Episode 011


హాస్పిటల్ నుంచి బయలుదేరిన తర్వాత అను నన్ను ఒక హెయిర్ స్టైలిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అక్కడ ఆమె నాకు కొంచెం హెయిర్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేయించింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్లీ కేఫ్ కి బయల్దేరాము. అను కారు నడుపుతూ, దీపు గారు మీరు ఇలాగే అందరికీ సహాయపడుతూ ఉంటారా? అని అడిగింది. .... ఏం,, ఎందుకలా అడిగారు? .... అది,, ఎందుకంటే? ఆరోజు ముక్కు మొహం పరిచయంలేని మా అన్నయ్యకు సహాయం చేశారు. మళ్లీ ఈరోజు ఆ అమ్మాయికి ఆమె అన్నయ్యకి సహాయం చేశారు. .... అదేంటంటే, మా అమ్మ దగ్గర నుంచి నేను ఇదంతా నేర్చుకున్నాను. అవసరమున్న వారికి మనకు చేతనయినంత సహాయం చేయాలని మా అమ్మ నేర్పింది. ఒకవేళ ఎవరైనా మన కళ్ళెదుట చావుబతుకుల్లో ఉన్నట్లయితే వీలైనంతవరకూ వారిని బతికించే ప్రయత్నం చేయాలని చెప్పింది. నేను కేవలం ఆమె నేర్పిన పాఠాలనే అనుసరిస్తూ వస్తున్నాను.

చాలా బాగా నేర్పించారు. నేను కూడా మీతో పాటు ఉండి మీ నుండి చాలా నేర్చుకోవచ్చు అని అంది అను. ఆ తర్వాత అలా అది ఇది అని మాట్లాడుకుంటూ కేఫ్ దగ్గరికి చేరుకున్నాము. అభి మరియు దేవి ఇంకా అక్కడే ఉన్నారు. దేవి మమ్మల్ని చూసి మాట్లాడుతూ, ఏంటి? మీరిద్దరూ మరీ ఇంత లేట్, ఎక్కడికి వెళ్లారేంటి? అని అడిగింది. .... వదిన మేము ఎందుకు లేట్ అయ్యామంటే అంటూ అను మా షాపింగ్, ఆ తర్వాత రెస్టారెంట్, ఆ తర్వాత హర్రర్ రూమ్, ఆ తర్వాత వచ్చే దారిలో ఆ అబ్బాయి మరియు అమ్మాయిల జరిగిన సంఘటన గురించి మొత్తం చెప్పింది.

అంతా విని అభి మాట్లాడుతూ, శభాష్ దీపు శభాష్, ఆరోజే నువ్వు నా మనసులో స్థానం సంపాదించావు. ఈరోజు జరిగిన దాన్ని విన్న తర్వాత నీ మీద గౌరవం మరింత పెరిగింది అంటూ అభి ముందుకు వచ్చి నన్ను హాగ్ చేసుకుని అభినందించాడు. ఇంతలో తన మొహం మీద పడుతున్న కురులను ఉఫ్ అని పెదవులతో గాలి ఊది పక్కకు తప్పించిన దేవి మాట్లాడుతూ, మరి ఎవరి తమ్ముడు అనుకుంటున్నారు? అని కొంచెం ఫోజు కొట్టింది. .... అమ్మ తల్లి! నీ తమ్ముడే. ఇప్పుడు కాదని ఎవరన్నారు? అని అన్నాడు అభి. .... అది అలా రండి దారికి. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కొద్దిగా జ్ఞానం పెరిగింది మిస్టర్ మొద్దు రాస్కెల్ గారికి అని అంది.

అభి చిన్నగా మాట్లాడుతూ, అవును నువ్వు చెప్పింది నిజమే, నేను మొద్దునే. నేను చేసిన అతి పెద్ద పిచ్చిపని నిన్ను పెళ్లి చేసుకోవడమే అని గొణిగాడు. .... ఏమన్నావ్? అని అంది దేవి. .... ఏం లేదు,, ఏం లేదు అని అన్నాడు అభి. .... లేదు అభి, నువ్వు ఏదో అన్నావ్? .... అను దేవి దగ్గరకు వచ్చి నెమ్మదిగా చెవిలో మాట్లాడుతూ, అన్నయ్య ఏమంటున్నాడు అంటే, నిన్ను పెళ్లి చేసుకోవడమే తాను చేసిన పెద్ద పిచ్చిపని అని అంటున్నాడు వదిన అని చెప్పింది. .... వారెవ్వా,,, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం నువ్వు చేసిన అతి పెద్ద పిచ్చిపనా? అరెరే,,, అసలు నేను కాబట్టి నీలాంటి బొజ్జ గణపయ్యని పెళ్లి చేసుకున్నాను. లేదంటే నిన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకునేవారు కాదు. ఇకపోతే ఇప్పుడు తమరు చేసిన తప్పుకి ఈ రోజు లంచ్ మరియు డిన్నర్ కట్. అర్థమైందా? అని అంది దేవి.

