Update 05
Arjun
అర్జున్
అర్జున్
చీకట్లో నేషనల్ హైవే మీద స్పీడ్ గా వెళ్తుంది కారు, ఆ స్పీడ్ చూస్తే ఏదో ఎమర్జెన్సీ గా వెళ్తుందని అనుకుంటారు ఎవరైనా, అంత వేగంగా వెళ్తున్న ఆ నల్ల కారుని ఒక పెద్ద వ్యాన్ పక్క నుంచి ఢీ కొట్టింది, దానితో కారు గాల్లో ఎగిరి పక్కనే ఉన్న అడవిలోకి జారుకుంటూ వెళ్లి ఆగింది, అందులోనుంచి దిగింది ఎవరో కాదు నేనే.. పేరు అర్జున్.
కళ్ళు తిరుగుతున్నాయి చేతితొ తల తడుముకుని చూసాను రక్తం కారుతుంది, అది కార్ పల్టీ కొట్టడం వల్ల తగిలిన దెబ్బ కాదు ఎవరో ఐరన్ రాడ్ తొ కొడితే తగిలిన దెబ్బ, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించే టైం లేదు అవ్వును టైం, టైం, టైం అస్సలు లేదు ఇంకో పదిహేను నిమిషాల్లో నేను చచ్చిపోతాను కార్ లో ఉన్న నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో కూడా నాకు తెలీదు, అస్సలు ఏం జరుగుతుందో నా ఫ్యామిలీకి తెలీదు.
చిన్నగా కార్ డోర్ తెరిచి నా భార్యని బైటికి లాగాను, తన మెడ మీద కిటికీ గ్లాస్ గుచ్చుకుని రక్తం కారుతుంది కానీ చేతిలో ఉన్న పది నెలల పిల్లోడికి మాత్రం ఏం కానివ్వలేదు, ఎంతైనా తల్లి కదా ప్రాణం ఇచ్చయినా కాపాడుకుంటుంది.
పెద్దగా ఒక ఉరుము, చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి, పక్కనే ఉన్న అమ్మని కూడా బైటికి రమ్మని చెయ్యి ఇచ్చాను అమ్మని బైటికి లాగి ముందు కూర్చున్న నాన్నని చూసాను స్పృహలో లేడు కష్టపడి బైటికి తీసుకొచ్చి పక్కనే ఉన్న చెట్టుకి ఆనించాను.
జోరుగా వర్షం పడుతుంది చుట్టు పది మంది అందులో 30 ఏళ్ల లోపు వాళ్ళు ముగ్గురు 50 ఏళ్ల లోపు వాళ్ళు నలుగురు ఇక 50 ఏళ్ల పై వారు ముగ్గురు, మొత్తం పది మంది.
అందరి చేతికి ఒకే రకం వాచీలు కానీ ఎవ్వరివి పని చెయ్యడంలేదు, నాది కూడా.. పక్కనే ఉన్న అమ్మకి, నా భార్యకి ఏం అర్ధం కావట్లేదు ఎందుకంటే వాళ్ళకి నేను రక రకాలుగా కనిపిస్తున్నాను కాబట్టి.
మా అమ్మకి తను కనీ పెంచుకున్న 15 ఏళ్ల పిల్లోడు, 20 ఏళ్ల కాలేజీ పిల్లోడు, 25 ఏళ్ల కుర్రోడు మధ్యలో 30 ఏళ్ల అస్సలు కొడుకు కనిపిస్తున్నారు. నా భార్యకి కాలేజీ లో ప్రేమించిన ఒక పిల్లోడు ఒక కుర్రోడు ఒక మొగుడు కనిపిస్తున్నారు. అందుకే వాళ్లకస్సలు ఏమి అర్ధం కావట్లేదు, మీకు కన్ఫ్యూసింగ్ గా ఉందా ?
ఈ జోరు వర్షంలో ఈ చీకట్లో ఈ అడవిలో నేను.. అర్జున్. చుట్టు నన్ను చంపడానికి వచ్చిన పది మంది అర్జున్లు. 15yrs, 19yrs, 25yrs, 34yrs, 40yrs, 46yrs, 50yrs, 55yrs, 60yrs, 65yrs.
తలకి తగిలిన దెబ్బలకి వర్షం ఒక్కొక్క బొట్టు తల మీద పడుతుంటే నాకు మైకం ఇంకా ఎక్కువవుతుంది.
ముసలి అర్జున్ వెళ్లి స్పృహ తప్పి పడిన మా నాన్న తల నరికేసాడు. తూలుతూ నాన్న దెగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాను తల లేని బాడీ చూస్తూ, ఇంతలో మా అమ్మ అరుపుకి తల తిప్పి చూసాను 40 ఏళ్ల అర్జున్ మా అమ్మని రాక్షసంగా వెనక నుంచి కత్తితో పొడిస్తే వచ్చిన అరుపు అది.
ఏడిచే ఓపిక లేదు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అమ్మ దెగ్గరికి వెళ్లి ఒళ్ళో పెట్టుకుని చూస్తున్నాను ఇంతలో నా బిడ్డ ఏడుపు వినిపించింది, తల తిప్పి చూసాను నా బిడ్డని వాళ్ళ అమ్మ దెగ్గర నుంచి లాగేసుకుంటున్నారు, నా భార్య గట్టిగా బిడ్డను పట్టుకునేసరికి ఒకడు నా భార్య పీక కోసేసాడు అది గిల గిలా కొట్టుకుంటూ నా కళ్ళలోకే కళ్ళు పెట్టి చూస్తూ పడిపోయింది.
అప్పటికే ప్రాణం లేని నా అమ్మని పక్కన పడుకోబెట్టి మోకాళ్ళ మీద నిల్చున్నాను నా పది నెలల బిడ్డ గొంతు పట్టుకున్నాడెవడో కానీ బ్లూ కాలర్ ఉండాల్సిన వాచ్ వాడి చేతికి పచ్చ రంగు వాచ్ ఉంది అచ్చు నా లాంటిదే, చెయ్యి ఎత్తాను వద్దు అన్నట్టు కానీ వాడు పసిబిడ్డ అని కూడా చూడకుండా ఒంటి చేత్తో మెడ పట్టుకుని గాల్లోకి లేపి నన్ను చూసి నవ్వుతూ మెడని పిసికేసాడు నా బిడ్డ గుజ్జు లా మారి పిండం కింద పడిపోడం చూసాను.
కళ్ళు మూసుకున్నాను నాకు తెలుసు నేను వాళ్ళని కాపాడుకోలేనని ఎందుకంటే నేనేం చేస్తానో ఏం ఆలోచిస్తానో అన్ని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల ఉన్నది కూడా నేనే కాబట్టి.
