Update 13

రాత్రి గడిచి తెల్లారుతుంది. మెల్లిగా చలి తీవ్రత హెచ్చింది. చలికి కాలి మడిమలు వంకర్లు తిరుగుతున్నాయి. నడక భారమైంది. దార్లోని డీలుక్స్ హోటల్ లో కొద్ది సేపు నడుం వాలుద్దామని బస చేశారు.

హోటల్ లోని బెడ్లు, దొంతర్లుగా వున్న రగ్గులు అన్నీ మంచు ముద్దల్ని చుట్ట బెట్టరా అన్నంత చల్లగా వున్నాయి. వాటి పైన విశ్రాంతి తీసుకోడం కష్టంగా తోచింది ప్రయాణికులకు, అందుకే కాలకృత్యాలు తీర్చుకుని వేడి టీ తీసుకున్నారు.

తల్లిని చుట్టుకొని జ్వాల ఏదో నసుగుతున్నది. అచలకు ఆ గారబము అర్థమైనా ఏమీ తెలియనట్లు వూరుకుంది. సత్యలీల గమనించి జ్వాలకు కావాల్సిన ఐస్క్రీమ్ కొని తెచ్చింది. గమ్మత్తు! అంత చలిలోనూ చిన్నారి సునాయాసంగా చల్లటి ఐస్క్రీమ్ ఎంజాయ్ చేస్తూ తిన్నది.

తూరుపు దిశ మెల్లిగా రంగు మారుతున్నది. లేత సూర్యకిరణాలు ఆకాశాన్ని అలముకుంటున్నాయి.

అమ్మయ్య! గుడి చేరుకున్నారు.

స్పీకర్ మొగుతున్నది.. తోలుతో తయారు చేసిన బెల్ట్, పర్సులు, ప్లాస్టిక్ సంచులు గర్భగుడిలో నిషిద్దమని..

మనుషుల రద్దీ కారణంగా గుహ ద్వారా ప్రవేశం రద్దు చేశారు. “బ్యాడ్ లక్, గుహ ద్వారం ఓపెన్ ఉంటే బావుండను. ” శరణ్ జీత్ గారు నిరుత్సాహ పడ్డారు.

దేవి దర్శనం ముఖ్యం, ఏ దారైతేనేమి.. మనసులో అందరూ అనుకున్నారు.

>>>>>>>>>>

సెలవు రోజున అమ్మాయీ, అబ్బాయీ.. వాళ్ళిద్దరి తరపున ఒకరే అయిన పెద్దమనిషి కూర్చున్నారు.

కేశవరెడ్డి మొదలు పెట్టాడు, “ఆనంద్.. ప్రజ్ఞా.. మీరద్దరూ నా వాళ్ళే, ఇద్దరిలోనూ క్రమశిక్షణ, మంచితనము వున్నాయి. మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకొని నా ఇంట్లోనే వుండాలి అనే స్వార్థం నాలో వుంది.

ఎందుకంటే, ఆనంద్ నా బిజినెస్ను ఎప్పుడూ ప్రక్క త్రోవ పట్టించలేదు. ప్రజ్ఞ నా ఇంటి బాగోగులన్నీ చక్కగా చూసుకుంటున్నావు.

ఇది నా ఆలోచన, అభిప్రాయం కూడా. మీరు పరస్పరం ఒక సారి మాట్లాడుకోండి, నేను వేరే రూమ్లోకి వెళతాను. ” అంటూ లేచాడు.

“సేఠ్జీ.. సార్.. , మీరు ఇక్కడే కూర్చోండి.. ” ఆనంద్ కేశవరెడ్డిని తిరిగి కూర్చోబెట్టాడు.

“ఇక మీ రాశులు ఏమిటో, జాతకాలు ఏమిటో నేను పరిశీలించలేదు. నా పెళ్లి నిశ్చయంకు ముందు కల్పన తరపు వారు, మా తరపు వారు వంద శాతం జాతకాలు తనిఖీ చేసి వివాహం చేశారు.

కాని ఏమైందీ.. నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది.

ఈ మాటే అంటే అందరూ ఏమంటారు, ‘మన తలరాతను ఎవ్వరూ మార్చలేరు’ అని. ఆల్రెడీ తలరాతతో ఫిక్స్ అయ్యాక, మన మనోబలాన్ని కించ పరుస్తూ జాతకల పరిశీలనలు ఎందుకు? మీకు జాతకల పట్టింపు వుంటే కనుక్కోమంటే.. కనుక్కుంటాను. ”

“పెదనాన్నా, మీరు పెళ్ళిళ్ళు కుదిర్చే మధ్యవర్తి కాదు, ఈ ఇంటికి అధిపతి, మాకు..

ప్రత్యేకంగా నాకు.. మీరు సన్మార్గం చూపించిన, భగవంతుడు యిచ్చిన మరో నాన్నగారు. ”

“సరే మరి, విషయానికి వద్దాము. ప్రజ్ఞా, నీ మనసులో మాట చెప్పు తల్లీ.. ”

ప్రజ్ఞ ఆనంద్ ను చూస్తూ సూటిగా చెప్పదొడిగింది, “మా ఇంటి పెద్దలు నా పెళ్లి మా బావ తో.. ”

ఆనంద్ ఆటంకం కల్గించి, “నాకు తెలుసు, నేను విన్నాను. పెళ్లి తరువాత మనము కలిసి జీవించే అంశాల పైన మాట్లాడుదాము. ”

“నేను పెదనాన్నాను వదిలి, అత్తారింటికని వేరే చోట వుండను. ఈ ఇల్లే నా స్వర్గం!”

