Episode 002

నేను ప్రిన్సిపాల్ మేడంతో కలిసి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుని ఇంటికి బయలుదేరాము. మేడం ప్లీజ్,, నన్ను నా రూం దగ్గర దింపండి అని అన్నాను. .... నోరు మూసుకొని మాట్లాడకుండా కూర్చో. ఇప్పుడు నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తున్నావు. నీ తలకు బాగా గట్టిగా దెబ్బ తగిలింది. నువ్వు

చాలా నీరసంగా కూడా అయిపోయావు. పైగా నువ్వు నీ రూంలో ఒక్కడివే ఉంటావు. నిన్ను చూసుకోవడానికి అక్కడ నీకు ఎవరూ లేరు. అందుకే ఏం మాట్లాడకుండా నాతో పాటు మా ఇంటికి రా. అర్థమైందా? .... కానీ మేడం,,,,,, .... మేడం నా మాటకు మధ్యలోనే అడ్డుతగిలి, నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు. ఇప్పుడు నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తున్నావు అంటే వస్తున్నావు అంతే. అర్థమైందా?

నేను కూడా ఇంకేమీ మాట్లాడకుండా సరే అన్నట్టు తల ఆడించాను. అది చూసి మేడం పెదవులపై చిరునవ్వు మెరిసింది. వెంటనే నన్ను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని, మంచి అబ్బాయి అంటే ఇలా ఉండాలి అని అన్నారు. ఆ తర్వాత మేడం నన్ను సీట్లో పడుకోబెట్టి నా తలను ఆమె ఒడిలో పెట్టుకున్నారు. కొంతసేపటికి మేము మేడమ్ గారి ఇంటికి చేరుకొని కార్ ఇంటి బయట ఆగింది. మేడమ్ గారి ఇంట్లో ఆమె కాకుండా ఆమె భర్త, ఆమె కూతురు మాత్రమే ఉంటారు. ఆమె ఇల్లు ఒక పెద్ద విశాలమైన 2 అంతస్థుల బిల్డింగ్.

ముఖ్య ద్వారం దాటుకొని లోపలికి వెళ్లగానే ఒక పెద్ద హాలు ఉంటుంది. అందులోనే ఒక పక్క డైనింగ్ టేబుల్ దానిని ఆనుకొని వంటగది ఉంటుంది. కూర్చునే చోటికి మరోవైపు 3 రూమ్ లు ఉంటాయి. ఒక రూమ్ మేడమ్ గారిది అయితే, రెండోది గెస్ట్ రూమ్, మిగిలింది స్టోర్ రూమ్. పై అంతస్తులో కూడా ఇలాగే మూడు రూములు ఉంటాయి. అందులో ఒకటి తమ కూతురి బెడ్రూమ్ కాగా, మిగిలినవి గెస్ట్ రూమ్లు. ఇక్కడ మనం కొంచెం మేడమ్ గారి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం.

మేడం గారి భర్త పేరు దీపక్ వర్మ. అదేంటి నా పేరే చెబుతున్నానని ఆశ్చర్యపోతున్నారా? అవునండి అతని పేరు నా పేరు ఒకటే. అతని వయసు 40. మంచి హైట్, హైట్ కి తగ్గ పర్సనాలిటీతో చాలా బాగుంటారు. అతను ఈ ఊర్లో పేరున్న బిజినెస్మేన్ లలో ఒకరు. అతనికి అతని ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అతని ఫ్యామిలీని చాలా ప్రేమిస్తారు.

మేడం గారి పేరు కవిత వర్మ. ఆమె వయసు 37. చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఆమెది స్వచ్ఛమైన మనసు. అందరి పట్ల ప్రేమభావం కలిగి ఉండడం ఆమెలో ఉన్న ప్రత్యేకత. ఆమె మొహంలో ఎప్పుడూ నవ్వు కనబడుతూనే ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ వీలైనంతవరకూ తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచేలా ప్రయత్నిస్తుంది.

