Episode 016.1


ఫ్లాష్ బ్యాక్ ముగించి వర్తమానంలోకి,,,,,,,,

ఈ మూడు రోజులు కవిత మేడం, ప్రీతి, దేవి, అను, అభి మరియు అంకుల్ లకు కొంచెం టెన్షన్ గా గడిచింది. ఆ పిల్లవాడి తండ్రి వీర్రాజు కూడా ఎటూ కదలకుండా అక్కడే హాస్పిటల్లో ఉండిపోయాడు. ఇన్స్పెక్టర్ రుద్ర కూడా ఏదైనా క్లూ దొరకకపోతుందా అని తన ఇన్వెస్టిగేషన్లో నిమగ్నమై ఉన్నాడు. గత మూడు రోజులుగా రుద్ర కూడా చాలా బిజీగా ఉన్నాడు. ప్రీతి, దేవి మరియు అను అయితే భోజనం తినడం కూడా మానేసి రోజంతా హాస్పిటల్ బయట ఉన్న మందిరానికి వెళ్లి ప్రార్థిస్తూ కూర్చోవడం లేదంటే నేను ఉన్న రూమ్ బయట కూర్చొని ఏడవడం చేస్తూ వస్తున్నారు. అభి మరియు అంకుల్ కలిసి వాళ్ల ముగ్గురిని ఊరుకోపెడుతూ నచ్చచెప్పి భోజనం తినిపించేవారు.

ఒకటి రెండు సార్లు పిన్ని కూడా హాస్పిటల్ కి వచ్చి వెళ్ళింది. ఈరోజు మూడవరోజు కావడంతో డాక్టర్ చెప్పిన టైం ప్రకారం నేను మరికాసేపట్లో స్పృహలోకి రావాలి. అందరూ నేను స్పృహలోకి రావాలని చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. అందరి మనసులు చాలా విచారంతో నిండిపోయి ఉన్నాయి. డాక్టర్ గారు కూడా నన్ను స్పృహలోకి తీసుకొని రావడానికి తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అతను చెప్పిన టైం దాటిపోయి మరో పదిహేను నిమిషాలు కావచ్చింది. ఒక్కసారిగా నా ఊపిరిలో హెచ్చుతగ్గులు ఏర్పడి స్క్రీన్ మీద కనబడుతున్నాయి. నాకు ఊపిరి తీసుకోవడం అతి కష్టంగా మారింది. డాక్టర్ గారు కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ హడావిడి పడుతున్నారు.

చివరికి అంతా ముగిసిపోయింది. నా ఊపిరి నిలిచిపోయింది. నన్ను ఎవరో లాక్కుని వెళ్లిపోతున్నట్టు నాకు అనిపిస్తోంది. నేను కూడా చాలా సంతోషంగా నన్ను లాగుతున్న వైపు వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు నా అమ్మ దగ్గరికి వెళ్లిపోవాలి అని ఆత్రుతగా ఉంది. అక్కడ నా కన్నతల్లి మరియు పార్వతి అమ్మ వెయిట్ చేస్తున్నారు అన్న సంతోషంలో నేను అలా నన్ను లాగుతున్న వైపు వెళ్ళిపోతున్నాను.

ఇక్కడ డాక్టర్ రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయారు. అతను బయటికి రాగానే బయట ఉన్న అందరూ అతడిని చుట్టుముట్టారు. డాక్టర్ ఇప్పుడు నా బాబుకి ఎలా ఉంది? అని అడిగారు కవిత మేడం. .... "సారీ,,, హీ ఈజ్ నో మోర్" అని చెప్పాడు డాక్టర్. ఈ విషయాన్ని డాక్టర్ అలా చెప్పగానే దేవి నేలపై మోకాళ్లపై కూర్చుని బోరున ఏడవడం మొదలు పెట్టింది. అను మరియు అభి ఆమెను పట్టుకొని సముదాయిస్తున్నారు. మరోపక్క ఆ మాట విన్న ప్రీతి స్పృహ తప్పి పడిపోయింది. పాపం పిచ్చితల్లి మేమిద్దరం కలిసింది కొద్ది రోజులే అయినా నా మీద అమితమైన ప్రేమ పెంచుకోవడంతో మా ఇద్దరి మధ్య బంధం చాలా దృఢంగా పెనవేసుకుపోయింది. ఇక కవిత మేడం అయితే దుఖఃంతో కుమిలిపోతూ అక్కడే ఉన్న బల్లపై అచేతనంగా పడిపోయారు.

