Update 15

స్వాతికి లెక్కల్లో ఏదో సందేహం వస్తే నివృత్తి చేస్తూ ఉన్నాడు ఈశ్వర్.

" బాబూ, చానా సంతోషంగుంది. మీరూ, బుజ్జీ ఒచ్చినందుకు. మేమే పిలుద్దం అనుకుంటున్నం. మీరే ఒస్తిరి. అంత బాగనేనా ఆడ? పెద్ద ఆపార్టుమెంటుల ఉంటరంట గద మీరు ? ఈన జెప్పిండె... గప్పుడు పెళ్ళప్పుడు రానీకె కుదర్లె నాకు. గందుకే రాలె. ఏమనుకోవొద్దు." అంది జయమ్మ.

" అయ్యో, పర్లేదండి ." అన్నాడు ఈశ్వర్.

" బుజ్జిని చూస్తె చానా సంతోషంగుంది బాబు. దానికి ముక్కు మీన కోపం గాని, మనస్సు చానా మంచిది దానిది. అదేమన్న కోపం తెప్పించినా గూడ జెర మీరే ఓర్సుకోండి. "

" అయ్యో తన వల్ల ఎప్పుడూ ఏ ఇబ్బందీ రాలేదు నాకు." అన్నాడు ఈశ్వర్.

" చానా సంతోషం బాబూ. బుజ్జి , నువ్వు ఇద్దరు సంతోషంగ ఉంటే సాలు. "

ఈశ్వర్ చిరు మందహాసం చేశాడు. జయమ్మ చిత్ర యొక్క మేలుని అంత మనస్పూర్తిగా కోరుకోవడం ఈశ్వర్ కి సంతోషాన్ని కలిగించింది.

ఇంతలో గ్లాసు నిండా పాలు తీసుకుని వచ్చింది చిత్ర.

"ఇదో... పాలు తీస్కో. సుక్క బర్రెవి. మస్తుంటయ్ కమ్మగ." అని తన భర్త చేతికి అందించింది చిత్ర.

" మరి నువ్వు తాగవా ?" అంటూ చిత్ర వైపు చూస్తూ అడిగాడు ఈశ్వర్.

" నాకు ఆకలేం అయితలే. నువ్వు తాగు రోజు పొద్దు పొద్దు గల్ల తింటవ్ టిఫిను. ఆకలి గొంటవ్ ." అంది చిత్ర.

చిత్ర యొక్క ' పెద్దరికాన్ని ' చూసి ముచ్చటపడింది జయమ్మ.

పాలు తాగిన ఈశ్వర్ తో

" ఇదో... కార్ల పొయి కూరగాయలు తెద్దమా ? ఊరు గూడ సూపిచ్చినట్టైతది నీకు. ఏమంటవ్ ?" అంది చిత్ర.

" yeah sure."

చిత్ర, ఈశ్వర్ లు ఇద్దరూ కార్లో బయలుదేరారు. మధ్యలో ఒక చోట కార్ ఆపమంది చిత్ర.

" ఇదో.... ఈ గుడి నాకు చానా ఇష్టం. ఒక సారి పోదమా లోనికి ? జెస్టు లోపటికి ఇట్ల పొయి, అట్లొద్దం. సరేనా ?" అంది చిత్ర.

" హేయ్ , నీకిష్టమైనంత సేపు ఉందాం లోపల. నాకు తోందరేం లేదు. " అన్నాడు ఈశ్వర్.

చిత్ర, ఈశ్వర్ లు ఇద్దరూ సాయి బాబా గుడి లోనికి వెళ్ళారు.

అక్కడ చేతులు జోడించి మొక్కని తన భర్త తరఫున ముందు దేవుడికి మొక్కి, తరువాత తన దండాన్ని మొక్కుకుంది చిత్ర. అక్కడ ఉన్న విభూతిని కాస్త చేతిలోకి తీసుకుని, తన భర్త నుదురు పై రాసింది చిత్ర.