వెల్కమ్ టు ది టైమ్ లాప్స్.
వెల్కమ్ టు మై వరల్డ్.
పొద్దున్నే ఎవరో కిటికీ కర్టెన్ ని పక్కకి జరిపారు నా నిద్ర చెడగొట్టడానికి, ఎవరో కాదు నా మీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా అని ఎదురు చూసే నా గయ్యాళి చెల్లెలు. దుప్పటి తల నిండా కప్పుకుని పడుకున్నాను..
సుభద్ర : నవ్యా అన్నయ్యని లేపు. కిచెన్ లోనుంచి మా అమ్మ అరుపు
నవ్య : నేను లేపను.. మళ్ళీ నన్ను కొడతాడు. నువ్వే లేపుకో
సుభద్ర : అబ్బబ్బ అంటూ చపాతీలు చేస్తూనే స్టవ్ ని సింలో పెట్టి అట్లకాడతొ బెడ్రూంలోకి వచ్చింది. రేయి లేస్తావా పిర్ర మీద అట్లకాడ పెట్టనా
ముసుగు తీసాను, అమ్మా ఎలాగో కాలేజ్ కెళ్ళేటప్పుడు చంపుతావు కనీసం ఈ హాలిడేస్ అయినా ఎంజాయి చెయ్యనివ్వవే, ఇంకో పది రోజులు అయితే ఎలాగో కాలేజీకి వెళ్ళాలి అప్పుడు నువ్వు చెప్పినట్టే వింటాలే అని గడగడా వాగేసి మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాను.
సుభద్ర : వీడికి ఇవ్వాళ మనం నాయనమ్మ వాళ్ళ ఊరికి వెళుతున్నాం అని గుర్తుందా లేదా అని నవ్యని చూసి అడిగింది.
నవ్య : మతిమరపోడు.. ఎప్పుడు గుర్తుండి చచ్చింది.. ఏది గుర్తుండి చచ్చింది, మనల్ని గుర్తు పెట్టుకున్నాడు అదే పదివేలు.
లేచి నవ్య ముడ్డి మీద తన్నాను.
నవ్య : అమ్మా చూడే...
సుభద్ర : రేయ్.. ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఇద్దరు తన్నుకోడానికి.. అర్జున్ లేచి బ్యాగులు సర్దు ఇక నవ్య నువ్వు నాతొ పాటు వచ్చి నేను చపాతీలు కాలుస్తుంటే నువ్వు వాటిని పార్సెల్ చేద్దువురా అని కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది.
మొహం మీద కొట్టుకుంటూ బద్దకంగా లేచి ముందు బ్రష్ చేసి చిన్నగా ఒక్కో బ్యాగ్లో బట్టలు సర్ధకుండా కుక్కుతుంటే ఇంతలో మా నాన్న అక్కడికి వచ్చి నన్ను, నేను చేస్తున్న పని చూస్తూ కూర్చున్నాడు.
అర్జున్ : ఏంటి నాన్నా
రవి : సుభద్రా.. చెప్పక చెప్పక ఈ వెధవకే నువ్వు పని చెప్పావా.. నీకు డబల్ పని పెడతాడు.. రేయి అది వదిలేసి పొయ్యి ఫోన్లో గేమ్స్ ఆడుకోపో
అర్జున్ : థాంక్స్.. నాన్న
రవి : సిగ్గులేకపోతే సరి.. పొయ్యి స్టేషన్ కి వెళ్ళడానికి క్యాబ్ ని పిలుచుకు రాపో.. వెధవన్నర వెధవ
అర్జున్ అబ్బా అనుకుంటూ చెప్పులు వేసుకుని బైటికి వెళ్లి క్యాబ్ మాట్లాడి పిలుచుకుని వచ్చేలోపు అందరూ రెడీ అయ్యి గేట్ తాళం వేసి బైట నిల్చొని ఉన్నారు.
సుభద్ర : చూడండి.. వాడి అవతారం పనోడిలాగ.. స్నానం కూడా చెయ్యలేదు.. కనీసం బ్రష్ అయినా చేసాడో లేదో
రవి : వాడు అలా ఉంటేనే బాగుంటాడు
నవ్య : అయినా వాడేదో రోజు స్నానం చేసేవాడిలాగ మాట్లాడతావే.. ఒక్కో సారి నాలుగు రోజులు కూడా చెయ్యడు గబ్బు కొడుతుంది నాకు వాడి పక్కన పడుకుంటే
అర్జున్ : ఆపుతావా నా మీద చాడీలు చెప్పడం.. అమ్మా పదండి అని బ్యాగ్స్ డిక్కీలో పెట్టి వెనకాల కూర్చుంటే నాన్న డ్రైవర్ తొ మాట్లాడుతూ ముందు కూర్చున్నాడు. గంటలో రైల్వే స్టేషన్ ముందు ఉన్నాం, టిక్కెట్లు తీసుకుని ట్రైన్ కోసం ఒక అరగంట ఎదురు చూడగా వచ్చింది.
నవ్య : అమ్మా.. వాడిని వెనక్కి రమ్మను పెద్ద హీరోలా వెళ్లి పట్టాల దెగ్గర నిలబడ్డాడు.. ట్రైన్ స్పీడ్ గా వచ్చిందంటే ఆ గాలికే ఎగిరిపోతాడు
అర్జున్ : చిన్న పిల్లవి చిన్న పిల్లలా ఉండు..
నవ్య : అంత లేదు నీకు నాకు పది నిముషాలు మాత్రమే తేడా, అంత దానికి నువ్వు పెద్దొడిలా ఫీల్ అవ్వకు.
ఇంతలో ట్రైన్ హారన్ వినిపించి నాన్న అరిచాడు.. ఇద్దరం తగ్గి తలా ఒక బ్యాగ్ అందుకుని ట్రైన్ ఎక్కాం.. ట్రైన్ ఎక్కామో లేదో నవ్య తినడం మొదలు పెట్టింది ఉడకేత్తిన పల్లీల నుంచి వయా సమోసాలు మీదగా చనా మసాలా వరకు ఏది వస్తే అది తింటూనే ఉంది నాన్న కొనిస్తూనే ఉన్నాడు..