అయ్యయ్యో అంత పని చేయకు దేవి. ఆకలితో ఉండటం నావల్ల కాదు. ఏమి తినకపోతే నా పరిస్థితి దారుణంగా ఉంటుంది అని ప్రాధేయ పడుతున్నాడు అభి. మరోవైపు వాళ్ళిద్దరి గిల్లికజ్జాలు చూసి అను మరియు నేను పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూ ఉన్నాము. నో,,, కుదరదంటే కుదరదు. ఒకసారి నిన్ను నువ్వు చూసుకో ఆ బొజ్జ చూడు ఎలా పెరుగుతుందో అని అంది దేవి. .... అరే బొజ్జ ఎక్కడ ఉంది? చూడు నేను ఎంత స్లిమ్ గా ఉన్నానో. .... ఎవరన్నారు నువ్వు స్లిమ్ గా ఉన్నావ్ అని? ఆ బొజ్జ చూడు ఫుట్ బాల్ గ్రౌండ్ అంత ఉంది. ఆ మొహం చూడు దుమ్మలగుండు మొహం వేసుకుని. .... ఒసేయ్ నేను ఫిట్ గానే ఉన్నానే. అను కొంచెం నువ్వైనా చెప్పవే. .... లేదు అన్నయ్య. నేను ఏమి చేయలేను. దీనికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అని అంది అను. .... నువ్వు నా సైడా లేదా దాని సైడా? .... సారీ,,, నాది నా వదిన కం బెస్ట్ ఫ్రెండ్ పక్షమే.

విన్నావు కదా ఏం చెప్పిందో? ఇప్పుడు నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. ఒకవేళ నువ్వు గనుక నాకు చెప్పకుండా గాని నాకు తెలియకుండా గాని ఏదైనా తినడానికి పట్టుకున్నా సరే నాకంటే చెడ్డది ఇంకొకర్తి ఉండదు చెబుతున్నాను అని అంది దేవి. .... అభి నెమ్మదిగా గొణుగుతూ, నీకంటే చెడ్డది ఈ భూమి మీద ఉండదు కూడాను అని అన్నాడు. ఆ మాట అనుకి వినపడింది. కానీ దేవి ఆ మాట వినలేదు. ఏమన్నావ్? సరిగా వినబడలేదు మళ్లీ ఒకసారి చెప్పు? అని అడిగింది దేవి. .... నేనేమన్నాను? నేను ఏమీ అనలేదు. .... అన్నయ్య ఎందుకు అలా అబద్దం చెప్తున్నావ్? ఇప్పుడే కదా వదిన కంటే చెడ్డది ఉండదు అని అన్నావు అని అంది అను.

చెడ్డది అన్న పదాన్ని అను ఒత్తి పలకడంతో అభి అను వైపు కళ్ళు పెద్దవి చేసి గుర్రుగా చూశాడు. మరోవైపు ఆ మాటకి ఇక్కడ దేవికి మండిపోతోంది. ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గిల్లికజ్జాలు సరదాగానే జరుగుతున్నాయి అనుకోండి. ఓహో,,, అయ్యగారికి నేను అంత చెడ్డదానిలా కనబడుతున్నానా? సరే అయితే ఇప్పటి నుంచి మొదలు రెండు రోజుల వరకు నీకు మొత్తం భోజనం బంద్. కేవలం తాగడానికి మంచినీళ్లు మాత్రమే దొరుకుతాయి అని అంది దేవి. .... అయ్యో అయ్యో నా మీద మరీ అంత కక్ష పెంచుకోకే. .... ఇక మాట్లాడడానికి ఏమీ లేదు అని అంది దేవి. .... అభి, అను మరియు నా వైపు చూసి, కనీసం మీరైనా చెప్పండి అని అనగానే, అను తన భుజాలు ఎగరేస్తూ ఏం చేయలేం అన్నట్టు తల అడ్డంగా ఊపింది.

