Update 13
శంభల రాజ్యం – 11
సింహళ పూర్వీకుల చరిత్ర
"సింహళ రాజ్య ప్రజలలో ఆందోళన మొదలయ్యింది. సింహ దత్తుడి పూర్వీకులు చేసిన పాపాల గురించి చర్చ మొదలైంది. రాజ్యంలో ఏ విషయాన్నైనా గోప్యంగా ఉంచటం వీలుపడదు. ఎవరో ఒకరి వల్ల అది చేరవలసిన చోటికే చేరుతుంది. ఇలాగే సాగితే పరిస్థితి అదుపు తప్పిపోతుందేమోనని తీవ్రమైన ఆలోచనలలో నిమగ్నమై ఉన్నాడు మంత్రి."
అంతలో అక్కడికి కవిశ్రేష్ఠుడు చేరుకున్నాడు.
"మంత్రివర్యా ఏమిటి ఆలోచిస్తున్నారు?" అని అడిగాడు.
"మీరు మాకు చెప్పిన విషయాన్ని యథాతథముగా ప్రజలకు ఎలా సవివరముగా చెప్పాలో అంతుచిక్కటం లేదు", అన్నాడు.
"ప్రజల మనసుల గురించి ఆందోళన వద్దు. మనం నిమిత్తమాత్రులం. మన కర్తవ్యం కేవలం సత్యాన్ని చెప్పుట మాత్రమే. వారిని సంస్కరించుట కానే కాదు. అయినా సింహళ రాజుల గురించి వీరికి చెప్పినా నమ్మే స్థితిలో ఉండరు", అంటూ విచిత్రముగా నవ్వాడు ఆ కవి.
"అదేమిటి అలా అనేసారు?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు మంత్రి.
"సూర్యుడి చుట్టూ తిరిగే భూమిని మాత్రమే చూసిన కళ్ళకు
మేరువు చుట్టూ తిరిగే సూర్యుడి గురించి చెబితే అర్థం అవుతుందా !" అన్నాడు కవి.
"అనగా ?" అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు మంత్రి.
"సూర్యుణ్ణి చూసేవాళ్ళం మనం. సింహళ రాజులు మేరువును చూసారు. ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సూర్యుణ్ణి సైతం దర్శించారు. అలాంటి వారు చేసే మంచి పనులే సరిగ్గా అర్థం కావు. ఇక వారి పాపాల గురించి మనం చెబుతూ పోతే రాజ్య ప్రజలను ఇంకా ఇంకా అయోమయస్థితిలోకి నెట్టిన వాళ్ళం అవుతాము", అన్నాడు కవి.
"మీకు తెలిసిన చరిత్రను నాతో పంచుకోగలరా?" అని సంశయిస్తూ అడిగాడు మంత్రి.
"అది చెప్పటానికే ఇక్కడికి వచ్చాను. సింహళ రాజులు జ్ఞాన సంపన్నులు. వారికున్న తెలివితేటలకు దేవతలు సైతం విస్తుపోయే రోజులవి. వీరి పూర్వీకుల రాజ్య పరిపాలనలో మానవులు సైతం దేవతలలా బ్రతికిన రోజులున్నాయి. సంగీత, సాహిత్య, నాట్య కళా కోవిదులు సింహళ రాజులు, సింహళ ప్రజలు. అమితమైన భక్తి తత్పరత కలవారు. భగవంతుని తత్వాన్ని ఆరాధించే వారు. వీరికున్న సునిశిత దృష్టికి దేవతలు, త్రిమూర్తులు హర్షించేవారు. వీరి కళ్ళకు సాక్షాత్కరించేవారు. అలాంటి సింహళలో కొన్ని క్రూర జంతువులు ఉద్భవించాయి. ఆ క్రూర జంతువుల నుండి ప్రజలను కాపాడటానికి సింహళ రాజులు యజ్ఞం చెయ్యటం ఆరంభించారు. యజ్ఞం ఆరంభించిన పదిహేను ఘడియలకు ఆ క్రూర జంతువు ఎక్కడున్నా సరే ఆ అగ్ని హోత్రం దగ్గరకు చేరుకునేది. ఆ జంతువు క్రూరత్వం తగ్గిపోయి చిన్న పరిమాణంలోకి మారిపోయి ఆ హవిస్సులో పడిపోయేది. ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆ జంతువు చేసే అరుపులు, ఆర్తనాదాలు అక్కడ మార్మోగిపోయేవి. ఆ జంతువుల చివరి శ్వాసలు ఆ గాలిలోనే కలిసిపోయేవి. ఆ జంతువుల బలి ఎంతో అశాంతిని మిగిలించింది. వారికి తెలిసిన ఈ యజ్ఞ మంత్రాన్ని ఎన్నడూ ఉపయోగించని సింహళ రాజులు ఈ క్రూర జంతువుల నుండి ప్రజల్ని కాపాడటానికి మొట్టమొదటిసారి యజ్ఞాన్ని నిర్వహించి ఆ మంత్రం వాడి వాటిని లయం కావించారు.
ఇది దేవుని దృష్టిలో ఖచ్చితంగా మారణహోమమే. కానీ సింహళ రాజులకు ప్రజల పైనున్న పిచ్చి ప్రేమ వల్ల వారి జ్ఞానం మసకబడింది. ఆగ్రహించిన దేవుడు అదే రోజు రాత్రి వారికి కనిపించాడు.
'మీ కళ్ళకు మేరువు కనిపిస్తుంది కానీ నేను చేసిన మాయ కనిపించదా?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడిగాడు ప్రాంచద్రుద్రుడు.
మేరువులోని దేవతలలో ప్రముఖుడు ఈ ప్రాంచద్రుద్రుడు. ఆయన కోపం ప్రళయాగ్నిలా దహిస్తోంది.
అంతటా అయోమయం నెలకొని ఉంది.
'అవి క్రూర జంతువులు కావు. కలియుగంలో మిమ్మల్ని వెంటాడే అరిషడ్వర్గాలు. మీ సింహళలోని ప్రజలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఉంటే ఈ సింహళను ఇందిరా పరిధికి చేర్చేవాడిని. జనన మరణాలకు దూరంగా ఆ దేవదేవునికి దగ్గరగా బ్రతికే అదృష్టం ఈ మన్వంతరంలో సింహళకు దక్కి ఉండేది. కానీ ప్రజలపై మీకున్న అతి ప్రేమతో మీరే ఈ మారణకాండకు పూనుకున్నారు. నేను చేసిన మాయారచన కాస్తా నిజం అయ్యింది. ఇందుకు నన్ను కూడా బాధ్యుణ్ణి చేశారు. మీకు పెట్టిన పరీక్ష నా పాలిట శాపం అయ్యింది. దేవతలను సైతం అబ్బురపరిచే మీ తెలివి ఏమైనట్టు? మంత్రాన్ని ఇలా మారణహోమం చేయటానికా వినియోగించేది?' అంటూ ఆగ్రహజ్వాలలు కురిపించాడు ప్రాంచద్రుద్రుడు.
'మమ్మల్ని క్షమించండి స్వామి ! మీరు పెట్టిన ఈ పరీక్షలో విఫలమవ్వటమే కాక ఇందులో ఎలాంటి పాత్ర లేని సింహళ ప్రజలను, మిమ్మల్ని బాధ్యుల్ని చేసాము. ఇందుకు మాకు ఎలాంటి శిక్ష విధించినా ఆనందంగా స్వీకరిస్తాము కానీ ఈ సింహళను ఇందిరా పరిధికి చేర్చండి', అని ప్రాధేయపడ్డారు.
'అయితే మీకు కాలబంధనాలే గతి', అన్నాడు ప్రాంచద్రుద్రుడు.
'సింహళలో సింహ దత్తుడు పాలించే కాలం దాకా ఎన్నో జన్మలు తీసుకుంటూ ఎన్నో రూపాలు ధరిస్తూ పంచభూతాలను తృప్తి పరుస్తూ కాలబంధనాల్లో చిక్కుకుని సింహళను, సింహళ ప్రజలను విముక్తి చెయ్యాలి. అందుకు సిద్ధమైతేనే మీరు ఈ కర్మ నుండి ముక్తి పొందుతారు. లేదా కలి ప్రవేశించిన సింహళను చూస్తారు. కరువును చూస్తారు. కన్నీళ్లు చూస్తారు. మరణాలు చూస్తారు. వినాశనం, విలయం రెండింటినీ మేరువును చూసిన ఈ కళ్ళతోటే మీరు చూస్తారు', అంటూ ఉగ్రుడైపోయాడు ప్రాంచద్రుద్రుడు.
