Episode 07


సారిక : హలో వెంకీ ఎక్కడున్నావ్.. బిర్యానీ చేస్తా అన్నావ్.. ఇంతవరకు రాలేదు.. ఆ.. అలాగే.. వెయిటింగ్ ఇక్కడా

నాకు చూచాయగా మాటలు వినిపిస్తున్నా పట్టించుకోలేదు.. కొంతసేపటికి అందరూ వచ్చినట్టున్నారు గోల మొదలయ్యింది.. నా పనిలో నేనున్నాను.. కొంతమంది అమ్మాయిలు రూంలోకి వచ్చి నేను ఉండటం చూసి మళ్ళీ వెళ్లిపోయారు.. ఒక అరగంట అరుచుకున్నారు, నవ్వుకున్నారు అబ్బో గోల గోల చేశారు.. చిన్నగా అరుపులు మాయమయ్యేసరికి లేచి బైటికి వెళ్లాను.. ఎవ్వరు లేరు.. ఇంటి వెనకాల పెరట్లో నుంచి మాటలు వినిపిస్తుంటే వెళ్లాను అందరూ దేనికో కుస్తీలు పడుతున్నారు.. సారిక నావైపు చూసేసరికి అందరూ నన్ను చూసారు.. చిన్నగా మెట్ల మీద కూర్చున్నాను.. ఏడుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు మొత్తం పదిమంది వచ్చారు.. ఆ మధ్యలో ఒకడు మాత్రం సారిక ముందు తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.. సారిక తనవైపు చూడటానికి పాపం తెగ ప్రయత్నిస్తున్నాడు.. ఇదేమో నన్నే సీరియస్ గా చూస్తుంది.. అక్కడున్న ఇద్దరు అబ్బాయిలు నా వైపు వచ్చారు.

హాయ్ బాసూ.. నా పేరు హరి వీడి పేరు కిరణ్.. నీ గురించి సారిక ఇందాక చెప్పింది.

వంశీ : ఆహా.. ఏం చెప్పింది

హరి : అదే నువ్వు తనకి తోడుగా ఇక్కడ తనకి హెల్ప్ గా ఉండటానికి వచ్చావని చెప్పింది.. చిన్నప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్ అటగా..

వంశీ : చాలా బాగా కవర్ చేస్తున్నావ్.. పరవాలేదు.. అది నన్ను అమ్మనా బూతులు తిడుతుంది.. నువ్వు కొంచెం దెగ్గరగా చెప్పినా నమ్మేవాడిని కాదు కానీ కనీసం వినేవాడిని

కిరణ్ : (నవ్వుతూ) నిజంగా అంతలా ఎలా కొట్టుకున్నారు

వంశీ : దాన్ని అడగలేదా.. ఇంతలో ఇద్దరు అమ్మాయిలు కూడా మా దెగ్గరికి వచ్చారు.

హరి : లేదు ఒకప్పుడు నీ గురించి తెగ మాట్లాడేది.. క్లాస్ లో ఉన్నంత సేపు ఎప్పుడు నిన్ను తిడుతూనే ఉండేది.. ఇప్పుడు ఎందుకో కొన్ని నెలల నుంచి మౌనంగా ఉంటుంది.. కొంచెం డల్ గా ఉంటుంది.

వంశీ : లాస్ట్ మంత్ వాళ్ళ నాన్న గారు చనిపోయిన రోజులే.. అందుకే డల్ గా ఉండుంటుంది.. ఇంతకీ ఏం చేస్తున్నారు.

హరి : అదిగో వాడు బిర్యానీ చేస్తా అని ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాడు, ఇంతవరకు పొయ్యే వెలగలేదు.. కట్టెలు చికెన్ అన్ని తీసుకొచ్చాం.. వీడిని నమ్ముకున్నందుకు.. తను చెపుతుంటే లేచి వాళ్ళ దెగ్గరికి వెళ్ళాను.

వంశీ : తన పేరేంటి..?

కిరణ్ : వెంకీ

వంశీ : బాబు వెంకీ..

అక్కడున్న అమ్మాయిలు నవ్వారు.. సారిక మాత్రం కోపంగా చూసింది.

వెంకీ : ఏంటి..?

వంశీ : ఏం చేస్తున్నావ్

వెంకీ : కనిపించట్లేదా.. పొయ్యి వెలిగిస్తున్నా.. సారిక.. ఎవడు వీడు.. డిస్టర్బె న్స్

వంశీ : వాడు వీడు అంటే అదిగో ఆ పెద్ద కర్ర ఉంది కదా అది దిగిపోద్ది రోయి.. నేను పర్మిషన్ ఇస్తే.. ఈ పార్టీ జరుగుతుంది.. వచ్చిన పని మాత్రమే చేసుకోండి.. అని సారికని చూస్తూ వెనక్కి తిరిగాను.. సారిక తల దించుకుంది.. ఈ పాటికి నా మీద పడి పిడిగుద్దులు గుద్దేది.. ఎందుకో సైలెంట్ గా ఉంది మరి..

