Chapter 11

అతను మరింతగా కంఠాన్ని పెంచాడు. ఆ చీకట్లో నేను ఎక్కనున్నాడో తెలియక గింజకుపోతూ అరుస్తున్న అతను ఎలా పిచ్చి పట్టినట్టు స్టేషన్ లో తిరుగుతున్నాడో ఊహించాను. మనసంతా ఏదోలా అయిపోయింది.
కిందకు దిగుదామని కాళ్ళను కదిలిస్తున్నాను. కానీ లేవలేకపోయాను.
ట్రైన్ పెద్దగా కూత పెడుతూ కదిలింది. జయంత్ గొంతు రైలు కూతను మింగేయాలని చేస్తున్న ప్రయత్నం తెలుస్తూనే వుంది.
రైలు వేగం పుంజుకుంది.

ఇంత జరిగాక అన్నం సహిస్తుందనిగానీ, నిద్ర ముంచుకువస్తుందనిగానీ అనుకోలేదు. అన్యమనస్కంగానే పిల్లలకు భోజనం పెట్టి పడుకోబెట్టాను. ఇక ఎప్పుడూ ఇలా ఒంటరిగా వుండకూడదని నిర్ణయించుకున్నాను.

మరుసటిరోజు జయంత్ నేను ఊహిస్తున్నట్టే ఇంటికొచ్చాడు. అప్పుడే పిల్లలు స్కూలుకి వెళ్ళారు. ఏం చేద్దామా అనుకుంటూ వుండగానే వచ్చాడతను. ముఖంలో కళ తప్పింది. జ్వరం వచ్చి ఇంకా కోలుకోనట్లు వున్నాడు.

తెల్లటి ప్యాంటుమీద తెల్లటి ఖద్దరు చొక్కా లూజుగా వేలాడుతోంది. వంకీలు తిరిగిన జుట్టును మాత్రం శుభ్రంగా దువ్వుకున్నాడు. తన జుట్టు మీద అతనికి చాలా మోజు. అంత అందంగా జుట్టు చాలాకొద్ది మందికి మాత్రమే వుంటుందని అతని నమ్మకం. అది నిజం కూడా. అంత తపన లోనూ అతని జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడంటే తన జుట్టుమీద తనకెంత ఇష్టమో తెలుస్తూ ఉంది.

రాగానే నాకు మరింత దగ్గరగా నిలబడి “నిన్నరాత్రి మీకోసం రైల్వేస్టేషన్ లో ఎంతగానో వెదకాను. నా దురదృష్టం కొద్దీ స్టేషన్ లో కరంట్ లేదు. అప్పటికీ మీకోసం అరిచాను. కానీ మీకు వినిపించినట్టు లేదు ఎంతో నిరాశతో వెనక్కి వచ్చేశాను.
“ఎందుకు నన్ను వెదకడం?”
“మిమ్మల్ని చూడాలని.”
“ఎందుకు చూడడం?”
అతను జవాబు చెప్పలేకపోయాడు. ఏమని చెబుతాడు! అంత డైరెక్టుగా అడగకూడని ప్రశ్నలు అవి. వాటికి జవాబు హృదయస్పందనే. అది వినాలంటే ఎదుటి వ్యక్తి మనసును పరవాలి. అతను జవాబు చెప్ప కూడదనే అడిగాను.

“నాకు బజారులో అర్జంట్ పనుంది వెళ్ళాలి” అంటూ అతనివైపు చూడకుండా తాళం కప్ప అందుకున్నాను. బయటకొచ్చి తాళం వేశాను. అతనూ నా వెనకే బయల్దేరాడు.

