Episode 100.1


మేమంతా సరదాగా నవ్వుకుంటూ బయటికి వచ్చి నేను గేట్ తీసుకుని బయటకు వచ్చేసరికి నా రూమ్ ముందర కారు ఆగడం గమనించాను. వెంటనే నా మొహంలో చిరునవ్వు మెరిసి కారు దగ్గరికి నడుచుకుని వస్తుండగా పవిత్ర కార్లో నుంచి దిగి నా వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. చక్కగా పట్టులంగా ఓణి కట్టుకొని కుందనపు బొమ్మలా ఉంది. నా దగ్గరికి వస్తూనే నన్ను కౌగిలించుకుంది. నేను నవ్వుతూ, ఏంటే బుజ్జమ్మ గంగిరెద్దులా తయారయ్యావు అని అన్నాను. వెంటనే పవిత్ర తన పెదాలు బిగించి నా వైపు గుర్రుగా చూసింది. హ్హహ్హహ్హ,,, హ్యాపీ బర్త్డేరా బుజ్జమ్మ,,, అని నుదుటి మీద ముద్దు పెట్టాను. .... థాంక్యూరా అన్నయ్య,,,, నా పుట్టినరోజు నీకు గుర్తుందన్నమాట ఇంకా మర్చిపోయావేమో అనుకున్నాను అంటూ మూతి ముద్దు ఇచ్చింది.

ఓయ్,,, తింగరి బుజ్జమ్మ,,, మనం రోడ్డు మీద ఉన్నాం అని అన్నాను. .... ఆఆఆ తొక్కలే,,, నిన్ను ముద్దు పెట్టుకోవడానికి నాకు ఎవడి పర్మిషన్ అవసరం లేదు నా అన్నయ్య నా ఇష్టం అని మళ్ళీ ఒకసారి మూతి ముద్దు ఇచ్చింది. .... మొండిదానివే,,, నువ్వేం మారలేదు అని సరదాగా వీపు మీద కొట్టి నా నుంచి దూరం జరిపాను. .... ఇంతలో నా వెనుక నుంచి సోము, జెస్సీ, తార మా దగ్గరికి వచ్చారు. పవిత్ర వాళ్లని చూస్తూనే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి నా వైపు చూసింది. ఇంతలో తార వచ్చేటప్పుడు గార్డెన్ లో ఉన్న గులాబీ పువ్వుని కోసుకొచ్చినట్టుంది దానిని పవిత్ర చేతికి ఇస్తూ, హ్యాపీ బర్త్డే,,, అని విష్ చేసింది. తారతో పాటే సోము, జెస్సీ కూడా పవిత్రను విష్ చేశారు. పవిత్ర కొంచెం అయోమయంగానే వాళ్ల ముగ్గురికీ థాంక్స్ చెప్పి ఎవరు?? అన్నట్టు నా వైపు చూసి కళ్ళెగరేసింది.

నేను నవ్వుతూ గయ్స్,,, ఇది నా చెల్లెలు పవిత్ర, బుజ్జమ్మ వీళ్ళు నా ఫ్రెండ్స్ సోము, జెస్సీ, తార అని పరిచయం చేశాను. .... పవిత్ర చిన్న చిరునవ్వు నవ్వుతూ హాయ్,, అంటూ వాళ్ళ ముగ్గురికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. .... ముగ్గురు సరదాగా మాకు బర్త్ డే పార్టీ లేదా? అని అడిగారు. .... పవిత్రకి ఏం చెప్పాలో తెలీక నా వైపు చూసి, మా అన్నయ్య ఇస్తాడులే అని అనడంతో అందరం నవ్వుకున్నాము. .... ఇంతలో నాకు కార్లో నుంచి దిగి అక్కడే నిల్చున్న పిన్ని కనపడగానే, గయ్స్,,, మేము వెళ్ళాలి అక్కడ పిన్ని వెయిట్ చేస్తుంది మీరు మీ పని చూసుకోండి మనం సాయంత్రం కలుసుకుందాం అని చెప్పగా ముగ్గురు తిరిగి వర్క్ స్టేషన్ లోకి వెళ్ళిపోయారు. నేను పవిత్ర భుజం మీద చేయి వేసి నడుచుకుంటూ పిన్ని దగ్గరకు వచ్చాను. ఏరా కన్నా,,, అన్నాచెల్లెళ్ల ముచ్చట్లు అయిపోయాయా? అని నవ్వుతూ అడిగింది పిన్ని.

