Update 12

వారి కళ్ళల్లో తన పట్ల కాస్త భయం కనిపించింది ఈశ్వర్ కి. ఇందాక తను చిత్ర తో ' ప్రయత్నించిన ' ప్రవర్తన వల్ల ఆ పిల్లలు బాధ పడ్డారేమో నన్న అపరాధ భావం కలిగింది ఈశ్వర్ కి. కనీసం ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకైనా ఏలాంటి ' ప్రయోగాలు ' చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్!

కంప్యూటర్ ముందు పని చేసుకుంటున్న తన భర్త అలసిపోయాడని గుర్తించి, అతని రూం దెగ్గరికి వెళ్ళింది చిత్ర.

కంప్యూటర్ లోని కోడింగ్ తో విసిగి, వేసారిన ఈశ్వర్ కళ్ళకు చిత్ర యొక్క నగుమోము ఉపశమనం లా తోచింది. ఆమె కళ్ళు, ఆమె నవ్వు, చాలా ఆకర్శణీయంగా తోచాయి ఈశ్వర్ కి.

"ఇదో, నేను చాయ్ తాగుదమనుకుంటున్న . నీగ్గూడ చెయ్యమంటవా ?" అడిగింది చిత్ర.

తనకు అలసటగా అనిపించి, తన నాలుక చాయ్ ని కోరుకున్నప్పుడే చిత్ర కు కూడా ఛాయ్ తాగాలని ఎలా అనిపిస్తుందోనని ఆశ్చర్యం కలిగింది ఈశ్వర్ కి.

తనకు తలనొప్పిగా ఉన్నప్పుడల్లా తన తలకు నూనె పెట్టి అమృత మర్దనా చేస్తుండే విషయం గుర్తొచ్చింది ఈశ్వర్ కి. ఒక్క క్షణం అతనికి చిత్ర తనకు దెగ్గరయ్యింటే బాగుండుననిపించింది. గత మూడేళ్ళుగా మనుషుల యొక్క ఆత్మీయ స్పర్శ లకూ, ఆత్మీయ మాటలకూ దూరమైన ఈశ్వర్ కి, చిత్ర తనతో రోజూ కాసేపు ఏదొ ఒక విషయం లో కబుర్లు చెప్పుంటే బావుండుననిపించింది.

" కొంచమే జేస్త. ఎక్కువేమి చెయ్య గాని. తాగుదువు. సరెనా ?" అంది చిత్ర, తన భర్త తన వైపు తీక్షణంగా చూస్తూ, ఏమీ మాట్లాడక పోయే సరికి.

" yeah yeah పెట్టు. actually నేనే నిన్ను tea అడుగుదామనుకుంటున్నా. " అన్నాడు ఈశ్వర్.

' తెలుసు గాన్లె. ' అని లోలోన నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళింది చిత్ర.

***

వాళ్ళింటి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని, ఈశ్వర్, చిత్ర లు ఛాయ్ తాగసాగారు.

" టీ చాలా బావుంది. " అన్నాడు ఈశ్వర్.

తన భర్త ఎదో బయటి వాళ్ళకు చెప్పినట్టుగా తాగిన ప్రతీసారి టీ బావున్నట్టు చెప్పనవసరం లేదనిపించింది చిత్ర కు. పనిలో పడి అలసిపోయిన తన భర్త కు రుచికరంగా ఛాయ్ చేయడం తన కనీస బాధ్యత అనీ, అది తన భర్త ఏదో ఘనకార్యం లా ప్రతీసారీ మెచ్చుకోవడం నచ్చలేదామెకి.

" నేను మంచిగనే జేస్త ఎప్పుడన్నా. " అంది చిత్ర కాస్త విసురుగా.

ఊహించని సమాధానం చిత్ర నుండి ఎదురయ్యేసరికి ఎలా స్పందించాలో తెలియక కృతకమైన చిరు మందహాసం చేసాడు ఈశ్వర్.

ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

వెళ్ళి తలుపు తీసిన చిత్రకు శ్రీజ, అభిరాం లు కనిపించారు.

" లోపటికి రా స్రీజా. " అంది చిత్ర ఆప్యాయంగా.

" ఉండని మేడం. మళ్ళి సారి వోస్తా. అది... వీడిది birthday ఇవాళ. evening party ఉంది. మీరు, సార్ తప్పకుండా రావాలి. " అంటూ , డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఈశ్వర్ ని వైపు చూస్తూ, " తప్పకుండా మీ ఇద్దరు రావాలి. " అంది శ్రీజ మరోసారి.

"sure", " సరే " , ఈశ్వర్, చిత్ర లు ఒకేసారి అన్నారు.

" హ్యాపీ బర్తుడే. " అంటూ అభిరాం బుగ్గను తడిమింది చిత్ర ఆప్యాయంగా.

ప్రతిగా మందహాసం చేసాడు అభిరాం. అభిరాం చేసిన మందహాసం చిత్ర కు బాగా సంతోషాన్ని కలిగించింది.