మేడమ్ గారి కూతురి పేరు ప్రీతి వర్మ. ఆమె వయస్సు 17. బంగారు బొమ్మలా ఉంటుంది. ఒక్కతే కూతురు కావడంతో చాలా అల్లరి చేస్తుంది. అంతేకాకుండా చాలా తెలివైనది అర్థం చేసుకోగల సామర్థ్యం కలది.

మేము ఇంట్లోకి వెళ్లేసరికి దీపక్ వర్మ గారు హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నారు. మేము లోపలికి రావడం గమనించిన అతను వెంటనే పైకి లేచి మా దగ్గరకు వచ్చారు. ఏంటి కవిత ఇంతవరకు ఎక్కడ ఉన్నావు? ఈ రోజు చాలా లేట్ అయిపోయింది? ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయొచ్చు కదా? పైగా నేను ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. .... ఓఓహ్,,, సారీ, నేను ఆ విషయమే మర్చిపోయాను. నా ఫోన్ కూడా సైలెంట్ మోడ్ లోనే ఉండిపోయింది అని అన్నారు మేడం. ఆ తర్వాత దీపక్ వర్మ గారి చూపు నా మీద పడింది.

అది సరే కానీ, ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? నువ్వు నాకు పరిచయమే చేయలేదు? .... కవిత మేడం మాట్లాడుతూ, ఏది గుర్తుపట్టండి చూద్దాం? .... ఓహో,, నాకే ఛాలెంజా? అయితే ఉండు కొంచెం ఆలోచించనివ్వు. ఆఆఆ,,, ఎవరై ఉంటారబ్బా??? కొంపతీసి దీపు గాని కాదు కదా? అని అన్నారు. దీపక్ అంకుల్ మాటలు విన్న నేను ఆశ్చర్యంతో బిత్తరపోయాను. నేను అలాగే ఆశ్చర్యపోతూ నవ్వుతున్న మేడం వైపు చూశాను. మేడమ్ అలాగే నవ్వుతూ అంకుల్ వైపు చూసి అవును అన్నట్టు తలాడించారు. వెంటనే అంకుల్ సంతోషంగా నన్ను హాగ్ చేసుకుని వదిలి, కానీ ఈ తలకి కట్టు ఏంటి? అని అడిగారు.

అప్పుడు మేడం మాట్లాడుతూ ఈరోజు కాలేజ్లో జరిగిన ఉదంతం మొత్తం వివరించి చెప్పారు. సరే ఏం పర్వాలేదులే, అంతా బాగయిపోతుంది. రా బాబు అంటూ నన్ను పిలిచి కూర్చోవడానికి సోఫా చూపించారు అంకుల్. మేము అందరం సోఫాలో కూర్చున్నాము. మేడం మాట్లాడుతూ, ఇంతకీ నా బంగారు తల్లి ఎక్కడ? .... అది ఇంకా తన రూంలో కూర్చుని చదువుకుంటుంది. .... అయ్యో రామ,, ఇంతకీ అది డిన్నర్ చేసిందా లేదా? .... నేను దానికి చెప్పి చెప్పి అలసిపోయాను. నీ గారాల పట్టి కదా? నేను అమ్మతోనే కలిసి తింటాను అని మంకుపట్టు పట్టుకుని కూర్చుంది. .... సరే అయితే ఉండండి నేను దానిని పిలుచుకొని వస్తాను.

మేడమ్ పైకి లేచి అక్కడ ఉన్న ఒక నౌకరుతో మాట్లాడుతూ, హరి,, దీపు కోసం కిచిడి తయారు చేయమని రాముతో చెప్పు అని చెప్పారు. అందుకు ఆ నౌకరు సరే అమ్మగారు అని చెప్పడంతో మేడమ్ ప్రీతిని తీసుకొని రావడానికి ఆమె రూం వైపు వెళ్లిపోయారు.