ఇది నా దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంటే నువ్వు ఉన్నావని గమనించలేదు పిన్ని అంటూ పిన్నిని కౌగలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఎలా ఉన్నావు? అని నవ్వుతూ అడిగాను. .... నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావురా కన్నా? అని నా బుగ్గ మీద ముద్దు పెట్టి చాలా ప్రేమగా ఆప్యాయంగా అడిగింది. .... నేను బాగానే ఉన్నాను పిన్ని అని అనగా ఇంతలో పవిత్ర మధ్యలో అడ్డుపడి, మీరిద్దరూ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు టైం అయిపోతుంది ముందు పదండి అని అంది. .... ఏంటే ఆ తొందర?? వచ్చి రెండు నిమిషాలు కాలేదు పిన్నితో మాట్లాడనివ్వవా? అని అన్నాను. .... అబ్బా,,, అన్నయ్య మనం కార్లో వెళ్తూ మాట్లాడుకోవచ్చు ముందు కారెక్కు అని అంది. .... కార్లోనా?? సడన్ గా ఇప్పుడెక్కడికిరా బుజ్జమ్మ? అని అడిగాను.

పిన్ని మాట్లాడుతూ, ఈరోజు దాని పుట్టినరోజు కదా కన్నా గుడికి తీసుకువెళ్లి పూజ చేయిస్తాను అంటే నిన్ను కూడా తీసుకు వెళ్దామని ఇక్కడికి తీసుకొచ్చింది అని అంది. .... ఇదేంటే కొత్తగా?? ఇంతకాలం ఈ అన్నయ్య గుర్తు రాలేదు గానీ,,,, అని నేను మాట్లాడుతూ ఉండగానే పవిత్ర ఉహుం,, ఉహుం,, అమ్మ,,, చూడమ్మా,,, ఈ రోజు నా పుట్టినరోజు నన్ను ఏడిపించొద్దని చెప్పు అంటూ పిన్నిని చుట్టేసి గారాలు పోయింది. .... పాపంరా కన్నా,,, ఈరోజు నీతో కలిసి గుడికి వెళ్లాలని మొండి చెయ్యకుండా చక్కగా తయారయ్యింది. లేదంటే ఎప్పుడూ ఆ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని మగరాయుడులాగా బలాదూర్ తిరిగేది అంతే కదా బుజ్జులు అని పవిత్రని సరదాగా ఆటపట్టించింది. .... అమ్మా,,,,, అంటూ పవిత్ర పిన్నికేసి గుర్రుగా చూస్తూ, నువ్వు చెప్పినట్టు తయారయ్యాను కదా? అని పళ్ళు నూరింది.

ఇది నిన్ను కూడా బెదిరిస్తుందా పిన్ని? అని సరదాగా అన్నాను. .... పిన్ని పవిత్ర నుదుటి మీద ముద్దు పెట్టి, మొండిదే గాని మంచిదిరా కన్నా. నీకు దూరం అయిన దగ్గర్నుంచి ఈరోజు వరకు అది పుట్టినరోజు చేసుకోలేదు. నేనే గుడికి వెళ్లి దాని పేరున పూజ చేయించేదాన్ని. ఇంత కాలానికి అది గుడికి రావడానికి ఒప్పుకుంది అని చెప్పింది. .... ఆ మాట విని నాకు మనసు చివుక్కుమంది. పవిత్రని నా దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి దాని కళ్లల్లోకి చూశాను. అది కూడా నా కళ్ళలో చేరిన కన్నీటి పొర చూస్తూ, నేనేమీ నీలాగా ఏడవను తెలుసా? అని నవ్వింది. .... ఆ మాటకి నాకు నవ్వు వచ్చేసి మరింత గట్టిగా కౌగిలించుకుని, నువ్వేం మారలేదే మొండిదాన అని ముద్దు చేశాను. .... అది చూసి పిన్ని మాట్లాడుతూ, పుట్టినరోజు అయితే చేసుకోదు గాని ఆరోజు నేను చేసిన అన్ని రకాలు ఫుడ్ ఐటమ్స్ ఇంకా స్వీట్లు దెయ్యం పట్టినట్టు తినేస్తుంది అని నవ్వింది.

