Episode 015
ప్లాష్ బ్యాక్ కంటిన్యూ,,,,,,
రవి పవిత్ర లతో కలిసి నా జీవితం ఐదు సంవత్సరాల పాటు ఎలా గడిచిపోయిందో నాకే తెలీదు. నాకు రవికి చాలా ప్రియమైన చెల్లెలు పవిత్ర. పవిత్ర చాలా మొండిఘటం. తను ఏదంటే అది జరగాల్సిందే. మా ఇద్దరి గారాబంతో మరింత మొండిగా తయారయింది. కానీ చాలా బాగా చదువుతుంది. మంచి తెలివైన పిల్ల. తన దృష్టిలో మా ఇద్దరినీ ఒకేలా చూసేది. మా మధ్య ఎటువంటి అరమరికలు ఉండేది కాదు. మా కంటే చిన్నపిల్ల కావడంతో మేమిద్దరం కూడా ఆమెకు ఎటువంటి అడ్డుచెప్పకుండా తనకు నచ్చినట్టుగానే అన్ని చేసి పెట్టే వాళ్ళం. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి ఆమెకు స్నానం చేయించడం, తినిపించడం, బట్టలు తొడగడం, ఆమెకు కావాల్సినవి కొనిపెట్టడం ఇలా ఏం కావాలన్నా చేసేవాళ్ళం. ఒక విధంగా చెప్పాలంటే ఆమె మా ఇద్దరికీ గారాలపట్టి. అలా వారితో ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ గెంతుతూ జీవితం సాగిపోతోంది.
మేము ముగ్గురం జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాము. కానీ మేము అలా సంతోషంగా ఉండడం మరెవరికో సంతోషంగా లేనట్టుంది. అది ఎవరో మీకు తర్వాత తెలుస్తుంది. కానీ అతను మంచివాడు కాదు. నన్ను జీవితంలో హాయిగా బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నాడు.
రవి పవిత్ర నా జీవితంలో ఒక భాగమైపోయారు. ఇప్పుడు మేము ముగ్గురం కలిసే ఉంటున్నాము. పవిత్ర కూడా మా కాలేజ్ లోనే చదువుతూ ఉండటంతో మేము ముగ్గురం కలిసి కాలేజ్ కి వెళ్లడం, తిరిగి వచ్చి వండుకొని తినడం, పార్క్ కి వెళ్లి ఆడుకోవడం, కలిసి స్నానం చేయడం, కలిసి ఒకే మంచం మీద పడుకోవడం అలా వాళ్ళిద్దరితో జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎందుకో తెలియదు గాని కాలేజ్లో ఒక మేడం కూడా నన్ను అమితంగా ఇష్టపడతారు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అది మరెవరో కాదు కవిత మేడం. ఆమె మా కాలేజ్లో ఒక ఏడు సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యారు. ఆమె చాలా మంచి మనసున్న మనిషి. అప్పట్నుంచే నా పట్ల చాలా ప్రేమగా ఉంటున్నారు.
ఏదో సామెత చెప్పినట్టు అన్ని విషయాలను కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండనివ్వదు అంటారు. అలా ఐదు సంవత్సరాలు చాలా బాగా గడిచిపోయాయి. ఏదో ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు తప్ప. అవి జీవితంలో మరీ అంత గొప్పగా గుర్తుపెట్టుకోవాల్సినవి కాదు. కానీ ఇప్పటికి ఒక ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మాత్రం జీవితాన్ని ఒక్కసారిగా అతలాకుతలం చేసేసింది. ఆరోజు నేను, రవి మరియు పవిత్ర కాలేజ్ కి వెళ్ళాము. మధ్యాహ్నం లంచ్ టైం లో నేను రవి క్యాంటీన్లో కూర్చుని ఉన్నాము. పవిత్ర భోజనం చేసి ఆడుకోవడానికి వెళ్లిపోయింది.