సింహళ రాజులకున్న దూరదృష్టి చేత అలాంటి సింహళ ఎలా ఉంటుందో వెంటనే అర్థం అయిపోయింది.
ప్రాంచద్రుద్రుడు సింహళ రాజులకు కాలబంధనాలు విధించాడు.
ఒక్కొక్కరికి ఒక్కో బంధనం. వాటిల్లో సంగీత బంధనాలు కూడా ఉన్నాయి. అనగా నిరంతరం ఒకే రకమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది. హవిస్సులో బలి అయిపోయిన క్రూర జంతువుల ఆర్తనాదాలు లెక్కచెయ్యనందుకు ఈ శిక్ష.
సంగీత బంధనాలలో ఎలాంటి రాగాలు పలుకుతాయో ప్రాంచద్రుద్రుడికి మాత్రమే తెలిసున్న విషయం.
-----------------------------------------------
ఎంతటి వారైనా సరే కాలానికి కట్టుబడక తప్పదు అనటానికి సింహళ రాజుల చరిత్రే తార్కాణం. ఏమంటే సింహళ రాజుల గొప్పతనమంతా వారికి ప్రజలపైనున్న ప్రేమలోనే ఉంది. సింహళను ఇందిరా పరిధికి చేర్చే వరకూ ఈ కష్టతరమైన శిక్షలన్నీ అనుభవిస్తూ వచ్చారు. వారికి ప్రజల క్షేమం తప్ప వేరే ధ్యాస లేదు. సింహళ తప్ప మరొకటి పట్టదు.
ఈ నిజం తెలుసుకున్న సింహ దత్తుడు తన పూర్వీకుల త్యాగాలన్నీ చూస్తూ వచ్చాడు. ఆయన కన్నీరే మనకు వర్షం అయ్యింది. సింహళ రాజులు ఏ నాడూ కంట తడి పెట్టలేదు. ఆనందంగా వారి భోగాలన్నీ త్యజించారు. సింహ దత్తుడు రాజు అయ్యే సమయానికి వారి చరిత్ర తెలియకుండా జాగ్రత్త పడ్డారు. సింహ దత్తుడి పాలనలోనే సింహళ ఇందిరా పరిధికి చేరుతుందని ప్రాంచద్రుద్రుడు మాటిచ్చాడు. సింహ దత్తుడికి వారి పూర్వీకుల గురించిన ఈ నిజం తెలియకుండానే ఇందిరా పరిధికి చేరుకొని రాజుగా భోగభాగ్యాలన్నీ అనుభవిస్తాడని పూర్వీకులు భావించారు. కానీ సింహ దత్తుడి అన్వేషణలో ఈ నిజాలన్నీ తనంతట తానుగానే తెలుసుకున్నాడు. మొదటగా మేరువుకు చేరుకున్నాడు. అటు పిమ్మట ప్రాంచద్రుద్రుడిని కలిసి ఈ చరిత్రను తెలుసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం మేరువు పైనే మన సింహ దత్తుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు', అని చెప్పటం ముగించాడు కవి శ్రేష్ఠుడు.
ఈ చరిత్రను ఆసాంతం విన్న మంత్రి అదే రోజు రాత్రి తన సైన్యాన్ని నియమించి సింహళ రాజ్యంలోని ఇంటింటికీ వెళ్లి కవి శ్రేష్ఠుడు చెప్పిన విషయాన్ని పొల్లుపోకుండా వివరించమని ఆజ్ఞాపించాడు..
సింహళ రాజ్య ప్రజలకు ఇదంతా వివరంగా తెలియటానికి రెండు రోజుల సమయం పట్టింది. ఈ రెండు రోజులలో ప్రజలకు ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు. అయినా సరే ఏదో తెలియని నమ్మకం. ఇదంతా కట్టుకథలా వాళ్లకు అనిపించటం లేదు. సింహళ రాజులు ఇంతకు పదింతలు త్యాగాలు చేసుంటారు అనిపిస్తోంది. మంత్రి ఆలోచన ఫలించింది. కవి శ్రేష్ఠుడు చెప్పదలుచుకున్న సత్యం భద్రంగా వారి హృదయ స్థానాలకు చేరింది.
ప్రజలందరూ ఇళ్ల నుండి బయటికొచ్చారు. ధారగా కురుస్తోన్న ఆ వర్షాన్ని చూస్తూ మోకాళ్లపై నిలబడి
"సింహదత్త మహారాజా తిరిగిరా
మేరువును చూసిన ధీరులారా మీకు నమస్సులు" అంటూ ఆకాశం వైపు చూస్తూ జయ జయ ధ్వానాలు చేస్తూ,
నేలపై తల పెట్టి ప్రార్థిస్తూ రెండేళ్లు ఆ వర్షంలోనే తడిసారు.
పుణ్యాన్ని అందరూ పంచుకుంటారు....కానీ పాపాన్ని సైతం పంచుకునే ప్రజల్ని చూస్తూ దేవతలు పూలవర్షం కురిపించారు.
వర్షం ఆగిపోయింది. సింహళ మాయమైపోయింది. చేరవలసిన చోటికే చేరింది.
సింహళ ఇప్పుడు ఇందిరా పరిధిపైనున్నది.
“ఇందిరా పరిధి పై ఉండవలసిన సింహ దత్తుడు మన శంభలకు మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తున్నారా”, అని అడిగాడు రుద్రసముద్భవ.
"కర్మ శేషమా స్వామి ?", అన్నాడు సంజయ్.
"అవును సంజయ్. చెయ్యాల్సిన కర్మ నుండి ఎంతటివారైనా సరే తప్పించుకోలేరు ", అంటూ నిట్టూర్పుతో అన్నాడు రుద్రసముద్భవ.
“అలాంటి సింహ దత్తుడి రాకతో ఈ శంభలకు విక్రమసింహుడు దొరికాడు.
విక్రమసింహుడి వల్ల శంభలకే ఒక అందం వచ్చింది. అంతా ఆ పైవాడి రచన కాకపోతే మరేమిటి?" అంటూ నవ్వాడు రుద్రసముద్భవ.
---------------------------------------------------
శంభల రాజ్యం – 12
యతిరాజు ప్రాంచద్రుద్రుడి ఆగమనం - వరుణ ప్రాకారం వైపుకు అభిజిత్ అడుగులు
సింహళ ఇందిరాపరిధికి వెళ్ళిపోయాక భూమ్మీద శాంతి భద్రతలకు లోటు ఏర్పడింది. సింహళ రాజుల త్యాగాలు సింహళను, సింహళ ప్రజలను సురక్షితంగా ఇందిరాపరిధికి చేర్చాయి. సింహళ రాజుల మారణహోమంలో బలి ఐన క్రూర జంతువుల అవశేషాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అవి భూమిపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ క్రూర జంతువుల అవశేషాలను రాబందులు, నక్కలు, వేటకుక్కలు తినటం మొదలు పెట్టాయి. ఒక చీకటి రాత్రి పూట అలా తిన్న రాబందొకటి ఇబ్బంది పడుతూ ఒక చెట్టు మీద వాలింది. అదే సమయంలో అటు వైపుగా వెళుతున్న వలకాడు ఈ రాబందును చూసి ఆగిపోయాడు. దూరంగా ఎక్కడినుంచో వస్తున్న వెలుగులో ఈ రాబందు కళ్ళు మెరిసాయి. కానీ ఆ వేటగాడైన వలకాడికి అది చకోర పక్షిలా కనిపించింది. అంతక్రితమే అతనికి చకోర పక్షిని వేటాడి భుజిద్దామనే దుర్బుద్ధి కలిగింది. చకోర పక్షి గురించి తన గురువు గొప్పగా పొగుడుతుంటే విన్నాడు. స్వతహాగా కాముకుడు అవ్వటం చేత గురువు చెబుతున్న మాటల్లోని భావం బోధపడక పెడబుద్ధి పుట్టింది. వెన్నెలను తాగి బతికే గొప్ప జీవి చకోర పక్షి. అలాంటి చకోర పక్షిని చంపాలనే ఆలోచనే వికృతి. అందుకే ఆ ఆలోచనకు తగ్గట్టే ఇప్పుడు ఈ రాబందే చకోర పక్షిలా అతనికి కనిపించి మాయకు గురి చేసింది. వెంటనే ఆ రాబందును అక్కడికక్కడే నేలకొరిగేలా చేసి దగ్గర్లో మంట కనపడితే ఒక గుడారం వైపుగా పరుగులు తీసాడు. ఆ వేటగాడి మనసులో ఇంకా అది చకోర పక్షి అన్న భ్రమే ఉంది. ఆ గుడారం బయట నలుగురున్నారు. వారు ఆ రాత్రి వేటకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆకలి మీదున్నారు.
