Episode 02
చిన్నోడు సిద్ధూ ఉద్యోగంలో చేరిన నాలుగు నెలల తరువాత వాడికి కూడా పెళ్లి చెయ్యాలని నాన్న నిర్ణయించాడు. అదే అందరం వాడిని కూర్చోబెట్టి అడిగాము.
భారతి : సిద్దు, ఏం మాట్లాడవే ఏదైనా చెప్తేనే కదా మాకు తెలిసేది.
సిద్దు : అదీ నేనొక అమ్మాయిని ప్రేమించాను, మీరు ఒప్పుకుంటే తననే పెళ్లి చేసుకుందామని... అని ఆపేసి నాన్నని చూసాడు.
అందరం నాన్న వైపు తిరిగాము, నాన్న మూడే మూడు ముక్కల్లో తేల్చేసాడు ''రేపు ఒకసారి పిలువు" అని. అందరం సంతోషించాం. ఆ తెల్లారే సిద్దు అమ్మాయిని తీసుకొచ్చాడు తన పేరు సురేఖ.. చాలా అందంగా ఉంది మాకు నచ్చింది కానీ అమ్మాయికి సర్దుకుపోయే గుణం లేదు, తన మాటల్లోనే తెలుస్తుంది, కొంచెం పంతం ఎక్కువే అని గమనించాను, తనకి మా ఇల్లు కూడా నచ్చలేదు తన మొహంలో కనిపించింది. అమ్మాయి వెళ్ళిపోయాక సిద్దు మమ్మల్ని చూసాడు.
రఘు : నాకు ఆ అమ్మాయి నచ్చలేదు, నీకు అస్సలు సెట్ అవ్వదు అయినా కానీ నా మాట వినను అంటే నీ ఇష్టం, నాకు అభ్యంతరం లేదు కానీ ఆ అమ్మాయి నీకు సెట్ అయ్యేలా కనిపించట్లేదు రా సిద్దు వాళ్ళు చాలా డబ్బులున్నోళ్లు, చూస్తుంటే అస్సలు డబ్బుకి విలువనిచ్చేలా ఆ అమ్మాయి కనిపించడం లేదు. మనం రూపాయి రూపాయి దాచుకుంటే ఇక్కడిదాకా వచ్చాం. తనకి నీకు అస్సలు పొంతనేలేదు. ఒక్కసారి ఆలోచించి చూడు అని లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకెవ్వరం ఏమి మాట్లాడలేదు, రాత్రి పడుకునే ముందు సిద్దు నా దెగ్గరికి వచ్చాడు.
సిద్దు : అక్కా
భారతి : ఏంటి నాన్నా
సిద్దు : ఆ అమ్మాయి నీకు కూడా నచ్చలేదా?
భారతి : (వాడి మొహంలో బాధ గమనించాను) లేదు నాకు నచ్చింది, చాలా అందంగా ఉంది .
సిద్దు : మరి నాన్నా...
భారతి : చూడు సిద్దు నాన్న చెప్పినా ఎవరు చెప్పినా నీ మంచి కోసమే, అయినా అయన కచ్చితంగా వద్దు అని చెప్పలేదు కదా, నీకు సలహా మాత్రమే ఇచ్చారు. ఒకసారి నువ్వు కూడా అలోచించి నిర్ణయం తీసుకో నీ వెంటే మేమందరం అని వాడికి నచ్చజెప్పాను.
"అవును రా సిద్దు.." అని వెనక నుంచి భుజం మీద చెయ్యి వేసి వెన్ను తట్టింది వదిన మధు. తరవాత ఏం జరుగుతుందో నాకు తెలిసుంటే అస్సలు పెళ్లి జరగనిచ్చేదాన్ని కాదు. నేను ఎంత పెద్ద తప్పు చేసానో ఆ తరువాతే అర్ధమయ్యింది నాకు.