ఈశ్వర్, చిత్ర లు ఒక మూలకు కూర్చున్నారు.

" గీ గుడికి పెండ్లి కాక ముందు ప్రతి గురు వారం వచ్చెడిదాన్ని. నాకు మస్తు ఇష్టం గీ గుడంటె." అంది చిత్ర.

" ఓ.. బాగుంది చుట్టూ atmosphere. idol కూడా చాలా బావుంది."

" ఆ?! "

" అదే .. విగ్రహం."

" హా ... గీ గుడిని బాలకిషన్ రావు అనేటాయ్న చెందాలకు తిరిగి కట్టించిండె. పాపం చానా కష్టపడిండె. గిప్పుడు ఈడుంట లేరు వాళ్ళు. హైదరబాదులనే ఉంటరు వాళ్ళ కొడుకు దేర. ఇంగ అప్పుడప్పుడొస్తుంతరు గుడిని సూడనీకె. " అంది చిత్ర.

"ఓ." అన్నాడు ఈశ్వర్, అవసరమైన దాని కన్నా ఎక్కువ సమాచారాన్ని ఇచ్చే అలవాటున్న చిత్రని చూసి ముచ్చటపడుతూ.

" ఏమి నవ్తున్నవ్ ?"

" ఏమీ లేదు."

" చెప్పు. "

" నువ్వు పక్కనుంటే అస్సలు బోర్ కొట్టదు చిత్రా."

" హహ, చిన్నగున్నప్పటి కెళ్ళి నేను గంతే. మా అమ్మ నేను సన్నవిల్ల గ వున్నప్పుడు నా నోట్ల వస పోశింటదని అంటుండె ఊకె" అంది చిత్ర నవ్వుతూ.

" వస అంటె ?!"

" గదే ... చిన్నగున్నప్పుడు మాటలు దబ్బున రానీకె పోస్తరు పిల్ల నోట్లల్ల."

" ఓ.... నిజమే అన్నాడు మీ మామయ్య."

అలిగింది చిత్ర, గట్టిగా నవ్వాడు ఈశ్వర్.

కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్ళారు ఈశ్వర్, చిత్ర లు.

అప్పటికే రామచంద్రయ్య వచ్చి ఉన్నాడు.

" మామా ! ఎట్లున్నవ్ ?! " , " బుజ్జీ ! ఎట్లున్నవ్ ?! " ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్న మరు క్షణమే ఏకకాలంలో అన్నారు.

రెండు , మూడు కుశల ప్రశ్నల తరువాత చిత్ర తన మామయ్యకు ఆరోగ్యం పై ' క్లాసు ' తీసుకోవడం ప్రారంభించింది.

భవిష్యత్తులో తాను చిత్ర చేతిలో ఎన్ని ' క్లాసు లు ' వినాల్సి వస్తుందో ననుకున్నాడు ఈశ్వర్.

ఐదు నిమిషాల చిత్ర చీవాట్లు, రామచంద్రయ్య సంజాయిషీల తరవాత చిత్ర , రామచంద్రయ్యలకు పక్కన ఈశ్వర్ ఉన్న విషయం గుర్తొచ్చింది.

" ఎట్లున్నరు బాబు? అంత మంచిగనే ఉందా? మీ అమ్మ, నాయినలు బాగున్నరా ?"

" హా బావున్నారు. " అన్నాడు ఈశ్వర్. తన సొంత తల్లిదండృల యొక్క క్షేమ సమాచారాన్ని గూర్చి ఒక్క సారైనా కనుక్కోవాలన్న ఆలోచన కూడా తనకు రాని విషయం ఈశ్వర్ మనస్సును కలుక్కుమనేలా చేసింది. తనకు కూడా చిత్ర తన వాళ్ళతో ఆప్యాయంగా ఉన్నట్టుగా తను తల్లిదండృల తో ఉండింటే ఎంతో బావుండుననిపించింది.

