Episode 102.2
నేను స్నానం చేసి తయారయ్యి డోర్ లాక్ చేసుకుని బయటికి వచ్చి కాలేజీకి బయలుదేరుతుండగా వర్క్ స్టేషన్ బయట కారుకి నెంబర్ ప్లేట్లు మారుస్తూ తార కనబడటంతో తన దగ్గరికి వెళ్లాను. ఏంటి తార ఏమైంది? అని అడిగాను. .... ఏం లేదు దీపు,,, నిన్న నైట్ ఆ రాజుగాడి బాడీ సెంటర్ లో పడేసినప్పుడు ఏదైనా సెక్యూరిటీ కెమెరాల్లో మన కారు కనబడే అవకాశం ఉండొచ్చు అందుకే ఇంతకుముందు తగిలించిన డూప్లికేట్ నెంబర్ ప్లేట్ తీసేసి ఒరిజినల్ నెంబర్ ప్లేట్ తగిలిస్తున్నాను. ఎలాగూ మనకి మరో రెండు రోజులు వేరే మిషన్ ఏమీ లేదు కదా అని అంది. నేను కూడా తనకు సాయం చేసి రెండు నెంబర్ ప్లేట్లు మార్చిన తర్వాత తార నాకు బాయ్ చెప్పి బయలుదేరింది. నేను ఫోన్ చేస్తాను అని బాయ్ చెప్పగా తార వెళ్ళిపోయింది. నేను కాలేజీకి వెళ్లి అను, జ్యోతిలతో కలిసి క్లాసులు అటెండ్ అయ్యాను.
మధ్యాహ్నం ఇంకా ఒక క్లాసు మిగిలి ఉండగా గ్యాప్ లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. చూడగా అది నేను సేవ్ చేసుకున్న లాయర్ అంకుల్ నంబర్ నుంచి వస్తుంది. నేను అను, జ్యోతిలను వదిలి కొంచెం పక్కకి వెళ్లి కాల్ లిఫ్ట్ చేసి, హలో అంకుల్,,, ఎలా ఉన్నారు, ఏంటి ఈ టైంలో కాల్ చేసారు? అని అడిగాను. .... బాబు దీపు,,, నేను చెప్పినట్టు పేపర్ వర్క్ అంతా పూర్తయింది. ఈరోజు మంచిరోజు అందుకని ఈ రోజే నీకు బాధ్యతలు అప్పజెపుదామని అన్ని ఏర్పాట్లు చేశాను. మనం మధ్యాహ్నం బయలుదేరి ఆఫీసుకి వెళ్ళాలి నువ్వు రెడీగా ఉంటే నేను వచ్చిన తర్వాత బయలుదేరుదాం అని అన్నారు. .... దానికి అంత తొందర ఏమొచ్చింది అంకుల్ మనం తర్వాత ఎప్పుడైనా దాని గురించి చూసుకోవచ్చుగా అని అన్నాను. .... లేదు బాబు నీ కంపెనీలు నీ చేతికి అందించవలసిన సరైన సమయం ఆసన్నమైంది. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను మధ్యాహ్నం 3:00 వస్తాను నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేశారు.
నేను ఫోన్ మాట్లాడటం అయిపోయిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు అలాగే ఆలోచిస్తూ నిలుచుండి పోవడంతో అది చూసిన జ్యోతి, అను నా దగ్గరికి వచ్చి, ఏమైంది అన్నయ్య, దీపు,,, ఏంటి అంతలా ఆలోచిస్తూ ఉండిపోయావు? అని ఇద్దరు కలిసి ఒకేసారి అడిగారు. .... నేను ఆలోచనల నుంచి తేరుకుని, నథింగ్,,, ఏం లేదు,, అని ఒక చిన్న చిరునవ్వు నవ్వేసరికి ఇద్దరూ నా వైపు కొంచెం వింతగా చూసి, సరేలే పద క్లాసుకి టైం అవుతుంది అని నా చేతులు పట్టుకొని లాక్కెళ్లారు. క్లాసు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లినా అమ్మ అప్పుడే రాదు కాబట్టి ఒక్కడినే కూర్చుని భోజనం చేయడం ఇష్టంలేక, హేయ్,,, ఈరోజు మనం క్యాంటీన్లో లంచ్ చేద్దామా? అని వాళ్ళిద్దర్నీ అడిగాను. .... అను నా వైపు కొంచెం క్యూరియస్ గా చూసి, నీ రూమ్లో నువ్వు వండుకున్న పప్పన్నం వేస్ట్ అయిపోతుందేమో? అని కొంచెం వెటకారంగా అంది.
