Episode 097.2


సరే సార్,,, అని చెప్పి నేను పొజిషన్ లోకి వచ్చి పుష్అప్స్ తీయడం మొదలు పెట్టాను. కానీ ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది. నిన్న రాత్రి నాకు చేతికి అయిన గాయం నొప్పి పుట్టడం మొదలైంది. దానికి తోడు నా చేతికి ఉన్న కట్టు కవర్ చేయడం కోసం ఈరోజు నేను ఒక ఫుల్ హ్యాండ్స్ వైట్ షర్ట్ వేసుకొని వచ్చాను. సరేలే అని ఆ విషయాన్ని లెక్కచేయకుండా పుష్అప్స్ కంటిన్యూ చేశాను. తొందర తొందరగా 55 పుష్అప్స్ వరకు కానిచ్చేసరికి ఆ గాయం నుంచి రక్తం కారడం మొదలైంది. అంతేకాకుండా ఆ రక్తం వైట్ షర్టు వేసుకోవడం మూలాన తొందరగా స్ప్రెడ్ అయ్యి బయటకు కనబడటం మొదలైంది. అది చూసి అక్కడున్న మూడవ స్టూడెంట్, మామ అటు చూడండి వాడి చేతి దగ్గర ఏదో అయినట్టుంది అనగానే అందరూ నా వైపు చూశారు. అను కూడా అది చూసి, దీపు ఏంటిది? అంటూ ఆ చోట తడిమి, అయ్యో రక్తం,,, అని కంగారు పడుతూ, ఆగు దీపు,,, ప్లీజ్ ఈ పని చేయడం ఆపు అని అంది.

ఏం పర్వాలేదులే,,, నాకు ఇలాంటివి ఏమీ కొత్త కాదులే,,, అని అన్నాను. .... ఇంతలో మా చుట్టూ మరి కొంతమంది స్టూడెంట్స్ గుమిగూడారు. అందులోనుంచి ఒక అమ్మాయి ముందుకు వచ్చి మమ్మల్ని ర్యాగ్ చేస్తున్న మొదటి స్టూడెంట్ దగ్గరకు వచ్చి హగ్ చేసుకుని, ఏంటన్నయ్య ఇక్కడ ఏం చేస్తున్నావ్? ఏంటిది ఇక్కడ అందరూ ఇలా గుమిగూడారు? అని అడిగింది. .... ఏం లేదురా జ్యోతి హీరో గారి బలపరీక్ష చేస్తున్నాం అని అన్నాడు. అప్పుడు జ్యోతి నావైపు యధాలాపంగా చూసింది. ముందు పెద్దగా పట్టించుకోలేదు కానీ తర్వాత నిశితంగా చూసి ఆశ్చర్యంతో అవాక్కయి పోయింది. .... ఇక్కడ అను మాట్లాడుతూ, ఏంటీ పిచ్చి పని దీపు?? ఆపుతావా లేదా? లేదంటే ఇదిగో ఇప్పుడే వదినకి ఆంటీకి కాల్ చేసి చెప్తా,,, చూడు రక్తం ఎలా కారిపోతుందో?? అని అంటుంది. ఆ మాట విని జ్యోతి కూడా నా దగ్గరికి వచ్చింది.

