్యానం వీడి తన నటరాజరూపంతో జ్వలిస్తూ తాండవం చేస్తాడు”, అన్నాడా ముముక్షువు.

"అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆ ధ్యానరూపంలో ఉన్న శివుడే కళ్ళు తెరిచి ఇక్కడ తాండవం చేస్తాడా స్వామి?" అంటూ ఆ 56 అడుగుల శివుణ్ణి చూస్తూ అభిజిత్ విస్తుపోయి ఆ పరమశివునికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

"అవును. ఆయనని బంగారు వర్ణంలో అలా ధ్యాన మూర్తిగా చూడటం వలన మీకు విగ్రహంలా కనిపిస్తున్నాడు. కొంత మంది యోగీంద్రులకు ఆయన తీసుకునే శ్వాస కూడా వినిపిస్తుంది. వాళ్ళ యోగసిద్ధి అలాంటిది మరి", అన్నాడా ముముక్షువు.

" పాదుకాతీర్థం తయారీలో వాడే పుప్పొడిని ఈ శివుని ఆలయంలో ఉన్న సువర్ణ పుష్పాల నుండే తీసుకుంటారని చెప్పారు స్వామి. ఆ సువర్ణ పుష్పాలు ఉన్న చెట్టు ఎక్కడుందో చెబుతారా?" అని అడిగాడు అభిజిత్.

ముముక్షువు వాళ్ళ ముగ్గురినీ ఒక చోటికి తీసుకువెళ్లాడు. అక్కడొక దేవతా వృక్షం ఉన్నది. ఆ దేవతా వృక్షానికే ఎన్నో సువర్ణ పుష్పాలున్నవి. వాటిని చూపిస్తూ ఆ ముముక్షువు ఇలా చెప్పాడు.

"సూర్యుని నామాలలోని ఒక నామమే పూషా. పోషించువాడు అని అర్థం. సమృద్ధిని ఇచ్చువాడు అని అర్థం. ద్వాదశ ఆదిత్యులలో ఒకడే పూషుడు. ఆయన నుండే ఈ సువర్ణ పుష్పాలు ఉన్న చెట్టు వచ్చింది. ఈ చెట్టుని కూడా సూర్య గణాలే అందించాయి", అన్నాడా ముముక్షువు.

ఇంతలో అక్కడికి సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు వచ్చారు. ఆ సైనికుల్ని చూడగానే అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళు సైనికులు కారు. ఇన్నాళ్లూ సైనికుల వేషధారణలో వాళ్ళని భ్రమింప జేసిన కామరూపధారులు. అనగా ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగల శక్తి సంపన్నులు వారు.

ఆ ఇద్దరు సైనికులూ వాళ్ళ రూపాల్ని వదిలేసి తమ సొంత రూపంలోకి వచ్చేసారు. వాళ్లిప్పుడు సైనికులలా లేరు. శంభల రాజ్యంలోని ఖరీదైన వస్త్రాలు ధరించి ఉన్నారు.

"నేను అనిరుద్ధుల వారి ఆస్థానంలోని మంత్రిని. నా పేరు ఫాలనేత్రుడు. మా అమ్మ శివభక్తురాలు. అందుకే నాకు ఆ శివుని పేరే పెట్టింది", అన్నాడు ఆ మంత్రి.

"నేను అనిరుద్ధుల వారి రాజ్యంలోని సేనాధిపతిని. నా పేరు రుద్రసముద్భవ ", అన్నాడా సేనాధిపతి.

"మిమ్మల్ని పరీక్షించనిదే మీకు శంభల రాజ్యంలోని యుద్ధ విద్యలు నేర్పటం అసాధ్యం. మీకా యోగ్యత లేనిచో ఆ విద్యలు మీకు నేర్పినా అవి సిద్ధించవు. అందుకే మేము ఎప్పటికప్పుడు సిద్ధపురుషుడితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇప్పుడు మాకు మీ మీద నమ్మకం కలిగినది. ఇక శంభల రాజ్యానికి బయలుదేరుదామా?" అని అడిగాడు ఆ ఫాలనేత్రుడు.

శివునికి నమస్కరించి ఆ ఆలయం నుండి బయటికొచ్చేశారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.

సిద్ధపురుషుడు, రుద్రసముద్భవ, ఫాలనేత్రుడు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపించింది.