ఇరువైపులా అభ్యంతరం లేకపోవడంతో పెళ్ళికి ఏ ఆటంకం రాలేదు అప్పుడప్పుడు వాళ్ళ మాటల వల్ల కొంచెం బాధ పడ్డా ఎవ్వరం పట్టించుకోలేదు పెళ్లి అయ్యి అందరం కారులో అమ్మాయిని తీసుకుని ఇంటికి తిరిగి వస్తునాం. ముందు కారులో సంపత్ డ్రైవ్ చేస్తుంటే నాన్న తన ఒళ్ళో లావణ్య, మా వారు మధు వాళ్ళ నాన్న ఇంకో ఇద్దరు కూర్చున్నారు, వెనకాల కారులో సిద్దు డ్రైవ్ చేస్తుంటే నాతో పాటు పెళ్లి కూతురు, మధు, మధు వాళ్ళ అమ్మ, మా అమ్మ, పిల్లలు అందరం బైలుదేరాం, మిగతా వాళ్ళు ట్రైన్ కి వస్తున్నారు.
అందరం ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వులతో ఆనందంగా వస్తున్నాం, ఏమైందో ఎలా జరిగిందో తెలీదు రెప్ప పాటులో మా ముందు ఉన్న కారు గాల్లోకి ఎగిరి పల్టీ కొట్టి ఆగిపోయింది. వెంటనే సిద్దు కార్ ఆపగానే అందరం పరిగెత్తాం, హైవే మీద అందరూ గుమిగుడారు అంబులెన్సు రావడం మేమందరం దాని వెనకే హాస్పిటల్ కి వెళ్లడం అన్ని త్వరగా జరిగిపోయాయి. లోపలికి తీసుకెళ్లారు.. సిద్దు చేతిలో ఉన్న లావణ్యని చూసాను నాన్న తనని చుట్టేశాడో ఏమో తనకి దెబ్బ తగల్లేదు కానీ స్పృహలో లేదు.
పావుగంటలో డాక్టర్ బైటికి వచ్చి చెప్పేసాడు.. నా భర్త, నా తమ్ముడు, మధు వాళ్ళ నాన్న అందరూ చనిపోయారని. నాన్నకి రెండు కాళ్ళు పని చెయ్యవట లావణ్యకి మాత్రం ఇంకా స్పృహ రాలేదు. విషయం తెలుసుకుని అటు వైపు పెళ్లి వారు కూడా వచ్చారు. రాత్రికి లావణ్యకి స్పృహ వచ్చింది మధుతో పాటు వెళ్లాను తన బుగ్గ మీద చిన్న గాటు బానే ఉంది కానీ దెబ్బ తలకి తగలడం వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ రావొచ్చని చెప్పాడు. మా వాళ్ళని తీసుకుని ఇంటికి వచ్చేసాం.
ఆ తెల్లారే జరగాల్సిన కార్యక్రమాలన్ని జరిగిపోయాయి, వారం వరకు అస్సలు ఎవ్వరం తెరుకోలేకపోయాం చిన్నా, ప్రణీత, అమ్ములు(లావణ్య) నాన్న ఎక్కడా మావయ్య ఎక్కడా అని అడుగుతుంటే పక్కకి వెళ్లి ఏడవటం తప్ప ఇంకేం చెయ్యలేక పోయాం...........
పేజీ తిప్పాను అన్ని కాళీ పేజీలు.. మా పంతులమ్మ చెప్పింది డైరీలో మనం రాసుకున్నవి మన చివరి రోజుల్లో చదివితే ఆ మధురానుబూతులు గుర్తుతెచ్చుకుని ఆస్వాదించవచ్చని కానీ నాకు ఇక రాయాలనిపించలేదు, అందుకే తరువాత అన్ని కాళీ పేజీలు ఉన్నాయి.. డైరీ లోపల పెట్టేసి బైటికి వచ్చి చూసాను రాత్రి పదకొండు అవుతుంది.
