Update 06

అక్షిత నేరుగా ఇంతకముందు చిన్నాని దుబాయికి పంపిన ఆఫీస్ కి వెళ్లి ఎంక్వయిరీ చేసింది కానీ అస్సలు చిన్నా అక్కడికి రాలేదని చెప్పడంతో అక్షితకి ఏడుపు ఆగలేదు.. ఆఫీస్ నుంచి బైటికి వచ్చి రోడ్డు మీద ఎండలో నిలబడింది.. చుట్టూ చూసింది.. ఇంత పెద్ద సిటీలో చిన్నాని ఎలా వెతకాలో అర్ధం కాక అలా నిలబడిపోయింది.. ఆలోచించగా ఇంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అన్న విషయం తట్టగానే వెంటనే కళ్ళు తుడుచుకుని ఇంటికి వెళ్లి చిన్నా రూం తెరిచింది.. గోడకి వాడు ఇడిచిన బట్టలు అలానే ఉన్నాయి.. (అక్షితా.. నాకు బట్టలు ఇలా ఉంటేనే ఇష్టం.. మోడరన్ స్టైల్ నా వల్ల కాదు) బట్టలు చూస్తూనే సెల్ఫులు అన్ని వెతికింది. లోపల చివరన కొన్ని పేపర్లు దొరికాయి తెరిచి చూసింది.. అవి శృతి వేసిన పెయింటింగ్స్

మొదటిది మధుమతిది, చిన్నా అమ్మ బొమ్మ చూసి పక్కన పెట్టింది.. రెండోది చూసి కళ్ళనిండా నీళ్లతో మంచం మీద కూర్చుంది. అందులో ఉన్నది తనది చిన్నాల పెయింటింగ్. ఎర్ర చీరలో ఒంటి నిండా బంగారంతో చేతికి ఎర్రని గాజులు, మెడలో పసుపు తాడుతో.. అక్షిత తన చేతిలో ఉన్న పేపర్ పట్టుకుని చిన్నా పక్కన నిలుచుని వాడి వంక వెటకారంగా చూస్తుంటే చిన్నా మాత్రం స్టైల్ గా జీన్స్ హుడి టీషర్ట్ లో అక్షితని చూసి సిగ్గుపడుతూ తన భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్న పెయింటింగ్ అది.

పెయింటింగ్ చేతబట్టుకుని ఏడుస్తూనే నేరుగా శృతి దెగ్గరికి వెళ్ళింది. శృతి ఏమైందన్నట్టుగా చూడటంతో అక్షిత తన చేతిలో ఉన్న పెయింటింగ్ తీసి శృతి ముందు పెట్టింది.

అక్షిత : ఇందాక ఆంటీ మాటలు నీ మాటలు విన్నాను

శృతి ఆ పెయింటింగ్ తీసి చూస్తూ నవ్వి పక్కన పెట్టేసి అక్షిత వంక కూర్చోమని సైగ చేసింది.

శృతి : ఒక రోజు చిన్నా నా దెగ్గరికి వచ్చి దెగ్గరుండి ఈ పెయింటింగ్ గీయించుకున్నాడు. అన్ని అనుకున్నట్టు నీకు వాడికి పెళ్లి జరిగితే నిన్ను ఈ పెయింటింగ్ లో ఉన్నట్టు రెడీ చేసి వాడు పొట్ట కరిగించి ఆ బట్టలు వేసుకుని అందులో ఉన్నట్టే నిలబడి నీ చేతిలో ఈ పెయింటింగ్ పెట్టాలని అనుకున్నాడు.. నీకోసం సప్రైస్ ప్లాన్ చేశాడు అని నవ్వింది ఆ రోజు చిన్నా మాటలు గుర్తు చేసుకుంటూ

అక్షిత : నాతో ఒక్కసారి కూడా చెప్పలేదు

శృతి : చిన్నప్పటి నుంచి చాలా సార్లు చెప్పాడు అక్షితా.. నువ్వు పట్టించుకోలేదు

అక్షిత : ఒక్కసారి వాడిని చూడాలని ఉంది

శృతి : ఆ కోరిక నాకూ ఉంది.. కనపడితే కబురుచేస్తాను

అక్షిత లేచి ఏడుస్తూనే మంచం మీదున్న ఆ పెయింటింగ్ తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది.
•°• •°•
°•°​