“ఎందుకు నన్నిలా వెంబడించడం? నన్ను వెళ్ళనీ” నడక స్పీడు పెంచాను. అతను ప్రార్థించే స్థితికి చేరుకున్నాడు.
“మీతో మాట్లాడాలి” నా వెనకే పరుగెత్తుతూ చెప్పాడు.
“ఏం మాట్లాడాలి?”
“చాలా”.
“చాలా కుదరదు. ఎందుకు నన్నిలా విసిగిస్తావ్? ఎవరయినా చూశారంటే నా పరువు గోవిందా. నా భర్తకు తెలిస్తే నన్ను ఇంట్లోంచి తరిమేస్తాడు. ఆ తరువాత నా గతేం కాను?”
“ఈ జీవితానికి నేను బాధ్యత వహిస్తాను. అంత జరిగితే మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకుంటాను” నిశ్చయంగా చెప్పాడు.
నేను ఠక్కున ఆగాను. ఇక దీనికి ఇంతటితో పుల్ స్టాప్ పెట్టకపోతే చాలా దూరం పోతుందని గ్రహించాను.
“ఇప్పుడు అలానే అంటావ్. కానీ రేపు మన సంబంధాలు బయట పడితే నువ్వు సులభంగా తప్పించుకుంటావ్. ఇదెక్కడి పీకులాట అని తేలుకుట్టిన దొంగలా నోరు మెదపవు.

నువ్వు ఇంకా పెళ్ళికాని వాడివి. నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. నువ్వు సంఘానికి వెరవకుండా నన్ను పెళ్ళి చేసుకోగలవా? నీ జీవితాన్ని త్యాగం చేయగలవా? నీవల్లకాదు. పది రాత్రులయ్యాక నేనంటే నీకు మోహం మొత్తుతుంది. పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది..

పెళ్ళి అయిన తొలిరోజుల్లో నా భర్త చాలా అందగాడని అనుకునే దాన్ని. కొంచెం పాతపడ్డాక ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. నీకు నేనైనా అంతే. ఇప్పుడు రంభలా అనిపించినదాన్ని రేపు రంగమ్మలా అనిపిస్తాను” అతను నా మాటలకు అడ్డు తగిలాడు. “ఇవన్నీ సహజమైన విషయాలు. వీటిని అసహజంగా అనుకొని నిట్టూర్చడమే మనమంతా కామన్ గా చేసే తప్పు.”

“పోనీ అవన్నీ వదిలేద్దాం. రేపు నా భర్తకు ఇదంతా తెలిస్తే నువ్వు నన్ను ఏలుకుంటావా? నాకు నమ్మకంలేదు. అందుకు కారణం నువ్వు చెడ్డవాడివని కాదు, నీ పరిస్థితులు, బంగారంలాంటి భవిష్యత్తు వదులుకోలేవు. మాటలకేం వుంది? ఎన్నయినా చెప్పగలం. తీరా చేతలకొచ్చాక వెనకడుగు వేస్తాం. అంతెందుకు- నీకు చాలా ఇష్టమయిన జుట్టుని నాకోసం వదులుకుని బోడిగుండు చేసుకోగలవా? చేసుకోలేవు. ఎందుకంటే నీ జుట్టు నీకు చాలా అందం ఇస్తుంది కాబట్టి. అందువల్ల నన్ను ఇక మరచిపో, ఎప్పుడూ కలుసుకోవాలని ప్రయత్నించకు. నా మాట మన్నిస్తానని నమ్మకం” ఎంతో సీరియస్ గా చెప్పాను.

అతను ఏదో మాట్లాడాలన్న ప్రయత్నాన్ని అడ్డుకున్నాను. నా మాటల ఎఫెక్టు అలా కొనసాగాలంటే ఇక సంభాషణను పొడిగించకూడదు. అందుకే అక్కడ నిలబడి వున్న రిక్షాను రమ్మనమని సైగ చేశాను.
రిక్షావాడు పరుగు పరుగున వచ్చాడు.

