Update 14

తన కళ్ళ ముందే అభిరాం దారుణంగా చనిపోయిన సంఘటన చిత్ర కళ్ళ ముందు మెదల సాగింది. గత మూడు రోజులుగా చిత్ర నిస్తేజత లో మునిగి ఉంది.

చావు వల్ల కలిగే బాధతో తన జీవితాన్నే ముడి వేసుకున్న ఈశ్వర్ కి, చిత్ర అదే బాధ లో ఉంటే చూడ్డం మాత్రం చూడలేక పోతున్నాడు.

అమృత మరణం తరవాత ఆ దుఃఖం లోనే బ్రతకాలనుకున్న తనకు చిత్ర కళ్ళల్లోని దుఃఖాన్ని చూడటానికి మాత్రం మనస్సు రావట్లేదు. చిత్ర ఎప్పటిలా సంతోషంగా ఉంటే చూడాలనిపించ సాగింది ఈశ్వర్ కి. తనతో మాట్లాడుతున్నంతసేపూ చిత్ర ఆ బాధ ని మర్చిపోతుందని గుర్తించిన ఈశ్వర్ , ఆమెతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

" చిత్రా, నాకు టీ తాగాలనిపిస్తోంది. పెడతావా ?" అడిగాడు ఈశ్వర్ , నవ్వుతూ.

"అట్లే" అంటూ లోనికి వెళ్ళింది చిత్ర.

తాను చాయ్ అడిగిన ప్రతిసారీ వంటింట్లోకి వడి వడిగా అడూగులు వేస్తూ వెళ్ళే చిత్ర, నిస్తేజంగా, నిరీహలో ఒక్కో అడుగూ వేస్తూ వెళ్ళడం ఈశ్వర్ మనస్సును గాయపరచసాగింది. చిత్రను మునుపటిలా చలాకీగా చూడాలన్న కోరిక ఈశ్వర్ కి చాలా బలంగా కలగసాగింది. ఆమెను సంతోష పరచడానికి మార్గాల్ని వెతకసాగాడు ఈశ్వర్.

వంటింట్లోకి వడి వడిగా వెళ్ళాడు ఈశ్వర్.

" చిత్రా, నిన్న నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు లంసా టీ పొడి తెచ్చా. ఆగు టీ పొడి లో మిక్స్ చేస్తా. టేస్టీ గా ఉంటుంది టీ ఇంకా." అని నవ్వుతూ కబ్బొర్డ్ లోని లంసా టీ పొడి పుడా ని విప్పదీసి, టీ పొడి లో కలపసాగాడు ఈశ్వర్.

చిత్ర మౌనంగా నిలుచుని ఉంది.

" నా టీ ఎప్పుడూ తాగలేదు కదా నువ్వు ? నువ్వు తప్పుకో నేను పెడతా ఇవాళ . నువ్వొకదానివే కాదు, నేను కూడా టీ బాగా పెట్టగలను. " అంటూ చిత్ర భుజాన్ని పట్టుకుని ఈమెను పక్కకు జరిపి , టీ చేయసాగాడు ఈశ్వర్.

చిత్ర కళ్ళ ముందు ఇంకా అభిరాం మెదలసాగాడు.

" ఇంకెన్ని రోజులని ఇలాగే ఉంటావ్ చిత్రా ?! చనిపోయాడు, ఏడ్చావ్, అయిపోయింది. ఆ పిల్లాడు చనిపోతాడని నీకు, నాకు ముందే ఏం తెలీదు కదా ! తెలిస్తే అలా జరగకుండా చూసుకునే వాళ్ళం కద. పోయినోళ్ల గురించి ఎన్ని రోజులని ఇలా బాధ పడుతూ ఉంటాం చెప్పు ?! ఇంకెన్ని రోజులు నువ్వు బాధపడుతూ, పక్క వాళ్ళని బాధ పెడుతూ ఉంటావ్ ?" అని గట్టిగా అరవాలనిపించింది ఈశ్వర్ కి.

తను చెప్పాలనుకున్న మాటలు తన తల్లిదండ్రులు అతనికి పదే పదే చెప్పిన విషయం ఈశ్వర్ కి గుర్తురాసాగింది !

అతని మాట పెగల్లేదు. ఒక్క సారి చిత్ర వైపు చూసాడు. ఆమె ధీర్ఘాలోనలో ఉన్నట్టుగా కనబడింది.

ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినబడింది.

" చిత్రా, నేను ఇక్కడ busy గా ఉన్నాను. నువ్వెళ్ళి ఎవరో చూడు." అన్నాడు ఈశ్వర్. చిత్ర అలానైనా అభిరాం ఆలోచనల్లోనుంచి బయటకు వస్తుందేమో నన్న ఆశతో.

చిత్ర మౌనంగా హాల్ వైపు వెళ్ళింది. చిత్ర యొక్క మౌనం భరింపరానట్టుగా తోచింది ఈశ్వర్ కి.

