Episode 010


నేను ఇంటి దగ్గర నుంచి కాఫీ షాప్ కి వెళుతూ నా జీవితం గురించి ఆలోచించుకుంటున్నాను. కొద్దిరోజుల్లోనే నా జీవితం ఎలా ఉండేది ఎలా మారిపోయింది? ఇంతకు ముందు నన్ను చూసిన వారంతా నష్టజాతకుడు, రాక్షసుడు అని చెప్పి చీత్కరించుకునేవారు. కానీ ఇప్పుడు నన్ను చూసి అంతా దగ్గరవుతున్నారు. ముందు కవిత మేడం కుటుంబం, ఆ తర్వాత ఆ పిల్లాడి కుటుంబం, ఇప్పుడేమో అభి కుటుంబం, చివరిగా రుద్ర వీళ్ళంతా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు. అకస్మాత్తుగా నా తలరాతలో ఇన్ని మార్పులు ఎలా చోటుచేసుకుంటున్నాయి? అని తీవ్రంగా ఆలోచించినా నాకు ఎటువంటి సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే మన తలరాత ఆ పైవాడి చేతిలో ఉంటుంది.

అంటే నా ఉద్దేశ్యం మన అదృష్టం కేవలం భగవంతుని రాతల మీద ఆధారపడి ఉంటుంది అని కాదు. అప్పుడప్పుడు మనిషి తన అదృష్టాన్ని తానే రాసుకుంటూ ఉంటాడు. కాకపోతే అవకాశం కోసం ఎదురు చూడాలి. అదృష్టం అందరికి తలుపు తడుతుంది కానీ అది అందిపుచ్చుకునే వారు కొందరు మాత్రమే. సరైన సమయానికి దానిని అందిపుచ్చుకున్నామంటే ఇక వారి లైఫ్ గాడిలో పడినట్టే అని భావించవచ్చు. జీవితం ప్రతి క్షణం మనతో ఏదో ఒక కొత్త ఆట ఆడుతూనే ఉంటుంది. అందులో కొంతమంది ఓడిపోవచ్చు మరికొంతమంది గెలవచ్చు. అలా కొంతసేపు ఆలోచించుకుంటూ నడుస్తూ తర్వాత నా మదిలో నుంచి ఆలోచనలను తీసి పక్కన పెట్టి తొందరగా కాఫీ షాప్ కి చేరుకున్నాను.

అక్కడ పని చేసే వర్కర్స్ నన్ను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే నేను మళ్ళీ తిరిగి ఆ కేఫ్ కి వస్తానని వాళ్ళు ఎవరూ ఊహించలేదు. నేను అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే అభి అక్కడికి వచ్చి ఉన్నాడు. అతనితో పాటు అను కూడా ఉంది. అభినే స్వయంగా నాకు స్వాగతం పలికి తర్వాత స్టాఫ్ అందరిని మీటింగ్ కి రమ్మని పిలిచాడు. అభి మీటింగ్లో మాట్లాడుతూ, చూడండి ఫ్రెండ్స్ ఇది వరకు మనకు ఉన్న మేనేజర్ ని తప్పుడు ప్రవర్తన కారణంగా నేను అతనిని ఉద్యోగంలో నుంచి తీసేసాను అన్న విషయం మీకు అందరికీ తెలిసినదే. ఈరోజు నేను మీకు మన కొత్త మేనేజర్ ని పరిచయం చేయబోతున్నాను. ఇదిగో ఇతనే మిస్టర్ దీపక్ వర్మ ఈరోజు నుంచి మీ కొత్త మేనేజర్ అని చెప్పగా అందరూ చప్పట్లు కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత అభి, అను, నేను కలిసి నా క్యాబిన్ లోకి వెళ్ళాము.