అప్పుడే అక్కడికో ఖగరథము వచ్చినది.

"భూలోకంలో మీరు చూసే విమానాల కంటే 1000 రేట్లు వేగంతో ఈ ఖగరథ గమనం ఉంటుంది.

ఇలాంటివి శంభల రాజ్యంలో కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి", అంటూ ఆ ఖగరథంలోకి వాళ్ళను ఆహ్వానిస్తూ అన్నాడు మంత్రి ఐన ఫాలనేత్రుడు.

భూలోకంలోని విమానానికి రెట్టింపు పరిమాణంలో ఉందా ఖగరథం. బయటి నుండి చూసే వాళ్లకి బంగారు విమానంలా ఉంది. భూలోకంలోని విమానాలకు ఉన్నట్టే ఈ ఖగరథానికి రెక్కలున్నాయి కానీ అవి గాలిలో ఉన్నప్పుడు మాత్రమే తెరుచుకునేలా వెసలుబాటు ఉంది. ఒక్క సారి భూమ్మీదకు దిగిన తర్వాత ఆ రెక్కలు ఇక కనిపించవు. అలా అమర్చారు వాటిని.

శంభల నగరంలో చిట్టచివరి ప్రాకారం ఐన చింతామణి గృహంలోకి అడుగుపెట్టడానికి అనుమతి, అర్హత లేకపోవటం వల్ల అభిజిత్, అంకిత, సంజయ్ లు శివుని ఆలయం నుండి ఖగరథంలో శంభల రాజ్యానికి పయనమయ్యారు. సిద్ధపురుషుడు కూడా వారితో పాటే వస్తున్నాడు.

మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవ ఎంతో ఆనందంగా ఒక కార్యాన్ని పూర్తిచేసినట్టు గర్వంతో విజయదరహాసం చేస్తున్నారు.

------------------------------------------------------

ఘోర కలి అరాచకాలు - 1

బోర్డు డైరెక్టర్ లతో ఘోర కలి మీటింగ్


భూలోకంలో ఘోర కలి ఏ రంగాన్నీ వదిలిపెట్టలేదు. స్టీల్, ఐరన్, మినరల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇలా అన్ని రంగాల్లో తనేంటో ప్రపంచానికి పరిచయం చెయ్యాలని సంకల్పించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించి జీ.కె. కార్పొరేషన్ అండ్ ఇండస్ట్రీస్ పేరుతో ప్రపంచంలోని పలు చోట్ల కంపెనీలను స్థాపించి శ్రామికులను నియమించుకున్నాడు. తన ప్రతీ కంపెనీలో కొన్ని వేల మంది వర్కర్స్ తన ఆజ్ఞలను అనుసరించి పనిచేస్తూ ఉంటారు. ఘోర కలి దగ్గరున్న నాగమణి ఎంతో శక్తివంతమైనది కావటంతో దాన్ని ఆసరాగా చేసుకుని ఎన్నోఅరాచకాలు చెయ్యటం మొదలు పెట్టాడు.

ఒక రోజు జీ.కె. కార్పొరేషన్ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ ల మీటింగ్ ని ఘోర కలి సీక్రెట్ గా తన సామ్రాజ్యంలో ఏర్పాటు చేసాడు. ఆ రోజు ఘోర కలికి సెక్యూరిటీగా ఎంతో మంది ఉన్నారక్కడ. ఆ మీటింగ్ కి పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్స్ ఒక చోట హాజరయ్యారు. వారు అక్కడికొచ్చి 2 గంటలవుతోంది. ఘోర కలి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి ఘోర కలి తన సొంత రూపంతోనే వచ్చాడు. కళ్ళకు కాటుకతో, నలుపైన దుస్తులతో, తను ధరించిన ఆ దుస్తులపైన వికృతమైన గుర్తులతో చూడగానే ఒళ్ళు గగ్గుర్పొడిచేలా ఉన్నాడు.