వచ్చింది వాచ్ మెన్ దంపతులుగా గుర్తించాడు ఈశ్వర్. సాయంత్రం కాలేజ్ అయ్యాక పిల్లలు నేరుగా తమ దెగ్గరికే వస్తారని చెబుతున్నారు వాళ్ళు. చిత్ర వాళ్ళ మాటలకు ముభావంగా సమాధానాలు ఇవ్వసాగింది.

వాళ్ళ తో మాట్లాడే ఉద్దేశం లేనట్టుగా ఆమె మాట్లాడసాగింది. వాళ్ళు తోందరగా వెళ్ళిపోయి చిత్ర తిరిగి తన ముందుకు వచ్చింటే బావుండునని కోరుకోసాగాడు ఈశ్వర్. కానీ వాళ్ళు ఎంతకూ వెళ్ళట్లేదసలు. ఈశ్వర్ ఏదైతే జరగొద్దని అనుకుంటున్నాడో అదే జరగసాగింది.

" మేడం.. ఇందాకే విన్న. పాపం ఆ మూగబ్బాయి చనిపోయాడట గా . లారీ గుద్దేసిందటగా. మీరు కూడా ఉన్నారట గా ?! " అంది జ్యోతి ఆతురత గా.

" ఆ.... అవ్ను" అంది చిత్ర, ఆమె స్వరం లో ఆ సంఘటన పై వికర్షణా భావం ఈశ్వర్ కి ప్రస్పుటంగా కనిపించసాగింది.

" అయ్యో, మీరప్పుడు చూస్కోలేదా మరి? శ్రీజ మేడం ఎప్పుడూ ఆ అబ్బాయి ని పట్టుకునే ఉంటుంది కదా, మరి అప్పుడు పట్టుకోలేదా ? "

" ..లేదు "

" అప్పటికప్పుడే ఆ బాబు చనిపోయాడా? లేక హాస్పిటల్ కి తీసుకెళ్ళాక చనిపోయాడా ?"

" ఆ బాబు ఎలా చనిపోయాడో నీట్ గా మీ ఇంటికి మేమిద్దరం వచ్చి ఎక్స్ప్లేన్ చేస్తాం . మీరింక ఇప్పుడు వెళ్ళొచ్చు ." అన్నాడు ఈశ్వర్, వంటింట్లో నుండి బయటకు వచ్చి.

చప్పుడు చేయకుండా ఆ వాచ్ మెన్ దంపతులు బయటకు వెళ్ళారు.

" పాపం అంత మంచి ఆమెకు ఇట్లాంటి వాడిని ఇచ్చి గోంతు కోసారు కదా." అంది జ్యోతి తన భర్త తో లిఫ్ట్ లో కిందికి దిగుతూ.

అవునన్నట్టుగా తలూపాడు ఓంకార్.

చిత్ర సోఫాలో కూర్చుండి పోయింది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరగసాగాయి. ఈశ్వర్ ఆ దంపతులను తలుచుకుని, గట్టిగా పళ్ళు కొరికి, లోనికి వెళ్ళి రెండు కప్పుల్లో చాయ్ పట్టుకు వచ్చాడు.

" చిత్రా , తీస్కో. " అంటూ ఆమె చేతికి అందించాడు.

చిత్ర చాయ్ కప్పుని చేతిలో పట్టుకుని, అభిరాం ని గుర్తు తెచ్చుకోసాగింది.

" అయ్యో, మరీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను మరీ అంత చెండాలంగా ఏం చేయను.పర్లేదు తాగొచ్చు." అన్నాడు ఈశ్వర్.

ఒక్క క్షణం చిత్ర ముఖం లో ఒక చిరునవ్వు విరిసింది.

" నవ్వితే నువ్వు కూడా చాలా బావుంటావు చిత్రా. " అన్నాడు ఈశ్వర్.

ప్రతిగా చిత్ర నుండి తన ఊరి యాస లో ' తాంక్సు ' అన్న పదాన్ని ఆశించాడు ఈశ్వర్.

కానీ చిత్ర ప్రతిగా ఒక కృత్రిమమైన మందహాసాన్ని చేసింది.

" లంసా వేసాక టీ చాలా బాగయ్యింది చిత్రా, నాదే ఇలా ఉంది అంటే నువ్వు చేస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది" అన్నాడు ఈశ్వర్, టీ తాగుతూ.

ఆ కప్పులో నుంచి చాయ్ ని తనకు అలవాటైనట్టుగా జుర్రసాగింది చిత్ర. తన వంక నవ్వుతూ చూస్తున్న ఈశ్వర్ వైపుకి తిరిగి," ఏమి ?" అని అడిగింది చిత్ర.

" ఏమి లేదు. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావ్ ఇవాళ. అందుకే చూస్తున్నా నిన్ను.... ఏ చూడకూడదా నా పెళ్ళాన్ని నేను?" అన్నాడు ఈశ్వర్.