నవ్య : అలా చూడకపోతే.. నువ్వు కొనుక్కోవచ్చుగా
రవి : అవి ఓన్లీ ఫస్ట్ ర్యాంకర్స్ కి మాత్రమేరా తల్లీ, నువ్వు తిను
అర్జున్ : చెప్పాడుగా.. నువ్వు మెక్కు అని కోపంగా లేచి డోర్ వైపు వచ్చి నిల్చున్నాను, చల్లటి గాలి పొలాలు దాటి అడవిలోకి వెళ్తున్న కొద్ది ట్రైన్ వేగం ఇంకా పెరగసాగింది. ఇంతలో ఏమైందో ఏమో సడన్ గా ట్రైన్ ఆగింది. నేను పడిపోకుండా ఉండటానికి ఎమ్మటే ఎదురుగా ఉన్న డోర్ ని కాలితో తొక్కి పట్టాను.
అన్నీ గ్యాస్ లీక్ అయిన శబ్దాలు, పైకి ఎక్కి పడుకున్న వాళ్లు కింద పడ్డారు. కొంత మందికి దెబ్బలు తగిలాయి, నవ్యని అమ్మని పడిపోకుండా నాన్న పట్టుకున్నాడు. ముసలోళ్ళు అవసరం లేకపోయినా ఒకటే ఏడుపులు అరుపులు.
కొందరు కిందకి దిగారు, వాళ్ళతో పాటు నాన్న కూడా దిగితే తన వెనకాలే నేనూ దిగాను. అందరూ ముందు ఇంజిన్ వైపు వెళుతుంటే మేము వెళ్ళాము, చూస్తే ఇంజిన్ కి ఏదో గుద్దుకుని ఆగిపోయింది రౌండ్ గా పెద్దగా రాజుల కాలంలో యుద్ధానికి వాడే ఐనప గుండు అంత ఉంది, ఒక మనిషి మాత్రమే పట్టగలడు ముందే గుద్దుకోవడం వల్ల ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అందరూ ఏదో ఎలియన్ స్పేస్ షిప్ అని దాని దెగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు.
కొంత మంది ట్రైన్ డ్రైవర్ల దెగ్గరికి వెళ్లారు వాళ్ళకి ఎలా ఉందొ చూడ్డానికి, అస్సలు అదేంటో చూద్దామని చాలా దూరంగా ఉండే మనుషుల్ని దాటుకుంటూ దాని చుట్టూ చూస్తూ నడుస్తున్నాను సడన్గా నా కాలికి షాక్ కొట్టింది.
కాలు పక్కకి జరిపి కింద చూస్తే పసుపు రంగులో చిన్న రింగ్ రెండు ఇంచుల diameter/వ్యాసం అంత సన్నని ప్లేట్, పసుపు రంగులో కొద్దిగా మెరుస్తుందనే చెప్పాలి. ఇంతలో నాన్న కోపంగా అరుస్తుంటే దాన్ని జోబులో పెట్టుకుని ఆయన దెగ్గరికి వెళ్లిపోయాను.
ఇక అక్కడనుండి నలుగురం నడుచుకుంటూ రోడ్డున పడి ఒక క్యాబ్ బుక్ చేసుకుని నాయనమ్మ ఇంటికి బైలుదేరాము, మధ్యలో జరిగిన దానికి కారణంగా సాయంత్రం నాలుగింటికి చేరాల్సిన మేము రాత్రి పదింటికి చేరాము.
ఇంట్లోకి వెళ్లి తాతయ్య నాయనమ్మని పలకరించి ఏదో తిన్నామనిపించి, వాళ్లు ట్రైన్ ఆక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటుంటే నేను వెళ్లి మంచం ఎక్కి పడుకున్నాను, పది నిమిషాలకి లైట్ వేశారు కళ్ళు తెరిచి చూసాను పక్కన నవ్య చేతిలో దిండుతొ నిల్చొని ఉంది.
అర్జున్ : ఏం కావాలి
నవ్య : జరిగితే పడుకోవాలి, అని ఆవలించింది.
అర్జున్ : ఇప్పుడు దీనితొ గొడవ ఎందుకులే అని దుప్పటి తల నిండా కప్పుకుని కళ్ళు మూసుకున్నాను.
చిన్నగా నవ్య నా దుప్పట్లోకి దూరింది. నేను గట్టిగా పట్టుకున్నా తన వైపు లాక్కొడానికి నవ్య, ఇటు నా వైపు లాక్కొడానికి నేను ఇద్దరం లాక్కుంటూ ఉంటే నా జోబు లోనుంచి చిన్న వెలుగు ఒకటి కనిపించి దుప్పటి వదిలేసాను, దెబ్బకి నవ్య దొల్లుకుంటూ కింద పడింది.
అర్జున్ జేబులో ఉన్న రింగ్ ని బైటికి తీసాడు, నవ్య కోపంగా లేచి తిడదామని తల ఎత్తి చూసి అర్జున్ చేతిలో ఏదో మెరుస్తుంటే దెగ్గరికి వెళ్ళింది.
నవ్య : అన్నయ్య ఏంట్రా అది.
అర్జున్ "ష్.." ముందు తలుపు దెగ్గరికి వేసి రా అనగానే నవ్య అలాగే అని తలుపు వేసి వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది.
అర్జున్ : ట్రైన్ ఆక్సిడెంట్ అయినప్పుడు కిందకి దిగాను కదా అప్పుడు దొరికింది, ఏంటో తెలీదు అప్పుడు కూడా ఇలానే మెరిసింది.
నవ్య : ఇటివ్వు.. చూస్తా.. అని తీసుకుని రింగ్ చుట్టు పరీక్షగా చూసి అటు ఇటు తిప్పింది.
అర్జున్ : ఎందుకే
నవ్య : మొద్దు ఇటు చూడు ఇది కంపాస్.. డైరెక్షన్ చూపిస్తుంది.. ఆ వెలుగు చూడు ఎటు తిప్పినా ఒకే డైరెక్షన్ లో ఉంది
అర్జున్ : ఏదటివ్వు.. అని మళ్ళీ అటు ఇటు తిప్పి చూసి, నవ్యా కానీ నార్త్ ఇటు వైపు కాదు కదా ఇది రివర్స్ లో ఉంది ఇది ఈస్ట్.. ఇది చూపించేది డైరెక్షన్ కాదు కో ఆర్డినేట్స్.. ఎక్కడికో లొకేషన్ సెట్ చేసి ఉంది.
