Episode 098.1
కాలేజీలో జరిగిన సంఘటనతో హృదయం కలతచెంది దుఃఖాన్ని దిగమింగుకొని నా రూంకి చేరుకున్నాను. రూంలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకుని అమ్మ ఫోటో తీసుకుని మంచం మీద కూర్చున్నాను. ఆ ఫొటో చూసి, ఎందుకమ్మా అక్క నాతో ఇలా ప్రవర్తిస్తుంది? అందరూ నీ చావుకి కారణం నేనే అని నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. నీ చావుకి కారణం నేను కాదని ఎలా చెప్పాలమ్మా? పోనీ నువ్వయినా వచ్చి చెప్పు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మధ్య ఒకసారి ఇంటికి వెళితే ఆరోజు కూడా అందరూ నన్ను ఒక రాక్షసుణ్ణి చూసినట్టు చాలా హీనంగా చూశారు. ఆరోజు కూడా అక్క నా మీద చేయి చేసుకుంది మళ్లీ ఈ రోజు కూడా అదే జరిగింది అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాను. చాలా సేపు అలా ఏడ్చుకుంటూ నా జీవితంలో జరిగిన దురదృష్టకర సంఘటనలను గుర్తు చేసుకున్నాను.
ఇక చాలురా దీపు,, ఎంతసేపని అలా ఏడుస్తావు? ఇలా ప్రతి దానికి ఏడ్చుకుంటూ కూర్చోవడం నీ వీక్నెస్ లాగా తయారయింది. నువ్వు ఇంతకుముందు లాంటి దీపువి కాదు, శారీరకంగా మానసికంగా దృఢంగా తయారైన సరికొత్త దీపువి. ఇది జీవితంరా ఎప్పుడు ఏది ఎలా జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. అలా చూస్తూ ఉండు ఏదో ఒక రోజు నీ విలువ తెలుసుకుని ఇప్పుడు నిన్ను అసహ్యించుకుంటున్న వారందరూ తిరిగి నిన్ను అక్కున చేర్చుకునే రోజు వస్తుంది అన్న రవి మాటలు వినబడ్డాయి. .... నేను కొంచెం అసహనంగా, ఇంకెప్పుడు వస్తాయిరా,,, నేను చచ్చిన తర్వాతా? అని అన్నాను. .... వస్తాయిలేరా,,, ఆ రోజులు కూడా తొందర్లోనే వస్తాయి. సరేగాని లే ఎంతసేపు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అలాగే నువ్వు లెక్కలు తేల్చాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్న రవి మాటలతో ఉలిక్కిపడి లేచాను. నా గుండెల మీద ఉన్న అమ్మ ఫోటో పక్కకి జారింది. ఎప్పుడు పడుకున్నానో తెలీదుగానీ ఇంతవరకు నేను రవితో మాట్లాడింది నిద్రలో అని తెలుసుకుని కొంచెం తేలికగా ఊపిరి తీసుకున్నాను.
మంచం మీద నుంచి లేచి బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి మంచినీళ్లు తాగి డోర్ ఓపెన్ చేసుకొని బయట మెట్లపై కూర్చున్నాను. మధ్యాహ్నం ఏమి తినక పోవటంతో ఆకలిగా అనిపించింది. మనసు కూడా బాగుండక పోవడంతో అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. కానీ అమ్మకి ఈ విషయం తెలిస్తే బాధ పడుతుందని అమ్మ దగ్గరికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. కొంతసేపు అక్కడే కూర్చుని తర్వాత లేచి లోపలికి వెళ్ళి తినడానికి వండుకోవడం మొదలుపెట్టాను. అలా వంట చేస్తూ ఆలోచించగా మధ్యాహ్నం జరిగిన సంఘటనలో అక్కని ఎటాక్ చేసిన వాళ్లు కిషోరీ లాల్ పేరు చెప్పడం గుర్తొచ్చి వెంటనే నా మైండ్ అలర్ట్ అయింది. ఈ కిషోరీ లాల్ గాడికి అక్కను ఎటాక్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మొన్న రాత్రి కార్ నన్ను రాసుకుంటూ వెళ్లడానికి ఈ రోజు అక్క మీద జరిగిన ఎటాక్ కి ఏమైనా సంబంధం ఉందా? అన్న డౌట్ వచ్చింది.
