Episode 108.1
పొద్దున్న అలారం చప్పుడుతో తార నిద్రలేచి గబగబా తన నైటీ వేసుకుని బటన్లు పెట్టుకుంటూ నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటున్న నా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి, మావ వెళ్తున్నాను నువ్వు రెడీ అయ్యి వచ్చేయ్ అని చెప్పి డోర్ తెరుచుకుని వెళ్ళిపోయింది. నేను కూడా లేచి డోర్ దగ్గరకు వెళ్లి చిన్నగా తల బయటపెట్టి వర్క్ స్టేషన్ వైపు చూశాను. తార గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళింది కానీ లోపలి డోర్ క్లోజ్ చేయడం జరగలేదు. నాకెందుకో తేడాగా అనిపించింది కానీ లోపలికి వచ్చి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జాగింగ్ సూట్ వేసుకుని వర్క్ స్టేషనుకి చేరుకున్నాను. ఆ టైంకి ముగ్గురూ రెడీ అయ్యి హాల్లో కూర్చుని కనబడ్డారు. గుడ్ మార్నింగ్ గయ్స్,,, ఏంటి ఈ రోజు చాలా తొందరగా లేచినట్టున్నారు అని అన్నాను. .... నీకు కుదిరినట్టు మాకు అన్ని కుదరవు కానీ తప్పదు కదా,, అందుకే అలారం పెట్టుకొని టైంకి రెడీ అయ్యాము అని కొంచెం దీర్గం తీసి నా వైపు తార వైపు మార్చి మార్చి చూస్తూ అన్నాడు సోము.
సోము మాటలు వినగానే తార నా దగ్గర నుంచి రావడం వాళ్లు చూసేసారు అని అర్థం అయిపోయింది. ఇంతకీ ఈ తింగరిది ఎలా మేనేజ్ చేసిందో ఏంటో? అని మనసులో అనుకొని, కమాన్ గయ్స్,,, అంటూ పార్క్ వైపు బయలుదేరదీశాను. పార్కు చుట్టూ రౌండ్లు వేస్తుండగా వీలు చూసుకుని తారతో మాట్లాడగా, నిన్ను నిద్ర లేపడానికి వచ్చానని చెప్పానులే అని అంది. .... అదేమైనా అంత నమ్మశక్యంగా ఉందా? ఇంకేదైనా చెప్పుండొచ్చుగా? అని అన్నాను. .... ఆ టైంకి నాకు అలా తట్టింది చెప్పేశాను. ఇప్పుడు ఏమైందని అలా టెన్షన్ పడుతున్నావు? అని అంది. .... సోము ఎలా మాట్లాడాడో వినలేదా? మన అందరి మధ్య ఇటువంటి విషయం తలెత్తడం అవసరమా? అని అన్నాను. .... ఆఆ బొక్కలే,,, నువ్వు లైట్ తీసుకో,, అంటూ నవ్వేసి పరుగు స్పీడ్ పెంచి వెళ్ళిపోయింది. .... దీనికి ఉన్న ధైర్యం నాకు లేకుండా పోయింది అని మనసులోనే నవ్వుకుని అందరితో పాటు కలిసిపోయి పని పూర్తి చేసుకుని అనుతో పలకరింపులు అయిపోయిన తర్వాత వర్క్ స్టేషనుకి చేరుకున్నాము.