అందులో ఎక్కి కూర్చుని ‘గుడ్ బై’ అని ముఖం తిప్పేసుకున్నాను. అతను బాగా షాక్ తినేశాడేమో శిలాప్రతిమలా చూస్తూ నిలబడిపోయాడు. నాకు కావాల్సింది కూడా అదే.
రిక్షా కదిలింది.

అతను ఇక రాడన్నది సుస్పష్టం. అంతగా నిలదీసి బెదిరిస్తే జంకని మగవాడు అరుదు. అందుకే భవిష్యత్తు గురించి భయంకరంగా చెప్పి హడల గొట్టేశాను. కానీ ఈ శూన్యాన్ని నేను భరించగలనా అన్న కొత్త అనుమానం కలిగింది. అయితే ఆ అనుమానం నిజం కాకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది.
నేనూ వూహించినట్టుగానే జయంత్ రాలేదు. ఈపాటికి అతనూ నన్ను భయంకరంగా తిట్టుకుని మరిచిపోయి వుంటాడనుకున్నాను.
రెండు రోజులు గడిచిపోయాయి.

మూడోరోజు మధ్యాహ్నం తిరిగి పిల్లల్ని స్కూలుకి పంపాక రెస్టు తీసుకుందామని అనుకున్నాను. మగతగా నిద్ర పట్టేసింది.
ఎవరో తలుపు తడుతున్నారు. ఇది కలా, నిజమా అని తర్కించు కుంటూ చుట్టూ చూశాను.
మళ్ళీ చప్పుడు. ఈ వేళప్పుడు ఎవరా అనుకుంటూ లేచాను. ఒంగోలు నుంచి ఉదయమే ఆయన ఫోన్ లో మాట్లాడారు. రెండు రోజుల తరువాత వస్తానన్నారు కాబట్టి ఆయనకాదు. మరెవరా అనుకుంటూ తలుపు తీశాను.

ఎదురుగ్గా వున్నది ఎవరో ఒక్కక్షణం పోల్చుకోలేకపోయాను. నున్నటి గుండుతో చెమటలు కార్చుకుంటూ నావైపు తదేకంగా చూస్తున్న జయంత్ ను చూస్తుంటే ఏదోలా అయిపోయాను.

నా మాటల్ని సీరియస్ గా తీసుకొని నాకోసం గుండు గీయించుకుని ఎదురుగా నిలబడ్డ అతన్ని చూస్తుంటే నా గుండెను మడతపెట్టేసినట్లనిపించింది. రక్తనాళాలు శరీరంలో నుంచి చొచ్చుకొని రక్తం కారిపోతున్నట్లుంది. పెద్ద గాలి అల తలకు విసురుగా తగిలినట్లయింది. నా భ్రమలన్నీ పటాపంచలయ్యాయి.
ఏమీ మాట్లాడకుండా లోపలికి రమ్మన్నట్లు దారికి అడ్డం తోలిగాను…
లోపలికొచ్చాడు.

హాల్లో ఒకరికొకరు ప్లాట్ గా చూసుకుంటూ నిలబడ్డాం.

అప్పుడు చూశాను అతడి తలను, గుండుమీది ఎర్రటి గాట్లు. చేత కానివాడు గుండు గీసినట్లు తలంతా గాట్లు. రక్తం గడ్డకట్టడంవల్ల గీతలు ఎర్రగా కనిపిస్తున్నాయి.

“ఏమిటిదంతా?” అని అడిగాను. ఎవరో నొక్కేస్తున్నట్లు కీచుమంటూ మోగింది నా కంఠం,
“గుండు గీసుకున్నాను. మిమ్మల్ని మధ్యలో వదిలిపోననీ, మీరంటే నాకెంతో ఇష్టమని చెప్పడానికే ఇలా తయారయ్యాను. మీరు చెప్పింది. నేనే చెయ్యాలనే తపనతో నాకు నేనే గుండు గీసుకున్నాను. అందుకే గాట్లు కాస్త ఎక్కువయ్యాయి. మిమ్మల్ని నమ్మించబోతున్నానన్న ఆనందంలో నొప్పి తెలియలేదు.”

