Update 08

"ఇదో.... నిమ్మకాయ చట్నీ పెడ్దమన్న గద. ఎప్పుడు గొందం నిమ్మకాయలు? "

"ఇప్పుడు కొంచం busy గా ఉన్నా. కాస్త workload ఎక్కువగా ఉంది.... నేనే చెప్తాను ఎప్పుడు వెళ్దామో.... సారీ."

"అయ్య అయ్య, నువ్వట్ల ఊకె సారీ జెప్పకు నాకు. నీకెప్పుడు కుదిర్తె అప్పుడే పోదం గాని. పని చేస్కో." అంది చిత్ర.

తన భర్త తన దెగ్గర 'సారీ' అన్న పదాన్ని చాలా తరుచుగా వాడుతూ ఉండటం నచ్చట్లేదామెకి.

'ఏందో ఏమో, గీ మనిషి ల మార్చాల్సినవి చానా ఉన్నయ్.' అనుకుంది తన మనస్సులో.

****

హాల్లో సోఫా పై కూర్చుని టి.వి చూస్తున్న చిత్రకి ముందు రోజు సేల్స్ గాల్స్ పై ' తన కోసం' ఈశ్వర్ కోపాన్ని చూపించిన వైనాన్ని పదే పదే తలుచుకోసాగింది చిత్ర. ఆమె మనస్సు సంతోషం తో, గర్వం తో ఉప్పొంగసాగింది. టి.వి వైపు చూడకుండా ఆమె ఓరగా బుద్ధిగా పని చేసుకుంటున్న ఈశ్వర్ ని చూడసాగింది.

తన భర్త క్లీన్ షేవ్ చేసుకుంటే బావుంటాడో, లేక కాస్త గరుకుగా గడ్డం ఉంచుకుంటే బావుంటాడో నని ఆలోచించసాగింది చిత్ర. పదహేను నిమిషాల విశ్లేషణ తరువాత తన భర్త ఎలాగైనా బావుంటాడన్న అభిప్రాయానికి వచ్చిందామె. పని మధ్యలో అప్రయత్నంగా ఈశ్వర్ తన తల ఎత్తి చిత్ర వైపు చూశాడు. తన వైపే చూస్తున్న చిత్ర వైపు చూస్తూ

"ఏదైనా చెప్పాలా నాకు?" అని సైగ చేశాడు.

"ఏమ్లే, ఏమ్లే. ఛాయ తాగుతవేమోనని." అంది చిత్ర. అంత అయత్నకృతంగా తాను ఎలా అబద్దమాడగలిగానన్న సందేహం కలిగిందామెకు.

ఈశ్వర్ కు చిత్ర నోటి వెంబట 'చాయ్' అన్న మాట విన్న వెంటనే అతని మెదడు లోని ప్రతి నరం చిత్ర చేసే ఛాయ్ ని కోరుకోసాగింది. కానీ అతనికి చిత్ర తో మరీ ఎక్కువగా ఛాయ్ లు పెట్టించుకోవొద్దని తనకు తాను పెట్టుకున్న నిశ్చయం గుర్తొచ్చి,

"ఇప్పుడేం ఒద్దులే చిత్రా! కావలసినప్పుడు నేనే నిన్ను అడుగుతాను లే." అన్నాడు 'తియ్యగా'.

తన భర్త యొక్క స్వరం లోని కృత్రిమమైన తియ్యదనాన్ని నిజమని భ్రమపడి, ఆనందపడింది చిత్ర. నిండుగా నవ్వుతూ సరేనన్నట్టుగా తలూపింది చిత్ర, తన భర్త వైపు చూస్తూ.

ఆ 'నవ్వు ' ని చూసి వెంటనే తన చూపుని తన లాప్టాప్ స్క్రీన్ పై పోనిచ్చాడు ఈశ్వర్. ఆమె వల్ల అతనికి కలుగుతున్న అపరాధభావాన్ని అణుచుకోవడానికి ప్రయత్నించసాగాడు.

చిత్ర కి తన భర్త తనతో అంత 'తియ్యగా' మాట్లాడిన దానికి ప్రతిగా ఏదైనా మంచి రుచికరమైన వంటకం చేసిపెట్టాలన్న ఆలోచన కలిగింది. వెంటనే ఆమె మెదడు కి ఈటీవీ అభిరుచి చానెల్ స్ఫురించింది. ఆ చానెల్ నెంబరుని కష్టపడి గుర్తుతెచ్చుకుని, టి.వి లో ఆ చానెల్ ని పెట్టింది చిత్ర. అందులో చికెన్ టిక్కా ని తయారుచేసే విధానాన్ని, పూర్తిగా అర్థం కాకున్నా కళ్ళు పెద్దవిగా చేసి ,తలూపుతూ 'వింటున్న ' యాంకర్ కి విశదీకరిస్తున్నాడు చెఫ్. ఆ చికెన్ ముక్కల్ని చూడగానే చిత్ర నోరూరింది.

'ఏందో ఏమో, గంత ఉంటడు మనిషి సూడనీకె. చికెన్, గికెన్ తిననంటడు. ఊకె ఆక్కూరలు మేక లెక్క నమిల్తే ఏమొస్తదసలు? మంచిగ అన్ని కొట్కదినాలె. " అనుకుంది చిత్ర తన మనస్సులో. పెళ్ళి కాక మునుపు తాను పట్నం లోని వ్యక్తికి భార్యను అవబోతున్నానని తెలుసుకొని, రకరకాలైన మాంసపు వంటకాలను రుచిచూద్దామనుకున్న విషయం గుర్తొచ్చింది చిత్ర కు.చిత్రకు తన ఊరూ, తన మామయ్యా గుర్తు రాసాగారు. ఒక్కసారి తనివితీరా తన మామయ్య తో మాట్లాడాలనిపించింది ఆమెకి. పెళ్ళై ఇన్ని రోజులవుతున్నా ఇంకా తన మేనమామ ఫోన్ చేయకపోవడానికి కారణం అర్థం కాలేదామెకు.ఊళ్ళో పరిస్థితులు ఏమైనా ఆందోళనకరంగా ఉన్నాయేమో నన్న భావన కలిగిందామెకు. కానీ ఎదైనా క్లిష్టమైన సమస్య ఎదురైతే తన మేనమామ తనను ఖచ్చితంగా సంప్రదిస్తాడని తనకు తాను సర్ది చెప్పుకుంది చిత్ర.

ఒక్క క్షణం ఈశ్వర్ అలా శాకాహారిగా మారటానికి అమృతే కారణమేమో నన్న భావన కలిగిందామెకు. అమృత ఆమె మస్తిష్కం లోకి 'రాగానే' చిత్ర తన భర్త ని తలుచుకుని ముందు రోజు నుంచీ అనుభవిస్తున్న సంతోషం మొత్తం ఒక్కసారిగా ఆవిరైపోయింది.

'క్రిష్నయ్యా! గా అమృతని ఊకె నా మైండు లోకి రాకుండగ సూడయ్యా జెర! మంచిగ అనిపిస్తలేదయ్యా నాకు గాయ్న ఇంగో ఆమెని తల్సుకుంటుండు అని నాకు గుర్తొస్తె. నాకు నేను ఏం గాదులే అని ఎంత చెప్పుకున్నా మనసుల మస్తు బాధవుతుందయ్యా నాకు. గాయ్న మనసుల నేనే ఉండేటట్టు సూడయ్యా. ఇంగేం ఒద్దయ్యా నాకు. ఇంగేం కోరుకోను నిన్ను. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.