(ఇక్కడ మన దీపు ఆలోచనల్లో మునిగిపోయాడు. అందరూ తనని ద్వేషిస్తూ ఉన్నప్పటికీ కేవలం ప్రిన్సిపాల్ మేడం మాత్రం తనతో అంత ప్రేమగా ఎలా ఉంటున్నారు? పైగా మేడం గారి భర్తకు కూడా తన గురించి తెలుసు. అదెలా సాధ్యం? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.)

అక్కడ మేడం ప్రీతి రూం దగ్గరకు చేరుకున్నారు. టక్,, టక్,, అంటూ ప్రీతి రూమ్ తలుపు కొట్టారు. లోపల్నుంచి ప్రీతి మాట్లాడుతూ, అబ్బా,,, డాడీ,, నాకు ఆకలిగా లేదు అని ఎన్ని సార్లు చెప్పాను మీకు. అయినా సరే మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా వస్తున్నారు? .... కవిత మేడం మాట్లాడుతూ, ఓహో అలాగా అమ్మాయి గారు? నాతో కూడా భోజనం చేయరా? అని అన్నారు. అమ్మ మాట వినగానే ప్రీతి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి తన అమ్మను గట్టిగా కౌగలించుకుని, మమ్మీ నువ్వు వచ్చేసావా? అని అంది. కవిత మేడం ప్రీతి బుగ్గ మీద ఒక తియ్యటి ముద్దు పెట్టి, అవునురా బంగారం వచ్చేసాను అని అన్నారు.

అయితే తొందరగా కిందకి పద నాకు చాలా ఆకలిగా ఉంది అని అంది ప్రీతి. మేడం మంచి మూడ్లో ఉండడంతో ప్రీతిని కొంచెం ఆట పట్టించడానికి, కానీ ఇంతవరకు నాకు ఆకలిగా లేదు అని చెప్పావంట కదా? .... అది అప్పుడు నాకు ఆకలిగా అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆకలేస్తుంది తొందరగా పద మమ్మీ. .... కానీ నీకు ఆకలిగా లేదు కదా? అంటే ఇప్పుడు నువ్వు కేవలం నా కోసమే తింటున్నావా? .... అయితే వెళ్ళు నేను నిజంగానే తినను అంటూ ప్రీతి మూతి ముడుచుకుంది. .... అరెరే నా బంగారు తల్లికి కోపం వచ్చింది. ఊరికే సరదాగా అన్నానురా తల్లీ. .... ప్రీతి బుంగమూతి పెట్టుకుని, పో,, నేనేమీ నీతో మాట్లాడను. ఇంత లేటుగా వచ్చింది చాలక ఇంకా నన్ను ఆటపట్టిస్తూ ఏడిపిస్తున్నావు. .... ఓకే ఓకే,, సారీ బాబా,,, ఈ సారికి నన్ను క్షమించేయ్. ..... నో, నిన్ను క్షమించనంటే క్షమించను పో ఇక్కడి నుంచి అని అంది ప్రీతి.

సరే అయితే ఈరోజు నువ్వు తినాల్సిన భోజనం నీ అన్నయ్యకు తినిపించమంటావా?. మేడం మాట విని ప్రీతి వెంటనే ఉత్సాహంగా మేడం వైపు చూసింది. అదే సంతోషంతో, మమ్మీ నిజంగానే అన్నయ్య వచ్చాడా? అని అడిగింది. మేడమ్ అవును అన్నట్టు కేవలం తన తలను మాత్రమే ఆడించారు. అంతే ప్రీతి వెంటనే సంతోషంతో ఎగిరి గంతులేసింది. నిజంగానే దీపు అన్నయ్య వచ్చాడా? అయితే తొందరగా కిందికి పద. తొందరగా నేను అన్నయ్యని చూడాలి అని అంది ప్రీతి.