"సభకు నమస్కారం. నేను డైరెక్ట్ గా పాయింట్ కొచ్చేస్తున్నాను. మీ పదిహేను మందీ ఇన్ని రోజులూ చాలా కష్టపడ్డారు. నేను చెప్పినట్టే మన కంపెనీలలో పని చేసే వర్కర్స్ తాగే టీ లో 'సమూఢ' అనే చీకటి రాజ్యంలో చెయ్యబడ్డ ద్రవ్యాన్ని కలిపి వారికిస్తూ వచ్చారు. వారిలో కనిపించిన మార్పేంటో మనం కళ్లారా మన ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు పంపిన రిపోర్ట్స్ లోనే చూసాం. అందుకు ముందుగా మనందరం సెలెబ్రేట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ లెక్కలేనంత మద్యం దొరుకుతుంది ఈ రోజు. ఇష్టపూర్వకంగా ఎంత కావలి అనిపిస్తే అంత తాగండి. ఏది కావాలి అనిపిస్తే అది తినండి. మా వంటవాళ్లు అన్ని రకాల కూరలూ వండించారు. మగువలకు కొదవే లేదీ సామ్రాజ్యంలో. ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి మీ సొంతం అవుతుంది.

కానీ ఇవన్నీ మీరనుభవించే ముందు మీరు నాకోసం ఒక చిన్న పని చేసిపెట్టాలి. చేస్తారా?" అని వాళ్ళని అడిగాడు ఘోర కలి.

ఘోర కలి చేస్తారా అని ప్రత్యేకించి వాళ్ళని అడుగుతున్నాడంటే అదేదో అల్లాటప్పా విషయం కాదని వాళ్లకి అర్థం అయిపోయింది.

అక్కడున్న పదిహేను మంది గుండెలూ వేగంగా పోటీపడి మరీ కొట్టుకుంటున్నాయి. ఒకరి కళ్ళు ఒకరు చూసుకుంటున్నారు. హ్యాండ్ కర్చీఫ్ తో నుదుటి పై చెమటని తుడుచుకుంటున్నారు. ప్రాణం పోయే ముందు ఎలా ఉంటుందో ఘోర కలి అడిగిన దానికి ఎదురుచెప్పటం అలా ఉంటుంది. ఇన్నాళ్లూ ఘోర కలితో చేతులు కలిపి తెగ సంబరపడిపోయారు. డబ్బు ఇచ్చే నషా అలాంటిది. ఎంత ప్రమాదంలో పడ్డామో తెలిసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయి ఎదురుగా ఘోర కలి రూపంలో యముడు రెడీ గా ఉంటాడు.

"ఏంటి ఆలోచిస్తున్నారు?" అన్నాడు ఘోర కలి.

అక్కడంతా నిశ్శబ్దం.

"ఇంకా ఆలోచిస్తున్నారేంటి.......................?" అని ఈ సారి గట్టిగా బల్ల గుద్ది మరీ అడిగాడు ఘోర కలి.

"అలాగే….అలాగే…. మీరేది అడిగితే అది చేస్తాం", అని ఆ పదిహేను మందీ లేచి నిల్చుని చేతులు కట్టుకుని ముక్తకంఠంతో మాటిచ్చారు.

"హహ్హాహ్హా.....భయం....భయం.....భయం భయమే నా పెట్టుబడి.....ఇప్పుడీ భయమే నా రాబడి", అంటూ భయంకరంగా నవ్వాడు.

"మీరందరూ మీ మీ రూపాల్ని శాశ్వతంగా మార్చేసుకోవాలి. అదే మీరు నాకోసం చేసే చిన్న పని", అని గట్టిగా నవ్వాడు ఘోర కలి.

"అంటే మా ఐడెంటిటీ మారిపోతుందా?" అని అడిగాడు వాళ్ళల్లో ఒకడు.

"మీ ఐడెంటిటీ ఏం మారిపోదు. మీ ఫామిలీ వాళ్లకు మీరేం దూరం అవ్వరు. ప్రపంచానికి మీ ఐడెంటిటీ అలానే ఉంటుంది. కానీ మీ రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి.

హ్హాహ్హాహ్హా", అంటూ నవ్వాడు ఘోర కలి.

వాళ్లకేం అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

అది గమనించిన ఘోర కలి వారికి అర్థం అయ్యేలా ఇలా వివరించాడు.

"మీరందరూ నా లా మారిపోతారు. అంటే చూడటానికి మీరు అచ్చం నాలాగే కనబడతారు బయటి ప్రపంచానికి. దీని వల్ల నా ఐడెంటిటీని ట్రేస్ అవుట్ చెయ్యటం ఎవ్వరి వల్లా కాదు. అప్పుడు మిమ్మల్ని చూసి మీకెదురు తిరగటానికి అందరూ భయపడతారు.