తన భర్తను తనకు ' అలవాటైన రీతిలో ' ఓరగా చూడటాన్ని కొనసాగించింది చిత్ర. గులాబీ, గోధుమ వర్ణాల మధ్య ఉండే తన భర్త పెదవులు చాలా ఆకర్షణీయంగా కనిపించాయి ఆమెకి. తన భర్త పెదవులను తనివితీరా ముద్దాడాలనిపించింది చిత్రకి. ఆమెకు తన స్నేహితురాలూ, కొన్ని విషయాల్లో 'గురువైన 'వీణ చెప్పిన సంగతులు స్ఫురణకు రాసాగాయి.

'క్రిష్నయ్యా, గా అమృత లెక్క గీ వీణ గూడ నాకు గుర్తు రాకుండగ సూడయ్యా. గిది గుర్తొస్తే నాకు ఇంగో రకమైన బాదవ్తుంది ఊకె. ' అని తనలో తాను తన భర్త వైపు చూస్తూ నిట్టూరుస్తూ నవ్వుకుంది చిత్ర.

ఇంతలో యాంకర్ నోటి నుండి 'ఆలూ పరోటా' అన్న మాట చిత్ర చెవిన పడింది.

'ఆల్గడ్డలంటే ఈనకి మస్తిష్టం ! మంచిగ గీ ఒంటలు జేశేటాయన చెప్తే నేర్సుకోని మంచిగ చేశి పెడ్త నేనింగ ' అని నిశ్చయించుకుంది చిత్ర.

టి.వి సౌండ్ పెంచుదామనుకుని, తన భర్త పనికి విఘాతం కలుగుతుందేమో నని భావించి, లేచి టి.వి పక్కన నిలబడి ఆసక్తిగా చెఫ్ చెప్పే తయారీ విధానాన్ని వినసాగింది చిత్ర.

సగం వరకు వచ్చేసరికి చిత్ర అంతకుముందెన్నడూ వినని పదార్థాల పేర్లు చెఫ్ నోటి నుండి రాసాగాయి.

'ఏందో ఏమో, ఈళ్ళు చెప్పేటివేందో గానీ నాకు పల్కనీకె నోరు గూడంగ తిరుగుతలే.' అనుకుంది చిత్ర తన మనస్సులో.

ఆ పదార్థాలకి ప్రత్యామ్నాయంగా ధనియాలు, జీలకర్ర వంటివి వాడాలని నిర్ణయించుకుంది చిత్ర. ఆలూ పరాటా తయారీ విధానాన్ని సంగ్రహంగా ఆఖరున చెఫ్ చెబుతూ ఉంటే తీక్షణమైన దృష్టి తో వినసాగింది చిత్ర. అతను చెప్పటం ముగించాక , టి.వి బంద్ చేసి, తన భర్త వైపు ఒక సారి తనివి తీరా చూసుకుని, వంటింటి వైపు బయలుదేరింది చిత్ర.

ఆ చెఫ్ చెప్పిన పదార్థాలల్లో చిత్రకు తెలిసినవాటిని వాడింది చిత్ర. ఆమెకు 'అర్థం కాని ' పదార్థాలను తనకు తెలిసిన పదార్థాలతో భర్తీ చేసింది చిత్ర. ఆ చెఫ్ చెప్పిన నిష్పత్తిలోనే కాక, కారానికి దూరంగా ఉండే తన భర్త యొక్క ఇష్టాలను చాలా తీక్షణంగా గుర్తు తెచ్చుకుని తయారు చేయసాగింది చిత్ర. తన భర్త యొక్క ఇష్టాలను అంత గా గుర్తెరిగి, అందుకు తగ్గట్టుగా తాను వంటకాన్ని తయారు చేసే విధానం చిత్రకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎట్టకేలకు మితిమీరిన ఉత్సాహం వల్ల ఒక సారి చిన్నగా చేయి కాల్చుకుని, పరాటాల తయారీని పూర్తిచేసింది చిత్ర. ఆ ఆలూ పరాటాలు సరిగా వచ్చాయో, లేదో నని కాస్త చించుకుని తినాలనుకుంది చిత్ర. కానీ అది ఎంగిలి అవుతుందేమో నని తన ప్రయత్నాన్ని విరమించుకుంది చిత్ర. తను తయారు చేసిన విధానం పై భరోసాని తెచ్చుకుంది చిత్ర.

' ఎందుకు బాగుండదు. మస్తుంటది ఆల్గడ్డ పరాట. గీనకు ఎట్లా మస్తిష్టం ఆల్గడ్డ. జెర మరీ బాలేకున్నా గూడ నచ్చుతది గానిలే.' అని మనస్సులో అనుకుంది చిత్ర.

ఆ పరాటా లను హాట్ ప్యాక్ లో సర్దింది చిత్ర. దోరగా కాలిన ఆ పరాటాలను తృప్తిగా నిమురుతూ

'గివి తిన్నాంక . నోరు తెరిచి అడగాలె నన్నింగ. చిత్రా, ఎప్పుడు జెస్తవ్ పరాటాలు మళ్ళ అని.' అనుకుంది చిత్ర మనస్సులో. కానీ మరుక్షణం ఆమెకు తన భర్త తనని ఆశతో అర్థించాలన్న ఆమె భావన తప్పుగా తోచింది. తన భర్త తనను అడగకముందే అతని ఇష్టాలన్నింటినీ తెలుసుకుని వ్యవహరించాలనుకుంది.

చిత్ర తనను రాత్రి భోజనానికి ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురుచూస్తూ లాప్టాప్ ముందు కూర్చున్నాడు ఈశ్వర్.అప్రయత్నంగా తన జుట్టుని చెరుపుకుని సరిచేసుకుంటున్నాడు ఈశ్వర్. కాలి పట్టీల శబ్దం వినబడగానే తన తల పైకి ఎత్తి చిత్ర వంక చూశాడు.

"ఇదో.... నాకు ఆల్గడ్డ పరాటాలంటే చానా ఇష్టం. ఊకె తింటుంటి మా మామ ఇంట్ల ఉన్నప్పుడు. అందుకే చేశ్న ఇగ. నీకు ఇబ్బందేం లేదు గద?!" అంది చిత్ర ఈశ్వర్ తో, తన లౌక్యాన్ని ప్రదర్షిస్తూ.

"అయ్యో పర్లేదు. నాకు కూడా ఆలూ అంటే చాలా ఇష్టం. " నిజాయితీగా సమాధానమిచ్చాడు ఈశ్వర్.

చిత్రకు తన భర్త 'ఇంకోసారి ' ముద్దొచ్చాడు.

చిత్ర చేసిన పరాటాలు బాగా నచ్చాయి ఈశ్వర్ కి. ఈ విషయం ఆమెకు చెప్పాలనుకున్నాడు ఈశ్వర్, కానీ చిత్ర తో అతిగా సంభాషించగూడదన్న అతని 'నియమం ' అతనికి గుర్తొచ్చి ఊరుకున్నాడు. తన భర్త నోటి వెంబడి ఏదైనా మెచ్చుకోలు వస్తుందేమో నని ఆశగా ఎదురు చూడసాగించి చిత్ర. పరాటాలు చెడిపోయాయేమో నన్న అనుమానం కలిగిందామెకు.