ఈసారి ఇంకాస్త నిండుగా ఒక చిరునవ్వు నవ్వింది చిత్ర. అభిరాం మరణం తరువాత ఆమె నుండి అంత నిండైన నవ్వు అప్పుడే వచ్చినట్టుగా గుర్తించాడు ఈశ్వర్.

" చిత్రా, ఈ రోజు నైట్ ఆలూ పరాటా చేస్కుందామా ? ఆ రోజు చేసావు చూడూ అలా . నీకు కూడా ఎలాగూ ఆలూ ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం ఆలూ. " అన్నాడు ఈశ్వర్, చిత్రకు ఆలుగడ్డ నిజంగానే ఇష్టమని భ్రమపడినవాడై.

" సరే" అంది చిత్ర.

చిత్ర ను ఎలాగోలా ఏదో ఒక విషయం మీద నిమగ్నం చేయాలన్న తన ఆలోచన ఫలిస్తున్నందుకు సంతోషించాడు ఈశ్వర్.

" రా మరి , లేచి రెడీ అవ్వు. ఆలూ కొందాము. ఇంట్లో లేవు. " అంటూ, చిత్ర వద్దంటున్నా ఆమె చేతిలోని ఎంగిలి కప్పు ని తీసుకుని సింక్ వద్దకు వెళ్ళాడు ఈశ్వర్.

' మొకం కడుక్కొనొస్త. జిడ్డు జిడ్డు గయ్యింది మొకం. ' అని చిత్ర అంటుందేమో నని అనుకున్నాడు ఈశ్వర్.

చిత్ర మౌనంగా స్నానాల గది వైపుకి వెళ్ళింది.

***

చిత్ర, ఈశ్వర్ లు ఆలుగడ్డ లు కొనుక్కోవడానికి ఇంటి నుండి బయలుదేరారు.

" నువ్వు వెళ్తూ ఉండు. నేను తాళం వేసి వస్తా. " అన్నాడు ఈశ్వర్.

సరేనంటూ లిఫ్ట్ వైపు వెళ్ళసాగింది చిత్ర.

తాళం వేసి చిత్ర వద్దకు వచ్చిన ఈశ్వర్ కి లిఫ్ట్ వద్ద సెక్రెటరీ అయిన రాం రెడ్డి తన ' పెద్దదైన ' జెర్మన్ షెప్పర్డ్ కుక్క ని పట్టుకుని కనిపించాడు. ఆ కుక్క ఈశ్వర్ ని చూస్తూ పళ్ళు కొరక సాగింది. దాన్ని పట్టుకున్న రాం రెడ్డి చిత్ర ని ఆ సంఘటన పై ' విచారించసాగాడు '. చిత్ర కు మళ్ళీ అభిరాం యొక్క చావు స్ఫురణకు రాసాగింది.

ఈశ్వర్ కి అక్కడికి వెళ్ళి అతన్ని ఆపాలనిపించింది. కానీ అక్కడ కుక్క అతన్ని చూసి గుర్రుగా పళ్ళు కొరకడం అతను గమనించాడు. చిన్నప్పుడు తన పక్కింట్లో ఉండే కుక్క అతని వెంట పడి కరిచిన వైనం ఈశ్వర్ కి గుర్తు రాసాగింది. చిత్ర ముభావంగా ఒక్కో ప్రశ్నకి సమాధానం చెప్పసాగింది. గుండెలా నిండా ఊపిరి తీసుకుంటూ, వడి వడిగా తన వైపు చూసి మొరుగుతున్న కుక్క ని దాటుకుంటూ రాం రెడ్డి వద్దకు వెళ్ళాడు ఈశ్వర్.

చిత్ర వైపు సూటుగా చూస్తూ

" లేట్ చేయొద్దూ అని చెప్పా కదా ! మళ్ళి ఏంటి ఇక్కడ ముచ్చట్లు ? తొందరగా వెళ్దాం పద . " అన్నాడు ఈశ్వర్ , గొంతులో అసహనాన్ని ధ్వనింపజేస్తూ.

రాం రెడ్డి వైపు చూసి ఒక కృతకమైన నవ్వు నవ్వాడు ఈశ్వర్. ఈశ్వర్ గురించి ' తెలిసినవాడై ' ఒక నిట్టూర్పు విడుస్తూ అటు నుండి తన కుక్కని పట్టుకుని వెళ్ళిపోయాడు ఈశ్వర్.

" రా వెళ్దాం పద. "అంటూ అప్రయత్నంగా చిత్ర భుజం పై చేయి వేసాడు ఈశ్వర్.

ఇద్దరూ సూపర్ మార్కెట్ వైపు నడవసాగారు.

" చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉన్న పెద్ద కుక్క ఒకటి నన్ను పీకింది . అప్పటి నుంచి చాలా భయం నాకు కుక్కలంటే ." అని గట్టిగా నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్.

" ఓ ." అంది చిత్ర.