ఆ మాటకి జ్యోతి నవ్వుకుంది. ఎందుకంటే సాధారణంగా అను ఎప్పుడు అడిగినా రూమ్ లో నేను వండుకున్న ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాను ఈరోజు నేనే అడిగేసరికి అనుకి ఛాన్స్ వచ్చి నన్ను ఎగతాళి చేస్తోంది. .... నేను చిన్నగా నవ్వుకుని, సరేలే ఏదో సరదాగా ముగ్గురం కలిసి భోజనం చేద్దామని అడిగాను నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోదాం అని అన్నాను. .... జ్యోతి మాట్లాడుతూ, పోనీలే అను,, అన్నయ్య అడక్క అడక్క అడిగాడు మళ్లీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడొస్తుందో ఏమో పద సరదాగా కలిసి భోజనం చేసి వెళ్దాం అని అంది. .... నువ్వుండవే,,, ఎన్నిసార్లు అడిగినా ఏదో కొంపలు అంటుకుపోయినట్టు రూమ్ కి పారిపోతాడు ఈ దద్దోజనం,,,, అంటూ నోట్లోనే నన్ను తిట్టుకుంటూ నసుక్కుంది. .... సరే మేడం,,, మీ కోపం నాకు అర్థమైంది ఇప్పుడు కూడా మీరు ఓకే అంటేనే వెళ్దాం లేదంటే వద్దులే అని సరదాగా అన్నాను.
అను ఒక స్వీట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నా వైపు చురచుర చూస్తూ అంతలోనే సిగ్గుపడుతూ, జ్యోతి అడిగింది కాబట్టి వస్తున్నాను అని నన్ను కవ్వించింది. .... మీ ఆజ్ఞ మేడం అంటూ మర్యాదగా వంగి పదండి అన్నట్టు చేతిని ముందుకు చూపించేసరికి అను పెదాల మీదకి చిరునవ్వు వచ్చేసింది. .... అయిపోయాయా మీ ఇద్దరి గిల్లికజ్జాలు ఇక పదండి లేదంటే క్యాంటీన్లో గిన్నెలు కడుక్కోవలసి వస్తుంది అని జ్యోతి జోక్ చేయడంతో ముగ్గురం నవ్వుకుని క్యాంటీన్ వైపు నడిచాము. ముగ్గురికి కావలసినవి ఆర్డర్ చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేసాము. వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కున్న తర్వాత నేను నా కర్చీఫ్ కోసం చూసుకుంటుండగా అను తన చున్నీతో నా మూతి తుడిచి చేతులు తుడుచుకోమని నా చేతికి అందించింది. నేను చిన్న చిరునవ్వు నవ్వి తన చున్నీతో చేతులు తుడుచుకుని థాంక్స్,,, అని అన్నాను. అను ముసిముసిగా నవ్వుకొని మురిసిపోయింది.