సారీ నేను కూడా ఏం చేయలేను అని అన్నాను. .... దీపు నువ్వు నా ఎంప్లాయ్ వి. నేను నీకు ఆర్డర్ వేస్తున్నాను. నన్ను క్షమించమని దేవికి అర్థమైనట్టు చెప్పు అని అన్నాడు అభి. సరే అని చెప్పి నేను దేవి దగ్గరికి వెళ్లి నిలుచున్నాను. నేను మాట్లాడబోయేంతలో దేవి కోపం నిండిన స్వరంతో మాట్లాడుతూ, తమ్ముడు నువ్వు పక్కకు తప్పుకో, ముందు నేను ఆయనతో మాట్లాడాలి అని చెప్పి అభికి ఎదురుగా నిల్చుంది. దేవి కోపం నిండిన స్వరంతో మాట్లాడుతూ, నిన్న రాత్రి నేను మీకు ఏం చెప్పాను? అని కోపంగా అనడంతో మేము ముగ్గురం కొంచెం భయపడ్డాము.

అభి కొంచెం ఆలోచించి, అదే,, దీపు నీ తమ్ముడు అని చెప్పావు. .... ఇంకా? ఇంకేం చెప్పాను? .... అదే,, దీపుని నా దగ్గర పనిచేసే ఎంప్లాయిలా చూడొద్దు అని చెప్పావు. ..... ఇంకా?.... తనని మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకడిలా చూడమని చెప్పావు. .... మరి అలాంటప్పుడు నా తమ్ముడుని పట్టుకొని ఎంప్లాయ్ అనడానికి నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? .... తప్పై పోయింది ప్లీజ్ నన్ను క్షమించు. ఇక మీదట ఇలాంటి తప్పు జరగదు అని అన్నాడు అభి.

ఇక్కడ నా కళ్ళమ్మట నీరుకారి పోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సోదరిలు నా పట్ల తమకు ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. అది ఒకటి ప్రీతి అయితే రెండవది దేవి. ప్రీతి అంటే చిన్న పిల్ల కాబట్టి, పైగా తనకు అన్నయ్య ఎవరూ లేరు కాబట్టి నాలో తన అన్నయ్యను చూసుకుంటుంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవి నా కోసం ఎందుకు అలా తన భర్తతో గొడవ పడుతుంది? అసలు ఆమె నాకు ఏమవుతుందని? స్వయంగా నా తోడబుట్టిన అక్కయ్య నన్ను చూసి చీదరించుకుంటుంది అలాంటిది దేవి నాపై ఎందుకు అంతలా పేమాభిమానాలు చూపిస్తుంది. నా నుదిటిన ఏం రాత రాసావయ్యా భగవంతుడా? సరేలే ముందు నేను ఈ గొడవని ఆపాలి. లేదంటే మరింత పెద్దది అయిపోయే ప్రమాదం ఉంది అని అనుకున్నాను.

దేవి మాట్లాడుతూ, నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని అంది. .... ఇదే నా మొదటి మరియు చివరి తప్పుగా భావించి క్షమించు ప్లీజ్,, అని అన్నాడు అభి. .... లేదని చెప్పాను కదా? నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని అంది దేవి. ..... అంతలో నేను గద్గదమైన స్వరంతో, ప్లీజ్,, అభి సార్ ని క్షమించండి అని అన్నాను. పూడుకుపోయిన నా గొంతు విని అందరి దృష్టి నా మీద పడింది. ఎందుకంటే నా గొంతు భావోద్వేగంతో నిండిపోయింది. అందుకే అందరూ నా వైపు చూస్తున్నారు.

నా కళ్ళల్లో కన్నీరు చూసిన దేవి వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను తన గుండెల కేసి హత్తుకుని, ఏమైంది తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడిగింది. .... కానీ నేను ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూనే ఉన్నాను. .... ఏమైందో చెప్పు తమ్ముడు. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను ప్లీజ్,, .... నేను ఏడుస్తూ, ఏం చేయమంటారు, మీరంతా నా మీద చూపిస్తున్న ఇంత ప్రేమని తట్టుకోలేకపోతున్నాను. చిన్నతనము నుండి చీదరింపులు ఛీత్కారాల మధ్యే జీవితాన్ని గడిపాను. మీ అందరి ప్రేమ నా మనసులో ఏదో తెలియని ఆత్రుతను జాగృతం చేస్తోంది. నువ్వు నన్ను తమ్ముడు అని ఎందుకు అంటున్నావు? పైగా నా కోసం అభి సార్ తో ఎందుకు గొడవ పడుతున్నావు? అని అడిగాను. నా మాటలు విని దేవి మరియు అను కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు కారుతున్నాయి.

