Update 01

ఆ కుటుంబానికి తల్లి ఋణం తీర్చుకోవాలి అనే శాపం వుంది.

ఆ శాపం ఎవరు పెట్టారు..... ఎందుకు పెట్టారు.......

తల్లి ఋణం తీర్చుకోవడం శాపమా.... పాపమా.... లేక వరమా

బిడ్డకు జన్మ ఇచ్చి ప్రయోజకుడిని చేసేది తల్లి.

ఆ తల్లి ఋణం ఏం చేసినా తీరదు.

తీర్చుకునే అవకాశం వుంటే ఎవరు వదులుకోరు.

కొడుకు తల్లి ఋణం తీర్చడానికి ఏం చేశాడు. అనేదే ఈ కథ సారాంశం.


మాతృ ఋణం

దిగులుగా ఇంట్లోకి వస్తున్న కొడుకు అభిలాష్ (24) ని చూసి కాళ్ళు కడుక్కుని రా అన్నం తిందువు అని చెప్పింది వనజ(46). కొడుకు వాలకం చూడగానే ఈ సారి కూడా కలిసి రాలేదు అనుకుని. వెంటనే అడిగితే బాధ పడతాడు అని ఏం మాట్లాడకుండా పల్లెం లో అన్నం వడ్డించింది. అభిలాష్ వచ్చి కూచుని అన్నం తింటున్నాడే కానీ గొంతులోకి దిగటం లేదు.

వనజ: ప్రయత్నం చేయటం తప్పు కాదు అభి. కానీ ప్రయత్నం చేసిన ప్రతి సారి గెలుస్తాము అని లేదు కదా. ఈ సారి కాకుంటే ఇంకో సారి. ప్రయత్నం చేయటం మాత్రమే కాదు మనకు కాలం కూడా కలసి రావాలి.

అభిలాష్: రెండు మార్కులతో పోయింది అమ్మ. రెండు మార్కులు అంతే. (కళ్ళు తుడుచుకుని) ఉద్యోగం వచ్చేసిందనుకున్న.

(అభిలాష్ భుజం తడుతూ)

వనజ: బాధ పడకు అభి నువ్వు కచ్చితంగా సాధిస్తావన్న నమ్మకం నాకుంది. ఇంకో ఎగ్జామ్ రాయి. ధైర్యంగా వుండు.

అభి: మంచి ఉద్యోగం వచ్చిందంటే అప్పులు కట్టేసి ఇబ్బంది లేకుండా బతుకుదాం అని ఆశ అమ్మ. ఆ ఆశ ఈ జన్మకి నెరవేరుతుందో లేదో అన్నాడు.

వనజ : మనకు కూడా మంచి సమయం వస్తుంది. దేవుడు కరుణించి నీకు ఒక ఉద్యోగం ఇస్తే.... (వనజ మాట పూర్తి కాలేదు)

అభిలాష్: దేవుడంట దేవుడు. ఏం చేస్తున్నాడు దేవుడు. ఎవరికైనా మనం అన్యాయం చేశామా. ఒకడి దగ్గర డబ్బు దొంగిలించామ. ఎవరి జీవితం అయిన నాశనం చేశామా. ఎందుకు మనకు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. పైగా మనం బతకడానికి దేవుడు కరుణించి నాకు ఉద్యోగం ఇవ్వాలా. అలా అయితే రెండు మార్కులతో నాకు ఉద్యోగం పోయింది. ఆ రెండు మార్కులు మీ దేవుడిని వేయించమను. నాకు ఉద్యోగం వస్తుంది. నువ్వు చెప్పింది, నేను చెప్పింది అన్ని వింటున్నాడు అంటావు కదా. ఏది ఆయనే రెండు మార్కులు వేయించి నాకు జాయినింగ్ లెటర్ పంపించమని చెప్పు. అమ్మ ఒకటి గుర్తు పెట్టుకో దేవుడు లేడు దయ్యం లేదు. మనం కష్టపడితేనే మనకు తిండి వస్తుంది అంతే. బియ్యం అయినా కూరగాయలు అయినా మనిషి పండిస్తున్నాడు. దేవుడు కాదు. నేను కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. నీ మూడ నమ్మకాలతో కాదు.

(అని కోపంగా అన్నం తినకుండా లేచి వెళ్ళిపోయాడు)

వనజ ఎంత పిలిచినా వినకుండా వెళ్ళాడు అభిలాష్.

ఇంక చేసేది లేక తనుకూడా ఏమీ తినకుండా కళ్ళు తుడుచుకుని నీళ్లు తాగి పడుకుంది. ఎప్పుడు నిద్రలోకి జారుకుందో నిద్రపోయింది.

ఏదో అలికిడి అయిన శబ్దం వస్తె లేచి చూసింది వనజ.