ఈ వేటగాడు వాళ్ళని చూస్తూ ఇలా అన్నాడు,
"చకోర పక్షిని తెచ్చాను", కళ్ళు మెరిసిపోతూ అన్నాడు.
ఆ నలుగురిలో ఒకడికి ముచ్చెమటలు పట్టాయి.
"ఏం మాట్లాడుతున్నావ్? చకోర పక్షిని పూజిస్తాం మేము. అలాంటిది దాన్ని తుదముట్టించావా. నియతి లేని నాయాల" అంటూ కళ్ళెర్రజేశాడు.
వాళ్ళల్లో ఒకడు అతన్ని పక్కకు తీసుకెళ్లాడు.
"సరిగ్గా చూడు. అది రాబందు. చకోర పక్షి కాదు. వీడెవడో మిడిమిడి జ్ఞానిలా ఉన్నాడు.
ఇదే మంచి అవకాశం. తిందాం పద" అంటూ ఉండగా
"ఏమయిందిరా నీకు రాబందును తింటానంటున్నావ్?" అంటూ అడిగాడు.
"రాబందుకు నాకు వైరం. ఆ జాతి అంటేనే పడదు. మా తాత శవాన్ని పీక్కు తిని చంపిందది. వదిలిపెట్టమంటావా? మనం వేటాడలేదు. అదే మన దాకా వచ్చింది. ఎట్టా వదలమంటావు?"
"వైరం వద్దురా బాబు. మంచిది కాదు. నా మాట విను", అని ప్రాధేయపడ్డాడు.
అంతలో మరో ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా ఆ రాబందును తినటానికే మొగ్గు చూపారు.
అలా ఆ రోజు రాత్రి వాళ్ళు ఆబగా ఆ రాబందు మాంసం భుజించారు. ఇలాగే ఆ క్రూర జంతువుల అవశేషాలు తిన్న నక్కలు, వేటకుక్కలు కూడా మనుషుల వేటకు బలి అయిపోయి వారిచే భుజించబడ్డాయి. ఇలా కొన్ని నెలల పాటు సాగింది. ఇవి తిన్న వారందరు కర్కశంగా తయారయ్యారు. క్రూర జంతువు అవశేషం వారిలో ఏ విధంగా చేరిందో తెలీదు గాని ఇప్పుడు భూమ్మీద ఇలాంటి వాళ్ళే క్రూర జంతువులలా మారిపోయారు. వీరు బహు కాముకులుగా పరివర్తనం చెందారు. సత్వరజస్తమో గుణాలున్న మనుష జన్మను సార్థకం చేసుకోకుండా నిరర్థకం చేసుకునే దిశగా ఇలా వీరు భూమ్మీదున్న తక్కిన వారిని భయాందోళనలకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. వీరి వల్ల ఆడవారికి భద్రత లేకుండా పోయింది. చిన్నపిల్లలకు రక్షణ లేదు. యువకులకు దిక్కుతోచడం లేదు.
అలాంటి సమయంలో ఒక నాటి రాత్రి ఆకాశంలో పూర్ణ చంద్రుడు ఉండగా తెల్లటి వృషభంపై ఆసీనుడై యతిలా ఖడ్గధారియై ప్రాంచద్రుద్రుడు భూమ్మీదకు వచ్చాడు.
“య ఏవం వేదా
యోపామాయతనం వేదా
ఆయతనవాన్ భవతి”
అంటూ తన ప్రభతో ఒక్కసారిగా మంత్రపుష్పం అందుకుంటూ ముందుకుసాగాడా ఆ యతీశ్వరుడైన ప్రాంచద్రుద్రుడు. ప్రాంచద్రుద్రుడి నడకే ఎంతో మంది శిష్యగణాల్ని జతచేస్తూ పోయింది. మంత్రపుష్పంలోని అదే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు ఎగసిపడే అగ్నిశిఖలా వెడుతున్నాడా యతిరాజు.
ఆయన కళ్ళల్లోని జ్వాలలు పఠించే మంత్రాల ద్వారా బయటికి పెల్లుబుకుతూ జ్వాలాతోరణంలా ఆయన చుట్టూ ఏర్పడి భూమిపైనున్న కాలుష్యాన్నంతా తగలబెట్టుకుంటూ పోతోందా ఏమిటి అన్నంత గంభీరంగా ఉంది ఆ దృశ్యం.
ఆ క్రూర జంతువుల అవశేషాలు భూమిపైనున్న 108 స్థానాలను కలుషితం చేశాయి. ఆ 108 పరిసరాలలోని అసురీ శక్తినంతా తెచ్చి 108 చిత్గుహలలో బంధించాడు ప్రాంచద్రుద్రుడు.
“సరిగ్గా ఈ తురగ ప్రాకారం ఎక్కడైతే ఉందో అంతక ముందు 108 చిత్గుహలు ఉండేవని అంతక్రితం చెప్పాను కదా", అంటూ గుర్తుచేసాడు రుద్రసముద్భవ.
సంజయ్, అంకితలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
"మరిప్పుడు ఆ 108 చిత్గుహలు ఏమైపోయాయ్ స్వామి?" సంశయిస్తూ అడిగారు ఇద్దరూ.
" జజీరా తన స్వార్థంతో ఆ 108 చిత్గుహలను ధ్వంసం చేసాడు. విక్రమసింహుడొక్కడే జజీరాను, ఆ అసురీ సైన్యాన్ని ఎదుర్కొని ఈ శంభల రాజ్యాన్ని ఎలా కాపాడారో ముందు ముందు మీరే తెలుసుకుంటారు", అన్నాడు రుద్రసముద్భవ.
అనిలుడిపై స్వారీ చేస్తోన్న విక్రమసింహుడికి ఏదో జ్ఞప్తికి వచ్చి హఠాత్తుగా ఆగిపోయాడు.
తురగ ప్రాకారంలో జజీరాతో తను చేసిన సంగ్రామం గుర్తొచ్చింది. తన తల్లి విజయకుమారిని కోల్పోయాడు. తనెంతగానో ప్రేమించిన మిథిలాను కోల్పోయాడు. విక్రమసింహుడిలా ఉన్న అభిజిత్ అడుగులు ఆవేశంగా వరుణ ప్రాకారం వైపుగా పడ్డాయి. సింహదత్తుడి త్యాగంతో పావనమైన ఆ వరుణ ప్రాకారాన్ని చూడనిదే తన స్వస్వరూపం పూర్తిగా అర్థం అవ్వదు అనిపించింది అభిజిత్ కి.
విక్రమసింహుడి హృదయం ఆనాడు సింహదత్తుడిలానే చెమర్చింది. కానీ విక్రమసింహుడికి ఆ నాడు సింహదత్తుడి పూర్తి చరిత్ర తెలియదు. ఎందుకంటే సింహదత్తుడు ఏ నాడూ విక్రమసింహుడికి తన గురించి తాను చెప్పుకోలేదు. ఒక యోధుడి బిడ్డగానే పెరిగాడు విక్రమసింహుడు.
సింహదత్తుడు తన పూర్వీకులను తెలుసుకుని కార్చిన కన్నీరనే వర్షంతో తడిసిముద్దైన నేల ఈ వరుణ ప్రాకారం.
ఇన్నాళ్టికి సింహ దత్తుడి గొప్పతనం తెలుసుకుని అడుగుపెట్టబోతున్నాడు విక్రమసింహుడైన అభిజిత్.
--------------------------------------------
శంభల రాజ్యం – 13
సింహదత్తుడి ప్రాణ త్యాగం
వరుణ ప్రాకారంలోకి విక్రమసింహుడు అడుగుపెట్టగానే అక్కడున్న ఆకాశం గొడుగు పట్టింది.