ఆ తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ నెమ్మదిగా పార్కింగ్ దగ్గరకు చేరుకొని ఎవరి దారిన వారు బయల్దేరాము. జ్యోతి అనుతో కలిసి కారులో బయలుదేరగా నేను నా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాను. దారిలో రుద్ర ఇంటికి వెళ్ళి బయట గేటు దగ్గర ఉన్న సెంట్రీ దగ్గర్నుంచి డబ్బుల ప్యాకెట్ కలెక్ట్ చేసుకుని ఇంటికి చేరుకున్నాను. నేను ఊహించినట్టుగానే అమ్మ ఇంకా కాలేజ్ నుంచి రాలేదు. నేను రావడం చూసిన రాము భోజనం పెట్టమంటారా? అన్నట్టు సైగ చేసి అడిగాడు. నేను తినేసి వచ్చానని సైగలతోనే చెప్పి నా రూమ్ లోకి వెళ్లి కార్ తాళం తీసుకుని అమ్మ వచ్చిన తర్వాత నేను కారు తీసుకుని వెళ్లాను అని చెప్పమని రాముకి చెప్పి నా రూమ్ కి బయల్దేరాను. రూమ్ కి చేరుకున్న తర్వాత డబ్బుల ప్యాకెట్ బద్రపరిచి గబగబా స్నానం చేసి ఒక మంచి డ్రెస్ తీసుకొని కొంచెం డిగ్నిఫైడ్ గా తయారయ్యాను. ఆ సమయంలో నేను మొదటిరోజు కేఫ్ లో మేనేజర్ గా జాయిన్ అయినప్పుడు అను నన్ను షాపింగ్ కి తీసుకెళ్లి చేసిన హడావిడి గుర్తొచ్చి నవ్వుకున్నాను. ఆ తర్వాత సరిగ్గా చెప్పిన టైంకి లాయర్ అంకుల్ రావడంతో ఇద్దరం కలిసి ఆఫీసుకి బయలుదేరాము.
ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఐదు అంతస్తుల భవనం దగ్గర కారు ఆగిన తర్వాత నేను అంకుల్ కిందికి దిగగా ఆఫీస్ సూట్ లో ఉన్న ఒక అమ్మాయి పూల బొకేతో ఎదురొచ్చి నాకు స్వాగతం పలుకుతూ విష్ చేసింది. ఆమెతో పాటు మరి కొంతమంది ఆఫీస్ స్టాప్ కూడా వచ్చి స్వాగతం పలికారు. నేను కూడా వాళ్లకు హాయ్ చెప్పి ఇవన్నీ అవసరమా అన్నట్టు నేను అంకల్ వైపు చూడగానే అంకల్ నవ్వుతూ, నువ్వు మొట్టమొదటి సారి ఆఫీసులో అడుగు పెడుతున్నావు కనీసం ఈ మాత్రం హడావిడి కూడా లేకపోతే ఎలా? పద లోపలకి వెళ్దాం అని నన్ను తీసుకుని లోపలికి వెళ్లారు. లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకువెళ్లి అక్కడున్న సెక్షన్లో ఎంప్లాయిస్ కి ఒకసారి నన్ను చూపించి అలాగే వరుసగా రెండు మూడు నాలుగు ఫ్లోర్లలో ఉన్న స్టాఫ్ కి నన్ను చూపించి పరిచయం చేసి ఐదవ ఫ్లోర్ కి తీసుకుని వెళ్లారు.
ఐదవ ఫ్లోర్ లో కేవలం చైర్మన్ కు సంబంధించి విశాలమైన ఆఫీస్ దానికి అనుబంధంగా ఒక టూ బెడ్ రూమ్ ఫ్లాట్ ఫుల్ ఫర్నీషింగ్ తో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఎంట్రన్స్ లో మాత్రం మరో రెండు క్యాబిన్లు ఉన్నప్పటికీ అవి ఖాళీగానే ఉన్నట్టు కనబడ్డాయి. అంకుల్ మాట్లాడుతూ, ఈ ఫ్లోర్ మొత్తం నీదే నువ్వు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. నీకు ఎవరైనా స్టాఫ్ దగ్గరగా ఉండాలనుకుంటే ఆ క్యాబిన్లు వాడుకోవచ్చు అంటూ వాటిని తెరిచి చూపించారు. ఆ తర్వాత నా ఆఫీస్ లోకి తీసుకుని వెళ్లి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి నీకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే మేనేజరుతో చెప్పి చేయించుకోవచ్చు అని చెప్పి ఆ తర్వాత టూ బెడ్ రూమ్ ఫ్లాట్ కూడా చూపించారు. ఆ తర్వాత నన్ను చైర్మన్ చైర్ దగ్గరికి తీసుకుని వెళ్లి, ఇది నీ సీట్,,, ఇందులో నిన్ను కూర్చోబెట్టడం నా బాధ్యత అంటు నా చెయ్యి పట్టుకుని నన్ను ఆ చైర్ లో కూర్చోబెట్టబోయారు.