జిమ్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని, గయ్స్ నేను ఒకసారి ఆఫీసుకి వెళ్లి వస్తాను. మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేసి బయల్దేరుదాం అని చెప్పి నా రూమ్ కి వెళ్ళిపోయాను. స్నానం చేసి తయారయ్యి ఆఫీసుకు వెళ్లి అనుమానం రాకుండా ఉండేందుకు భరద్వాజ్, కనకరాజుని పిలిపించుకుని నిన్న వచ్చిన రికార్డ్స్ గురించి అడిగి తెలుసుకుని ఇది వరకు జరిగిన ఇన్ కంటాక్స్ పేమెంట్ కోసం అడిగి కొంతసేపు వాళ్లతో గడిపి నేను అన్నీ నార్మల్ గానే అడుగుతున్నట్టు నటించి, ఇక నేను వెళ్తాను మీరు మీ పనులు చూసుకోండి అని చెప్పి మధ్యాహ్నం భోజనం టైంకి వర్క్ స్టేషనుకి చేరుకున్నాను. వెంటనే ముత్యాలమ్మ మామ్మ మాకు భోజనం ఏర్పాట్లు చేయగా అందరం కూర్చుని తినడం మొదలు పెట్టాము. మామ్మ నాకు వడ్డిస్తూ, నువ్వు కూడా రోజూ ఇక్కడే తినేయ్ బాబు అని ఆప్యాయంగా అడిగింది. .... లేదు మామ్మ పనులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఏ టైంకి ఎక్కడ ఉంటానో అక్కడే తినేస్తున్నాను. అవును మర్చిపోయాను నీకు తర్వాత వచ్చి డబ్బులు ఇస్తాను అని చెప్పాను. .... పది రోజుల క్రితం నువ్విచ్చిన డబ్బులు ఇంకా అలాగే ఉన్నాయి బాబు అవసరమైనప్పుడు నేను అడిగి తీసుకుంటానులే నువ్వేమీ గాభరా పడొద్దు అని చెప్పింది.
మేము భోజనాలు పూర్తి చేసి అన్నీ రెడీ చేసుకుని కార్ లో బయలుదేరాము. కిషోరీ లాల్ గాడి అడ్డాకి కొంచెం దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి తార మా అందరికీ గన్స్ మ్యాగజైన్స్, క్లోరోఫామ్ కలిపిన నాప్కిన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయగా ఎవరికి వారు అన్ని సిద్ధం చేసుకుని అక్కడినుంచి నడుచుకుంటూ ఆ వీధి ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము. బయట రోడ్డు మీద వీధికి అటు చివర ఇటు చివర ఇద్దరేసి మనుషులు గస్తీ కాస్తున్నారు. రోడ్డుమీద కావడంతో వెపన్స్ చేతిలో లేవు బహుశా లోపల ఎక్కడైనా దాచుకొని ఉండొచ్చు. నేను జెస్సి సోము వైపు చూసి, గయ్స్ మీరిద్దరూ వెనుక వీధిలో నుంచి వెళ్లి అటువైపునుంచి ఎంటర్ అవ్వండి నేను తార ఇట్నుంచి ఎంటర్ అవుతాము. క్విక్,, అని అనగానే సోము, జెస్సి గబగబా నడుచుకుంటూ వెనుక వీధిలో నుంచి వెళ్లి ఈ వీధి ఎంట్రన్స్ దగ్గరకు చేరుకోగానే ఇటునుంచి నేను తార ముందుకు అడుగులు వేశాము.
మా వైపు నుంచి ఇద్దరూ మనుషులు ముందుకు నడుస్తూ ఉండడంతో మేము చప్పుడు చేయకుండా వాళ్ళ వెనక ఫాలో అయ్యాము. అటునుంచి జెసి సోము కూడా అటు నుంచి ఇటు వస్తున్న ఇద్దరిని ఫాలో అవుతున్నారు. సరిగ్గా ఒక ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్న పాయింట్ చేరుకునేసరికి నేను అందరికీ సిగ్నల్ ఇచ్చాను. అదే సమయంలో అటు నుంచి వస్తున్న వ్యక్తులు మమ్మల్ని ఇటు నుంచి వెళ్తున్న వ్యక్తులు సోము జెస్సిలను చూశారు. ఏయ్,, ఎవర్రా మీ,,,,, అన్న పిలుపు అక్కడితోనే ఆగిపోయింది. వాడు చాలా బాగా లేట్ అయిపోయాడు ఎందుకంటే అప్పటికే మేము నలుగురం ఆ నలుగురి ముక్కులను క్లోరోఫామ్ నాప్కిన్స్ తో మూసేయడంతో వాళ్లు కిక్కురుమనకుండా కొంచెం పెనుగులాడుతూ స్పృహ తప్పి కింద పడ్డారు.