" విజయవాడ లోనే ఉన్నారా మీ అమ్మ వాళ్ళు ?" అడిగాడు రామచంద్రయ్య.

" హా అవునండీ." బదులిచ్చాడు ఈశ్వర్.

ఈశ్వర్ సమాధానం తెలిపేటప్పటి స్వరాన్ని బట్టి అతను లోలోన ఏం ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోగలిగింది చిత్ర.

తను కొనుక్కొచ్చిన ఆలుగడ్డలను తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది చిత్ర.

***

ఈశ్వర్ కి తోడుగా చిత్ర కూడా చప్పనైన ఆలుగడ్డ కూర తినసాగింది. మిగిలిన వాళ్ళు కోడి గుడ్డు, ఉల్లిగడ్డల కూర తినసాగారు.

భోజనాలు ముగించాక, ఇంటి ముందున్న వేప చెట్టు కింద ఉన్న బెంచ్ పై కూర్చున్నారు చిత్ర, ఈశ్వర్ లు.

ఈశ్వర్ కి తన అమ్మ, నాన్నలు గుర్తు రాసాగారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడాలి అనిపించింది ఈశ్వర్ కి. కానీ అన్నేళ్ళుగా తన తల్లి దండృలతో అతను పెంచుకున్న దూరం అతడికి గుర్తుకు రాసాగింది.

" ఇదో... నీ ఫోనిస్తవా? జెర పనుంది."

" ఎందుకు ?"

" అని జెప్పాల్నా?! అడుగుతె ఇయ్యవా నాకు ?! " అంది చిత్ర.

" హం. " అని నిట్టూర్చి, నవ్వుతూ తన భార్య చేతికి ఫోన్ ఇచ్చాడు ఈశ్వర్.

పక్కకు వెళ్ళింది చిత్ర ఆ ఫోను తీసుకుని.

తనకు తెలిసిన కాస్త ' సెల్ ఫోన్ ' గ్న్యానం తో , ఫోన్ తో కుస్తీ పడి, రెండు నిమిషాల తరువాత 'mom' అన్న కాంటాక్ట్ కి ఫోను కలిపింది చిత్ర.

" అత్తయ్యా, నేను చిత్ర ని . బాగున్నరా?..." అంటూ సంభాషణని ప్రారంభించింది చిత్ర.

రెండు నిమిషాల తరువాత తన భర్త చేతిలో ఫోను పెట్టింది చిత్ర.

" ఎవరు ?"

" మాట్లాడు."

"రేయ్ నాన్నా, ఎలా ఉన్నావ్ రా ? " అంది ఈశ్వర్ వాళ్ళ అమ్మ సరళ.

" బావున్నాను. నువ్వెలా ఉన్నావ్? నాన్న హెల్త్ ఎలా ఉంది ?" అవి కుశల ప్రశ్నల్లా కాక ఈశ్వర్ యొక్క మనస్సు లోతుల్లోనుంచి తన్నుకు రాసాగాయి.

" బావున్నా రా నేను. మీ నాన్న హెల్త్ .. ఇంక తెలిసిందే కదరా, బి.పి ఉంది. పాపం బానే కేర్ తీసుకుంటున్నాడు లే కానీ నా భయం నాకు ఉంటుంది కదరా. సమ్మర్ కదా, బాగా నీరసపడుతున్నాడు."

"ఓ.. జాగ్రత్త గా చూస్కో అమ్మా నాన్న ని. బిపి కంట్రోల్ లో ఉండేలా."

ఎన్నో రోజుల నుంచి లోపల దాచుకున్న మాటలన్నీ ఒక్కొక్కటిగా ఈశ్వర్ నోటి వెంట రాసాగాయి.

తన భర్త ను ఏకాంతంగా వదిలేస్తే బావుంటుందనుకుని, అటు నుండి వెళ్ళింది చిత్ర.

1:45:36 సమయం పాటు సాగిన ఈశ్వర్ ఫోన్ సంభాషణ ఎట్టకేలకు ముగిసింది.