@@@@@@@@@@@@@@@@@@@@@@
ఎక్కడో ఒక దగ్గర ఎవరో మరొకరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు. మొదటి వ్యక్తి మాట్లాడుతూ, లేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. ఇప్పటికే చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ వస్తున్నాను. ఈ సారి ఎలాగైనా వాడిని అంతం చేయాల్సిందే అని అన్నాడు. అటు నుంచి వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ, లేదు లేదు ఈసారి అలా జరగదు. ఎట్టిపరిస్థితిలోనూ తప్పించుకోనివ్వను అని నీకు మాటిస్తున్నాను. ఈరోజే వాడికి జీవితంలో చివరి రోజు అవుతుంది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అతని మొహంలో ఒక పైశాచికమైన నవ్వు వెలిసింది. అతని దగ్గర ఒక వ్యక్తి నిల్చుని ఉన్నాడు.
ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ, వెళ్ళు,, ఈరోజు వాడి పని ముగించి రా అని ఆర్డర్ వేసాడు. .... సరే బాస్ అని అన్నాడు ఆ నిల్చున్న వ్యక్తి. .... ఆ,, ఇంకో విషయం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. గత ఏడు సంవత్సరాలలో ఇప్పటివరకు ఐదు సార్లు ఎటాక్ చేసాము. కానీ వాడు బతికిపోయాడు. కానీ ఇదే ఆఖరుసారి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు అర్థమైందా? .... సరే బాస్ అని చెప్పి ఆ నిల్చున్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత బాస్ నవ్వుతూ, ఈరోజు వాడు చస్తాడు. ఆ తర్వాత అంతా నాదే హ హ హ హ హ హ హ హ ,,,, అంటూ వికటాట్టహాసం చేశాడు.
@@@@@@@@@@@@@@@@@@@@@@
ఇక్కడ నేను రవి క్యాంటీన్లో కూర్చుని ఉన్నాము. పదరా రవి మంచినీళ్లు తాగి వద్దాం అని అన్నాను నేను. సరే పద అని అన్నాడు రవి. ఇద్దరం కలిసి వాటర్ కూలర్ దగ్గరికి వెళ్ళాము. ముందుగా నేను మంచినీళ్లు తాగుతున్నాను. ఇంతలో ప్యూన్ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి చేతిలో చాకు పట్టుకొని నా వైపు వస్తున్నాడు. నాకు ఆ విషయం పట్ల ఎటువంటి అవగాహన లేదు. అతను నాకు అతి దగ్గరగా వచ్చేస్తుంటే నేను మాత్రం నీళ్లు తాగడంలో బిజీగా ఉన్నాను. అతను నన్ను చంపడానికి చాకు ఉన్న చేతిని పైకెత్తగానే రవి దృష్టి అతని మీద పడింది. వెంటనే రవి ముందుకు ఉరికి పైకెత్తిన అతని చేతిని పట్టుకునే ప్రయత్నం చేశాడు.
కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. ఆ చాకు నేరుగా వెళ్లి రవి పొట్టలో దిగింది. వెంటనే రవి, దీపు పరిగెత్తు,,, దీపు పరిగెత్తు,,, అంటూ గట్టిగా అరిచాడు. వెంటనే నేను రవి వైపు తిరిగాను. అక్కడి దృశ్యం చూసి నాకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఒక వ్యక్తి రవి కడుపులో చాకుతో పొడిచినట్టు కనబడుతున్నాడు. రవి మాత్రం దీపు పారిపో,,, దీపు పారిపో,, అని గట్టిగా అరుస్తూ కనబడ్డాడు. కానీ నాకు అవేమీ వినబడటం లేదు. ఆ పొడిచిన వ్యక్తి మాత్రం రవి చేతినుండి తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రవి మాత్రం అతని చేతిని వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. వాడు మాత్రం ఆగకుండా దీపు పారిపో,, దీపు పారిపో,, అని అరుస్తూనే ఉన్నాడు. కానీ నేను మాత్రం ఎటూ కదలకుండా అలాగే నిలబడిపోయాను.