చిన్నా : అమ్మా.. నీ వల్ల నన్ను అందరూ పిచ్చివాడిలాగ చూస్తున్నారు.. అందరూ నన్ను మెంటలోడని అనుకుంటున్నారు

మధు : నీకిప్పుడు మెంటలే నాన్నా అని గట్టిగా నవ్వింది

చిన్నా : ఎవ్వరు లేనప్పుడు మాట్లాడుకుందాం.. అందరి ముందు వద్దు సరేనా

మధు : నీ పిచ్చి తగ్గిపోతే నేనే వెళ్ళిపోతా బంగారం.. కావాలంటే నన్ను పంపించేయి.. ఒకసారి ప్రయత్నించి చూడు

చిన్నా : వద్దులే.. నువ్వైనా నాకు తోడుగా ఉండు

మధు : ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాం

చిన్నా : ముందా చీర మార్చు, వారం నుంచి అదే చీరలో ఉన్నావ్

మధు : నేనెలా ఉండాలో ఊహించుకో అలానే మారిపోతాను, మళ్ళీ అడగడం దేనికి

చిన్నా కళ్ళు మూసుకుని తెరిచేసరికి మధుమతి ఒంటి మీదకి ఎర్ర చీర, చేతికి గాజులు మెడలో బంగారం దేవతలా అయిపోయింది.

మధు : బాగున్నానా

చిన్నా : సూపర్

మధు : అక్షిత కంటేనా

చిన్నా ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తున్నాడు..

మధు : సరే సరే.. నీ అక్షితే బాగుంది.. ఓకే నా

చిన్నా వెనక్కి తిరిగి నవ్వాడు

మధు : ఓయబ్బో.. సిగ్గే.. ఇంతకీ ఎటు వెళుతున్నాం

చిన్నా : చెన్నై అంటూనే ఆటో ఆపాడు

మధు : నేనెక్కడ కూర్చొనూ

అసహనంగా అమ్మా.. అంటూ చూసేసరికి ఆటో వాడు అయోమయంగా చూసాడు.. చిన్నా ఇంకేం మాట్లాడకుండా తన అమ్మ వంక కోపంగా చూస్తూ ఆటో ఎక్కేసారికి మధుమతి నవ్వుతూ డ్రైవర్ పక్కన కూర్చుంది. సరిగ్గా అప్పుడే ఆటో వెనక ఎవరో కత్తులతో పరిగెడుతూ వస్తుంటే అంతకముందే ఆటోలో కూర్చుని ఉన్న ఒక అమ్మాయి అన్నా పోనివ్వండి వాళ్ళకి దొరికితే చంపేస్తారు అని భయపడుతూ అరుస్తుంటే అమ్మా కొడుకులు ఇద్దరు వెనక్కి తింగి చూసారు. ఆటో వాడు భయపడి ఆటో అక్కడే వదిలేసి పారిపోయాడు.

మధు : కాపాడతావేంటి

చిన్నా : నేను హీరోని కానమ్మా.. నా పొట్ట చూడు

మధు : అయితే.. మెకానిక్ వే కదరా నువ్వు.. వేరే మెకానిక్లు విప్పలేని నట్లు బోల్టులు విప్పుతావ్.. మెకానిక్లే నీ కోసం క్యూ కడతారు.. ఓ నలుగురిని కొట్టలేవా

చిన్నా : ఉష్.. అబ్బబ్బా.. మా అమ్మ ఇంత విసిగించదు నన్ను

మధు : ఈ పాటికి నేను బతికి ఉంటే ఇదిగో ఇలానే ఉంటాను నేను..

చిన్నా : లేదు.. రూపం మా అమ్మని ఊహించుకుంటే మాటలు చేష్టలు అక్షితని ఊహించుకుంటున్నానేమో..

మధు : అస్సలు నేను బతికి ఉంటే ఈ పాటికి అది నా కోడలు అయ్యుండేది

చిన్నా : నువ్వు బతికుంటే అది నాకు అస్సలు పరిచయమే అయ్యేది కాదు

మధు : ఇప్పుడు ఆ అమ్మాయిని కాపాడతావా లేదా.. చూడు నిన్నే పిచ్చోడిని చూసినట్టు చూస్తుంది.