వెంటనే డాక్టర్ గారు ప్రీతిని పైకెత్తుకుని ట్రీట్మెంట్ చేయడానికి మరో రూం లోకి తీసుకుని వెళ్లి అవసరమైన ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగారు అంకుల్. .... డోంట్ వర్రీ ఆమె బాగానే ఉంది. మరికొద్ది సేపట్లో మెలుకువ వస్తుంది అని చెప్పారు డాక్టర్. .... థాంక్యూ డాక్టర్ అన్నారు అంకుల్. ఆ తర్వాత అంకుల్ కవిత మేడం దగ్గరికి వచ్చి ఆమెను ఓదారుస్తూ సముదాయించే ప్రయత్నం చేసారు.

కొంతసేపటి తర్వాత ఇక్కడ నేను ఉన్న రూమ్ లో కవిత మేడం, దేవి మరియు అను నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు. పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే అందరూ నాకు తమ మనసులో ప్రత్యేకమైన స్థానం కల్పించారు. అందుకే అందరూ ఏకధాటిగా కన్నీరుమున్నీరవుతున్నారు.

@@@@@@@@@@@@@@@@@@@@@@

ఎక్కడో సిటీకి దూరంగా ఉన్న ప్లేస్ లో ఒకతనికి నా చావు కబురు చేరవేయబడింది. అది విన్నతను చాలా సంతోషపడుతున్నాడు. అయినా సరే అనుమానం నివృత్తి చేసుకోవడం కోసం ఎవరికో ఫోన్ కలిపాడు. ఇతనే నన్ను చంపాలని అనుకున్న ఆ బాస్. ఆ బాస్ ఫోన్లో మాట్లాడుతూ, ఇదిగో జాగ్రత్తగా విను, ఎందుకైనా మంచిది నువ్వు వాడి మీద ఒక కన్ను వేసి ఉంచు. వాడు ప్రతిసారి ఏదో ఒక విధంగా చావు నుంచి తప్పించుకుంటున్నాడు. ఒకవేళ ఈసారి కూడా అటువంటిదే ఏమైనా జరుగుతుందేమో జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ప్రతి క్షణం నాకు వివరాలు అందిస్తూ ఉండండి అని చెప్పాడు. అటునుంచి సరే అన్న,,, అని చెప్పి ఫోన్ కట్ అయింది.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

ఇక్కడ హాస్పిటల్ లో ప్రీతికి కూడా మెలకువ రావడంతో వెంటనే లేచి నా దగ్గరకు వచ్చేసింది. నా మీద పడి ఏడుస్తూ, అన్నయ్య లెగు అన్నయ్య ప్లీజ్,,,, అతికష్టం మీద నాకు అన్నయ్య దొరికాడు. ఇప్పుడేమో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని ఏడుస్తూ ప్రీతి నన్ను గట్టిగా పట్టుకుని, నేను నా అన్నయ్యను ఎక్కడికి వెళ్ళనివ్వను. అన్నయ్య లెగు అన్నయ్య ప్లీజ్,,,, అని ఏడుస్తుంది.