ఈ విషయం గురించి రుద్రతో మాట్లాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అన్న ఆలోచనలు చుట్టుముట్టాయి. చాలా సేపు ఆలోచించిన తర్వాత రుద్రతో చెప్పకుండా ఉండడమే మంచిదనిపించింది. ఎందుకంటే రుద్రకి నా బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా తెలీదు. వాడికి నేను ఒక అనామకుడు గానే తెలుసు దాన్ని అలాగే ఉండనిద్దాము. ఈ విషయాల గురించి నేనే స్వయంగా తెలుసుకోవడం మంచిది అని అనుకున్నాను. ఆ తర్వాత వంట పూర్తి చేసుకుని భోజనం చేసి కిషోరీ లాల్ గాడి ఫైల్ ముందర వేసుకుని స్టడీ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మరో నాలుగు రోజులు పగలు కాలేజీకి వెళ్లడం మిగిలిన సమయంలో ఈ కిషోరీ లాల్ గాడి కేసు గురించి వివరాలు సేకరించడం లాంటి విషయాలతో బిజీబిజీగా గడిచిపోయింది. నా చేతికి తగిలిన గాయం కూడా తగ్గిపోవడంతో వీకెండ్లో అమ్మ దగ్గరికి వెళ్లి ప్రీతి మరియు అమ్మతో సరదాగా గడిపి తిరిగి వచ్చేసాను.
ఈ రుద్ర చెప్పిన వాళ్లని చంపుతున్నాను కానీ అదేదో వాడి దగ్గర డబ్బులు తీసుకుని చేసే కాంట్రాక్ట్ కిల్లింగ్ లాగా అనిపిస్తోంది. ఇలా చేసుకుంటూ పోతే నాకు రుద్ర గురించి ఎలా తెలుస్తుంది? ఈ పని నా చేత చేయించడం వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకోవాలి. మళ్లీ నా వేట మొదలుపెట్టాలి అని నిర్ణయించుకుని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. రుద్రకి తెలియకుండా ఈ కిషోరీ లాల్ గాడి సంగతి తేల్చాలి ఈ కేసు పెద్దది కావడంతో నాతో ఒక టీమ్ ఉంటే బెటర్ అనిపించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కిషోరీ లాల్ గాడి దగ్గరకు వెళ్లాలంటే ముందుగా వాడి కుడి భుజం అయిన రాజుని దాటుకుని వెళ్లాలి అని రుద్ర చెప్పిన విషయం గుర్తుంది. నేను చేసిన స్టడీ ప్రకారం కిషోరీ లాల్ గాడు ఎప్పుడూ ఎవరికీ బయట కనబడడు. వాడు ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఉండి అన్ని పనులు ఫోన్ ల మీద మరియు అనుచరులతో జరిపిస్తూ ఉంటాడు.
ఈ రాజు గాడు వాడికి సైన్యాధిపతి కిషోరీ లాల్ గాడి పనులన్నీ చూసుకునేది వీడే. ఈ రాజు గాడు కిషోరీ లాల్ కోసం ఎన్నో హత్యలు, దోపిడీలు, కిడ్నాపులు ఇంకా చాలా పనులు చేశాడు. వీడొక ట్రెయిన్డ్ ఫైటర్. అంతేకాదు వాడు ఉండే ఏరియాలో చట్టవిరుద్ధంగా ఫైట్స్ నిర్వహిస్తూ బెట్టింగ్ మీద బాగా సంపాదిస్తూ ఉంటాడు. వీడు పెద్ద ఫైటర్ కావడంతో చాలా మందిని మట్టికరిపించి చంపేశాడని ఇంతవరకు వాడికి ఓటమి తెలియదని తెలిసింది. కిషోరీ లాల్ అండదండలు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ ఆఫీసర్లు గాని ఇంకే ఇతర శక్తులు గాని వాడి జోలికి రావు. అంతేకాదు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను మొట్టమొదట లేపేసిన రాణా గాడు వీడికి తమ్ముడు. వాడి తమ్ముడిని చంపిన వాడిని వెతికి పట్టుకొని తన చేతులతో చంపాలని వాడు ఎదురు చూస్తున్నాడు అని కూడా తెలుసు. వాడు నన్ను వెతుక్కుని రావడం ఏంటి? నేనే వాడికి ఎదురు వెళ్తాను,, అంటే ఈ DD చేతిలో వాడికి మూడింది అని అనుకోగానే నా మొహంలో ఒక క్రూరమైన నవ్వు మెరిసింది.