ఇంతలో ఈశ్వర్ దృష్టి దారిలో ఉండే పార్క్ పైన పడింది.

" చిత్రా, కాసేపు పార్క్ లో కూర్చుందామా? ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది బాగా." అన్నాడు ఈశ్వర్.

" అట్లే " అంది చిత్ర.

చిత్ర నోటి వెంట ఏక శబ్ద సమాధానాలు వినడం మరింత అసౌకర్యంగా అనిపించసాగింది ఈశ్వర్ కి.

వాళ్ళిద్దరూ పార్క్ లో ఉన్న ఒక బెంచ్ పై కూర్చున్నారు.

తన దెగ్గర ఇక మాట్లాడేటందుకు మాటలు అయిపోయాయని అనుకున్నాడు ఈశ్వర్.

" చిత్రా, నువ్విలా బాధ పడుతుంటే నాకు ఏదోలా ఉంది. please come out of this mood . please " అన్నాడు ఈశ్వర్ , ఆమె ముఖాన్ని తన చేత్తో తన వైపుకి తిప్పుకుని.

" ఎట్ల జెప్పు ? ఆ ? నా కండ్ల ముందె.....చిన్న పిల్లగాడు..... గంతకు ముందు వరకు నా ఒళ్ళ కూసోనిండె. " అంది చిత్ర, తన దుఃఖాన్ని అణుచుకుంటూ.

ఈశ్వర్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలో ఒక బంతి వచ్చి చిత్ర కాళ్ళకు తగిలింది.

" ఆంటీ బాల్ " అని అరుస్తున్నాడు ఒక ఐదేళ్ళ అబ్బాయి.

ఆ అబ్బాయిని చూసిన చిత్రకు అభిరామే కళ్ళ ముందు మెదలసాగాడు. అతన్ని చూస్తూనే ఉండిపోయింది చిత్ర, తన కళ్ళ నిండా నీళ్ళని నింపుకుంటూ.

" దూరంగా వెళ్ళి ఆడుకో " అంటూ బంతిని ఆ అబ్బాయి వైపు విసిరాడు ఈశ్వర్.

చిత్ర మాత్రం ఆ బాబు వైపే చూడసాగింది.

" చిత్రా, ఇంక వెళ్దామా లేట్ అవుతుంది ." అన్నాడు ఈశ్వర్, ఇక లాభం లేదనుకుని.

సరేనంటూ తలూపింది చిత్ర.

తాను అనవసరంగా తన భార్య ని పార్క్ కి తీసుకొచ్చినట్టుగా భావించాడు ఈశ్వర్. వెంటనే అతనికి తన భార్య కు పార్క్ ఎదురుగా ఉన్న సందు చివరన ఉండే గుడి అంటే ఇష్టం అన్న విషయం గుర్తుకు వచ్చింది. కనీసం గుడి కి తీసుకుపోతే నన్నా ఫలితం ఉంటుందేమో నన్న ఆశతో

" చిత్రా, అటూ , ఇటూ తిప్పుతున్నాననుకోకు. గుడికి వెళ్దామా? నువ్వు ఆ రోజు అన్న శిల్ప కళ ను నాకు కూడా చూడాలని ఉంది ." అన్నాడు ఈశ్వర్, గట్టిగా నవ్వుతూ.

" ఒద్దు " అంది చిత్ర, ఖరాఖండిగా.

" అయ్యో , ఎందుకలా ?" అడిగాడు ఈశ్వర్, తన భార్య యొక్క స్పందనకు ఆశ్చర్యపడిపోతూ.

" చిన్నగున్నప్పటి కెళ్ళి నేను గంత నమ్ముత గాయ్నని. నేనంటె చులకన . నన్ను బాద పెట్టుడంటె చానా సరదా.... అయిదేండ్ల పిలగాడిని ఎందుకు తీస్కపోదమనుకున్నడు ? గంత తొందరెందుకు ?! మాటలు గూడ రావు కద గా పిలగాణికి. ఎందుకట్ల జేస్తడు? ఎందుకట్ల ఆడుకుంటడు?!... నేను ఇంగెప్పుడు పోను గాయ్న దెగ్గరికి. గాయ్నకి ఇంగ పూజలు చెయ్యను. " అంది చిత్ర కోపంగా, తన కన్నీళ్ళని తుడుచుకుంటూ.

" అది కాదు చిత్రా.... చూడు చిత్రా, may be తన దెగ్గరికి తొందరగా తీసుకెళ్ళబోతున్నాడు కాబట్టే ఆ బాబు కి మాటలు ఇవ్వలేదేమో దేవుడు." అన్నాడు ఈశ్వర్.

చిత్ర ముఖ కవళికలలో ఎలాంటి మార్పు లేదు.

