Chapter 02


బతకడం వేరు , జీవించడం వేరు

బతకడం .. ప్రాణం మాత్రమే ఉంటుంది

జీవించడం .. అనుభూతి కూడా ఉంటుంది

సలహా అన్నది మంచు లాంటిది .. ఎంత మృదువుగా చెప్పగలిగితే అంత ఎక్కువ కాలం మనలో ఉండి మనసులోకి దిగుతుంది

"అమ్మా రాలేదా నాన్నా "

"యామిని , తెలుసుగా .. తనకి కాళ్ళ నొప్పి .. అంతసేపు నుంచోలేదు ఎయిర్పోర్ట్ లో "

"వీల్ చైర్ ఉంటది కదా "

"అదే మాట నేనంటే , అదేమన్నదొ తెలుసా .. నా మనవడు , మనవరాలు కు నేనలా కనిపిస్తే ఇక అమ్మ మమ్మల్నెలా చూసుకుంటుందన్న అనుమానం రాదా అని "

"ఒరేయ్ రాము నువ్వు చెప్పరా .. నా వయసు ఎంత ఉంటదో "

"63 ?"

"నువ్వు చెప్పరా గంగా "

"57"

"కరెక్ట్ గంగా .. నేను 58, అమ్మమ్మ 55.. "

"తాతయ్యా .. 58 అంటే నమ్మలేకున్నా "

"ఒరేయ్ రాము .. తాతయ్య ఈ వయసులో కూడా బులెట్ బైక్ రైడ్ చేయగలడు .. ఇక కుస్తీ పోటీల్లో నాన్న ని ఓడించేవాడే లేడు మన ఊళ్ళో "

"రియల్లీ ? నా వీడియో గేమ్ లో ఉండే ఫైటర్ కన్నా బలంగా ఉంటావా తాతా ?"

"గంగా .. నువ్వే చెప్పాలి .. ఇంటికెళ్ళాక "

"తాతా .. నన్ను మాత్రం మామిడి చెట్టెంకించాలి .. జినెల్ కన్నా ఫాస్ట్ గా ఎక్కాలి నేను "

"రాము .. జినెల్ ఎవడు ?"

"అయ్యో .. తాతయ్యా .. జినెల్ అమ్మాయి .. అది వీడియో గేమ్ లో క్యారక్టర్ .. అది యిట్టె ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి ఎగరగలదు "

"అవునా .. నేర్పిస్తారా మనవడా .. మనకి వందెకరాల కొబ్బరి తోట , పదెకరాల మామిడి తోట .. రొయ్యల చెరువులు .. ఇంకా ఎన్నెన్నో .. జినెల్ అందంగా ఉంటుందా "

"అందుకే అన్నకి అదంటే అంత ఇష్టం "

కార్ ఆగింది .. రైల్వే గేట్ పడింది ..

బెంజ్ కార్ ని చూసి అక్కడున్న జనాలు వింతగా చూస్తున్నారు .. వాళ్ళని చూసి .. కాంతయ్య జేబులోంచి గాగుల్స్ పెట్టుకుని జుట్టు వెనక్కి ఎగరేసుకుంటూ రజని కాంత్ స్టయిల్ లో చుట్ట ని జేబు లోంచి నోట్లోకి విసిరేసుకుని వెనక ఉన్న పిల్లల వైపు ఒక లుక్కు ఇస్తే ..

వాళ్ళు నవ్వుకుంటూ .. "తాతయ్యా .. అచ్చం బీకెన్ లా ఉన్నారు .. " , అని అంటే .. ఆయనకి అర్ధం అయ్యింది .. "బికెన్ అంటే హీరో కదా మీ వీడియో గేమ్ లో " , అని అంటే .. గంగ నవ్వు ఆపుకుంటూ "తాతా ..బికెన్ అంటే జోకర్ .. ఫన్నీ క్యారక్టర్ " , అని అంటే .. ఆయన వెంటనే చుట్ట జేబులో పెట్టుకుని .. గాగుల్స్ షర్ట్ బటన్ కి తగిలించుకుంటాడు ..

ఈ లోగ గ్రీన్ సిగ్నల్ పడుతుంది

అదంతా గమనిస్తున్న యామిని కి అర్ధమయింది ... నాన్న అసలు కేరక్టర్ ఇది కాదు .. వాళ్ళని నవ్వించాలని అలా చేసాడు

ఇంకొంచెం దూరం పోయేక సన్నటి దారి .. దారికి అడ్డంగా ఆగిపోయిన జీప్ .. రోడ్ అంచున ఉన్న బురద గుంటలో టైర్ ఇరక్కపోయింది ..యాక్సిలేటర్ ఎంత రైజ్ చేసినా టైర్ బయటకి రావడం లేదు ..