నవ్య : ఇప్పుడు ఏం చేద్దాం
అర్జున్ : నన్ను ఆలోచించనీ, ఇది ఏదో డేంజర్ లాగ ఉంది దీని మీద రాసి ఉన్న లాంగ్వేజ్ కూడా నేను ఎక్కడా చూడలేదు అస్సలు ఇది భూమికి సంబంధించిన మెటలేనా అని నా డౌట్.. నవ్య ఒకసారి పొద్దున నువ్వు ట్రైన్ లో కొన్న మాగ్నెట్ సెట్ తీసుకురా
నవ్య : హ్మ్.. అని పరిగెత్తుకుంటూ వెళ్లి తెచ్చింది
అర్జున్ : చూడు ఇది మాగ్నెట్ కి అతుక్కోవట్లేదు కానీ ఇది స్టీల్ కూడా కాదు అలా అని అల్యూమినియం కూడా కాదు, ఏ మెటల్ ఇది అని కొరికి చూసాడు...?
అప్పుడే సుభద్ర లోపలికి వచ్చి "రేయి ఇంకా పడుకోలేదా మీరు, పడుకోండి" అని అరిచేసరికి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ముసుగు తన్నారు.
నవ్య : ఇప్పుడేం చేద్దాం
అర్జున్ : నన్ను ఆలోచించనీ.. అస్సలు ఏ టెక్నాలజీ లేకుండా లైట్ ఎలా వెలుగుతుంది ఇది రేడియం కాదు, పడుకో రేపు ఆలోచిద్దాం.. ఇంకోటి ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పకు
నవ్య : అలాగే
అర్జున్ : ఇక పడుకో
తెల్లారి లేచి చూసాను, రింగ్ రాత్రి అంతగా వెలగడం లేదు కానీ ఇంకా డైరెక్షన్ చూపిస్తుంది.. చుట్టూ గీసినట్టు సన్నగా ఒక బ్లూ కలర్ లైన్ వెలుగుతుంది. మధ్యాహ్నం వరకు అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను
అర్జున్ : నవ్యా
నవ్య : ఆ.. అమ్మ అన్నం తినడానికి రమ్మంటుంది నిన్ను
అర్జున్ : ఈ లొకేషన్ చూసి వద్దామనుకుంటున్నా
నవ్య : ఏం వద్దు, లేని పోనీ రిస్క్
అర్జున్ : ఆలోచించాను ముందు దూరం నుంచి చూస్తాను, ఏ రిస్క్ లేదని కంఫర్మ్ అయితేనే ముందుకి వెళతాను, లేదంటే లేదు.
నవ్య : వద్దు.. ఫస్ట్ అది తీసేయి.. లేదంటే అమ్మ వాళ్ళకి చెపుతాను.
అర్జున్ : చిన్న పిల్ల లాగా ప్రవర్తించకు.. ఈ రాత్రికి అందరూ పడుకున్నాక వెళ్లి, ఎవ్వరు లేవక ముందే మళ్ళీ వచ్చేస్తాను
నవ్య : అయితే నేనూ వస్తాను.
అర్జున్ : వద్దు, నేనెళ్ళి వచ్చేస్తాను.
నవ్య : వెళితే ఇద్దరం వెళదాం లేదంటే లేదు
అర్జున్ : సరే రాత్రికి రెడీగా ఉండు.. ఈ లోగా ఎవ్వరికీ తెలియకుండా తాతయ్య బైక్ కీస్ తీసి పెట్టు.
నవ్య : అలాగే
అర్జున్ : నవ్యా.. నిజంగా నేనంటే అంత కేరింగా
నవ్య : అదేంట్రా అలా అంటావ్
అర్జున్ : సరే వేళ్ళు
రాత్రి అయ్యింది అందరూ పడుకున్నాక నేను లేచి ఇంటి నుంచి బైటికి వచ్చి చుట్టూ చూసాను ఎవ్వరు లేరు.
నవ్య : ఏంటి చూస్తున్నావ్
అర్జున్ : భయపడి చచ్చాను కదే, నువ్వు పడుకోలేదా
నవ్య : బండి కీస్ నా దెగ్గరే ఉన్నాయి అన్నయ్యా.. ఇక ఇదా బ్యాగ్ కొన్ని అవసరం అయ్యేవి తెచ్చాను
అర్జున్ : నువ్వే నాకు లగ్గేజీ మళ్ళీ నీకొక లగేజ్ సరిపోయింది.
నవ్య : వెవ్వేవే..
అర్జున్ : వీటికేం తక్కువ లేదు పదా అని వెళ్లి చప్పుడు రాకుండా బండి తీసి ఎక్కాను.. చూస్తావేంటి నెట్టు
నవ్య : నేనా ???
అర్జున్ : మరి వస్తా అన్నావ్ గా, వచ్చినందుకు ఏదో ఒక పని చెయ్యి
నవ్య : నీ సంగతి తరవాత చెప్తా.. అని బండి ముందుకు తోసింది. కొంత దూరం వెళ్ళాక బండి స్టార్ట్ చేసాను నవ్య ఎక్కి కూర్చుంది.
అర్జున్ : ఇదిగో ఈ రింగ్ తీసుకో నువ్వు నాకు డైరెక్షన్ ఇస్తూ ఉండు స్పీడ్ గా వెళ్ళొచ్చేద్దాం.
నవ్య : చలో.. రైట్ రైట్..
ఇప్పటివరకు ఇలాంటి ఒక అడ్వెంచర్ చేసిందే లేదు అందులోనూ నా చెల్లితో, చుట్టూ చీకటి పేరుకే హైవే కానీ రవ్వంత వెలుగు కూడా లేదు. నాకే భయంగా ఉంది ఇక నా చెల్లెలి పరిస్థితి ఏంటో.. అది నాకోసమే వస్తుంది నాకేమైనా అవుతుందేమో అని భయపడుతుంది.. ఇన్ని రోజులు దీన్ని ఎంత ఏడిపించాను నాకే కొంచెం సిగ్గుగా అనిపించింది. నా చెల్లెలు కూడా నన్ను అంతే ఏడిపించేది అనుకోండి కానీ అవసరం వచ్చినప్పుడు నా వెంటే ఉంది కదా.. అయినా నాక్కూడా ఇదంతా రిస్క్ అనిపించింది, ఇప్పటికిప్పుడు ఎవరైనా మా బండి ఆపితే చేసేది ఏమి లేదు.. బండి వెనక్కి తిప్పుదాం అని ఆలోచిస్తుండగా
నవ్య : అన్నయ్యా ఇక్కడే హైవే దిగి చెట్ల మధ్యలోకి వెళ్లు ఇప్పుడే
బండి చెట్ల మధ్యలోకి దింపాను, కొంత దూరం వెళ్ళాక దట్టమైన అడవి ప్రాంతం వచ్చింది. బండి అక్కడే ఆపేసి ఇద్దరం దిగి నడుచుకుంటూ వెళుతుంటే నవ్య తన బాగ్ లోనుంచి టార్చ్ లైట్ తీసింది.