శివుణ్ణి వ్యోమకేశి అంటారు. ఆకాశమే తన కేశములుగా కలవాడని అర్థం. కాలమే శివుడు. అలాంటి కాలం అనే ఆకాశం విక్రమసింహుడి రాకకై నిరీక్షిస్తూ ఇన్ని రోజులూ గడిపిందా అన్నంతగా నల్లబడింది కురుల లాంటి మేఘాలతో.
విక్రమసింహుడు జజీరాతో జరిగిన సంగ్రామంలో ఓడిపోయానని అనుకున్నాడు కానీ తన తండ్రి సింహదత్తుడి గొప్పతనం తెలుసుకోలేని కొడుకుగా ఓడిపోయాడని ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. అది సింహదత్తుడి గొప్పతనం.
సింహదత్తుడికి తన పూర్వీకులు వదిలి వెళ్లిన గొప్పతనం. వాస్తవానికి సింహళను, సింహళ ప్రజలను ఇందిరాపరిధికి చేర్చటంతోనే సింహళ రాజుల బాధ్యతలన్నీ తీరిపోయాయి. కానీ, అలా చేతులు దులిపేసుకుని వెళ్లే వాళ్ళే అయితే వాళ్ళు సింహళ రాజులెందుకవుతారు? సింహదత్తుని పూర్వీకులు ప్రజలను క్రూరజంతువుల బారి నుండి కాపాడటానికి జరిపిన మారణహోమానికి ప్రాయశ్చిత్తంగా అన్నిశిక్షలనూ అనుభవించారు. ఎన్ని త్యాగాలు చెయ్యాలో అన్నీ చేశారు. అయినా ఇవేవీ సింహదత్తుడికి తెలియనివ్వలేదు. సింహ దత్తుడే స్వయంగా తెలుసుకున్నాడు. ఇప్పుడు విక్రమసింహుడు కూడా అంతే. తనే అభిజిత్ గా వచ్చి విక్రమసింహుడిగా ఆనాడు ఏమేం తెలుసుకోలేకపోయాడో అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నాడు.
వరుణ ప్రాకారంలో సింహదత్తుడు తుదిశ్వాస విడిచాడు. అనలప్రాకారంలోని జ్వాలాజిహ్వుడి నుండి, మేఖలలోని భైరవి నుండి శంభలకు పూర్తిగా విముక్తి కల్పించాడు.
జ్వాలాజిహ్వుడు, భైరవి ఒకప్పుడు శంభల రాజ్యంలోని ఈ వరుణ ప్రాకారంలో మూడు అమావాస్యలు విచ్చలవిడిగా శృంగారం జరిపారు. ఈ విషయం తెలిసిన ఏ వ్యక్తి కూడా బతికి బయటపడినట్టు శంభల చరిత్రలోనే లేదు. కానీ కొన్ని విషయాలు దాచిపెడితే దాగేవి కావు. కంటితో చూస్తేనే తెలిసే సత్యాలు కూడా కావు. కొన్ని చర్యలకు విపరీతమైన పరిణామాలుంటాయి. అలాంటిదే ఈ జ్వాలా జిహ్వుడు,
భైరవిల రతిక్రీడ. జ్వాలాజిహ్వుడు, భైరవిల ప్రేమ ఒకప్పుడు రెండు వంశాలనే నాశనం చేసింది. వారిరువురి రూపురేఖలను పూర్తిగా మార్చి వేసింది. అయినా సరే రూపాలకు అతీతంగా వారి మధ్యనున్న మోహం మరింత బలపడుతూ పోయింది. ఆ మోహమే ఎంతో మందిని భయపెడుతూ పోయింది. సరిగ్గా ఈ వరుణ ప్రాకారం ఉన్న చోటునే ఒకప్పుడు సింహళ ఉండేది. అదే సింహళలో కొన్ని క్రూర జంతువులను సింహళ రాజులు యజ్ఞానికి ఆహుతిచ్చి బలిచేశారు. అలాంటి ఈ చోటులో ఉన్న వరుణ ప్రాకారంలో మరిన్ని క్రూరజంతువులు తయారవుతున్నాయని శంభల జ్యోతిష్యుడు కనిపెట్టి శంభల రాజులనూ, మంత్రులనూ హెచ్చరించాడు. కొత్తగా పుట్టుకొస్తున్న ఈ క్రూరజంతువులు ఎక్కడివా అని అంచనా వేస్తే అప్పుడు అర్థం అయింది ఏంటంటే అవి జ్వాలా జిహ్వుడు, భైరవిల ప్రేమకు ప్రతిరూపాలని. అలాంటి సమయంలో వారికి శంభలను కాపాడే యోధుడిగా సింహదత్తుడు మాత్రమే కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న సింహదత్తుడు ఇలా అన్నాడు.
"సింహళ ప్రజలు ఇందిరాపరిధికి వెళ్ళిపోయాక మళ్ళీ నేను తిరిగి శంభలకు ఎందుకు రావలసి వచ్చిందో నాకిన్ని రోజులూ బోధపడలేదు. ఇప్పుడు ఆ కార్యకారణ సంబంధం చాలా స్పష్టముగా నా కళ్లముందుంది. శంభలను కాపాడటం నా బాధ్యత", అన్నాడు.
శంభల రాజులు, మంత్రులు సంశయించారు.
మహామంత్రి ముందుకొచ్చి తన సంశయాన్ని ఇలా బయటపెట్టాడు.
"మీరిప్పుడు ఆ క్రూరజంతువులను చంపితే జ్వాలాజిహ్వుడు, భైరవి ఊరుకుంటారా?
శంభలను సజీవంగా దహనం చేస్తారు. ఆ క్రూరజంతువులను చంపకపోతే అవే మనల్ని సంహరిస్తాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని మీరొక్కరే ఎలా ఎదుర్కుంటారు?"
"ప్రాంచద్రుద్రుడిచ్చిన యజ్ఞ మంత్రాన్ని ప్రజల శ్రేయస్సు కోసం వాడి వారి కంటే ముఖ్యమైనది మరొకటి లేదని చాటారు మా పూర్వీకులు. వారు పడ్డ కష్టాలను మేరు పర్వత దర్శనం జరిగినప్పుడు నా కళ్లారా నేను చూసాను. అలాంటి రక్తం పంచుకు పుట్టిన నేను సింహళ నేలపై ఉన్న ఈ శంభలను ఎలా వదిలేసి వెళ్లిపోగలను ! పైగా శంభల రాజకుమారి ఐన విజయకుమారి నా ధర్మపత్ని. విక్రమసింహుడు నా కొడుకు. నా పరాక్రమాన్నే శంభలకు కానుకగా ఇచ్చిన నేను నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపొమ్మంటున్నారా?" అని కన్నెర్రజేశాడు.
అంతవరకు సింహదత్తుడిలోని ఆగ్రహ జ్వాలను చూడని వాళ్లకు ఈ ప్రశ్నతో నోట మాటరాలేదు.
వరుణ ప్రాకారం ఉన్న చోటు సింహళ రాజుల, ప్రజల కన్నీళ్లతో పావనమైన స్థలం. అలాంటి నేలపై అరాచకం జరగాలన్నా జరగదు. విధ్వంసం మొదలు పెట్టాలన్నా కుదరదు. అందుకే జ్వాలా జిహ్వుడు, భైరవిల ప్రతిరూపాలైన అంజీరణులను పూర్తిగా నశింపజేయ్యగలిగాడు సింహదత్తుడు. సింహదత్తుడి కత్తికి బలైన ఆ అంజీరణుల ఆర్తనాదాలు జ్వాలా జిహ్వుడికి, భైరవికి వినబడ్డాయి.
అనల నుండి కోపంగా నలుదిశలా జ్వాలలతో బయలుదేరిన యాళి జ్వాలా జిహ్వుడు అయితే, మేఖల నుండి ఉగ్రరూపం దాల్చి రెక్కలు పెద్దవిగా చేసి అడ్డొచ్చిన దాన్నల్లా తన్నుకుపోయే గరుడపక్షి భైరవి.
వరుణ ప్రాకారంలో వీరిరువురి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు సింహదత్తుడు.