చిన్నా ఆ అమ్మాయి వైపు చూసాడు, ఆ అమ్మాయి భయం భయంగా చిరంజీవి వంక వెర్రి చూపులు చూసింది..
°•°
•°• •°•​

చెన్నై హైవే దిగి సిటీ సెంటర్ రోడ్డు ఎక్కి అక్కడి నుంచి చిరంజీవిని అరెస్ట్ చేసిన సెంట్రల్ జైలుకి వెళ్ళింది అక్షిత మరియు లావణ్యని తీసుకొస్తున్న కారు. అక్షిత నేరుగా లోపలికి వెళ్లి జైలు అధికారులతో మాట్లాడుతుంటే లావణ్య బైటే కొడుకులతో నిలుచుని అటు ఇటు చూస్తూ చెట్టు కింద కూర్చుని ఉన్న శృతిని చూసి అటు పరిగెత్తింది. అక్షిత లోపల మాట్లాడి బైటికి వచ్చేసరికి లావణ్య, శృతి మాట్లాడుతుండడం చూసి దెగ్గరికి వచ్చింది.

అక్షిత : ఎలా ఉన్నావ్ శృతి

శృతి : ఇదిగో ఇలా ఉన్నాను

అక్షిత : వాడితో మాట్లాడావా

శృతి : లేదు పిలుస్తాం అన్నారు

అక్షిత : అదే అడిగాను.. అందరికీ కలిపి ఒకేసారి అవకాశం ఇస్తారట

ఇదంతా చూస్తున్న అక్షిత కొడుకు వేణుకి లావణ్య కొడుకు చిరంజీవికి సరిగ్గా అర్ధంకాకపోయినా తన పేరు కూడా చిరంజీవి అవ్వడం అందులో చిన్నా అని వేణు ముద్దు పేరుతో పిలుచుకోవడంతో తమ అమ్మలకి చాలా దెగ్గరవాడని అర్ధం అయ్యింది.. ఇద్దరు కుర్రోళ్లకి కొన్ని అనుమానాలు కూడా పుట్టాయి కానీ మౌనంగా ఉన్నారు.

కొంతసేపటికి ఒక అధికారి వచ్చి పిలవగా అక్షిత, లావణ్య మరియు శృతి లోపలికి వెళ్లారు, ఇక్కడ కొడుకులు మాత్రం అస్సలు ఏం జరుగుతుందో మొత్తం పూస గుచ్చినట్టు ప్రతి విషయం తమ నాన్నలకి అందిస్తున్నారు.

లోపలికి వెళ్లిన ముగ్గురు ఆడవాళ్ళకి చిన్నా తన పక్కనే ఉన్న తమ వయసు గల ఇంకొకరితో మాట్లాడుతుంటే వెళ్లి చిన్నా ముందు నిలుచున్నారు.

చిన్నా : సంజు ఇక్కడి నుంచి వెళ్ళిపో

సంజు : నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను

అక్షిత : చిన్నా..

చిన్నా తల పక్కకి తిప్పి చూసాడు.. లోపల కొట్టినట్టున్నారు మొహం అంతా వాచిపోయింది.. పెదం పగిలిపోయింది..

అక్షిత : ఏంట్రా ఇదంతా

చిన్నా ఏం మాట్లాడకుండా శృతి వంక ఒకసారి చూసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి అక్షితని లావణ్యని చూసి వెళ్లిపోండి అని చెపుతూనే శృతి మెడ వంక చూసి కిందకి చూసాడు కాళ్ళకి మెట్టెలు ఉన్నాయా లేవా అని.. శృతి ప్రేమగా చూసింది. చిన్నా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

ఇప్పటివరకు చిన్నాతో మాట్లాడిన ఆమె బయటకి వచ్చి ఏడుస్తుంటే అక్షిత, లావణ్య, శృతిలు వెళ్లి ఆమెని పలకరించారు.

అక్షిత : మీరు చిన్నా అదే చిరంజీవికి ఏమవుతారు

చిన్నా నా అన్నయ్య అంది ఏడుస్తూనే

లావణ్య : తను నీకెలా తెలుసు.. ఎలా పరిచయం

ఎవరు మీరంతా.. ప్రెస్ ఆ.. తమిళ్ నాడులో చిరంజీవి అంటే చాలా మందికి తెలుసు.. ఇప్పటికే అందరితో విసిగిపోయి ఉన్నాను.. నన్నేమి అడగకండి వెళ్లిపోండి.