అభిలాష్ టీ పెడుతున్నాడు.

వనజ : ఎంతసేపు అయింది నువ్వు వచ్చి

అభిలాష్: ఇపుడే, (తాగడానికి నీళ్లు ఇచ్చి) ఇదిగో ఈ సమోసా తిను అంతలోపు టీ అవుతుంది.

వనజ: టీ పొడి కాస్త ఎక్కువ వెయ్యి. తల నొస్తుంది.

అభిలాష్ : సరే.

వనజ: ఎన్ని మార్కులు వచ్చాయి.

అభిలాష్ : ఎన్ని మార్కులు తగ్గాయి అని అడుగు.

వనజ : రాని రెండు మార్కుల గురించి కాదు నేను అడిగేది. నీకు వచ్చిన మార్కుల గురించి.

అభిలాష్: ఎన్ని వస్తె ఏం ఉద్యోగం రాలేదు గా

వనజ: సాయంత్రం పెద్దమ్మ రమ్మంది. వెళ్లి రా. ఏదో మాట్లాడాలట.

అభిలాష్: ఏం మాట్లాడతారు. పాత పాటే. తీసుకున్న అప్పు కట్టలేక పోయాం కదా. కొత్త బాండ్ వ్రాసి ఇవ్వు అంటుంది.

వనజ: వచ్చేనెల వడ్డీ ఇస్తాం అని చెప్పు.

అభిలాష్: తీసుకున్న అప్పు అరవై వేలు. ఇప్పటి వరకు కట్టిన వడ్డీ ఎనభై వేలు.

వనజ: వడ్డీ ముందు గుర్రాలు కూడా పరిగెత్తలేవు.

అభిలాష్: (టీ ఇస్తూ) గొలుసు తాకట్టు పెట్టి.. వాళ్ల అప్పు తీర్చెద్దాం.

వనజ: అది తాకట్టు పెడితే మన దగ్గర అవసరానికి డబ్బు ఇచ్చే వస్తువు ఏది వుండదు. వచ్చే నెల వడ్డీ ఇస్తాం అని చెప్పి కొత్త బాండ్ వ్రాయించి రా.

అభిలాష్: అలాగే, కాసేపు ఆగి వెళతాను.

అభిలాష్ టీ తాగి బయటికి వెళ్ళాడు.

వనజ ఇంటి పని లో పడింది.

కాసేపటికే అభిలాష్ వచ్చాడు.

పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లావ అని అడిగింది వనజ

అభిలాష్: ఆ వెళ్ళాను. కొత్త బాండ్ రాయించి ఇచ్చాను. రేపు **** బ్యాంక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి.

వనజ : రేపటి సంగతి కదా జరగబోయే దాని గురించి ఎక్కువ ఆలోచించకు.

అభిలాష్: ఆలోచించకుండా ఎలా వుండాలి. మనకు ఆదాయం లేదు. ఇపుడు చేసే ఈ ఐదు వేల ఉద్యోగంతో బతుకంతా ఇలాగే వుండాల. నాన్న ఉండుంటే ఇలా వుండే వాళ్ళమ. అప్పులు చేసి బతికే వాళ్ళే బాగున్నారు. అప్పు ఇచ్చి వసూలు చేసుకోలేక...

అభిలాష్ మాటలని మధ్యలోనే ఆపుతూ

వనజ: చాలు. అన్ని విషయాలు నీకు తెలుసు అనుకోకు. చెప్పినా ఇప్పుడు నీకు అర్థం కావు.

అభిలాష్: నేను చిన్న పిల్లాడిని కానమ్మ, నాకు అన్ని అర్థం అవుతాయి.

వనజ: నమ్మిన వాళ్లకు అప్పు ఇచ్చాం. వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. అనే నీకు తెలుసు. చెల్లెలి భర్తకి ఆక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో పడితే ఆపరేషన్ కోసమని పది లక్షలు వాళ్లకు డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు ఇవ్వడానికి మీ నాన్న అప్పు చేశాడు. అవును అప్పు చేసి ఇచ్చాడు. మీ మామయ్య దక్కలేదు. ఆ దిగులుతో మీ అత్త కూడా చనిపోయింది. వాళ్లకు పిల్లలు కూడా లేరు. డబ్బు అంతా ఆసుపత్రి ఖర్చులకు అయిపోయింది. ఆ డబ్బు అంతా కట్టడానికి ఎన్నో తిప్పలు పడ్డాడు. వ్యాపారం లో నష్టాలు చుట్టుముట్టాయి. చివరికి ఒక రోజు మీ నాన్న మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను, మీ నాన్న ఇవి నీ వరకు రాకుండా దాచాము.

అభిలాష్: ఆ డబ్బు ఇచ్చింది అత్తయ్య వాళ్ళకా..