అప్పుడు రవి తన కాలితో నా కాలుని గట్టిగా ఒక్క తన్ను తన్నాడు. అప్పటికిగాని నేను వాస్తవంలోకి రాలేదు. వెంటనే తేరుకొని నేను రవి వైపు కదిలాను. వద్దురా దీపు దగ్గరికి రావద్దు. వీడు నిన్ను చంపేస్తాడు. దగ్గరికి రావద్దు రా,,, అని రవి అరుస్తున్నాడు. వెంటనే నేను అటు ఇటు చూసాను. అక్కడ నేల మీద ఒక దగ్గర వాటర్ పైపులు మరమ్మతులకు వాడే ఇనుప గొట్టం ఒకటి కనబడింది. వెంటనే నేను దాన్ని అందుకుని ఆ వ్యక్తి చేతి మీద ఒక గట్టి దెబ్బ వేసాను. వెంటనే ఆ గొట్టంతో అతని కాళ్ళ ముడుకుల మీద కూడా గట్టిగా కొట్టాను. దాంతో అతను వెంటనే నేల మీద పడ్డాడు. వెంటనే నేను ఆ గొట్టంతో అతని తలమీద నాలుగైదు దెబ్బలు వేసాను. దాంతో అతని తల పగిలి రక్తం కారడం మొదలైంది.
అక్కడే అతను స్పృహతప్పి పడ్డాడు. వెంటనే నేను రవి వైపు తిరిగి వాడి దగ్గరకు వెళ్లి వాడిని పైకి లేపే ప్రయత్నం చేశాను. కానీ వాడిని పైకి లేపగలిగేంత శక్తి నాకు లేకపోయింది. దగ్గర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ నిల్చుని తమాషా చూస్తున్నారు. నేను మాట్లాడుతూ, నీకేమీ కాదురా రవి, నీకోసం ఎవరినైనా సహాయం చేయమని అడుగుతాను ఉండు అని చెప్పి, ఎవరైనా సహాయం చేయండి,, ఎవరైనా సహాయం చేయండి అన్ని గట్టిగా అరిచాను. కానీ ఎవ్వరూ ముందుకు వచ్చి సాయం చేయలేదు. అంతలో రవి నా చేతిని పట్టుకుని నొప్పితో విలవిలలాడుతూ చిన్నగా మాట్లాడుతూ, నేనింక బతకనురా దీపు. నా బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇక నేను వెళ్ళిపోతున్నాను బాయ్,,, అని అన్నాడు.
లేదురా నీకు ఏమీ కాదు,, నీకు ఏమి కాదురా రవి అని అన్నాను. .... రవి గింజుకుంటూ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ ని ఉద్దేశించి నాతో మాట్లాడుతూ, ఒక్క మాటరా దీపు, నువ్వు వాళ్ళ లాగా తయారవ్వమాకు. ఒక మంచి మనసున్న వ్యక్తిలా తయారవ్వాలి. అందరికీ సహాయం చేయాలి. దీపు మై ఫ్రెండ్,,, నువ్వు బుజ్జమ్మ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి శాశ్వతంగా మాకు దూరం అయిపోతూ కన్నుమూశాడు. ఇప్పుడు నేను పవిత్రకి ఏమని సమాధానం చెప్పాలి? ఈరోజు నేను నా ఆప్తమిత్రుడిని కోల్పోయాను. ఈరోజు వాడు తన స్నేహధర్మాన్ని నిర్వర్తిస్తూ నా కోసం తన ప్రాణాలు వదిలాడు. స్నేహధర్మాన్ని పాటించాడు కానీ శాశ్వతంగా మాకు దూరమయ్యాడు. ఇప్పుడు నేను పవిత్రకి ఏమని సమాధానం చెప్పాలి?
నెమ్మది నెమ్మదిగా మా చుట్టూ జనం పోగవుతున్నారు. కవిత మేడంతో పాటు మిగిలిన టీచర్లు అందరూ కూడా అక్కడికి వచ్చి చేరారు. నేను దేని కోసం అయితే భయపడుతున్నానో అదే,, పవిత్ర కూడా అక్కడికి వచ్చేసింది. అది వస్తూనే రవి మీద పడి ఏడవడం మొదలు పెట్టింది. అన్న ఏమైంది అన్న? పైకి లెగు,, అన్న,, అన్న,, నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు,, నాతో మాట్లాడు అన్న అని ఏడుస్తూ ఉంది. నేను ముందుకు కదిలి పవిత్ర భుజం మీద చేయి వేసాను. వెంటనే పవిత్ర నా చేతిని విసిరికొట్టింది. అసలే దానికి కోపం ఎక్కువ. అంతే కోపంగా మాట్లాడుతూ, నువ్వు నా నుంచి దూరంగా పో. ఇదంతా నీ వల్లే జరిగింది. నా ఫ్రెండ్స్ చెప్పిందంతా నిజమే. నువ్వొక రాక్షసుడివి. ఈ రోజు నువ్వు నా అన్నని కూడా మింగేసావు. నువ్వు నా అన్నని నా నుంచి దూరం చేసావు అని చెప్పి, అన్న లెగన్న,, అన్న లెగన్న,, అంటూ గట్టిగా రోదిస్తోంది.