కాంతయ్య కార్ దిగాడు .. ఎం జరిగిందని అడిగితే డ్రైవర్ జరిగింది చెబుతాడు .. జాకీ పనిచేయడం లేదు .. కాంతయ్య షర్ట్ మడతపెట్టి .. పక్కనున్న కొన్ని గులక రాళ్ళని తెచ్చి గుంత పక్కన పెట్టి .. "నేను జీప్ ని పైకి లేపుతా .. అప్పుడు ఈ రాళ్ళని టైర్ కింద కి వేయి .. " , అని ఆ డ్రైవర్ దగ్గరున్న తువ్వాలుని థన్ భుజం మీద వేసుకుని .. జీప్ డోర్ రాడ్ ని భుజం మీద సపోర్ట్ గా పెట్టుకుని .. కొంచెం కొంచెం పైకి లేపుతున్నాడు జీప్ ని .. అంత బరువున్న జీప్ ని ఒక సైడ్ నుంచి లేపడం అంత ఈజీ కాదు .. ఒక్కడే మెల్ల మెల్లగా లేపుతూ డ్రైవర్ కి సైజ్ చేస్తే .. వాడు ఆ గులక రాళ్ళని టైర్ కింద వేసి .. మట్టిని పోస్తాడు .. ఆల్మోస్ట్ రెండు ఇంచులు లేసింది .. బురద లోంచి

రాళ్ల మీద ఉన్న టైర్ .. కాంతయ్య రోడ్ పక్కనే ఉన్న పెద్ద బండరాయి ని తీసుకొచ్చి టైర్ కి ముందు పెడతాడు .. గుంటలోంచి టైర్ వచ్చేదానికి వీలుగా యాంగిల్ ని సెట్ చేసి .. జీప్ ఎక్కుతాడు .. ఫస్ట్ గేర్ లో .. క్లచ్ , యాక్సిలరేటర్ రెండు ఒకేసారి కంట్రోల్ చేస్తూ .. రయ్ రయ్ మంటూ వెనక టైర్ కింద రాళ్ల సపోర్ట్ తో .. ముందు ఉన్న రాయి మీదనుంచి ఒక్క ఉదుటున ఎగిరి గుంటలోంచి బయటకొచ్చేసరికి .. జీప్ స్పీడ్ ని కంట్రోల్ చేసి ఆపుతాడు ...

హమ్మయ్య .. ఎలాగోలా బయటకొచ్చింది .. ఆ గుంటని పూడ్చమని డ్రైవర్ కి చెప్పి తన బెంజ్ కార్ ఎక్కుతాడు

అదంతా చూస్తున్న రాము , గంగ ఆశ్చర్యపోతారు .. ఈ వయసులో తాతయ్య ఇంత బలంగా .. అసలు ఇలాంటి సాహసాలు వీడియో గేమ్స్ లో చూడడమే ..

"నాన్నా .. అంత రిస్క్ తీసుకుని ఆ జీప్ ని లేపడం అవసరమా ? మీ భుజాలకి ఏదన్న అయితే "

"మనకేదో అవుతుందని అందరూ వెళ్లిపోతున్నారు .. ట్రాఫిక్ కూడా స్లో అయింది ... యామిని .. అసలు ఇదొక లెక్క కాదు .. నీకు తెలుసుగా .. రెండు మూడు బియ్యం బస్తాల్ని ఒకేసారి లేపి లోడ్ వేయగలను "

తాతయ్య నే చూస్తూ .. గంగ , రాము నోరెళ్లబెడితే .. యామిని నవ్వుకుంటది .. ఇలాంటివి ఇంకెన్ని చూడాలో వీళ్ళు ..

ఇంతలో ఊరు వచ్చేస్తుంది .. పచ్చని పొలాల మధ్య ఉన్న ఫార్మ్ హౌస్ .. ఊరు బయట .. చాల పెద్ద బంగ్లా .. ఇంతకు ముందు వచ్చినప్పుడు వేరే చోట ఉండే వాళ్ళు .. కార్ దిగుతూ వరండా లో మజ్జిగ చివ్వుతున్న అమ్మ ని చూసి ఆనందంతో వెళ్లి పలకరించింది యామిని ..

నాన్న ని చూసి ఏడ్చిన యామిని అమ్మని చూసి ఆనందిస్తుంది .. ఈ గంటలోనే నాన్న చేసిన హంగామా .. వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తూ ఆయన చేసిన అల్లరి .. ఎందుకో ఆశ చిగురిస్తుంది యామినికి

కూతుర్ని పక్కన పెట్టి పిల్లలతో .. "ఉండండిరా అక్కడే .. ఒక్క నిమషం " , అని వీరమ్మ దిష్టి తీసేదానికి కుంపటి లో నిప్పులు పోసి .. కల్లుప్పు వేసి .. వాళ్ళకి దిష్టి తీస్తుంటే ..