వెంకీ : నువ్వొచ్చి వెలిగించు.. చూస్తాను ఎంత పెద్ద పోటుగాడివో.. కర్రలు పచ్చిగా ఉన్నాయి అందుకే మండట్లేదు.

నేనెళ్ళి మెట్ల మీద కూర్చుని నవ్వుకున్నాను.. అది చూసి వాడికి మండినట్టుంది..

వెంకీ : చూసారా.. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు.. పని చేసే వాడికి తెలుస్తుంది.

వంశీ : పెద్ద కర్రలతో మంట మండదు.. ఇది బేసిక్.. ఏడో తరగతి వాడికి కూడా తెలుసు.. చిన్న చిన్న పుల్లలు పెట్టి మంట వెలిగించి వాటి మీద కర్రలు పెట్టండి అదే మండుకుంటుంది..

ఇంకో పది నిముషాలు పట్టినా ఆ వెంకీ అనే వాడి వల్ల కాలేదు.

వంశీ : అవును నాకు ఒక డౌటు.. ఇంతకీ చికెన్ కలుపుకున్నారా

లేదు బాసూ.. వాడికే తెలియాలి

వంశీ : ఇది బాగుంది.. కనీసం చికెన్ కూడా కలుపుకోకుండా పొయ్యి వెలిగించి ఏం చేస్తారు.. చికెన్ మసాలాలో మగ్గితేనే కదా అది ఊరేది.. మసాలా చికెన్ కి పట్టేది.. అస్సలు మీరు వండేది బిర్యానీయేనా..?

కిరణ్ : ఒరేయి ఏం మాట్లాడవేంట్రా పరువు తీస్తున్నావ్.. అస్సలు నీకు వచ్చా రాదా

నేను లేచి లోపలికి వెళుతుంటే అమ్మాయిలు పిలిచారు వెనక్కి తిరిగాను..

1 అమ్మాయి : వంశీ ప్లీజ్ మాకు హెల్ప్ చెయ్యవా

2 అమ్మాయి : కొనుక్కోచ్చినవన్నీ వేస్ట్ అయిపోతాయి

వెంకీ : ఎహె నన్ను చెయ్యనిస్తారా లేదా అనగానే వంశీ లోపలికి వెళ్ళిపోయాడు.

4అమ్మాయి : సారిక.. తనకి బిర్యానీ చెయ్యడం వచ్చా

సారిక : వాడికి అన్నీ వచ్చు..

6అమ్మాయి : మరి వెళ్లి పిలవ్వే.. ఆల్రెడీ చీకటి పడుతుంది.. ప్లాన్ మొత్తం వేస్ట్ అయ్యేలా ఉంది.. వెళ్ళవే

వెంకీ : ఏం అవసరం లేదు.. నేను చూసుకుంటాను

1అమ్మాయి : నువ్వు ముందు పొయ్యి వెలిగించరా.. సారిక నువ్వెళ్ళి పిలుస్తావా మమ్మల్నే వెళ్లి అడగమంటావా అనేసరికి సారిక కింద పడి ఉన్న అగ్గిపెట్టె తీసుకుని లోపలికి వెళ్ళింది.

నేను లోపలికి వెళ్లి మంచం మీద కూర్చుని నా గేమ్ నేను ఆడుకుంటున్నాను.. పదినిమిషాలకి సారిక వచ్చి నా ముందు నిలుచుంది.. గేమ్ పాజ్ లోపేట్టి తనని చూసాను.. అగ్గిపెట్ట నా మీద వేసి మౌనంగా వెళ్ళిపోయింది. పరవాలేదు కొంచెం బలుపు దిగింది.. ఇంక ఇంతకుమించి అడగలేదులే.. పోనీ మన చేతిలో పనే కదా అని లేచి పెరట్లోకి వెళ్లాను.. వాళ్ళ దెగ్గరికి వెళుతూనే షర్ట్ పైన గుండీలు విప్పి ప్యాంటు కింద మడమ దెగ్గరకి మడుస్తూ వెళ్లాను.

వంశీ : అందరూ హెల్ప్ చేస్తాము అంటే మొదలు పెడదాం

అమ్మాయిలు : తప్పకుండా.. వంశీ.. మేము కూడా నేర్చుకుంటాము.. మాకు కూడా నేర్పవూ..

వంశీ : ముందు బేషన్ తీసుకురండి..

2అమ్మాయి : మరి పొయ్యి..?