'ఏందో ఏమో, మంచిగ కానట్టున్నయివి. పాపం రోజు లెక్క చెపాతీలు జేశింటే ఐపోవసలు. అనోసరంగ ఈనని ఇవి తనబెడ్తి.' అనుకుంది చిత్ర తన మనస్సులో.

తినడం ముగించాక తన ఎంగిలి కంచాన్ని కడగడానికి సింక్ దెగ్గరికి తీస్కెళ్ళాడు ఈశ్వర్. చిత్ర చాలా కష్టపడి చేసిన రుచికరమైన పరాటాలు తనకి నచ్చాయని ఒప్పుకోకపోవడం తప్పనిపించింది అతనికి.

"పరాటాలు చాలా బావున్నాయి చిత్రా.they were really delicious." అన్నాడు ఈశ్వర్ కిచెన్ నుండి వస్తూ. తన భర్త ఇంగ్లీష్ లో చెప్పింది అర్థం కాకున్నా మొదటి వాక్యానికి సంబంధించిందే అయి ఉంటుందని భావించింది చిత్ర.

"అవునా. తాంక్స్. చానా తాంక్స్. మంచిగ కాలేదేమో అనుకున్నసలు." అంది చిత్ర, తనకు లోపల నుండి పొంగుకొస్తున్న సంతోషాన్ని కాస్త అణుచుకుంటూ. తనకు ఇంకా ఆ విషయం పై మాట్లాడాలని ఉన్నా , వ్యవహారం చెడిపోతుందేమో నని భావించి అంతే మాట్లాడింది చిత్ర.

రోజు లాగే తన కాళ్ళకి వాకింగ్ షూస్ తొడుక్కుని వాకింగ్ కి బయలుదేరాడు ఈశ్వర్. చిత్ర కు ఏదో స్ఫురించినదై , వడి వడిగా తలుపు దెగ్గరికి పరిగెత్తింది. లిఫ్ట్ దెగ్గర నిలబడి లిఫ్ట్ కాబిన్ కోసం ఎదురుచూస్తున్న చిత్ర ఈశ్వర్ తో

"ఇదో... వొచ్చేటప్పుడు జెర మీరా షాంపోలు తెస్తవా? నేను మొన్న రెండు రోజులు పాలు తెస్తి జుడు. ఆ అంగట్ల దొరుకుతయ్. జెర తెయ్యి." అంది చిత్ర.

సరేనని తలూపాడు ఈశ్వర్.

"ఇదో ...చిల్లరుందా మళ్ళ? గా షాపామె ఊకె చిల్లర లెవ్వంటది."

తన శరీరం లోని ఓపికనంతా కూడదీసుకుని చిత్ర తో "చూడు చిత్రా,each meera shampoo costs 2 rupees each. నా దెగ్గర10 rupees note ఉంది purse లో.5 sachets కొంటాను. అప్పుడు ఆమె వైపు చిల్లరేం ఉండదు. సరేనా?" అన్నాడు ఈశ్వర్.

"మంచిది." అంది చిత్ర.

తన మాటల్లోని వ్యంగ్యాన్ని చిత్ర అర్థం చేసుకోలేదని అర్థం చేసుకున్నాడు ఈశ్వర్. ఇంతలో లిఫ్ట్ క్యాబిన్ వాళ్ళుండే ఐదవ అంతస్థుకి వచ్చింది. అందులోంచి చందర్ రావు బయటకి వచ్చాడు.

రాబోవు వారం రోజులకు తలకు మించిన భారాన్ని మోపిన తన బాస్ పై రుసరుసలాడుతూ తన ఇంటి కాలింగ్ బెల్ ని మూడు సార్లు నొక్కాడు ఈశ్వర్. తలుపు తెరుచుకుంది. కానీ తలుపు తెరిచింది చిత్ర కాదు... చందర్ రావు!

చందర్ రావు retired bank manager. ఈశ్వర్ వాళ్ళ పై ఫ్లోర్ లో ఉంటాడు.ఆయన భార్య రెండేళ్ళ క్రితం చనిపోయింది. ఆయన కొడుకు, కూతురు అమెరికా లో స్థిరపడ్డారు. ఆయన భార్య చనిపోయాక ఆయన అమెరికా వెళ్ళటం కానీ , లేక ఆయన సంతానం అమెరికా నుండి ఆయనని చూడటానికి వచ్చినట్టుగాకానీ ఈశ్వర్ చూడలేదెప్పుడూ.

తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని 'పట్టించుకోని ' వాడిగా ముద్రపడ్డ ఈశ్వర్ ని ఏనాడూ పలకరించలేదు చందర్ రావు. ఈశ్వర్ కూడా తన పై పడ్డ ముద్ర ని చెరిపేసుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు.!

డోర్ తెరుచుకున్నాక, ఎదురుగా చందర్ రావు ని చూసి కాస్త ఉలిక్కిపడి, తరవాత తేరుకుని, కృత్రిమమమైన నవ్వొకటి విసిరాడు ఈశ్వర్. ప్రతిగా చందర్ రావు కూడా ఒక నవ్వు విసిరాడు. చందర్ రావు డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి కూరగాయలు తరిగే పనిని కొనసాగించాడు. ఇంతలో చేతిలో గరిట తో వంటింట్లోనుంచి వచ్చింది చిత్ర.

* * *

గంట తరువాత వేడి, వేడి వెజ్ బిర్యానీ తయారయ్యింది.... చిత్ర, చందర్ రావులు ముద్ద నోట్లో పెట్టుకున్న ఈశ్వర్ వైపు ఏం చెబుతాడోనని ఆతురుతతో చూస్తున్నారు. ఈశ్వర్ కి వాళ్ళ ముఖాలల్లోని కుతూహలాన్ని చూసి, వాళ్ళని ఆటపట్టించాలనిపిచింది. ముఖం లో ఏలాంటి భావోద్వేగాన్ని ఉంచకుండా ఇంకో రెండు ముద్దలు తిన్నాడు ఈశ్వర్. కుతూహలాన్ని ఆపుకోలేకపోయింది చిత్ర.

"ఎట్లుంది?" అని అడిగింది.

చందర్ రావు కూడా అంతే కుతూహలం తో ఈశ్వర్ సమాధానానికై ఎదురు చూస్తున్నాడు. పక్కన ఉన్న నీళ్ళ గ్లాసు తీసుకుని, కొన్ని నీళ్ళు తాగాడు ఈశ్వర్. చిత్ర, చందర్ రావులు ఒకరి ముఖాన్ని మరొకరు చూసుకోసాగారు.

"బావుంది. in fact super గా ఉంది." అన్నాడు ఈశ్వర్.

చిత్ర, చందర్ రావులు గత రెండు గంటలుగా పడ్డ కుస్తీలో ఎట్టకేలకు విజయం సాధించినట్టుగా భావించుకుని, ఒకరి ముఖాన్ని మరొకరు చూసుకుంటూ "హమ్మయ్య" అనుకున్నారు.