అంజీరణుల శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి అక్కడ. జ్వాలా జిహ్వుడు, భైరవి అల్లంత దూరం నుండే చూసారీ ఘోరాన్ని. అంత కోపంలో కూడా కన్నీరు మున్నీరయ్యారు. అంత ఘోరంగా అక్కడ చచ్చి పడున్న అంజీరణులను చూస్తూ బాధగా తన రెక్కలతో నిర్జీవంగా పడున్న వాటి శరీర భాగాలను ఒడిలోకి తీసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది భైరవి. ఒక్క ప్రాణం అయినా మిగిలుందేమోనని ఆతృతగా వెతుకుతున్న కళ్ళతో చుట్టూ చూస్తున్నాడు జ్వాలా జిహ్వుడు. హృదయవిదారకంగా ఉంది వారిరువురి పరిస్థితి. జ్వాలా జిహ్వుడిలో తండ్రి కనిపించాడు. భైరవిలో తల్లి కనిపించింది. భైరవి మాతృవేదన, జ్వాలాజిహ్వుడి పితృశోకం రెండూ ఆ సమయంలో అరణ్యరోదనే అయ్యాయి. ఏడ్చి ఏడ్చి కనులలో నీళ్లు ఇంకిపోయాయి భైరవికి. వెతికి వెతికి కనులలో ప్రేమ ఇంకిపోయింది జ్వాలా జిహ్వుడికి. ఇప్పుడు ఇద్దరూ సింహదత్తుడి కోసమే వెతుకుతున్నారు.
------------------------------------------------------
సరిగ్గా అదే సమయంలో ధీరునిలా వారికెదురొచ్చి నిలబడ్డాడు సింహ దత్తుడు.
"మా ప్రేమకు ప్రతిరూపాలని నామరూపాలు లేకుండా చేసావే. అసలు నీకు మనసంటూ ఉందా?" అని అడిగాడు జ్వాలా జిహ్వుడు.
"మీ ప్రేమకు ప్రతిరూపం ప్రపంచానికి ఆటంకం కాకూడదు కదా", అన్నాడు సింహ దత్తుడు.
"అంజీరణులు ఎవ్వరికైనా హాని తలపెట్టాయా?" రోదిస్తూ అంది భైరవి.
"అవి చంపే దాకా చూస్తూ ఉండమంటారా?" అని ఎదురు ప్రశ్న వేసాడు సింహ దత్తుడు.
"వాటిని లయం చెయ్యటానికి నువ్వెవరు? శివుడివా?" కోపంగా అడిగాడు జ్వాలా జిహ్వుడు.
"లయం చేసే ప్రతి వాడు శివుడే. లయం లేనిదే సృష్టి లేదు. సృష్టి అంటూ ఉంటే లయం అవ్వక తప్పదు. అది ధర్మం", అని ఎలాంటి బెదురు లేకుండా చెప్పాడు సింహ దత్తుడు.
"ఏది లయం చెయ్యాలో శివుడికి తెలుసు. కాలానికి తెలుసు. అసలు నువ్వెవరు?" అంటూ కోపంగా అడిగింది భైరవి.
"సింహదత్తుడిని. సింహళ రాజ్యం ఉన్న ఈ నేలపైనే రాజ్యపరిపాలన చేసిన రాజును", అంటూ బదులిచ్చాడు.
"అది ఒకప్పుడు. ఇప్పుడు కాదు కదా", అన్నాడు జ్వాలా జిహ్వుడు.
"నిజమే. కానీ ఇప్పుడు శంభల రాజకుమారి విజయకుమారి నా సతీమణి. శంభలను, శంభల ప్రజలనూ కాపాడే బాధ్యత నాదే", అన్నాడు సింహ దత్తుడు.
"మాకు పుత్రశోకం కలిగించిన నిన్ను ఊరికే వదిలిపెట్టము. మేము చచ్చినా సరే నీకు పుత్రశోకం కలిగితీరుతుంది" అంటూ శపించారు జ్వాలా జిహ్వుడు, భైరవిలు.
సింహ దత్తుడి నోట మాటరాలేదు. తను ఇంతవరకూ పరాక్రమం చూపించాను అనుకుంటున్నాడు. కానీ అది ఇంతటి దుఃఖం తెచ్చిపెడుతుందని అనుకోలేదు.
జ్వాలా జిహ్వుడు, భైరవిలు కేవలం కామ సుఖాలను అనుభవించారనుకున్నాడు. కానీ ఇప్పుడు వారు తల్లిదండ్రుల స్థానంలో తనను ప్రశ్నిస్తున్నారు. వారి బాధలో నిజముంది. వారి భావనలో ఎంత నిజమున్నదో వారికే తెలియాలి. ఇలాంటి ధర్మ సందిగ్ధంలోనే సరిగ్గా తన పూర్వీకులు కూడా నెట్టివేయబడ్డారు.
అప్పుడు సింహదత్తుడు ఆకాశం వైపుకు చూస్తూ ఇలా అన్నాడు.
"రాజుగా ధర్మాన్ని పాటించిన నన్ను శివుడివా అని వీళ్ళు అడుగుతున్నారు. రాక్షస సంహారం చేసిన నన్ను పుత్రశోకం కలిగించావు అంటున్నారు. నాకు పుత్రశోకం కలిగితే మాత్రం నా కొడుకు నిన్నే చేరుకుంటాడు శివా. నిన్నే చేరుకుంటాడు. నిన్నే ప్రశ్నిస్తాడు. నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు. నిన్ను నిలదీస్తాడు శివా. గుర్తుపెట్టుకో", అంటూ సింహ దత్తుడు వజ్రమణి అనే ఆయుధాన్ని తీసి జ్వాలా జిహ్వుడిపై సంగ్రామానికి బయలుదేరాడు.
నిరంతరాయంగా రెండు గంటలు జరిగిన ఆ యుద్ధంలో చివరికి జ్వాలా జిహ్వుడు, భైరవి ప్రాణాలు విడిచారు. సింహదత్తుడు శంభల కోసం వారితో తలపడుతూ తన ప్రాణత్యాగం చేసాడు. చరిత్రకెక్కాడు. విక్రమసింహుణ్ణి శంభలకిచ్చాడు.
వరుణప్రాకారంలో నిల్చున్న అభిజిత్ కళ్ళముందు ఇదంతా ఆవిష్కృతం అయింది.
కుండపోతగా అక్కడ వర్షం కురుస్తోంది.
అది వర్షం కాదు సింహదత్తుడి కన్నీరే అని తెలుస్తోంది అభిజిత్ రూపంలో ఉన్న విక్రమసింహుడికి. ఇదంతా తెలుసుకున్న అంకిత, సంజయ్ లకు విక్రమసింహుడి వేదన మొదటి సారి అర్థం అయినట్టు అనిపించింది. సింహదత్తుడి పరాక్రమం ఎల్లలు లేనిదిగా తోచింది.
రుద్రసముద్భవ మీసం మెలేసాడు. సింహాన్ని చూస్తేనే కాదు తలచుకున్నా సరే ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యం అతని చేత చేయించిన చేష్ట అది.
--------------------------------------------------------
శంభల రాజ్యం – 14
జజీరా ప్రలోభము.....విక్రమసింహుడిని తుదముట్టించుటకు జ్వాలా జిహ్వుడి విశ్వప్రయత్నం
వరుణ ప్రాకారం తర్వాత వరుసగా అనల, మేఖల ప్రాకారాలున్నాయి. అప్పటికే వరుణ ప్రాకారం బయట ఖగరథం ఒకటి నిలుపబడి వున్నది.
ఖగరథం వైపుకు అడుగులేస్తున్న రుద్రసముద్భవను చూస్తూ, "అదేంటి స్వామి? ఎటువైపుకు మన పయనం ?" అని అడిగాడు సంజయ్.
"అనల, మేఖల ప్రాకారాలలో మనకు ప్రవేశం నిషిద్ధం. ఒకప్పుడు జ్వాలా జిహ్వుడు, భైరవిల నివాస స్థానాలవి. అక్కడికి వెళ్లాల్సిన సమయం ఇంకా ఆసన్నమవ్వలేదు ", అంటూ చెప్పటం ఆపేసాడు రుద్రసముద్భవ.
"మనం తెలుసుకోవాల్సిందేదో ఇంకా మిగిలే ఉంది", అన్నది అంకిత.
అభిజిత్, అంకిత, సంజయ్ లతో రుద్రసముద్భవ నేతృత్వంలో ఖగరథం కదిలింది.