జ్యోతి మాట్లాడుతూ, అన్నయ్య ఆగు ఏంటీ పని? అయ్యయ్యో,,, ఎంత రక్తం పోతుందో చూడు. అన్నయ్య ప్లీజ్ ఆపు,,, లేదంటే నా మీద ఒట్టే అని గట్టిగా అరిచింది. .... తన మీద ఒట్టు అనడంతో నేను ఆగిపోయాను. అను జ్యోతి ఇద్దరు కలిసి నన్ను లేపి నుంచో పెట్టారు. .... ఏంటి అన్నయ్య ఇది? ఈ పని చేయమని ఎవరు చెప్పారు చూడు ఎంత రక్తం పోతుందో? అసలిదంత ఎవరు చేయమన్నారు? అని అడిగింది. అప్పుడు అను ఆ ముగ్గురు సీనియర్ స్టూడెంట్స్ వైపు కళ్ళతోనే చూపించి సిగ్నల్ ఇస్తూ, వీళ్ళు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు అని జ్యోతితో చెప్పింది. .... అప్పుడు జ్యోతి ఆ మొదటి స్టూడెంట్ దగ్గరికి వెళ్లి కోపంగా మాట్లాడుతూ, అయితే నువ్వు కాలేజీకి వచ్చి వెలగబెట్టే పనులు ఇవన్నమాట? శభాష్,,,, అని అంది. .... అది కాదురా జ్యోతి,,,, అంటూ ఆ స్టూడెంట్ జ్యోతిని సముదాయించబోయాడు.

ఛీ పో,, నా దగ్గరకు రావద్దు. అసలు అతను ఎవరో నీకు తెలుసా? నువ్వు ఇలాంటి చెత్త పనులు ఎవరితో చేస్తున్నావో తెలుసా? అని గట్టిగా గద్దించి అడిగింది. .... ఎవడాడు? ఎవడో దారినపోయే దానయ్య కోసం నువ్వు ఎందుకు అంతలా ఆవేశపడి పోతున్నావు? అని అన్నాడు. .... ఆ మాట వింటూనే జ్యోతి తన అన్నయ్యని లాగిపెట్టి ఒకటి పీకింది. ఛీ,,, నువ్వు నా అన్నయ్యవి అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఏంటన్నావు,, దారినపోయే దానయ్యా?? నువ్వంటున్న ఆ దారినపోయే దానయ్యే నీ చెల్లెలి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు అది కూడా ఒక సారి కాదు రెండు సార్లు. అందులో ఒకసారి చావుదాక వెళ్లి వచ్చాడు. ఇక్కడ నా తోడబుట్టిన నువ్వేమో ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తున్నావు. నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అంటూ జ్యోతి నా దగ్గరికి వచ్చింది.

పదన్నయ్య,,, అంటూ జ్యోతి, అను నన్ను తీసుకొని వెళ్లి కార్లో కూర్చోబెట్టి కారుని హాస్పిటల్ వైపు పోనిచ్చారు. నేను రాత్రి వెళ్లిన హాస్పిటల్ కి అదే నేను రెగ్యులర్ గా వెళ్లే అదే హాస్పిటల్ కి కారు పోనివ్వమని అనుతో చెప్పాను. మేము ముగ్గురం కలిసి తొందరగానే హాస్పిటల్ కి చేరుకున్నాము. వాళ్ళిద్దర్నీ విజిటింగ్ ఏరియాలో కూర్చోమని చెప్పి నేను డైరెక్ట్ గా డాక్టర్ ఛాంబర్ కి వెళ్లాను. ఎందుకంటే మనకి డాక్టర్ తో ఇంతకుముందే సెట్టింగ్ ఉండడంతో స్టాఫ్ ఎవరు కూడా నన్ను ఆపలేదు. డాక్టర్ గారు కూడా వెంటనే నా చేతికి ఉన్న కట్టు మార్చి కొత్తది వేశారు. నీకు రెస్ట్ కావాలి ఎలాంటి అడ్వెంచర్స్ చెయ్యొద్దని ముందే చెప్పాను కదా? నువ్వు వచ్చేసరికి ఖాళీగా ఉన్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత రక్తం పోయేది? అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు డాక్టర్. .... నేను నవ్వుతూ డాక్టర్ గారికి థాంక్స్ చెప్పి బయటికి వచ్చాను. మేము ముగ్గురం హాస్పిటల్ బయటికొచ్చి కారులో కూర్చుని నా రూమ్ కి పోనివ్వమని అనుతో చెప్పాను.