************
నగరంలో మరో చోట తన రూమ్ లో ఫైటర్ రాజు సీరియస్ గా ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో వాడి దగ్గరికి ఒక మనిషి రాగా వాడిని చూసి మాట్లాడుతూ, ఆ DD గురించి ఏమైనా తెలిసిందా? అని కొంచెం కోపంగా అడిగాడు. .... లేదు రాజు భాయ్,, ఇంకా ఏం తెలియలేదు అని అన్నాడు ఆ మనిషి. .... ఇంకా ఎంత కాలంరా తొందరగా తెలుసుకోండి, వాడు ఎవడు ఎక్కడ ఉంటాడు? ఇవన్నీ నాకు తెలియాలి లేదంటే వాడి కంటే ముందు మీరు లేచిపోతారు అని వార్నింగ్ ఇచ్చాడు రాజు. .... సరే భాయ్. .... ఇంకా ఎర్రిమొహలు వేసుకుని ఇక్కడ ఏం చూస్తున్నారు తొందరగా వెళ్లి వెతికి చావండి అని రాజు కోపంగా అరవడంతో ఆ మనిషితో పాటు ఉన్న మరో నలుగురు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ రూమ్లో మిగిలింది రాజు ఒక్కడే. రాజు సీరియస్ గా ఆలోచిస్తూ వెళ్లి సోఫాలో కూర్చుని రెండు చేతులు చాచి తల వెనక్కి వాల్చి, అసలు ఎవడ్రా నువ్వు DD? ఎక్కడున్నావురా? నీయబ్బ నువ్వు ఒక్కసారి నా చేతికి దొరకాలి అప్పుడు చెప్తాను నీ పని. నేను నిన్ను చంపిన తీరు చూసి ప్రతి ఒక్కరూ గడగడ వణికి ఉచ్చ కార్చుకునేలా చేస్తాను. నిన్ను చంపి నా తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరేలా చేస్తాను. ఒరేయ్ DD ఎక్కడున్నావురా నువ్వు,,,, అని గట్టిగా అరిచి, ఒరేయ్ తమ్ముడు నిన్ను చంపిన వాడిని ఖచ్చితంగా నీ దగ్గరకు పంపి తీరుతాను ఇది నీ అన్న నీకు ఇస్తున్న మాట అని కోపంతో ఊగిపోయాడు. కానీ తన చావు తనను వెతుక్కుంటూ తొందర్లోనే తన దగ్గరకు వస్తుందని ఈ రాజు గాడికి తెలీదు.
************
ఒకరోజు కాలేజ్ పూర్తిచేసుకుని వచ్చి భోజనం చేసి వర్క్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ చీఫ్ ఇచ్చిన సూట్ కేస్ ఓపెన్ చేసి అందులో ఉన్న ల్యాప్టాప్ మరియు రిస్ట్ వాచ్ బయటకు తీసి రిస్ట్ వాచ్ చేతికి తగిలించుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాను. వాచ్ లో ఉన్న ఒక బటన్ ప్రెస్ చేయగానే లాప్టాప్ లో వీడియో కాలింగ్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యి కొంతసేపటికి చీఫ్ వీడియోలో ప్రత్యక్షమయ్యారు. హలో సార్,,, ఏజెంట్ దీపు రిపోర్టింగ్ సర్ అని అన్నాను. .... హలో మిస్టర్ DD,,, హౌ ఆర్ యు? ఏంటి వీడియో కాల్ చేసావ్ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉందా? అని అడిగారు. .... సర్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అందుకే వీడియో కాల్ చేస్తాను. .... ఓకే,, చెప్పు. .... సార్ రుద్ర చెప్పినట్టే ఇప్పటి వరకు అన్నీ చేస్తూ వస్తున్నాను. కానీ ఇలా అయితే ఎప్పటికీ రుద్ర గురించి తెలుసుకోవడం సాధ్యం కాదేమో అనిపిస్తుంది. అందుకే ఇప్పటిదాకా రుద్ర ఆపి ఉంచిన ఆ కిషోరీ లాల్ కేసుని వాడికి తెలియకుండా చేస్తే అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చని నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ మధ్య నా చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు నా అనుమానాన్ని బలపరుస్తున్నాయి. ఆ కిషోరీ లాల్ గాడి కుడి