తూకం తో కొలిచినట్టు తినే ఈశ్వర్, తేన్పులు తీస్తూనే బిర్యాని లాగించాడు. తన చుట్టూ మరో ఇద్దరు ఉన్నారన్న విషయాన్ని మరచి, తన్మయత్వం తో తినసాగాడు ఈశ్వర్. చాలా రోజుల తరవాత అలా తన్మయత్వం లో తనను తాను మరచిపోతూ భోంచేసాడతడు. చిత్రకు అలా తింటున్న ఈశ్వర్ ని చూసి చాలా సంతోషమేసింది. తన భర్త ను చూస్తున్నప్పుడు చిత్ర కళ్ళల్లోని మెరుపు చూసి చందర్ రావు కు ముచ్చటేసింది. చిత్రను, ఈశ్వర్ ని చూసి ఆయనకు తన సంతానం గుర్తుకు వచ్చారు.

కడుపు నిండా తిని తన ఎంగిలి కంచాన్ని తీసుకుని సింక్ వైపుగా వెళ్ళాడు ఈశ్వర్. "ఆయనకది అలవాటు" అంది చిత్ర చందర్ రావు వైపు చూస్తూ, ఈశ్వర్ చర్యకు సంజాయిషీ ఇచ్చినట్టుగా.

చిన్నగా నవ్వాడు చందర్ రావు. చందర్ రావుని తినమని చెప్పింది చిత్ర. తనకు బాక్స్ లో కొంచం కట్టివ్వమని, తన ఫ్లాట్ కి వెళ్ళి తింటానని కోరాడు చందర్ రావు. ఎక్కువ వద్దనీ, తనకు అరగదనీ, కొంచం మాత్రమే కట్టివ్వమని మరీ మరీ చెప్పాడు చందర్ రావు. ఆయన సూచనలనే అనుసరించింది చిత్ర.

ఈశ్వర్ ఫోన్ కి అమెరికా లో ఉన్న క్లైంట్ నుంచి కాల్ వచ్చింది. కాస్త విసుక్కుంటూనే ఫోన్ ఎత్తి మాట్లాడుతూ తన రూం లోకి వెళ్ళి లాప్ టాప్ ముందు కూర్చున్నాడు ఈశ్వర్. ఎప్పుడూ లేనిది ఈశ్వర్ కి తన పని పట్ల అసహనం కలిగినట్టుగా గుర్తించింది చిత్ర. ఒక వైపు ఈశ్వర్ని చూస్తూనే బిర్యానీ తింటూ వుంది చిత్ర. అతనలా ఒత్తిడికి లోనవటం ఆమెకు కాస్త ఆందోళన కలిగించింది. తన ఫోన్ సంభాషణను ముగించుకుని వాకింగ్ షూస్ వేసుకోబోయాడు ఈశ్వర్. ఎందుకో ఆ వేళ చిత్రకు ఈశ్వర్ ని కనిపెట్టుకోని ఉండాలనిపించింది చిత్రకు.

"వాకింగ్ కు నేను గూడ వస్త." అంది చిత్ర.

"అంటే గా పెద్దమన్షి పాపం ఎక్కువ తిననన్నడు. ఇంగ నేను వేస్టయిపోతదని జెర ఎక్కువ తిన్న. రాత్రి పూట అరగదని ఒద్దమనుకుంటున్న . గంతే ఇంగేమ్లే." అంది చిత్ర, కాస్త నిజాన్నీ, కాస్త అబద్దాన్నీ కలిపి చెబుతూ.

ఆమె ప్రతిపాదనకు కాస్త ఆశ్చర్యం వేసినా సరేనన్నాడు ఈశ్వర్.

* * *

గత పదిహేను నిమిషాలుగా ఇద్దరూ మౌనంగా నడుస్తూ వున్నారు. ఈశ్వర్ ముఖం లో కాస్త అసహనం కనిపిస్తోంది చిత్రకు. ఈశ్వర్ తో ఏదో ఒకటి మాట్లాడాలనిపించిందామెకు.

ఇంతలో ఈశ్వరే "ఆయన పేరేంటో ఉండే?! ...అదే ఇందాక మన ఇంటికి వచ్చిన ఆయన." అన్నాడు ఈశ్వర్.

"చందర్ రావు. రెండు రొజులు పాలు కొననీకి పోతి గద. అప్పుడు షాపు కాడ పరిచెయమయిండె. పాపం ఒక్కడే ఫ్లాట్ ల ఉంటడు. చానా మంచోడు ." అంది చిత్ర.

" ఈరోజటి బిర్యానీ ఎట్ల జేయాల్నో గాయన్నే జెప్పిండు. పాపం కూరగాయలు సన్నగ తరిగిచ్చిండు. ఆయ్నకు తిండం కన్నా వొండడం ఎక్కువ ఇష్టం అంట. కానీ ఆయ్న ఒండి పెట్టనీకి వాల్లింట్లో ఎవ్వరు లేరు ఆయ్న తప్ప. అందుకే నేనే జెప్పిన మనింటికి రమ్మని. మస్తు సంతోషమయ్యిండే ఆయ్నకి." అంది చిత్ర, అవసరమైన దాని కన్నా ఎక్కువ సమాచారాన్ని ఇచ్చే తన అలవాటుకు బద్దురాలై.అన్ని రోజులుగా ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నా కనీసం ముఖ పరిచయం కూడా చేసుకోని తనకూ, ఇంటికి పిలిచి కూరగాయలు తరిగించేంత 'నేర్పు ' గల చిత్రకూ చాలా వ్యత్యాసమున్నట్టుగా అనిపించింది ఈశ్వర్ కి.

" హా. ఒక్కడే కనిపిస్తూ ఉంటాడు పాపం. వాళ్ళ పిల్లలు abroad లో సెటిల్ అయ్యారంట." అన్నాడు ఈశ్వర్.

"అబ్రాడ్ ల కాదు, అమెరికా ల" ఈశ్వర్ ని సరిచేసింది చిత్ర.

చిత్ర ఇంగ్లీష్ ప్రావిణ్యాన్ని చూసి లోలోన నవ్వుకున్నాడు ఈశ్వర్.

ఒక్కసారి తన ఇష్టదైవమైన కృష్ణుడిని తలుచుకుని,

"ఏమి అట్లున్నవ్ ఆఫీస్ కెళ్ళి సాయంత్రమొచ్చినప్పుడు?" తాను వాకింగ్ కి వచ్చిన కారణం పై పని చేయటం ప్రారంభించింది చిత్ర.

" అదా...work tensions. ఎప్పుడూ ఉండేవే. client requirements ఎక్కువగా ఉన్నాయి. మాకు టైం తక్కువగా ఉంది. మా టీం లో ఇద్దరు లీవ్ లో ఉన్నారు. వన్ వీక్ లో ఫినిష్ చేయాలి అంట. మా టీం లో నాకు తప్ప ఆ language రాదు. సో, ఆ పని మొత్తం నా మీదికే తోసాడు మా బాస్." వివరించాడు ఈశ్వర్.

ఈశ్వర్ తనకు అంత విపులంగా తన పరిస్థితిని వివరిస్తుంటే చాలా సంతోషమేసింది చిత్రకు. అతను చెప్పింది పూర్తిగా అర్థం అవ్వకున్నా, సంగ్రహంగా అర్థం అయ్యిందామెకు. రాబోవు వారం రోజుల్లో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నైనా రాబోవు వారం రోజులు తన భర్తకు అనుకూలంగా వ్యవహరించాలనుకుంది చిత్ర.