గాలిలో వెళుతుండగా అభిజిత్ తన పక్కనే ఉన్న గవాక్షి ద్వారా ఆకాశం వైపుకు చూసాడు.
సూర్యుడు కనిపించాడు. పక్షులు కనిపించాయి. ఒకసారి క్రిందకు చూసాడు. అనల ప్రాకారం కనిపించింది. అనలలో నడయాడినట్టు అక్కడి నేలపై జ్వాలా జిహ్వుడి పాద ముద్రలు, ప్రాకారం నలుమూలలా శరీర రూపురేఖలు స్పష్టంగా ముద్రింపబడ్డాయి. మహనీయుల అడుగులు నేల తల్లికి ఎంత పావనమో లోక కంటకులు ఆవిడకి అంత పెనుభారం. ఆ ప్రాకారం ఇప్పటికీ నిప్పులు వెదజల్లుతున్నట్టుగా అనిపించింది అభిజిత్ దృష్టికి. తదుపరి మేఖల కనిపించింది. ఏదో తెలియని అశాంతి నిండుకున్న ప్రదేశంలా ఉందది. భయం గొలిపే ఎరుపు రంగు అనల అయితే, కమ్ముకొనే పెను చీకటి మేఖల.
"మనమిప్పుడు వెళ్లబోయే ప్రాకారం ఏది స్వామి?" అని అడిగాడు సంజయ్.
"ఇక్కడి నుండి రాబోయే నాలుగు ప్రాకారాలూ విక్రమసింహుడి జీవితాన్ని పూర్తిగా మార్చివేసినవే ", అంటూ రుద్రసముద్భవ అభిజిత్ వైపు చూసాడు.
"ఇప్పుడు మనం అడుగుపెట్టబోయేది ప్రలోభ లో", అంటూ ఊపిరి బిగబట్టి ఏదో తెలియని ఆలోచన తనను వేధిస్తున్నట్టుగా రుద్రసముద్భవ ఒక్కసారిగా సంజయ్, అంకితల వైపు చూసాడు.
ప్రలోభ లో ఏదైనా జరగవచ్చు. మీరు ఇప్పటివరకు మాయారూపధారుల గురించి, కామరూపధారుల గురించి విని ఉంటారు. శంభల మునుపెన్నడూ కనని, వినని, ఎరుగని సంకల్పధారులని ప్రలోభ లో మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. అందుకు విక్రమసింహుడే కారణం. ఆ సంకల్పధారులెవరో, వారెప్పుడు, ఎందుకు, ఎలా కనిపిస్తారో ఒక్క విక్రమసింహుడికే…తెలుసు", అంటూ అభిజిత్ వైపు చూసారు ముగ్గురూ.
"అంతుబట్టని మాయకు ఒక రూపం ఉంటుంది. అంతులేని కామానికి ఒక రూపం ఉంటుంది. మన బుద్ధి బలానికి మనోబలం తోడైనప్పుడు సంకల్పం మనలోనే స్థిరమయ్యి ఉంటుంది. అలాంటి సంకల్పం వేరొక బాహ్య రూపం ఎలా తీసుకుంటుంది స్వామి?" అని అడిగాడు సంజయ్.
"చాలా లోతైన ప్రశ్న అడిగావు సంజయ్. సంకల్పానికి వికల్పం ఎదురైనప్పుడు, ఆ వికల్పము అంతటి మహాసంకల్పానికే మరణసదృశం అవుతున్నప్పుడు ఆ మహాసంకల్పానికున్న బలం వల్ల సంకల్పమొక రూపం తీసుకుంటుంది. బాహ్యరూపం సంతరించుకుంటుంది. ఈ విషయాన్ని నేను కళ్లారా చూసాను కాబట్టే ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
విక్రమసింహుడికి ఈ ప్రాకారంలో అలా తటస్థపడ్డవారే ఆ సంకల్పధారులు. వారిని శంభల యోగులు అంటారిక్కడ. సంకల్పధారి అన్న దృష్టి ఎంతో లోతుకు వెళితే గానీ అందని భావన. శంభల రాజ్య యోధులు శంభల యోగులుగా వీరిని కొలుస్తారు. యుద్ధానికి సంసిద్ధం అయ్యే సమయంలో వారు ఈ శంభల యోగుల ముందే సంకల్పం చెబుతారు. యుద్ధంలో విజయం ఆ సంకల్పం నెరవేరటం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎటువంటి విఘ్నాలు ఎదురవ్వుకుండా ఉండేందుకు శంభల యోగుల దీవెనలు వారికి ఎంతైనా అవసరం."
అంతట్లో ఖగరథం ప్రలోభ వాకిట ఆగింది.
ఖగరథం దిగగానే అభిజిత్ అడుగులు తనకు తెలియకుండానే ప్రలోభ లోనికి పడ్డాయి.
తానక్కడికి బహు తక్కువ పర్యాయాలే వచ్చి ఉన్నా సరే, అక్కడేదో చారిత్రక ఘట్టం జరిగిన అనుభూతి కలుగుతోంది.
రుద్రసముద్భవ అభిజిత్ నే చూస్తూ ఉన్నాడు. తను అనుకున్నదే జరుగుతోంది. అభిజిత్ కి అక్కడేదో గుర్తుకొస్తోంది.
మిథిలా విక్రమసింహుడి కోసం పూర్ణిమ రాత్రి నాడు రావటం గుర్తుకొస్తోంది.
మిథిలా ప్రేమలో పడి జజీరా రూపంలో విక్రమసింహుడికి పొంచివున్న ప్రమాదం కనబడకపోవడం గుర్తుకొస్తోంది.
అభిజిత్ ఒక చోట ఆగిపోయాడు. అంతకంటే ఇంకేం గుర్తుకు రావటం లేదు.
రుద్రసముద్భవ, సంజయ్ మరియు అంకితలు అక్కడికి చేరుకున్నారు.
ప్రలోభలో ఏం జరిగిందో చెప్పమన్నట్టుగా అభిజిత్ రుద్రసముద్భవ దిక్కు చూసాడు.
--------------------------------------------------
"ఇప్పుడు నేను చెప్పబోయేది నీకెలా అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు కానీ ఈ ఘట్టం ద్వారా ఎప్పటికీ మరువలేని శంభల యోగులు మాత్రం శాశ్వతంగా శంభలకు దొరికారు. వారెవరో తెలిస్తే నీకు విక్రమసింహుడు అర్థం అవుతాడు. సింహ దత్తుడు అర్థం అవుతాడు. నీకు నువ్వు ఇంకా బాగా అర్థం అవుతావు అభిజిత్", అంటూ రుద్రసముద్భవ చెప్పటం మొదలు పెట్టాడిలా.
"విక్రమసింహుడు మిథిలాను ఇష్టపడుతున్న రోజులవి. మిథిలా కోసం ఏదైనా చేసే ధైర్యం, సాహసం విక్రమసింహుడి దగ్గర ఉండనే ఉన్నాయి. వాటిని మించే ప్రేమను మిథిలా మాత్రమే విక్రమసింహుడికివ్వగలిగింది. మిథిలా రాజకుమారి కాదు. కానీ, రూపలావణ్యంలో ఏ రాజకుమారికీ, దేవకన్యకు తీసిపోని అందం తనది. విక్రమసింహుడు రాజు. విక్రమసింహుడంతటి అందగాణ్ణి అంతక్రితం శంభల ఖచ్చితంగా చూడలేదు. అలాంటి వీరిరువురూ కలిసిన ప్రతి సారి వీరిద్దర్నీ చూస్తూ ప్రకృతి మైమరచిపోయి ఆనందతాండవం చేస్తోందేమో అన్నట్టుండేది. వీరి మాటల్లో చూపులు కలిసేవి. చూపుల్లో మాటలు కలిసేవి. శంభలలో అంతులేని ప్రేమ భాష తెలిసిన ప్రేమికులు వీరిద్దరేనా అన్నట్టుండేది. మిథిలా కోసం ఏదైనా చేసెయ్యగలిగే విక్రమసింహుడి బలాన్ని బలహీనతగా చూసే జజీరా కళ్ళకు వీరి ప్రేమ అంతగా రుచించేది కాదు. మిథిలాను మోజుపడ్డాడు జజీరా. జజీరాది శారీరక వాంఛ. పైగా జజీరా తనను తాను విక్రమసింహుడితో పోల్చుకుంటూ తానెందులోనూ అతనికి తీసిపోనని భావిస్తూ ఈర్ష్యాద్వేషాలను పోగుచేసుకున్న బలవంతుడు. విక్రమసింహుడు జజీరా గురించి ఏనాడు ఆలోచించలేదు. విక్రమసింహుడికి తన ప్రేమలో మిథిలా తప్ప వేరెవ్వరూ కనిపించేవారు కాదు.
