Episode 079.3


ఈ రోజు శనివారం కావడంతో రాత్రికి ఎలాగూ అమ్మ దగ్గరికి వెళ్తాను కాబట్టి ఈ పూటకి భోజనం వండుకొని తినేసి అన్ని క్లీన్ చేసుకుని హ్యాపీగా ఒక మంచి నిద్ర పూర్తి చేసి సాయంత్రం లేచి తయారయ్యి బైక్ మీద అను ఇంటికి బయలుదేరాను. దార్లో వెళ్తూ అనుకి కాల్ చేయడంతో నేను ఇంటికి చేరుకునే సరికి అను బయటకు వచ్చి నిలబడింది. నలుపు రంగు కుర్తీ సూట్, అదే కలర్ హై హీల్స్ శాండిల్స్, సింపుల్ గా వాలుజడ హెయిర్ స్టైల్ లో భలే అందం గా కనబడింది అను. బైక్ మీద వచ్చిన నన్ను చూసి తన మొహం వెలిగిపోయింది. సరిగ్గా బైక్ తనముందు ఆపగా హాయ్ అని పలకరించి అటూ ఇటూ కాళ్ళు వేసి బైక్ ఎక్కి కూర్చుంది. కొత్త బైక్ వెనుక అందమైన అమ్మాయి నా వరకు ఇది ఒక సరికొత్త అనుభవం. నా వయసులో ఉండే ప్రతి కాలేజీ కుర్రాడికి ఇలా అమ్మాయిని బైక్ లో వేసుకుని తిరగడం అనే ఒక చిన్న కోరిక తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ స్థితిని ఎంజాయ్ చేస్తూ అను సూచనమేరకు ఒక గార్డెన్ రెస్టారెంట్ కి వెళ్ళాము.

బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్లి ఒక టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చోబోతుండగా హాయ్ అను అన్న పిలుపు వినబడడంతో అను అటువైపు చూసింది. అట్నుంచి ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి అను ని హగ్ చేసుకుని, ఏంటే ఎలా ఉన్నావు? అని పలకరించింది. .... అను కూడా ఆ అమ్మాయిని పలకరించి, నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు? అని అడిగింది. .... నేను బాగున్నాను, మనం కలిసి చాలా రోజులైంది, ఇంతకీ అతనెవరు అన్నట్టు నా వైపు కళ్ళతోనే చూపించి సైగ చేసింది ఆ అమ్మాయి. నేను వాళ్ళని పట్టించుకోలేనట్టు మరో వైపు చూస్తున్నాను కానీ వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. .... అను నెమ్మదిగా మాట్లాడుతూ, నీకు చెప్పాను కదా తనే అని అంది. .... ఓహ్,,, ఆ హీరో వీడేనా? జేమ్స్బాండ్ హీరో లాగా భలే ఉన్నాడే చూస్తుంటే నాకే కొరుక్కు తినేయాలనిపిస్తుంది అని గుసగుసలాడింది. .... ఛుప్,,, నోర్ముయ్యవే, నా బాయ్ఫ్రెండ్ మీద పడిందా నీ కన్ను? పిచ్చి వేషాలు వేస్తే కళ్ళు పీకేస్తాను అని అను అనడంతో ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు.