భుజం అయిన ఫైటర్ రాజు గాడు వాడి తమ్ముడిని చంపిన నన్ను వెతుకుతున్నట్లు నా విచారణలో తెలిసింది. నేను టేకప్ చేసిన మొట్టమొదటి కేసు ఆ అమ్మాయిల కిడ్నాపర్ రాణా ఈ రాజుగాడికి తమ్ముడు. సో,,, ఈ రెండు కేసులకు ఏదో లింక్ అప్ ఉందని నాకు సందేహంగా ఉంది. అందుకే ఈ కేసుని రుద్రకి తెలియకుండా చేస్తే మనకు ఏదైనా క్లూ దొరకవచ్చని నాకు అనిపిస్తుంది. కాకపోతే ఆ కిషోరీ లాల్ గాడు తనదంటూ ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకొని కలుగులో దాక్కొని అన్ని పనులు ఈ రాజు గాడితో చేయిస్తుంటాడు. ఆ కిషోరీ లాల్ ని బయటకు లాగాలంటే మనం ఈ రాజు గాడిని పట్టుకొని విచారించాలి. కానీ వీడి నెట్వర్క్ పెద్దది. వాడి బలగం ఎప్పుడూ వాడి చుట్టూ కంచు కవచంలా ఉంటుంది దానిని ఫేస్ చేయాలంటే నాకు ఒక టీమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
నేను ఒక్కడినే చేస్తే వాడికి తొందరగా సమాచారం చేరిపోయి తప్పించుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఒక టీంతో చేస్తే పని సక్రమంగా పూర్తి చేయొచ్చు అందుకు తగ్గ ఇన్ఫర్మేషన్ సేకరించి పెట్టుకున్నాను. .... మ్,,, నీ ఐడియా బాగుంది DD కానీ వాళ్ల దగ్గర నుంచి మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? .... ఐ డోంట్ నో నర్,,,, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్,,,, రుద్ర ఇది ఒక పెద్ద కేస్ దీని సంగతి తర్వాత చూసుకుందాం అని అన్నాడు అంటే ఏదో అనుమానించ తగ్గ విషయం ఉన్నట్టే కదా? అందులోనూ ఈ కిషోరీ లాల్ హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. వాడు చేయించే అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు ఒకవేళ మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకకపోయినా వీళ్ళిద్దరిని లేపేసి కొంత చెత్తని క్లీన్ చేసి పడేయొచ్చుగా అని అన్నాను. .... అవును ఈ కిషోరీ లాల్ గురించి నా దగ్గరకి కూడా ఇటువంటి ఇన్ఫర్మేషనే వచ్చింది. ఓకే,, వాట్ డు యు వాంట్?
సర్ నాకు ఇద్దరు ముగ్గురు మనుషుల అవసరం ఉంటుంది. .... చీఫ్ కొంచెం ఆలోచించి, ఓకే,,, ఇంకేమైనా కావాలా? మనీ, వెపన్స్,,, అని అడిగారు. .... నో సర్,, ఇంకేమీ అవసరం లేదు. డబ్బు కావాలంటే మన ఫైనాన్షియర్ రుద్ర ఉన్నాడు కదా,,, అని ఒక స్మైల్ ఇచ్చి, మీరు నాకు టీం మెంబర్స్ ని నేను ఉన్న చోటికి పంపిస్తే చాలు అని అన్నాను. .... హ్హహ్హహ్హ,,, వెరీ గుడ్,,, నీ కాన్ఫిడెన్స్ బాగుంది, నాకు కొంచెం టైం ఇవ్వు ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ లో నీ టీమ్ నీ దగ్గర ఉంటుంది. ఆల్ ది బెస్ట్,,, ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే నన్ను కాంటాక్ట్ చెయ్, టేక్ కేర్,, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశారు. ఆ తర్వాత నేను అన్నీ ప్యాక్ చేసి అక్కడే వెయిట్ చేశాను. సాయంత్రం సమయంలో నా వర్క్ స్టేషన్ తలుపు చప్పుడైంది. నేను వెళ్లి డోర్ ఓపెన్ చేయగా బయట ఇద్దరు మగ ఒక ఆడ కలిపి ముగ్గురు మనుషులు కనబడ్డారు. నేను వాళ్లను చూసి చిన్న చిరునవ్వుతో లోపలికి రమ్మని ఆహ్వానించాను.