మిథిలాకు విక్రమసింహుడి అమ్మగారైన విజయకుమారితో మంచి అనుబంధం ఏర్పడింది. విజయకుమారికి మిథిలా అంటే ఎంతో ఇష్టం. విక్రమసింహుడికి అన్ని విధాలా ఆమె సరైన ఈడు జోడు అని తన నిశ్చితాభిప్రాయం. జజీరాకి వేగుల ద్వారా ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేవి. శంభలలో ఎవ్వరికీ ప్రవేశం లేని అనల, మేఖలలో జజీరా ఒకనాటి రాత్రి ప్రవేశించాడు. సింహ దత్తుడు జ్వాలా జిహ్వుడిని, భైరవిని సంహరించిన తర్వాత అనల, మేఖల ప్రాకారాలను పూర్తిగా నిర్బంధించి వేశారు. అసలక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. జజీరా మొట్టమొదటి సారి అక్కడికెళ్ళాడు. అనలలో మొట్టమొదటి సారిగా విషాన్ని కాకుండా నిప్పును విరజిమ్మే పాములను చూసాడు జజీరా. ఆ గాలిలోనే విషం ఉంది. జజీరా అణువణువులోనూ అది రివ్వున ఎక్కేసింది. జజీరా అక్కడ ఏదో అద్భుత శక్తి ఉందనుకుని ఆ శక్తిని జపం చేస్తూ ప్రార్థించాడు. ఆ ప్రార్థన వల్ల జ్వాలా జిహ్వుడు సింహ దత్తుడికిచ్చిన శాపం తాలూకు ఘట్టం మొత్తం జజీరా కళ్ళకు కట్టినట్టు కనబడింది. జ్వాలా జిహ్వుడు అంతం అయిపోయినా అక్కడ ఉత్తరక్రియలు జరగకపోవటం చేత అతని ప్రేతం అలానే మిగిలిపోయింది. ఆ ప్రేతాన్ని ఆవాహన చేసుకునే మంత్రం జజీరా దగ్గరుంది. విక్రమ సింహుడి మీదున్న ఈర్ష్య జజీరా చేత ఆ ప్రేతాన్ని తనలోకి ఆవాహన చేసుకునేలా పురికొలిపింది. ముందు వెనుక ఆలోచించకుండా కేవలం విక్రమసింహుడి పైనున్న అసూయతో జ్వాలా జిహ్వుడి ప్రేతాన్ని తనలోకి ఆహ్వానం పలికాడు జజీరా. జ్వాలా జిహ్వుడి ప్రేతం జజీరాలోకి ప్రవేశించగానే పిచ్చి పట్టినవాడిలా చుట్టూ వెతికాడు. దేనికోసం వెతుకుతున్నాడో అర్థం కావట్లేదు.
'పదకొండు...పదకొండు.... పదకొండు' అంటున్నాడు. అదే సమయంలో అక్కడొక బిలం కనబడింది. ఏదో గుర్తుకొచ్చినవాడిలా అందులోకి వెళ్ళాడు. అక్కడ పదకొండు సర్పాలు కనిపించాయి. అవి మాట్లాడే విష సర్పాలు. కానీ వాటి విషాన్ని అవి ఇతరులపై ప్రయోగించవు. ఈ విషయం జ్వాలా జిహ్వుడికి బాగా తెలుసు. అందుకే పూర్ణిమ రాత్రి కోసం ఇన్నేళ్లు ఎదురు చూసాడు. ఇప్పుడు సమయం ఆసన్నం అయ్యింది. పూర్ణిమ రోజున ఆ పదకొండు సర్పాలకూ విముక్తి దొరుకుతుందని ఎప్పుడో ఒక ఋషివర్యుడు చెప్పాడు. అదే వాక్యాన్ని ఆలంబనగా చేసుకుని అక్కడే ధ్యానంలో ఉన్నాయవి. కానీ ఈ సర్పాల విషం అత్యంత ప్రమాదకరం. ఒకసారి ఈ సర్పాల విషపు చుక్క అక్కడి రాతిపై పడటం, ఆ రాయి మలమల మాడిపోవటం తన కళ్లారా చూసాడు జ్వాలా జిహ్వుడు.
అది చూసిన రోజు నుండి మదిలో నిలిచిపోయిందా దృశ్యం. ఇప్పుడదే విషపు చుక్కతో జ్వాలా జిహ్వుడి ప్రేతం సింహ దత్తుడి కొడుకైన విక్రమ సింహుడిని అంతం చేద్దాం అనుకుంటోంది. విక్రమసింహుడిని చూసి ఈర్ష్య పడే జజీరా ద్వారా తన శాపాన్ని ఎలాగైనా నెరవేర్చాలన్న కసి జ్వాలా జిహ్వుడి ప్రేతానిది. ఈ విషపు నాగులకు పూర్ణిమ రోజున సగరుడు తాకిన మట్టి తెచ్చి పూజ చేస్తే విముక్తి కలుగుతుందని తెలియటంతో జజీరా వెంటనే తాను ఆ పని చేస్తానని మాటిచ్చాడు. అందుకు కృతజ్ఞతగా తాము ఏమి చెయ్యాలో జజీరాను అడిగాయి ఆ పదకొండు విషసర్పాలు. ప్రలోభలో మిథిలా, విక్రమసింహుడు కలవనున్న పూర్ణిమ రోజున వారిరువురి మధ్యనా దూరం పెరిగేలా చెయ్యమని కోరాడు జజీరా. ఇద్దరు ప్రేమికుల్ని విడదీయ్యటం కాకుండా మరేదైనా కోరుకొమ్మని అడిగాయి ఆ పదకొండు విష సర్పాలు. జజీరా ఊహించని పరిణామం ఇది.
పదకొండు సర్పాలనూ విడి విడిగా వాటి విషపు చుక్కలను ఇవ్వమని కోరాడు. ఒక నిమిషం పాటు దీర్ఘాలోచన చేశాయి.
"నువ్వు మా విషాన్ని ఎందుకు అడుగుతున్నావో మాకు అనవసరం. కానీ ఈ విషం చాలా ప్రమాదకారి. పుట్టగతులుండవు. ఒకే ఒక్క విషపు చుక్క అయినా సరే అతి భయంకరమైన నరకాన్ని బ్రతికుండగానే చవిచూపిస్తుంది. ఇది హెచ్చరిక మాత్రమే. ఆ పై నీ మనోగతాన్ని అనుసరించే నువ్వు ప్రవర్తిస్తావు", అని జజీరా కోరినట్టుగానే విషపు చుక్కల్ని ఇవ్వటానికి సిద్ధమయ్యాయి.
"ఇది నువ్వు ఎవరి మీద ప్రయోగించాలి అన్నా ముందు ఇక్కడి నుండి నువ్వు ఈ విషాన్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళటానికి వీలుగా ఉండే ప్రహీణ అదుగో అక్కడున్నది. అందులో మాత్రమే నువ్వు ఈ విషాన్ని నింపగలవు" అన్నాయా విష సర్పాలు.
జజీరా విషం నిండిన ఆ ప్రహీణ తో బిలం నుండి నిష్క్రమించాడు.
సగరుడు తాకిన మట్టి కోసం వెతకసాగాడు జజీరా. ప్రలోభలో సగరుడు తాకిన మట్టి ఉంటుందని తన వేగుల ద్వారా వాకబు చేయిస్తే తెలిసింది. సగరుడు అంటే సముద్రుడు. సముద్రం తాకిన మట్టి ఇక్కడెలా ఉందబ్బా అని ఆశ్చర్యపోయాడు జజీరా. ప్రలోభలో విస్తారముగా పరుచుకుని వున్న పర్వతం నుండి తెచ్చిన ఆ మట్టిని అతనికి అందించారు వేగులు.