ఎన్నో రోజుల భారాన్ని దించుకుని, ప్రసన్న వదనం తో కూర్చున్న తన భర్త పక్కన వచ్చి కూర్చుంది చిత్ర.

" అయిపొయ్యిందా మీ ముచ్చట ! " అంది చిత్ర వ్యంగ్యంగా.

" అమ్మ వాళ్ళ ను నెక్స్ట్ వీక్ మన ఇంటికి రమ్మన్నా." సంతోషంగా చెప్పాడు ఈశ్వర్.

చిరునవ్వొకటి విసిరింది చిత్ర.

ఇంతలో జయమ్మ చిత్ర, ఈశ్వర్ లకు ఛాయ్ తీసుకొచ్చింది.

చాయ్ కాస్త తాగంగానే తన భార్య పెట్టినంత బాగా జయమ్మకు చాయ్ పెట్టడం రాదని నిర్ణయించాడు ఈశ్వర్.

" బుజ్జీ, ఈశ్వరు కి సూపియ్యి మంచిగ. గా సోమశిల, మంచాలకట్ట, సింగోట్నం గియన్ని. మంచిగ కారున్నది గద. రోడ్డు గూడంగ మంచిగ అయింది గిప్పుడు " అంది జయమ్మ.

" అవ్ను.. పోదమా మంచిగ మస్తుంటది క్రిశ్నా నది కాడ. గుళ్ళు గూడంగ మస్తుంటయ్. మంచిగ తిరుగుదం ఇయాల. ఏమంటవ్ ?" అంది చిత్ర.

"yeah sure " అన్నాడు ఈశ్వర్.

" ఒక్క పది నిమ్శాలాగు. మొకం కడుక్కొనొస్త. జిడ్డు జిడ్డు గయ్యింది మొకం మొత్తం."

" ఓకే ." అని గట్టిగా నవ్వాడు ఈశ్వర్.

" ఏందో ఏమో, నీకు బలె నవ్వొస్తుంది నన్ను జూస్తే." అని మూతి ముడుచుకుని అక్కడినుంచి స్నానాల గది వైపుకు వెళ్ళింది చిత్ర.

వడి వడిగా నడుస్తూ వెళ్తున్న చిత్రని అలాగే నవ్వుతూ చూస్తూ ఉండిపోయాడు ఈశ్వర్.

*****

చిత్ర, ఈశ్వర్ లు ఇద్దరూ కార్ లో సోమశిల కు బయలుదేరారు. చిత్ర తన గతం లోని ఒక్కో విశేషాన్ని చెప్పసాగింది. గోలీలాటలో తను గెలుచుకున్న గోలీలను తనకు ఇవ్వలేదని తన పక్కింటి అబ్బాయిని కొరికిన విషయం, తనకు మార్కులు తక్కువగా వస్తే తన మామయ్య చెవి మెలితిప్పిన విషయం , ఆడుకుంటుండగా పన్ను విరగ్గొట్టుకున్న విషయం, పదవ తరగతి పరీక్ష చిట్టీలు కొట్టి పాసయిన విషయం, చిన్నప్పుడు ఇంట్లో చిల్లర దొంగతనం చేస్తూ వాళ్ళ అమ్మకు దొరికిపోయిన విషయం.. ఇలా ఆపకుండా ఒక్కో విషయాన్ని చెప్పసాగింది చిత్ర.

నవ్వీ నవ్వీ ఈశ్వర్ ఆయాసపడసాగాడు.

సోమశిల లోని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు ఈశ్వర్ , చిత్ర లు.

" చాలా బావుంది చిత్రా ఈ ప్లేస్. " అన్నాడు ఈశ్వర్.

" హా మస్తు మంచిగుంటది. గందుకే గద నిన్ను తీస్కొచ్చింది ఈడికి. దా నది సూద్దువు. మస్తుంటది క్రిశ్నా నది ఈడ. " అంది చిత్ర.