అర్జున్ : ఇంటెలిజెంట్ ఫెల్లో
నవ్య : మరి నీ చెల్లిని కాబట్టి నీలానే ఉంటాననుకున్నావా అని ఎడమ చేతిలో ఉన్న రింగ్ డైరెక్షన్ బట్టి నడుస్తుంటే తన వెనకే నడుస్తున్నాను.
కొంత సేపటికి రింగ్ లైట్ పెరుగుతుంది అంటే దెగ్గరికి వచ్చేసామన్నమాట. నవ్య నన్ను పిలిచి అటు చూడు అనగానే పక్కకి చూసాను ఎవరో ఆఫీసర్స్ ట్రైన్ క్రాష్ గురించి ఇన్స్పెక్షన్ చేస్తున్నారనుకుంటా మా వైపు తిరిగేలోపే నవ్వని పక్కకి లాగేసి టార్చ్ ఆపేసాను.
అర్జున్ : నవ్యా.. ఇక్కడే ఉండు, నాకు ఆ రింగ్ ఇవ్వు నేనెళ్ళి చూసొస్తాను
నవ్య : జాగ్రత్త అంటూనే నా చేతికి రింగ్ ఇచ్చింది
రింగ్ డైరెక్షన్ చూస్తూ చెట్ల వెనకాల దాక్కుంటూ ఎవ్వరి కంటా పడకుండా వెళుతుంటే చివరికి ఒక పొద దెగ్గరికి వచ్చేసరికి రింగ్ ఆగకుండా వెలుగుతూనే ఉంది అంటే దెగ్గరికి వచ్చేసాను. నాకు పన్నెండు అడుగుల దూరంలో ట్రైన్ పట్టాలు క్రాష్ ఐన ట్రైన్ ఇంజిన్ ఉన్నాయి.. ఈ వెలుగు ఎవరికైనా కనిపిస్తే ఇక అంతే కానీ దీన్ని ఎలా ఆపాలో అర్ధం కాలేదు అప్పుడే నా కాలికి ఏదో తగిలి కిందకి చూసాను మట్టిలో చిన్న లైట్ వెలుగుతుంటే.. అటు ఇటు చూసి ఎవ్వరికి కనిపించకుండా కిందకి వంగి మట్టి కొంచెం తవ్వితే అప్పుడు బైట పడింది... అదొక వాచ్.. ఏదో సింథటిక్ రబ్బర్ లాంటి బెల్ట్ మధ్యలో అర్ధం కానీ వెలుగులతో గడియారం మెషిన్ రింగ్ లైట్ పసుపు రంగులో అందరికి కనిపించేంత వెలుగుతుండేసరికి ఏం చెయ్యాలో తెలియక గబగబా రింగ్ ని వాచ్ మీద పెట్టి నొక్కాను అంతే పెద్ద వెలుగు ఒకటి వచ్చింది ఆ తరువాత ఎం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు ఎవరో నా చెయ్యిని గట్టిగా పట్టేసినట్టు అనిపించింది.
ఒక్కసారిగా నా పుట్టుక నుంచి అమ్మ దెగ్గర మొదటిసారి తాగిన పాల రుచి, నా బారసాల, నాన్నకి ఇచ్చిన ముద్దులు, చెల్లి పుట్టడం తనని ఏడిపించడం, మొదటి సారి కాలేజ్ కి వెళ్లడం, మొదటిసారి ఒక అమ్మాయిని చూడటం నుంచి కాలేజీ ఎగ్జామ్స్ లో చీటీ పెట్టి సర్ కి దొరికిపోవడం వరకు ప్రతీ ఒక్కటి నా కళ్ళ ముందు తిరిగుతున్నాయి, కళ్ళు తిరిగుతున్నాయి.. పడిపోయాను.
± ± ±
± ± ±
± ± ±
±
ఎవరో మొహం మీద నీళ్లు కొడితే లేచాను. చూస్తే ఇక్కడే ఆఫీసర్స్ కోసం ఏర్పాటు చేసిన ఆఫీస్ రూంలో ఉన్నానని అర్ధం అయ్యింది. లేచి నిల్చున్నాను. సర్ ఈ అబ్బాయికి స్పృహ వచ్చింది అని ఒకతను కేక వెయ్యగానే ఎవరో ఒకతను లోపలి వచ్చి నన్ను చూసి ఇందాక పిలిచినాయనని బైటికి వెళ్ళమన్నాడు.
ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్
అర్జున్ : సర్ అది నేను మా అన్నయ్య ట్రైన్ ఆక్సిడెంట్ అయిన తరువాత ట్రైన్ ఆగకముందే మా అన్నయ్య బైటికి దూకేసాడు నేను కూడా దూకాను కానీ అన్నయ్య కనిపించలేదు నేను వెతుకుతూ ఉండేసరికి అడవిలో దారి తప్పిపోయాను తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ లైట్స్ వెలగడం గమనించి వెతుక్కుంటూ వచ్చాను అని కొంచెం భయంగా చెప్పింది నమ్ముతాడా లేదా అన్న అనుమానంతోనే వణుకుతూ చెప్పాను ఎందుకంటే వీళ్ళ ద్వారా మ్యాటర్ ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే నా చాప్టర్ క్లోజ్.. అస్సలుకే చెల్లిని కూడా తీసుకొచ్చాను.
రేయి ఇంత ఎత్తున్నావ్ నువ్వెలా తప్పిపోయావ్ రా అని నవ్వాడు, నేనేం మాట్లాడలేదు మౌనంగా ఉన్నాను. సరే సరే మీ పేరెంట్స్ నెంబర్ చెప్పు వాళ్ళకి ఫోన్ చేస్తాను అన్నాడు. ఆమ్మో ఇంకేమైనా ఉందా.. వెంటనే పని చెయ్యని మా తాత పాత నెంబర్ చెప్పాను.
నీ చేతికున్న వాచ్ బాగుంది ఎక్కడ కొన్నావ్ ??
అర్జున్ : చెయ్యి చూసుకున్నాను ఆ వాచి నా చేతికి ఉంది. ఇదెలా నా చేతికి వచ్చిందబ్బా అని ఆలోచిస్తూనే, ఇది మా అమ్మమ్మ గారింటి దెగ్గర జాతరలో కొన్నాను అని ఏదో నోటికి వచ్చింది చెప్పాను.