నేనేమో నన్ను లాగుతున్న వైపు, నా గమ్యం అదే అని నాకు అనిపిస్తున్న వైపు వెళ్ళిపోతున్నాను. అలా వెళుతూ ఉన్న నా చెవుల్లో నాకు బాగా పరిచయమైన ఒక స్వరం వినపడుతోంది. ఎక్కడికి వెళ్తున్నావురా? అంత తొందర ఏమొచ్చింది నీకు? కొంచెం ఆగు అని ఆ స్వరం విడిపడింది. వెంటనే నేను ఆ స్వరాన్ని గుర్తుపట్టాను. అది మరెవరో కాదు నా ప్రాణ స్నేహితుడైన రవి. వెంటనే నేను ఆనందంతో, రవి మై ఫ్రెండ్ ఎక్కడున్నావురా? అని అడిగాను. అప్పుడు ఒక పొగ లాంటి ధూళి ఎగురుకుంటూ నా ముందుకు వచ్చి ఆగింది. ఆ తర్వాత దాని ఆకారం మారడం మొదలైంది. ఆ పొగ లాంటి ధూళి పూర్తిగా మటుమాయం అయిపోయే సరికి నా ఎదురుగా రవి నిల్చుని ఉన్నాడు. వాడు నా వైపు కొంచెం కోపంగా చూస్తున్నట్లు కనబడ్డాడు.

ఎక్కడికి రా వెళ్తున్నావు? అని కొంచెం సీరియస్ గా అడిగాడు. .... నేను నీ దగ్గరికి నా అమ్మలు ఇద్దరు దగ్గరికే వస్తున్నానురా. .... మరి ఇక్కడ మిగిలి ఉన్న, నువ్వు నేను చేయవలసిన పనిని ఎవడు పూర్తి చేస్తాడు? .... అబ్బా పనా? ఇంకా ఎంత పని చేయాలిరా? పని చేసి చేసి అలిసిపోయాను. ఈ ప్రపంచం నా మీద చూపిస్తున్న ద్వేషాన్ని భరిస్తూ భరిస్తూ అలిసిపోయాను. ఈ సమాజం నాకు తగిలించిన రాక్షసుడు అనే ముద్రను ఇంకా భరించడం నా వల్ల కాదు. .... నోరు ముయ్యిరా,,, ఒక్కటి గాని పీకాను అంటే నీ బుర్రకి పట్టిన బూజు మొత్తం వదిలిపోతుంది. ఇంకా నువ్వు ఇక్కడ చేయవలసిన అతి ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులన్నీ నువ్వే స్వయంగా నీ చేతులతో చేయాలి. అయినా అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు అని నీకు ఎవడ్రా చెప్పాడు?

కవిత మేడం, ప్రీతి, దేవి, అను, అభి, దీపక్ అంకుల్, పిన్ని, హరిత, ఇంకా ఆ పిల్లాడి తల్లిదండ్రులు అతని కుటుంబం వీళ్ళందరూ నిన్ను ప్రేమించడం లేదా? ఇప్పుడే ఒకసారి వెనక్కి వెళ్లి చూడు అక్కడ నీ కోసం ప్రీతి ఎలా ఏడుస్తుందో. ఇంకా నీ మీద కోపంగా ఉన్న నా బుజ్జమ్మని కూడా నువ్వు ఒప్పించాలి కూడా. .... ఒరేయ్ నేను అతి కష్టం మీద ధైర్యం కూడగట్టుకుని దానిని చూడటానికి వెళుతున్నాను. అటువంటిది నేను దానిని ఎలా ఒప్పించగలను? .... సమయం వచ్చినప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. ఆ,, మరో మాట, నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న మరో మనిషి నీ చుట్టూనే తిరుగుతుంది. నువ్వు ఆ మనిషిని గుర్తించి ఆమె ప్రేమను గౌరవించాల్సి ఉంది అర్థమైందా? మ్,,,, ఇప్పుడు వెళ్ళరా వెనక్కి. .... ఒరేయ్ నువ్వు నా అమ్మలను కలవకుండా చేస్తున్నావు కదా? నీ సంగతి తర్వాత చూస్తానురా. .... ఒరేయ్ వెనక్కి వెళ్తావా లేదా? లేదంటే లాగిపెట్టి ఒక్కటి పీకమంటావా? .... ఎందుకలా అరుస్తావ్? వెళ్తానులే అని చెప్పి నేను తిరిగి వచ్చేసాను.