ఒక్క క్షణం నిట్టూర్చి, చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ " చిత్రా, life లో ఏదో ఒక unexpected incident జరిగిందని నిన్ను నువ్వు మార్చుకోకు చిత్రా. అప్పుడు నిన్ను నువ్వే కోల్పోవాల్సి వస్తుంది. please. Don't change yourself. నువ్వు ఇలాగే బావున్నావు చిత్రా. you have no idea how awesome you live." అన్నాడు ఈశ్వర్. ఆ మాటలు ఈశ్వర్ గుండె పొరల్లో నుంచి బయటకు వచ్చాయి.

ఒక్కో మాట అంటున్నంత సేపూ ఈశ్వర్ కి మూడేళ్ళ తన గతం గుర్తుకు రాసాగింది. తను ప్రేమించిన అమృత మరణం తరవాత , తనను తాను మార్చుకునే క్రమం లో తనను తానే కోల్పోయిన వైనం అతని కళ్ళ ముందు మెదలసాగింది. చిత్ర తన జీవితం లో ఏ దశలోనూ తనలా ఏ విషయం లోనూ వ్యవహరించకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్.

ఒక్క క్షణం గుడి వైపుకు చూసి, తిరిగి తన భర్త వైపుకి తిరిగి,

" ఇదో... మనం ఇంటికి పోదమా ? సూపర్ మార్కెట్ వరకు పొవ్వాలనిపిస్తలే....పోదమా ?" అంది చిత్ర.

" yeah yeah okay నీ ఇష్టం. " అన్నాడు ఈశ్వర్, అతని కంటి చూపు గుడి వైపుకి పడింది.

చిత్ర సంతోషంగా ఉండటానికి ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు ఈశ్వర్. నాస్తికుడైన అతడు గుడి వంక చూస్తూ, తన మనస్సులో

" చిత్ర చాలా happy గా ఉండాలి. ఎప్పుడూ చాలా చాలా happy గా ఉండాలి." అనుకున్నాడు.

ఇద్దరూ తమ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళసాగారు. చిత్ర భుజం పైన చేయి వేసి నడిపించుకు వెళ్ళసాగాడు ఈశ్వర్.

మౌనంగా నడుస్తున్న చిత్రను ఏదో ఒక సంభాషణ లో ఉంచాలని అనుకున్నాడు ఈశ్వర్.

" చిత్రా, నేను formal dresses కొనాలి అనుకుంటున్నాను. నువ్వే select చేయాలి. రేపు shopping mall కి వెళ్దాం . సరేనా ?" అన్నాడు ఈశ్వర్.

" formal dress లు అంటే ?"

" అదే... నేను office కి వేస్కెళ్తుంటాను కదా full hands shirt , plain pant అలా." అన్నాడు ఈశ్వర్.

" ఓ ... నాకు మంచిగ తెల్వదు గద. నీకు నచ్చుతయో లేదొ మళ్ళ. "అంది చిత్ర.

తన భార్య ఏదో ఒక విషయం మీద మాట్లాడటం సంతోషాన్ని కలిగించింది ఈశ్వర్ కి.

" ఏం కాదు లే, నీకు నచ్చితే చాలు కాని. అయినా ఇప్పుడు ఎలా వేసుకున్నా fashion ఏ." అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ.

" మ్మ్మ్ం... సరే మళ్ళైతె." అంది చిత్ర.

" ఇదో .... నాకు ఇంటికి పొయ్నాంక వొంట చేయాల్నని అనిపిస్తలే ఇయాల. నువ్వు గా రోజు.. గదే నాకు చెయ్యి కాలిన రోజు, బయటికెళ్ళి ఫోను జేశి తెప్పిచ్చినవ్ జూడు. అట్ల ఇయాల గూడ తెప్పిస్తవా ? " అంది చిత్ర.

" ఫుడ్ ఆర్డర్ చేయటమెందుకు ? నాకు వంట చేయడం వస్తుంది . నేను చేస్తా ఇవాళ. చూద్దువు గాని నా వంట టేస్ట్ కూడా ." నవ్వుతూ అన్నాడు ఈశ్వర్.

చిరునవ్వొకటి నవ్వింది చిత్ర.

***

వాకింగ్ ముగించుకుని వచ్చారు చిత్ర , ఈశ్వర్ లు.

" నేను చేసిన ఉప్మా గురించి నువ్వేమైనా చెబుతావేమో నని ఇందాకటి నుంచి వెయిటింగ్ నేను. " అన్నాడు ఈశ్వర్.

" మస్తుంది.... నిజంగ. " అంది చిత్ర.

" మరి అప్పుడే చెప్పొచ్చుగా ఇదేదో ?! "

" నువ్వు మంచిగుంది అంటె రోజు చేస్తా అంటవ్ ! నాకట్ల మంచిగనిపియ్యదు. గందుకే ఇంగేమి చెప్పలే. " అంది చిత్ర నవ్వుతూ.

ప్రతిగా ఒక చిరునవ్వు నవ్వాడు ఈశ్వర్. చిత్ర నవ్వు తన యొక్క మనస్సుకి తాకిన అనుభూతి కలిగింది ఈశ్వర్ కి.