నేను ఆయన్ను ఒకసారి ఆపి అక్కడే రూమ్ లో గోడకు వేలాడదీసి ఉన్న పార్వతి అమ్మ ఫోటో దగ్గరికి వెళ్లాను. ఇదే ఫోటో ఇంట్లో కూడా పార్వతి అమ్మ రూమ్ లో ఉంటుంది. ఎప్పుడు ఆ ఫోటో చూసిన నాకు ఎనలేని సంతోషంగా ఉంటుంది. పార్వతి అమ్మ జ్ఞాపకాలను తలుచుకుని చేతులతో ఫోటోని తాకి ఆమె ఆశీర్వాదం తీసుకుని తిరిగి సీట్ దగ్గరికి వచ్చాక అంకుల్ నన్ను సీట్ లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న కొన్ని పేపర్ల మీద నా సంతకం పెట్టమని పెన్ చేతికి అందించి చెప్పారు. ఆయన చెప్పినట్టు నేను సంతకం చేసిన తర్వాత లాయర్ అంకుల్ ఆ పేపర్ల మీద స్టాంప్ వేసి నా చేతికి అందిస్తూ, ఈ క్షణం నుంచి ఈ కంపెనీలు మొత్తం నీ కంట్రోల్ లోకి వచ్చేసాయి. ఇక మీదట అన్ని నీ ఆజ్ఞానుసారం జరగవలసిందే. ఈ పేపర్లు నువ్వు జాగ్రత్తగా పెట్టుకో అని సేఫ్ లాకర్ చూపించారు. నేను లేచి వాటిని లాకర్ లో పెట్టి తిరిగి వచ్చి లాయర్ అంకుల్ ని ఆప్యాయంగా హగ్ చేసుకున్నాను.
అంకుల్ సంతోషంగా నా వీపు తడుతూ, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. పార్వతమ్మ గారు నీ మీద పెట్టుకున్న నమ్మకం నువ్వు వమ్ము చేయలేదు. ఆమె చిత్రపటానికి నమస్కారం చేసి ఆమె ఆశీస్సులు తీసుకుని ఈ చైర్ లో కూర్చుని ఆమెకు సరైన వారసుడివి అని నిరూపించుకున్నావు. ఈరోజుతో నా పూర్తి బాధ్యత తీరిపోయింది. ఇంతకాలం నేను నా బాధ్యతను పూర్తిగా నిర్వహించగలనో లేదో అని అనుక్షణం భయం భయంగా ఉండేది. నీకు బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా నా మీద ఉన్న భారం దిగిపోయి చాలా ఉపశమనంగా అనిపిస్తుంది అని సంతోషంగా నవ్వారు. .... అదేంటి అంకుల్ అలా అంటారు ఎప్పటిలాగే ఇక మీదట కూడా మీరే అన్ని చూసుకోవాలి అని మర్యాదగా అన్నాను. .... లేదు బాబు ఇక మీదట నేను ఈ పనులన్నీ చేయలేను. వీటిని కాపాడే బాధ్యత మోస్తూ ఇప్పటికే చాలా అలసిపోయాను. ఆ మహాతల్లి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఇంత కాలం పని చేస్తూ వచ్చాను అని అన్నారు.