అభి మాట్లాడుతూ, ఏంటి దీపు ఇది, ఇంత సింపుల్ గా డ్రెస్ వేసుకుని వచ్చావు? అని అడిగాడు. .... ఏం,,, ఏమైంది? అని అడిగాను. .... అయ్యో,, ఇప్పుడు నువ్వు మేనేజర్ అయ్యావు, ఇకపై నువ్వు సూటు బూటు వేసుకుని తిరగాలి అని చెప్పి తన జేబులో నుంచి కొంత డబ్బు తీసి నా చేతికి ఇస్తూ, ఒక పని చెయ్ డబ్బులు తీసుకుని వెళ్లి నీకోసం ఒక మంచి సూట్ తీసుకొనిరా అని అన్నాడు. .... లేదు లేదు,, నాకు ఈ డబ్బులు అవసరం లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అన్నాను. .... ఇంతలో నా వెనక నుంచి, నువ్వు ఆ డబ్బులు తీసుకోవాల్సిందే, వాటితో నువ్వు మంచి సూట్ కొనుక్కోవలిసిందే అన్న మాట వినపడింది. మేమిద్దరం అటువైపు చూడగా అక్కడ దేవి మరియు అను ఇద్దరు కలిసి నిలబడి కనబడ్డారు.

దేవి మాట్లాడుతూ, నువ్వు మమ్మల్ని నీ వాళ్ళం అని భావించినట్లయితే ఆ డబ్బులు తప్పకుండా తీసుకోవాల్సిందే అని అంది. .... సరే అయితే, కానీ ఈ డబ్బులు చాలా ఎక్కువ అని అన్నాను. .... అప్పుడు అను మాట్లాడుతూ, అన్నయ్య వదిన నేను కూడా అతనితో పాటు షాపింగ్ కి వెళ్తాను. లేదంటే ఇతను అక్కడ ఏది చౌకగా దొరికితే అదే కొనుక్కొని వచ్చేస్తాడు అని అంది. .... ఆ అవును నువ్వన్నది నిజమే, ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను నువ్వు నా తమ్ముడికి మంచి సూట్ సెలెక్ట్ చేసి తీసుకోవాలి అని అంది దేవి. .... సరే అలాగే వదిన అని అంది అను.

ఆ తర్వాత అను నన్ను తీసుకొని కారు దగ్గరకు వచ్చి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని తన పక్కన ఉన్న సీట్లో నన్ను కూర్చోమని చెప్పింది. ఆమె చెప్పినట్టే నేను పక్క సీట్ లో కూర్చున్నాను. ఆ తర్వాత ఆమె కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చి మాట్లాడుతూ, హ,, ఇంకేంటి దీపు గారు అని అంది. .... మీరే చెప్పాలి అను మేడం అని అన్నాను. .... దీపు మీకు ఇష్టమైన కలర్ ఏంటి? .... నాకు ఇష్టమైన కలర్ అంటూ ఏమి లేదండి. .... అయితే ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది. సర్లేండి మనం ఎలాగోలా మేనేజ్ చేద్దాం అని అంది. అను కారు డ్రైవ్ చేస్తుంది కానీ అప్పుడప్పుడు కన్నుల చివర నుండి నన్ను చూస్తూనే ఉంది. నేను మాత్రం అను వైపు చూడకుండా నా దృష్టంతా రోడ్డు మీద కేంద్రీకృతమై ఉంది.

కొంత సేపటికి మేము ఒక మాల్ దగ్గరకు చేరుకున్నాము. అది ఈ సిటీలోనే పెద్దది మరియు బెస్ట్ మాల్. అను కార్ పార్క్ చేసిన తర్వాత మేమిద్దరం కలసి మాల్ లోకి వెళ్ళాము. నేను మాల్ కి రావడం ఇదే మొదటిసారి. తను నన్ను ఒక మెన్స్ సెక్షన్ లోకి లాక్కెళ్ళింది. అక్కడ ఒక సేల్స్ గర్ల్ ఉంది. ఆ సేల్స్ గర్ల్ మమ్మల్ని చూసి, హలో మేడం, హాయ్ సర్ చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను అని అడిగింది. .... అను నన్ను చూపిస్తూ, ఇతనికి ఒక కోట్, ప్యాంట్ చూపించండి అని అంది. .... తప్పకుండా మేడం, ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఆ సేల్స్ గర్ల్ మా ఇద్దరికీ చాలా రకాల కోట్, ప్యాంట్లు చూపించింది.

