Episode 106


సురేష్ షూట్ చేస్తాడు అని నేను ముందే గ్రహించి సోనియాకు అడ్డంగా వెళ్ళి నిల్చుని సోనియాను పక్కకి తోసేసాను. దాంతో సోనియా కిందపడిపోయి బుల్లెట్ నా ఎడమ భుజానికి కొంచెం కింద గుండెకు పైన తగిలింది. నాకు బుల్లెట్ తగలడంతో సోనియా మరియు కవిత ఒకేసారి గట్టిగా సన్నీన్నీన్నీన్నీన్నీన్నీ,,,,,,, అని అరిచారు. బుల్లెట్ తగలగానే నేను కూడా సోనియా పక్కనే నేలపై పడిపోయాను. సురేష్ మళ్లీ రెండోసారి షూట్ చెయ్య బోతుంటే కవిత వెంటనే నాకు అడ్డంగా వచ్చి ఆ వచ్చే బుల్లెట్ తనకు తగిలేలా నాకు అడ్డంగా నిలిచింది. బులెట్ తగిలి నేను కిందపడగానే సోనియా వెంటనే నన్ను కౌగిలించుకుని గట్టిగా పట్టుకుని తన శరీరాన్ని నా ఛాతికి ఆనించి నన్ను రెండో బుల్లెట్ తగలకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది. కవిత నా ముందుకు వచ్చి మోకాళ్లపై కూర్చుని నాకు అడ్డంగా నిలిచింది.

సురేష్ గాడు నవ్వుతూ మాట్లాడుతూ, అబ్బబ్బబ్బా ఎంతైనా నీ ప్రియురాళ్ళను మెచ్చుకోవాల్సిందేరా. ఒక దాని కోసం నువ్వు చచ్చి పోవడానికి రెడీ అయితే నీ కోసం చచ్చి పోవడానికి ఇంకొకతి రెడీ అయిపోయింది. నేను ఒక్కదాన్నే చంపాలని అనుకున్నాను. కానీ ఇద్దరిని చంపేస్తే పోలా. నీకు కావలసిన ఇద్దరిని నీకు దూరం చేస్తే నువ్వు ఇంకా బాగా బాధపడొచ్చు. సురేష్ గాడు కవితకు గురిపెట్టి షూట్ చేశాడు. కానీ వాడు షూట్ చేసిన వెంటనే వాడే నేల మీద పడిపోయాడు.

ఏం జరిగిందో అని నేను కంగారుపడి చూడగా గేట్ దగ్గర ఖాన్ భాయ్ కనపడ్డారు. ఖాన్ భాయ్ చేతిలో గన్ పట్టుకొని సురేష్ గాడి కాళ్లను షూట్ చేశారు. సురేష్ గాడికి బుల్లెట్ తగిలిన వెంటనే నేల మీద పడి ఖాన్ భాయ్ వైపు షూట్ చేశాడు. కానీ ఖాన్ భాయ్ బుల్లెట్ నుంచి తప్పించుకోవడంతో బుల్లెట్ వెళ్లి గేట్ కి తగిలింది. అప్పుడు ఖాన్ బాయ్ మళ్లీ రెండోసారి సురేష్ ను షూట్ చేయడంతో వాడు పూర్తిగా నేలకొరిగి వాడి చేతిలో ఉన్న గన్ కింద పడిపోయింది. చూడగా బుల్లెట్ వాడి గుండెకు తగిలినట్టుంది. బహుశా వాడు చచ్చి ఉంటాడు.

సురేష్ గాడు కింద పడిన వెంటనే కవిత వాడి దగ్గరకు పరుగెత్తి వాడి చేతిలో నుంచి పడిన గన్ అందుకోబోతుంటే అది చూసి ఖాన్ భాయ్ కవితను ఆపుతూ, వద్దమ్మా అలా పట్టుకోవద్దు. దానిమీద అతని వేలిముద్రలు ఉంటాయి. అదే మాకు సాక్ష్యంగా ఉపయోగపడుతుంది అని అన్నారు. నిజానికి కవిత ఆ గన్ తీసుకొని మిగిలిన బుల్లెట్లు వాడి శరీరంలోకి దింపాలని అనుకుంది. కానీ ఖాన్ భాయ్ తనను వెనకనుంచి పట్టుకొని ఆపడంతో కవిత కోపంతో ఊగిపోతూ వాడి శరీరాన్ని కాలితో ఇష్టం వచ్చినట్టు తంతూ, నీకెంత ధైర్యంరా నా సన్నీని షూట్ చేయడానికి? నీ రక్తం తాగుతానురా పాపిష్టి ఎదవ అంటూ కవిత కోపంతో అరుస్తూ వాడిని కాలితో తంతుంది. అప్పుడు ఖాన్ భాయ్ మాట్లాడుతూ, ఇక ఆపమ్మా, వాడు చచ్చిపోయాడు అని చెబుతున్నా సరే కవిత అతని మాట వినడం లేదు.

అప్పుడు నేను నెమ్మదిగా మాట్లాడుతూ, ఇక చాలు కవిత వాడు చచ్చిపోయాడు అని అనగానే నా మాట విని కవిత వెంటనే నా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది. అప్పుడు ఖాన్ బాయ్ కవిత మరియు సోనియాలకు నాకు బుల్లెట్ తగిలిన చోటా గట్టిగా నొక్కి పట్టుకోమని చెప్పారు. మీరిద్దరూ దెబ్బ తగిలిన చోట గట్టిగా నొక్కి పట్టుకుని రక్తం బయటికి పోకుండా చూడండి. నేను వెంటనే ఆంబులెన్స్ కు కాల్ చేస్తాను అని అన్నారు. .... కానీ భాయ్ మీరు ఇక్కడకు ఎలా? అంటూ నేను చిన్న గొంతుతో ఖాన్ భాయ్ ని అడిగాను. ....