పక్క రూంలో అమ్మా నాన్నా పడుకొని ఉన్నారు, ఇంకో రూంలో లైట్ వేసే ఉంది. మధు తన పక్కనే నా కూతురు ప్రణీత పడుకున్నారు, లావణ్య మాత్రం ఏదో చదువుతూనే ఉంది. ఆక్సిడెంట్ అయిన దెగ్గర నుంచి లావణ్య నిద్రపోవడం మానేసింది. నిద్ర పోయినప్పుడల్లా తనకి ఆ ఆక్సిడెంట్ జరిగిందే గుర్తొచ్చి వెంటనే లేచేస్తుంది అందుకే అది అస్సలు పడుకోదు.. అలిసిపోతేనో లేక ఆపుకోలేనంత నిద్ర వస్తేనో తప్ప అది నిద్రపోదు.. డాక్టర్ కి చూపించాను, సైకియాట్రిస్ట్ కి చూపించాను కానీ లాభం లేదు ఇప్పుడెందుకు నిద్ర పోలేదంటే రేపు చిన్నా వస్తున్నాడు.. నాకంటే అదే ఎక్కువగా ఎదురు చూస్తుంది వాడి కోసం.
అవును వాడు ఇంట్లో ఉండట్లేదు కాదు ఉంచలేదు, సిద్దు పెళ్ళైయ్యాక తన భార్య సురేఖ వల్ల చాలా మనస్పర్థలు వచ్చాయి. తను ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్లే మాకు ఇలా జరిగిందని మేము అనుకుంటున్నామని భ్రమ పడింది. చిన్న చిన్న వాటికి కూడా సర్దుకుపోయేది కాదు. సిద్దు మా పక్కన కూర్చుని ఐదు నిమిషాలు మాట్లాడితే చాలు తన గురించి మేము ఏదేదో చెపుతున్నామెమో అని అస్సలు మమ్మల్ని వాడితో గడపనిచ్చేది కాదు. పిల్లల్ని కూడా వాడికి దూరం పెట్టేది కొన్ని సంవత్సరాలు మేమూ పట్టించుకోలేదు.. కానీ పిల్లలు పెద్దయ్యే కొద్ది వాళ్ళకి తెలుస్తుంది.
సిద్దు కి ఇద్దరు పెద్దది అక్షిత, చిన్నోడు చందు ఇద్దరు బార్న్ విత్ సిల్వర్ స్పూన్స్ అంటారు కదా, వాళ్ళకి లేని లోటు లేదు ఎక్కువగా అమ్మమ్మ గారింట్లోనే పెరిగిన పిల్లలు, వాళ్ల అమ్మమ్మ వాళ్ళు అన్ని సమాకూర్చేవాళ్ళు. మాకు వాళ్ళకి అంత చనువు వచ్చేలా సురేఖ వాళ్ళని మాతో కలవనివ్వలేదు.
ప్రణీత, లావణ్య పరవాలేదు సురేఖకి తన పిల్లలకి దూరంగానే ఉండేవాళ్ళు కానీ చిన్నా గాడికి ఇవన్నీ అర్ధం అయినా కావాలని సురేఖతో గొడవ పెట్టుకునే వాడు. చిన్నాకి సిద్దు అంటే చాలా ఇష్టం ఎక్కువగా వాడి మావయ్యతో గడపడానికి ఇష్ట పడేవాడు అది సురేఖ అస్సలు ఓర్చుకునేది కాదు. సిద్దు గాడికి ఇదంతా ఆలోచించి అందరిని దార్లో పెట్టేంత సమయం వాడి దెగ్గర ఉండేది కాదు, ఒక్కడే మా అందరినీ పోషించడానికి చాలా ఎక్కువగా కష్టపడేవాడు అందుకే ఇలాంటి తలనొప్పి యవ్వారాలకి దూరంగా ఉండేవాడు.. పిల్లలకి ఏదైనా కొనిచ్చినా సురేఖకి తెలియనిచ్చేవాడు కాదు అలా జరుగుతున్న రోజుల్లో చిన్నా గాడి వల్ల నాకు ఇంకో సమస్య వచ్చి పడింది ఈ సారి అది అక్షిత రూపంలో..