కార్ నా రూమ్ వైపు వెళ్తుండగా, ఇదిగో మీ ఇద్దరికీ చెబుతున్నాను ఇప్పుడు జరిగిన విషయం గురించి ఎవరికీ చెప్పొద్దు అని అన్నాను. .... ఏం ఎందుకు చెప్పొద్దు,,, నేను వదినకి ఫోన్ చేసి చెబుదామనుకుంటున్నాను అని అంది అను. .... నేను కూడా ఈ విషయాన్ని ఇంట్లో చెబుదామని అనుకుంటున్నాను అని అంది జ్యోతి. .... అను పిచ్చిదానిలా మాట్లాడకు, ఈ విషయం అందరికీ తెలిస్తే ఎంత టెన్షన్ పడతారో నీకు తెలుసు కదా? జ్యోతి నువ్వు కూడా ఎవరికీ చెప్పొద్దు కాలేజీల్లో ఇలాంటి విషయాలు జరగడం సహజమే కదా? అని అన్నాను. .... అను నన్ను ఆటపట్టించడం కోసం కొంచెం కొంటెగా మాట్లాడుతూ, కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వదినతో చెప్పకుండా ఎలా? అని అంది. .... ఓయ్,,, నువ్వు గాని చెప్పావనుకో దేవి అక్క మీద ఒట్టే అని అను నోటికి తాళం వేశాను.

ఆ తర్వాత మేము నా రూమ్ కి చేరుకొని వాళ్ళిద్దర్నీ కార్లోనే ఉండమని చెప్పి నేను రూమ్ లోకి వెళ్లి షర్ట్ ప్యాంట్ మార్చుకుని వచ్చి కార్లో కూర్చొని తిరిగి కాలేజీకి బయల్దేరాం. కాలేజీకి చేరుకొని కార్ నుంచి కిందికి అడుగు పెట్టేసరికి జ్యోతి అన్నయ్య వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. సారీ బ్రో,,, మేము నీతో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు. నీ ప్రాణాలు పణంగా పెట్టి నా చెల్లెలిని కాపాడిన నీతో ఇలా వ్యవహరించినందుకు నేను సిగ్గు పడుతున్నాను. ప్లీజ్,,, బ్రో మమ్మల్ని క్షమించు అని అన్నాడు. .... వెంటనే నేను అతని భుజాలు పట్టుకుని పైకి లేపి, ఏం చేస్తున్నావు బ్రో?? అరే ఈ మాత్రం దానికి క్షమాపణలు అంటూ మరీ అంత పెద్ద మాటలు ఎందుకు? ఇది కాలేజ్ ఇక్కడ ఇటువంటి సరదాలు జరగడం మామూలు విషయమే కదా? డోంట్ వర్రీ,, బీ హ్యాపీ,,, అని అన్నాను. .... ఆ తర్వాత అతను మాట్లాడుతూ, సారీ రా జ్యోతి,, అలాగే మిస్?? మీకు కూడా సారీ,,, అని అనుతో అన్నాడు.

అతని సారీ స్వీకరించి అను చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది. జ్యోతి వెళ్లి తన అన్నయ్యను కౌగిలించుకుంది. ఆ తర్వాత జ్యోతి తన అన్నయ్యను పరిచయం చేస్తూ, వీడు నా అన్నయ్య మోహిత్, అన్నయ్య ఈమె అను. ఇకపోతే నీ చెల్లెలు ఈరోజు ఇలా బతికి ఉండడానికి కారణం ఇదిగో ఈ దీపు అన్నయ్య అని చెప్పింది. .... నేను మోహిత్ ని హగ్ చేసుకుని ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పలకరించుకున్నాము. అను కూడా మోహిత్ కి షేక్ హ్యాండ్ ఇచ్చింది. .... అవును జ్యోతి నువ్వేంటి ఇక్కడ,,, నువ్వు కూడా ఇదే కాలేజీలో చదువుతున్నావా? అని అడిగాను. .... నేను కూడా మీలాగే న్యూ జాయినింగ్ ఫస్ట్ ఇయర్ కామర్స్ అని అంది. .... అయితే మన ముగ్గురిది ఒకే క్లాస్ అన్నమాట అని అంది అను. .... మీది కూడా కామర్సా? అంటూ ఆశ్చర్యపోతూ జ్యోతి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆ తర్వాత మేము అంతా కలిసి అక్కడి నుంచి ఎవరి క్లాసురూముల వైపు వారు వెళ్ళాము. నేను అను జ్యోతి మా క్లాసులకు వెళ్లి మొదటిరోజు పరిచయ కార్యక్రమాలు ముగిసిన తర్వాత జరిగిన నాలుగు క్లాసులు అటెండ్ అయ్యి మొదటి రోజు కాలేజీ వాతావరణాన్ని ఎంజాయ్ చేశాము.