మేము తీసుకోవాల్సిన వాటిని ఎంచడానికి అను చాలా టైమ్ తీసుకుంది. సుమారు ఒక అరగంట తర్వాత 4 కోట్, ప్యాంట్లు నాకోసం సెలెక్ట్ చేసింది. వాటన్నిటిని ఒక్కొక్కటిగా ట్రై చేసి చూడమని నాతో చెప్పింది. నేను చేంజ్ రూమ్ లోకి వెళ్లి మొదటిగా ఒక బ్లాక్ కలర్ ది ట్రై చేశాను. అది నాకు సరిగ్గా సరిపోయింది. నేను అది తొడుక్కుని బయటికి వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు నా వైపు కొరుక్కు తినేసేలా తీకణమైన చూపులతో చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ చూపులు నన్ను కొంచెం ఇబ్బంది పెట్టడంతో నేను తిరిగి లోపలికి వెళ్ళిపోయి మిగిలిన మూడు కూడా ట్రై చేశాను.

బయట నుంచున్న అను తో సేల్స్ గర్ల్ మాట్లాడుతూ, మేడం మీ బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆ బ్లాక్ సూట్ లో సార్ హీరో లాగా ఉన్నారు అని అంది. నేను తన బాయ్ ఫ్రెండ్ అన్న మాట విని మొదట అను కొంచెం సిగ్గుపడింది. ఆ తర్వాత సేల్స్ గర్ల్ కి జవాబిస్తూ, అవును అలాగే ఉంటాడు. కోటి మందిలో ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. అందుకే నేను వాడిని చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పింది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా లోపల నేను ఒక గ్రే కలర్ సూట్ వేసుకొని మిగిలినవి పట్టుకొని బయటికి వచ్చాను. ఆ తర్వాత ఆ నాలుగు కోట్, ప్యాంట్లకు పేమెంట్ చేసిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చాము.

అను నాతో మాట్లాడుతూ, పద ఏమైనా తిందాం అని అంది. .... తిందామా? ఇక్కడ ఏముంటాయి తినడానికి? అని అడిగాను. .... అను ఒకసారి నన్ను చూసి, అయితే నిజంగానే నువ్వు మాల్ కి రావడం ఇదే మొదటిసారా? అని అడిగింది. ..... అవును. .... అయితే విను, మాల్ లో ఫుడ్ సెక్షన్ కూడా ఉంటుంది. అక్కడ మనకి తినడానికి అన్నీ దొరుకుతాయి. తాగడానికి కాఫీ కూడా దొరుకుతుంది అని చెప్పింది. .... సరే పద వెళ్దాం అని అన్నాను. తర్వాత అను నన్ను ఫుడ్ సెక్షన్ దగ్గరకి తీసుకొని వెళ్ళింది. అక్కడ తినడానికి ఒక పిజ్జా రెండు కాఫీ ఆర్డర్ చేసింది. కొద్దిసేపటికి మా ఆర్డర్ వచ్చేసింది. పిజ్జా వచ్చి రావడంతోనే ఎన్నో రోజులుగా తిండి తినని దానిలా దానిపై విరుచుకుపడింది అను. కానీ నేను మాత్రం దానిని చేతితో తాకను కూడా లేదు.

నేను కాఫీ తాగుతూ పిజ్జా తింటున్న అను వైపు చూస్తున్నాను. కొంతసేపటి వరకు అను దృష్టంతా తింటున్న పిజ్జా మీద ఉంది. ఆ తర్వాత సడన్ గా ఆమె చూపు నా మీద పడింది. ఆ తర్వాత మళ్ళీ తినడం మొదలుపెట్టింది కానీ మధ్యలో మళ్లీ ఒకసారి నా వైపు చూసింది. నేను మాత్రం ఇంకా ఆమె వైపే అలా చూస్తూ ఉన్నాను. అను మాట్లాడుతూ, ఏమైంది అలా చూస్తున్నావ్? ఎప్పుడూ అమ్మాయిని చూడలేదా ఏంటి? అని అడిగింది. .... లేదు,, అమ్మాయిలనైతే చాలామందినే చూశాను. కాకపోతే ఇలా తిండికోసం ఎగబడే అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అని అన్నాను.