వాడికి అక్షిత అంటే ఇష్టమని తెలియడానికి నాకు ఎక్కువ రోజులు పట్టలేదు, ఇంట్లో అందరూ గమనించే ముందే వాడిని హెచ్చరిద్దామని అనుకున్నాను కానీ బాధ పడతాడేమో అని మౌనంగా ఉన్నాను.. కానీ ఈ విషయంలో సురేఖ చిన్నాని కోప్పడిందని మాకు తరవాత చిన్నా చెపితే తెలిసింది, చిన్నా గాడస్సలు పట్టించుకోలేదు.. వాడస్సలు సురేఖ అనే ఒక మనిషి ఇంట్లో లేదు అన్నట్టు ప్రవర్తించేవాడు. అక్షిత కూడా అంతే చిన్నాని అస్సలు వదిలిపెట్టేది కాదు, దాని తమ్ముడు చందు అమ్మ కూచి, వాడు మాకు దూరంగానే ఉండేవాడు కానీ అక్షిత మాలో కలిసిపోయేది వాళ్ల అమ్మ వచ్చినప్పుడు మాత్రం నటించేది వెళ్లిపోయాక మా ఒళ్ళో వాళ్లిపోయేది.. అది చిన్నా గాడికి నచ్చిందేమో.. ఒకరోజు అక్షిత చిన్నా ఆడుకుంటూ లావణ్యని పట్టించుకోలేదట అది ఏడ్చుకుంటూ నా దెగ్గరికి వచ్చి చెప్పింది పక్కనే ఉన్న మధు కూడా అది విని మొహం మాడ్చెసింది.
నేనూ గమనిస్తూనే ఉన్నాను చిన్నా అక్షితల మధ్య రోజు రోజుకి చనువు పెరుగుతుంది, ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని భయం వేసింది అన్నిటికంటే ముఖ్యంగా చిన్నాకి లావణ్యనే అనుకున్నాం.. మధు కూడా చాలా ఆశపడుతుంది.. తండ్రి లేని పిల్ల, నిద్ర లేమి సమస్య ఉంది ఇలాంటి పిల్లని బైట ఇచ్చే సమస్యే లేదు చిన్నా గాడికేనని మేము ఎప్పుడో నిర్ణయించేసుకున్నాం.. కానీ లెక్కలు మారేలా ఉన్నాయి అనిపించింది.
భారతి : అమ్ములు నువ్వెళ్ళి ఆడుకో నేను బావతో మాట్లాడతాను.. మధు అన్నం మాడుతుంది వెళ్ళు.. ఒకసారి చిన్నాని ఇటు రమ్మను.. రూంలో ఉంటాను.
మధు : వదిలేయి వదినా పిల్లలదేముంది
భారతి : దాని గురించి కాదులేవే పిలు.. అని రూంలోకి వెళ్ళిపోయింది.
రెండు నిమిషాలకి తలుపు చప్పుడు అయితే తల ఎత్తి చూసింది భారతి.
భారతి : చిన్నా ఇలా రా, కూర్చో.. ఏం చేస్తున్నావ్?
"ఊరికే ఆడుకుంటున్నాం"
భారతి : నిన్ను హాస్టల్లో వేద్దామనుకుంటున్నా
"అలాగా"
భారతి : వెళతావా
"అలాగే"
భారతి : బాధపడుతున్నావా?
"లేదు, నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం" అని లేచాడు
భారతి : ఇంకోటి, నాకొక మాటివ్వాలి
"ఎందుకే జోకులు చేస్తావ్, చెప్పు నీకేం కావలి"
భారతి : పెద్దయ్యాక లావణ్యని పెళ్లి చేసుకుంటానని మాటివ్వు... అని చెయ్యి చాపింది.
"ఓస్.. అంతేనా.. ఇదిగో ప్రామిస్.. సరేనా.. ఇక వెళ్ళనా"
భారతి : ఎక్కడికి?
"ముందు అమ్ములుకి సారీ చెప్పాలి"
భారతి : వెళ్ళు
చిన్నా బైటికి వెళ్ళగానే, ఇప్పటి వరకు జరిగిందంతా విన్న మధు లోపలికి వచ్చి భారతి ముందు కూర్చున్నది.