తన సుపుత్రుడికి అస్సలు నచ్చని ' బుగ్గ గిల్లుడు ' కార్యక్రమాన్ని చిత్ర చేసినా కూడా, వాడు అంత 'శాంతంగా ' స్పందించడం తో ఆశ్చర్యపోయింది శ్రీజ.

తన సుపుత్రుడి వైపే నవ్వుతూ చూస్తున్న చిత్ర వైపు చూస్తూ, ఆమెతో

" అంతే కాదు మేడం.. night ఏం వండకండి. అందరం కలిసి మా ఇంట్లోనే dinner చేద్దాం." అంది శ్రీజ.

సరే నని చెప్పబోయి, ఒక్కసారి ఈశ్వర్ వైపు చూసింది చిత్ర, అతని ఇష్టాన్ని అనుసరిద్దామనుకుని.

చిత్ర తన అభిప్రాయానకై తన వైపు చూడటాన్ని ఈశ్వర్ గమనించాడు. శ్రీజ అంత ఆప్యాయంగా పిలిస్తే వెళ్లకపోతే తప్పవుతుందన్న భావన వెలిబుచ్చాడు ఈశ్వర్ తన కళ్ళల్లో .

"వస్తమైతె తప్పకుండ." అంది చిత్ర, చిరు మందహాసం చేస్తూ.

తిరిగి మందహాసం చేస్తూ వెళ్తున్న శ్రీజ ని ఏదో గుర్తొచ్చినట్టుగా పిలిచింది చిత్ర.

" గదీ... వాచ్ మెన్ వోళ్ల పిల్లలు మా ఇంట్లనే ఉన్నరు. నా కిందాక గుర్తుకి రాలె. " అంది చిత్ర.

" ఓ... అవ్నవ్ను. ఊరెళ్తున్నామని చెప్పారు.. మీ ఇంట్లోనే ఉంచారా పిల్లల్ని?"

" హా అవ్ను, పొలం పంచాయితి అయితె పొయిర్రు. రేపో, ఎల్లుండో ఒస్తమని జెప్పిర్రు."

"ఓ అవ్నా.. అయినా పర్లేదు మేడం. వాళ్ళు కూడా వస్తారు లేండి. అందరం కలిసే భోంచేద్దాం." అంది శ్రీజ.

" నీకు గింత మందికి ఒండనీకి ఇబ్బందయితదేమొ గద. " అంది చిత్ర.

" అయ్యో, అలా ఏం లేదు. మీరెంత మంది ఒస్తే మేము అంత హాపీ." అంది శ్రీజ, కృత్రిమమైన చిరునవ్వు సంధిస్తూ, మచ్చు మీద పెట్టబడిన పెద్ద కుక్కర్ ని కిందికి దింపాలని ఆలోచిస్తూ.

" మంచిది అయ్తె. ఒస్తం మేమందరం." అంది చిత్ర, నిండుగా మంసహాసం చేస్తూ.

***

" ఇదో.... ఏమ్లే, గా చిన్నపిలగాని పుట్టిన దినం గద ఇరోజు, గందుకే కొవ్వొత్తి మీన గా పిలగాని పేరు చెక్కుదము అనుకుంటున్న. గా పిలగాని పేరు ఇంగ్లీశుల a..b..e..r..a..m ఏనా ?" అడిగింది చిత్ర, భోజనం ముగించుకుని, తన ప్లేట్ కడుక్కుంటున్న ఈశ్వర్ ని.

" abhiraam అన్నది proper noun. so you have that freedom to keep spelling as you wish. But if i were you, i would prefer A..b..h..i..r..a..a..m. " అన్నాడు ఈశ్వర్.

తాను కనీసం ఇంటర్మీడియట్ వరకైనా చదువుకుని ఉండింటే బాగుండుననుకుంది చిత్ర.

" నేను చిన్నగున్నప్పుడు గా వాకీల్ స్రీనివాసరావు పెద్ద బిడ్డ వైశ్నవి తోని బాగా దోస్తుగ ఉంటుంటి. గా పిల్ల వాళ్ళ మామ కాడికి వనపర్తి కి పొయినప్పుడు నేర్చుకుండెనంట, నాకు గూడ నేర్పిండె గప్పుడు, ఎండ కాలం సెల్వులల్ల. " అంది చిత్ర తనకు అబ్బిన కళ యొక్క పుట్టు పూర్వత్తరాలు ఉత్సాహంగా చెబుతూ.

" ఓ .. నైస్, బావుంటుంది. నాకు కూడా pencil carvings అంటే చాలా ఇష్టం. అమృ...."

' అమృత కి నేను ఇచ్చిన first gift కూడా pencil carving ఏ. ' అనబోయిన ఈశ్వర్ మాట మధ్యలోనే ఆగిపోయింది.

తన భర్త చనిపోయిన తన ప్రియురాలిని గూర్చే ఏదో విషయాన్ని ప్రస్తావించబోయాడని అర్థం చేస్కుంది చిత్ర. తను అస్సలు ఆ మాట ని విననట్టుగా తన భర్తకు భ్రమ కలిగించాలనుకుని,

" pencil carving ఆ , అంటే ఏంది ?! " అడిగింది చిత్ర.