పవిత్ర మాటలు విని మళ్లీ ఈరోజు నా మనసు ముక్కలైపోయింది. అది చెప్పింది కూడా నిజమే. ఈరోజు నా వల్లనే రవి చనిపోయాడు. నా జీవితం ప్రతి మలుపులో నాతో ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంది. ఇక చేసేదేమి లేక నేను కూడా అక్కడే ఏడుస్తూ కూర్చున్నాను. అంతలో కవిత మేడం ఇన్ఫామ్ చేయడంతో సెక్యూరిటీ ఆఫీసర్లు అక్కడికి వచ్చారు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి సంఘటన జరిగిన చుట్టుపక్కల అంతా క్షుణ్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ఇదంతా ఎలా జరిగింది? ఆ అబ్బాయిని, ఆ వ్యక్తిని ఎవరు కొట్టారు? అని అడిగాడు. .... కవిత మేడం కళ్ళమ్మట నీళ్ళతో దుఖాన్ని దిగమింగుకుని మాట్లాడుతూ, మాకు ఎవరికీ ఏమీ తెలీదు సార్, దీపుకే అంతా తెలుసు అని చెప్పారు.
అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ నా దగ్గరకు వచ్చి, చెప్పు బాబు ఇక్కడ ఇదంతా ఎలా జరిగింది? అని అడిగారు. .... సార్,, నేను ఇక్కడి నుంచొని మంచి నీళ్లు తాగుతున్నాను. అంతలో ఈ వ్యక్తి నన్ను చంపడానికి వచ్చాడు. కానీ ఆ విషయం గమనించిన నా ఫ్రెండ్ అతను నన్ను పొడిచేయడానికి ముందే మా మధ్యకు వచ్చాడు. దాంతో నాకు తగలవలసిన చాకు నా ఫ్రెండ్ కడుపులో దిగింది. వెంటనే వాడు అరుస్తూ అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతను వాడి చేతి నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అతను వచ్చింది నా మీద దాడి చేయడానికి. ఇంతలో నేను చుట్టూ వెదికి కనబడిన గొట్టాన్ని అందుకుని అతని చేతి మీద ఆ తర్వాత అతని తలమీద కొట్టడంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. నేను కొట్టిన దెబ్బలకి అతని తల నుంచి రక్తం కూడా కారింది. నా ఫ్రెండ్ ని చంపిన అతనికి కఠినంగా శిక్షపడేలా చూడండి సార్. నా అన్న లాంటి ఫ్రెండ్ ని ఇతను దారుణంగా చంపేశాడు అని చెప్పి నేను అక్కడే కూర్చుని బోరున ఏడుస్తున్నాను.
కవిత మేడం ముందుకు వచ్చి నన్ను సముదాయిస్తున్నారు. మరోవైపు ఇద్దరు టీచర్లు వెళ్లి పవిత్రను కూడా సముదాయిస్తున్నారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, కానిస్టేబుల్ ఈ అబ్బాయి దగ్గర వాంగ్మూలం తీసుకొని రాసుకోండి. అలాగే అంబులెన్స్ రప్పించి ఈ శవాన్ని ఆ హంతకుణ్ని హాస్పిటల్ కి చేర్పించండి. శవానికి పోస్టుమార్టం చేయించాలి. ఆ హంతకుడికి ట్రీట్మెంట్ చేపించి లాక్ అప్ లో పెట్టండి అని చెప్పగా అందుకు కానిస్టేబుల్ ఎస్ సార్ అని అన్నాడు. నేను లేచి రవి దగ్గరకు వెళ్లాను. రవి శరీరాన్ని నా చేతితో తాక బోతుండగా వెంటనే పవిత్ర నన్ను ముట్టుకోనివ్వకుండా నా చేతిని విసిరికొట్టింది.