భారతి : ఏంటే
మధు : వాడిని హాస్టల్లో ఎందుకు
భారతి : వెళ్లనీ, వెళతా అన్నాడుగా
మధు : నువ్వు చెప్పావని ఒప్పుకున్నాడు, వాడికి ఇష్టంలేదు
భారతి : తెలుసు
మధు : వాడు బాధపడతాడు
భారతి : ఎప్పుడైనా వాడి మొహంలో అది నువ్వు గమనించావా
మధు : మాకు తెలీదు కానీ నీకు తెలుసుగా వాడు బాధలో ఉన్నాడో లేదో
భారతి : నేనేం చెప్పినా చేస్తాడు, అస్సలు బాధ పడడు.. నువ్వు ఫీల్ అవ్వకు.
మధు : మరి లావణ్య విషయం?
భారతి : అందులో ఏముంది?
మధు : చిన్న వయసులో మాట ఎందుకు తీసుకున్నావ్, వాడికి నచ్చిన వాళ్ళని చేసుకొనీ అది లావణ్య అయితే సంతోషం కానీ ఇలా వద్దు.
భారతి : వాడేం చిన్న పిల్లోడు కాదు, నేను లావణ్య అన్న పేరు ఎత్తగానే వాడికి ఏ టు జెడ్ మొత్తం అర్ధం అయ్యింది.. అందుకే చివర్లో అమ్ములుకి సారీ చెప్తా అని వెళ్ళాడు.. వాడికి అన్ని తెలుసు నువ్వేం కంగారు పడకు కొన్ని విషయాలు నాకు వదిలేయి.
లావణ్య : అత్తా... అత్తా...
భారతి : హా..
లావణ్య : ఏం ఆలోచిస్తున్నావ్, బావ గురించా... రేపు వస్తాడులే పడుకోపో
భారతి : మరి నువ్వు?
లావణ్య : పడుకుంటాలే
భారతి : సరే నేను వెళుతున్నా..
లోపలికి వచ్చి మంచం మీద పడుకున్నాను.. జరిగినదానికి ఇప్పటికే అమ్మా నాన్న ఇప్పటికి భాధ పడుతూనే ఉన్నారు, ఎప్పుడు అల్లరిగా మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండే మా అమ్మ అస్సలు రూంలో నుంచి బైటికి రావడం లేదు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపిస్తే నా రూంకి వస్తుంది లేదంటే లేదు.. నాన్న అన్ని గమనిస్తున్నా ఏమి మాట్లాడలేదు.. ఇక చిన్నా ని హాస్టల్లో వేసాను... పది పన్నెండు రోజుల పండగ సెలవలు లేక సమ్మర్ హాలిడేస్ కి మాత్రమే ఇంటికి వచ్చేవాడు. ఒక్క రోజు రెండు రోజులకి మాత్రం వచ్చేవాడు కాదు.
ఆ తరువాత మూడేళ్ళకి అటు అత్తగారింటి పోరు ఇటు పెళ్ళాం పోరు పడలేక సిద్దు అమెరికా వెళ్ళనా అని నన్ను అడిగాడు, వాడి మీద జాలేసింది కానీ చాలా గర్వంగా ఫీల్ అయ్యాను వాడు ఇప్పటికి నన్ను పర్మిషన్ అడిగినందుకు, అమెరికా వెళితే వాళ్ళకంటూ ఒక మంచి జీవితం ఏర్పడుతుంది ఎన్ని రోజులని మా జీవితాలని వాడి ఎదుగుదలకి అడ్డు వెయ్యను, అందుకే నాన్నతో మాట్లాడి ఉన్న ఆస్తులని సమానంగా పంచమన్నాను.. నాకు నచ్చింది చెయ్యమన్నాడు.
మూడు వాటాలు చేసి ఒకటి సిద్దు పేరు మీదా, ఒకటి నా కూతురు ప్రణీత మీదా, ఇంకోటి మధు పేరు మీదా రాపించాను. మధు చాలా ప్రశ్నలు అడిగింది అన్నిటికి నవ్వాను.
మధు : మొత్తం ప్రణీతకి ఇచ్చేస్తే మరి నీకు
భారతి : నాకెంటే నా కొడుకు లేడు
మధు : మరి ఇది లావణ్య పేరు మీద కాకుండా నా పేరు మీద రాసావ్?
భారతి : లావణ్య నా కోడలు దానికి నా కొడుకున్నాడు అవసరం లేదు.