ఇంతలో అటుగా వెళ్తున్న నలుగురు అబ్బాయిలు మా దగ్గరికి వచ్చారు. అందులో ఒకడు నన్ను చూసి, అరే,, మన టాపర్ భలే తయారయ్యాడే!! చాలా రోజుల తర్వాత కనబడ్డావురా. ఏరా టాపరు ఏంటి అమ్మాయినేసుకుని తిరుగుతున్నావా? అని వేళాకోళంగా అన్నాడు. .... అవును వీళ్ళు మరెవరో కాదు ఆ రోజు కాలేజ్ చివరి రోజున నాతో గొడవపడిన గ్యాంగ్. బాగా బలిసినోడికి చెడబుట్టిన ఒక పనికిమాలిన చెత్త ఎదవ వాడి ముగ్గురు చెంచాలు. నేను వాళ్ళని చూసి, చూడండి బాస్ ఆరోజు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ అనవసరంగా ఎటువంటి సీన్ క్రియేట్ చేయొద్దు అని అన్నాను. .... ఆ గ్యాంగ్ లీడర్ మాట్లాడుతూ, పాపం మన టాపరు భయపడినట్టు ఉన్నాడురా అని నవ్వాడు. .... వాడి మాటకి నాకు చిర్రెత్తుకొచ్చింది కానీ పక్కన అను ఉండడంతో ఇప్పుడు వాళ్ళతో గొడవ పడడం అంత మంచిది కాదు అని కామ్ గా ఉన్నాను.

కానీ అక్కడ జరుగుతున్నదంతా చూసిన అను, ఏయ్ ఎవరు మీరు? ఏంటి న్యూసెన్స్? అని అంటూ నా వైపు చూసి ఎవరు? అన్నట్టు కళ్ళతోనే అడిగింది. .... ఇంతలో మరో చెంచాగాడు మాట్లాడుతూ, అబ్బో పాపకి కోపం వచ్చిందిరా అని ఒక వెకిలి నవ్వు నవ్వాడు. .... మరొక చెంచాగాడు మాట్లాడుతూ, ఏంటి పాపా లవ్వా? ఆడితో ఏం చేస్తావు గాని మాతో రా అసలు మజా ఏంటో తెలుస్తుంది అని వెటకారంగా అన్నాడు. .... ఇంకా ఊరుకోవడం నావల్ల కాలేదు. చూడండి బాస్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఆరోజు కూడా ఇలాగే అనవసరంగా మీరే గొడవ మొదలు పెట్టారు. దానికి ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి అంతే కానీ ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడకండి అని అన్నాను. .... అబ్బో,,, హీరోకి కోపం వచ్చిందిరోయ్. ఏంట్రా బిల్డప్పులు ఇస్తున్నావు ఆ రోజు కాలేజ్ లో ప్రిన్సిపాల్ అడ్డుపడింది కాబట్టి బతికి పోయావు లేదంటే ఈరోజు ఇలా ఉండేవాడివి కాదు అని అన్నాడు లీడర్.

ఇంకా శాంతంగా ఉండడానికి నా ఈగో ఒప్పుకోలేదు. అదే సమయంలో అను మరియు తన ఫ్రెండ్ కూడా కొంచెం భయపడుతున్నట్లు కనబడటంతో నేను ఆ లీడర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇంతకీ మీకు ఏం కావాలి ఫ్రెండ్స్? అనవసరంగా గొడవ పెంచుకోవడం అవసరమా? అని అన్నాను. .... గొడవ పెంచుకోవడం ఏంట్రా? ఆరోజు తప్పించుకున్నావు ఈరోజు వదిలిపెట్టే సమస్యే లేదు అని అన్నారు. .... చూడండి బాస్ అకారణంగా మన మధ్య ఈ గొడవ ఎంతకాలం? సరే మీరు మరీ అంతలా ముచ్చట పడుతున్నారు కాబట్టి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీరు ఓడిపోతే ఈ రెస్టారెంట్ లో అంట్లు కడిగి మళ్లీ ఇంకెప్పుడు నా కంట పడకూడదు. ఒకవేళ నేను ఓడిపోతే మీరు ఏం చెప్పినా చేస్తాను అని అన్నాను. .... వాడికి చిర్రెత్తుకొచ్చి, ఏంట్రా నువ్వు నాకు ఆఫర్ ఇచ్చేది? ఏదో కొద్దిగా బాడీ పెంచగానే పెద్ద హీరోని అనుకుంటున్నావా? నలిపి పారేస్తాను నాకొడకా. పక్కన అమ్మాయి ఉంది కదా అని రెచ్చిపోకు అని అన్నాడు.