మీరు ఇంత నమ్మకమైన మనిషి కాబట్టే అమ్మ ఈ పని మీ ద్వారా చేయించి ఉంటుంది అంటూ అంకుల్ ని ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చోపెట్టాను. ఆ తర్వాత నా సీట్లో కూర్చొని, ఇంతకీ మనకి ఏయే బిజినెస్లు ఉన్నాయి అంకుల్? అని అడిగాను. .... బాబు దీపు మనకి అంటే పార్వతమ్మ గారి పేరుమీద ఇక్కడ SEZ లో ఒక వజ్రాలు పాలిష్ చేసి ఎగుమతులు చేసే యూనిట్ ఉంది. దానికి సంబంధించి ముడిసరుకు మనకు విదేశాల నుంచి వస్తుంది వాటిని సానబట్టి పాలిష్ చేసి ఎగుమతి చేస్తూ ఉంటాము. ఈ యూనిట్ మీద సుమారు రెండు వందల మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. ఇక రెండవ అతి పెద్దది క్లాతింగ్ బిజినెస్. రాజమండ్రి దాటిన తర్వాత రావులపాలెం దగ్గరలో మనకి స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. అది పార్వతమ్మ గారి అన్నయ్య పేరు మీద ఉండేది. అక్కడ వివిధ రకాల క్లాత్ తయారవుతుంది. వాటిని కొంత వరకు మనదేశంలోనే సప్లై చేస్తాము మరి కొంచెం విదేశాలకు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఆ యూనిట్ మీద కూడా సుమారు 1000 మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు.
ఇకపోతే ఇక్కడే మనకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉంది. సుమారు 300 వరకు కంటైనర్ ట్రైలర్లు, టిప్పర్లు, ఇంకా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి. అది కూడా పార్వతమ్మ గారి పేరు మీదే ఉంది. ఇకపోతే సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా స్టార్ట్ చేసి నడిపారు కానీ అది మొదట్లోనే ఉండగా ఆ దుర్ఘటన జరగడంతో దానిని ముందుకు కొనసాగించలేక పోయాము. కానీ ఆ బిజినెస్ కోసం ఈ నగరం చుట్టుపక్కల కొన్న సుమారు వెయ్యి ఎకరాల భూమి అలాగే ఉంది. ఇక చివరగా సిటీ సెంటర్ లో మనకి ఒకే ఒక జువెలరీ షాప్ ఉంది. ఈ ఘటన జరిగే కొద్ది నెలల ముందు బంగారు రిటైల్ వ్యాపారం మొదలుపెట్టి ఆ షాప్ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఒక ఫ్రాంచైజీ లాగా మన బ్రాండ్ తో రాష్ట్రం మొత్తం బ్రాంచీలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉండగా ఆ ఘటన మూలంగా ముందుకు అడుగువేయలేకపోయాము. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ నీ పేరు మీదకి వచ్చేసాయి. ఇకమీదట ఏం చేయాలని నిర్ణయించుకుంటావో నీ ఇష్టం అని ముగించారు అంకుల్.
ఇదంతా విన్న తర్వాత నా రోమాలు నిక్కబొడుచుకొని స్థాణువులా ఉండిపోయాను. ఇంత పెద్ద వ్యాపారాలు ఉన్నాయని నిజంగా నాకు ఇంతవరకు తెలీదు. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి పార్వతి అమ్మతో కలిసి జువెలరీ షాప్ కి వెళ్లినట్టు మాత్రం గుర్తుంది. ఇంత పెద్ద వ్యాపారాలు ఆస్తులు నా పేరు మీద రాసి పెట్టిందంటే అమ్మకు నా మీద ఎంత ప్రేమ ఉండేదో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇవన్నీ తెలియక ముందు ఆమెకు నా మీద ఉన్న ప్రేమ గురించి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ విషయం గురించి తెలిస్తే అందరికీ ఆమె గొప్పతనం అర్థమవుతుంది. ఇలా ఆలోచనలలో ఉండగా నా ఆఫీస్ రూమ్ డోర్ చప్పుడయింది. అంకుల్ అటు వైపు చూసి కమిన్ అని అనడంతో డోర్ తెరుచుకుని ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చారు. ఇందాక మేము కింద ఫ్లోర్లలో అందరినీ పరిచయం చేసుకున్నప్పుడు ఈ వ్యక్తులు అక్కడ కనబడలేదు.