తిరిగి నా శరీరంలోకి వచ్చాను కానీ ఎటువంటి చలనం లేకుండా అలాగే పడి ఉన్నాను. ఇక్కడ ప్రీతి, అన్నయ్య లెగు అన్నయ్య,,, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అని గట్టిగా నా చేతిని పట్టుకొని అంటోంది. .... ఊరుకో తల్లి వాడు ఇక ఎప్పటికీ లేవడు అని కవిత మేడం ఏడుస్తూ అంటున్నారు. .... లేదు అన్నయ్య లేచి మాట్లాడతాడు. అన్నయ్య లెగు అన్నయ్య ప్లీజ్,,,,, అప్పుడే అకస్మాత్తుగా ఒక స్వరం వినపడింది. అది విని ప్రీతి తప్ప అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు.

ప్రీతి నా చేతిని పట్టుకుని అన్నయ్యని ఎక్కడికి వెళ్ళనివ్వను, అన్నయ్య లెగు అన్నయ్య అని మాట్లాడుతున్నప్పుడే నేను నా చేతితో ప్రీతి చేతిని గట్టిగా పట్టుకుని, మత్తు నిద్ర నుంచి మేల్కొన్నట్టు ఆవలిస్తూ, సరేరా నా బంగారు తల్లి నేను ఎక్కడికి వెళ్లడం లేదు. ఇక్కడే ఉన్నాను అని అన్నాను. అలా నా స్వరం వినపడటంతో ప్రీతి తప్ప అక్కడున్న వారందరూ షాకయ్యారు. కానీ వెంటనే అందరూ ఆ షాక్ నుంచి తేరుకుని చాలా సంతోషపడ్డారు. అభినవ్ వెంటనే డాక్టర్ ని పిలవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కవిత మేడం సంతోషానికి అవదులు లేవు. నాతో మాట్లాడుతూ, నాన్న నీకు బాగానే ఉంది కదా? ఈ రోజు నువ్వు మా అందరి ప్రాణాలు తీసేసావు తెలుసా? అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఇన్ని రోజులుగా మేమంతా ఎలా గడిపామో ఆ దేవుడికే తెలియాలి అని అన్నారు.

దేవి మాట్లాడుతూ, కాకపోతే ఇంకేంటి? ఆ భగవంతుడు నాకు ఒక తమ్ముడిని ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి లాగేసుకున్నట్టు అనిపించింది. థాంక్ గాడ్ అని అంది. .... అను కూడా నా దగ్గరికి వచ్చి నా చేతి మీద ముద్దు పెట్టుకుని, నాకు కూడా అలాగే అనిపించింది. ఆ భగవంతుడు అందరి కంటే మంచి స్నేహితుడిని నా నుంచి దూరం చేస్తున్నాడు అనిపించింది అని అంది. నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ ఈ విషయం గురించి కాలమే సమాధానం చెప్పాలి. అంకుల్ కూడా నా దగ్గరికి వచ్చి ప్రేమగా నా తల నిమిరారు.

అంతలో ప్రీతి మాట్లాడుతూ, ఇక మీరందరూ మాట్లాడటం ఆపుతారా? అన్నయ్యని హాయిగా రెస్ట్ తీసుకోనివ్వండి. అయినా అన్నయ్య నువ్వు చేసింది ఏమీ బాగోలేదు అని అంది. .... నేను నవ్వుతూ, ఏం ఏమైంది? అని అడిగాను. .... లేకపోతే ఏంటి అన్నయ్య, ఇన్ని రోజులుగా మమ్మల్ని ఎంత ఏడిపించావో తెలుసా? ఒక్కసారి నీకు అంతా బాగైపోనీ అప్పుడు చెప్తా నీ పని అని అంది. ప్రీతి మాట విని అందరూ నవ్వుకున్నారు. ఇంతలో అభినవ్ డాక్టర్ ని తీసుకుని వచ్చాడు.