కేశవరెడ్డి కల్పించుకున్నాడు, “చాలా సంతోషం, ఎందుకంటే అత్తారింటి అప్పగింతలు వుండవు. ముఖ్యంగా పెళ్ళికూతురు పుట్టిల్లు వదిలి వెళ్ళేప్పుడు పడే దుఃఖం నేను చూడలేను. మనసును కలిచి వేసే ఘట్టం అది. ”

కొద్ది సేపు మౌనంగా వున్నారు. ఆనంద్ అన్నాడు, “నాకు కావల్సింది కూడా అదే. కానీ ఎప్పుడైనా మా అక్కల మంచి-చెడ్డలు నేను చూడాల్సి వుంటుంది. ”

“అలాగే. ”

“నా కంటే ఎక్కువ చదువు కున్నావు, కానీ నన్ను చదువమని యిబ్బంది పెట్టకు. ఎందుకంటే నా ధ్యాస, పట్టుదల..ఇప్పుడు నేను చేస్తున్న వృత్తి మీదనే వుంది.

నా వలన ఎప్పుడైనా నీ మనసు బాధ పడితే, ఆ మరుక్షణమే నాతో చెప్పి నన్ను సరిదిద్దాలి. ”

“ఒకే.

మరి నా మాట, మనిద్దరిలో ఒకరినొకరు గౌరవంగా, నమ్మకంగా, ఆప్యాయతగా వుండాలి. ఏదయినా సమస్య వస్తే పరిష్కారం ఆలోచించాలి గాని ఇంటిని కురుక్షేత్రం చేయవద్దు. ”

“అమ్మో, కురుక్షేత్రం వరకూ వెళ్లొద్దు. సాధారణ ‘ఛీ, ఛా’ కూడా నచ్చవు. నాకు మనుషుల విలువ ముఖ్యం. ” ఆనంద్ గబగబా చెప్పేశాడు.

“ముహూర్తల పని నా వంతు.. ” కేశవరెడ్డి ఆనందం వెలిబుచ్చాడు.

ప్రజ్ఞ “పెదనాన్నా, మీకు నచ్చిన చోట పెళ్లి నిర్ణయించండి. తక్కువ ఖర్చులతో, చాలా సింపుల్ గా కావాలని నా కోరిక. ”

“ఆనంద్, నువ్వు ఆబిడ్స్ పుల్లారెడ్డి షాప్ వెళ్ళి మంచి స్వీట్స్ తీసుకురా.. ” కేశవరెడ్డి అనుభవం కొట్టిన దెబ్బలకు బొప్పికట్టిన తల ఎగరేసి అన్నాడు.

ఆనంద్ స్వీట్స్ కొనేందుకు వెళ్ళాడు.

“పెదనాన్న స్వీట్స్ కంటే ముందు నాకు ఒక విషయంలో నిజం తెలియాలి.. ”

ఏమిటి అన్నట్లు చూశాడు కేశవరెడ్డి.

“నా వెంట పడ్డ వానర మూకను యే విధంగా మాన్పించారు.. ఆనంద్ ను అడిగితే మాట దాటేస్తున్నాడు..”

“ఆనంద్ ఒకట్రెండు మార్లు మంచి మాటగా వాళ్ళకు నచ్చచెప్పాడు, మాట వినలేదు.

మన షాప్ లేన్లో గల అన్ని షాపుల ఓనర్స్ సంతకాలు తీసుకుని, మేయర్ వద్ద కెళ్ళి అసలు విషయం చెప్పాము. అంతే, మేయర్ గారు ఎలా నచ్చ చెప్పారో తెలియదు, అబ్బాయిలు జాగ్రత్త పడ్డారు. ”

“మేయర్ గారి అబ్బాయి వున్నందుకు ఒక రకంగా మేలే జరిగిందైతే.. ”

“ఎవరు వున్నా సరే, అట్లా అమ్మాయిలను యిబ్బంది పెడితే.. ఎవ్వరూ ఊరుకురు.. సెక్యూరిటీ ఆఫీసర్ల వరుకు వెళ్ళినా సందేహం లేదు. ”

“అవును, నిజమే.. ” అన్నది ప్రజ్ఞ.

శంషాబాద్లోని అమ్మపల్లి వూర్లో శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రతీ నెలా పునర్వసు నక్షత్రం రోజున సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆ శుభ సమయాన ప్రజ్ఞా ఆనంద్ల పెళ్లి జరిపించాడు కేశవరెడ్డి.

ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ఫోటోలకు దండం పెట్టి హృదయ విధారకంగా ఏడ్చింది. తండ్రి బాధ్యత వహిస్తున్న కేశవరెడ్డి ఓదారుస్తూ “ప్రజ్ఞా, ఏడవకు, నేను చూడలేను. ” అన్నాడే గానీ ఆతని దుఃఖం కూడా అరికట్ట లేక పోయాడు.

అమ్మానాన్నల వియోగం తెలిసిన ఆనంద్ కళ్ళు చెమ్మగిల్లాయి.​
Next page: Update 14
Previous page: Update 12