వాళ్లు లోపలికి వస్తూనే అంకుల్ కి నమస్కారం పెట్టి మొహంలో నవ్వు పులుముకుని నా వైపు చూశారు. అంకుల్ నన్ను వాళ్ళకు పరిచయం చేస్తూ, ఇతనే మన చైర్మన్ పార్వతమ్మ గారి కొడుకు ఈరోజు నుంచి మీ కొత్త ఎండి దీపక్ వర్మ అని చెప్పారు. ఆ తర్వాత నా వైపు తిరిగి అందులో ఒకతన్ని చూపిస్తూ, ఇతను మన చీఫ్ మేనేజర్ మిస్టర్ కనకరాజు, మరొకతన్ని చూపించి ఇతను మన చీఫ్ అకౌంటెంట్ మిస్టర్ భరద్వాజ్ అని పరిచయం చేశారు. నేను లేచి ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించాను. కానీ వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు ఎందుకో తేడాగా అనిపించింది. వాళ్ళిద్దరి మొహాల్లో నవ్వు ఫేక్ అని స్పష్టంగా తెలుస్తుంది. నేను రావడం వాళ్ళకు ఇష్టంలేదు అన్నట్టు వాళ్ల కళ్ళలోకి చూస్తే తెలిసిపోతుంది. నేను వచ్చినందువల్ల వాళ్ళ ప్రయోజనాలు ఏవో దెబ్బ తింటున్నట్టు అప్పుడప్పుడు వారు నవ్వుతున్న నవ్వు మాటున దాగి వున్న క్రోధం చెప్పకనే చెబుతుంది. సరే ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం అని మనసులో అనుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టాను.
ఆ తర్వాత అంకుల్ మాట్లాడుతూ, ఇకమీదట మీరు సార్ ఆర్డర్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అవసరమైతే సార్ పిలుస్తారు అని వాళ్ళను అక్కడి నుంచి పంపేశారు. ఆ తర్వాత ఇద్దరం లేచి మొత్తం నా ఆఫీస్ రూమ్ అంతా తిరిగి చూసి దాన్ని ఆనుకొని ఉన్న నా ఫ్లాట్ లోకి వెళ్లి అది కూడా అంతా చూసి సోఫాలో కూర్చున్నాము. నేను మాట్లాడుతూ, అంకుల్ మన మేనేజర్, అకౌంటెంట్ లను చూస్తుంటే ఏదో తేడాగా కనబడుతున్నారు? అని అడిగాను. .... అవునా,,, నీకు ఎందుకు అలా అనిపించింది? అని అడిగారు అంకుల్. .... వాళ్ల మొహాలు నవ్వుతున్నాయి కానీ వాళ్ళ కళ్ళల్లో ఏదో కోపం కనబడుతుంది. వాళ్ల వ్యవహారశైలి చూస్తుంటే నాకు ఆ విషయం తెలుస్తుంది అని అన్నాను. .... వెరీ గుడ్ బాబు,,, వాళ్లు చాలా తేడాగాళ్లు అని నాకు కూడా అనుమానంగానే ఉంటుంది.