నాకు వీడి బాబు నుంచి ఫోన్ వచ్చింది సన్నీ. వీడు ఇంట్లో నుంచి గన్ పట్టుకొని నిన్ను చంపడానికి నీ ఇంటికి బయల్దేరాడు అని, మీరు కావాలంటే ఏదైనా చేయండి కానీ మళ్ళీ వాడు మరో నేరం చేయకుండా ఆపండి అని అతను చెప్పాడు. అతను చెప్పింది నాకు అర్థమైంది. వెంటనే నేను నీకు ఫోన్ కూడా చేశాను. కానీ ఎన్నిసార్లు చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకే నేనే స్వయంగా నీకు విషయం చెప్పడానికి మీ ఇంటికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇలా,,,,,, .... మీరు సరైన సమయానికి వచ్చి మంచి పని చేశారు. లేదంటే ఈరోజు నేను,,,, అని నేను మాట్లాడుతూ ఉండగా సోనియా వెంటనే తన చేతితో నా నోరు మూసేసి, తను ఏడుస్తూ నా నోటినుంచి ఎటువంటి అశుభం మాట్లాడటానికి వీలు లేదని చెప్పింది. కవిత కూడా నా పక్కనే కూర్చుని ఏడుస్తుంది.

తర్వాత ఖాన్ బాయ్ అంబులెన్స్ కు ఫోన్ చేస్తూ ఉంటే నేను నేల మీద పడి సోనియా ఒడిలో తల పెట్టుకుని ఉన్నాను. సోనియా ఒకచేత్తో నాకు బుల్లెట్ తగిలిన చోట గట్టిగా నొక్కి పట్టుకుని మరో చేత్తో నా తలను ప్రేమగా నిమురుతూ ఉంది. కవిత కూడా తన చేతిని సోనియా చేతి మీద వేసి మరింత గట్టిగా నొక్కి పట్టుకుంది. కానీ అప్పటికే చాలా రక్తం పోవడం వలన నేను సోనియా ఒడిలో స్పృహ కోల్పోయాను. తిరిగి నాకు స్పృహ వచ్చేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. నా పక్కన ఒక నర్సు నిల్చొని నాకు రక్తం ఎక్కిస్తూ ఉంది. నేను చిన్నగా కళ్ళు తెరిచి అటు ఇటు చూసేసరికి నా పక్కన ఒక టేబుల్ పై కవిత కూర్చుని ఉంది. నా భుజానికి కట్టుకట్టి ఉండగా, కవిత నా పక్కనే కూర్చుని తన తలను బెడ్ పై ఆనించి ఉంది. బహుశా తను పడుకుంది కాబోలు. నాకు తెలివి వచ్చిన వెంటనే నర్స్ బయటకు పరిగెత్తింది. దాంతో వెంటనే కవిత మేల్కొంది. నాకు స్పృహ వచ్చింది అని చెప్పడానికి నర్స్ డాక్టర్ దగ్గరకు వెళ్లగా, కవిత లేచి నన్ను చూసి ఏడుస్తూ నన్ను గట్టిగా కౌగిలించుకుంది.

ఇప్పుడు ఎలా ఉంది నీకు? బాగా నొప్పిగా ఉందా? అని కవిత అడగగా నేను సమాధానం చెబుతుండగా అమ్మ, అత్తయ్య మరియు శోభక్క అక్కడికి వచ్చారు. అందరి కళ్ళు చెమ్మగిల్లి ఏడుస్తూ కనిపించారు. అంతలో వెనుకనుంచి డాక్టర్ వచ్చి, వెళ్లండి వెళ్లండి ఇక్కడ ఇంత మంది ఉండకూడదు. అతనిని కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి అని అనగా, అమ్మ మాట్లాడుతూ, ఇప్పుడు నా బిడ్డకు ఎలా ఉంది డాక్టర్? ప్రమాదం ఏమీ లేదు కదా? అని అడిగింది. .... లేదమ్మా ఎటువంటి ప్రమాదం లేదు. బుల్లెట్ పైపైనే తగలడంతో పెద్ద ప్రమాదం ఏమీ లేదు. అలాగే గుండెకు గాని ఎముకకు గాని తగలకపోవడంతో మీ అబ్బాయి బతికిపోయాడు. ఈ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. కానీ బుల్లెట్ శరీరం మీద తగిలి కొంచెం చీలుకుపోయి కొంచెం రక్తం ఎక్కువగా పోయింది. ఇప్పుడు ఇంకేమి కంగారు పడవలసిన పని లేదు. కొద్దిగా రక్తం ఎక్కిస్తే చాలు. ఇక తనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇప్పుడు మీరు బయటకు వెళ్లండి. నేను ఇతనిని చెక్ చేయాలి. తర్వాత ఇతనిని ప్రైవేట్ రూమ్ కి షిఫ్ట్ చేస్తాము. అప్పుడు మీరు తీరికగా ఇతనిని కలవచ్చు.