నా దొంగ బుజ్జమ్మ,,, ఎదిగింది గాని చిలిపి అల్లరి ఇంకా పోలేదు అని సరదాగా అన్నాను. .... నేను నా పుట్టినరోజే కాదు నీది, రవి అన్నయ్యది కూడా మర్చిపోను తెలుసా? అని అంది పవిత్ర. .... అవునురా కన్నా అస్సలు మర్చిపోదు అందుకే ఆ రోజంతా నిన్ను తిట్టుకుంటూ నేను నీ కోసం పూజ చేయించి తీసుకొచ్చిన ప్రసాదం మొత్తం ఖాళీ చేసేస్తుంది. అలాగే రవి పుట్టిన రోజున కూడా అదే వెళ్లి షాపుల్లో స్వీట్లు కొనుక్కొచ్చి, నన్ను వదిలి వెళ్లిపోయావు అంటూ వాడిని కూడా తిట్టుకుంటూ భూతం ఆవహించినట్టు ఆ స్వీట్లు మొత్తం తినేస్తుంది అని నవ్వింది పిన్ని. .... ఆ ఆ,, చెప్పింది చాల్లే,,, తొందరగా పద అన్నయ్య టైమ్ అయిపోతుంది అని ముద్దుగా గారాలు పోతూ చెప్పింది పవిత్ర. .... సరే మీరిద్దరూ కార్లో పదండి నేను వెనకాల బైక్ లో వస్తాను అటు నుంచి అటే కాలేజీకి వెళ్లాలి అని అన్నాను.

అయితే అమ్మ నువ్వు కార్లో వచ్చేయ్ నేను అన్నయ్యతో బైక్ మీద వస్తాను అని చెప్పింది పవిత్ర. ఆ తర్వాత పిన్ని కార్లో కూర్చుని బయలుదేరగా నేను బైక్ స్టార్ట్ చేసి పవిత్రను కూర్చోపెట్టుకొని కారును ఫాలో అవుతూ గుడికి చేరుకున్నాము. పిన్ని మా ఇద్దరి పేరుమీద అర్చన చేయించి ఇద్దరి చేత పంతులు గారి కాళ్లు మొక్కించిన తర్వాత ప్రసాదం తీసుకుని బయలుదేరాము. గుడికి వచ్చినప్పుడు కొంచెం సేపు కూర్చుని వెళ్లాలి అని చెప్పి పిన్ని మెట్లమీద కూర్చుని మా ఇద్దరినీ చెరోవైపు కూర్చో పెట్టుకుంది. చాలాకాలం తర్వాత నాకు చాలా సంతోషంగా ఉందిరా కన్నా. ఈ మహాతల్లికి ఇంతకాలానికి నీ మీద కోపం తగ్గింది అని కింద మెట్టు మీద కూర్చున్న పవిత్ర నుదుటి మీద ముద్దు పెట్టింది. .... అవును పిన్ని ఇంత కాలంగా ఇది నన్ను ఎన్ని తిట్లు తిట్టిందో తెలుసా? రోజూ పొద్దున్నే వీళ్ళ తిట్లతోనే నా రోజు మొదలయ్యేది అనే సరదాగా నవ్వుతూ అన్నాను.

పవిత్ర బుంగమూతి పెట్టుకొని, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం అవసరమా, అప్పుడంటే ఏదో తెలియక నీ మీద కోపంతో అలా అనేదాన్ని కావాలంటే నువ్వు కూడా నన్ను తిట్టు ఇంకా కోపంగా ఉంటే నన్ను కొట్టు కానీ నన్ను ఫైనల్ గా క్షమించెయ్ అంటూ పిన్ని ఒడిలో తల పెట్టుకుంది. .... పిచ్చిదానా,,, వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ఎన్ని మాటలన్నా వాడికి నీ మీద కోపం రాదు. నీకోసమని నా మాట విని ఇంటికి కూడా వచ్చి అనవసరంగా ఆ పెద్ద రాకాసితో చెంపదెబ్బ తిన్నాడు. అయినా సరే ఒక్క మాట మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడే గాని ఎవరికి ఎదురు చెప్పలేదు. నా కన్నయ్య బంగారం,,, అంటూ పిన్ని నా తలను కూడా ఒళ్ళో పెట్టుకొని నా బుగ్గ మీద ముద్దు పెట్టి, నన్ను క్షమించరా కన్నా ఆ రోజు నా మాట కాదనలేక ఇంట్లోకి వచ్చి అవమానపడ్డావు అని కన్నీళ్లు పెట్టుకుంది.