ఆ తర్వాత కవిత మేడం మరియు ప్రీతి కలిసి కిందికి వచ్చారు. నేను అంకుల్ ఇంకా సోఫాలోనే కూర్చుని ఉన్నాము. నన్ను చూసి ప్రీతి నా వైపు పరిగెత్తుకుంటూ వస్తోంది. అది చూసి నేను కూడా లేచి నిలుచున్నాను. నేను నిలుచున్నది సంతోషంతో ఆమెను పలకరించడానికి కాదండి. ఈ అమ్మాయి నా వైపు ఎందుకలా పరిగెత్తుకొని వస్తుందో అర్థం కాక లేచి నిల్చున్నాను. ఇంతలో ప్రీతి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని, నా అన్నయ్య వచ్చేసాడు,, నా అన్నయ్య వచ్చేసాడు,, అని గోలచేస్తూ తన మొహాన్ని పైకెత్తి నా మొహం లోకి చూస్తూ, ఇకమీదట నా అన్నయ్యని ఎక్కడికి వెళ్ళనివ్వను. చెప్పు అన్నయ్య ఇకపై నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవు కదా? అని అంది ప్రీతి. అందుకు నేను కూడా అనాలోచితంగా వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపాను. ఎందుకంటే ఆ సమయంలో నా బుర్ర ఏమి పని చేయడం లేదు.

ప్రిన్సిపాల్ మేడం ఫ్యామిలీ మొత్తం అందరికీ నా గురించి తెలుసు అన్న విషయం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ తర్వాత ప్రీతి నా తలకు కట్టి ఉన్న కట్టు చూసి, అన్నయ్య నీ తలకు ఏమైంది అన్నయ్య? అని అడిగింది. .... ఏం లేదులే బంగారం, అది,,, ఏదో చిన్న దెబ్బ తగిలింది అంతే అని అన్నాను. .... ఏంటి అన్నయ్య నువ్వు చిన్న పిల్లాడిలాగ అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? సరే పద నువ్వు నాతో కలిసి భోజనం చేద్దువు గాని. ఆ తర్వాత నువ్వు రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. అర్థమైందా? అని అంది ప్రీతి. నేను కూడా అందుకు సరే అంటూ తల ఊపాను. ఇదంతా చూస్తూ కవిత మేడం మరియు దీపక్ అంకుల్ నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత మేము అంతా కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాము.

ఈ రోజు నేను నా అన్నయ్యకి స్వయంగా నా చేతులతో తినిపిస్తాను. నా చేతితో తింటావు కదా అన్నయ్య? అని అడిగింది ప్రీతి. ఈసారి కూడా నేను సరే అన్నట్టు తల ఊపాను. ఆ తర్వాత ప్రీతి తన చేతితో నాకు తినిపించడం మొదలు పెట్టింది. ఇంతవరకు నాకు ఎప్పుడూ చీదరింపులు చీత్కారాలు మాత్రమే ఎదురయ్యాయి. కానీ ఈ రోజు వీళ్లంతా నా పట్ల చూపిస్తున్న ప్రేమ అనురాగం ఆదరణ చూసి తట్టుకోలేక నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి.

నా కళ్ళమ్మట నీరు కారడం చూసి ప్రీతి మేడంతో మాట్లాడుతూ, మమ్మీ చూడు అన్నయ్య ఏడుస్తున్నాడు అని అంది. వెంటనే మేడం పైకి లేచి నా దగ్గరకు వచ్చి, ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. .... ఏం లేదు మేడం. ఈరోజు వరకు నేను అందరి నుంచి చీదరింపులు ఛీత్కారాలు మాత్రమే ఎదుర్కొన్నాను. కానీ ఈ రోజు మీ అందరి ద్వారా నాకు మళ్ళీ ప్రేమ ఆదరణ దొరకడంతో తట్టుకోలేక పోయాను అంటూ నా కన్నీటిని తుడుచుకున్నాను. .... నా మాట విని మేడం నన్ను కౌగలించుకుని, అరె,, నా బుజ్జి బాబు కదూ ఊరుకో నాన్న ఏడవకు అని అన్నారు.