నేను నా సామ్రాజ్యంలో ఇక్కడే కూర్చుని ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు.

ఏది జరిగినా నిమిషాల్లో యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా నా సందేశాన్ని ప్రపంచంతో పంచుకుంటాను. ఇక్కడే ఉంటూ ప్రపంచంలో పలు చోట్ల జరిగే ఎన్నో సంఘటనలను నాకు నచ్చే విధంగా మలచుకుంటాను. ప్రపంచం మొత్తాన్ని భయపెడతాను.

మీరు ఉండే చోట జనాలు మిమ్మల్నే ఘోర కలి అనుకుని భ్రమపడుతూ భయపడుతూ బ్రతుకుతారు.

ఆ భయమే మన పెట్టుబడి.

ఆ భయంతోటే ప్రజలు మనకు బానిసలవుతారు.

ఆ భయంతోటే మనం వారికి దొరలు అవుతాం.

ఆ భయంతోటే ప్రపంచాన్ని గడగడలాడిస్తాం.

మీరు చెయ్య వలసిందల్లా నా లా మారిపోవటమే.

చేస్తారు కదూ?" అంటూ ఆ పదిహేను మందిని ఒక్కసారి సూటిగా చూస్తూ గంభీరంగా అడిగాడు.

వేరే గత్యంతరం లేక వాళ్ళందరూ ఒప్పుకున్నారు.

"ఈ ఘోర కలి ఎప్పుడూ మీ చుట్టూ రక్షగా ఉంటాడు", అంటూ ఘోర కలి అక్కడున్న ప్రతీ ఒక్కడి వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుని రాక్షస ప్రేమతో ప్రతీ ఒక్కడి బుగ్గపైన ముద్దు పెట్టాడు. ఘోర కలి శ్వాస బలంగా తగులుతోంది అక్కడున్న ప్రతీ ఒక్కడికి.

------------------------------------------------------------

"నన్ను నమ్మి వచ్చిన వాళ్లకు ఇలాగే ముద్దిచ్చి నా ప్రేమను చూపిస్తాను. అది నా గుణం.

ఈ రోజుతో మీరందరూ నా లా మారిపోతారు. ప్రపంచానికి నన్ను చూపే అద్దాలు మీరే.

హహ్హాహ్హా", అంటూ ఘోర కలి నవ్వుతున్నప్పుడు తెలియకుండానే కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు ఉప్పొంగాయి.

ఇంతలో ఘోర కలికి ఒక రక్షక భటుడి నుండి పిలుపు రావటంతో అక్కడి నుండి హుటాహుటిన వెళ్ళిపోయాడు.

--------------------------------------------------------------

శంభల రాజ్యం – 1

శంభల రాజ్యానికి స్వాగతం


ఖగరథం శంభల రాజ్యానికి చేరుకున్నది. శంభల రాజ్య ప్రవేశ ద్వారం దగ్గర భూలోక వాసులకు ఘనస్వాగతం పలకటానికి అక్కడ ఎంతో మంది ఎదురుచూస్తూ ఉన్నారు. ఖగరథం నుండి బయటకు అడుగుపెట్టిన మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవలతో పాటు సిద్ధపురుషుడు ముందుకు కదిలి వెళుతున్నారు. వారిని అభిజిత్, అంకిత, సంజయ్ లు అనుసరిస్తున్నారు. వీళ్ళతో పాటు అక్కడుండే ఒక భటుడు కూడా వస్తున్నాడు.

శంభల రాజ్యాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు అన్నట్టుంది అక్కడి వాతావరణం. శంభల నగరంలోలానే శంభల రాజ్యంలో దొరికే వాయువు అత్యంత శ్రేష్ఠమైనదిగా అనిపించింది వారికి. కాలు నేలను తాకగానే అక్కడున్న మట్టి రేణువులు చర్మానికి గట్టిగా అతుక్కున్నట్టు అనిపించాయి. అభిజిత్ కి తన కాలు వైబ్రేట్ అయినట్టు అనిపించి, "ఇక్కడ మట్టి ఏంటి ఇలా ఉంది?" అని అడిగాడు.

"ఇది మంకిల. మట్టి కాదు. ఇది చాలా దూరం వ్యాపిస్తుంది. నువ్వు ఇక్కడికొచ్చావన్న సాక్ష్యం చెబుతుంది", అన్నాడు భటుడు.