చిత్ర ' అమృత ' అనే శబ్దాన్ని విననందుకు ఊపిరి పీల్చుకున్నాడు ఈశ్వర్!

" అదీ .. నువ్విప్పుడు candle పై చేస్తున్నావ్ కదా , అదే pencil carvings అయితే , pencil nib పై చేస్తారు. అంతే"

" అంటే పెన్సిలు మొలికి మీదనా ?"

" హా."

" అయ్య, మస్తు కష్టము గదా అట్ల."

" హా, బట్ , ట్రై చేస్తుంటే అదే వస్తుంది. కొంచం ఓపిక కావాలి అంతే." నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.

"ఓ"

ఒక నిమిషం పాటు సంశయం తరవాత, చిత్ర, తన భర్త తో

" ఇదో... నీకిప్పుడేమన్న అర్జంటు పనుందా ?" అడిగింది.

"urgent అంటే specific గా ఏం లేదు. ఏ ఎందుకలా అడిగావ్ ?" అడిగాడు ఈశ్వర్.

" జెర పక్కనుంటవా గిది చేస్తున్నప్పుడు. చానా రోజులయ్యింది చేశీ. మంచిగ రాదేమోనని బయమవ్తుంది. " అంది చిత్ర నిజాయితీగా.

***

తాను ఊహించిన దానికన్నా చిత్ర కు candle carving కళలో ప్రావీణ్యం చాలా తక్కువ ఉందని చాలా తక్కువ సమయం లోనే గ్రహించగలిగాడు ఈశ్వర్.

ఇద్దరూ కలిసి సాయంత్రం పార్టీ సమయానికల్లా candle carving పనిని పూర్తి చేసారు.

" మస్తు చేశ్న కద !" అంది చిత్ర తన కళాఖండాన్ని చూసి మురిసిపోతూ.

ఏం మాట్లాడాలో తెలియక అవునన్నట్టుగా మూలిగాడు ఈశ్వర్.

వాళ్ళింటి గోడ గడియారం ఆరు సార్లు కొట్టింది.

" ఆరయ్యింది. పార్టి కి తయారవుదమా ? పిల్లలు గూడ ఒచ్చే టయిమయ్యింది." అంది చిత్ర.

" హం " అన్నాడు ఈశ్వర్, అమృత చనిపోయిన తరువాత, తన పెళ్ళిని మినహాయించి వెళ్తున్న మొదటి వేడుక అని గుర్తు చేసుకుంటూ.

" నేను మళ్ళ పొయి, మొకము కడుక్కొనొస్త. మస్తు జిడ్డు జిడ్డు అయింది. అట్లనే జెర చీర గూడ మార్సుకుంట. " అంటూ స్నానాల గది వైపుగా నడిచింది చిత్ర.

***

కాలేజ్ నుండి వచ్చిన రేణుక, రాజేష్ లను వెంటబెట్టుకుని బయలుదేరారు ఈశ్వర్, చిత్ర లు.

లిఫ్ట్ లోపలికి నడిచారు నలుగురూ. తను, తన భర్త తో కలిసి చేసిన కళాఖండాన్ని మళ్ళీ తన భర్త సహాయం తీసుకుని ప్యాక్ చేసింది చిత్ర.

ఆ ఇద్దరు పిల్లలు తనను చూసి కాస్త భయపడుతున్నట్టుగా గమనించాడు ఈశ్వర్. వాళ్ళు అలా తనపై వికర్షణా భావాన్ని చూపిస్తూ ఉండటం అసౌకర్యంగా అనిపించింది ఈశ్వర్ కి.

"what are your names ?" అడిగాడు ఈశ్వర్, ఆ పిల్లలు తనకు కాస్త దెగ్గరౌతారేమో నని ఆశ పడుతూ.

" అంకులు ఆస్కింగునో ? టెల్ , టూ నేంస్ " అంది చిత్ర, తన భర్త ఆ పిల్లలతో సంకర్షించడానికి ప్రయత్నం చేయడాన్ని ఆస్వాదిస్తూ.

చిత్ర ఇంగ్లీష్ ని విని, ఆ ఇద్దరు పిల్లలు నవ్వు ఆపుకుంటున్నారని గుర్తించాడు ఈశ్వర్. ఒక్క క్షణం ఆ ఇద్దరు పిల్లల పై కోపం, చిత్ర పై జాలి కలిగాయి ఈశ్వర్ కి.

" రేణుక " " రాజేష్ " అంటూ బదులిచ్చారు ఇద్దరు పిల్లలు.

" హం ." అన్నాడు ఈశ్వర్ , వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇద్దామనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుంటూ, చిత్ర అవమాన పడ్డదేమో నన్న ఆలోచన కలిగి ఉండి.

తాను అనవసరంగా మధ్యలో మాట్లాడానేమో ననుకుంది చిత్ర. అందుకే తన భర్త అతనికి ' అలవాటైనట్టుగా ' " హం " అన్న శబ్దాన్ని చేసినట్టుగా భావించుకుంది చిత్ర.