చిత్ర తన అసహనాన్ని గుర్తించగలగడం చాలా ఆశ్చర్యంగా తోచింది ఈశ్వర్ కి. అమృత మరణం తరువాత అలా మనస్పూర్తిగా బాగోగులు ఇంకొకరిచేత అడిగించుకునీ చాలా ఏళ్ళైన విషయం అతనికి గుర్తుకు వచ్చింది. ఏదో తెలియని భావుకత కలిగిందతడికి. కానీ, అతని మస్తిష్కానికి అమృత గుర్తుకు రాసాగింది. అసలు తన 'ప్రాణానికి ప్రాణమైన ' 'తన అమృత ' తనకు అస్సలు తరచుగా గుర్తురాకపోవడాన్ని గుర్తించాడు ఈశ్వర్.వెంటనే చిత్ర పట్ల అతనికి ఏర్పడ్డ భావుకత పై అమృత పట్ల అతను చూపించే ' విధేయత ' అనే పొర కమ్మింది. అతని ముఖకవళికల్లో మార్పుని గమనించింది చిత్ర. తన భర్త కి అమృత గుర్తొచ్చినట్టుగా ఊహించి, అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టగూడదని నిర్ణయించుకుంది చిత్ర. అతనితో ఏదో వేరే విషయాన్ని గూర్చి మాట్లాడి అతని ఆలోచనలను మళ్ళించాలనుకుంది చిత్ర.

"నువ్వు ఎంత దూరం నడుస్తవ్ రోజు?" అడిగింది చిత్ర.

"usually up and down కలిపి 1 kilometer నడుస్తా.but ఇరోజు ఎక్కువ నడుద్దాం అనుకుంటున్నా. ఎక్కువ తిన్నాగా అందుకే.i mean ఒక వేళ నీకు ఇబ్బందిగా ఉంటే నేను రోజు లాగే నడుస్తా." అన్నాడు ఈశ్వర్.

"లే అట్లేమ్లే. నాకు గూడ నడవడమంటే మస్తు ఇష్టం." అంది చిత్ర.." నీ తో నడవడం అంటే చాలా ఇష్టం" అని తన భర్త తో చెప్పాలనిపించింది ఆమెకి.

"ఓ. ఫైన్ ." అన్నాడు ఈశ్వర్.

కాస్త దూరం నడిచాక, తిరుగు ప్రయాణాన్ని ఆరంభించారు వాళ్ళిద్దరూ. తన భర్త అమృతని గుర్తుచేసుకుని, బాధ పడే కార్యక్రమాన్ని తన చాకచక్యతతో నిరోధించ గలిగినందుకు గాను లోలోన చాలా గర్వపడింది.

" నువ్వు చాలా ఫాస్ట్ గా నడుస్తున్నావ్. నైస్" మెచ్చుకోలుగా అన్నాడు ఈశ్వర్.

"హా. ఊళ్ళ బాగ అలవాటు నడవడం. జెర ఊరు బయట ఉంటమ్మేం. ఏ పనికయినా ఊళ్ళకు పొవ్వాలె. కిలోమీటరు దూరం ఉంటది." అంది చిత్ర.

ఇంతలో చల్లని గాలి ఈశ్వర్ ముఖాన్ని తాకింది. వెచ్చని వులెన్ స్వెటర్ ధరించిన అతడికి ఒంటిపై పెద్దగా చల్లగా అనిపించలేదు. కానీ చిత్ర ఆ చలి వల్ల కాస్త వణకడం గమనించాడతడు.

"స్వెటర్ వేసుకురాలేదా?" అన్నాడు ఈశ్వర్.

"స్వెటర్ లేదు." అని కళ్ళతోనే బదులిచ్చింది చిత్ర.

చిత్ర ని చూసి, జాలి, అపరాధభావం కలగలిసిన భావోద్వేగం కలిగింది ఈశ్వర్ కి. కానీ తాను చిత్ర ని జాలిగా చూస్తే ఆమె అత్మాభిమానం దెబ్బతింటుందేమో నని అనిపించింది ఈశ్వర్ కి.

" ఇంటికి వెళ్ళాక order చేద్దాం sweater." అన్నాడు ఈశ్వర్.

"అట్లే." అంది చిత్ర.

'order' చేయటానికి అదేమైనా మసాలా దోశ నా అని సందేహం కలిగింది చిత్రకు.

ఇంటికి చేరుకున్నాక చిత్రను పక్కన కూర్చోబెట్టుకుని , లాప్ టాప్ లో amazon website ని open చేశాడు ఈశ్వర్. అందులో రకరకాల స్వెటర్ బొమ్మలు వస్తున్నాయి.

"అవునూ, నీ సైజ్ ఏంటి?" అడిగాడు ఈశ్వర్.

" అంటే?" తిరిగి ప్రశ్నించింది చిత్ర.

"స్వెటర్ వేసుకోవటానికి నీ సైజ్ ఏంటి" విపులంగా చెప్పాడు ఈశ్వర్.

"ఏమో." అంది చిత్ర.

ఈశ్వర్ ఒక్కసారి తన పక్కన కూర్చున్న చిత్ర యొక్క మెడ నుంచి ఉదర భాగం వరకూ పరికించి చూశాడు 'తొలిసారిగా'!

ఒక్క క్షణం అతని కంటి చూపు ఆమె యొక్క బిగువైన కుచ ద్వయం దగ్గర ఆగింది. చిత్ర యొక్క కుచద్వయం చాలా నయన మనోహరంగా తోచిందతడికి. మరుక్షణం తనను తాను తమాయించుకుని తన చూపు పక్కకు తిప్పుకున్నాడు. తన భర్త అలా తనను 'చూస్తుంటే' చిత్ర ధమనుల్లోని రుధిరం ఉరకలు వేయసాగింది. తన ఒంటి తాను తట్టుకోలేనంత తాపం పుట్టింది. ఒక్కసారిగా తన భర్త తనను గట్టిగా పట్టుకుంటే బావుండు అనిపించింది. రాతిలా ధృడంగా ఉండే అతని యెదకు ఆమె యొక్క కుచములని అతడు అదిమి పట్టింటే బావుండు అనిపించింది ఆమెకు. తనను తాను శాంత పరుచుకునేందుకు అప్రయత్నంగా ఒక నిట్టూర్పు విడిచింది చిత్ర.

చిత్ర యొక్క మోము పై ఉన్న హావభావాలని గ్రహించగలిగాడు ఈశ్వర్! చిత్ర వైపు నుండి తన చూపును లాప్ టాప్ వైపు తిప్పుకుని "actually ఇక్కడ ఎక్కువ models లేవు. రేపు ఉదయం మనం షాప్ కి వెళ్ళి కొందాం . సరేనా?" అన్నాడు ఈశ్వర్.

సరేనంది చిత్ర తన భర్త యొక్క ఆంతర్యాన్ని గ్రహించి. తన మనస్సులో చనిపోయిన అమృతని క్షమాపణలు కోరుకుంటూ తన గది లోనికి వెళ్ళాడు ఈశ్వర్.