డాక్టర్ చెప్పగానే అందరూ బయటకు వెళ్ళిపోయారు. కానీ కవిత మాత్రం వెళ్లలేదు. డాక్టర్ కవితను కూడా వెళ్ళిపొమ్మని చెప్పగా కవిత అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు అమ్మ మాట్లాడుతూ, తనని ఇక్కడే ఉండనివ్వండి డాక్టర్. వచ్చిన దగ్గర నుంచి వాడిని వదలకుండా వాడి దగ్గరే ఉంది అని అంది. అందరూ బయటకు వెళ్లిపోయినా కవిత మాత్రం నా చేతిని పట్టుకుని అక్కడే కూర్చుని ఉంది. డాక్టర్ నన్ను చెక్ అప్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత నన్ను వేరే రూమ్ కి షిఫ్ట్ కూడా చేశారు. రూమ్లో నా చుట్టూ అందరూ ఉన్నారు. అమ్మ, అత్తయ్య, శోభక్క, కవిత కానీ సోనియా లేదు. నా కళ్ళు సోనియా కోసం వెతుకుతున్నాయి. అత్తయ్యకు ఆ విషయం అర్థమై, సన్నీ సోనియా ఇక్కడే ఉంది. మరికాసేపట్లో వచ్చేస్తుంది అని అంది. .... కానీ అత్తయ్య సోనియా ఎక్కడుంది? .... అప్పుడు అమ్మ మాట్లాడుతూ, అది నీ కోసం రక్తం ఇస్తుంది. మాలో ఎవరి రక్తం కూడా నీ రక్తం గ్రూపుతో సరిపోవడం లేదు. సోనియా రక్తం మాత్రమే నీ గ్రూప్ తో మ్యాచ్ అయింది. అందుకే అది నీ కోసం రక్తం ఇస్తుంది.

అప్పుడు నర్స్ రూమ్ లోకి వచ్చింది, మీ అమ్మాయి మిమ్మల్ని పిలుస్తుంది అని అమ్మతో చెప్పగా అమ్మ మరియు శోభక్క అక్కడి నుంచి సోనియా దగ్గరకు వెళ్లారు. అత్తయ్య బెడ్ మీద కూర్చుని నా తల నిమురుతూ ఏడుస్తుంది. మరోపక్క కవిత నా చెయ్యి పట్టుకొని కూర్చొని ఏడుస్తుంది. అబ్బా,, ఇక ఏడుపు ఆపండి. నేను బాగానే ఉన్నాను కదా. డాక్టర్ గారు చెప్పింది మీకు వినపడలేదా? మీరు ఏడవడం ఆపకపోతే నేను ఏడుస్తాను. నేను ఏడవడం మొదలు పెడితే మీరు నా ఏడుపు మొహం చూడలేరు అని సరదాగా అనగానే అత్తయ్య మరియు కవిత సంతోషపడ్డారు. అత్తయ్యా నాన్న ఎక్కడ? .... నాన్న సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి ఖాన్ గారి దగ్గరకు వెళ్లారు బుజ్జి. ఏవో పేపర్లు సంతకాలు చేయాల్సి ఉందంట తొందర్లోనే వచ్చేస్తారు. .... అప్పుడే అమ్మ మరియు శోభక్క రూంలోకి వచ్చారు. .... అమ్మా మీరిద్దరే వచ్చారే, సోనీయా ఎక్కడ? .... అప్పుడు శోభక్క డోర్ వైపు చూపించగా అక్కడ సోనియా ఏడుస్తూ నిల్చుంది. అక్కడే నిల్చున్నావేమే పిచ్చిదానా? రా నా దగ్గరికి అని నేను అనగానే సోనియా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. చాలాసేపు అలా ఏడ్చిన తర్వాత అమ్మ సోనియాని పైకి లేపి తనను ఊరుకోబెట్టింది.

ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నిన్ను ఇంత ప్రేమగా చూసుకునే అన్నయ్య ఉన్నందుకు నువ్వు సంతోషించాలి. నీ కోసం వాడు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడినందుకు నువ్వు గర్వపడాలి. ఇక చాల్లే ఏడవడం ఆపు. ఇప్పుడు నీ అన్నయ్య బాగానే ఉన్నాడు. ఇంక ఆపు,, ఆపేయాలి! అని అంది అమ్మ. .... శోభక్క మాట్లాడుతూ, ఇక ఆపరా సోనియా అంటూ సోనియాని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. నా పెళ్లిలో ఎక్కడ డాన్స్ చేయాల్సి వస్తుందోనని ఈ సన్నీ గాడు ఇక్కడ హాస్పిటల్ లో పడుకుని నాటకాలు ఆడుతున్నాడు. వాడు నా పెళ్లిలో డాన్స్ చేస్తే జోకర్ లాగా ఉంటాడని వాడికి తెలుసు. అందుకే డాన్స్ చేయకుండా తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాడు అని శోభక్క అనగానే అందరూ నవ్వారు. ఎందుకంటే నిజంగానే నాకు డాన్స్ చేయడం రాదు. డాన్స్ చేసిన ప్రతిసారి నిజంగా నేను జోకర్ లాగానే కనపడతాను. ఇప్పటిదాకా అందరూ నా గురించి ఏడ్చారు. ఇప్పుడు నా మీద జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు.

అరే శోభక్కా నువ్వేమీ కంగారు పడకు. నేను జోకర్ని అయినా పర్వాలేదు. కానీ నీ పెళ్లిలో మాత్రం తప్పకుండా డాన్స్ చేస్తాను. నువ్వు మా అందరికీ దూరంగా వెళ్ళిపోతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇన్నాళ్లకు ఆ భగవంతుడు మా మొర ఆలకించాడు అని నేను జోక్ చేయగానే అందరూ నవ్వారు. అప్పుడు శోభక్క నా వైపు కొంచెం కోపంగా చూసి మాట్లాడుతూ, చూడమ్మా వీడికి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ఎంత తొందరగా ఉందో. నీ కూతుర్ని వాడు అలా అంటూ వుంటే నువ్వు ఏమి మాట్లాడట్లేదు ఏంటమ్మా? ....