చిత్ర యొక్క ఉత్సాహాన్ని ఆస్వాదిస్తూ ఆమె వెనక నడవసాగాడు ఈశ్వర్.

సూర్యాస్తమయం కావొస్తూ ఉంది. నది దెగ్గరి జాలర్లు తమ తమ ఇళ్ళకు ప్రయాణమవుతూ ఉన్నారు. చిత్ర, ఈశ్వర్ లు ఇద్దరూ నది ఒడ్డున కూర్చుని ఉన్నారు.నది ఒడ్డులో నుండి వీస్తున్న చల్లని గాలి ఈశ్వర్ , చిత్ర ల ముఖాలకు తాకుతూ ఉంది.ఇద్దరూ మాటలతో కాక తమ కళ్ళతోనే సంభాషించుకోసాగారు. ఒక్కసారి చుట్టు పక్కల ఎవరైనా ఉన్నారేమో నని పరికించి చూసింది చిత్ర ఎవరూ లేరని రూఢీ చేసుకుంది.

ఈశ్వర్ అప్రయత్నంగా తన జుట్టుని చేత్తో చెరుపుకుని, తిరిగి సరిచేసుకుంటూ ఉన్నాడు. చిత్ర తన చేతి వేళ్ళతో ఈశ్వర్ యొక్క జుట్టుని నిమరసాగింది. ఈశ్వర్ కి చిత్ర యొక్క స్పర్శ మనోహరంగా తోచింది.

ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్కో సాగారు. చిత్ర నుదుటిపై స్వేదం పుట్టుకొస్తోంది. ఆమె గొంతు తడారిన భావన కలగటం తో గుటకలు మింగ సాగింది.

వారిద్దరూ అప్రయత్నంగా దెగ్గరకు రాసాగారు. ఒకరి నిశ్వాసలు మరొకరికి వేడిగా తగల సాగాయి. అప్రయత్నంగా కళ్ళు మూసుకున్న చిత్రకు ఈశ్వర్ యొక్క పెదవులు వెచ్చగా తాకాయి. ఆమె చేతులు ఈశ్వర్ యొక్క మెడ చుట్టూ పెనవేసుకోబడ్డాయి. తన భర్త యొక్క పెదవుల స్పర్శ ఆమె పెదవులకు చల్లదనాన్ని, ఆమె నరాల్లో వేడినీ పుట్టించసాగింది.

ముద్దు కార్యక్రమం పూర్తైనదని ఈశ్వర్ తన పెదాలను దూరం చేసి, చిత్ర కళ్ళల్లోకి సూటిగా చూడసాగాడు. ఈశ్వర్ యొక్క పదునైన కంటి చూపుకి ప్రతిగా చిత్ర తన కళ్ళనిండా సిగ్గుని నింపుకుని , తన కళ్ళతోనే నవ్వసాగింది. తన స్నేహితురాలూ, ఇలాంటి విషయాల్లో తనకు ' గురువైన ' వీణ చెప్పిన దానికన్నా ఆచరణాత్మకంగా ముద్దు ఎక్కువ బాగుందని నిర్దారించుకుంది చిత్ర.

చిత్ర చెంపలను తన చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు ఈశ్వర్.

ఆ క్షణం చిత్ర యొక్క కళ్ళల్లోని సంతోషం తన జీవితం యొక్క ఉద్దేశంగా తోచింది ఈశ్వర్ కి.

చీకటి పడ్డాక ఇద్దరూ కార్లో ఇంటికి వెళ్ళడానికి కార్లో కూర్చున్నారు.

" ఇదో ...."

" ఏంటి ?"

" ఇంగోటి పెట్టుకుందమా ? మంచిగుంది."

ఈసారి చిత్ర, ఈశ్వర్ లు ఇంకాస్త త్రికరణశుద్దిగా తమ ముద్దు కార్యక్రమాన్ని నిర్వర్తించారు.