డాక్టర్ అందరినీ బయటకు వెళ్ళమని చెప్పాడు. దాంతో అందరూ లేచి బయటకు వెళ్తున్నారు. కానీ ప్రీతి మాత్రం అక్కడే కూర్చుంది. డాక్టర్ మాట్లాడుతూ, అమ్మా నువ్వు కూడా బయటికి వెళ్ళు అని అన్నాడు. .... లేదు నేను వెళ్ళను. నేను గాని బయటికి వెళితే మళ్లీ అన్నయ్య ఎక్కడికైనా,,,,,,, లేదు బాబు నేను వెళ్ళను అని అంది. .... నేను ప్రీతితో మాట్లాడుతూ, బంగారం నేను ఎక్కడికి వెళ్లిపోవడం లేదురా. డాక్టర్ గారి మాట విను ప్లీజ్,, అని అన్నాను. .... నువ్వు ఏమీ మాట్లాడకుండా మూసుకుని ఉండు. నేను ఎక్కడికి వెళ్ళను అంటే వెళ్ళను,, వెళ్ళను,, వెళ్ళను,, అంతే, అర్థమైందా? .... డాక్టర్ గారు అది ఇప్పుడు చెబితే వినేటట్టు లేదు. మీరు చేయవలసిన చెక్ అప్ చేయండి అని అన్నాను.

ఆ తర్వాత డాక్టర్ నాకు పూర్తిగా చెక్ చేసి, డోంట్ వర్రీ తొందరగానే కోలుకుంటావు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అందరూ తిరిగి మళ్ళీ రూమ్ లోకి వచ్చారు.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ఇందాక మనం చెప్పుకొన్న బాస్ కి సంబంధించిన వ్యక్తి ఒకడు నా మీద నిఘా పెట్టి ఉన్నాడు. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ, అన్న వాడు ఇంకా బతికే ఉన్నాడు. ఎలా అయ్యిందో తెలియడం లేదు కానీ ఇందాక చనిపోయాడు అని డాక్టర్ చెప్పడం మాత్రం నిజమే. కానీ వాడు తిరిగి లేచి ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు అని అన్నాడు. ..... అటునుంచి బాస్ మాట్లాడుతూ, నేను ఇంతకు ముందే చెప్పాను కదరా వాడు చావుని కూడా తప్పించుకుని తిరిగి వస్తాడని. సరే ఏం పర్వాలేదులే నువ్వు అక్కడి నుంచి తిరిగి వచ్చెయ్. కొద్ది నెలలు ఆగిన తర్వాత మళ్లీ పక్కాగా ప్లాన్ సిద్ధం చేసుకొని వాడిని అంతం చేద్దాం అని చెప్పి ఫోన్ కట్ అయింది.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

మరోవైపు నేను స్పృహలోకి వచ్చాను అన్న విషయం పిన్నికి కూడా తెలిసింది. కానీ పిన్ని నన్ను చూడటానికి రాలేకపోయింది. కానీ కవిత మేడం ఫోన్ నుంచి పిన్నితో మాట్లాడటం జరిగింది. నేను స్పృహలోకి వచ్చాను అన్న విషయం తెలియగానే ఇన్స్పెక్టర్ రుద్ర నన్ను చూడటానికి వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉన్నావు దీపు? అని అడిగాడు రుద్ర. .... నేను బాగానే ఉన్నాను రుద్ర .... యాక్చువల్లీ దీపు నేను నీ వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంది. .... సరే అడుగు. .... దీపు అసలు ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? నీమీద ఫైరింగ్ చేసింది ఎవరు? .... లేదు ఆ కాల్చిన వాడు ఎవడో నాకు తెలియదు. కానీ వాడు ఒక గూండా అని చెప్పగలను.