అక్షిత : మేమందరం చిన్నా కుటుంబంలోని వాళ్ళం

కళ్ళు తుడుచుకుని తనకి ఎవ్వరు లేరని చెప్పాడు

శృతి : వాడంతే చెపుతాడు.. అస్సలు ఏంటి ఇదంతా

వాడు అని అంత చనువుగా పిలవడం విన్న తను ఆశ్చర్యపోతూ..

చెపుతాను.. నా పేరు సంజన.. సంజు..

నా పేరు సంజన.. సంజు.. నేనొక అనాధని.. పెరిగింది చదివింది అంతా మదర్ తెరిసా ఫౌండేషన్ లోనే.. నాకు తనే ఇన్స్పిరేషన్. ఇంజనీరింగ్ చేసాను ఒక చేత్తో సంపాదిస్తూనే ఇంకో చేత్తో చిన్న ఫౌండేషన్ ఒకటి దత్తత తీసుకున్నాను ఆరుగురు అమ్మాయిలు ఉన్న చిన్న బాలికా వసతి గృహం. సాఫీగా సాగిపోయే నా జీవితంలోకి ఒక రౌడీ వచ్చి నన్ను చిన్నాభిన్నం చేసాడు.. భయపడి పారిపోతున్న సమయంలో నేను ఎక్కిన అదే ఆటోలో చిన్నా అన్నయ్య కూడా ఉన్నాడు. నన్ను కాపాడి నా గురించి తెలుసుకుని నాకు సాయం చేశాడు.

సాయం చెయ్యమని ఆ రౌడీ బారి నుండి నన్ను నా ఫౌండేషన్ ని కాపాడమని వేడుకున్నాను, చేస్తానన్నాడు కానీ ఇక్కడ కాదు వేరే ఊర్లో అయితే చేస్తానన్నాడు. నేనూ అదే అనుకున్నాను.. ఇక్కడుంటే వాడు మళ్ళీ వస్తాడు అందుకే దేవుడికి దణ్ణం పెట్టుకుని ఏం ఆలోచించకుండా గుడ్డిగా అన్నయ్యని నమ్మి ఆరుగురు ఆడపిల్లలతో పాటు అన్నయ్య వెంట ట్రైన్ ఎక్కేసాను అలా మొదలయ్యింది మా ప్రయాణం.

చెన్నైలో దిగి ముందు తినేసి అందరం కలిసి అన్నయతో వెళ్లిపోయాం.. ముందు ఒక రూం తీసుకుని పిల్లలని పడుకోమని చెప్పి మమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నాడు.. నేను అన్నయ్యతో మాట్లాడదామని బైటికి వచ్చాను. అన్నయ్య అప్పటికే కిందకి వెళ్లడం చూసి నేనూ కిందకి వెళ్లాను. తనలో తనే ఏదో మాట్లాడుకుంటూ వెళుతుంటే కొంచెం భయం వేసింది.. అన్నయ్య వెళ్లి చెట్టు కింద కూర్చుని కొంతసేపటికి నన్ను చూసి.. ఏమి లేదన్నట్టుగా ప్రవర్తిస్తూ నన్ను రమ్మని సైగ చేసి కూర్చోమన్నాడు. చెట్టు కింద బల్ల మీద కూర్చున్నాను.

చిన్నా : నీ పేరు సంజన కదా.. నా పేరు చిరంజీవి

సంజు : చెప్పారు

చిన్నా : సరే.. అన్నయ్య అని పిలిచావ్ గా అలానే పిలువు.. నువ్వు ఫౌండేషన్ పెట్టడానికి నేను సాయం చేస్తాను.. నా దెగ్గర కొంత డబ్బు ఉంది, తక్కువ విలువ చేసే దెగ్గర స్థలం తీసుకుందాం.. నువ్వు జాబ్ చేస్తా అన్నావ్

సంజు : అవును.. నాకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది.. నా దెగ్గర కూడా కొంత డబ్బు ఉంది, అవి ఫౌండేషన్ కట్టడానికి, మిగతా ఖర్చులకి సరిపోతుందనే అనుకుంటున్నాను.