అప్పుడు తను చేస్తున్నది ఏంటో తెలుసుకుని, హుం,, అది,, అదేంటంటే, వదిన ఈరోజు కేఫ్ కి వచ్చి నిన్ను కలవాలనే తొందరలో ఉంది. అందుకే నన్ను టిఫిన్ కూడా తిననివ్వలేదు. అందుకే ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి మాట మారుస్తూ, అది సరే నా సంగతి పక్కన పెట్టు ఇంతకీ నువ్వు ఎందుకు తినడం లేదు? అని అడిగింది. .... చచ్చింది గొర్రె,, ఇప్పుడు తనతో ఏమని చెప్పాలి? నాకు పిజ్జా ఎలా తినాలో తెలీదు. మనకి ఇలాంటి విషయాల మీద అసలు అవగాహన లేదు. .... అది,, అది,, అదేంటంటే? .... ఏంటది? అది అది అనుకోని. .... అది,, విషయం ఏమిటంటే నాకు పిజ్జా తినడం తెలీదు అని అనేసరికి అనుకి నవ్వాగలేదు.

అను అలా నవ్వుతూనే, ఏంటి నిజమా? అంటే నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ పిజ్జా తినలేదా? దీపు ఏంటిది మరీ చిన్న పిల్లాడిలా? సరే ఉండు నేను నీకు తినడం ఎలాగో నేర్పిస్తాను అంటూ ఒక ఫోర్క్ మరియు చాకు అందుకుని, ఇదిగో ఈ రెండింటినీ తీసుకుని ఈ ఫోర్క్ తో ఇలా గుచ్చి పట్టుకొని ఈ చాకుతో ఇలా కట్ చేసి ఫోర్క్ తో తీసుకొని తినాలి అని చెప్పింది. నేను కూడా ఆమె చెప్పినట్టు ట్రై చేశాను. కానీ ప్లేట్ లో ఉన్న పిజ్జా పీస్ ఒకసారి ఇటు ఒకసారి అటు జారిపోతునే ఉంది. అది చూసి అను కి మరోసారి నవ్వాగలేదు. నేను తినను దీన్ని, అరే ఒక దగ్గర కుదురుగా ఉండటం లేదు. ఎలా తినాలి దీన్ని? అని అన్నాను. నా అవస్త చూసి అను అలా నవ్వుతూనే ఉంది.

ఆ తర్వాత అను మాట్లాడుతూ, ఆగు దీపు ఆగు, నేను నీకు నేర్పిస్తాను ఉండు అని సీట్లో నుంచి లేచి నా దగ్గరకు వచ్చింది. నా వెనకాల నిల్చొని తన చేతులతో నా రెండు చేతులతో పట్టుకుని, ముందు ఈ ఫోర్క్ ని ఇలా నొక్కి పట్టుకో, ఆ తర్వాత చాకుతో ఇలా నెమ్మదిగా కట్ చెయ్, అది కట్ అయిన తర్వాత ఫోర్క్ తో దానిని తీసుకొని నీ నోట్లో పెట్టుకొని తిను అని చెప్పింది. ఇదంతా చేస్తూ ఉండగా అను దృష్టంతా నా మొహం మీదే ఉంది. నాతో ఈ అద్భుతమైన క్షణాలను ఆమె ఆస్వాదిస్తోంది. కానీ నా దృష్టి మాత్రం ప్లేట్లో ఉన్న పిజ్జా మీద ఉంది. అలా ఒక ముక్క తినిపించిన తర్వాత కూడా అను చేతులు ఇంకా నా చేతులను పట్టుకునే ఉన్నాయి.