సరే ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పు. .... సరే అని చెప్పి ఆ రోజు ఆ సంఘటన ఎలా జరిగిందో మొత్తం వివరంగా రుద్రకి చెప్పాను. పక్కనే ఉన్న కవిత మేడంతో పాటు మిగిలిన వారందరూ కూడా అది విన్నారు. .... సరే అయితే ఇప్పుడు నా ఇన్వెస్టిగేషన్ మళ్లీ కొత్తగా మొదటి నుంచి మొదలు పెడతాను. .... నేను అక్కడ ఉన్న వారిని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, మీరంతా కొంచెం బయటకు వెళ్తారా? నేను రుద్రతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి అని అనడంతో రుద్ర తప్ప మిగిలిన వారంతా బయటకు వెళ్లిపోయారు. చెప్పు ఏం మాట్లాడాలి నాతో? అని అడిగాడు రుద్ర. .... రుద్ర నేను అండర్ కవర్ కాప్ గా పని చేయడానికి సిద్ధమే అని అన్నాను. .... హ్మ్,,, అయితే నిర్ణయం తీసుకున్నావన్న మాట.

మరొక విషయం ఏమిటంటే నువ్వు ఆ గూండా గురించి వివరాలు తెలుసుకో చాలు. అంటే వాడెవడు? వాడు ఏం చేస్తుంటాడు? వాడి వెనుక ఎవరున్నారు? వాడికి ఎవరి అండదండలు ఉన్నాయి? ఇలాంటి మొత్తం విషయాలు సేకరించి పెట్టు. ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. .... సరే అయితే నువ్వు తొందరగా రికవరీ అవ్వు. నీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత నేను నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలిసి ఈ సిటీలోని గుండాలను నామరూపాల్లేకుండా ఏరిపారేద్దాం. .... నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇదిగో నేను కొంచెం కోలుకున్న తర్వాత ట్రైనింగ్ కోసం కావలసిన ఫిట్ నెస్ సంపాదించిన తర్వాత నేను మళ్లీ నిన్ను కలుస్తాను అని చెప్పాను. ఆ తర్వాత రుద్ర అక్కడినుంచి వెళ్ళిపోగా బయట ఉన్న వారంతా తిరిగి లోపలికి వచ్చారు.

ఈసారి అందరితో పాటు వీర్రాజు కూడా లోపలికి వచ్చాడు. కవిత మేడం నా దగ్గరికి వచ్చి నా నుదిటిపై ముద్దు పెట్టుకొని, నా బాబు చాలా ధైర్యవంతుడు అంటూ ముద్దుగా అన్నారు. .... దేవి మాట్లాడుతూ, అవును అత్త నువ్వు చెప్పినట్టు నా తమ్ముడు చాలా ధైర్యవంతుడు అని అంది. .... లేదక్క అన్నయ్య నన్నే ముందు కలిశాడు. అందుకే నా అన్నయ్య మాత్రమే ధైర్యవంతుడు అని అంది ప్రీతి. .... లేదు నా తమ్ముడు అని అంది దేవి. .... లేదు నా అన్నయ్య అని అంది ప్రీతి. .... ఓసి నా రాకాసి అమ్మమ్మ, వీడు మనిద్దరికీ అన్నయ్య తమ్ముడు సరేనా? అని అంది దేవి. .... ఆ అర్థమైందిలేవే పిశాచి నాన్నమ్మ అని అంది ప్రీతి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి దగ్గరకు చేరి కౌగిలించుకున్నారు. వాళ్ళిద్దరూ సరదాగా ఆట పట్టించుకుంటూ మాట్లాడుకుంటున్న తీరు చూసి అందరూ సరదాగా నవ్వారు.