అయ్యో! ఇందులో నేను మాట్లాడేదేముంది. మీ ఇద్దరు తేల్చుకోండి. అయినా ముందు మొదలు పెట్టింది నువ్వే కదా. ఇప్పుడు నువ్వే నీ తమ్ముడుతో మాట్లాడుకో. నాదేముంది ఒక కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోతే మరో కూతురు నా ఇంట్లోకి వస్తుంది అని అంది అమ్మ. .... మరో కూతురా? మరో కూతురు ఎవరమ్మా? అని శోభ కంగారుపడుతూ అడిగింది. .... ఇంకెవరు? ఇదిగో కవితే. ఏమ్మా సన్నీకి పెళ్ళాంగా మా ఇంటికి వస్తావు కదూ అని అమ్మ సడన్ గా అడిగేసరికి కవిత సిగ్గుతో నా బెడ్ మీద వంగి తన మొహాన్ని దాచుకుంది.

అయ్యో! అయ్యో! అంత సిగ్గు ఎందుకమ్మా. సోనియా నాకు అంతా చెప్పిందిలే. నువ్వు సన్నీని రక్షించుకోవడానికి వాడి ముందుకు వెళ్లి గన్ కు ఎదురుగా నిల్చున్నావని మాకు తెలుసు. అంతలా ప్రేమిస్తున్నావా సన్నీని. మరి వాడిని పెళ్లి చేసుకొని నా ఇంటికి వస్తావా? అని అమ్మ అడగగా, కవిత సిగ్గుపడుతూ తన తలను పైకెత్తి నెమ్మదిగా మాట్లాడుతూ, వస్తాను ఆంటీ అని అంది. .... ఆంటీ కాదు ఇకమీదట అమ్మ అని పిలవడం అలవాటు చేసుకోవాలి కవిత వదిన గారు అని శోభక్క అనగానే అందరూ నవ్వడంతో కవిత సిగ్గుల మొగ్గ అయింది. ఒకవైపు అందరూ నవ్వుతూ ఉంటే మరోపక్క సోనియా మౌనంగా నిల్చొని ఉంది.

తన మొహం చాలా దిగులుగా ఉంది. నేను నవ్వుతూ దిగులుగా ఉన్న సోనియా మొహం వైపు చూసాను. అప్పుడు అత్తయ్య మా ఇద్దరినీ గమనించింది. కొంచెం సేపటి తర్వాత డాక్టర్ గారు వచ్చి నాకు నిద్ర పట్టడానికి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారు. అందరూ నవ్వుతూ ఉన్నప్పటికీ సోనియా తన మొహంలోని దిగులు నాకు కనబడకుండా దాచలేకపోతోంది. తను తన మొహంలో దిగులు కనబడకుండా బయటికి నవ్వుతూ ఉన్నప్పటికీ తన చేసే ప్రయత్నం నా ముందు విఫలమయింది. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నా కళ్ళు మూతలు పడి ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియలేదు. బహుశా ఇంజక్షన్ ప్రభావం నాకు తొందరగా నిద్రపుచ్చి ఉంటుంది.

అర్ధరాత్రి నాకు మెలుకువ వచ్చింది. రూమ్ లో చిన్న లైట్ వెలుగుతూ రూమంతా కొంచెం వెలుతురు కనబడుతోంది. ఆ రూమ్ లో నా మంచం కాకుండా ఒక సోఫా ఉంది. దానిమీద అత్తయ్య పడుకొని ఉంది. దాని పక్కనే రెండు కుర్చీలు ఉన్నాయి. ఒక కుర్చీలో సోనియా కూర్చుని మరొక కుర్చీమీద తన కాళ్ళు పెట్టుకుని ఉంది. తను నిద్ర పోకుండా కళ్ళు తెరిచి ఉంది. నాకు కుడివైపున ఒక చిన్న టేబుల్ మీద కవిత కూర్చుని నా చెయ్యి పట్టుకొని నా బెడ్ మీద తల ఆనించి రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు నేను చిన్న స్వరంతో కవిత,, కవిత,, అని పిలిచాను. వెంటనే కవిత తలపైకెత్తి నా వైపు చూసింది. అదే సమయంలో సోనియా కూడా మా ఇద్దరి వైపు చూసింది. ... ఏమైంది సన్నీ? దాహంగా ఉందా? లేదా వాష్ రూమ్ కి వెళ్లాలా? ....

నాకు దాహంగా లేదు. అలాగే వాష్ రూమ్ కి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. .... మరైతే ఎందుకు నిద్ర లేచావు? పడుకొని రెస్ట్ తీసుకో. .... నేను పడుకుంటాను గాని నువ్వు కూడా పడుకొని రెస్ట్ తీసుకో. ఎంతసేపని ఇలా టేబుల్ మీద కూర్చుంటావు. .... నా మాట విని కవిత సోఫా మరియు కుర్చీల వైపు చూసేసరికి తనకు పడుకోవడానికి ఖాళీ లేదని నాకు అర్థమైంది. అప్పుడు నేను మంచం మీద నా లెఫ్ట్ సైడ్ కి కొంచెం జరగడంతో మంచం మీద కొంచెం ఖాళీ ఏర్పడింది. నేను కవితను అక్కడ పడుకోమని సైగ చేశాను. అందుకు కవిత నిరాకరించింది. నేను తనకు మళ్లీ కొంచెం గట్టిగా చెప్పడంతో కవిత ఒకసారి సోనియా వైపు చూసింది. సోనియా కూడా నా పక్కన పడుకోమని తన తల ఊపి సైగ చేసింది.