అప్పుడు ఏడ్చాను నేను. జీవితంలో చాలా ఏళ్ళ తరువాత మనస్ఫూర్తిగా ఏడ్చాను. మనసులోని కుళ్ళంతా కరిగిపోయేటట్లు ఏడ్చాను. నా ఇష్టమంతా కన్నీళ్ళతో తెలియజేయడానికి ఏడ్చాను. ఆ అభిమానానికి, ఆ పిచ్చి ప్రేమకూ, అందాన్ని కూడా చాలా సులభంగా తృణీకరించగలిగిన ఆ మోహావేశానికి కదిలిపోయి ఏడ్చాను.

ఒకడుగు ముందుకువేసి జయంత్ చేయి పట్టుకుని సోఫాలో కూర్చుంటూ లాక్కున్నాను. ఊహించని ఈ సంఘటనకు అతను పూర్తిగా నామీద వాలిపోయాడు.
అది హాలనీ, తలుపు మూయలేదనీ, ఎవరైనా వస్తే రెడ్ హ్యండెడ్ గా పట్టుబడతామనీ ఏమీ తోచలేదు ఆ క్షణంలో భయమంటే ఏమిటో దగ్గరకు రానివ్వలేదు మనసు. ఏమిచ్చి అతన్ని సంతోషపరుద్దామనే ఆలోచనంతా.

అతని దిగులునీ, అతని బాధనీ, అతని కోరికనూ, అతని తపననూ, అతని ఉద్వేగాన్నీ, అతని ఉద్రేకాన్నీ క్షణంలో తీర్చేయాలన్నంత ఆత్రుతతో మరింత దగ్గరకు లాక్కున్నాను.
నన్ను నేను అర్పించుకున్నాను.

ఇలాంటివి చాలారోజులు దాగవు. మౌనంగా సంభాషించుకునే ఓ చూపు. ఆత్మీయనంతా రంగరించుకున్న చిన్న పలకరింపు. ఆ వ్యక్తి కనబడగానే ముఖంలో ఎగజిమ్మే వెలుగు, అతని సాన్నిహిత్యంలో శరీరం తిరిగే వంపూ, ఇవన్నీ ఎదుటివాళ్ళకు మన రహస్యాన్ని ఈజీగా పట్టిస్తా యనుకుంటా.

మా సంబంధం ప్రారంభమైన ఆరునెలలకి కాబోలు నా భర్తకి విషయం తెలిసిపోయింది.
“ఏమిటిదంతా?” అని అడిగాడు.
ఇలాంటి సందర్భానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయాను.
“ఏం చేయను! తప్పలేదు”
నావల్లకాదు. మెత్తటి మనిషి. అందుకే దీన్ని ప్రపంచంపు సమస్య చేయలేదు.

“ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైతే ఏం చేయాలో మనం విడిపోదాం. మీకు తెలియకుండా రహస్యంగా జయంత్ తో గడపడం నాకు మొదటి నుంచీ ఇష్టంలేదు. కాని చెప్పానుగా. తప్పలేదనీ” ఎదురుగా వున్న గోడను చూస్తూ చెప్పాను.
ఆయనలో చిన్న కదలిక.
“అతనితో వుంటావా?” కాసేపు మౌనం తరువాత అడిగారు.
“బహుశా వీలు కాదనుకుంటాను. మా ఊరు వెళ్ళిపోతాను.”
“పిల్లలు?”
“మీరు వాళ్ళను చూసుకోలేరు. డ్యూటీలో బిజీగా వుండే మీకు వాళ్ళ పోషణ చాలా కష్టం. అందుకే నేను తీసుకుపోతాను. వేసవికాలం సెలవులకో, పండగలకో మీ దగ్గరికి పంపిస్తాను.”