మరుసటి రోజు ఉదయాన్నే స్వెటర్ కొనడానికి చిత్ర, ఈశ్వర్ లు బయల్దేరారు తమ స్విఫ్ట్ కార్ లో.

"అవ్నూ ఈ కార్ల పాటలొస్తయా?" అడిగింది చిత్ర.

"వస్తాయి... కానీ ప్రస్తుతం పాటలు లేవు." బదులిచ్చాడు ఈశ్వర్.

"ఏమైనా పాటలు వినాలని ఉందా?" మళ్ళీ తనే అడిగాడు ఈశ్వర్, హైదరబాద్ ట్రాఫిక్ అలవాటులేని చిత్ర కు విసుగు కలుగుతుందేమో నన్న అనుమానం కలిగిన వాడై.

"లేవన్నవ్ గద." అంది చిత్ర.

"Download చేస్తా. చెప్పు ఏ పాటలు వింటావు?" అడిగాడు ఈశ్వర్.

".......మహేష్ బాబు వి ఉన్నయా?" ఉత్సాహంగా అడిగింది చిత్ర. సంగీత దర్శకుడి పేరో, గాయకుడి పేరో, కనీసం సినిమా పేరు కూడా చెప్పకుండా నటుడి పేరు చెప్పడం కాస్త వింతగా తోచింది ఈశ్వర్ కి.

" ఏ మూవీ సాంగ్స్ కావలి మహేష్ బాబు వి?" అడిగాడు ఈశ్వర్.

" పోకిరి... కాదు కాదు మురారి. మురారి పాటలు పెడ్తవా ? చానా రోజులైంది యినీ." అంది చిత్ర.

తన ఫోన్ లో మురారి పాటలు Download చేసి, కార్ లో ఉన్న music system ద్వారా ప్లే చేసాడు ఈశ్వర్.

ట్రాఫిక్ మెల్లిగా కదల నారంభించింది.

' ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక....' పాట ప్లే అవుతూ ఉంది.

" మస్తు ఉంటది గద ఈ సినిమ " అంది చిత్ర అప్రయత్నమైన ఉత్సాహం కలదై.

"ఏమో నాకు మరీ అంతగా నచ్చలేదు" బదులిచ్చాడు ఈశ్వర్ నిజాయితీగా.

" అవునా ! ఏం నచ్చలే నీకు అందుల ?! మహేష్ బాబు ది నాలుగో సినిమా అది. మస్తు జేశిండు ఐనా గూడా. లాస్ట్ లయితే ఏడుపు ఒస్తది మస్తు... గదే గాయ్న కడుపుల గడ్డ పార కుచ్కున్నప్పుడు." అంది చిత్ర.

"హో.. ఏమో నాకైతే boring గా అనిపించిండె మూవీ." అన్నాడు ఈశ్వర్.

"ఏడ ఏడనిపించిండె బోర్ ?! మహేష్ బాబు మస్తు జేశిండు గద ఆ సినిమాల" అంది చిత్ర.

చిత్ర యొక్క 'fanism' అర్థమైంది ఈశ్వర్ కి. fans తో ఎందుకొచ్చిన తంటా అని

" హా... ఔను బానే ఉంటుంది మూవీ. క్లైమాక్స్ లో నిజంగా మహేష్ బాబు బాగా చేసాడు." అన్నాడు ఈశ్వర్.

ఈశ్వర్ యొక్క ఆంతర్యాన్ని గ్రహించింది చిత్ర.

"ఐనా.... నాకు నచ్చితే నీకు గూడ నచ్చాలే అని లేదు లే. నీకు నచ్చకపొయ్యిండొచ్చు లే."అంది చిత్ర.

తన ఉద్దేశాన్ని చిత్ర గ్రహించగలిగిందని గ్రహించగలిగాడు ఈశ్వర్.

"నాకైతే మహేష్ బాబు ప్రతి సినిమాల నచ్చుతడు. ఆయ్న వి ఏ సిన్మా అయ్నా నాకు నచ్చుతది." అంది చిత్ర చిరునవ్వుతో.

"ఔనా !!! ఆగడు కూడా నచ్చిందా ఐతే ?!!!" వెటకారంగా అన్నాడు ఈశ్వర్.

" ఆ సిన్మాల గూడ మహేష్ బాబు మస్తు జేసిండు. సిన్మా తీసేటొళ్ళు సక్కగ తియ్యలే అంతే." అంది చిత్ర సంజాయిషీ ఇస్తున్నట్టుగా.

"హం .ఓకే." అన్నాడు ఈశ్వర్ , మహేష్ బాబు ను గూర్చిన చర్చ ముగించదలచిన వాడై.

వాళ్ళ కారు ట్రాఫిక్ లో అతి మెల్లిగా కదులుతూ ఉంది.

ఒక్కొక్కటిగా మహేష్ బాబు సినిమాల పాటలు వింటూ ఉన్నారు ఇద్దరూ.

' పుచ్చకాయ, పుచ్చకాయ తీపి పెదవి నువ్వు ఇచ్చుకోవె . ఇచ్చుకోవె ...' పాట ప్లే అవుతూ ఉంది.

మాటల్లో వాళ్ళు చేరాల్సిన షాపింగ్ మాల్ వచ్చేసింది.

" ఎన్ని కిలోమీటర్ల దూరం ఒచ్చినం ఇప్పుడు మనం ?" అడిగింది చిత్ర.

"four or five kilometres" అన్నాడు ఈశ్వర్.

"గంటన్నర కెళ్ళి మనం పొయింది గింతేనా ? దీనికి బదులు నడిచి పోతే అర్ద గంటల ఒస్తుంటుమి గద ?!" అంది చిత్ర.

నవ్వాడు ఈశ్వర్. తన భర్త యొక్క నవ్వుని చూసి, తన మనస్సులో నవ్వింది చిత్ర.

ఇంద్రభవనాన్ని తలపించే షాపింగ్ మాల్ ని చూస్తూ ఉంది చిత్ర. ఆమె కళ్ళు షాపింగ్ మాల్ లోని ప్రతి అణువునూ ఆశ్చర్యం తో చూస్తున్నాయి. చిత్ర కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని చూసి, ఈశ్వర్ కి కాస్త ముచ్చటేసింది.

మెడ పట్టుకు పోతుందా అన్నంతగా దిక్కులు చూస్తూ ఉంది చిత్ర. అక్కడ పొట్టి , పొట్టి బట్టలేసుకున్న ఆడవాళ్ళని చూసి కాస్త ఏవగింపు కలిగింది చిత్రకు.

అక్కడ తినుబండారాలు అమ్మడాన్ని గమనించింది చిత్ర. చిత్ర ఫుడ్ కోర్ట్ వైపు చూడటాన్ని గమనించాడు. ఆమెకు ఆకలి వేస్తుందేమో నన్న భావన కలిగిందతడికి.

" మనం ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో. ఇక్కడే తినేసి వెళ్దామా? this place looks hygenic " అన్నాడు ఈశ్వర్.