కవిత నాకు కుడివైపున పడుకొని నా భుజం మీద తల ఆనించి తన చేతిని నా పొట్ట మీద పెట్టి రెస్ట్ తీసుకుంటుంది. కవిత నా దగ్గర పడుకోగానే సోనియా కూడా తన కళ్ళు మూసుకుంది. ఆ సమయంలో నేను సోనియా వైపు చూడగా తన కళ్ళల్లో ఏదో దిగులు కనపడి నాకు దిగులు కలిగిస్తోంది. కవితకు బాగా నిద్ర ముంచుకు వచ్చినట్టు ఉంది. అందుకే మత్తులో నన్ను బాగా హత్తుకుపోయి పడుకుని ఉంది. నేను కూడా నా కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకున్నాను. పొద్దున్న శోభక్క నన్ను కవితను లేపుతూ, హలో లైలా మజ్ను తెల్లారింది లెగండి అని అనగానే నాకు మెలకువ వచ్చి చూసేసరికి సోఫాలో అమ్మ, అత్తయ్య మరియు సోనియా కూర్చుని ఉన్నారు. నాన్న చైర్ లో కూర్చున్నారు. శోభక్క నా బెడ్ దగ్గర నిల్చుని మా ఇద్దరిని నిద్ర లేపుతుంది.

శోభక్క మాట విని నాకు నాతోపాటు కవితకు కూడా మెలుకువ వచ్చింది. కవిత మేల్కొని మమ్మల్ని లేపుతున్న శోభక్క వైపు చూసి గుడ్ మార్నింగ్ చెప్పింది. కానీ వెంటనే రూమ్ లో ఉన్న మిగిలిన వ్యక్తులను చూసి సిగ్గుపడిపోయింది. ఎందుకంటే వాళ్ళ అందరి ముందు నాతోపాటు బెడ్ మీద పడుకుని ఉంది. వెంటనే లేచి బాత్ రూంలోకి పరిగెత్తి పారిపోయింది. తను అలా పరిగెత్తుకొని వెళ్ళే సరికి రూమ్ లో అందరూ నవ్వారు. అప్పుడు నాన్న మాట్లాడుతూ, నువ్వు చెప్పేది నిజమే సరిత. ఇప్పుడు శోభ పెళ్లితో పాటు సన్నీకి కూడా పెళ్లి చేసేయాలి అని అనడంతో అందరూ నా వైపు చూసి నవ్వారు. దాంతో నేను కూడా కొంచెం సిగ్గు పడ్డాను. కానీ సోనియా మాత్రం ఇంకా దిగులుగానే నా వైపు చూస్తూ కనపడింది. కొంతసేపటికి కవిత బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది. కానీ ఇంకా సిగ్గు పడుతూనే ఉంది. ఇంకా సిగ్గు పడాల్సింది ఏముందమ్మా కవిత. మీరిద్దరూ మాకు దొరికిపోయారు అని అనడంతో కవిత సిగ్గుపడుతూ వచ్చి నా పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చుంది.

లేదు లేదు నువ్వు ఇంకా ఇక్కడే కూర్చోవద్దు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో. సరిత ఇంకా శోభ ఇక్కడే సన్నీ దగ్గర ఉంటారు. నువ్వు గీత మరియు సోనియా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి. .... ప్లీజ్ అంకుల్ నన్ను ఇక్కడే సన్నీ దగ్గర ఉండనివ్వండి. అయినా నేను రాత్రి రెస్ట్ తీసుకున్నాను అని కవిత నాన్న వైపు చూడకుండా తలదించుకుని చెప్పింది. .... ముందు నువ్వు నన్ను అంకుల్ అని కాకుండా నాన్న అని పిలువు. ఇక రెస్ట్ విషయం అంటావా మీ ఇద్దరూ ఎంత బాగా రెస్టు తీసుకున్నారో మేమంతా చూసాము అని నాన్న అనడంతో మళ్లీ రూమంతా నవ్వులతో మార్మోగిపోయింది. కవిత మాత్రం సిగ్గుతో చచ్చిపోయింది.

అప్పుడు అత్తయ్య సోనియా నా దగ్గరకు వచ్చి కలిసి ఇంటికి బయలుదేరారు. సోనియాకు ఇంటికి వెళ్లాలని లేదు. ఆ విషయం తన కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుంది. తన కళ్ళల్లో నన్ను వదిలి వెళ్తున్న నిరాశ కనబడుతుంది. అప్పుడు నాన్న మళ్ళీ మాట్లాడుతూ, లెగమ్మా కవిత లేచి ఇంటికి వెళ్లి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రండి. అయినా నీ సన్నీ ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోడులే అని అన్నారు. కవిత ఏమి మాట్లాడకుండా లేచి వెళ్లి సోనియా దగ్గర నిలుచుంది. తర్వాత వాళ్ళిద్దరూ అత్తయ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. నాన్న కూడా ఏదో పని ఉండి వెళ్లిపోవడంతో అమ్మ మరియు శోభక్క నా దగ్గర ఉన్నారు.