నా అన్న నుంచి దూరంగా ఉండు నువ్వు అని కోపంగా అంది. .... ఈ సారి నాకు కూడా కొంచెం కోపం వచ్చింది. అదే కోపంతో, నేను ఎందుకు దూరం ఉండాలి. వాడు నాకు అన్నయ్య కంటే ఎక్కువ. వాడికి అంతిమ సంస్కారాలు కూడా నేనే చేయాలి అర్థమైందా? అని చెప్పి నేను వాడి పక్కనే కూర్చుని ఏడుస్తున్నాను. కొంతసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఆ హంతకుడి బాడీ మరియు రవి శవాన్ని అందులోకి ఎక్కించి కానిస్టేబుల్ తో పాటు నేను కూడా లోపల కూర్చున్నాను. పవిత్రను కవిత మేడంతో పాటు ఇంటికి పంపించాను. రవి డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తయింది. ఆ హంతకుడికి వైద్యం చేయించి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి పంపించారు.
పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత రవి బాడీ తీసుకొని నేను ఇంటికి చేరుకున్నాను. తర్వాత అన్ని రెడీ చేసి కొంతమంది సహాయంతో రవి శవాన్ని స్మశానానికి తీసుకొని వెళ్ళాము. అక్కడ నా చేతుల మీదుగా దహన సంస్కారాలు పూర్తి కావించి తిరిగి ఇంటికి చేరుకున్నాను. కొద్ది రోజులు దుఃఖంతో ఏడుస్తూ గడిచిపోయాయి. తర్వాత ఒకరోజు పవిత్ర తన సామానంతా ప్యాక్ చేసుకుని ఎక్కడికో బయలుదేరింది. అది చూసి నేను, ఎక్కడికి వెళ్తున్నావ్? అని అడిగాను. .... నేను ఎక్కడికి వెళితే నీకెందుకు? అని సీరియస్ గా జవాబిచ్చింది. .... నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాది. .... ఇప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను. నన్ను ఆపడానికి ప్రయత్నించవద్దు. .... సరే అదే నీ నిర్ణయం అయితే నీ ఇష్టం అని అన్నాను.
ఆ తర్వాత పవిత్ర వెళ్ళిపోయింది. అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. నేను ప్రతిరోజు పవిత్రను చూసి రావడానికి ఆశ్రమానికి వెళ్లి వచ్చేవాడిని. పవిత్ర కోసం ఆశ్రమానికి డొనేషన్ కూడా కట్టేవాడిని. ఆ తర్వాత ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. మా బాబాయ్ కి పెళ్లై 13 సంవత్సరాలు కావస్తోంది. కానీ వాళ్ళకి పిల్లలు కలగలేదు. అందుకే మా పిన్ని ప్రతి శుక్రవారం అక్కడికి దగ్గరలో ఉన్న ఒక గుడికి వస్తూ ఉంటుంది. అదృష్టవశాత్తు ఆ రోజు శుక్రవారం. మా పిన్ని చాలా మంచిది. స్వచ్ఛమైన మనసు కలిగి ఎప్పుడూ ప్రేమభావంతో ఉంటుంది. మనసులో ఎటువంటి కల్మషం లేని అమాయకురాలు. వెంటనే నేను గుడి దగ్గరకు చేరుకున్నాను. కానీ పిన్ని ఇంకా రాకపోవడంతో నేను ఆమె కోసం అక్కడే వేచి చూస్తూ కూర్చున్నాను.