ఎందుకంటే మన కంపెనీలు నడుస్తున్న తీరు వాళ్లు చూపించే లెక్కలు అప్పుడప్పుడు నేను ఏదైనా ప్రశ్నలు అడిగితే దానికి వాళ్లు ఇచ్చే సమాధానాలు ఒకదానికి ఒకటి పొంతన ఉండవు. లీగల్ గా నేను ఈ కంపెనీలకు ట్రస్టీని మాత్రమే కానీ నడిపించాల్సినది వాళ్లే. నాకు కూడా చాలా అనుమానాలు ఉండేవి కానీ నాకు వాళ్లను నిలువరించే అధికారం లేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ కంపెనీ లోని ఆస్తులు కరిగిపోకుండా మేనేజర్లు అకౌంటెంట్లు ఇంకా మిగిలిన ఆఫీస్ స్టాఫ్ పని చేయడం వాటి వివరాలు ఎప్పటికప్పుడు కోర్టుకు అందజేయడం మాత్రమే నా పని. అలాగే నాకు ఉద్యోగులను తొలగించే అధికారం కూడా లేదు. ఇవన్నీ నీ చేతికి అప్పగించే వరకు మన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను చేర్చుకోవడం గాని తొలగించడం గాని చేసే హక్కు వీళ్ళకే ఉంది. వాళ్లు చూపించే లెక్కలు పనుల వివరాలు మీద నాకు ఎప్పుడూ అనుమానం ఉండేది. కావాలంటే నువ్వు ఇన్ని సంవత్సరాల పనితీరు మీద ఒక ఎంక్వైరీ వేసి వాళ్ల నిగ్గు తేల్చే హక్కు నీకుంది అని అన్నారు అంకుల్.
లేదు అంకుల్ అంత తొందరగా ఇటువంటి పనులు చేయకూడదు. నేను వాళ్ళని మరికొంచెం గమనించి ఏం చేస్తే బాగుంటుందో నిర్ణయిద్దాం. ఒకవేళ మీరు చెప్పినట్టే ఏమైనా అవకతవకలు బయటపడితే వాళ్లను ఏం చేయాలో నా స్టైల్ లో నేను చూసుకుంటాను అని అన్నాను. .... శభాష్ దీపు బాబు,,, పార్వతమ్మ గారికి సరైన వారసుడివి అనిపించుకున్నావు. పద నీకు మన SEZ లోని వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్ మరియు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సైట్ చూపిస్తాను అంటూ పైకి లేచారు. నేను కూడా అంకుల్ తో కలిసి లిఫ్ట్లో కిందికి దిగి అందరికీ వీడ్కోలు పలికి కార్ లో బయలుదేరి వెళ్ళాము. దాదాపు రెండు గంటల పాటు వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్ మొత్తం తిప్పి చూపించి అక్కడున్న ఫ్లోర్ మేనేజర్, సూపర్వైజర్లు, లేబర్ కి నన్ను పరిచయం చేసి అక్కడినుంచి బయలుదేరి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సైట్ కి తీసుకెళ్ళి అక్కడ కూడా అందరినీ పరిచయం చేశారు. కొంతసేపు అక్కడ జరిగే పనుల గురించి వివరంగా చెప్పి తిరిగి కారులో బయలుదేరాము.
గోదావరి జిల్లాలో ఉన్న స్పిన్నింగ్ మిల్ విషయాల గురించి చెప్పి అక్కడ ఫ్లోర్ మేనేజర్ కి నువ్వు వస్తావని చెప్పి ఉంచాను నీకు ఖాళీ చూసుకుని ఒకసారి విజిట్ చేసిరా అని చెప్పారు అంకుల్. ఇంకా నాకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాల గురించి అంకుల్ నాకు వివరంగా చెబుతూ సిటీ లోకి చేరుకున్న తర్వాత అంకుల్ తన ఆఫీసు ముందు దిగిపోయి ఇక సెలవు తీసుకుంటాను అని చెప్పారు. .... నేను అంకుల్ ని హగ్ చేసుకుని, అదేంటి అంకుల్ అలా మాట్లాడుతారు మీ సహాయం లేకుండా ఇవన్నీ చూసుకోవడం నా ఒక్కడి వల్ల అవుతుందా? మీ సలహాలు సూచనలు నాకు ఎంతో ముఖ్యమైనవి. ఇంతకాలం ఇంత పని బాధ్యతగా నిర్వహించిన మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. నేను ఇంకా చదువుకుంటున్నాను హఠాత్తుగా మీరు ఈ పని మొత్తం నాకే అప్పగించి వెళ్ళిపోతే ఎలా? అని అన్నాను.