ఇంతలో ప్రీతి మాట్లాడుతూ, నువ్వు చెప్పేది నిజమే మమ్మీ. అన్నయ్య ఇప్పుడు బుజ్జిబాబు లాగే కనబడుతున్నాడు. చూడు చిన్న పిల్లాడిలా ఎలా ఏడుస్తున్నాడో అని అంది. ప్రీతి అన్న మాటలకు మేమంతా నవ్వుకున్నాము. ఆ తర్వాత మేము అంతా డిన్నర్ పూర్తి చేసి అక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్నాము. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యలో మేడం గుర్తు పెట్టుకొని మరి నా చేత మందులు మింగించారు. ఆ తర్వాత కొంత సేపటికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గెస్ట్ బెడ్ రూమ్ లోకి నన్ను తీసుకెళ్లి పడుకోబెట్టారు. ఆ తర్వాత మేడం గదిలో లైట్స్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అందరూ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు.

ఆ రాత్రి నేను ఎంత సేపు మెలుకువగా ఉన్నానో నాకే తెలీదు. ఇంతకీ మేడం మరియు ఆమె ఫ్యామిలీ అందరూ నన్ను అంతగా ఎందుకు ప్రేమిస్తున్నారు? అని చాలాసేపు ఆలోచిస్తూ గడిపాను. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాను.

మరుసటి రోజు తెల్లవారింది. ఈ రోజు ఎలా ఉంటుందో ఏమో. ఈరోజు అందరి కంటే ముందు ప్రీతి నిద్ర లేచింది. ఇలాంటి రోజు కోసమే ఆమె చాన్నాళ్లుగా వేచి చూస్తుంది. ఇలాంటి ఒక రోజు తనకు కూడా రావాలని కలలు కనేది. తనకు ఒక అన్నయ్య ఉంటే తనే స్వయంగా ప్రేమగా అతన్ని పొద్దున నిద్ర లేపాలని ఆమె కోరిక. ఈరోజు ఆమె కన్న కలలు నిజం కాబోతున్నాయి. అందుకే ఈ రోజు ఆమె తొందరగా నిద్ర లేచి తన రూం డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ కి పరిగెత్తింది. కానీ విధిరాత మరోలా ఉంది కాబోలు. తన కోరిక తీరడానికి ఇది సరైన సమయం కాదు అనుకుంటా. కిందికి దిగడానికి మెట్లు దగ్గరికి చేరుకునేసరికి ఆమె కాలు జారింది. అంతే,, ఒక్కసారిగా మమ్మీమ్మీమ్మీమ్మీ,,, అంటూ పెద్ద కేక పెట్టింది ప్రీతి.

ఆమె మెట్ల మీద పడి కిందికి దొర్లుతూ ఉంది. ఆమె శరీరం పొర్లుతూ పొర్లుతూ మెట్ల మీద నుంచి కిందకు చేరుతుంది. ఇక్కడ కింద అందరికీ ఆమె కేక వినబడింది. వెంటనే అందరూ మంచం మీద నుంచి లేచి పరిగెత్తారు. నేను కూడా లేచి బయటకు పరుగెత్తాను. నేను బయటకు వచ్చి చూసేసరికి ప్రీతి మెట్లమీద నుంచి దొర్లుతూ కిందికి వస్తుంది. ఆమె చివరి మెట్టుకు చేరుకునే సరికి ఆమె తల మెట్టు అంచుకు తగులుకొని రక్తం కారడంతో ఆమె స్పృహ తప్పిపోయింది.

అందరం పరిగెత్తుకొని ఆమె దగ్గరకు చేరుకున్నాము. ఆమెను చూసి అందరికీ కళ్ళలోని నీళ్లు కారుతున్నాయి. కవిత మేడం ఏడుస్తూ, అమ్మా బంగారం లెగమ్మ. చూడు తల్లి అమ్మను నేను ఇక్కడే ఉన్నాను. (అంటూ తన భర్త వైపు చూసి) చూడు దీపక్ మన బంగారు తల్లి ఎందుకు లేవడం లేదు? ప్లీజ్,, దాన్ని కళ్ళు తెరవమని చెప్పు అంటూ ఏడుస్తున్నారు. దీపక్ అంకుల్ వెంటనే ప్రీతిని తన చేతులతో ఎత్తుకుని బయటకు పరుగులు తీశారు. బయటకు చేరుకున్న తర్వాత ప్రీతిని కారు బ్యాక్ సీట్ లో పడుకోబెట్టారు. కవిత మేడం కూడా కారు వెనక సీట్లో కూర్చున్నారు. నేను అంకుల్ తో పాటు ముందు సీట్లో కూర్చున్నాను. వెంటనే అంకుల్ కారుని హాస్పిటల్ వైపు పరుగులు పెట్టించారు. ఈ లోపు నేను మేడం కలిసి ప్రీతికి స్పృహ రప్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము.