నేను లేచి పిన్ని కన్నీళ్లు తుడుస్తూ, సంతోషంగా గుడికి వచ్చి ఆ కన్నీళ్లు ఏంటి పిన్ని? ఇప్పుడు ఏమైయిపోయింది,, కొట్టింది అక్కే కదా? ఇదిగో ఇది తెలుసుకున్నట్టే అక్క కూడా ఏదో ఒకరోజు తెలుసుకుంటుంది ఆ మాత్రం దానికి నువ్వు నన్ను క్షమించమని అడగాలా? అని అన్నాను. .... పిన్ని మమ్మల్నిద్దరిని చెరోవైపు తన గుండెలకు హత్తుకుని, నా జీవితంలో మిగిలిన సంతోషం మీరే కన్నా. మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. నువ్వు దూరమైనా దీన్ని నా దగ్గరకు చేర్చి నిన్ను దాన్లో చూసుకునేలా చేశావు. మనమందరం కలిసి ఉండే రాత రాశాడో లేదో ఆ దేవుడు అని నిర్లిప్తంగా అంది పిన్ని. .... మ్,,, మొదలెట్టేసింది వేదాంతం,,, ఎప్పుడు చూసినా ఇదే వరసరా అన్నయ్య. ఒక్కతే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది నేను లేకపోతే ఏమయ్యుండేదో అని సిట్యువేషన్ కూల్ చేయడానికి సరదాగా మాట్లాడింది పవిత్ర.

నేను కూడా దాని మాటలకు నవ్వుకుని, సరేలే ఇకమీదట పిన్ని ఏడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. పిన్ని ఎప్పుడైనా కన్నీళ్లు పెట్టుకున్నట్టు నాకు తెలిసిందో నీకు మోత మోగిపోతుంది అని సరదాగా నవ్వుతూ అన్నాను. .... ఆ ఆ,,, ఆ సంగతి నేను చూసుకుంటాలే గాని నాకు గిఫ్ట్ ఏమిస్తున్నావు? అని అడిగింది. ... నీకేం కావాలో చెప్పు అని అన్నాను. ....పవిత్ర ఏదో అనబోయి ఆగి, ఇక్కడ కాదులే బయటికి వెళ్ళాక చెబుతాను అని అంది. .... నేను టైం చూసుకుని, సరే పిన్ని ఇక వెళ్దామా నేను కాలేజీకి వెళ్లాలి అని అనగానే పిన్ని మా ఇద్దరికీ ప్రసాదం పెట్టి లేచి మా ఇద్దరి చేతులు పట్టుకొని గుడి బయటకు తీసుకొచ్చింది. .... ఇప్పుడు చెప్పవే బుజ్జమ్మ ఏం కావాలి నీకు? అని అడిగాను. .... ఏం లేదు ఈ రోజు నాకు నీ దగ్గరే ఉండాలని ఉంది కానీ ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళాలి అందుకే సాయంత్రం నేను నీ దగ్గరికి వచ్చేస్తాను మళ్లీ పొద్దున్నే అమ్మ దగ్గరికి వెళ్లిపోతాను ప్లీజ్ కాదనకు అని చెప్పి పిన్నితో, అమ్మ నువ్వు చెప్పమ్మా,,, అని గోముగా అడిగింది.

పోనీలేరా కన్నా ఒక్క పూటే కదా ఈ రోజు రాత్రి నీతో ఉండి పొద్దున్నే నా దగ్గరికి వచ్చేస్తుందిలే అని అంది పిన్ని. .... నాకు వెంటనే అక్కడ మా ఆపరేషన్ విషయం గుర్తుకొచ్చి, సారీరా బుజ్జమ్మ,,, ఈరోజు నాకు కొంచెం అర్జెంటు పని మీద బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది ఇంకోసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తాలే అని అన్నాను. .... ఉహూం,,, వద్దు,,, నన్ను బయటికి ఎక్కడికి తీసుకు వెళ్ళవలసిన అవసరం లేదు. నాకు నీతో కలిసి ఉండాలని ఉంది ఈ రోజు కాకపోతే ఇంకో రోజు నీనుంచి నాకు కావాల్సిన గిఫ్ట్ అదే అని మొండిగా అంది. .... పిన్ని కూడా సరదాగా నవ్వుతూ పవిత్రని దగ్గరకు తీసుకుని ముద్దు చేస్తూ, మొండిఘటం,,, ఏది అనుకుంటే అది జరిగిపోవాలి,,, పోనీ నీకు ఖాళీగా ఉన్న రోజునే దీన్ని నీ దగ్గరకు పంపిస్తాలే కన్నా అని అనడంతో నేను కూడా సరే అనక తప్పలేదు.