లిఫ్ట్ పెంట్ హౌస్ వద్దకు చేరే సరికి, నాలుగు తెలియని ముఖాలు మాత్రమే కనిపించాయి వాళ్ళకి. ఆ నలుగురిలో ఆడ వాళ్ళ ముఖాలు విశ్వనాథ్ ని పోలి ఉండటం తో వాళ్ళు విశ్వనాథ్ యొక్క అక్కలుగా, వారి పక్కన ఉన్నది విశ్వనాథ్ యొక్క బావలుగా గుర్తించాడు ఈశ్వర్.

అపార్ట్మెంట్ మొత్తం లో కేవలం తామే పిలవబడ్డామని గుర్తించి ఆశ్చర్యపోయారు ఈశ్వర్, చిత్ర లు.

" వచ్చారా మేడం , మీ కోసమే చూస్తున్నాం. వీడు అప్పటి నుంచి ఒకటే ఎదురు చూస్తున్నాడు కేక్ కట్ చేద్దామని." అంది శ్రీజ నవ్వుతూ, ' మీదే ఆలస్యం ' అన్న అర్థం వచ్చేలా.

" పిల్లలు ఒచ్చే వరకు లేటయ్యిండె ." అంది చిత్ర నిజాయితీగా.

చిత్ర అంత నిజాయితీ సమాధానం చెప్పేసరికి, అనవసరంగా తాను లౌక్యాన్ని ఆమె వద్ద చూపించినట్టుగా భావించుకుంది శ్రీజ.

చిత్ర, ఈశ్వర్ లకు కూర్చీలు వేసింది శ్రీజ.

లోపలి నుంచి కూల్ కేక్ నూ, అభిరాం నూ బయటకు తీసుకు వచ్చింది శ్రీజ.

రాజేష్, రేణుక లతో పాటు చిత్ర ఆబగా ఆ కేక్ వంక చూడసాగింది.

వెంటనే ఏదో మరచిపోయినట్టుగా లోనికి వెళ్ళింది శ్రీజ. ఐదు నిమిషాలైనా తిరిగి రాకపోయే సరికి విషయమేంటో తెలుసుకుందామనుకుంది చిత్ర. శ్రీజ యొక్క ఆడపడుచులెవ్వరూ ఆమె ఏం వెతుకుతుందో తెలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపనట్టుగా గుర్తించ గలిగింది చిత్ర. ఈశ్వర్ ఎక్కడికి వెళ్తున్నావని అడిగేలోపే వడివడిగా శ్రీజ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది చిత్ర.

వస్తువులను పక్కనే పెట్టుకుని , వాటి కోసం తన చుట్టంతా వెతికే అలవాటున్న శ్రీజ, దేనికోసమో వెదుకుతున్నట్టుగా గుర్తించింది చిత్ర.

" నువ్వు చాకు కోసము దేవులాడుతున్నవా ?" అడిగింది చిత్ర.

" హా అవ్ను " అంది శ్రీజ.

" గీడనే ఉంది గద." అంటూ వంట గట్టు పై మూలకు ఉన్న చాకు ని చూపించింది చిత్ర నవ్వుతూ.

" హమ్మయ్యా, దొరికింది. అప్పటి నుండీ వెతుకుతున్నా. " అంది శ్రీజ, నిట్టూరుస్తూ.

' ఏందో ఏమో, గీమె మరీ గిట్లుంటే కష్టమే. ' అనుకుంది చిత్ర తన మనస్సులో. పైకి మాత్రం చిరునవ్వు నవ్వింది చిత్ర.

" నాకు వస్తువులు త్వరగా దొరికి చావవు. మా ఆయన ఎప్పుడూ తిడుతుంటాడు నన్ను ఊరికే వెతుకుతుంటా అని" అంది శ్రీజ.

చిరునవ్వొకటి నవ్వింది చిత్ర, ఏమని స్పందించాలో తెలియక.

బయటికి చాకు తో వచ్చిన తన తల్లిని చూసి

" ఇంతసేపా ? " అన్నట్టుగా ముఖం పెట్టాడు అభిరాం.

విశ్వనాథ్ , శ్రీజ లు ఇద్దరూ హ్యాపీ బర్త్డే పాటను పాడసాగారు. చిత్ర గోంతు కలుపుదామనుకుని, తప్పుగా పాడితే తన పరువూ, తన వల్ల తన భర్త పరువూ పోతుందేమో నని ఊరుకుంది. ఇంతలో ఈశ్వర్ కి ఫోన్ వస్తే, మాట్లాడటానికి పక్కకు వెళ్ళాడు. కేకు ని అభిరాం నోట్లో పెట్టారు వాడి తల్లిదండ్రులు, మేనత్తలు.

అభిరాం ని తిరిగి తన మేనత్తలకు , మామయ్యలకు కేకు తినిపించమని చెప్పింది వాళ్ళ అమ్మ.