వంశీ : ఇప్పుడు అది అవసరం లేదు కానీ ముందు బేషన్ పట్రాండి అనేసరికి సారిక లోపలికి వెళ్లి బేషన్ తెచ్చింది... అందరూ చూడండి.. ముందు చికెన్ కడుక్కుని రండి ఆ తరువాత కొంతసేపు నానబెట్టాలి ఇప్పుడు మనకి అంత టైం లేదు కాబట్టి కొంచెం మజ్జిగ చేసి అందులో చికెన్ నానబెట్టండి సరేనా.. హరి, కిరణ్ చికెన్ ఫ్రై కూడా చేద్దాం వెళ్లి డీప్ ఫ్రైకి ఒక మూడు కిలోల చికెన్ తీసుకురండి.. చిన్నగా కొట్టించండి.. బ్రెస్ట్ పీస్ అయితే బెటర్.

కిరణ్ : అలాగే.. ఇప్పుడు మజా వస్తుంది.. థాంక్స్ బాసు.. కొంతమందిని నమ్ముకుని ఉంటే.. బొగ్గు అయ్యేది అని వెంకీని చూసి నవ్వుతూ వెళ్లారు.

వంశీ : నవ్వకండి.. తనకి అంతో ఇంతో ఐడియా లేకపోతే అలా ముందుకు రాడు.. కొంత కంగారు పడ్డాడు అంతే.. వెంకీ ఆనియన్ కటింగ్ వచ్చా

వెంకీ : వచ్చు..

వంశీ : ఓకే ఆ పని మీద ఉండు.. ఎవరైనా పుదీనా కట్ చెయ్యండి.. మీ ఫ్రెండుని వంట సామాన్లు తీసుకురామ్మని చెప్పండి.. నేనెళ్ళి ఆయిల్ క్యాన్ తెస్తాను అని లోపలికి వచ్చి ఆయిల్ తెచ్చాను.

ఇక రండి పొయ్యి వెలిగిద్దాం.. పొయ్యిలో ఉన్న కట్టెలు తీసేసి చిన్న పుల్లలు రెండు పేపర్లు పక్కనే ఉన్న ఎండిపోయిన కొబ్బరి పీచు పెట్టి ముందు పొయ్యి వెలిగిస్తుంటే వెంకీ ఓరకంటితో చూస్తున్నాడు.. అది వెలగగానే కొంత సేపు ఉంచి మూడు కర్రలు పెట్టి అంటుకునేదాకా ఉండి ఆ తరవాత మిగతా కర్రలు పెట్టాను.. ఫుల్లుగా అంటుకుంది మంట.

అమ్మాయిలు : వావ్

వంశీ : ఏంటి ఎప్పుడు పొయ్యి వెలిగించడం చూడలేదా మీరు..?

అమ్మాయిలు : లేదు

వంశీ : సరిపోయింది.. మూకుడు పెట్టి ఆయిల్ పోసాను.. వెంకీ ఆనియన్ ఫ్రై చెయ్యి.. నేను చికెన్ కలుపుతాను

వెంకీ : అలాగే.. సారీ..

నవ్వాను.. ఒక అమ్మాయి వెళ్లి నానబెట్టిన నీళ్లు పారబోసి చికెన్ తీసుకొచ్చింది.. నేను చెపుతుంటాను వెయ్యండి.. అనగానే సారిక ముందుకు వచ్చింది.

వంశీ : చికెన్ కలుపుతూ.. నిమ్మకాయి పిండండి అనగానే పక్కనే ఉన్న అమ్మాయి నిమ్మకాయి పిండింది.. కలుపుతూ ఇక నేను చెపుతుంటే సారిక చకచకా అన్ని నా చేతిలో వేస్తుంది.. ఉప్పు.. కారం.. కొంచెం నూనె..

అమ్మాయి : నూనె దేనికి వంశీ

వంశీ : బాగా కలవడానికి.. అవును ముందు వెళ్లి బియ్యం కడుక్కుని రండి.. పది మంది అంటే మూడు కిలోలు చాలా ఎక్కువ సరిపోతుందులే వెళ్ళండి.. అని అల్లం వెల్లుల్లి వేసి కలుపుతూ ఇది పక్కన పెట్టేసి మిక్సీలో దాల్చిన చెక్కా, లవంగాలు, యాలుకలు.. బిర్యానీ ఆకు.. అనాస పువ్వు.. కొన్ని మిరియాలు.. కొన్ని జీడీపప్పు వేసి మిక్సీ పట్టండి.. అందరూ అయిమోయంగా చూసేసరికి.. సరే నేను వేసి ఇస్తాను.. మీరు మిక్సీ పట్టండి అనేసరికి ఓకే అని నవ్వారు.