టైం చూపించట్లేదే
అర్జున్ : ఉత్తిదే ఆట బొమ్మ ఊరికే కొన్నాను
ఆయన నన్ను చూసి నవ్వుతూ నా పేరెంట్స్ కి ఫోన్ చెయ్యడానికి లోపలికి వెళ్ళగానే లేచి అటు ఇటు చూసాను ఎవ్వరు లేరు అందరూ పనిలో ఉన్నారు ఇదే రైట్ టైం అని ఒక్క అడుగులో బైటికి పరిగెత్తి ఎవరో పిలుస్తున్నా వినకుండా పట్టాలు దాటి చెట్టు వెనక దాక్కున్నాను
అర్జున్ : నవ్యా.. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి
నవ్య : ఎంత భయం వేసిందో తెలుసా.. నీకేమైనా అయితే అని ఏడ్చేసింది
అర్జున్ : వాళ్ళు చూడకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని నవ్య చెయ్యి పట్టుకుని బండి దెగ్గరికి పరిగెత్తాను, ఇద్దరం బండి ఎక్కి కిక్ కొట్టి గట్టిగా లాగితే గంటన్నరలో మళ్ళి ఇంటి దెగ్గర బండి ఆపి నెట్టుకుంటూ లోపల పెట్టేసి ఇంట్లోకెళ్ళి ఇద్దరం మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకునేవరకు మా ఇద్దరి గుండె చప్పుడి వేగం తగ్గలేదు. గోడకున్న గడియారం చూస్తే నాలుగున్నర అవుతుంది, ఇంకో అరగంటలో నానమ్మ లేచి కళ్ళాప జల్లుతుంది. నా టైం బాగుంది అని ఊపిరి పీల్చుకుని పక్కనే ఉన్న నవ్య చెయ్యి పట్టుకున్నాను.. నన్ను చూసింది
అర్జున్ : పడుకో ఎలాగో ఇంకో గంటలో లేపుతారు అని మాట్లాడేసరికి, నన్ను చూసి అటు తిరిగి పడుకుంది, నేనూ కళ్ళు మూసుకున్నాను
అమ్మ కేకలకి మెలుకువ వచ్చింది, పక్కన చూస్తే నవ్య కూడా ఇంకా పడుకునే ఉంది. చిన్నప్పుడెప్పుడో చెల్లి నా పక్కన పడుకున్నట్టు గుర్తు మళ్ళీ ఈరోజే.. అన్నింటిలో నాకంటే ముందు ఉండాలని ప్రయత్నిస్తుంది ముందే ఉంటుంది కూడా.. పిలిచాను పలకలేదు వెంటనే నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను.
నవ్య లేచే ఉన్నాన్రా అని నవ్వింది, లేవబోతే నా కాలర్ పట్టుకుంది, ఇంకా కళ్ళు తెరవలేదు. నవ్వుతూ నిజంగా ప్రేమేనా అంది.. నేనేం మాట్లాడలేదు.. నవ్వి నా కాలర్ వదిలేసింది.. ఈ సారి బుగ్గ మీద ముద్దు పెట్టి లవ్ యు అని చెప్పాను. నవ్వింది. లేచి బైటికి వచ్చాను అమ్మ ఇంకా అరుస్తూనే ఉంది.
అర్జున్ : ఎందుకే అరుస్తున్నావ్ అలాగా
సుభద్ర : మరీ నువ్వు లేవట్లేదు, నీ చెల్లి లేవట్లేదు.. ఇక్కడికి వచ్చాక పద్ధతులు మారుతున్నాయి ఏదో సెలవులు కదా అని వదిలేస్తున్నా.. ఇంటికెళ్ళాక చెపుతా మీ సంగతి.
రవి : ఆ.. అమ్మా కొడుకులిద్దరు మొదలుపెట్టారా సుప్రభాతం, ఒరేయి చెల్లిని లేపు అందరం మన పొలాలని చూడ్డానికి వెళుతున్నాం.
అర్జున్ : పొలాల్లో ఏముంది నాన్నా చూడ్డానికి.. కాలు పెడితే బురద, అంటుకుంటే దురద
సుభద్ర : సరిపోయింది.. అంతే అవ్వాలి మీకు.. నాది సుప్రభాతం అన్నారుగా.. మీరే వేగండి వాడితో
రవి : ఇదొకటి నా ప్రాణానికి.. రేయి నువ్వు నా బుర్ర తినకుండా చెప్పింది చెయ్యి చాలు.. ముందు చెల్లిని లేపి, ఆ తరవాత క్యాన్ లో నీళ్లు నింపు.
అర్జున్ : సరే..
రవి : రేయి చేతికి ఆ వాచి ఏంటి ?
అర్జున్ : లైట్ వాచ్ నాన్నా.. ట్రైన్ లో కనిపిస్తే కొన్నాలే
రవి : ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందా అది
అర్జున్ : అందుకే లైట్ వాచ్ అని పేరేట్టారు దానికి
రవి : ఎవరినిడిగి కొన్నావ్
అర్జున్ : అమ్మేవాడిని అడిగీ..
రవి : ఈ సెటైర్లకేం తక్కువ లేదు, బాటరీలకి డబ్బులడుగుతే బెల్ట్ తెగిపోద్ది
అందరూ రెడీ అయ్యి బైటికి వచ్చి ఇంటి తాళం వేశారు
నవ్య : ఎక్కడికిరా నాకు నిద్రొస్తుంది అని చెయ్యి గోక్కుంది
అర్జున్ : అక్కడికి వెళ్ళాక పడుకుందులేవే కొంచెం ఓర్చుకో
రవి : ఆ.. ఇంక పదండి
అర్జున్ : పదండి అంటే ఆటోనొ ఎడ్లబండినొ దేన్నో ఒకదాన్ని పిలుచుకురండి
రవి : దిగోచ్చాడండి దేవుడు.. అయ్యగారికి ఫ్లైట్ బుక్ చెయ్యండి.. ఎదవన్నర ఎదవ
తాతయ్య : పోనీలేరా
రవి : నీకు తెలీదు నాన్నా.. రేయి క్యాన్ లో నీళ్లు నింపన్నా నింపావా
అర్జున్ : ఆ నింపాను
సుభద్ర : ఏ నీళ్లు
నానమ్మ నవ్వుకుంటుంది..
అర్జున్ : టాప్ నీళ్లు.. నాన్న చెప్పింది మాత్రమే చెయ్యమన్నారు అదే చేసాను.. ఆయన ఏ నీళ్ళని క్లారిటీగా చెప్పలేదు.