మరుసటి రోజు మధ్యాహ్నం భోంచేసుకుని, కొల్లాపూర్ లోని వకీలు శ్రీనివాసరావు వాళ్ళింటిని సందర్శించి, హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు ఈశ్వర్, చిత్ర లు.

దారిలో ఒక రెస్టారెంట్ లో భోంచేసి, వాళ్ళింటికి చేరుకున్నారు.

ఎప్పటిలాగే ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. చిత్రకు నిద్ర పట్టట్లేదసలు. ముందు రోజు యొక్క ముద్దు కార్యక్రమాలూ, వీణ చెప్పిన విషయాలూ వెరసి, చిత్రకు ఆ రాత్రి గడవడం చాలా కష్టంగా తోచింది.

ఇంతలో తన భర్త యొక్క కాళ్ళ అలికిడి వినబడింది చిత్రకు.

' హమ్మయ్య .' అనుకుంది తన మనస్సులో.

లైట్ వేస్తూ ఈశ్వర్ చిత్ర పడుకున్న గదిలోనికి వచ్చాడు.

ఏం మాట్లాడాలో అర్థం కాక తన భర్త యొక్క కళ్ళల్లోకే చూడబోయింది చిత్ర. ఎంత ధైర్యంగా ఉందామన్నా, ఉండలేక, సిగ్గుతో తన తలను వంచుకుంది. ఆమె అరచేతుల్లో పుడుతున్న స్వేదాన్ని తన చీరకు తుడుచుకోసాగింది.

" చిత్రా ."

" చెప్పు." అంది చిత్ర, తన తల కిందికి దించుకునే.

" నన్ను క్షమించు."

ఒక్క సారిగా తన తల ఎత్తి ఈశ్వర్ వైపు ఆశ్చర్యంగా చూసింది చిత్ర. తన ఎదురుగా తడిసిన కళ్ళతో ఉన్నాడు ఈశ్వర్.

" ఏయ్ ! ఎందుకట్లంటున్నవ్ ?! " అంది చిత్ర , ఒకేసారి తనకు కలుగుతున్న కోపాన్నీ, బాధనీ అణుచుకుంటూ.

" నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళకు చిత్రా, నాకు నువ్వు కావాలి. లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనుండాలి."

" ఏమి గట్ల మాట్లాడుతున్నవ్ ఇయాల. నేనేడికి బోత చెప్పు ?! "

" నీకో విషయం చెప్పాలి చిత్రా.... నేనొక అమ్మాయిని ప్రేమించా నిన్ను పెళ్ళి చేస్కోక ముందు."

" ఓ అట్లనా? .... నాకు గూడ బడిల ఉన్నప్పుడు ఒక పిలగాడు ఇష్టముంటుండె . ఏడుండో ఏమో గిప్పుడు." అంది చిత్ర, తన భావోద్వేగాన్నంతా అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ, కృత్రిమమైన చిరునవ్వొకటి ధరించి.

" అలా కాదు..... మేము మూడేళ్ళు కలిసున్నాం. తను కాన్సర్ తో నా చేతుల్లోనే చనిపోయింది. అప్పటినుంచి నేను నా లైఫ్ లో ఇంకే అమ్మాయినీ రానివ్వకూడదనుకున్నా. మా అమ్మ తను చనిపోతానని బెదిరించి నీతో నా పెళ్ళి చేసింది..."

" ఇదో ..." అని ఈశ్వర్ మాటకు అడ్డుపడబోయింది చిత్ర.

" నన్ను పూర్తిగా చెప్పనివ్వు..... నన్ను పూర్తిగా చెప్పనివ్వు. తెలియాలి నీకు !"

చిత్ర కళ్ళల్లో మెల్లిగా నీళ్ళు తిరగసాగాయి.