అను తన ప్రపంచంలో తాను విహరిస్తోంది. నాతో మరో ముక్క తినిపించిన తర్వాత కూడా ఆమె నా చేతులను విడవక పోవడంతో నేనే మాట్లాడుతూ, అను మేడం ఇప్పుడు నేను తినడానికి ట్రై చేస్తాను. మీరు వెళ్లి మీది తినండి అని అన్నాను. నా మాట విని అను నా చేతులను వదిలేసి నా వెనకనే నిల్చొని నా వైపు కోపంగా చూసి మనసులో చిలిపిగా తిట్టుకుంటూ తన ప్లేస్ లోకి వెళ్లి కూర్చుని తన పిజ్జా తింటూ మధ్య మధ్యలో నా వైపు చూస్తూ ఉంది. మొండిఘటం,, తనకు దగ్గరవడానికి మంచి అవకాశం దొరికింది అనుకుంటే ఈ మొండి సచ్చినోడుకి ఏం అర్థం కావడం లేదు. తనకి ఎంత దగ్గర అవుదామని ప్రయత్నిస్తుంటే అంత దూరం పారిపోతున్నాడు. చూస్తాను చూస్తాను ఎంత కాలం నా నుంచి ఇలా దూరం పారిపోతాడో నేను చూస్తాను అని మనసులోనే అనుకుని బయటకు మాత్రం చిరునవ్వు నవ్వింది.

ఆ తర్వాత కొంత సేపటికి మేము తినడం పూర్తిచేసి బిల్ పే చేసి అక్కడినుంచి బయలుదేరి బయటికి వస్తున్నాము. ఇంతలో అను దృష్టి ఆ మాల్ లో ఏర్పాటుచేసిన డార్క్ రూమ్ హర్రర్ థీమ్ మీద పడింది. నాకు దానిని చూపిస్తూ, దీపు పద అందులోకి వెళ్లి వద్దాం. నేను ఇంతకుముందు చాలా సార్లే ఈ మాల్ కి వచ్చాను కానీ అందులోకి వెళ్లడం కుదరలేదు అని అంది. .... కానీ దానిని చూస్తుంటే చాలా భయంకరమైనది లాగా అనిపిస్తుంది. .... పద దీపు, నువ్వేమి అంత భయపడవలసిన పనిలేదు నేను ఉన్నాను కదా అని అంది. అను మాట విని నేను మనసులోనే నవ్వుకున్నాను. ఎందుకంటే అతి చిన్న తనం నుండే ఒక్కడినే జీవితం గడపటానికి అలవాటుపడిన వాడిని. అలాంటి నాకు ఇలాంటివి చూస్తే భయమా?

ఆ తర్వాత మేము టిక్కెట్లు తీసుకుని ఆ హర్రర్ ప్లేస్ లోకి ప్రవేశించాము. మేము ఇలా లోపలికి వెళ్ళగానే మొత్తం లైట్లు అన్ని ఆగిపోయి కేవలం రెడ్ లైట్స్ మాత్రమే వెలుగుతున్నాయి. అది కూడా ఆగి ఆగి వెలుగుతున్నాయి. మధ్య మధ్యలో మెరుపుల మెరుస్తున్నట్టు తెల్లని కాంతి మెరిసి మాయం అయిపోతుంది. చుట్టూ విచిత్రమైన శబ్దాలు కూడా వినబడుతున్నాయి. పిడుగులు పడితే వచ్చే శబ్దాలు కూడా వినబడుతున్నాయి. తనకేదో భయంగా ఉన్నట్టు అను నా జబ్బని గట్టిగా పట్టుకుంది. (అమ్మాయి చాలా షార్ప్ గా ఉంది. నిజానికి అను ఇంతకు ముందే ఇక్కడికి చాలా సార్లు వచ్చింది. అందుకే ఇప్పుడు ఆమెకు ఈ హర్రర్ ప్లేస్ చూడటానికి ఎటువంటి భయం లేదు. కానీ నాకు దగ్గరగా ఉండడం కోసం ఇప్పుడు ఆమె నాటకం ఆడుతుంది).

మేము అలా ముందుకు నడుచుకుంటూ వెళుతున్నాను. అను కూడా నా జబ్బని పట్టుకుని హాయిగా నాతో పాటు నడుస్తుంది. మధ్య మధ్యలో తనకు భయం కలుగుతున్నట్టు నటిస్తూ నాజబ్బను గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. నేనేమో ఆమె భయపడుతుంది కాబోలు అని అనుకుంటున్నాను కానీ అసలు విషయం వేరు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు అమ్మాయి చాలా షార్ప్ గా ఉంది. ఆమె అలా భయం నటిస్తూ నాకు బాగా దగ్గరగా అతుక్కుపోతుంది. అను తన మనసులోనే, ఏం బాబు!! ఇందాకా రెస్టారెంట్ లో నన్ను దూరం పెట్టావు కదూ? ఏది ఇప్పుడు పెట్టు చూద్దాం? ఇక్కడ నేను చాలా చేయగలను. అలా చూస్తూ ఉండు అని అనుకుని పెదాలపై చిన్న చిరునవ్వు మెరిసింది.