“ఇక మాట్లాడవలసింది ఏమీలేనట్లు ఆయన బయటికి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక బయల్దేరి ఈ ఊరు వచ్చేశాను. అమ్మా వాళ్ళకు నేనొక్కదాన్నే సంతానం. అందుకే మొదట్లో బాధపడ్డా తర్వాత సర్దుకున్నారు.”
“జయంత్ కి మరుసటిరోజు తెలిసింది విషయమంతా. తెలిసిందే తడవుగా పరిగెత్తుకు వచ్చాడు నా దగ్గరికి.

ఊరికి వచ్చీ రాగానే “బయల్దేరు” అన్నాడు.
“ఎక్కడికీ?”
“ఎక్కడ కేమిటి? ఎక్కడికైనా. మనం కలిసి వుందాం. ఇలాంటి పరిస్థితి వస్తే నేరుగా మా ఇంటికి వచ్చెయ్యమని చెప్పాను గదా” నొచ్చుకుంటూ మాట్లాడాడు.
“ఎలా రాను జయంత్? ఆవేశం తగ్గించుకుని ఆలోచించు. నువ్వు ఇంకా కుర్రాడివి. ఎంతో భవిష్యత్తు వుంది నీకు. నీతో వచ్చేసి దాన్నంతా ధ్వంసం చేయనా? వద్దు. అలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు మానుకో. హాయిగా యింటికి వెళ్ళిపో. చక్కగా పెళ్ళి చేసుకో. ఇంకా పై చదువులు చదువు. రీసెర్చ్ చేస్తానని చెప్పావుగా. ముందు ఆ పని చెయ్.”

అతను ఒప్పుకోలేదు. నన్ను వదిలి వెళ్ళడానికి ఎంతో కన్విన్స్ చేయాల్సి వచ్చింది. దాదాపు నాలుగు గంటల సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం నన్ను వదిలి వెళ్ళడానికి అతి కష్టం మీద ఒప్పుకున్నాడు.
అతన్ని సాగనంపడానికి బస్టాండ్ వరకూ వెళ్ళాను.

దూరంగా వస్తున్నా బస్సు కనిపించగానే ప్రయాణీకులమతా హడావుడిగా లేచారు.
“ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాం” అర్థిస్తున్నట్లు చేయి పట్టుకున్నాడు.
“వద్దు జయంత్…. నువ్వు ఇక్కడికి వచ్చి గొప్ప సహాయం చేశావ్. మనుషుల మీద నమ్మకం పెంచావ్. అంతకంటే నాకేం కావాలో చెప్పు. ప్రేమ, అభిమానం, ఆత్మీయత- ఇవన్నీ ఒట్టి గాలి కబుర్లు కావని నిరూపించావ్. మనుషుల మీద గొప్ప నమ్మకాన్ని పెంచావు. మనుషుల మీద ప్రేం పోయాక ఎలా బ్రతకడం? ఇప్పుడు అలా కాదు. మిగిలిన జీవితాన్ని నా చుట్టూ వున్న మనుషుల మధ్య అద్భుతంగా గడిపే ఉత్సాహాన్ని ఇచ్చావ్. నువ్వు చేసిన ఈ సహాయానికి జీవితాంతం ఋణపడి వుంటాను” ఏదో తెలియని ఉద్వేగంతో నా కళ్ళు వర్షిస్తున్నాయి.

బస్సు వచ్చి ఆగింది.
జయంత్ ని చేయి పట్టుకుని బలవంతంగా ఎక్కించాను. బస్సు కదులుతూ వుంది.
“ఇక నిన్ను చూడడం నీ పెళ్ళిలోనే” గట్టిగా అరిచాను.
నా చెంపలమీద జారుతున్న కన్నీళ్ళను చూడలేక తల తిప్పుకున్నాడు జయంత్.
బస్సు రేపిన దుమ్ము నన్ను పూర్తిగా కప్పేసింది.​
Next page: Chapter 12
Previous page: Chapter 10