------------------------------------------------------------
ఆ మట్టిని తీసుకెళ్లి జజీరా పూర్ణిమ నాడు ఆ పదకొండు విష సర్పాలకూ అందించాడు.
ఆ మట్టి వాసన పసిగట్టాయి ఆ విష సర్పాలు. ఒక్కసారిగా పదకొండు సర్పాలూ జజీరా వైపు చూశాయి. జజీరాకు ముచ్చెమటలు పట్టాయి.
"సగరుడు తాకిన ఈ మట్టి నీకెక్కడిది?" అని ముక్తకంఠంతో ప్రశ్నించాయి ఆ సర్పాలు.
"ప్రలోభలో దొరికింది", అని తడబడుతూ జవాబిచ్చాడు జజీరా.
కాసేపటి మౌనం తర్వాత,
"ఏదైతేనేం, మాకు ముక్తిని కలిగించినవాడివయ్యావు", అంటూ ఆశీర్వదించాయవి.
జజీరాకేమీ అంతుబట్టడం లేదు. ఆ బిలం నుండి నిష్క్రమించాడు.
ఆ పూర్ణిమ రాత్రి విక్రమసింహుడు ప్రలోభలో మిథిలాను కలవబోతున్నాడు . మిథిలా విక్రమసింహుడు ఆరాధించే పరమశివునికి అభిషేకం చేసిన పాలు ఒక బంగారు పాత్రలో తీసుకుని వస్తోంది. మిథిలా చేతుల మీదుగా ఆ అభిషేక తీర్థాన్ని పుచ్చుకోవాలని విక్రమసింహుడు ఆనందంగా ఎదురుచూస్తున్నాడు ఆకాశంలోని పున్నమి చంద్రుణ్ణి చూస్తూ. మిథిలా మాత్రం తను అంతవరకు చేసిన పూజలో ఆ పరమశివునికి విన్నవించుకున్న తన ప్రేమ గురించే ఆలోచిస్తూ విక్రమసింహుణ్ణి ధ్యానిస్తూ వస్తోంది.
జజీరా మిథిలాను వెంబడిస్తున్నాడు. అదే సమయంలో మిథిలా ఒక చోట ఆగి విక్రమసింహుడికి ఎంతో ఇష్టమైన మందార మకరందాన్ని దాచి ఉంచిన వనంలోకి వెళ్ళింది. వెళుతూ ఆ అభిషేక పాత్రను అక్కడే వదిలి వెళ్ళింది. జజీరా ఆ పాత్రలోనే తను తెచ్చిన ప్రహీణ లోని ఆ విషపు చుక్కను కలిపాడు అందులో. వేడిగా పొగలు కమ్ముతూ ఉంది ఆ పాత్ర. ఆ అభిషేక మహిమో మరేంటో తెలియట్లేదు గానీ పాల రంగు మాత్రం అలాగే ఉంది. జజీరా అది చూస్తూ వికృతంగా నవ్వాడు. మిథిలా మందార మకరందాన్ని ప్రోగు చేసుకుని తన దగ్గర దాచుకుని వనం నుండి బయటికొచ్చింది. ఆ పాత్రను తీసుకుని ముందుకు సాగింది. జజీరా ఇంకా మిథిలా వెనకే వస్తూ ఉన్నాడు.
ప్రలోభలో వున్న పర్వత ప్రాంతం చేరుకున్నారు. ఆ పర్వతం విశాలంగా దారి పొడుగునా పరుచుకుని ఉన్నది. మిథిలా విక్రమసింహుని కోసం వెతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నది. వెనకే జజీరా వస్తున్నాడు. అల్లంత దూరాన విక్రమసింహుడు కూర్చుని ఉన్నాడు.
ఇంతలో ఆ పర్వతాన్ని చీల్చుకుంటూ పదకొండు మంది ఒక్కరొక్కరుగా జజీరా వెనుకే వస్తున్నారు. ఇదంతా జజీరా దృష్టికి అందట్లేదు. ఎందుకంటే జజీరా వెనక్కి తిరిగి చూస్తే కదా. తన చూపంతా ఆ పాత్ర పై, ముందున్న విక్రమ సింహుడిపై ఉన్నది. మిథిలా దృష్టి అంతా విక్రమసింహుడి పై.
మిథిలా విక్రమసింహుణ్ణి చేరుకొని తన దగ్గరున్న ఆ పాత్రలోని అభిషేక క్షీరాన్ని అందివ్వబోతుండగా,
జజీరా వెనకున్న ఆ పదకొండు మంది
"హరహర మహాదేవ శంభో శంకర " అనుకుంటూ
పరమశివునికి అభిషేకం చేసిన ఆ పాత్రలోని క్షీరాన్ని విషంతో కలిసినా సరే అలాగే స్వీకరించారు. జజీరా వారిని చూసి నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే వారు పదకొండు మంది ఉన్నారు. సరిగ్గా పదకొండు విష సర్పాలను మెడలపై ధరించి ఉన్నారు. జజీరా అనలలో చూసిన విష సర్పాలే అవి .
ఆ పాత్రలోని క్షీరాన్ని పుచ్చుకోగానే ఆ పదకొండు మంది ఉగ్రులైపోయారు. వారి కళ్ళల్లో దావాగ్ని ప్రవహిస్తోందేమో అన్నట్టుగా ఉన్నారు. వారిని చూసి జజీరాలోని జ్వాలా జిహ్వుడి ప్రేతం అదిరిపడి జజీరా శరీరాన్ని వదిలిపెట్టింది. ఆ పదకొండు మంది కలిసి ఆ ప్రేతాన్ని అంతమొందించారు. జజీరా కళ్లెదుటే జరుగుతున్న ఈ విలయ తాండవాన్ని చూస్తూ నోరు మెదపకుండా ఉండిపోయాడు.
జ్వాలా జిహ్వుడి ప్రేతానికి విముక్తి కల్పించిన తర్వాత ఆ పదకొండు మంది విక్రమసింహుడిని, మిథిలా ను కలిశారు.
"ఏకాదశ రుద్ర విభూతులము మేము. ఇక్కడే కొన్నేళ్లుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. పర్వత గర్భంలో కలిసిపోయాం. మీ నాన్న గారైన సింహ దత్తుడు ఆ పరమ శివుని దగ్గర మా గురించి ప్రస్తావించారు. ఆయన వల్లే ఈ రోజున మాకు విముక్తి లభించింది. మా ద్వారా ఈ పదకొండు విష సర్పాలకూ లభించింది. ఈ పూర్ణిమ రాత్రి ఏకాదశ రుద్రులలో శాశ్వతంగా కలిసిపోతున్నాం. మాకు ఇకపై జన్మ లేదు. నీకేమైనా కావాలంటే కోరుకో" అని వరం అడిగారా పదకొండు మంది.
"ఇవ్వాల్టి రోజున మీ పరాక్రమాన్ని నా కళ్ళతో చూసాక శంభల యోగులుగా మీరిక్కడి యోధులకు కార్యసిద్ధిని కలిగిస్తారనే దృఢ నమ్మకం కలిగింది. జ్వాలా జిహ్వుడితో మా నాన్న గారు పోరాడి ప్రాణ త్యాగం చేశారు. అయినా ఆ ప్రేతం ఇంకా బతికే ఉండటం నన్నెంతగానో కలవరానికి గురిచేసింది. మీరు లేకుంటే నేను బ్రతికుండే వాణ్ని కాను. నేనే మీకెంతో రుణపడి ఉన్నాను. అలాంటిది మీరే తిరిగి వరం ఇచ్చారు నాకు", అంటూ వినయంగా వారికి నమస్కరించాడు.
"ఇదంతా కార్యకారణ సంబంధం, విక్రమసింహ. నువ్వు అడిగినట్టుగానే శంభల యోగులుగా మా శక్తి ఈ శంభల రాజ్య యోధులకు ఎప్పుడూ ఒక రక్షణ కవచంలా వాళ్ళ చుట్టూ ఉంటుంది. వరం నీకోసం కాకుండా రాజ్యం కోసం కోరుకున్నావు చూడు అక్కడే నీలో సింహ దత్తుడు కనిపించాడు మాకు. జయము", అంటూ జజీరా వైపు కన్నెత్తి కూడా చూడకుండా అక్కడి నుండి నిష్క్రమించారా ఏకాదశ రుద్ర విభూతులైన శంభల యోగులు ", అని చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
స్వస్తి
శుభం