రా : ఎంటమ్మమ్మ ఇది

వీ : దిష్టి అని అంటారు

గం : అంటే ఏంటి అమ్మమ్మ ?

వీ : ఈ సృష్టిలో కొన్ని ఈవిల్ పవర్స్ తిరుగుతుంటాయి .. వాటి దృష్టి మీ మీద పడి మీలోని పాజిటివ్ ఎనర్జీ ని లాగేసుకుంటాయి .. ఈ నిప్పుల్ని చూసి మీ దగ్గరకి రావు

రా : అమ్మమ్మా నీకు ఇంగ్లీష్ వచ్చా

కాం : ఒరేయ్ అమ్మమ్మ ఇంగ్లిష్ టీచర్ గా చేసి .. మానేసింది

రా : రియల్లీ ? ఎందుకు మానేశావ్ అమ్మమ్మ ?

వీ : నుంచోని చెప్పాలి .. కాళ్ళ నొప్పులు .. అందుకే మానేశా

పిల్లల్ని లోపలకి తీసుకెళ్లి AC రూమ్ లో కూర్చోబెడతాడు కాంతయ్య .. పిల్లలు వస్తున్నారని గంట ముందే AC ఆన్ చేసేసరికి ఆల్రెడీ చల్ల బడి హాయ్ గా ఉంది

"సరే .. రెస్ట్ తీసుకోండి కొంచెం సేపు .. ఈ లోగ అమ్మతో మాట్లాడుతుంటా " , అని వెళ్ళిపోతాడు కాంతయ్య

గంగ బాత్రూం డోర్ ఓపెన్ చేస్తే ఆశ్చర్యపోతుంది .. ఢిల్లీ లో తమ బెడ్ రూమ్ కన్నా పెద్దది .. వెస్ట్రన్ కమోడ్ .. క్వార్జ్ వాష్ బేసిన్ .. ఇంపోర్టెడ్ క్లోసెట్ .. షవర్ ఆక్సిసరీస్ కూడా చాల మోడరన్ గా ఉన్నాయ్ ..

తన స్టఫ్ అంతా పేర్చుకుంది .. కాస్మెటిక్స్ .. వారానికి సరిపడా ..

ఇక బెడ్ రూమ్ అయితే ఇంద్ర భవనమే .. పెద్ద కింగ్ సైజు బెడ్ .. ఇంకో పక్క సోఫా .. స్టడీ టేబిల్ .. ఇంపోర్టెడ్ ఫర్నిచర్ .. ఖరీదైన కర్టెన్స్ .. ఓపెన్ చేస్తే .. అందమైన పచ్చని పొలాలు .. కిటికీ కి దగ్గర్లో ఒక చెట్టు .. చెట్టు మీద పక్షులు ..

చాల బాగా నచ్చింది ఇల్లు ..

నాన్న పెద్ద ఆఫీసర్ .. కానీ నిజాయితీగా సర్వీస్ చేయడం వల్ల పెద్దగా సంపాదించింది లేదు .. ఆఫీస్ కి దగ్గరని 3 బెడ్ రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు .. ఢిల్లీ లో ఫ్లాట్ అంటే చిన్న చిన్న గదులే .. నలుగురు సంతానం కాబట్టి 3 బెడ్ రూమ్స్.. లేదంటే 2 తోనే సరిపెట్టుకుని వాడేమో

తాతయ్య కి వందల ఎకరాల తోటలు .. రొయ్యల చెరువులు .. పెద్ద బంగ్లా .. బెంజ్ కార్ .. అద్దె కి తీసుకున్నా , కొనడం పెద్ద లెక్క కాదు ..

ఇన్ని ఆస్తులు ఉన్నా .. సింపుల్ గా ఉంటాడు ..

ఇప్పుడే వస్తారా అని అన్నకి చెప్పి బాత్రూం వెళ్లి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తది ..

మోకాళ్ళ దాక ఉండే గౌన్ వేసుకుని .. బెడ్ మీద కూర్చుని ఫోన్ అందుకుంటది .. వీడియో గేమ్స్ ఆడే దానికి .. ఇంతలో రాము కూడా వెళ్లి స్నానం చేసి వస్తాడు .. చెల్లి తో కలిసి కంపిటిషన్ .. అక్కడ మంగ , సోము .. ఇక్కడ గంగ , రాము ... నలుగురి మధ్య వారం నుంచి కంపిటిషన్ నడుస్తుంది .. ఎవరు గెలుస్తారో

ఇక ఇలాంటి రూమే ఇంకోటి ఉంది .. అక్కడ యామిని అమ్మ వొడిలో తల పెట్టి రిలాక్స్ అవుతుంది ..