రెండవ రోజు కాలేజ్ కూడా ఇంచుమించుగా అలాగే గడిచింది కాకపోతే నిన్న జరిగిన సంఘటనతో సీనియర్లు ఎవరూ మమ్మల్ని ర్యాగ్ చేయలేదు. నిజం చెప్పాలంటే కాలేజీ ఇప్పుడే మొదలయ్యింది కాబట్టి సీనియర్లు ఎవరు పెద్దగా రాలేదు అని చెప్పాలి. కొత్తగా కాలేజ్ జాయిన్ అయిన ఆనందంలో ఉండగా మూడవరోజు నేను ఊహించని సంఘటన ఎదురయ్యింది. మూడవ రోజు క్లాసులలు అటెండ్ అయి లీజర్ టైంలో కూల్ డ్రింక్స్ తాగుదామని నేను అను జ్యోతి ముగ్గురం కలిసి క్యాంటీన్ కి వెళ్ళాము. ముగ్గురం కూర్చుని మాట్లాడుకుంటూ కూల్ డ్రింక్స్ తాగుతుండగా అనుకోకుండా నా దృష్టి బయట నడిచి వస్తున్న వ్యక్తి మీద పడింది. కొంచెం దూరంలో ఉన్న పార్కింగ్ దగ్గర తన కారు దిగి కార్తీక అక్క నడుచుకుంటూ కాలేజీ బిల్డింగ్ వైపు వస్తుంది. కానీ నా చూపు అక్క మీద కంటే ఆమె వెనుక కొంచెం దూరంలో స్పీడ్ గా వస్తున్న ఒక కారు మీద ఉంది.

ఎందుకో నా మనసు కీడు శంకించింది అక్క వెనుక వస్తున్న కారు తనను గుద్దడానికే వస్తున్నట్టు నా సిక్స్త్ సెన్స్ నన్ను అలర్ట్ చేసింది. వెంటనే నేను ఉన్నపళంగా అక్కడి నుంచి లేచి క్యాంటీన్ బయటకి పరిగెత్తాను. చెప్ప చేయకుండా లేచి పరిగెడుతున్న నన్ను చూసి అను జ్యోతి క్వశ్చన్ మార్క్ మొహాలు పెట్టి ఒకరినొకరు చూసుకున్నారు. నేను అక్క వస్తున్న వైపు ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళుతూ, అక్కా,,, పక్కకు తప్పుకో,,,, అని అరిచాను. కానీ అక్కకి అది వినపడలేదు. అక్కా,, పక్కకు తప్పుకో అక్క,,,,, అంటూ మరోసారి అరిచాను. కానీ అక్క అది కూడా వినిపించుకోలేదు. వెనుక కారు దూసుకొస్తోంది నేను కూడా చాలా వేగంగా పరిగెత్తుతూ దాదాపు అక్క దగ్గరకు చేరుకున్నాను. మరో నాలుగైదు సెకండ్లలో కారు అక్కను ఢీకొట్టబోతుంది అనగా అక్కా,,,,, అని అరుస్తూ తనని పక్కకి తోసేసి ఆ వెనుకే వచ్చిన కారు బానెట్ పైకి ఎగిరి కారు టాప్ మీద దొర్లుతూ వెనుక వైపు దూకాను.