ఒక గంట గడిచిన తర్వాత పిన్ని గుడికి వచ్చింది. పిన్ని పూజా కార్యక్రమాలు అంతా పూర్తయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత వెళ్లి పిన్ని వెనకాల నిల్చున్నాను. వెనక్కి తిరిగిన పిన్ని నన్ను అక్కడ చూసి ముందుగా షాక్ అయింది. ఆ తర్వాత పక్కకు జరిగి అక్కడినుంచి వెళ్ళిపోతుంటే, పిన్ని,,, అని పిలిచి ఆపబోయాను. అయినా సరే పిన్ని ఆగకుండా వెళ్లిపోతూ ఉండటంతో, పిన్ని ఒక్కసారి నా మాట విను పిన్ని. కావాలంటే తర్వాత జీవితాంతం నువ్వు నా మొహం చూడకపోయినా పర్వాలేదు. చివరిగా ఒక్కసారి నా మాట విను పిన్ని అని అన్నాను. ఆ మాట విన్న పిన్ని ఆగిపోయింది. నేను పిన్నికి ఎదురుగా వెళ్లి చేతులు జోడించి నిల్చున్నాను.
పిన్ని కేవలం నీ దగ్గరకు ఒక సహాయం కోరి వచ్చాను అని చెప్పి నా జేబులో ఉన్న ఒక ఫోటో తీసి పిన్నికి అందించాను. ఆ ఫోటోలో రవితో పాటు ఉన్న పవిత్ర ఉంది. పిన్ని,, నా చేతులు జోడించి అర్థిస్తున్నాను ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు దత్తత తీసుకోండి. .... నేను ఎందుకు దత్తత తీసుకోవాలి? .... నేను ఏడుస్తూ మోకాళ్లపై కూర్చుని, ఎందుకంటే నా కోసం ఆ అమ్మాయి అన్నయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోతూపోతూ ఆమె అన్నయ్య జీవితాంతం ఆమెను జాగ్రత్తగా చూసుకోమని బాధ్యత నాకు అప్పగించి పోయాడు. కానీ ఆ అమ్మాయి తన అన్నయ్య చనిపోవడానికి కారణం నేనే అని భావిస్తుంది. అందుకే ఆమె నన్ను ద్వేషిస్తుంది. అందుకే నేను ఎంత ప్రయత్నించినా ఆమె దగ్గరకు వెళ్లలేకపోతున్నాను. ఆమెకు ఎదురుపడే శక్తి ఇప్పుడు నాకు లేదు అని అన్నాను.
అయితే అందుకు నన్ను ఏం చేయమంటావు? అని అంది పిన్ని. .... ఏడుస్తూ పిన్ని పాదాలు పట్టుకుని, పిన్ని నీ పాదాలు పట్టుకుని ప్రాధేయ పడుతున్నాను దయచేసి ఆ అమ్మాయిని మీరు దత్తత తీసుకోండి. నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకోగలవు. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ పిన్ని నా మాట మన్నించండి ప్లీజ్. కనీసం ఆ అమ్మాయికి ఒక కుటుంబం దొరుకుతుంది. ఆమె జీవితానికి సరైన దారి దొరుకుతుంది. నాకు ఎలాగూ అదృష్టం లేదు కనీసం ఆ అమ్మాయికైనా కుటుంబంతో కలిసి జీవించే అదృష్టం కలుగుతుంది. అలాగే నీకు కూడా ఒక కూతురు దొరుకుతుంది. ప్లీజ్ పిన్ని,,, అని అన్నాను.
పిన్ని తన కాళ్లు వదిలించుకొని, నా దగ్గర ఆల్రెడీ ఒక కూతురు ఉంది. అలాంటప్పుడు నేను మరో అమ్మాయిని దత్తత ఎందుకు తీసుకోవాలి? ఇంకేం మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి పిన్ని ముందుకు వెళ్ళిపోయింది. .... నా గురించి కాకపోయినా ఒక్కసారి ఆ అమ్మాయి గురించి ఆలోచించండి పిన్ని ప్లీజ్,,, అని అన్నాను. కానీ పిన్ని నా మాట వినిపించుకోకుండా గుడిలో నుంచి బయటికి వెళ్లిపోయింది. కానీ నాకు తెలియకుండా పిన్ని చాటుగా ఉండి నా వైపు చూస్తోంది. నేను మాత్రం ఇంకా అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉన్నాను. అలా ఏడుస్తూ ఏడుస్తూ వెక్కిళ్లు మొదలై నేను ఎగూపిరి తీసుకోవడం మొదలు పెట్టాను.