రవి : ఆ బెల్ట్ అందుకో జానకి.. ఈరోజు వీడికుందీ
సుభద్ర : ఏమండి నా పేరు సుభద్ర.. ఎవరినో తలుచుకుంటున్నారు మీరు
రవి : అమ్మ బాబోయ్.. నేను కృష్ణం రాజు డైలాగ్ అన్నానే
సుభద్ర : ఏమో ఎవరికి తెలుసు
రవి : రేయి ఇదంతా నీ వల్లే
అర్జున్ : మీ ప్రేమానుబంధాలు సీరియల్ ఎపిసోడ్ అయిపోతే పోదాం ఇంక.. మరీ అంత ఎదవని కాదు.. మంచినీళ్ళే నింపాను.
అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్లి చుట్టూ పక్కల పొలాలు చూస్తూ అవి ఎవరివో.. ఏ కాలంలో ఏ పంటలు వేస్తారో చెపుతుంటే నేను నవ్య ఊ కొడుతున్నాం.
అర్జున్ : తాతయ్య డౌటు
తాతయ్య : అడుగు
రవి : నాన్నా వాడి డౌట్లు నువ్వు తీర్చలేవు
అర్జున్ : కరీనా సీజన్లో వేసే పంటలు ఏంటి
నవ్య, సుభద్ర, నానమ్మ పగలబడి నవ్వుతుంటే రవి కోపంగా చూసాడు
అర్జున్ : ఏంటి.. ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నాను
రవి : దరిద్రుడా అది కరీనా, కత్రినా కాదు.. ఖరీఫ్ సీజన్.. కనీసం మన పుస్తకాలైనా చదివితే తెలుస్తాయి..
తాతయ్య : ఖరీఫ్ లో పత్తి, వరి, పల్లీలు మొదలయినవి వేస్తారు అర్జున్.. ఇక రబీలో గోధుమ, బార్లె, చెరుకు అలాంటివి వేస్తారు
అర్జున్ : తాతయ్య గంజాయి ఎప్పుడు పండిస్తారు
రవి : చెత్తనా కొడకా
తాతయ్య : నవ్వుతూ ఫిబ్రవరి మార్చిలో మొదలు పెడతారు.. కాకపోతే దొంగతనంగానే కదా పుల్లయ్యలకి దొరకకపోతే పండగే
ఇంతలో అందరం మా పొలం దెగ్గరికి వచ్చేసాం అంతా తిరుగుతూ తెలిసిన వాళ్ళతో ముచ్చట్లు పెడుతుంటే అమ్మ బావి పక్కన చెట్టు కింద సాప వేసింది.. నవ్య వెంటనే నిద్ర పోయింది నేను ఈ వాచ్ సంగతేంటో చూద్దామని చిన్నగా పొలంలోకీ దూరి దిష్టి బొమ్మ కింద కూర్చుని చేతికున్న వాచ్ చూసాను
వాచ్ కింద చిన్న బటన్ ఒకటి ఉంది అది నొక్కగానే నేను ఫిట్ చేసిన రింగ్ పైకి వచ్చింది, పెద్దగా ఏమి రాసిలేదు రింగుని తిప్పాను ఏదో మోడ్స్ అనుకుంటా చూస్తుంటే అలానే ఉన్నాయి. మొత్తం మూడు ఉన్నాయి సరదాగా ఎలా ఉంటుందో అని మొదటి దాని మీద పెట్టి రింగ్ కిందకి ఒత్తాను.. ఏమైంది.. ఏం కాలేదు. లైట్ వచ్చి ఆగిపోయింది.
చిరాకు పుట్టి లేచి అమ్మ వాళ్ళ దెగ్గరికి వెళ్లాను. అమ్మని చూడగానే బుర్ర తిరిగిపోయింది.. నోట్లో స్పూన్ పెట్టుకుని తింటూ ఆగిపోయింది.. పక్కనే చెల్లి పడుకుని ఉంది. పక్కకి తిరిగి చూస్తే నాన్న తాతయ్య భుజం మీద చెయ్యి వేసి అలానే ఉన్నాడు, తాతయ్య నవ్వు అన్ని ఆగిపోయాయి ఒక్కసారి అస్సలు ఏమి అర్ధం కాలేదు, వాచ్ వంక చూసాను అందులో ఏదో బ్లింక్ అవుతుంది, చూస్తుంటే టైమర్ నడుస్తున్నట్టుంది. ఆ టైమర్ ఎంతసేపు ఉంటుందో అర్ధంకాలేదు, దీన్ని మాములుగా ఎలా చెయ్యాలో తెలీదు, వాచ్ రింగ్ అటు ఇటు తిప్పుతూ ఇష్టం వచ్చినట్టు గుద్దుతున్నాను, టెన్షన్ కి నా నుదిటి మీద నుంచి కారుతున్న చెమట నా చెవుల్లోకి దూరుతుంది. భయపడిపోయాను వాచ్ తీసి పారేయ్యాలనిపించింది గట్టిగా లాగి చూస్తే రాలేదు.. కింద గడ్డిలో దొల్లుతూనే తల పట్టుకుని కళ్ళు మూసుకున్నాను. ఇలా ఎంతసేపో తెలీదు ఒక్కో సెకను ఒక్కో గంటలా తోచింది.. ఏదేదో ఆలోచనలు.. ఏడుపు వస్తుంది.. ఇంతలో అరుపు
రవి : రేయి.. ఎక్కడ చచ్చావ్
నాన్న గొంతు వినగానే నా గుండె కొట్టుకోవడం నాకు వినిపించింది.. పరిగెత్తుకుంటూ ఆయన ముందుకు వెళ్లాను.
రవి : అందరకి పెడుతుంటే నువ్వు తినకుండా ఎక్కడికి వెళ్ళావ్.. ఏబ్రాసి
నాన్న తిట్లు వినగానే నా టెన్షన్ తగ్గి నా మోహంలోకి నవ్వొచ్చింది.. వెంటనే ఉచ్చోసుకోవడానికి వెళ్ళాను నాన్నా.. ఈ సారి చెప్పి వెళతాలే అని కూర్చుని సైలెంట్ గా మెక్కడం మొదలెట్టాను.. హమ్మయ్య అనుకున్నాను మనసులో
సుభద్ర : ఇంకొంచెం వెయ్యనా
రవి : ఎందుకు క్యాన్ మొత్తం వాడికే ఇచ్చేయి, ఇప్పటికే దున్నపోతులా మేపుతున్నావ్.. ఇక వాడిని ఆంబోతులా తయారుచేసే పనిలో పడ్డావ్
తాతయ్య : పోనీ లేరా
సుభద్ర : ఎందుకండీ నా కొడుకుని చూసి ఎప్పుడూ ఏడుస్తారు.. సగం మీ దిష్టి తగిలే బక్కగా అయిపోతున్నాడు నా బిడ్డ
రవి : ఆ.. ఆ.. మహాతల్లి.. నిన్ను నీ కొడుకుని నేనేం అనలేదు.. నన్ను వదిలేయ్యమ్మా అన్నపూర్ణమ్మా..