నేను డీకొన్న వేగానికి కారు ఫ్రంట్ గ్లాస్ పగలడంతో కొంచెం ముందుకు వెళ్లి కార్ ఆగి అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు బయటికి దిగారు. నేను వెనుక నిలదొక్కుకుని తిరిగి చూడగా ఆ ఇద్దరు వ్యక్తులు కాలేజీ స్టూడెంట్స్ లాగా కనపడలేదు. వీళ్ళెవరో నిజంగానే అక్కను ఎటాక్ చేయడానికి వచ్చారు అనిపించి వెంటనే వాళ్ళిద్దరి మీదకి ఉరికి దొరికినోడిని దొరికినట్టు చితక్కొట్టడం మొదలు పెట్టాను. అక్క కారుకు మరోవైపు కొంచెం దూరంగా పడి ఉండగా నేను కారు ఇవతల వైపు వాళ్లను కొడుతూ దూరంగా వచ్చి, నాకొడకల్లారా ఎవర్రా మీరు,,, కారుతో మా అక్క మీదకి ఎందుకు దూసుకొస్తున్నారు? అని వాళ్ళ ఇద్దరికీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వీరకుమ్ముడు కుమ్ముతూ అడిగాను. .... నేను కొడుతున్న దెబ్బలకు తాళలేక అందులో ఒకడు మాట్లాడుతూ, అన్నా ప్లీజ్ అన్నా ఆపు,,, మమ్మల్ని క్షమించు,,,, ఈ పని చేయమని మాకు డబ్బులు ఇచ్చి పంపారు అని అన్నాడు.

ఆ మాట వినగానే నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది వెంటనే తేరుకుని, ఎవడు?? మీకు డబ్బులు ఇచ్చి పంపించింది ఎవడు? అని అడిగాను. .... ఏమో మాకు తెలీదన్న,,, ఎవడో బంగారు వ్యాపారి కిషోరీ లాల్ మనిషంట మాకు డబ్బులు పంపించి ఈ పని చేయమని చెప్పాడు అని అన్నాడు. ఆ మాట నాకు నిజంగానే షాకింగ్ గా అనిపించి అలాగే ఆగిపోయాను. ఇంతలో కాలేజి సెక్యూరిటీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో ఎవరో ఫోన్ చేయడంతో అక్కడి లోకల్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ నుంచి కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి వాళ్ళిద్దర్నీ పట్టుకొని కార్ కూడా అక్కడినుంచి తీసుకుని వెళ్ళిపోయారు. నేనింకా ఆలోచనల నుంచి పూర్తిగా తేరుకోలేదు. కిషోరీ లాల్ డబ్బులు ఇచ్చి అక్క మీద ఎటాక్ చేయమని చెప్పడం ఏమిటి? ఈ విషయం గురించి రుద్రతో మాట్లాడదామా? అన్న ఆలోచన వచ్చి మళ్లీ ఎందుకో అది సరికాదని అనిపించి ఆ ఆలోచన విరమించుకున్నాను.