***

చిత్ర ఈశ్వర్ లు తమ , తమ గదుల్లోకి పడుకోవడానికి వెళ్ళారు.

కాసేపయ్యాక, తలుపు కొట్టిన శబ్దం వినిపించేసరికి ఈశ్వర్ వెళ్ళి తన గది తలుపు తెరిచాడు. ఎదురుగా చిత్ర కళ్ళ నిండా నీళ్ళతో నిల్చుని ఉంది.

" నాకు రోజు పండుకుంటె అబిరామే గుర్తుకొస్తుండు. నిద్ర పడ్తలే నాకస్సలు రాత్రిపూట. నిన్న, మొన్న గూడ నిద్ర పట్టలే నాకు. నీ కాడనే పండుకుంట ఇయాల. పండుకోనిస్తవా నన్ను. " అంది చిత్ర.

" హేయ్ , అడగాలా ?! రా లోపలికి. " అంటూ తన భార్యను లోపలికి తీసుకుని వచ్చాడు ఈశ్వర్.

మంచం పైన కూర్చున్న చిత్ర పక్కన కూర్చున్నాడు ఈశ్వర్.

" నీకేమి తాకకుండగ పండుకుంట నేను సరెనా. నాకు బయమవ్తోంది ఒక్క దాన్నె పండుకొవ్వలంటె. గందుకే " అంది చిత్ర, సంజాయిషీ ఇచ్చుకుంటూ.

" హేయ్! ఇది మనిల్లు. నీ ఇష్టమొచ్చిన దెగ్గర పడుకోవొచ్చు. పదే పదే చెప్పకు ఇలా నాకు. " అన్నాడు ఈశ్వర్, ఆప్యాయత నిండిన కోపం తో.

ఒక్క నిమిషం పాటు మౌనంగా కూర్చున్నారు వాళ్ళిద్దరు. హఠాత్తుగా తన భర్తను కౌగిలించుకుని తనివితీరా ఏడవసాగింది చిత్ర. అభిరాం విషయం లో ఆమె మనస్సు పొరల్లో ఉన్న బాధంతా బయటకు వెళ్ళగక్కుతుందని గ్రహించాడు ఈశ్వర్ .

ఆమె తనివితీరా ఏడ్చిందని రూఢీ చేసుకున్నాక, ఆమె భుజాలను పట్టుకుని లాగి, ఆమె కళ్ళల్లోకి చూస్తూ

" చిత్రా, ఎక్కడికైనా వెళ్దామా ఒక రెండు , మూడు రోజులు ? నీకిష్టమొచ్చిన ప్లేస్ చెప్పు. తీస్కెళ్తా నిన్ను. " అన్నాడు ఈశ్వర్.

" మా ఊరికి పోదమా ? మామోళ్ళని సూడాలనిపిస్తుంది. పెంట్లవెల్లికి తీస్కపోతవా నన్ను?" అంది చిత్ర ఈశ్వర్ తన మాటను పూర్తి చేసిన మరుక్షణమే.

" sure. "

" మనం ఒస్తున్నమని మామోళ్ళకు ముందే జెప్పకు. జెర సర్ప్రైజు ఉంటది మంచిగ . " అంది చిత్ర.

ఆమె కళ్ళల్లో మునుపటి మెరుపు యొక్క చాయలు కనిపించాయి ఈశ్వర్ కి.

ఆమె కళ్ళల్లో మునుపటి మెరుపు యొక్క చాయలు కనిపించాయి ఈశ్వర్ కి.

" నీకెలా ఇష్టమైతే అలానే. ఇప్పుడైతే పడుకో మరి. పొద్దున్నే arrange చేస్కోవాలి అన్ని." అన్నాడు ఈశ్వర్.

" సరే . " అంటూ మంచం యొక్క మూలకు వెళ్ళి పడుకుంది చిత్ర.

తన మనస్సు కుదుటపడటం తో మెల్లిగా నిద్రలోకి జారుకుంది చిత్ర.

ప్రశాంతంగా పసి పాప లాగా నిద్రపోయిన తన భార్య తల నిమురుతూ, ఆమె నుదురు ని ముద్దాడాడు ఈశ్వర్.

పొద్దున్నే ఆరింటికి హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈశ్వర్ , చిత్ర లు పదింటికల్లా పెంట్లవెల్లికి చేరుకున్నారు. ఎక్కువ చప్పుడు చేయకుండా తన మామయ్య వాళ్ళింట్లోకి వెళ్ళింది చిత్ర. అక్కడ టి.వి చూస్తున్న స్వాతి కళ్ళు వెనకాల నుంచి మూసింది చిత్ర.

చిత్ర వేళ్ళను కాసేపు తడిమిన స్వాతి,

" వొదినె నా ?" అంది.

" ఎట్లున్నవ్ ?! " అంది చిత్ర నవ్వుతూ, స్వాతి వైపు చూస్తూ.