తన కోరిక మన్నించినందుకు పవిత్ర మొహం సంతోషంతో వెలిగిపోయింది. వెంటనే పిన్ని బుగ్గ మీద ముద్దు పెట్టి నన్ను కౌగిలించుకుని ఒక మూతి ముద్దు ఇచ్చి, అమ్మ నువ్వు కార్లో ఇంటికి వెళ్ళిపో నేను అన్నయ్యతో కలిసి కాలేజ్ కి వెళ్లిపోతాను అని చెప్పి, అన్నయ్య నన్ను కాలేజ్ దగ్గర దింపేసి నువ్వు కాలేజీకి వెళ్లిపో అని అంది పవిత్ర. నేను సరే అనడంతో పిన్ని మా ఇద్దరికీ ముద్దులు పెట్టి కారులో కూర్చుంది. నేను దగ్గరికి వెళ్లి విండోలో నుంచి మరొకసారి పిన్నిని కౌగిలించుకొని ఒక మూతి ముద్దు ఇచ్చి జాగ్రత్త అని చెప్పిన తర్వాత పిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను బైక్ స్టార్ట్ చేసి పవిత్ర నా వెనకాల హత్తుకొని కూర్చోగా పవిత్ర చదువుతున్న కాలేజ్ వైపు బయలుదేరాము. పవిత్ర నేను మాటల్లో పడి తొందరగానే తన కాలేజ్ దగ్గరికి చేరుకున్నాము.

కాలేజ్ దగ్గర బైక్ ఆపగానే పవిత్ర కిందకి దిగి, అన్నయ్య ఒక్క నిమిషం నా బెస్ట్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను అని పార్కింగ్ ఏరియా వైపు గబగబా నడిచింది. అప్పుడే నాకు ప్రీతి చదివేది కూడా ఈ కాలేజ్లోనే అన్న విషయం గుర్తొచ్చి పవిత్ర వెళ్తున్న వైపు చూసేసరికి అక్కడ పార్క్ చేసిన యాక్టివా పై ఒక అమ్మాయి అటువైపు తిరిగి కూర్చుని ఉండడం కనపడింది. ఒకసారి బండిని పరిశీలనగా చూడగా అది కచ్చితంగా ప్రీతి బండి అని తెలియడంతో ప్రీతి చెప్పిన బెస్ట్ ఫ్రెండ్ ఈ తింగరి బుజ్జమ్మేనా అని నా పెదవులమీద చిరునవ్వు మెరిసింది. పవిత్ర దగ్గరకు వెళ్లగానే ఇద్దరూ ఒకరి నొకరు పలకరించుకుని హగ్ చేసుకుని చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్నారు. బహుశా ప్రీతి పవిత్రకి బర్త్ డే విషెస్ చెప్పినట్టుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నా దగ్గరకు నడుచుకుంటూ వస్తున్నారు.

నాకు దగ్గరగా వచ్చే సమయానికి ప్రీతి బండి మీద కూర్చుని ఉన్న నన్ను చూసి ఆశ్చర్యపోతూ తొందరగా అడుగులు వేసుకుంటూ వచ్చి, నువ్వేంటి అన్నయ్య ఇక్కడ? అని అడిగింది. నేను ఏమీ మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నాను. ఇంతలో పవిత్ర దగ్గరికి వచ్చి, అదేంటే వీడిని పరిచయం లేకుండానే పలకరించడానికి అంత తొందర పడుతున్నావు? అని అంది. .... ఏంటే మా అన్నయ్యని పట్టుకుని మర్యాద లేకుండా వాడు వీడు అని అంటున్నావు అని అంది ప్రీతి. .... వీడికి మర్యాద ఎందుకు? వీడిని నేను ఎప్పుడూ అలాగే పిలుస్తాను అని అంది పవిత్ర. .... ఎప్పుడూ అలాగే పిలుస్తావా? నువ్వు మా అన్నయ్యని??? అంటూ పవిత్ర మొహంలోకి చూస్తూ ఆగిపోయింది. అటు పవిత్రకి కూడా అప్పుడే బుర్రలో లైట్ వెలిగినట్టుంది అందుకే అది కూడా ప్రీతి మొహంలోకి చూస్తూ ఉండిపోయింది.