కొంతసేపటి తర్వాత శోభక్క అత్తగారు మామగారు నన్ను చూడడానికి వచ్చారు. వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు శోభక్క మరియు అమ్మ వాళ్లను బయటకు సాగనంపడానికి వెళ్లారు. వాళ్లు బయటకు వెళ్లిన వెంటనే సురేష్ వాళ్ళ నాన్న లోపలకి వచ్చారు. ఎలా ఉన్నావ్ సన్నీ. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ నా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉన్నప్పటికీ అతని కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. అతను ఏడుస్తున్నట్టు కనిపించారు. నన్ను షూట్ చేసింది అతని కొడుకే కదా మరి ఏడవక ఏం చేస్తాడు. .... నేను బాగానే ఉన్నానండి. ఐ యాం సారీ అంకుల్. అది,, సురేష్,,, ....

అతను నా దగ్గరకు వచ్చి కూర్చుని. వాడికి ఏం జరగాలో అదే జరిగింది. అదే వాడి తలరాత. కనీసం మరో నేరం చేయకుండా తప్పించుకున్నాడు. నీకు గాని మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరిగి ఉంటే ఏమయ్యేది? నాకు ఎవరిమీద కోపం లేదు సన్నీ. నేను ఇంతకుముందు చేసినవన్నీ వాడిని రక్షించడానికే చేశాను. ఎంతైనా నాకు కొడుకు కదా. కానీ కోర్టులో ఆ వీడియోలు చూసిన తర్వాత వాడి మీద నాకు చాలా కోపం వచ్చింది. నా కొడుకు ఇలాంటి నీచమైన పనులు చేస్తాడని కనీసం ఊహించను కూడా లేదు. ఇప్పుడు వాడు చనిపోవడం మంచిది అయింది. ఇలాంటి కొడుకును కనడం కంటే ఆ భగవంతుడు నాకు రితిక లాంటి మరో కూతుర్ని ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ అతను వెక్కి వెక్కి ఏడ్చారు.

వాడొక్కడే దోషి కాదు అంకుల్. ఇదంతా వాడొక్కడే చేయలేదు. బహుశా వాడు అమిత్ మరియు వాడి స్నేహితులతో కలిసి ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి అలవాటుపడి ఉంటాడు. .... ఏది ఏమైనా వాడు చేసింది చాలా తప్పు పని సన్నీ. అందుకు వాడికి తగిన శిక్ష కూడా పడింది. ఇక మిగిలిన వాళ్ళకి కూడా కచ్చితంగా శిక్ష పడే తీరుతుంది. నిన్న సురేష్ నిన్ను చంపడానికి బయలుదేరినప్పుడు నేనే ఖాన్ గారికి ఫోన్ చేసి చెప్పాను. ఇంతకుముందు సెక్యూరిటీ ఆఫీసర్ల నుంచి రక్షించడానికి వాడిని నేనే ఇంట్లో దాచాను. కానీ వాడు నిన్ను చంపడానికి బయలుదేరినప్పుడు మాత్రం ఏం చేయడానికైనా వెనకాడవద్దని ఇన్స్పెక్టర్ ఖాన్ కు ఫోన్ చేసి చెప్పాను. ఖాన్ తను చేయాల్సిన పనిని సరిగ్గా చేశారు. ఇప్పుడు నా వంతు వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయగలనో అది చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను కూడా మీకు సహాయంగా ఉంటాను సన్నీ. ఎలాగూ నా కూతురు బయట దేశంలో సురక్షితంగా ఉంది. నా కొడుకు ఎలాగూ చనిపోయాడు. ఇక నేను వాళ్లకు భయపడాల్సిన పనిలేదు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ నాకు ధైర్యంగా వుండమని చెప్పి వెళ్ళాడు.

ఇప్పుడు అతను ఏం చేయబోతున్నాడో నాకు తెలీదు. అతను ఎందుకు అలా మాట్లాడాడో నాకు అర్థం కాలేదు. కానీ ఇకమీదట తను ఏం చేసినా మంచి చేస్తాడని నాకు నమ్మకం కుదిరింది. నేరం చేయకుండా ఆపడానికి తన కొడుకునే చంపుకున్నవాడు మిగిలిన వాళ్లకు శిక్ష పడడానికి ఎటువంటి రిస్క్ అయినా తీసుకోగలుగుతాడు.

కవిత మరియు సోనియా ఇంటికి వెళ్లి రెండు గంటలే అయ్యింది. అయినా వాళ్ళిద్దరు తిరిగి వచ్చేశారు. ... అరే మీరిద్దరూ ఇంత తొందరగా వచ్చేసారేమి? కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా అని అంది అమ్మ. .... అమ్మా మేము రాత్రి రెస్ట్ తీసుకున్నాములే అని అంది సోనియా. .... అవునవును ఎంత రెస్టు తీసుకున్నారో నాకు తెలుసులే. నీ అన్నయ్య దగ్గర ఉండాలని ఉందని తిన్నగా చెప్పొచ్చు కదా. సరే అయితే మీరిద్దరే ఉండండి నీ అన్నయ్య దగ్గర. నాకు శోభకు కొంచెం షాపింగ్ చేయాల్సిన పని ఉంది అంటూ అమ్మ నా నుదిటిపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ రోజంతా సోనియా మరియు కవిత నా దగ్గరే ఉన్నారు. రాత్రి కూడా మొండికేసి నా దగ్గరే ఉండి పోయారు.