"ఇంద్రియాలకు స్పందించే గుణం ఉంటుంది. ఈ మంకిలకు వ్యాపించే గుణం ఉంది. వెళ్ళేటప్పుడు ఒక పిడికిలంత తీసుకుని వెళ్ళు. భూలోకంలో ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది", అన్నాడు ఆ భటుడు అభిజిత్ కళ్ళలోకి చూస్తూ.

భవిష్యత్తులో జరగబోయేదేదో కళ్ళ ముందు ఫ్లాష్ లా కనిపించింది అభిజిత్ కి. కానీ అదేంటో అంత క్లియర్ గా తెలియట్లేదు. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు. ఆ భటుడు చెప్పినట్టే ఒక పిడికిలంత మంకిల తీసుకుని తన దగ్గరున్న పౌచ్ లో వేసుకున్నాడు.

“ఇప్పుడు దాచుకున్న ఈ పిడికెడే భూలోకంలో పదింతలు అవుతుంది. ఎందరినో కాపాడుతుంది”, అంటూ ఆ భటుడు చిత్రంగా నవ్వాడు.

"శంభల రాజ్యంలో జాగ్రత్త దొరా", అన్నాడు. అభిజిత్ అర్థం కానట్టు చూసాడు.

"ఇక్కడ నెగ్గావా...ముల్లోకాలు నీవే. ఇక్కడ ఓడావా... విజయమిక దక్కదు దొరా", అన్నాడు.

అభిజిత్ అలర్ట్ అయ్యాడు. తనకు సంబంధించినది ఏదో ఆ భటుడు చెబుతున్నాడనిపించింది.

"ఇక్కడి ఆడవాళ్లు మాయ చేస్తారు దొరా....వాళ్ళ వలలో పడకు", అని అంకితను చూస్తూ, "ఆమెను ప్రేమించాలో వద్దో ఒక నిర్ణయం తీసుకో దొరా....సౌఖ్యంగా ఉంటాది నీ మనసు. కుదుటపడుతుంది నీ వయసు", అన్నాడు. ఆ మాట అంకితకు కూడా వినబడింది. అభిజిత్ ని చూస్తూ నవ్వింది.

అభిజిత్ ఆ భటుడిని పక్కకు పిలిచి, "బాసు నువ్వు భూలోకంలో ఫార్చ్యూన్ టెల్లింగ్….అదే చిలకజోస్యం చెప్పేవాడివా....నీ లాంగ్వేజ్ అలాగే ఉంది మరి", అన్నాడు.

"నీకు అర్థం అవ్వాలని అలా చెప్పా దొరా", అన్నాడు భటుడు.

"ఇదిగో అంతా బానే ఉంది కానీ, నువ్వు నన్ను దొరా అనకు. ఐ యాం నాట్ యువర్ దొరా", అన్నాడు అభిజిత్.

"లేదు దొరా. మనది ఏడు జన్మల సంబంధం. నువ్వు మా దొరవే", అన్నాడు ఆ భటుడు. ముందుకు కదిలాడు భటుడు.

అభిజిత్ ఆగిపోయాడు ఆ మాటకి. లోపల ఇలా అనుకుంటున్నాడు.

"ఏడు జన్మల సంబంధమా? వీడెంటిలా మాట్లాడుతున్నాడు ! ఏంటోలే...ముందు ముందు ఇంకెన్ని షాక్ లు ఇస్తాడో !"

ఒక వేగు వీరిని స్వాగతించటానికి అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాడు.

"భూలోక వాసులకు ప్రణామములు", అంటూ అక్కడున్న వేగు వారిని స్వాగతించాడు.

"శ్వేత ద్వీప వైకుంఠ వాసి ఐన సిద్ధపురుషుణ్ణి కలుసుకోవటం ఎంతో ఆనందాన్నిచ్చే విషయం", అని శిరస్సు వంచి సిద్ధపురుషునికి ప్రణామం చేశాడా వేగు.

"శంభల రాజ్యాధిపతి అనిరుద్ధుల వారు మీ అందరికీ తగిన విడిదిని ఏర్పాటు చేశారు", అంటూ ఆ వేగు వాళ్ళను ఒక అతిథి గృహానికి తీసుకెళ్లాడు.అతిథిగృహం చేరుకున్నారు వారందరూ.