ఇద్దరూ కలిసి ఒకరి మొహంలో ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ, నువ్వు చెప్పిన అన్నయ్య వీడేనా? అని అడిగింది పవిత్ర. .... ప్రీతి అవును అన్నట్టు తల ఆడించి, అంటే నువ్వు చెప్పిన మీ అన్నయ్య??? అని తన సందేహం వెలిబుచ్చడంతో పవిత్ర కూడా తలాడించింది. అప్పటికిగాని వాళ్ళిద్దరి అన్నయ్య ఒక్కడే అని తెలుసుకోలేకపోయారు. .... నేను హ్హహ్హహ్హహ్హ,,,,, అని గట్టిగా నవ్వుతూ, మీ ఇద్దరూ అన్నయ్య గురించి మాట్లాడుకున్నారు గాని వాడి పేరు గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదా తింగరిబుచ్చులు? ఇద్దరికి ఇద్దరు సరిపోయారు ఇద్దరిదీ సరైన జోడి అని పగలబడి నవ్వాను. .... పో అన్నయ్య,,, నువ్వు కూడా ఎప్పుడూ నాకు చెప్పలేదు కదా అని అంది ప్రీతి. ..... నేను ప్రీతిని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, ఎప్పుడూ అటువంటి అవకాశం రాలేదురా బంగారం. నువ్వు ఆ రోజు డ్రెస్ ఇచ్చావ్ చూడు అది దీని కోసమే అని అన్నాను.

పవిత్ర కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యపడుతూ, ఆరోజు ఆ డ్రస్ చూడగానే ఎక్కడో చూసిన డ్రెస్ అనుకున్నాను అది దీని దగ్గర్నుంచి తీసుకొచ్చావా? అని అడిగింది. .... అవును ఆరోజు నువ్వు వేసుకున్న డ్రెస్ నా బంగారానిదే అని అన్నాను. .... ప్రీతి కొంచెం కంగారు పడుతూ, అంటే ఆ రోజు నువ్వు రక్షించింది దీనినా? అని పవిత్ర వైపు చూసి, ఇంత జరిగినా నాతో ఎందుకు చెప్పలేదే? అని అడిగింది. .... పవిత్ర తలదించుకుని, అన్నయ్య ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని అన్నాడు అందుకని,,,,,, అంటూ ఆగిపోయింది. ..... వెంటనే ప్రీతి పవిత్రను కౌగిలించుకొని, సారీ సారీ,, ఇంకేం చెప్పద్దు. థాంక్ గాడ్,,, నీకేమి కాలేదు అంతే చాలు అని అంది. .... వాళ్లిద్దరి మధ్య అన్యోన్యత చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. ఇంచుమించుగా ఇద్దరూ ఒకలాంటి వాళ్లే కాకపోతే ప్రీతీ పవిత్ర అంత మొండిది కాదు.

నేను పవిత్రను కూడా దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, ఇక ఆ విషయాన్ని మర్చిపోవాలి బుజ్జమ్మ ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి. అవును బంగారం మీ ఇద్దరూ ఒకే కాలేజ్ పైగా బెస్ట్ ఫ్రెండ్స్ మరి ఎప్పుడూ మీ పేరెంట్స్ గురించి మాట్లాడుకోలేదా? అలా అయినా ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది కదా? అని అడిగాను. .... అమ్మ మరొక కాలేజ్ ప్రిన్సిపాల్ అని దానికి తెలుసు కానీ ఎప్పుడూ కలిసే అవకాశం రాలేదు. అలాగే పవిత్ర అమ్మ గురించి కూడా నాకు తెలుసు కానీ నేను కూడా ఎప్పుడూ కలవలేదు అని చెప్పింది. .... నేను చిన్నగా నవ్వుతూ, నువ్వు కలిసావురా బంగారం నాకు ఆక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చిన సుమతి పిన్నే పవిత్ర అమ్మ. ఒసేయ్ బుజ్జమ్మ నువ్వు చిన్నప్పుడు చదివిన కాలేజ్ ప్రిన్సిపాల్ కవితనే ప్రీతి అమ్మ అని చెప్పాను.

Next page: Episode 100.2
Previous page: Episode 099.2