మరుసటి రోజు శోభ పెళ్లి. డాక్టర్ నన్ను ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయకపోవడంతో నేను పెళ్లికి వెళ్ళలేకపోయాను. అయినా పెళ్లికి ఎక్కువమంది ఏమీ అటెండ్ కాలేదు. ఇటునుంచి అమ్మ నాన్న అత్తయ్య సోనియా. అబ్బాయి తరపు నుంచి వాళ్ళ అమ్మానాన్న, చిన్నాన్న పిన్ని. అబ్బాయి వాళ్ళ చిన్నాన్న మా నాన్నకు మంచి స్నేహితుడు. అతని ద్వారానే సంబంధం కుదిరింది. వాళ్ల పెళ్లి జరిపించడానికి ఇంతకుముందు రితిక మరియు కరణ్ ల పెళ్లిని రిజిస్టర్ చేసిన వ్యక్తే ఇక్కడ కూడా పెళ్లి జరిపించడానికి వచ్చాడు. అతను ఖాన్ భాయ్ స్నేహితుడు. ఖాన్ భాయ్ అతనిని పెళ్లి జరిపించడానికి ఏర్పాటు చేశారు. పెళ్లి జరిగిన తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ లంచ్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత శోభక్క తన అత్తగారి ఇంటికి వెళ్లిపోయింది. కవిత పెళ్లికి వెళ్ళకుండా నా దగ్గరే ఉండిపోయింది. తర్వాత రెండు రోజులు కూడా తను నా దగ్గరే ఉండిపోయింది. తను మొండికెయ్యడంతో అమ్మ నాన్న కూడా ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు వారి దృష్టిలో కవిత తమ ఇంటి కోడలు. ఆ విషయంలో అందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క సోనియా తప్ప.

రిసెప్షన్ పార్టీ రోజు రానే వచ్చింది. నేను హాస్పిటల్ లో ఉన్నా కేవలం రెస్ట్ మాత్రమే తీసుకోవాల్సి ఉండటంతో అదే రెస్టు ఇంటిదగ్గర తీసుకోమని డాక్టర్ కూడా నన్ను డిస్చార్జ్ చేసేసారు. ఇంటికి వచ్చి నా రూమ్ లో ఉన్న బెడ్ మీద రెస్టు తీసుకుంటున్నాను. ఇల్లంతా డెకరేషన్ తో మెరిసిపోతూ చాలా సందడిగా ఉంది. నాకు బయటకు రావాలని ఉన్నా ఇంట్లో వాళ్లంతా నన్ను బయటకు తిరగకుండా, పార్టీ ఎలాగూ రాత్రి కాబట్టి అంతవరకు రూమ్ లోనే రెస్ట్ తీసుకోమని చెప్పారు. గాయం ఇంకా పచ్చిగా ఉండడంతో డాక్టర్ కూడా ఎక్కువగా తిరగవద్దు అని, కుట్లు మానకపోవడంతో ఎక్కువగా కదిలితే రక్తం కారే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు.

అయినా నేను ఉండబట్టలేక మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో కిందికి వచ్చేసరికి ఇల్లంతా చక్కగా డెకరేట్ చేసి చాలా అందంగా తీర్చిదిద్ది ఉంది. ఇంటి ముందు గార్డెన్ లో డాన్స్ ప్రోగ్రాం కోసం డీజే అరేంజ్ చేసి ఉంది. వెనుక వైపు గార్డెన్లో తినడానికి తాగడానికి ఏర్పాటుచేసి ఉంది. నేను అలా కింద తిరుగుతూ ఉండగా నా దృష్టి అమ్మానాన్నల రూమ్ మీద పడింది. అక్కడ రేఖ, మనోహర్ మరియు మామయ్య కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను నెమ్మదిగా రూమ్ డోర్ దగ్గరకు చేరుకొని చాటుగా నిలబడి వాళ్ల మాటలు వింటున్నాను. నాకైతే రేఖ మనోహర్ మరియు మామయ్య మాత్రమే కనబడుతున్నప్పటికి లోపల వినబడుతున్న మాటలను బట్టి అమ్మా నాన్న మరియు అత్తయ్య కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది.

మావయ్య మాట్లాడుతూ, అశోక్ నువ్వు నన్ను క్షమించేసావు కానీ నేను ఇంకా మరొకరిని క్షమాపణలు అడగాల్సి ఉంది అని అన్నాడు. .... నిన్ను క్షమించవలసిందే సురేంద్ర. నువ్వు చేసిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది. శిక్ష అంటూ పడవలసి వస్తే నీతో పాటు నాకు కూడా సమానంగా పడవలసిందే అని అన్నారు నాన్న. .... అప్పుడు అత్తయ్య మాట్లాడుతూ, అవును సురేంద్ర తప్పు మనందరిదీ. మనమందరం శిక్షార్హులమే. కానీ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఏముంది. జరగాల్సింది అంతా జరిగిపోయింది. ఇక ముందు ఏం చేయాలి అన్నదే మనం ఆలోచించాలి. .... ఏం జరగాలి అన్నది తర్వాత ఆలోచించవచ్చు. కానీ ముందు నేను మరొకరికి క్షమాపణ చెప్పాలి అన్నాడు మావయ్య. .... ఇప్పుడు నువ్వు ఎవరిని క్షమాపణ అడగాలి సురేంద్ర అని అంది అత్తయ్య.