తొందరగానే అంకుల్ హాస్పిటల్ దగ్గరకు తీసుకొని వచ్చారు. వెంటనే ప్రీతిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకుని వెళ్ళిపోయారు. సుమారు మూడు గంటల తర్వాత ఆపరేషన్ పూర్తి చేసుకుని డాక్టర్ బయటికి వచ్చారు. వెంటనే కవిత మేడం మాట్లాడుతూ, డాక్టర్ ఇప్పుడు నా బిడ్డకు ఎలా ఉంది? అని అడిగారు. .... డాక్టర్ మాట్లాడుతూ, చూడండి మేము ఇప్పుడే ఏమీ చెప్పలేము. ఆమె తలకి గట్టిగా దెబ్బ తగిలింది. కొంచెం రక్తం కూడా ఎక్కువగానే పోయింది. అందుచేత మేము ఆమెను కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాల్సి ఉంది. ఒకవేళ ఆమె రేపటి వరకు స్పృహలోకి రాకపోయినట్లయితే కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి వెళ్లిపోయారు.

ఆ మాటలు విన్న మా అందరికీ కన్నీళ్లు ఆగలేదు. ఆ తర్వాత కొంత సేపటికి ప్రీతిని రూంలోకి షిఫ్ట్ చేశారు. కవిత మేడం మరియు దీపక్ అంకుల్ ప్రీతి దగ్గరకు వెళ్లారు. నేను మాత్రం బయటే ఉండిపోయాను. నా మనసు చాలా ఆందోళనగా ఉంది. కొంతసేపటి తర్వాత నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళుతున్నానో తెలియదు కానీ అలా నడుస్తూనే ఉన్నాను. హాస్పిటల్ బయట నాకు ఒక మందిరం కనపడింది. నేను వెళ్లి ఆ మందిరం ఎదుట చేతులు జోడించి మోకాళ్లపై కూర్చున్నాను.

దేవుడా! నా తలరాతను ఎందుకు ఇలా రాసావయ్య. నాకు దగ్గరయ్యే వారందరికీ ఎప్పుడూ ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంది. ఈరోజు అతి కష్టం మీద నాకు వీళ్ల నుండి ప్రేమ దొరికింది. కానీ అది కూడా ఎంతో సేపు నిలవలేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా? నా బంగారం, ఆ పిచ్చి తల్లి ఏం పాపం చేసిందయ్యా? పువ్వు లాంటి స్వచ్ఛమైన హృదయం ఆ పిల్లది. ఆమె పట్ల ఇంత నిర్దయ ఏలనయ్యా? ఏం చేయాలన్నా నాకు చెయ్ కానీ ఆ బిడ్డ ప్రాణాలు కాపాడు తండ్రి. నువ్వు గనక అలా చేస్తే నేను ఆమె నుంచి శాశ్వతంగా దూరమైపోతాను అని హామీ ఇస్తున్నాను. బంగారం లాంటి నా చెల్లెలిని కాపాడు అంతే చాలు. ప్లీజ్ నాకున్న నష్టజాతకం యొక్క ప్రభావాన్ని ఆమె మీద పడకుండా చూడు తండ్రి. ఒక్కసారి ఆమెను స్పృహలోకి తీసుకు వస్తే చాలు ఆ తర్వాత నేను శాశ్వతంగా ఆమెకు దూరంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ భగవంతుడా,, దయచేసి నా మొర ఆలకించు,, ప్లీజ్,, ప్లీజ్.