వాళ్లు లోపలికి వస్తూనే అందులో ఒక కుర్రాడు మాట్లాడుతూ, మనం చేయబోయే ఆపరేషన్ ఏంటి? అని అడిగాడు. .... నేను వాళ్లను సోఫాలో కూర్చో పెట్టి, ముందు ఒకడ్ని లేపుకొచ్చి వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి మరొకడిని పట్టుకురావాలి అని అన్నాను. .... అంతేనా,, అలాగే చేసేద్దాం అని అన్నాడు. .... ఇంతకీ మీ పేర్లు ఏంటో తెలియలేదు అని అన్నాను. .... అప్పుడు మొదటి కుర్రాడు మాట్లాడుతూ, నా పేరు సోమేశ్వరరావు అందరూ నన్ను సోము అని పిలుస్తారు అంటు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు నేను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశాను. .... రెండవ కుర్రాడు మాట్లాడుతూ, నా పేరు జస్వంత్ అందరూ నన్ను జెస్సీ అని పిలుస్తారు అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వగా నేను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశాను. .... చివరగా అమ్మాయి మాట్లాడుతూ, నా పేరు తార అని షేక్ హ్యాండ్ ఇవ్వగా నేను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించాను.
నైస్ టు మీట్ యు,,, నా పేరు దీపక్ వర్మ అందరూ నన్ను దీపు అని పిలుస్తారు. ఈమధ్యే డిపార్ట్మెంట్ లో చేరాను కావాలంటే మీరు నన్ను DD అని కూడా పిలవచ్చు అని అన్నాను. .... వెంటనే తార నా వైపు కొంచెం అనుమానంగా చూసి, కొంపతీసి నువ్వు ఆ మధ్య కొద్దిరోజులు టీవీలో సన్సేషన్ అయిన DD వి కాదు కదా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా నేను అవును అన్నట్లు తల ఆడించాను. ఓ మై గాడ్,,, చీఫ్ మమ్మల్ని నీతో కలిసి పని చేయడానికి పంపించారా? మై గుడ్ నెస్,,,, అంటే మాకు సూపర్ మజా అన్నమాట అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే అది చూస్తూ మేము ముగ్గురం నవ్వుకున్నాము. నేను సోఫాలోంచి లేచి, గయ్స్,,, ఇదే మన వర్క్ స్టేషన్. మీరు ఉండేది కూడా ఇక్కడే. కింద ఒక రూమ్ పైన మరో నాలుగు రూములు అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికీ ఏ రూమ్ నచ్చితే ఆ రూమ్ లో సెటిల్ అయిపోండి. మీకు ఏదైనా అవసరం ఉంటే నేను ఇక్కడే దగ్గర్లో నా రూమ్ లో ఉంటాను బయటకు వచ్చి పిలిస్తే సరిపోతుంది లేదంటే నా నెంబర్ ఇస్తాను రాసుకొని నాకు కాల్ చేస్తే సరిపోతుంది అని అన్నాను.
వాట్,, నువ్వు ఇక్కడ మాతోపాటు ఉండవా? అని అడిగాడు జెస్సీ. .... లేదు,,,, నేను నా రూమ్ లో ఉంటాను అంటూ వాళ్ళను బయటకు తీసుకువచ్చి అక్కడి నుంచి నా రూమ్ చూపించాను. .... ఇక్కడ కాకుండా అక్కడ చిన్న రూమ్ లో ఉండడం ఏంటి? అని అడిగింది తార. .... నాకున్న కారణాలు ఏవో నాకు ఉన్నాయిలే అని నవ్వేసి, సరే మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి వాళ్లను లోపలికి పంపించి ఇంటి వెనుక ఉన్న అవుట్ హౌస్ వైపు నడిచాను. అక్కడికి వెళ్లి డోర్ కొట్టగా ముత్యాలమ్మ మామ్మ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న నన్ను చూసి, అరే,, దీపు బాబు నువ్వా,,, ఏంటి బాబు ఇలా వచ్చావు? అని నవ్వుతూ పలకరించి నన్ను దగ్గరికి తీసుకుంది. .... ఏం లేదు మామ్మ,,, నా ముగ్గురు స్నేహితులు మన బంగ్లాలో ఉంటారు వాళ్ల కోసం భోజనం ఏర్పాట్లు లాంటివి చేయగలవా? అని అడిగాను.