" వీళ్ళతో పెట్టించుకోవడమే ఎక్కువ ." అన్నట్టుగా ముఖం పెట్టి , వాళ్ళకు కేకు తినిపించాడు అభిరాం.

ఇదంతా చూస్తున్న చిత్ర

' ఏందో ఏమో, గింత మంది కలిసి ఒకరి నోట్ల ఇంగోళ్ళు పెడుతున్నరు. ఎంగిలయితుంది. మళ్ళ గా కేకు నే నాకు ఈశ్వరు కూ పెట్టేటట్టున్నరు గద ! ' అనుకుంది తన మనస్సులో.

గిఫ్ట్ లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అభిరాం యొక్క ఇద్దరు మేనత్తలూ, చెరో గిఫ్ట్ ఇచ్చారు అభిరాం కి. తన తల్లి వద్దని వారిస్తున్నా , పట్టుబట్టి అప్పడే ఆ గిఫ్ట్ల పై ఉన్న కవర్లని తెరిపించాడు అభిరాం. వాడి కి ఆ గిఫ్ట్లు చాలా ' రొటీన్ ' గా తోచాయి.

" నువ్వు కూడా ఇట్లాంటివే తెచ్చావా లేక కొత్తవేవైనా తెచ్చావా ?" అని చూపులతోనే అడిగాడు అభిరాం.

" అదీ... ఈన ఫోను ల మాట్లాడనీకె పొయ్యిండు. ఈన కోసమే వెయిటు జేస్తున్న . " అంది చిత్ర, గిఫ్ట్ ని అందజేయడానికి వెనక ఉన్న కారణాన్ని చెబుతున్నట్టుగా.

" పరవాలేదు లే " అన్నట్టుగా చిరునవ్వోటి నవ్వింది శ్రీజ.

మూడు నిమిషాలు గడిచినా ఈశ్వర్ రాకపోయే సరికి, అందరూ ఈశ్వర్ ఎప్పుడు వస్తాడా,ఆ గిఫ్ట్ ఎప్పుడు వాళ్ళు అందజేస్తారా అన్నట్టుగా చిత్ర వంక చూడసాగారు. ఇంక వాళ్ళను ఎదురుచూసేలా చేయడం కష్టమనిపించింది చిత్రకు.

" ఈనొచ్చే దాక లేటయిటట్టుంది. " అంది చిత్ర, పర్లేదులే ఎదురుచూస్తాం అని శ్రీజ అంటుందేమో ననుకుని.

శ్రీజ ఏమీ మాట్లాడలేదు, ఎప్పుడు తంతు ముగుస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉన్న తన ఆడ పడుచులను దృష్టి లో ఉంచుకుని.

' ఏందో ఏమో, ఈశ్వరు వొచ్చే దాంక నన్న ఎదురు సూస్తలేరీళ్ళు. ' అనుకుంది చిత్ర తన మనస్సులో.

పైకి మాత్రం నవ్వుతూ అభిరాం దగ్గరికి వెళ్ళి, అతనికి చేతికి తను తీసుకువచ్చిన గిఫ్ట్ ని అందించింది చిత్ర. తన భర్త తో కలిసి ఆ గిఫ్ట్ ని ఇవ్వకపోవడం చాలా లోటుగా అనిపించింది చిత్రకు.

చిత్ర చేతిలో నుంచి గిఫ్ట్ తీసుకున్న మరు క్షణమే , దాని పైనున్న కవరు ని విప్పమని తన తల్లకి సైగ చేశాడు అభిరాం.

అభిరాం ఆసక్తిని గమనించిన చిత్ర,

" ఓపెను జేయ్ , ఏం గాదు. అబిరాము కు మస్తు నచ్చుతది గది. " నవ్వుతూ అంది చిత్ర, నమ్మకంగా.

అది తెరవగానే , తన తల్లి చేత ఇటీవలే english alphabets నేర్పించుకున్న అభిరాం ఆసక్తిగా ఆ కాండిల్ కార్వింగ్ పై ఉన్న అక్షరాలు ఒక్కొక్కటిగా మనసులో చదవసాగాడు.

' abhiraam ' అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి ఆ కొవ్వొత్తి పైన.

చిత్ర తమ కొడుకు పై చూపిన ఆప్యాయతకు ఆనందించారు విశ్వనాథ్, శ్రీజ లు.

" ఏమి .. ఎట్లుంది ? నచ్చిందా ?"అభిరాం ని అడిగింది చిత్ర నవ్వుతూ.

వాడు మాత్రం ఆ కాండిల్ నే ఆసక్తిగా చూస్తూ, వాళ్ళ అమ్మ వైపు తిరిగి, దాన్ని చూపించసాగాడు.

" ఆంటీ అడుగుతుంది నాన్నా ఎలా ఉంది అని " అంది శ్రీజ, చిత్ర వైపు చూస్తూ.

తన తల్లిదండ్రులిద్దరికీ తన గిఫ్ట్ ని గర్వంగా చూపించుకున్నాక, చిత్ర వైపు తిరిగి నవ్వాడు అభిరాం.