చిన్నా : మరింకే.. ఎమ్మా అని పక్కకి చూసాడు.. మళ్ళి నా వంక చూసాడు, భయం వేసి అయోమయంగా చూసాను. సంజన నీతో ఇంకో విషయం మాట్లాడాలి.. నీకు నన్ను చూస్తుంటే భయంగా ఉందా

సంజు : లేదండి

చిన్నా : నీ కళ్ళలో చూస్తేనే తెలుస్తుంది.. కదమ్మా అని పక్కకి తిరిగి నవ్వి మళ్ళి నన్ను చూసాడు. నేనేం మాట్లాడలేదు. నాకు కొంచెం పిచ్చి ఉంది అదే క్రాక్ అంటారు కదా

భయపడి లేచి నిలబడ్డాను

చిన్నా : అయ్యో.. భయపెట్టానా.. పిచ్చి అంటే నేనేం సైకోని కాను.. ముందు కూర్చో అమ్మాయి నిన్ను అలా చూస్తుంటే నాకు భయంగా ఉంది అనేసరికి బల్ల మీద కూర్చున్నాను. నాకు పిచ్చి అంటే ఎలా చెప్పాలి నీకు.. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది ఎందుకని అడక్కు నాకు తెలీదు.. ఒక్కన్నే అడుక్కుంటూ మెకానిక్ పని నేర్చుకుని అక్కడ నుంచి దుబాయి వెళ్లి అక్కడ డబ్బు సంపాదించి మళ్ళి ఇండియా వచ్చాను ఇక్కడ వరకు బానే ఉంది.. ఆ తరువాత కొంచెం లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయి అప్పుడే ఇదిగో మా అమ్మ అని గాల్లో చెయ్యి తిప్పి ఎవరినో చూపిస్తున్నట్టు చెయ్యి పెట్టి.. నా బ్రెయిన్ లోనుంచి బైటికి వచ్చింది.. నాకు తప్ప ఇంకెవ్వరికి కనిపించదు వినిపించదు.. నేనేదో నాకున్న హీరో పవర్ లా చెపుతున్నానా.. ఇదే నాకున్న పిచ్చి.. మాములుగా నేను ఒక్కణ్ణి ఉన్నప్పుడే అలా ప్రవర్తిస్తుంటాను కానీ అప్పుడప్పుడు బాగా విసిగిస్తుంది మా అమ్మ అప్పుడు కొంచెం తల నొప్పి వస్తుంది.. బైట వాళ్ళకి మాత్రం నాలో నేనే మాట్లాడుకుంటూ ఉన్నట్టు కనిపిస్తా అంతే.. నాకింకే జబ్బు లేదు.. నాకూ కొంచెం తోడు కావాలని నేను అలా వదిలేసాను.. హాస్పిటల్లో చూపించుకోలేదు.. ఆమ్మో మా అమ్మ అలిగింది అని లేచి బతిమిలాడుకున్నట్టు వెళుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను.

కొన్ని రోజుల తరువాత అన్నయ్య చాలా మంచివాడని అర్ధం అయ్యింది, అప్పుడప్పుడు తనలో తనే మాట్లాడుకుంటాడు. మొదట్లో నేను పక్కన ఉన్నప్పుడు బాగా ఇబ్బంది పడేవాడు ఆ తరువాత నేను కూడా ఆయనకి ఇబ్బంది కలగకుండా అమ్మకి గుడ్ మార్నింగ్ లవి చెపుతూ ఉండేదాన్ని.. అలా ఇద్దరం అన్నా చెల్లెళ్ళుగా కలిసిపోయాం.

అక్షిత నోటి మీద చెయ్యి వేసుకుని ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది.. లావణ్య శృతి ఇద్దరూ చెరో రెక్క పట్టుకుని లేపి పక్కన కూర్చోబెట్టారు. వేణుకి వాళ్ళ అమ్మని ఎలా ఓదార్చాలో ఎందుకు ఓదార్చాలో కూడా తెలీదు.

అక్షిత : అంతా నా వల్లే.. అని చెంపల మీద కొట్టుకుంది గట్టిగా ఏడుస్తూ

శృతి : ఊరుకో.. అంతా మన చేతుల్లో ఉంటుందా అని అక్షితని కొంచెం కఠినంగానే ఓదార్చింది కళ్ళు తుడుచుకుంటూ.. మీరు చెప్పండి.. మరి ఇదంతా ఏంటి..? ఎలా జరిగింది..?​
Next page: Update 07
Previous page: Update 05