యామిని తల్లో పేలు చూస్తూ .. అక్కడక్కడ కనిపిస్తున్న తెల్ల వెంట్రుకల్ని పీకేస్తూ వీరమ్మ

"ఏంటే .. అప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చాయి "

"అమ్మా .. వాటికీ వయసుకి సంభంధం లేదే "

"మరి ఎందుకొచ్చాయి "

"ప్రశాంతంగా పడుకుని ఎన్నాళ్ళయిందో "

"ఎం .. అల్లుడు గారు ఇంకా నిద్ర పోనీవడం లేదా .. ఇంకో ఇద్దరు కవల పిల్లల్ని కనాలనా ?"

"అంత సీన్ లేదే .. ఉన్నాళ్ళతోనే తల ప్రాణం తోకకొస్తుంది "

"యామిని .. ఒక నెల రోజులు నువ్వు నిచ్చింతగా ఉండు .. వీళ్ళ సంగతి మేము చేసుకుంటాం "

"అదే ధైర్యంతో తెచ్చా వాళ్ళని .. వాళ్ళకి వారమనే చెప్పా .. వాళ్ళకి నచ్చితే నెల .. మీకు ఓపిక ఉన్నంత కాలం ఉంచుకోండి "

"మన పిల్లల పెంపకం మనకు భారం కాకూడదు ..మిగతా వాళ్ళిద్దర్నీ కూడా పంపు .. "

"అసలు ముందు వీళ్ళద్దరు ఎలా ఉంటారో చూద్దాం "

ఇంతలో కాంతయ్య వస్తాడు ..

అమ్మ వొడిలో తల పెట్టి పడుకున్న యామిని నాన్నని చూసి లేసి కూర్చుని .. "రా నాన్నా .. " , అని అంటే

ఆయన చొరవ తీసుకుని పెళ్ళాం వొడిలో తల పెట్టి పడుకుని "యామిని .. మా దగ్గర కూడా మొహమాటమా నీకు .. నలుగురు పిల్లల్ని సాక్కుంటూ , ఇంకో పక్క ఉద్యోగం చేసుకుంటూ .. ఎంతో కష్టపడుతున్న నీకు .. మా దగ్గరేగా ఇంత స్వతంత్రం .. మనం పిల్లలకి ప్రేమని పంచితే వాళ్లే మనల్ని గౌరవిస్తారు .. నీ సంస్కారం .. ఈ వయసులో కూడా .. ", అని అంటే

యామిని కళ్ళు తుడుసుకుంటూ నాన్న పొట్ట మీద తల పెట్టి పడుకుని .. అమ్మా , నాన్న చేతులు తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టి "నాన్నా .. చిన్నప్పటినుంచి మనుషుల్ని ఎలా గౌరవించాలి , మనం జీవితంలో ఎలా బతకాలని నువ్వు చెప్పిన పాఠాలు .. అమ్మాయి అంటే వంటింటికే పరిమితం కాకూడదని అన్ని నేర్పించి ధైర్యంగా ఢిల్లీ లో రైల్వేస్ లో పెద్ద జాబు చేయగలిగే స్థితికి తెచ్చిన అమ్మా .. అమ్మా , నాన్న లు పిల్లలకి ప్రేమని ఎలా పెంచాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి .. మీ పెంపకంలో పెరిగినా .. నా పెంపకం లో తేడా వచ్చింది .. కారణం నేనే .. ఉద్యోగం , మొగుడు అని పిల్లల్ని పట్టించుకోలేదు .. వాళ్లకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేక పోయా .. " , అని అంటది

కాంతయ్య కూతురి తల నిమురుతూ "యామిని .. వాళ్ళు మీ పిల్లలు కాదు మా పిల్లలు .. జనరేషన్ జనరేషన్ కి మార్పులు వస్తున్నాయ్ .. కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి .. వాళ్ళకేది కావాలో వాళ్ళకిస్తే మనకేమి కావాలో అవి మనకిస్తారు .. వాళ్ళకి అర్ధమయ్యే భాష లో చెప్పాలి .. అంటే .. ఇంగ్లీష్ లోనే చెప్పాలని కాదు .. భావం ముఖ్యం .. భాష కాదు .. " , అని అంటాడు

వీరమ్మ మొగుడి నెత్తి మీద ఒక్కటిచ్చి "దాన్ని తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో .. సవతి పెళ్ళాన్ని " , అని అంటే .. యామిని నవ్వుతూ "అవును నాన్నా .. ఈ వయసులో లక్ష్మి మీదెక్కడం అవసరమా ?" , అని అంటే .. ఆయన నవ్వుతూ "యామిని .. మనం సంపాదించేది దేనికి ? మనం సుఖంగా , ఆనందంగా ఉండాలి అనే కదా ? " , అని అంటాడు.
Next page: Chapter 03
Previous page: Chapter 01