నేను చాలా సింపుల్ గా అడిగాను. బహుశా నీ మీద నీకు నమ్మకం లేనట్టుంది అందుకే అలా వాగుతున్నావు అని అన్నాను. .... వాడు కోపంతో ఊగిపోతూ, ఇక్కడ నలుగురం ఉన్నాం ఏంట్రా నీ ధైర్యం? అని అన్నాడు. .... మాటలు ఎందుకు బాస్? నేను చెప్పిందానికి ఒప్పుకొంటే కొట్టేసుకుందాం అని అన్నాను. .... నా మాట విని అను మరియు తన ఫ్రెండ్ నా వైపు గుడ్లప్పగించి చూశారు. .... వాడు మాట్లాడుతూ, సరేరా మేము ఓడిపోతే నువ్వు చెప్పినట్టే చేస్తాము. కానీ నువ్వు ఓడిపోతే ఈ అమ్మాయిని ఇక్కడే ముద్దు పెట్టుకుంటాము అని వెటకారంగా నవ్వాడు. దాంతో వాడితో పాటు వాటి వెనుక ఉన్న చెంచాలు కూడా నవ్వారు. .... నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, గుడ్,, నాకు ఓకే అని చెప్పి విస్మయంగా చూస్తున్న అను వైపు చూశాను. .... ఏంటి దీపు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గుసగుసగా నాతో అంది. .... నేను తనకు దగ్గరగా వెళ్లి, ఎవరు గెలిచినా ముద్దు ఇవ్వడానికి రెడీ అయిపో అని ఆ గ్యాంగ్ వైపు తిరిగాను.

నేను అంత కాన్ఫిడెంట్ గా ఆ మాట అనేసరికి అను మొహంలో చిరునవ్వు మెరిసింది. ఇప్పుడు బద్రి సినిమాలో హీరోయిన్ లాగా పోజు కొడుతూ కొంచెం పొగరుగా వాళ్ళ వైపు చూసింది. అంతే సడన్ గా లీడర్ నామీద ఎటాక్ చేయడంతో నేను వాడి చెయ్యి పట్టుకుని మెలి తిప్పుతూ మొహం మీద ఒక పంచ్ ఇచ్చేసరికి దూరంగా వెళ్ళి పడ్డాడు. అను వైపు చూసి కొంచెం దూరంగా ఉండండి అని సిగ్నల్ ఇచ్చి తిరిగేలోపు ఇద్దరు చెంచాలు నా మీదకు ఉరుక్కుంటూ వచ్చారు. వెంటనే నేను అలర్ట్ అయ్యి పిడికిలి బిగించి ఒకడి పొట్టలో గట్టి పంచ్ ఇచ్చి అదే ఊపున మరొకడి గడ్డం కింద మరో పంచ్ ఇవ్వడంతో ఇద్దరూ నేల మీద పడ్డారు. వెంటనే మూడోవాడు నా దగ్గరకు దూసుకుంటూ వస్తుంటే కాలు పైకి లేపి వాడి గుండె మీద ఒక్క కిక్ తన్నేసరికి ఎగిరి పక్కనున్న మరో టేబుల్ మీద పడగా టేబుల్ విరిగి కింద పడి గిలగిలలాడాడు. ఇంతలో కింద నుంచి పైకి లేచిన లీడర్ అరుస్తూ నా మీదకు రాగా వాడి ఫిల్ట్ పట్టుకొని వరుసగా వాడి మొహం మీద నాలుగు పంచులు ఇచ్చేసరికి వాడి ముక్కు మరియు నోట్లో నుంచి రక్తం కారుతూ అక్కడే కుప్పకూలాడు.