తొర్రి పళ్ళేసుకుని, మనస్పూర్తిగా వాడు నవ్విన నవ్వు చిత్ర కు బాగా ఆకర్షణీయంగా తోచింది.

" అదీ.. ఈననే ఎక్కువ జేశిండు ఇందుల. నేనూకె అయిడియా ఇచ్చిన అంతే." అంది చిత్ర, నిజాయితీగా. గుర్తింపంతా తానొక్కదానికే రావడం బాగా ఇబ్బందిగా అనిపించిందామెకి.

ఆ మాటను శ్రీజ, విశ్వనాథ్ లకు నమ్మాలి అనిపించలేదసలు.

ఇంతలో క్లైంట్ తో ఫోన్ సంభాషణని ముగించుకుని అక్కడికి వచ్చాడు ఈశ్వర్.

" ఈనొచ్చిండు . " అంటూ తన భర్త వైపుగా నడవబోతున్న చిత్ర చేతిని పట్టుకుని ఆపాడు అభిరాం.

" ఏంది ?" అన్నట్టుగా చూస్తున్న చిత్రను కిందికి వంగమన్నట్టుగా సైగ చేసాడు అభిరాం.

ఆశ్చర్యంగా అతని సైగ ను అనుసరించిన చిత్ర నోట్లో కేకు ముక్కను పెట్టాడు అభిరాం.

తమ సుపుత్రుడి చర్య కు ఆశ్చర్యపోయారు శ్రీజ, విశ్వనాథ్ లు. అభిరాం అంత ' సున్నితత్వం ' సొంత తల్లిదండ్రులైన తమ పట్ల కూడా చూపించని వైనం గుర్తుకు వచ్చింది వాళ్ళిద్దరికీ.

అంత ప్రత్యేకంగా చూడబడ్డందుకు చాలా సంతోషం కలిగింది చిత్రకు. తనకు లభించిన ఆ గౌరవం లో తన భర్త పాత్ర చాలా ఉందనిపించిందామెకు.

తన భర్త దెగ్గరకు వెళ్ళి , ఏం చెప్పాలో తెలియక, " గీ కేకు సల్లగుంది." అంది చిత్ర.

" yeah ,అది cool cake ." అన్నాడు ఈశ్వర్ , చిత్ర మాటకి వచ్చిన చిరునవ్వుతో.

" కొల్లాపూర్ ల గూడ ఉంటయి కేకులు. గాడ కొత్తగ అయ్యంగారు బేకరి అని పెట్టిండె. కాని గీ కేకు మస్తుంది. గది నమ్లాల్సొస్తుండె ఊకె. గిదేమో నోట్లేసుకుంటెనే కరిగిపొయ్యింది." అంది చిత్ర.

కేకు ను గూర్చి చిత్ర సంభాషణను కొనసాగించడం కాస్త ఇబ్బందికరంగా తోచింది ఈశ్వర్ కి. అక్కడి వాళ్ళెవరైనా వింటే చిత్రను చులకనగా చూస్తారేమో నన్న భావన కలిగింది ఈశ్వర్ కి. చిత్ర చులకనగా చూడబడటానికి అర్హురాలు కాదనిపించింది ఈశ్వర్ కి.

"హం." అన్నాడు ఈశ్వర్ బదులుగా.

సంభాషణని ఆపమని తన భర్త తనకు పరోక్షంగా చెప్పాడని అర్థం చేసుకుంది చిత్ర.

disposable plates లో కేక్ ముక్కల ని పెట్టి, అందరికీ పంచింది శ్రీజ. రేణుక, రాజేష్ లతో కలిసి చిత్ర కేక్ ని తినసాగింది. ఆ పిల్లలు తినే విధానానికీ, చిత్ర తినే విధానానికీ ఎలాంటి తేడా కనిపించలేదు ఈశ్వర్ కి. తొందరలో చిత్రనీ, ఆ పిల్లలనీ ఎక్కడికైనా మంచి ఫుడ్ కోర్ట్ కి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్.

***

భోజనానికి కూర్చున్నారు అందరూ. వాచ్ మెన్ పిల్లలిద్దరినీ వారితో పాటుగా కాక, విడిగా కుర్చోబెట్టడం నచ్చలేదు ఈశ్వర్ కి. వాళ్ళు అవమానపడ్డారేమో నన్న భావన కలిగిందతడికి.

చిత్ర, ఈశ్వర్ , విశ్వనాథ్ లకు అన్నం , కూరలు, పప్పు వడ్డించింది శ్రీజ.

మొదటి ముద్ద తిన్న చిత్ర నేరుగా ఈశ్వర్ వంక చూసింది.

రోజూ లాగే తన నాలుగు వేల రూపాయల స్వెటర్ వేసుకుని తన భర్త తో కలిసి వాకింగ్ చేయసాగింది చిత్ర.

" ఇదో.... ఆళ్ళు గట్ల కూరలు గంత కారం జేస్తరనుకోలె.. ప్చ్, నేనే గా స్రీజకు చెప్పకపోతి నువ్వు కారం చానా తక్కువ తింటవని. సారి" అంది చిత్ర, అపరాధభావం తో.