మధు : అంతేలే నేనే పరాయిదాన్ని
భారతి : నువ్వు సెంటిమెంట్ డైలాగులు ఆపు, నాకు తెలుసు ఏం చెయ్యాలో.
మధు : ఆ పుస్తకాలు చదివి చదివి నీకు పిచ్చి ఎక్కింది ఇదిగో కాయితాలు నువ్వే ఉంచుకో, నాకేం అవసరం లేదు.. అని కోపంగా వెళ్ళిపోయింది.
భారతి : నిజంగానే నా మధు పిచ్చిది.. నా తమ్ముడు పోయిన రెండేళ్లకి అడిగాను లావణ్యని నేను పెంచుకుంటాను ఇంకో పెళ్లి చేసుకోమని.. ఎలా ధైర్యం వచ్చిందో ఏమో నన్ను ఎదిరించడానికే భయపడే నా మధు నా మీద చెయ్యి చేసుకుంది.. "నీ తమ్ముడంటే ప్రేమతో కాదు నేను ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది, నిన్ను వదిలి ఉండలేక" అని చెప్పకనే నా మీద ఉన్న ప్రేమని బయటపెట్టి ఏడ్చేసింది.
సిద్దు వాళ్ళు అమెరికా వెళ్లిపోయారు ఉన్న ఆస్తిలో కొంత అమ్మేసాను అది ముగ్గురు పిల్లల చదువుకి సరిపోతుంది.. కానీ లావణ్య అడ్డం తిరిగింది.. పది అయిపోగానే ఇక నేను చదవను అని చెప్పేసింది. అస్సలు కారణం నాకు మాత్రమే తెలుసు అది క్లాస్ లో నిద్ర పోయిందో లేక ఎప్పుడు వీక్ గా ఉంటుంది, ఎక్కువ స్టామినా ఉండదు దానికి తోడు దాని బుగ్గ మీద పెద్ద గాటు.. అర్ధం చేసుకున్నాను.. మధు ధైర్యం చెప్పింది కానీ లావణ్య ఒప్పుకోలేదు.. ఇలా సర్టిఫికెట్స్ కోసం కాకుండా తనకి ఏది చదవాలనిపిస్తే అది తనకి ఇష్టం వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంది చదువుకుంటా అడిగిన బుక్స్ కొనిస్తే చాలు అని చెప్పింది. ఆశ్చర్యం వేసినా ఒప్పుకున్నాను.. తరవాత మధు నన్ను కూడా తిట్టింది నా వల్లే అది ఆలా తయారు అయ్యిందని.. నిజమే అది చదివినదానికంటే దానికి నేను నేర్పిందే ఎక్కువ.
ప్రణీత b.tech అయిపోడానికి ఇంకా ఒక సంవత్సరం ఉంది, చిన్నా ఇంటర్ అయిపోయింది రేపు వస్తున్నాడు, ఈ రెండు సంవత్సరాలు ఎందుకో ఇంటికి రాలేదు, ఎందుకో నాకు చెప్పలేదు వాడు నన్ను అర్ధం చేసుకున్నట్టే నేను వాడిని ఏమి అడగలేదు, వచ్చాక చెపుతాడులే అనుకున్నాను. సిద్దు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు వారానికి ఒకసారి అక్షిత కూడా ఫోన్ చేస్తుంటుంది, అది ఇంకా వాడిని మర్చిపోలేదు ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది ఎలా ఉన్నాడు, ఎలా చదువుతున్నాడు, వాడికి ఏమేమి ఇష్టం అన్ని తెలుసుకుంటుంది వాడి గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంది ఇవేవి వాడికి తెలియనివ్వలేదు.. అలా అని అక్షితని ఎప్పుడు బాధ పెట్టలేదు తను నొచ్చుకునేలా కూడా ఎప్పుడు ప్రవర్తించలేదు ఓపికగానే ఉన్నాను.. ఇలా అన్ని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను.. తెల్లారి మెలుకువ వచ్చి చూస్తే నా పక్కనే నన్ను వాటేసుకుని పడుకుని నన్నే చూస్తున్నాడు చిన్నా