ఇక ఆ తర్వాత కిందపడ్డ ఆ నలుగురు పైకి లేవలేదు. ఇంతలో ఇక్కడ జరుగుతున్న గొడవ చూసి ఆ రెస్టారెంట్ మేనేజర్ ఇద్దరు సెక్యూరిటీ బౌన్సర్ లతో కలిసి అక్కడికి చేరుకున్నారు. నేను వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ, సారీ బాస్ కొద్దిగా మీ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యింది ఎంతయిందో చెప్తే ఇచ్చేస్తాను అని అన్నాను. .... అసలు ఏం జరిగింది సార్? అని అడిగాడు మేనేజర్. .... వాళ్లు నా పాత ఫ్రెండ్స్ అలవాటు ప్రకారం దెబ్బలు తిన్నారు. డోంట్ వర్రీ ఇక మీదట ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి కింద పడ్డ ఆ చెత్త ఎదవ జేబులో నుంచి డబ్బులు తీసి మేనేజర్ చేతికిచ్చాను. అతను అక్కడ జరిగిన డ్యామేజ్ కి సరిపడినంత డబ్బులు తీసుకొని మిగిలినవి నా చేతిలో పెట్టాడు. .... నేను ఆ డబ్బు తిరిగి వాడి జేబులో పెట్టి వాడిని పైకి లేపాను. వాడితో పాటు కింద పడ్డ ఆ ముగ్గురు చెంచాలని కూడా బౌన్సర్లు పైకి లేపి నిల్చోనెట్టారు. నలుగురు తలదించుకుని అక్కడినుంచి వెళ్ళిపోతుంటే నేను వాళ్ళను ఆపాను.

సో,,, మళ్లీ మనమధ్య ఎప్పుడూ ఇలా జరగదు అనుకుంటాను. ఆమ్ ఐ రైట్? అని అన్నాను. .... ఆ లీడర్ గాడు తల దించుకొని నువ్వు చెప్పినట్టే ఈ హోటల్ లో ప్లేట్లు కడిగి వెళ్ళిపోతాం అని పశ్చాత్తాపంతో అన్నాడు. .... నేను వాడి కాలర్ సర్దుతూ, ఈ జ్ఞానం ముందే ఉండాలి. మీరేమీ ప్లేట్లు కడగాల్సిన అవసరం లేదు కానీ మీరు ఆ అమ్మాయి పట్ల తప్పుగా వ్యవహరించారు. కాబట్టి అందరూ కలిసి ఆ అమ్మాయికి సారీ చెప్పి బుద్ధిగా ఇక్కడి నుంచి దొబ్బెయండి మళ్లీ నాకు ఎప్పుడు కనబడొద్దు అని అన్నాను. .... నలుగురు అను కి సారీ చెప్పి తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. బౌన్సర్లు కూడా వాళ్ళ వెనకే నడుచుకుంటూ బయటికి వెళ్లారు. మేనేజర్ మాట్లాడుతూ, థాంక్యూ సార్,,, ఇటువంటి వాళ్ళ వలన అనవసరంగా ఇబ్బంది పడ్డారు. అందుకు మా తరఫున సారీ చెప్తున్నాను. మీరు కూర్చోండి వెయిటర్ ని పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.

షర్ట్ నలగకుండా నలుగుర్ని అవలీలగా మట్టి కరిపించడం చూసిన అను మనసు ఉప్పొంగిపోతూ నా మీద ప్రేమను కళ్ళలో నింపుకొని గర్వంగా తన ఫ్రెండ్ వైపు చూసింది. ఆమె గుసగుసగా మాట్లాడుతూ, సరైనోడుని పట్టావే నువ్వు. నిజంగానే నీ బాయ్ ఫ్రెండ్ హీరో. చూస్తుంటే వాడిని ఇప్పుడే లేపుకెళ్లి పోవాలని ఉంది అని నవ్వుతూ అంది. .... అను చిరుకోపం నటిస్తూ, ఛీ పోవే,,, నా బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి ముందు నీ బాయ్ ఫ్రెండ్ సంగతి చూసుకో అని చెప్పింది. .... ఇంతలో నేను వాళ్ళ ఇద్దరి వైపు చూసి నవ్వడంతో అను తన సంతోషాన్ని దాచుకోలేక నా వైపు నవ్వుతూ చూసి భలే ఫైట్ చేసావు అన్నట్టు కళ్లు ఎగరేసి మూతి బిగించి చిన్నగా తల ఆడించి కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత తన ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ, ఇది నా హాస్టల్ మేట్, రెసిడెన్షియల్ కాలేజ్లో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం అని పరిచయం చేసింది. .... ఇద్దరం హలో హాయ్ అనుకున్న తర్వాత ఆ అమ్మాయి అనుకి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది.