ఏం పర్వాలేదు దీపు బాబు అవన్నీ నువ్వు చూసుకోగలవు. అయినా ఇంత కాలం పని చేసినందుకు కోర్టు నాకు ఫీజు రూపంలో చాలా సొమ్మును కట్టబెట్టింది. పార్వతమ్మ గారి ఉప్పు తిని బతికినవాడిని ఈ పనులన్నీ చూసుకోవడం నా బాధ్యత. ఆ తల్లి దయవల్ల నాకు ఏ విషయంలోనూ కొరత లేదు. ఇప్పుడు నువ్వు కొత్తగా తీర్చుకోవాల్సిన రుణాలు ఏమీ లేవు. నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. ఇంత కాలంగా నిన్ను ఎవరికీ పరిచయం చేయకపోవడానికి కారణం ఏంటంటే వేల కోట్ల ఆస్తులకు వారసుడు అయిన నిన్ను ఎవరైనా ఏదైనా చేస్తారేమో అన్న సంశయంతోనే ఆగాను. నువ్వే ఆ వారసుడువి అని ఎవరికీ తెలియకుండా ఉండేందుకే నేను కూడా నీ దగ్గరకు రాలేదు. కానీ నీకు తెలియకుండా నీ ఎదుగుదల చూశాను ఇప్పుడు నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు ఈ పనులన్నీ అలవోకగా చేసుకోగలవు. నేను ఇకమీదట నా పనులన్నిటికీ స్వస్తి చెప్పి రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఎప్పుడైనా నీకు మరీ క్లిష్ట పరిస్థితి ఎదురైతే నాకు ఒక ఫోన్ చెయ్ ఆ సమయంలో నీకు కావలసిన సలహా ఏదైనా ఇవ్వగలుగుతానేమో?
నేను ఇప్పుడు నీకు చివరిగా ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఒక మంచి నమ్మకమైన పర్సనల్ అసిస్టెంట్ కం సెక్రెటరీని పెట్టుకో. అప్పుడు నువ్వు ప్రతి దానికి తిరగాల్సిన అవసరం ఉండదు. నీ తరఫున నీ సెక్రటరీ ఆఫీసు వ్యవహారాలు చూసుకుంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం గాని లేదంటే ముఖ్యమైన మీటింగులు అటెండ్ అవ్వడం గాని మాత్రమే నువ్వు చేస్తే సరిపోతుంది. అయినా ఈ కాలం కుర్రాడివి నీకు నేను ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు ఆల్ ది బెస్ట్,, అంటూ నా భుజం తట్టారు. ఆయన నిజాయితీ చూసిన తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయి అలాగే కిందికి వంగి ఆయన కాళ్ళకి నమస్కారం చేశాను. ఆ తర్వాత పైకి లేచి, నేను మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోను తప్పకుండా మిమ్మల్ని కలుస్తూనే వుంటాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అని అనడంతో అంకుల్ కూడా కొంత భావోద్వేగానికి గురై నన్ను మళ్లీ ఒకసారి హాగ్ చేసుకుని భుజం తట్టి, సరే బాబు చాలా లేట్ అయిపోయింది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అవసరం అయినప్పుడు కలుద్దాం అని చెప్పారు. నేను ఆయన దగ్గర వీడ్కోలు తీసుకుని కారులో అమ్మ దగ్గరకు బయలుదేరాను.