ఆ తర్వాత వీర్రాజు మాట్లాడుతూ, దీపు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అని అడిగాడు. .... ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అన్న. సరైన సమయానికి వచ్చి నన్ను ప్రాణాలతో కాపాడినందుకు నీకు చాలా థాంక్స్ అన్న. నన్ను కాపాడింది మీరే అని ప్రీతి నాకు చెప్పింది. ఒక వేళ ఆ రోజు గనక మీరు ధైర్యం చేసి ఉండకపోతే,,,,,, అంటూ నేను ఏదో మాట్లాడబోతుంటే అను ముందుకు వచ్చి తన చేత్తో నా నొరు మూసేసి నా నోటి నుంచి ఆ మాట రాకుండా ఆపేసి, చుప్,,,, ఇక ఆపు అని అంది. .... దీపు ఇదంతా నేను నీ దగ్గర నుంచి నేర్చుకున్నదే. ఆ రోజు నువ్వే కనుక ధైర్యం చేసి ఉండకపోతే ఈ రోజున నా మొత్తం ఫ్యామిలీయే ఈ భూమ్మీద ఉండేది కాదు అని అన్నాడు వీర్రాజు. ఆ తర్వాత మరి కొంత సేపు మాట్లాడిన తర్వాత వీర్రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

వీర్రాజు వెళ్లిపోయిన తర్వాత కవిత మేడం దేవితో మాట్లాడుతూ, అవున్రా దేవి నీకు దీపు ఎలా తెలుసు? అని అడిగారు. .... అత్త నీకు ఆ రోజు చెప్పాను కదా అభి మీద ఎవరో అటాక్ చేశారని అప్పుడు అభిని ప్రాణాలతో రక్షించింది దీపునే. అది సరేగాని ఇప్పుడు నువ్వు చెప్పు దీపు నీకు ఎలా తెలుసు? .... ప్రీతి మధ్యలో మాట్లాడుతూ, నేను చెప్పనా? అని అడిగింది. .... హ నువ్వు చెప్పవే రాక్షసి అని అంది దేవి. .... అదేంటంటే అమ్మకి అన్నయ్య స్టూడెంట్. అది కూడా అలాంటి ఇలాంటి మామూలు స్టూడెంట్ కాదు. అందరి స్టూడెంట్స్ లోనూ అమ్మ ఫేవరెట్ స్టూడెంట్ అన్నయ్యే. పైగా అమ్మ అన్నయ్యని తన కొడుకు లాగా చూసుకుంటుంది. ఇంకేమైనా అడగాలా? అని అంది ప్రీతి. .... హ్మ్,,, ఓకే చెప్పినంత వరకు చాల్లేవే రాకాసి అమ్మమ్మ అని అంది దేవి.

అప్పుడు నేను మాట్లాడుతూ, ఇప్పుడు మీరంతా కలిసి నాతో చెప్పండి. ఇంతకీ మీరంతా ఒకరికొకరు ఎలా తెలుసు? అని అడిగాను. .... అప్పుడు దేవి కవిత మేడంని చూపిస్తూ, ఇదిగో ఇది నా అత్త. అంటే మా నాన్నకి చెల్లెలు అని అంది. .... అప్పుడు కవిత మేడం దేవి దగ్గరికి వెళ్లి వెనుక నుంచి దేవిని కౌగిలించుకు పట్టుకొని, ఇదేమో నా ప్రియమైన మేనకోడలు. అంటే ప్రీతికి మేనమామ కూతురు. అంటే నా అన్నయ్యకి కూతురు అని అన్నారు. .... అప్పుడు ప్రీతి మాట్లాడుతూ, అంటే నేను నీకు ప్రియమైన దాన్ని కానా? అని అడిగింది. .... కాదు నువ్వు రాక్షసివి అని చెప్పి దేవి పెదవి విరుస్తూ ప్రీతిని వెక్కిరించింది. దాంతో ప్రీతి నొచ్చుకుని మూతి ముడుచుకుంది. వాళ్ళిద్దరి చిలిపి చేష్టలు చూసి మిగిలిన మేమంతా నవ్వుకున్నాము.

Next page: Episode 016.2
Previous page: Episode 015