తనపై పదే పదే అంత మమకారాన్ని చిత్ర ఎలా చూపించగలుగుతుందో నని చిత్ర యొక్క కళ్ళల్లోకి చూస్తూ అడగాలనిపించింది ఈశ్వర్ కి.

" హం " అన్నాడు ఈశ్వర్, చిత్ర వైపు చూడాలనుకున్న తన కోరికను చంపుకుంటూ.

" ఇదో... గా వాచ్ మెను బార్య జోతి ఫోను జేసింది. ఇంగ నాల్గు రోజులైతదంట వచ్చెవరకు ఈడికి. " అంది చిత్ర కాస్త బెరుకుగా, లాప్టాప్ ముందు కూర్చుని పని చేసుకుంటున్న తన భర్త తో.

"okay". బదులిచ్చాడు ఈశ్వర్.

" మళ్ళ నీకు ఇబ్బందేమి గాదా, పిల్లలున్నందుకు ?" అడిగింది చిత్ర.

" అయ్యో ఇబ్బందేమ్లేదు. వాళ్ళ వల్ల ఇబ్బందేం ఉంటుంది చెప్పు ?" నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.

తన భర్త సమాధానం తో సంతోషపడింది చిత్ర.

" చాయ్ చేస్కుంటున్న నేను. నీగ్గూడ కొంచం పోస్త తాగుదువు సరేనా ?" అంది చిత్ర.

" కొంచం ఎక్కువే పెట్టు. ఎక్కువే తాగాలనిపిస్తోంది నాకు. "

" అట్లే ." అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది చిత్ర.

చిత్ర తనతో ఇంకాస్త మాట్లాడి ఉంటే బాగుండు ననిపించింది ఈశ్వర్ కి. ఒక నిమిషం తరువాత వంటింట్లో చిత్ర వద్దకు వెళ్ళాడు ఈశ్వర్.

అనూహ్యమైన తన భర్త రాక ను చూసి ఆశ్చర్యపోయింది చిత్ర.

" ఏమి ఇట్లొస్తివి ? " అడిగింది చిత్ర అయత్నకృతంగా.

"ఊరికే." బదులిచ్చాడు ఈశ్వర్, ఆ ప్రశ్న కు తన దెగ్గర కూడా సమాధానం లేకపోయే సరికి.

తన భర్త వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి, తిరిగి పొయ్యి వైపుకు తిరిగింది చిత్ర.

చిత్ర యొక్క నవ్వును మరోసారి చూడాలన్న కోరిక కలగసాగింది ఈశ్వర్ కి.

మరుగుతున్న నీటిలో పాలు, టీ పొడి పోసింది చిత్ర.

చక్కెర డబ్బా వైపుగా చేతిని చాపుతూ , దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న చిత్ర చేతికి డబ్బాను ఇచ్చాడు ఈశ్వర్.

తాను కోరుకున్నట్టుగానే తన వైపుకి తిరిగి నవ్వి, ఆ చక్కెర డబ్బాను చేతిలోకి తీసుకుంది చిత్ర.

"గదేందో లంసా పొడి దొరుకుతదంట గద, స్రీజ చెప్పిండె. గదేస్కుంటె ఇంగా మస్తు మంచిగ అయితదంట గద చాయ్. " అంది చిత్ర, ఈశ్వర్ వైపు చూస్తూ.

"yeah అవును. ఈసారి super market కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం."

"అట్లే." అంది చిత్ర.

చిత్ర తనకు అలవాటైన విధంగా ఏ వకీలు శ్రీనివాసరావు గురించో, తన మేనమామ గురించో లేక తన ఊరి గురించో మాట్లాడింటే బావుండుననిపించింది ఈశ్వర్ కి. అమె తో తన సంభాషణ కొనసాగేటట్టుగా చిత్ర వైపు నుండి ఏదైనా పొడిగింపు వచ్చింటే బావుండునని ఎదురు చూడసాగాడు ఈశ్వర్.

కానీ చిత్ర మాత్రం ఏమీ మాట్లాడలేదు. రెండు కప్పుల నిండా చాయ్ పోసి, ఒకటి తన భర్త చేతికి అందించింది.

" ఈడనే తాగుదమా? లేకపోతె డైనింగు టేబుల్ కాడికి పోదమా ?" అడిగింది చిత్ర.

" అక్కడికే వెళ్దాం." నిరాశపడుతూ బదులిచ్చాడు ఈశ్వర్.

డైనింగ్ టేబుల్ కుర్చీ పై కూర్చుని , తనకు అలవాటైన విధంగా శబ్దం వచ్చేలా చాయ్ ని జుర్రసాగింది చిత్ర.

" చిత్రా.." పిలిచాడు ఈశ్వర్.

తనవైపు చూసిన చిత్ర తో

" నువ్వు టీ చాలా బాగా చేస్తావ్." అన్నాడు ఈశ్వర్, ఇంకా తన చేతిలోని చాయ్ ని తాగకముందే.