వనజ : అవును. కానీ అంత ఖర్చు చేసినా మీ మామయ్య దక్కలేదు.

అభిలాష్ కు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వుండిపోయాడు.

====================

అభిలాష్: (ఫోన్ లో)హలో... అమ్మా... హలో...

వనజ : ఆ హలో చెప్పు కన్న వినపడుతుంది.

అభిలాష్: అమ్మా ****బ్యాంక్ ఎగ్జామ్ లో నేను పాస్ అయ్యాను అమ్మ. నాకు ఉద్యోగం వచ్చిందమ్మ...

వనజ కు ఆనందంతో కళ్ళు చెమర్చాయి.

అభిలాష్: అమ్మ వచ్చే వారం అపాయింట్మెంట్ ఇస్తారు. అమ్మ ఇంక మనకు ఇబ్బందులు వుండవు అమ్మ.

వనజ: ముందు ఇంటికి రా కన్న.

అభిలాష్ : వస్తున్న అమ్మ

అభిలాష్ ఇంటికి వస్తూనే అమ్మ కాళ్ళకు నమస్కరించాడు.

వనజ అభిలాష్ ను కౌగలించుకుని బుగ్గ పై ఏడుస్తూ ముద్దు పెట్టింది.

అభిలాష్: ఎందుకు ఏడుస్తున్నావ్. ఇంక అన్ని మారిపోతాయి. అప్పులు అన్ని తీర్చేద్దాం. నవ్వు అమ్మ

వనజ : వుండు నీ నోరు టైపు చేయాలి అని పరుగున వెళ్లి బెల్లం ముక్క తెచ్చి అభిలాష్ నోట్లో పెడుతుంది.

అభిలాష్ ఆ బెల్లం ముక్క కాస్త కొరికి మిగిలింది వనజ నోట్లో పెట్టాడు.

అభిలాష్ : అమ్మ, ఎక్కడ జాయినింగ్ వుంటుందో తెలియదు. దూరం అయితే నువ్వు కూడా నాతో రావాలి.

వనజ: ముందు అపాయింట్మెంట్ లెటర్ రానివ్వు. నీ ఉద్యోగం ఎక్కడ వుంటే అక్కడికే వెళదాం కన్న.

==============

వనజా అక్కడ నిన్ను పిలుస్తున్నారు.... ఎవరో చెప్పారు.

అటు వైపు తిరిగింది వనజ. దూరంగా ఒక పురోహితుడు ఆమెను చూసి రమ్మన్నట్టు సైగ చేసాడు. అంత మంది భక్తుల మధ్యలో తనని ఎలా గుర్తు పట్టాడు అని ఆలోచిస్తూ వనజ ఆ పురోహితుని దగ్గరకి వెళ్లి నమస్కారం చేసింది.

వనజ: స్వామి...

పురోహితుడు: మీ ఆయన పేరు మధు కదా

వనజ : అవును స్వామి.

పురోహితుడు: మరి ఋణం తీర్చుకున్నాడ

వనజ : అయోమయంగా ఏం ఋణం స్వామి

పురోహితుడు : గట్టిగా నవ్వి తీర్చుకొనందుకే మీ ఆయన ముందుగానే పైకి పోయాడు. ఆ ఋణం తీర్చుకుని వుంటే మీ ఆయన వంద సంవత్సరాలు బతికే వాడు.

వనజ : మీకు మా ఆయన అప్పు వున్నాడా స్వామి. ఆయన మీ దగ్గర ఎప్పుడు అప్పు తీసుకున్నాడు....

పురోహితుడు: మీ ఆయన ఋణ పడింది అతని అమ్మకు.

ఆ ఋణం తీర్చుకోలేదు వెళ్ళిపోయాడు. నీ కొడుకు నీకు ఋణ పడ్డాడు ఇంకో ఏడాది లోగా తీర్చుకోమని చెప్పు. లేదంటే హః...హః ..హః...అని గెట్టిగా నవ్వాడు.

వనజ : తీర్చుకోకుంటే

పురోహితుడు : మీ ఆయనకి పట్టిన గతే అంటూ ఇంకా గట్టిగా నవ్వసాగాడు.

చటుక్కున లేచి కూచుంది వనజ.

సమయం చూసింది. తెల్లవారు ఝామున 4 గంటలు. చుట్టూ చూసింది పక్క మంచం పై అభిలాష్ నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా వొళ్ళంతా చెమట్లు పట్టేసాయి.

ఈ వేళపుడు ఇలాంటి కల రావటం ఏంటి.... ఏం చేయాలి అని ఆలోచిస్తూ లేచి బాత్ రూం కి వెళ్ళి వచ్చి మళ్ళీ నిద్రపోయింది.​
Next page: Update 02