దేవి ఏడుస్తూ, నిన్ను ద్వేషించడమా? అటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. నీతో నేను ఆ పని చేయలేను. ఇకపోతే ప్రేమించడం అంటావా? అందుకు నువ్వే కారణం. నువ్వే మా మనసులోని స్థానం గెలుచుకున్నావు. ఇకపోతే నిన్ను తమ్ముడు అని ఎందుకు అంటున్నాను అంటే, నేను నా తల్లిదండ్రులకు ఏకైక సంతానాన్ని. చిన్నతనం నుండి అమ్మానాన్నలతో ఒంటరిగానే ఉన్నాను. నాకు అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని ఎవరూ లేరు. అందుకనే నాకు కూడా ఒక తమ్ముడు ఉంటే బాగుండేది అని, నా తమ్ముడికి రాఖీ కట్టాలని, నా తమ్ముడిని చాలా ప్రేమించాలని నా చిన్నతనం నుండే నాకు ఉన్న పెద్ద కోరిక. కానీ ఇంతవరకు అది సాధ్యం కాలేదు. నా ఈ కోరికను తీర్చమని ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థించే దానిని. కానీ ఆ భగవంతుడు నా మొర ఆలకించలేదు.

కానీ నువ్వు ఆ రోజు అభి ప్రాణాలను కాపాడావు అంటే నన్ను కాపాడినట్టే. అందుకే నిన్ను నా తమ్ముడిగా అనుకుని ప్రేమిస్తున్నాను. ఒక సోదరుడిగా అక్కను రక్షించుకోవడం అనేది సోదరుడి బాధ్యత. నేను చెప్పింది కరెక్టే కదా? అని అంది దేవి. నేను ఏమీ మాట్లాడకుండా దేవి మాటలు వింటున్నాను. దేవి నా నుంచి విడిపోయి తన రెండు చేతులు నా చెంపలకు ఆనించి నా మొహాన్ని పట్టుకుని, నేను చెప్పింది కరెక్టే కదా? అని మళ్లీ నన్ను అడిగింది. నేను అవును అన్నట్లు తల మాత్రమే ఆడించాను. ఆరోజు నువ్వు అభి ప్రాణాలు కాపాడావు అంటే నువ్వు నన్ను కాపాడినట్టే. అందుకే నువ్వే నా తమ్ముడివి అని ఆ రోజే డిసైడ్ అయిపోయాను.

నేను ఏడుస్తూనే, కానీ మీరు నా మీద చూపిస్తున్న ఇంత ప్రేమను నేను స్వీకరించలేక పోతున్నాను. ఎందుకంటే ఈ ప్రేమ నాకు అలవాటు అయిపోతుందేమోనని భయపడుతున్నాను. ఒకవేళ ఇదే నాకు అలవాటుగా మారిపోతే ఆ తర్వాత ఈ ప్రేమ నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అని భయపడుతున్నాను. ఇంతకు ముందు నా జీవితంలో అలాగే జరిగింది. కానీ దానిని ఎలాగోలా తట్టుకుని మళ్లీ నిలదొక్కుకున్నాను. కానీ మళ్లీ ఒకసారి అలాగే జరిగితే నేను తట్టుకోలేను. కచ్చితంగా నేను కుంగి కృశించి పోతాను అని ఏడుస్తూ నేల మీద మోకాళ్ళపై కూర్చుండిపోయి, నేను కృషించి పోతాను,, నేను కృషించి పోతాను అని అంటున్నాను. దేవి కూడా నేల మీద కూర్చుని మళ్లీ నన్ను తన గుండెల కేసి హత్తుకుంది.