" బావున్న . నువ్వెట్లున్నవ్ ? అన్న గూడ ఒచ్చిండా ?" తన మాట పూర్తి చేసే లోపే బయట తన కార్ ని పార్క్ చేసి ఈశ్వర్, వంటింట్లో నుంచి జయమ్మ ఒకేసారి ఆ గదికి వచ్చారు.

" అయ్యా ! ఎప్పుడొస్తిరి ?? సడనుగ వస్తిరి ఇద్దరు ! కూసో బాబూ . ఎట్లుర్రు బాబు ? బుజ్జీ, నువ్వెట్లున్నవే? అస్సలు ఫొను, గీను ఏం జెయ్యకుండనే ఒస్తిరి డయిరెక్టుగ ! ఎండల పడొచ్చినట్టున్నరు ఇద్దర్కి నీళ్ళిస్త ఆగండి !" అంటూ వంటింట్లోకి వడి వడిగా వెళ్ళింది జయమ్మ.

" ఇదో.. కూసో ." అంటూ ఇనప కుర్చీ పై ఆరేయబడ్డ తువాల ను పక్కకు తీసి, తన భర్తను కూర్చోమన్నట్టుగా సైగ చేసింది చిత్ర.

" ఆగు ఫ్యాను పెద్ద జేస్త. " అంటూ రెగులేటర్ వద్దకు వెళ్ళి, ఫ్యాన్ వేగాన్ని పెంచింది చిత్ర.

మూలకు నిలబడి ఈశ్వర్ ని చూస్తున్న స్వాతి వైపు కి తిరిగి

" హాయ్ ." అన్నాడు ఈశ్వర్.

" అన్న కు హాయంట జెప్పు." అంది చిత్ర, నవ్వుతూ.

చిత్ర ముఖం పూర్తిగా వెలిగిపోతూ మునుపటిలా ఉండటాన్ని గమనించాడు ఈశ్వర్. చిత్ర ను పెంట్లవెల్లికి తీసుకు రావడం చాలా మంచిదైనట్టుగా భావించాడు ఈశ్వర్.

తనకు తిరిగి హాయ్ చెప్పిన స్వాతి తో

" ఏం చదువుతున్నావ్ ? " అడిగాడు ఈశ్వర్.

" నయింత్ అయిపోయింది. టెంత్ సదవాలె." అంది స్వాతి.

" గీతేది ? కనిపిస్తలే ?" అంది చిత్ర.

" గీత లక్ష్మమ్మ అత్తోళ్ళింటికి పొయింది. పొద్దు గల్లనే పొయ్యిండె గాడికి." అంది స్వాతి.

" అయ్య, గట్లనా " అంది చిత్ర.

ఇంతలో రెండు గ్లాసుల నిండా మజ్జిగ తీసుకుని వచ్చింది జయమ్మ.

" ఎండల పడొచ్చిర్రు. పటండి మజ్జిగ జేస్కొచ్చిన. శక్కెర తక్కువైతె అడుగు బాబు." అంటూ ఈశ్వర్ చేతికి మజ్జిగ ఇచ్చింది జయమ్మ.

సరేనంటూ తలూపాడు ఈశ్వర్.

" మామేడుండు ? కనిపిస్తలేడు ?" అడిగింది చిత్ర.

" సామాన్లు తెయ్యనీకె అంగడి కాడికి పొయ్యిండె మీ మామ. ఒస్తడు ఇంగో పది, ప్దిహేను నిమ్శాలల్ల." అంది జయమ్మ.

" ఇంగేమి అత్తా, మామ ది, నీది పయి ఎట్లుంది ?" అడిగింది చిత్ర.

" బానే ఉందే బుజ్జీ, జెర ఎండకాలం గద, మీ మామ నే గీ మద్యన చాతనైతలే అంటుండు అప్పుడప్పుడు." అంది జయమ్మ.

" అయ్య, చాతనైతలేదా? ఏమట్ల? డాక్టరు కాడికి పొయి సూపిచ్కుండా మళ్ళ ?" అడిగింది చిత్ర, ఆందోళన , కోపం, ఆప్యాయత కలగలిసిన భావోద్వేగం కలిగినదై.

" ఒచ్చినాంక నువ్వే అడుగుదువు మీ మామ ని. గాయ్నకి కోడలు జెప్తెనే అర్తమైతది, పెణ్లాం, పిల్లలు జెప్తే చెవులకెక్కదు." అంది జయమ్మ.

" మంచిగ పూట పూటకు టైముకు తింటుండా ? ఊర్ల పోంటి తిరగవడ్తుండా ?" అడిగింది చిత్ర.

" వొస్తడు గద, నువ్వే అడుగు. నేను గివన్ని అడుగుతె చెడ్దదాన్నవ్త తల్లి. నువ్వే అడుగు గా మనిషి ని. నీతోనైతె మంచిగ చెప్తడు ముచ్చట." అంది జయమ్మ.