అది చూసి వెంటనే పిన్ని నా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది. అక్కడ గుడిలో ఉన్న మంచి నీళ్ళు తీసుకొని వచ్చి నాతో త్రాగించి నన్ను గట్టిగా వాటేసుకొని కౌగిలించుకుంది. నేను అలాగే పిన్ని కౌగిలిలో ఉండి ఏడుస్తూ, ప్లీజ్ పిన్ని,, ఆ అమ్మాయిని దత్తత తీసుకో పిన్ని. ప్లీజ్ పిన్ని ఒక్కసారి ఆ అమ్మాయి జీవితం గురించి ఆలోచించు పిన్ని అని అన్నాను. .... పిన్ని అలాగే నన్ను కౌగిలించుకుని ఏడుస్తూ, సరే,, సరే,, నాన్న నేను దత్తత తీసుకుంటాను. ఇంక నువ్వు ఊరుకో అంటూ నన్ను సముదాయించింది. నేను ఏడుస్తూ ఏడుస్తూ స్పృహ కోల్పోయాను. తిరిగి మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి నేను నా రూములో ఉన్నాను. పైకి లేచి కూర్చునేసరికి పిన్ని నాతో మాట్లాడిన చివరి మాట, నేను దత్తత తీసుకుంటాను అన్న మాట మాత్రమే నా మదిలో వినపడుతోంది. పవిత్ర జీవితానికి ఒక దారి దొరికినందుకు నేను మనసులో చాలా సంతోషించాను.
మరుసటి రోజు నా ఇంటి తలుపు ఎవరో తట్టారు. నేను వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి ఎదురుగా పిన్ని నవ్వుతూ నిలబడి కనపడింది. ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీకు? అని అడిగింది పిన్ని. .... ఇప్పుడు బాగానే ఉంది. లోపలికి రా పిన్ని అని పిలిచాను. .... లేదు నాన్న ఇప్పటికే చాలా లేట్ అయిపోయాను అంటూ బయట ఉన్న కార్ వైపు చూపించి, అదిగో అటు చూడు ఇప్పుడు నీకు సంతోషమేనా? అని అడిగింది. నేను కార్ వైపు చూసేసరికి కార్ లో పవిత్ర నిద్రపోతూ కనిపించింది. పవిత్రను చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించి నా కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే నేను కిందికి వంగి పిన్ని కాళ్ళు పట్టుకోబోతే పిన్ని నన్ను పట్టుకుని ఆపింది.
ప్లీజ్ పిన్ని నన్ను ఆపొద్దు లేదంటే నా మీద ఒట్టే అని చెప్పి పిన్ని కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని ఆమె పాదాలను ముద్దుపెట్టుకున్నాను. వెంటనే పిన్ని నన్ను పైకి లేపి గట్టిగావాటేసుకొని చిన్నతనంలో నన్ను ముద్దు చేసినట్టు నా పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకుంది. థాంక్యూ పిన్ని, థాంక్యూ సో మచ్,,, అని అన్నాను. .... చాల్లే ఇక ఆపు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను వెళ్తున్నాను. .... దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో పిన్ని. ఆ,, చెప్పడం మర్చిపోయాను అది కొంచెం మొండిది. .... ఏం పర్వాలేదులే. నేను దానిని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే నేను వెళ్తాను బాయ్ అని చెప్పింది పిన్ని. ఆ తర్వాత నా తల నిమిరి మళ్లీ ఒకసారి నా పెదవుల పైన ముద్దు పెట్టి పిన్ని వెళ్ళిపోయింది.
మా బుజ్జమ్మ జీవితం ఒక గాడిలో పడినందుకు ఇప్పుడు నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత నేను పవిత్రని చూడడానికి మాత్రమే పార్కుకి వెళ్లేవాడిని. అలాగే రవి చనిపోతూ నాకు చెప్పిన మాట ప్రకారం అవసరం ఉన్న వాళ్లందరికీ నాకు చేతనైన సహాయం చేయడం మొదలుపెట్టాను. అది డబ్బు రూపంలో గాని మరింకేదైనా సహాయం గాని నాకు వీలైనంత వరకు మాట తప్పకుండా చేసేవాణ్ని.