ఆ విధంగా నేను ఏడుస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే నేను మాట్లాడుతున్న మాటలను మరొకరు వింటున్నారు. అది మరెవరో కాదు కవిత మేడం. మేడం లోపల ప్రీతి దగ్గర కూర్చుని ఉండగా ఆమె మదిలో నా గురించి తలంపు వచ్చి అటు ఇటు చూడగా నేను రూమ్ లో లేకపోవడంతో ఆమె నన్ను వెతుక్కుంటూ బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చి చూసినప్పుడు నేను జీవచ్ఛవంలా అయోమయంగా నడుస్తూ బయటికి వెళ్ళిపోతూ ఉండటం చూసింది. ఆమె నన్ను పిలిచింది కానీ నేను వినిపించుకోలేదు. దాంతో మేడం కూడా నా వెనకే నన్ను అనుసరిస్తూ నడుస్తూ వచ్చారు. నేను మందిరం దగ్గరికి చేరుకున్న తర్వాత ఇలా కూర్చోవడం చూసి నా దగ్గరకు వస్తూ వెనకే ఆగిపోయారు. అంతలోనే నేను ప్రార్థించడం మొదలు పెట్టేసరికి ఆమె ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారు. నా మొర ఆలకించిన తర్వాత నాతో పాటు ఆమె కళ్ళలో కూడా నీళ్లు కారుతున్నాయి.

ఆ తర్వాత మేడమ్ ఏడుస్తూనే అక్కడి నుంచి వెనుదిరిగి లోపలికి వెళ్లిపోయారు. నేను కూడా అక్కడ నుంచి బయలుదేరి హాస్పిటల్ లోపలికి వెళ్లి రూమ్ బయట కూర్చున్నాను. కవిత మేడం ప్రీతి దగ్గర కూర్చుని ఉన్నారు కానీ ఆమె మదిలో మాత్రం నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ మాట్లాడిన మాటలే తిరుగుతున్నాయి. ఇక ఆ రోజు మరియు రాత్రి కూడా అలాగే గడిచిపోయింది. కానీ ప్రీతికి మాత్రం స్పృహ రాలేదు.

మరుసటి రోజు మధ్యాహ్నం సమయానికి కూడా ప్రీతీ స్పృహలోకి రాలేదు. ఇప్పుడు మా అందరి మనసులో భయం పెరుగుతూ పోతోంది. ఎందుకంటే ఇప్పుడు కనుక ప్రీతీ స్పృహలోకి రాకపోయినట్లయితే ఆమె కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 1:30 అయి ఉండగా కవిత మేడం ప్రీతి దగ్గర కూర్చుని మాట్లాడుతూ, తల్లి లెగమ్మా, ఎందుకిలా అమ్మని ఏడిపిస్తున్నావు? నా బంగారు తల్లి కదూ కళ్లు తెరువమ్మ. లేదంటే ఈ అమ్మ ప్రాణాలతో ఉండదు. ప్లీజ్ తల్లి కళ్లు తెరువు అని ఏడుస్తున్నారు.

ఇక్కడ నేను కూడా మనసులోనే ప్రీతి తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కూర్చున్నాను. కానీ ఎవరో అన్నట్టు, భగవంతుడు చేయడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు గాని మంచి వాళ్లకు మంచే చేస్తాడు అన్నది నిజమే అయ్యింది. మేడమ్ ప్రీతి చేతిమీద తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటే అకస్మాత్తుగా నా మదిలో ఒక విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే నేను లేచి హాస్పిటల్ బయటకు వచ్చి ఆటో ఎక్కి ఒక చోటికి బయల్దేరాను. కొంతసేపటి తర్వాత ఆటో ఒక ప్రాంతంలో ఆగింది. ఆటో ఆగిన ప్రాంతంలో ఒక గుడి ఉంది. నేను ఆటో దిగి ఆ గుడి వైపు నడుస్తూ ఉండగా కొన్ని పాత జ్ఞాపకాలు నా కళ్ళ ముందు మెదిలాయి.