దానికి సుభద్ర మూతిని అష్టవంకర్లు తిప్పి మొగుడిని కోపంగా చూసింది.. రవి వదిలేయ్యవే అని దణ్ణం పెట్టగా నవ్వుకుంది.. ఇద్దరు నవ్వుకున్నారు.. అక్కడున్న ఎవ్వరు గమనించలేదు వీళ్ళ నవ్వులు.
నాకు మాత్రం అమ్మా నాన్న మాటలు వినిపించడం లేదు వాచ్ మొదటి ఆప్షన్ సెలెక్ట్ చెయ్యగానే కొంతసేపు అంతా స్థంభించిపోయింది.. నాకు మళ్ళీ చూడాలని ఉంది.. వెంటనే తింటున్న ప్లేట్ పక్కన పెట్టేసి నాన్న చేతిలో ఫోన్ అందుకున్నాను..
రవి : ఎప్పుడు ఫోనేనా.. అని అరుస్తుండగానే వాచ్ మీద నొక్కడం, నాన్న ఫోన్లో టైమర్ మీద నొక్కడం ఒకేసారి జరిగాయి. మళ్ళీ అంతా ఆగిపోయింది.. నాన్న తన ఫోన్ లాక్కోవడానికి చెయ్యి ముందుకు చాపాడు.. అమ్మ అన్నం తింటూ నోరు తెరుచుకుని ఉంది.. నానమ్మ పల్లీలు నోట్లో వేసుకుంటుంటే రెండు గాల్లోనే ఆగిపోయి ఉన్నాయి.. సరిగ్గా టైమర్ చూస్తూ కూర్చున్నాను.. ఐదున్నర నిమిషాలకి మళ్ళీ మామూలు అయిపోయింది.. నాన్న ఎప్పుడు ఫోనేనా అన్న తరవాత నుంచి నా చేతిలో ఫోన్ లాక్కుంటూ ఫోన్ మీద చెయ్యి పడితే చేతులు విరిచేస్తా ఏమనుకున్నావో అంటూ విసురుగా లాక్కున్నాడు.
ఒకటి అయితే తెలిసింది ఆనుకుని ప్లేట్లో ఉన్న పులిహోర చకచకా తినేసాను.. అందరూ ఎప్పటివో ఊరి పాత ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు.. ఇక రెండో ఆప్షన్ చూడాలి.. ఆత్రుత ఆగలేదు వెంటనే బటన్ మీద నొక్కి రింగుని రెండు సార్లు తిప్పి నొక్కాను. ఈ సారి ఉచ్చ పడింది నాకు.. నా ప్లేట్లో నేను తిన్న పులిహార అలానే ఉంది.
రవి : అందరకి పెడుతుంటే నువ్వు తినకుండా ఎక్కడికి వెళ్ళావ్.. ఏబ్రాసి
నాన్న అదే తిట్టు మళ్ళీ తిట్టేసరికి ఆశ్చర్యం వేసి మౌనంగా ఉన్నాను, ప్లేట్లో పెట్టింది తింటుంటే అమ్మ అడిగిందే మళ్ళీ అడిగింది..
సుభద్ర : ఇంకొంచెం వెయ్యనా
రవి : ఎందుకు క్యాన్ మొత్తం వాడికే ఇచ్చేయి, ఇప్పటికే దున్నపోతులా మేపుతున్నావ్.. ఇక వాడిని ఆంబోతులా తయారుచేసే పనిలో పడ్డావ్
తాతయ్య : పోనీ లేరా
సుభద్ర : ఎందుకండీ నా కొడుకుని చూసి ఎప్పుడూ ఏడుస్తారు.. సగం మీ దిష్టి తగిలే బక్కగా అయిపోతున్నాడు నా బిడ్డ
రవి : ఆ.. ఆ.. మహాతల్లి.. నిన్ను నీ కొడుకుని నేనేం అనలేదు.. నన్ను వదిలేయ్యమ్మా అన్నపూర్ణమ్మా..
అమ్మా నాన్న సైగ చేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుతుంటే సిగ్గేసింది.. ఇంతలో నాన్న నా వంక కోపంగా చూసేసరికి మొత్తం తిని చూసాను నాన్న ఫోన్ నా చేతిలో లేదు.. తీసుకుంటుంటే.. ఎప్పుడు ఫోనేనా.. ఫోన్ మీద చెయ్యి పడితే చేతులు విరిచేస్తా ఏమనుకున్నావో అంటూ విసురుగా మళ్ళీ లాక్కున్నాడు. ఇప్పుడు పూర్తిగా అర్ధం అయ్యింది, రెండో ఆప్షన్ కాలాన్ని వెనక్కి తీసుకెళుతుంది.. ఈ సారి తాతయ్య గడియారం తీసుకున్నాను.. ఇందాక ఊరి గురించి మాట్లాడిందే మళ్ళీ మాట్లాడుకుంటున్నారు.. మళ్ళీ రెండో ఆప్షన్ మీద నొక్కాను.. మళ్ళీ సేమ్.. ప్లేట్లో పులిహార అలానే ఉంది.
రవి : అందరకి పెడుతుంటే నువ్వు తినకుండా ఎక్కడికి వెళ్ళావ్.. ఏబ్రాసి
.
.
.
.
రెండో ఆప్షన్ కి ఎంత టైం పడుతుందో తెల్చడానికి నాకు చాలా గంటలు పట్టింది.. ఆ ఆప్షన్ నన్ను ఇరవై రెండు నిమిషాలు వెనక్కి తీసుకెళుతుంది.. ఇవ్వాల్టికి చాలనిపించింది.. మళ్ళీ వాచ్ ని ముట్టుకోలేదు.. జరిగిందంతా మర్చిపోవడానికి ఏం జరగలేదు అన్నట్టు నటించడానికి మొదటి ఆప్షన్ వాడుకుని కొంతసేపు నాకు నేనే సర్దిచెప్పుకుని ఆపై అందరితో సరదాగా గడిపి ఇంటికి వచ్చేసాను.
ఇంటికెళ్లి ఏం మాట్లాడకుండా పడుకున్నాను, నా చెల్లి నవ్య నన్ను గమనిస్తూనే ఉంది చూస్తున్నాను, రాత్రి పడుకోబోయేముందు ఏదో అడగబోయింది మళ్ళీ ఏమనుకుందో ఏమో మెలకుండా అటు తిరిగి పడుకుంది, నేనూ కళ్ళు మూసుకుని పడుకున్నాను.