మేము మరికొంచెం ముందుకు నడుచుకొని వెళ్లేసరికి అక్కడ ఒక కఫిన్ (శవాలను అందులో పెట్టి పూడ్చే పెట్టె) లాంటిది కనపడింది. దాని తలుపు నెమ్మదిగా తెరుచుకోవడంతో అందులోనుంచి ఒక మమ్మీ బయటకు వచ్చింది. ఇప్పుడు నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. (నేనేమైనా సూపర్ మాన్ నా భయపడకుండా ఉండడానికి. నేను కూడా మనిషినే కదా). ఆ తర్వాత మమ్మీ గొంతు వినబడడం మొదలైంది. అది మమ్మల్ని, రండి,, హ హ హ ,,, నా దగ్గరకు రండి,,, రండి,, అంటూ తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. వెంటనే నేను అను చేతిని గట్టిగా పట్టుకున్నాను. దాంతో అను కి మంచి ఛాన్స్ దొరికినట్టై ఆమె మొహం ఆనందంతో మరింత వికసించింది.

మేము అలా ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోతున్నాము. అంతలో సడన్ గా మా ముందు ఒక దెయ్యం ప్రత్యక్షమైంది. దాంతో నేను చాలా భయపడ్డాను. విశేషం ఏంటంటే అప్పటిదాకా చాలా ఆనందంగా ఉన్న అను కూడా భయపడి వెంటనే నన్ను గట్టిగా వాటేసుకుంది. అప్పుడు అను తన మనసులోనే, ఆహా,, ప్రేమించిన వాడిని కౌగిలించుకుంటే ఎంత సుఖంగా ఉంది. జీవితాంతం ఇలానే ఉండిపోవాలని ఉంది అని అనుకుంది. అప్పుడు నేను మాట్లాడుతూ, అను ఇక నన్ను వదిలి పెడతావా? మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని అన్నాను. అసలు నిజం ఏమిటంటే నాకు చాలా భయంగా ఉంది. మా ముందు దెయ్యంలా ప్రత్యక్షం అయింది ఒక మనిషే కావచ్చు. కానీ ఆ సీన్ క్రియేట్ చేసిన వాడు నిజంగానే మా ముందు దెయ్యం వచ్చినంత అనుభూతిని కలిగించాడు.

నా మాట విన్న అను నా నుంచి దూరం జరిగింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు ఆమె మొహంలో సిగ్గు స్పష్టంగా తెలుస్తున్నాయి.ఆ తర్వాత మేము అలా ముందుకు నడుచుకుంటూ మరి కొన్ని అనుభవాలను ఎదుర్కొని ఆ తర్వాత ఎలాగోలా అందులో నుంచి బయట పడ్డాము. ఆ తర్వాత ఆ మాల్ లో నుంచి బయటకు వచ్చి కారులో కూర్చున్నాము. ఆ తరువాత అను కార్ స్టార్ట్ చేసి కేఫ్ వైపు పోనిచ్చింది.

మేము మాల్ నుండి కేఫ్ కి వెళ్తున్న దారిలో రోడ్డు పక్కన గుమిగూడి ఉన్న జనం మీద నా దృష్టి పడింది. వెంటనే నేను అనుని కార్ ఆపమని చెప్పాను.. కార్ ఆగుతూనే నేను బయటకు దిగి ఆ జనం గుమిగూడిన చోటకి వెళ్ళాను. నేను అక్కడికి చేరుకొని చూసేసరికి ఒక అబ్బాయి నేలమీద పడి ఉన్నాడు. అతని తల దగ్గర ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆ అబ్బాయి తల ఆ అమ్మాయి ఒడిలో ఉండగా ఆ అబ్బాయి నోట్లో నుంచి నురగలు కారుతున్నాయి. ఆ అమ్మాయి ఏడుస్తూ, అన్నయ్య లెవ్వు అన్నయ్య అంటూ చుట్టూ ఉన్న జనం వైపు చూసి, ప్లీజ్ ఎవరైనా అంబులెన్స్ ని పిలిపించండి అని చెప్పి, మళ్లీ ఆ అబ్బాయి వైపు చూస్తూ, అన్నయ్య ప్లీజ్ లెవ్వు అని ఏడుస్తుంది.