ఎందుకంటే ఆ గుడి నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకటి. ఈ గుడికి నేను ఎల్లప్పుడూ అమ్మతో కలిసి వచ్చే వాడిని. అమ్మ పోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. అలా అడుగులు ముందుకు వేసుకుంటూ గుడి వైపు వెళుతూ ఉంటే మరిన్ని జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. అలా నడుస్తూ గుడిలోకి చేరుకుని ఆ గుడిలోని అమ్మవారి ఎదుట మోకాళ్లపై కూర్చున్నాను.

అమ్మా తల్లి నువ్వు ఆపదలో ఉన్న వారందరినీ రక్షిస్తావని నా తల్లి చెబుతూ ఉండేది. దీనజనుల పాలిట ఎల్లప్పుడూ దయ కురిపిస్తావని, నీ ముందు చేతులు జోడించి అర్ధించే వారిని కరణిస్తావని చెబుతూ ఉండేది. ఈరోజు నేను నీ ముందు మోకరిల్లి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, దయచేసి నా బంగారుతల్లిని కాపాడు. ఇదంతా నా దురదృష్టం వల్ల జరిగింది. నేను ఎప్పుడైనా ఎవరికైనా దగ్గర అవుతుంటే నేను దగ్గరైన వారికి ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంటుంది. నేను నీ మీద ఒట్టేసి చెబుతున్నాను నా బంగారు తల్లికి మేడమ్ గారి ఫ్యామిలీ నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను. తిరిగి ఎప్పుడు మళ్లీ ఎవరికీ దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేయను. ప్లీజ్,,, తల్లి,, నా బంగారుతల్లిని కాపాడు,, నా బంగారుతల్లిని కాపాడు అంటూ నేను అక్కడే వెక్కి వెక్కి ఏడ్చాను.

నేను అలా ఏడుస్తూ ఉండగా ఎవరిదో చేయి నా భుజం మీద పడింది. నేను పైకి లేచి చూడగా అది ఆ గుడి పూజారి. ఆ పూజారి మాట్లాడుతూ, చూడు బాబు అలా నిరాశ పడకూడదు. ఆ తల్లి అమ్మవారి మీద విశ్వాసం ఉంచాలి. ఆమె అంతా మంచే చేస్తుంది. మంచి మనసుతో ప్రార్థించే వారి మాటను ఆమె తప్పకుండా వింటుంది. నీకు ఉన్న కష్టాన్ని ఆ తల్లితో చెప్పుకో అని అన్నారు. .... పూజారి గారు నా బంగారుతల్లికి తలమీద దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఆందోళనగా ఉంది. ఆమె ఈ రోజు స్పృహలోకి రాకపోయినట్లయితే కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్పారు అని చెప్పాను.

నా మాట విన్న పూజారి గారు గుడి లోపలికి వెళ్లారు. కొంతసేపటి తర్వాత అతను తిరిగి వచ్చి, ఇది తీసుకో బాబు అంటూ నా చేతికి ఒక చిన్న సీసాని ఇచ్చారు. దాంతోపాటే ఒక చిన్న ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఆ సీసాలో ఏదో తైలం ఉంది. అది చూసి నేను, పూజారి గారు ఏంటిది? అని అడిగాను. .... బాబు ఇది అమ్మవారి కోసం వెలిగించే ప్రధాన దీపం యొక్క తైలం. దీనిని తీసుకొని వెళ్లి నీ బంగారుతల్లి కళ్ళకు రాయి. అలాగే ఈ ప్యాకెట్ లో ఉన్న కుంకుమ ఆమె నుదిటిన పెట్టు. ఆ తల్లి దీవెన తప్పకుండా లభిస్తుంది అని చెప్పి పూజారి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను లేచి అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడినుంచి హాస్పిటల్ కి బయల్దేరాను.

Next page: Episode 003
Previous page: Episode 001