" తెలుసు నాకు. " అంటూ ఎప్పటిలా తన భర్త నుంచి ఎదురైన ' అనవసరపు ' మెచ్చుకోలు పై తన వ్యతిరేకతను వ్యక్తపరుద్దామనుకున్న చిత్ర, తన ప్రయత్నాన్ని విరమించుకుంది. తన యొక్క దురుసుతనం వెనక గల కారణాన్ని గ్రహించగలిగేంత ' లౌక్యం ' తన భర్త కు లేదని భావించింది చిత్ర! పైగా పదే పదే తన భర్త తో దురుసుగా మాట్లాడితే అతని మనస్సు గాయపడుతుందేమో నని భావించింది చిత్ర.

" తాంక్సు. " అంది చిత్ర.

చిత్ర ఎప్పటిలా కాకుండా తక్కువగా సంభాషించే సరికి, ఈశ్వర్ కి నిరాశ కలిగింది.

"actually i used to prefer coffee. But now i am addicted to your tea." అంటూ గట్టిగా నవ్వాడు ఈశ్వర్.

తను చేసిన చాయ్ కి మెచ్చుకోలు కి కొనసాగింపుగానే తన భర్త పై మాటలను అన్నాడని మాత్రం గ్రహించగలిగింది చిత్ర.

" నువ్వు నవ్తే మస్తుంటవ్ ." అంది చిత్ర. ఎప్పటినించో మోస్తున్న భారాన్ని తీర్చుకున్నట్టుగా అనిపించిందామెకు!

" రేయ్ నీ smile అంటే చాలా ఇష్టం రా నాకు. దాన్ని చూసే పడిపోయా నేను. " అని నిత్యం అమృత బ్రతికున్నప్పుడు తనతో అనే మాటలు హఠాత్తుగా గుర్తొచ్చాయి ఈశ్వర్ కి.

ఒక్క క్షణం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామనిపించింది ఈశ్వర్ కి. కానీ చిత్ర ని ఇంకాస్త సేపు చూడాలనిపించిందతడికి. చిత్ర కళ్ళల్లో తన పట్ల చూపుతున్న ప్రేమను ఇంకాస్త సేపు చూడాలనిపించింది ఈశ్వర్ కి.

" తాంక్స్." అన్నాడు ఈశ్వర్ , కృత్రిమమైన చిరునవ్వొకటి విసురుతూ.

" గీ మాట నీకు జెప్దమని మస్తు సార్లనుకున్న తెల్సా ." అంది చిత్ర నవ్వుతూ.

" హం . ఓకే ."

చిత్ర ఏదో చెప్పబోయి ఊరుకున్నట్టుగా గుర్తించాడు. ఏదో సన్నిహితమైన వ్యాఖ్య చేసేందుకే చిత్ర ప్రయత్నించిందని భావించాడు ఈశ్వర్.

చిత్ర ఆ వ్యాఖ్య చేస్తే తనకు బావుంటుందో , చెయ్యకపోతే బావుంటుందో అర్థం కాలేదు ఈశ్వర్ కి!

" ఇదో ...... నాకు ఎప్పటికెళ్ళో ఒక కోరికుంది. " అంది చిత్ర, తన లోని ధైర్యాన్నంతా కూడగట్టుకుని.

" ఏంటి ?"

" నీకు మస్తు కోపమొస్తది. ఒద్దుగాన్లె. " అంది చిత్ర.

" చెప్పు. ఏంటి ?" అడిగాడు ఈశ్వర్.

డైనింగ్ టేబుల్ అవతలి వైపు కూర్చుని టీ తాగుతున్న తన భర్త వైపు ఒరిగి, అతని నుదుటి పై ముద్దాడింది చిత్ర.

" గీ పని జెయ్యాల్నని నాకెప్పటికెళ్ళో ఉండె.... నాదేమి తప్పు లేదు జూడు. నువ్వే అడిగినవ్ ఏందీ అని." అంది చిత్ర, ఈశర్ కళ్ళల్లోకి చూద్దామని ప్రయత్నించి, ధైర్యం చాలక కిందికి చూస్తూ.

చిత్రను ఒక్కసారి గట్టిగా హత్తుకుని గత మూడేళ్ళుగా తను అనుభవిస్తున్న నొప్పినంతా ఆమె ముందు వెళ్లగక్కాలన్న కోరిక కలగసాగింది ఈశ్వర్ కి. తన గుండె పొరల్లో ఉండిపోయిన దుఃఖాన్ని చిత్రకు చెప్పొచ్చో లేదో నన్న సందేహం అతడికి కలిగింది. ఒక్క క్షణం అతను చిత్ర కళ్ళల్లోకి చూశాడు. ఎప్పటిలాగే చిత్ర తన కళ్ళ నిండా తనపై ప్రేమను నింపుకున్నదని గుర్తించాడు. తన ఆలోచనల్లో అమృతను నింపుకున్న ఈశ్వర్ కి చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూసేంత ధైర్యం సరిపోలేదు.​
Next page: Update 13
Previous page: Update 11