" ఉం, అడుగుత రాని !" అంది చిత్ర.

చిత్ర, జయమ్మ ల సంభాషణ బాగా ఆసక్తికరంగా, వినోదంగా తోచింది ఈశ్వర్ కి.

చిత్ర, జయమ్మ లకు హఠాత్తుగా పక్కన ఈశ్వర్ ఉన్నాడన్న విషయం గుర్తొచ్చింది. కాస్త మొహమాటంగా ఈశ్వర్ వైపు తిరిగి,

" వచ్చెటప్పుడేమన్న ఇబ్బంది అయ్యిండెనా ?" అంది జయమ్మ చిరునవ్వుతూ.

" అయ్యో, లేద్లేదు. అలా ఏం లేదు. బాగానే టైం పాస్ అయ్యిండే " అన్నాడూ ఈశ్వర్, చిత్ర దారి పొడవునా తన ఊరి విశేషాలు ఆపకుండా చెప్పిన వైనాన్ని గుర్తు తెచ్చుకుంటూ.

" ఆకలిగొన్నట్టున్నరు పాపం. అర్ద గంటల వొంట జేస్కొస్త. సరెనా ?" అంది జయమ్మ.

సరేనన్నట్టుగా తలూపాడు ఈశ్వర్.

వంటింటిలోకి వెళ్ళిన జయమ్మ వెనకే చిత్ర కూడా వెళ్ళింది.

" అత్తా, గీయ్న మన లెక్క కారం గీరం ఎక్కువ తినడు. మస్తు సప్పగ తింటడు. నేనే జేస్త గీయ్నకు వొంట గీడున్నంతవరకు అర్తమైందా ?" అంది చిత్ర.

" అట్లే ." అంటూ తలూపింది జయమ్మ.

" ఇంగొ మాట, గాయ్న చికెన్, మటన్ తినడు సూడు. "

" అట్లే."

" గుడ్లు గిడ్లు కూడ తేవాకండి. గవి కూడ తినడు ఈన."

"అట్లే .""

" ఇంగో ఇంట్ల దోమతెరుందా ?"

" హా ఉంది పైనుంది మచ్చు మీద. కిందికి దించాలె. "

" రాత్రి ఈనకు దోమ తెర సిద్దం జేయాలె జూడు. మన లెక్క దోమలు అల్వాటులెవ్వు ఈశ్వర్ కి. "

" అట్లే."

" ఏమేం కూరగాయలున్నయ్ ఇంట్ల ?"

" ఏమి లెవ్వు. గుడ్లున్నయ్ అంతే. గుడ్డు కూర ఒండుదమనుకున్న. నాకు తెల్వదు గద ఈశ్వరు నీసు తినడని." అంది జయమ్మ.

" అయ్య, గట్లనా ?! "

" హా.. ఫోను జేస్త మళ్ళ మామకు ."

" ఒద్దొద్దుగాన్లె. ఈన నేను గలిసి కార్ల పోతం పాబ్బాయి సందు కాడికి. గాడ శంకరయ్యోళ్ళు కూరగాయల్ పెట్టుకుంటరు గద. గాడికి పోయి తెస్తం ఇద్దరం కూరగాయలు."

" కార్లొచ్చినార్ ? బస్సుల గాదా ?"

" షీ... బస్సుల తిరుగుడు ఆయ్నకి అల్వాటు లేదు. మేము పక్క సందులకు గూడ కార్లనే పోతం . "

" మ్మ్మ్ం. సర్లె. పోయి రాపొండి. నేను గంత వరకు అన్నం పొయి మీన పెడ్త.... మీ ఆయ్న పాలు తాగుతడా? సుక్క బర్రె పాలున్నయ్. "

" ఈనిందా సుక్క బర్రె ? "

" ఆ అవ్ను. వారమౌతుంది. మూడు రోజుల కింద వరక్ గూడ జున్నిచ్చిండె గది."

" అవ్నా... సరె పాలు వొయ్యి గ్లాసుల. శక్కెరెక్కువెయ్యకు. గాయ్న తాగడు శక్కెరెక్కువ. లావౌతరంట శక్కెరెక్కువ తింటె."

" అట్లే తల్లి. మీ ఆయ్నకెంత గావాల్నో నువ్వే పోస్కో అమ్మా! మళ్ళ నేను పోస్తె నువ్వు మెచ్చుతవో లేదో !"

" అట్లే . గీ గిన్నలున్నయేనా పాలు ?! కాచి పోస్త ఆయ్నకు." అంటూ పాలు పొయ్యి మీద పెట్టింది చిత్ర.

తన కూతుళ్ళకు పెళ్ళిళ్ళైతే ఇంక వాళ్ళతో ఎంత వేగాల్సొస్తుందో నని భావిస్తూ, నిట్టూరుస్తూ వంటింట్లో నుంచి బయటకు వచ్చింది జయమ్మ.​
Next page: Update 15
Previous page: Update 13