నేను జనాన్ని తప్పించుకుని ముందుకు కదిలి, అతనికి ఏమైంది సిస్టర్? అని అడిగాను. .... ఏమో తెలీదు అన్న. మేము కొంచెం పని మీద వెళ్తున్నాము ఇంతలో సడన్ గా అన్నయ్య స్పృహ తప్పి నోట్లో నుంచి నురగలు కక్కుతూ పడిపోయాడు అని చెప్పింది. అంతలో అను కూడా అక్కడికి చేరుకుంది. అను,, వెళ్లి కారు వెనుక వైపు డోర్ ఓపెన్ చేసి ఉంచు అని అను తో చెప్పి జనం వైపు చూసి, ఇతన్ని కార్లో చేర్చడానికి ఎవరైనా హెల్ప్ చేయండి అని అడిగాను. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో ఇక లాభం లేదని నేనే ముందు కదిలి కష్టపడి అతన్ని నా భుజం మీద వేసుకున్నాను. ఆ తరువాత కారు వైపు కదిలి ఎలాగోలా కారు దగ్గరకు చేరుకొని అతి కష్టం మీద ఆ అబ్బాయిని వెనుక సీట్ లో పడుకోబెట్టాను. ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి దగ్గర కూర్చుంది. అనూ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా నేను ఆమె పక్క సీట్ లో కూర్చున్నాను.

అను మేడం ప్లీజ్ తొందరగా హాస్పిటల్ కి పోనివ్వండి అని చెప్పాను. అను కార్ స్టార్ట్ చేసి తొందరగానే హాస్పిటల్ కి చేరుకున్నాం. నేను కారు దిగి లోపలికి వెళ్లి వార్డు బాయ్ ని పిలుచుకొని వచ్చాను. మేము ఆ అబ్బాయిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకొని వెళ్ళాము. తర్వాత డాక్టర్ అతనిని ICU లోకి తీసుకువెళ్లి కావాల్సిన ట్రీట్మెంట్ అందించారు.

ఇక్కడ బయట ఆ అమ్మాయి మాట్లాడుతూ, మీ ఇద్దరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఈ రోజు గనక మీరు ఇద్దరూ లేకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో ఏమో? అని అంది. .... లేదు లేదు, ఇందులో థాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అని అన్నాను. .... అను మాట్లాడుతూ, సరిగ్గా చెప్పావు, ఇందులో థాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మేము ఇదంతా మానవత్వంతో చేసాము అని అంది. ఆ తర్వాత కొంచెం సేపు మేము క్యాజువల్ గా మాట్లాడుకున్నాము. కొంతసేపటికి డాక్టర్ లోపల నుంచి బయటికి వచ్చారు.

ఆ అమ్మాయి డాక్టర్ తో మాట్లాడుతూ, డాక్టర్ గారు మా అన్నయ్యకి ఏమైందండీ? అని అడిగింది. .... డాక్టర్ మాట్లాడుతూ, విషయం ఏమిటంటే మీ అన్నయ్య డ్రగ్స్ తీసుకున్నాడు. అందులో ఏదో కల్తీ జరిగినట్టుంది అందుకే ఇప్పుడు మీ అన్నయ్య ఈ పరిస్థితిలో ఉన్నాడు. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పారు. ఆ అమ్మాయి డాక్టర్ తో థాంక్స్ అని చెప్పడంతో డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నేను ఆ అమ్మాయితో మాట్లాడుతూ, మీ అన్నయ్య డ్రగ్స్ తీసుకుంటాడా? అని అడిగాను. .... అవును అన్న చాలా కాలం నుంచి, మా అమ్మ నాన్న మరియు వదిన చనిపోయిన దగ్గర్నుంచి తీసుకుంటున్నాడు అని అంది. .... ఓహో,,, ఐ యాం సారీ. మరి నువ్వు ఎప్పుడు మీ అన్నయ్యతో వద్దని చెప్పే ప్రయత్నం చేయలేదా? .... చేశాను,, చాలాసార్లు ఆ ప్రయత్నం చేశాను. కానీ అన్నయ్య నా మాటలను అస్సలు పట్టించుకోడు అని అంది. ఇంతలో నర్స్ బయటికి వచ్చి, పేషెంట్ కి తెలివి వచ్చింది, మీరు వెళ్లి చూడొచ్చు చెప్పింది.