మేమిద్దరం టేబుల్ మీద కూర్చుని వెయిటర్ ని పిలిచి ఆర్డర్ ఇచ్చాము. అను సంతోషానికి అవధుల్లేవు. అలాగే నవ్వు మొహంతో నా వైపే చూస్తూ కూర్చుంది. నేను సరదాగా మాట్లాడుతూ, మరి ముద్దుకి రెడీయేనా? అని అడిగాను. .... ఇంతకుముందు తనమీద అసలు ఇంట్రెస్ట్ చూపని నేను ముద్దు గురించి మాట్లాడేటప్పడికి అను సిగ్గుల మొగ్గ అవుతూ తల దించుకొని తన అంగీకారాన్ని చెప్పకనే చెప్పింది. నేను నవ్వుకొని ముందుకు వంగి తన చేతిని అందుకొని చేతి మీద ముద్దు పెట్టి వదిలి, నువ్వు ఏమనుకున్నావు? అని నవ్వాను. .... నేను చేసిన పనికి ముందు చిరుకోపం నటించి తర్వాత తను కూడా నవ్వేసింది. .... పాపం ఆ నలుగురికి నిన్ను ముద్దు పెట్టుకునే అవకాశం పోయింది అని జోక్ చేశాను. .... అను మూతి బిగించి తనను ఆటపట్టిస్తున్నందుకు నా వైపు గుర్రుగా చూసి నా చేతి మీద కొట్టి, నీకు చాలా సరదాగా ఉంది కదా? నా మీద పందెం కాస్తావా? అని ముసిముసిగా నవ్వుతూ అంది.

సారీ సారీ,,, అనుకోకుండా ఎదురైన పరిస్థితి ఆ టైంలో అలా చేయాల్సి వచ్చింది అని సర్ది చెప్పాను. ఆ తర్వాత ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ అనుకి ఇష్టం అయిన ఫుడ్ ఐటంస్, ఐస్ క్రీం తెప్పించుకుని తిని ఆ సాయంత్రాన్ని ఎంజాయ్ చేసాము. ఈరోజు జరిగిన సంఘటన, నేను అనుతో అంత చనువుగా ఉండడంతో అను ఫుల్ ఖుష్ అయిపోయింది. మరోపక్క నాకైతే అను చాలా ముద్దొచ్చేస్తోంది. ఇంతకు ముందంతా తనకు దూరంగా ఉండటానికి ప్రయత్నించిన నేను ఇప్పుడు నేనే తొందరపడి నా ప్రేమను ఆమెతో చెప్పేస్తానేమో అని నామీద నాకే సందేహం కలుగుతోంది. నేనంటే ఎంత ఇష్టమో ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనబడుతోంది. ఆమె నవ్వుతూ మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఎలాగోలా నన్ను నేను సంభాళించుకుని, ఒరే దీపు ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరమారా? నువ్వు చేయాల్సిన పనులు, నువ్వు ఎదుర్కోబోయే పరిస్థితుల మధ్య ఈ అమ్మాయిని ఇరికించడం అవసరమా? అని నా మనసు నన్ను హెచ్చరించడంతో వెంటనే అను గురించిన ఆలోచనలు పక్కనపెట్టి పార్టీ పూర్తి చేసుకుని ఇద్దరం అక్కడి నుంచి బయలుదేరి అనుని తన ఇంటి దగ్గర దింపి గుడ్ నైట్ చెప్పి నేను ఇంటికి బయలుదేరాను.

Next page: Episode 080.1
Previous page: Episode 079.2