ఇంతకు మునుపోసారి తన భర్త 'hygenic' అన్న పదాన్ని వాడినప్పుడు 160 రూపాయలు ఖర్చైన విషయం గుర్తుకు వచ్చింది చిత్రకు. కానీ అక్కడ ఫుడ్ కోర్ట్ దెగ్గర కూర్చుని భాగస్వాములతో పాటు తింటున్న స్త్రీలని చూసి, తనకు కూడా తన భర్త తో కలిసి అలా తినాలనిపించింది చిత్రకు. తన భర్త సంపాదించే 2 లక్షల రూపాయల్లో ఒక సారి 100, 200 రూపాయలు ఖర్చుపెడితే తప్పులేదని సర్ది చెప్పుకుంది చిత్ర. తను కాస్త తెలివిగా పొదుపు చేస్తే ఇద్దరూ ఇప్పుడు కలిసి తింటున్న డబ్బులను కవర్ చేయొచ్చని సర్దిచెప్పుకుంది.

"అట్లే... ఈడ దోషలు దొరుకుతయా?" అంది చిత్ర.

"ఇక్కడ దోషలు, ఇడ్లీలు దొరకవు చిత్రా."

"మరి?"

"ముందు లోనికి వెళ్దాం."

"అట్లే" అంది చిత్ర, తన భర్త మాటలోని చిరు వ్యంగ్యం చాలా 'ఆకర్షణీయంగా ' తోచిందామెకు.

ఫుడ్ కోర్ట్ లోపల కూర్చుంటూ "బర్గర్ తింటావా?" అని అడిగాడు ఈశ్వర్.

"బర్గర్ అంటే లావుగ బన్ను లాగుండి, టి.వి లల్ల కనిపిస్తది జూడు, అదేనా?" అడిగింది చిత్ర.

"హా అదే, అదే." చిత్ర అంత 'త్వరగా' గుర్తించినందుకు ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్.

"తింట!" ఉత్సాహంగా చెప్పింది చిత్ర.

రెండు వెజ్ చీజ్ బర్గర్ లను ఆర్డర్ చేయ దలిచాడు ఈశ్వర్.

"అవును, నువ్వు non-veg తింటావు కదా?" అడిగాడు ఈశ్వర్ 'తియ్యగా'.

"తింట" అంది చిత్ర . అనవసరంగా నిజం చెప్పానేమో నని అనిపించింది ఆమెకి.

"మరి.... ఎప్పుడు non-veg తినట్లేదేంటి నువ్వు?" అడిగాడు ఈశ్వర్ చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మాంసం విషయం లో చిత్ర ఏదో గూడుపుఠాణి పన్నుతోందన్న భావన కలిగిందతడికి!

"అంటే... నీకు non-veg నచ్చదని అత్తయ్య చెప్పిండె. అందుకే ఇంగ మానేశ్న" బదులిచ్చింది చిత్ర, నిజాయితీగా తన భర్త కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాట అతనికి చెబుతున్నప్పుడు చాలా సంతోషం కలిగిందామెకు.

ఈశ్వర్ కి అస్సలు నచ్చలేదు ఆమె చెప్పిన సమాధానం.

"చికెన్ బర్గర్ చెప్తాను ఓకేనా? తిందువు కాని. చాలా టేస్టీ గా ఉంటుంది. పాపం మీ పెంట్లవెల్లి లో అవి ఎక్కువగా దొరకకపోయుంటాయి." అన్నాడు ఈశ్వర్.

"అయ్య! ఉండన్లే, ఎందుకు. నువ్వు తినేదే నాకు కూడ జెప్పు." అంది చిత్ర.

"చికెన్ ఇష్టమో కాదో చెప్పు నువ్వు అంతే!" అన్నాడు ఈశ్వర్ కళ్ళల్లో, మాటలో కాస్త గాంభీర్యాన్ని ఒలకబోస్తూ.

"హా ఇష్టమే" అంది చిత్ర.

వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చాడు ఈశ్వర్. చేసిన ఆర్డర్ రావటానికి వాళ్ళు ఇద్దరూ వేచి వుండసాగారు.

తన భర్త తనతో చికెన్ బర్గర్ ఎందుకు 'తినిపిస్తున్నాడో' మెల్లి మెల్లిగా అర్థం అవుతోంది చిత్ర కు. ఆమె మనస్సు చివుక్కుమంది. తన ముందే కూర్చున్నా, తన భర్త ఒక్క సారిగా వెయ్యి అడుగులు దూరంగా వెళ్ళిన భావన కలిగిందామెకు.

"చికెన్ బర్గర్ చెప్తాను ఓకేనా? తిందువు కాని. చాలా టేస్టీ గా ఉంటుంది. పాపం మీ పెంట్లవెల్లి లో అవి ఎక్కువగా దొరకకపోయుంటాయి." అన్నాడు ఈశ్వర్.

" ఏమి ఆలోచిస్తున్నవ్ ?" అడిగింది చిత్ర, ఆ ప్రశ్న అడిగిన మరుక్షణం , అనవసరంగా అడిగానేమో నన్న భావన కలిగింది చిత్ర కు. తన ప్రశ్న అమృత గురించి ఆలోచిస్తున్న తన భర్త ను మరింతగా బాధిస్తుందేమో నన్న భయం కలిగిందామెకి.

"ఏం లేదు, ఏం లేదు"అన్నాడు ఈశ్వర్ తేరుకుని, చిత్ర వైపు తాను తదేకంగా చూస్తున్నట్టు గుర్తించినవాడై.

కృత్రిమమైన చిరునవ్వొకటి తన మోము పై ఉంచింది చిత్ర. ఈశ్వర్ కి చిత్ర ముఖం పై ఉన్న చిరునవ్వు తనను ఎప్పుడెప్పుడు ఆమె చూసినప్పుడు కలిగే చిరునవ్వు కంటే వేరేగా ఉందని అనిపించింది. ఈ నవ్వు కన్నా ఆమె అలవాటుగా చేసే చిరునవ్వే బాగున్నట్టుగా అనిపించిందతడికి.

ఇంతలో వెయిటర్ చికెన్ బర్గర్, వెజ్ బర్గర్ లను తీసుకుని వచ్చాడు.

"చికెన్ ది ఈడ పెట్టు అన్నా." అంది చిత్ర, వెయిటర్ తో.

చికెన్ బర్గర్ తింటున్న చిత్ర కి, జీవితం లో మొదటి సారిగా మాంసాన్ని తింటున్న భావన కలిగింది. తనకు అలా అనిపించడం తనకే ఆశ్చర్యంగా తోచింది.

ఈశ్వర్ కౌంటర్ దెగ్గర బిల్ కడుతూ ఉన్నప్పుడు చిత్ర చేతుల్లో చేతులు వేసుకుంటూ నడుస్తున్న జంటల్ని చూస్తూ ఉంది. ఈశ్వర్ బిల్ కట్టడం ముగించిన విషయాన్ని గమనించి, బిల్ ఎంతయిందో చూసుంటో బావుండుననుకుంది.

"రా... ఫష్ట్ ఫ్లోర్ కి వెళదాం. స్వెటర్స్ అక్కడ ఉంటాయ్ " అన్నాడు ఈశ్వర్,

" సరే" అంది చిత్ర.

ఈశ్వర్ ఆమెను escalator వద్దకు తీస్కెళ్ళాడు.

"అబ్బ ఇదెక్కాల్నా ఇప్పుడు? మెట్లు లెవ్వా పైకి పోనీకే?" అడిగింది చిత్ర కాస్త భయపడుతూ.

"ఏ ఏమైంది? భయమా నీకు ఇది?" అడిగాడు ఈశ్వర్.