సరే అని చెప్పి మేమంతా లోపలికి వెళ్ళాము. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ అన్నయ్య చాతిమీద పడి ఏడుస్తోంది. మేమిద్దరం కూడా వాళ్ల దగ్గరికి చేరుకున్నాము. ఆ అమ్మాయి తన అన్నయ్యతో మాట్లాడుతూ, నీకు ఎన్ని సార్లు చెప్పాను అన్నయ్య ఆ మాయదారి డ్రగ్స్ తీసుకోవడం మానేయమని. కానీ నువ్వు నా మాటలు అస్సలు పట్టించుకోవు. ఈరోజు నీకు ఏదైనా జరిగి ఉంటే? అని ఏడుస్తుంది. .... ఏం జరగదురా బుజ్జి, చూడు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అని అన్నాడు ఆ అబ్బాయి. అప్పుడు నేను ఆ అమ్మాయిని తీసుకొని బయటకు వెళ్ళమని అను తో చెప్పగా, అను ఆ అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్లిపోయింది.

ఆ అబ్బాయిని ఉద్దేశించి, ఎలా ఉన్నారు బ్రదర్ అని అడిగాను. .... బాగానే ఉన్నాను బ్రదర్. మాకు సహాయం చేసినందుకు మీకు చాలా థాంక్స్ అని చెప్పాడు. .... థాంక్స్ లు అవి తర్వాత చెప్పుకోవచ్చు. ముందు మీరు ఈ విషయం చెప్పండి, మీరు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు? డ్రగ్స్ లేకపోతే ఈ ప్రపంచం ఏమైనా ఆగిపోతుందా? ఈరోజు మీకు ఏదైనా జరిగి ఉంటే మీ చెల్లెలు పరిస్థితి ఏమయ్యేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సమయంలో మీ చెల్లెలు పరిస్థితిని మీరు చూడాల్సింది? ఎవ్వరూ మీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఒక వేళ ఏదైనా జరగరానిది జరిగి ఉంటే మీ చెల్లెలు జీవితం ఏమయ్యేది? ఈ నిర్దయ సమాజంలో ఆమె ఒక్కర్తే ఎలా నెట్టుకు రాగలదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భగవంతుని దయవల్ల ఆమెకు అటువంటి పరిస్థితులు ఎదురు కాకూడదు. అందుకే ప్లీజ్,, మీరు డ్రగ్స్ తీసుకోవడం ఆపేయండి అని అన్నాను.

బ్రదర్ మీరు చెప్పేదంతా వాస్తవమే. ఇంతకుముందు ఎప్పుడూ ఎవ్వరూ మీలా నాకు అర్థమయ్యేలా చెప్పేవారు దొరకలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైనా ఇంతకు ముందే చెప్పి ఉన్నట్లయితే నేను ఎప్పుడో ఈ డ్రగ్స్ వదిలి పెట్టేవాడిని. ఇక మీదట నేను నా చెల్లెలు కోసమే బతుకుతాను అని చెప్పాడు. ఆ తర్వాత నేను అతనితో మరి కొంచెంసేపు మాట్లాడి బయటికి వచ్చి ఆ అమ్మాయిని తన అన్నయ్య దగ్గరికి లోపలికి పంపించి మేం ఇద్దరం బయటికి వచ్చి కారులో కూర్చుని కేఫ్ కి బయల్దేరాము.
Next page: Episode 011
Previous page: Episode 009