ఆ తర్వాత నాకు అక్క గుర్తుకు రావడంతో అటు వైపు చూశాను. కింద పడ్డ అక్క లేచి పక్కనే ఉన్న ఒక బెంచీ మీద కూర్చుంది. వెంటనే నేను అక్క దగ్గరికి వెళ్లి, అక్క,,, నువ్వు బాగానే ఉన్నావు కదా?? నీకేం కాలేదు కదా? అని అడిగాను. .... వెంటనే అక్క నా వైపు కోపంగా చూస్తూ పైకి లేచి నన్ను లాగిపెట్టి ఒక్కటి కొట్టి, నన్ను అక్క అని పిలవడానికి ఎంత ధైర్యంరా నీకు? ఇంకా ఎంతకాలం ఇలా రాక్షసుడిలాగా మా వెంట పడతావు? ఎంతకాలం ఇలా మమ్మల్ని వేపుకుతింటావు? నీ నీడ మా మీద పడకుండా ఎక్కడికన్నా దూరంగా పోయి చావచ్చు కదరా? మా చుట్టూనే తిరుగుతూ మమ్మల్ని చంపి నరకానికి పంపేదాకా నీకు తృప్తిగా ఉండదా? అని తిట్టి పోసింది. అప్పటికే అక్కడికి వచ్చిన అను, జ్యోతి అక్క అన్న మాటలు విని ఆవేశంతో అక్క వైపు అడుగు వేశారు. వెంటనే నేను వాళ్ళిద్దర్నీ ఆపి అక్కడ నుంచి వెనుతిరిగి నడుచుకుంటూ దూరంగా వచ్చేసాను.

నా కళ్ళల్లో నీళ్లు తిరిగి దుఃఖం పొంగుకొచ్చింది. నేను అలాగే నడుచుకుంటూ పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చేశాను. నా వెనుకే అను కూడా వచ్చింది. నేను నా బైక్ మీద కూర్చోగా అను నా దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు దీపు? అని అడిగింది. .... ఏం లేదు,,,, నేను ఇంటికి వెళ్లిపోతున్నాను అని పూడుకుపోయిన గొంతుతో చెప్పాను. .... మరి మిగతా క్లాసులు? అని అడిగింది అను. .... ఇప్పుడు నాకు క్లాసులు వినాలనే ఇంట్రెస్ట్ లేదు. ఇంతకు ముందు క్లాసులు కూడా పెద్దగా ఏమీ చెప్పలేదు కదా మిగిలినవి కూడా అలాగే ఉంటాయిలే మీరు వెళ్ళండి క్లాసులకి అని అన్నాను. .... సరే అయితే ఒక నిమిషం ఉండు అంటూ అను నాకు దగ్గరగా వచ్చి తన చున్నీ పట్టుకుని నా కళ్ళలో నుంచి కారుతున్న కన్నీరు మరియు చెమట పట్టిన నా మొహాన్ని శుభ్రంగా తుడిచింది. నేను అలా అను మొహం వైపు చూస్తూ ఉండిపోయాను.

ఆ తర్వాత అను చిన్న చిరునవ్వు నవ్వి, మ్,,, ఇప్పుడు బాగున్నావు,,, నువ్వు ఏడిస్తే చూడటానికి అస్సలు బాగోవు అర్థమైందా? అని నన్ను కూల్ చేయడానికి జోక్ చేసి, ఇప్పుడు వెళ్ళు,,, కానీ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది. ఆ సమయంలో అను నా గురించి ఆలోచించిన తీరు నాకు సాంత్వన చేకూర్చడానికే అని అర్థమైంది. వెంటనే నేను అక్కడి నుంచి బయలుదేరి కాలేజ్ నుంచి బయటకు వచ్చేసాను. గేటు దాటిన వెంటనే మళ్లీ నా కళ్ళలోకి నీళ్ళు వచ్చేసాయి. ఈ రోజు మళ్ళీ నాకు ఒక దురదృష్టకరమైన రోజు. నా మనసును బాగా కలచివేసిన రోజు. అక్క మళ్ళీ నన్ను ఇంకోసారి కొట్టినరోజు. నేను ఏం తప్పు చేశానో కూడా అర్థం కాని రోజు. అలాగే కన్నీళ్లతో మెదడు మొద్దుబారిపోయి ఏం ఆలోచించాలో కూడా తెలియక అన్యమనస్కంగా బైక్ నడుపుతూ నా రూమ్ వైపు బయల్దేరాను.

Next page: Episode 098.1
Previous page: Episode 097.1