లేదు అలా ఏమీ జరగదు. ఈసారి నా తమ్ముడు జీవితాన్ని నేను అలా జరగనివ్వను అని చెప్పి దేవి నన్ను మరింత గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది. కొంతసేపటి తర్వాత అభి దేవిని ఊరుకోబెడుతూ, దేవి దీపుని సముదాయించాల్సింది పోయి నువ్వు కూడా ఏడుస్తున్నావేంటి? అని అన్నాడు. దేవి అతని మాటను మన్నించి నన్ను సముదాయించడం మొదలు పెట్టింది. కానీ నేను అలా ఏడుస్తూనే ఉన్నాను. ఊరుకో తమ్ముడు, ఎంతసేపని అలా ఏడుస్తావు? అని అంది. కానీ నేను ఇంకా ఏడుపు ఆపక పోవడంతో, నా మాట విని ఊరుకో తమ్ముడు. లేదంటే నా మీద ఒట్టే అని అంది.

ఒట్టు అన్న మాట వినగానే నేను ఏడవడం ఆపేశాను. దేవి తన కొంగుతో నా కన్నీళ్ళు తుడిచి నన్ను పైకి లేపి కుర్చీలో కూర్చో పెట్టింది. వెంటనే అను మంచి నీళ్ళు తెచ్చి నాకు ఇచ్చింది. నా వెక్కిళ్ళు ఇంకా ఆగలేదు. ఇంతలో అభి మాట్లాడుతూ, వీటన్నిటి మధ్య ఒక విషయం అలాగే ఉండిపోయింది అని అన్నాడు. .... ఏంటది? అని దేవి మరియు అను ఒకేసారి అన్నారు. .... నేను కూడా అభి వైపే చూస్తున్నాను. .... అదే,, ఇంతకీ దేవి నన్ను క్షమించినట్టా లేదా? నాకు మళ్లీ భోజనం దొరుకుతుందా లేదా? అని అన్నాడు. అభి మాట విని మా ముగ్గురికి నవ్వు తన్నుకు వచ్చింది. దాంతో అక్కడి వాతావరణం కొంచం తేలిక పడింది.

కానీ కొన్ని క్షణాల తర్వాత దేవి మళ్లీ కోపాన్ని తన మొహంలోకి తెచ్చుకొని మాట్లాడుతూ, లేదు,, లేదంటే లేదు అని అంది. .... దీపు ప్లీజ్,, నువ్వు రికమెండ్ చెయ్ అని అన్నాడు అభి. .... ప్లీజ్,, అక్క క్షమించెయ్ అని అన్నాను. వెంటనే దేవి నా వైపు తిరిగి చూసి, ఇప్పుడు ఏమన్నావు తమ్ముడు నువ్వు? అని అడిగింది. .... అభిని క్షమించమని చెప్పాను. .... లేదు లేదు దానికంటే ముందు ఏదో అన్నావ్?.... అక్క,,,, .... అక్క అన్న మాట వినగానే దేవి నన్ను గట్టిగా వాటేసుకుంది. తమ్ముడు మళ్లీ ఒకసారి అలా పిలవా? ప్లీజ్,,,, .... అక్క,,, .... ఈరోజు నా మనసుకు ఎంతో హాయిగా ఉంది తమ్ముడు. ఈ పిలుపు వినడానికి ఎంతోకాలంగా ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. మళ్లీ ఒకసారి పిలవవా?? .... మళ్లీ మీ ఇద్దరూ అక్క తమ్ముడు మొదలెట్టేసారా? ఎవరో ఒకరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి? అని అన్నాడు అభి. అభి మాట విని మేము ముగ్గురం మళ్లీ నవ్వుకున్నాం.

దేవి మాట్లాడుతూ, సరే ఈ సారికి క్షమించేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకూడదు అని అంది. .... అభి ఒక రాజభటుడు వంగి సలాం చేస్తున్నట్టు చేస్తూ, చిత్తం మహారాణి గారు అని అనడంతో మేమంతా మళ్లీ నవ్వుకున్నాము. భోజనాల టైం కావడంతో అభి తినడానికి ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత మేమంతా కలిసి భోజనం చేసాము. ఆ రోజు సాయంత్రం వరకు అందరం కేఫ్ లోనే గడిపాము. రాత్రికి ఎవరింటికి వారు బయలుదేరాము. నేను కూడా నా రూంకి బయలుదేరాను. నేను సగం దారి చేరుకున్నాను అక్కడ ఏరియా అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అలా నేను నడుస్తూ వెళుతుండగా నాకు కొంచెం ముందుగా ఒక అమ్మాయి నడుస్తూ వెళుతుంది. నేను నా మానాన ఆమె వెనుక నడుచుకుంటూ వెళుతున్నాను. ఇంతలో అకస్మాత్తుగా,,,,,,,,,,,
Next page: Episode 012
Previous page: Episode 010