పది నిమిషాలకి ఉల్లిపాయలతో వెంకీ.. చికెన్ తో హరి మరియు కిరణ్, మిక్సీ పట్టిన దానితో అమ్మాయిలు.. పుదీనా కొత్తిమీర కట్ చేసిన అమ్మాయిలు అందరూ వచ్చారు. బాస్మతి బియ్యం కూడా వచ్చేసాయి.

ముందు పొయ్యి మీద కట్ చేసిన ఉల్లిపాయలు వెంకీ వేయించుకుని వచ్చేలోపు నేను చికెన్ కలుపుతాను.. మీరు వెళ్లి హరి వాళ్ళు తెచ్చిన చికెన్ కడగండి. అని ఇందాక పక్కన పెట్టిన చికెన్ బిర్యానీ గిన్నెలోకి మార్చి అందులో పెరుగు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మిక్సీ పట్టిన మసాలా అన్ని వేసి కలిపి ఉప్పు చూసాను.. సరిపోలేదు.. కారం కూడా.. ఇంకొంత వేసి కలిపాను.. ఓకే.

ఇక పొయ్యి మీద గిన్నె పెట్టి ఎసురు పెట్టి అందులో నేను చెపుతుంటే సారిక వేస్తుంది.. అన్ని వేసి కింద కర్రలు లోపలికి పెట్టి మంట పెంచి మూత పెట్టేసాను.. పది నిమిషాలకి ఎసురు మరుగుతుంటే బియ్యం వేసి మళ్ళీ మూత పెట్టాను.. సగం ఉడికెంత వరకు ఎలాగో పనిలేదు కాబట్టి కూర్చున్నాను.. సారిక నా ఎదురుగా కూర్చుని నన్ను చూస్తుంటే నేను ఫోన్ తీసాను.. వెంకీ వచ్చి సారిక పక్కన కూర్చున్నాడు.. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు.. వాడేదో చెపుతుంటే ఇది నవ్వుతుంది.. నవ్వితే నవ్వుకుంది మధ్యలో నన్ను చూడటం దేనికి.

కొంతసేపటికి లేచి చూసాను చాలు ఇంక తీసేయ్యొచ్చు అనిపించింది.. నేము లేవడం చూసి సారిక జాలి గిన్నె పట్టుకొచ్చి నా పక్కన నిలుచుంది.. ఇంతక ముందు ఇక్కడే మేడం నేను కలసి వండుతుంటే చూసిందిగా గుర్తొచ్చి ఉంటుంది.. తన చేతిలో జాలి గిన్న తీసుకుని అన్నం తీసి బిర్యాని గిన్నె మీద ఒంపుతుంటే సారిక చిన్న గంటే తీసుకుని చూట్టు వచ్చేలా చేస్తుంది.. అన్నం మొత్తం ఒంపేసాక.. మీద వేయించిన ఉల్లిపాయలు, పుదీన వేసి మరిగింత నెయ్యి పోసి కొంత జీడి పప్పు కూడా వేసాను.. గిన్నె పొయ్యి మీద పెట్టి మూత పెట్టి.. ఇందాక ఎసురు గిన్నె తీసి ఈ బిర్యానీ గిన్నె మీద పెట్టి.. ఫుల్ మంట పెట్టి ఒక పన్నెండు నిమిషాలకి స్టాప్ వాచ్ పెట్టమన్నాను.

మూత తీసి చూస్తే అన్నం ఓకే ముక్క కుడా ఉడికింది.. అడుగున ఇంకా కొంచెం నీరు ఉంది, కట్టెలు తీసి మంట ఆర్పేసి, కొన్ని బొగ్గులు మూత మీద వేసి.. బరువుగా ఎసురు గిన్నె పెట్టి.. కింద బొగ్గులు వేడి తగిలేలా పెట్టి పక్కకి వచ్చి, ఇందాక తీసుకొచ్చిన చికెన్ లో నిమ్మకాయ పిండి కావలసినవి కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి పెట్టాను.

బిర్యానీ దించాక మళ్ళీ మంట పెట్టి చికెన్ డీప్ ఫ్రై చేసి రెడీ పెట్టాను.. అప్పటికే చీకటి పడిపోయింది.. హరి వాళ్ళ సాయంతో అన్ని లోపల పెట్టాను.. ఇంతలో ఫోన్ వస్తే మేడం రూంలోకి వెళ్లాను.

సారిక ఇంతసేపు వంశీని చూస్తూనే ఉంది.. అందరూ చూస్తున్నారని గమనించినా ఎలాగోలా వంశీని.. వాడు పడుతున్న కష్టాన్ని చూస్తూనే ఉంది.. వంశీతో ఏదో మాట్లాడదామని తన వెనకే వెళ్లిన సారిక వంశీ ఫోన్లో మాట్లాడుతుండడం చూసి ఆగిపోయి అక్కడే నిలుచొని తొంగి చూస్తుంది.
Next page: Episode 08
Previous page: Episode 06