--------------------------------------------------------------

"ఇచట మీరు విశ్రాంతి తీసుకోవలసిందిగా అనిరుద్ధుల వారి విన్నపం. రేపు సభనందు మిమ్మల్ని అందరికీ పరిచయం చేసిన పిమ్మట వారు మీతో ఏకాంతంగా చర్చిస్తారు. కూలంకషంగా అన్ని విషయాలు అప్పుడు మీకే తెలుస్తాయి. అంతవరకు అలసటకు గురైన మీ మనసుకు ప్రశాంతతనివ్వండి", అని ఆ వేగు అక్కడి నుండి నిష్క్రమించాడు.

మంత్రి ఫాలనేత్రుడు, సేనాధిపతి రుద్రసముద్భవలు వారి నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.

అతిథి గృహం నుండి బయటకు చూస్తే ఎంతో విశాలమైన శంభల రాజ్యం కళ్ళకు దేదీప్యమానంగా కనిపించింది. శంభల రాజ్యాన్ని చూస్తూ సిద్ధపురుషుడు అభిజిత్, అంకిత, సంజయ్ లతో ఇలా చెప్పాడు.

“శంభల నగరంలో ప్రాకారాలున్నట్టే శంభల రాజ్యంలో కూడా ప్రాకారాలున్నాయి. కానీ అవి సందర్శించటానికి శంభల రాజ్యాధిపతి అయిన అనిరుద్ధుల వారి ఆజ్ఞ కావాలి. యుద్ధ సేనాధిపతికి సముచితంగా అనిపించాలి. శంభల రాజ్యంలోనివి యుద్ధ ప్రాకారాలు. అంటే ఇక్కడ యుద్ధంలో ప్రయోగించే అనేకానేక వ్యూహాలు, అస్త్రాలు, ఆయుధాలు, సైన్యం ఇలా ఒక వేరే ప్రపంచమే ఉంటుందిక్కడ. ఇక్కడ నేర్పేది యుద్ధ విద్య. ఇక్కడి వారు బ్రతికేది రక్షించటానికే. రక్షించేది బ్రతికించటానికే. యుద్ధ నీతి తెలుసు. రీతి తెలుసు. వాటిని అతిక్రమిస్తే సంహారం ఇంకా బాగా తెలుసు.

ఇక్కడి ప్రతి కన్నూ మిమ్మల్ని ఒక కంట గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆలోచనలే శత్రువులు. వ్యక్తులు కాదు. చెడుకి, మంచికి వ్యత్యాసం వచ్చేది మన ఆలోచనలోనే. అది చెడ్డ పనైనా, మంచి పనైనా పడే కష్టం ఒక్కటే. అంతరంగంలో స్వచ్ఛత కోల్పోయినప్పుడు ఎంత గొప్ప పనైనా వృథాగా మిగిలిపోతుంది. అందుకే ఇక్కడ మీకిచ్చే శిక్షణకు మీరు అన్ని విధాలా అర్హులా కాదా అని మంత్రి, సేనాధిపతి మిమ్మల్ని పరీక్షించారు. భూలోక వాసులను ఘోర కలి నుండి కాపాడటం చిన్న విషయం కాదు. ఎన్నో యుద్ధ విద్యలలో ప్రవేశం ఉండాలి, ఎంతో వ్యూహ రచన కావాలి. అవన్నీ మీకందివ్వటానికి మీకొక గొప్ప ఆశయం కావాలి. మీలో పవిత్రత నిండి ఉండాలి.

మరీ ముఖ్యంగా, అవి కడదాకా మీలో అలాగే ఉండాలి”, అని చిన్నగా నవ్వుతూ సిద్ధపురుషుడు అభిజిత్ కళ్ళలోకి చూసాడు.

తను ఎవరికైతే చెప్పాలనుకున్నాడో వారికి విషయం బోధపడేలా ఉంటుంది ఆయన చిరునవ్వు. అదొక అస్త్రం అంతే. ఆ నవ్వు ఒక బాణం లాంటిది. చాలా అరుదుగా సంధించే ఆ చిరునవ్వు మనకు గుచ్చుకుందా. అంతే. జ్ఞానం వెల్లివిరుస్తుంది. కార్యాచరణ కళ్లముందుంటుంది. సిద్ధపురుషుడి ద్వారా పెల్లుబికే దైవీ శక్తి అది.

--------------------------------------------------------------------​
Next page: Update 09
Previous page: Update 07