" నిన్ను దూరం పెట్టాలని చూసా చిత్రా, తనను మనస్సులో ఉంచుకుని.కానీ నా వల్ల కాలేదు చిత్రా. నా వల్ల కాలేదు. చాలా బాధ పెట్టాను చిత్రా నిన్ను. చాలా చాలా బాధ పెట్టాను చాలా సార్లు. ఎన్ని సార్లు నిన్ను గట్టిగా హత్తుకుని ఏడవాలనిపించిందో తెలుసా. నిన్ను బాగా చూసుకోవాల్సిన నేను నిన్ను బాధ పెట్టాను చిత్రా. చాలా బాధ పెట్టాను. " ఈశ్వర్ కళ్ళల్లోంచి నీళ్ళు రాలసాగాయి. అతను మంచం పై కూర్చున్న చిత్ర ముందు మోకాళ్ళ మీద కూలబడిపోయాడు.

ఈశ్వర్ తలని తన చేత్తో పైకి లేపి, అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని, అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ

" ఇదో... నువ్వు బంగారానివి. అర్తమౌతుందా? నువ్వు బంగారానివి. నువ్వు నాకు దొర్కినందుకు ఎన్ని సార్లు క్రిశ్నయ్య కి దండం పెట్టుకున్ననో తెల్సా ? నేను బాద పడ్న అని నీకెప్పుడన్న జెప్పిన్నా ? ఆ? ఇంగోసారి నువ్వు గిట్ల మాట్లాడ్తే నాకు మస్తు కోపమొస్తది జెప్తున్న . అర్తమైతుందా ? నాకు మస్తు కోపమొస్తది." అంది చిత్ర గద్గర స్వరంతో.

"i am sorry chitra , don't leave me. please don't leave me ever. " ఈశ్వర్ ముఖం మొత్తం కన్నీళ్ళతో నిండిపోయింది.

" ఇదో .... ఇక్కడ జూడు. " అంటూ తన భర్త కళ్ళల్లోకి సూటిగా చూస్తూ

" నువ్వంటె నాకు చానా ఇష్టం. చానా చానా ఇష్టం. చచ్చేంత ఇష్టం నువ్వంటె నాకు. నీ వల్ల నాకెప్పుడు బాద కల్గలె. కల్గదు గూడ. బంగారాన్వి నువ్వు. నిన్ను బాగ సూస్కుంట నేను. నీకెప్పుడు ఏమి బాద కల్గనియ్య. నువ్వెప్పుడు సంతోషంగ ఉంటే సూడడం చానా ఇష్టం నాకు. నువ్వు గిట్ల ఏడుస్తుంటె నాకు మస్తు బాదవ్తుంది. అయినా గిట్ల ఏడుస్తరా ఎవరన్న గలీజ్ గ? ఆ? ."

ఈశ్వర్ కళ్ళ నుండి కన్నీటి ధారలు పారుతూనే ఉన్నాయి. తను ఏడుస్తూ, తన భర్త కన్నీళ్ళను తుడవసాగింది చిత్ర.

" ఇంగో సారి నేను నీ వల్ల బాద పడ్న అని నువ్వన్నవంటె మస్తు కోపమొస్తది జూడు నాకు. ఇంగెప్పుడన్న గిట్ల మాట్లాడినవంటె మంచిగుండదు జెప్తున్న. " అంటూ అతని ముఖం పై ఏడుస్తూ పదే పదే ముద్దాడింది చిత్ర.

"i love you. i love you . i love you. i lo..." అంటూ చిత్ర ఒళ్ళో తన తల పెట్టి తనివి తీరా ఏడవసాగాడు ఈశ్వర్.

ఈశ్వర్ యొక్క ఒత్తైన జుట్టును నిమురుతూ అతని తలపై తన తలను ఉంచింది చిత్ర.

తన ఇష్టదైవమైన శ్రీ కృష్ణుడిని తలుచుకుని, ఎల్లప్పుడూ తన భర్త సంతోషంగా ఉండేలా, ఎలాంటి బాధ పడకుండా ఉండేలా చూసుకొమ్మని కృష్ణుడిని ' హెచ్చరించింది ' చిత్ర.

-------------

సమాప్తం​
Previous page: Update 14