"హా."

"హేయ్, ఏం కాదు నేనున్నా కదా, చూడు ఎంత మంది వెళుతున్నారో , ఇది danger ఐతే వాళ్ళు అలా ఎక్కి వెళ్తారా చెప్పు." ధైర్యం చెప్పాడు ఈశ్వర్.

"ఏమో నాకు భయమేస్తది గది." అంది చిత్ర.

"శ్... ఏమవ్వదు! రా నా చేయి పట్టుకో. నన్ను పట్టుకుని ఉండు. 10 seconds లో వెళ్తాం మనం." అని ఆమె చేయి పట్టుకుని escalator పై అడుగు వేసాడు ఈశ్వర్.

చిత్ర భయంగా అతని చేతి గట్టిగా పట్టుకుని , కళ్ళు మూసుకుంది. escalator పై రెండు, మూడు క్షణాల తరువాత ఆమె కళ్ళు తెరిచింది.ఈశ్వర్ ఆమె వైపే చూస్తున్నాడు. కళ్ళు తెరిచిన ఆమెతో

'ఒకేనా?' అన్నట్టుగా సైగతోనే అడిగాడు ఈశ్వర్.

తలూపింది చిత్ర. చిత్రకు తన భర్త తన పట్ల ఆ క్షణం చూపించిన శ్రద్ద బాగా నచ్చింది. ఒక్క క్షణం స్వెటర్లు ఇంకా పై అంతస్థులో ఉండింటే బాగుండు అనిపించింది!

ఆమె కోరుకున్నట్టుగానే పెద్దల బట్టలు నాలుగో అంతస్థులో ఉన్నట్టుగా తెలుసుకున్నారు ఇద్దరూ. escalator దగ్గరకు రాగానే చిత్ర ఈశ్వర్ యొక్క మోచేయి, భుజం మధ్య భాగాన్ని పట్టుకుంది. అతని చేతి కండరాలు చాలా కరుకుగా తోచాయి ఆమె అరచేతికి. కావాలని అతన్ని పట్టుకున్నందున తన భర్త వైపు చూడాలంటే కాస్త సిగ్గేసింది చిత్రకు. తన చూపు నేరుగా, తన ఎదురుగా పెట్టుకుని escalator పై నిలబడింది. పై అంతస్థు రాగానే, ఈశ్వర్ ఆమెతో " ఇదిగో ఈ ఫ్లోర్ కూడా వచ్చింది. ఏమైనా అయ్యిందా చెప్పు!" అన్నాడు.

"అవునవును , ఏం గాలేదు నువ్వన్నట్టే." అంది చిత్ర.

ఈశ్వర్ కి ఆమె మాటల్లో కించిత్ వెటకారం ధ్వనించి నట్టుగా అనిపించింది.

రెండవ అంతస్థులో ని సేల్స్ గర్ల్ వద్దకు వెళ్ళి, చిత్రని చూపిస్తూ ఆమెకు స్వెటర్ చూపించమని అడిగాడు ఈశ్వర్. రెండు , మూడు వేసుకుని చూసి ఆఖరుగా నీలం రంగు స్వెటర్ ని ఎంపిక చేసుకున్నారు వాళ్ళు.చిత్రకు ఆ స్వెటర్ చాలా బాగా నచ్చినట్టుగా గ్రహించాడు ఈశ్వర్.

ఈశ్వర్ ఆ సేల్స్ గర్ల్ కి ఆ స్వెటర్ ని ప్యాక్ చేయమని ఇస్తున్నప్పుడు చిత్ర ఆ స్వెటర్ వెల రూపాయి తక్కువ నాలుగు వేలు గా చూసింది! వెంటనే ఆమె

" ఇదొద్దులే, ఇంగోటి కొందం.అస్సలిక్కడనే ఒద్దు. ఇంగో చోట కొందం." అంది.

చిత్ర వైపు వింతగా చూస్తున్న సేల్స్ గర్ల్ కి స్వెటర్ ని ప్యాక్ చేసి, బిల్ సిద్దం చేయమని చెప్పాడు ఈశ్వర్. చిత్ర ఏదో అనబోతుంటే నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసాడు. ఈశ్వర్ కి స్వెటర్ పైన ఉన్న వెల నే కారణమేమో నన్న భావన కలిగింది.

సేల్స్ గర్ల్ వెళ్ళాక, చిత్ర తో" ఎమైంది? ఏంటి నీ problem అసలు?" అన్నాడు ఈశ్వర్ , సమాధానాన్ని ఊహిస్తూనే.

" చలి కోటుకి నాల్గు వేలా ?! ఎవడన్న కొంటడా అట్ల ?!" అంది చిత్ర.

" మరి చలికి వణికితే బావుంటుందా?"

" అయ్తే మాత్రం నాల్గు వేలా ?! మా మామ పెళ్ళప్పుడు నాకు ఇప్పిచ్చిన పెళ్ళి చీరనే 2200 పడిండె." అంది చిత్ర.

ఈశ్వర్ కి ఆ పోలిక కాస్త వింతగా తోచింది.

" అయ్నా, రోజు చలి ల ఏడికి పోత నేను ?" మళ్ళీ తానే అంది చిత్ర.

" ఈ రోజు నుంచి రోజూ మనిద్దరం కలిసి ఈ నాలుగు వేల స్వెటర్ కోసమైనా వాకింగ్ కి వెళ్దాం. సరేనా ?" అన్నాడు ఈశ్వర్ కాస్త ఆయాసంగా, మాటవరసకు, అప్పుడు చిత్ర ని అదుపుచేయ దలచిన వాడై.

"ఏదోలే!" అని ముఖాన్ని అటువైపు తిప్పుకుని ముడుచుకుంది చిత్ర, డబ్బులు దండగ ఐపోతున్నాయని.

తను ఈ స్వెటర్ అనే మిష చేత నిన్నటి మాదిరి వాకింగ్ కి వెళ్ళొచ్చని తట్టింది చిత్ర బుర్రకి.

ఈశ్వర్ వైపు తిరుగుతూ చిరునవ్వుతో "అట్లనే గానిలె. నీ ఇష్టం ఇంగ" అంది.

ఎట్టకేలకు స్వెటర్ వివాదం సద్దుమణిగినందుకు ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్.

వాళ్ళు స్వెటర్ కొనుగోలు ముగించుకుని, బయటకు వస్తున్నప్పుడు ఫుడ్ కోర్ట్ వైపు చూస్తూ,

' బాబోయ్, బర్గర్ లకు ఐదు వందలు అయ్యాయని చిత్ర చూడలేదు, బతికిపోయా.' అనుకున్నాడు మనసులో.

* * *

ఆ రోజు రాత్రి భోజనం చేసాక, తన వాకింగ్ షూస్ వేసుకుని వాకింగ్ కి సిద్దపడ్డాడు ఈశ్వర్. అతను షూ లేసులు కట్టుకుంటూ ఉంటే అతని ముందు పాదాల జత ఒకటి ఒచ్చి ఆగింది. తల పైకెత్తి చూశాడు... పొద్దున కొన్న నీలం రంగు స్వెటర్ వేసుకుని, వాకింగ్ కి తయారయి నిలబడింది చిత్ర!​
Next page: Update 09
Previous page: Update 07