మావయ్య మాట్లాడుతూ, సన్నీని అడగాలి. వాడికి మొత్తం విషయం చెప్పి వాడిని క్షమించమని అడగాలి. సోనియాకు ఈ విషయాలు అన్ని తెలియవు కాబట్టి తనతో ఇంకేమీ మాట్లాడే పని లేదు. ఇంతకీ సన్నీ ఎక్కడ ఉన్నాడు. .... వాడు వాడి రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. వాడికి ఇప్పుడు ఏమి చెప్పొద్దు. అసలే వాడు చాలా బాధలో ఉన్నాడు. వాడు ఈరోజే హాస్పిటల్ నుంచి వచ్చాడు. అంతేకాకుండా ఈరోజు ఇంట్లో పండగ వాతావరణం ఉంది. ఈ సమయంలో వాడికి చెప్పడం మంచిది కాదు. సరైన సమయం వచ్చినప్పుడు మనం అందరం కలిసి వాడికి చెబుదాం అని అన్నారు నాన్న. .... అప్పుడు మనోహర్ మాట్లాడుతూ, ఇప్పుడు మీరు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. నిజం ఏమిటన్నది వాళ్లకు చెప్పడమే మంచిది. నిజాన్ని మనం ఎంత కాలం దాస్తే వారి మీద అంత చెడు ప్రభావం పడుతుంది. నిజం ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది అంటూ మనోహర్ రేఖ వైపు చూస్తూ చెప్పేసరికి రేఖ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని మనోహర్ ని కౌగలించుకుని ఏడుస్తుంది.

అరే ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్. నువ్వు నాకు అంత చెప్పేసావ్ కదా. ఇప్పుడు ఏడవడం దేనికోసం. చ చ ఊరుకో అని అన్నాడు మనోహర్. .... అప్పుడు మావయ్య మాట్లాడుతూ, నువ్వు సరిగా చెప్పావు మనోహర్. నిజాన్ని ఎంత తొందరగా వెలుగులోకి తీసుకు వస్తే అంత మంచిది. సన్నీ ఆరోగ్యం మెరుగైతే చాలు నేను కూడా ఆలస్యం చేయకుండా నిజం చెప్పేస్తాను అని అన్నాడు. తర్వాత వాళ్లంతా ఇంకేవో విషయాలు మాట్లాడుకుంటున్నారు.

అప్పుడు నేను డోర్ దగ్గర నుంచి పక్కకు తప్పుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుండగా వెనుకవైపు కిటికీ దగ్గర నిల్చున్న సోనియా నాకు కనబడింది. సోనియా కూడా లోపల జరుగుతున్నది అంతా వింటుంది. నేను వెనక్కు తిరిగి తనను చూసే సరికి తనకి ఏమీ తెలియదు అన్నట్టే బిహేవ్ చేస్తూ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్? పద పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. డాక్టర్ నిన్ను ఎక్కువగా తిరగవద్దు అని చెప్పారు కదా. నువ్వు పైకి వెళ్ళు. రాత్రి పార్టీ మొదలయ్యే వరకూ నువ్వు బెడ్ మీదనుంచి దిగడానికి వీల్లేదు అని అంది.

తనకు ఏమీ తెలియదు అన్నట్టు వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లోపల జరిగింది సోనియా వింటూ నాకు దొరికి పోయింది అన్న విషయం తనకు తెలుసు. అయినా సరే బింకాన్ని ప్రదర్శిస్తూ నాకు ఏమి తెలీదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ నా చెయ్యి పట్టుకొని పైన రూమ్ లో కవిత కూర్చున్న దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళి, ఇదిగో నీ సన్నీని జాగ్రత్తగా చూసుకో. డాక్టర్ ఏమో వీడిని తిరగవద్దు అని చెబితే వీడేమో ఇల్లంతా తిరుగుతున్నాడు. వీడిని రూమ్ లో నుంచి బయటికి వెళ్ళనివ్వద్దు అర్థమైందా అని సోనియా కవితతో చెప్పగానే కవిత నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకొని మంచం వద్దకు తీసుకువెళ్లి మంచమ్మీద పడుకోబెట్టింది. నేను రెండు నిమిషాలు అలా బాత్రూంలోకి వెళ్లానో లేదో నువ్వు బయట తిరగడానికి వెళ్ళిపోయావా? ఇప్పుడు పడుకొని రెస్ట్ తీసుకో. రాత్రి కాకముందే నువ్వు గాని రూమ్ లో నుంచి బయటకి వెళ్ళావా నాకంటే చెడ్డది మరొకతి ఉండదు అని అంది కవిత.

నేను మంచం మీద పడుకుని ఆలోచనలో పడ్డాను. సోనియాకు చెప్పకుండా నాకు మాత్రమే చెప్పేంత ముఖ్యమైన విషయం ఏముంది? నాకు మాత్రమే చెప్పవలసిన అంత తప్పు పని మామయ్య ఏం చేశాడు? అసలు బయట పడాల్సిన అవసరం ఉన్న నిజం ఆల్రెడీ రేఖ మనోహర్ తో చెప్పిన ఆ నిజం ఏమిటి? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను రాత్రి పార్టీ మొదలయ్యే వరకు రూమ్ లోనే ఉన్నాను. మావయ్య, మనోహర్, రేఖ నా దగ్గరకు వచ్చి నా యోగక్షేమాలు అడిగి తెలుసుకుని మళ్లీ కిందికి వెళ్ళిపోయారు. అంతకు మించి ఎవరూ నాతో ఏమీ మాట్లాడలేదు. నాకు ఏ నిజం గురించి కూడా చెప్పలేదు. వాళ్లంతా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఆ సరైన సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు.
Next page: Episode 107
Previous page: Episode 105