అందర్నీ మోసుకుని ఆ ఖాళీగా ఉన్న ఇంట్లోకి లాక్కెళ్ళి పడేసి తిరిగి బయటకు వస్తుండగా తార ఆపి, లోపల ఎంత మంది ఉన్నారో మనకు ఎంత టైం పడుతుందో తెలియదు. సో క్లోరోఫామ్ ని ఎంతవరకు నమ్మగలం వీళ్ళని లేపేస్తే పోలా? అంటూ తన గన్ తీసి సైలెన్సర్ బిగించింది. .... నీ సరదా ఎందుకు కాదనాలి మ్,, కానియ్ అని జెస్సి నవ్వుతూ అనడంతో తార నాలుగు బుల్లెట్లు వాళ్ల నుదుటి మధ్యభాగంలో దింపేసింది. ఆ తర్వాత మేము నలుగురం బయటికి వచ్చి ఆ ఇంటి డోర్ దగ్గరకు వేసాము. ఇక మిగిలిన యాక్షన్ అంతా కిషోరీ లాల్ గాడి అడ్డా కాంపౌండ్ లోపల జరుగుతుంది కాబట్టి క్లోరోఫామ్ నాప్కిన్స్ జాగ్రత్త చేసుకుని లోపల సీసీ కెమెరాలు ఏమైనా ఉంటాయేమోనని మా మొహాలు కనబడకుండా మాస్కులతో జాగ్రత్తపడి గన్స్ చేతబట్టి బ్లూటూత్ లో నలుగురం కనెక్ట్ అయ్యి ఆ కాంపౌండ్ గేట్ దగ్గరకు చేరుకుని ఇటు ఇద్దరం ఆటు ఇద్దరం నిల్చొని యాక్షన్ పార్ట్ కి రెడీ అయ్యాము.
నేను కొంచెం తల పక్కకి తిప్పి లోపలికి చూడగా తుమ్మ మొద్దుల్లాగా నల్లగా బాగా బలిసి ఉన్న నలుగురు వ్యక్తులు ధీమాగా నడుచుకుంటూ గేటు వైపు వస్తున్నారు. లోపల బిల్డింగ్ 20 అడుగుల దూరంలో ఉండడం వల్ల బహుశా గేట్ దగ్గర నుంచి బిల్డింగ్ వరకు పహారా కాస్తున్నారు అని అనిపించింది. నేను వెనక్కి తగ్గి సైలెంట్ గా బ్లూటూత్ లో మాట్లాడుతూ, గయ్స్ గేట్ లోపల నలుగురు పహారా కాస్తున్నారు ఎందుకైనా మంచిది గన్స్ కి సైలెన్సర్లు బిగించండి అని చెప్పి మిగిలిన ముగ్గురు గన్స్ కి కూడా సైలెన్సర్లు బిగిస్తుండగా బిల్డింగ్ లోపల్నుంచి ఎవరో మాట్లాడుతూ, ఒరేయ్ ఆ బయట నలుగురు కనబడటం లేదు ఒకసారి చూడండి అన్న మాట చాలా దూరం నుంచి వినపడింది. అంటే వీళ్ళు నలుగురు ఇప్పుడు బయటికి వస్తారు అని మేము అలర్ట్ అయ్యాము. వాళ్ళు నలుగురు గేటు తెరుచుకుని నాలుగడుగులు బయటకు వేసి నలువైపులా చూడటానికి తిరిగారు.
వాళ్ల చేతిలో గన్స్ ఉండటంతోవెంటనే మేము నలుగురం అలర్ట్ అయ్యి వాళ్లను షూట్ చేసాము. నేను తార సోము సరిగ్గా షూట్ చేయడంతో ముగ్గురు కిక్కురుమనకుండా కింద పడ్డారు. కానీ జెస్సీ షూట్ చేసిన వ్యక్తి కొంచెం తప్పుకోవడంతో బుల్లెట్ వాడి చెవికి మాత్రమే తగిలి తప్పించుకున్నాడు. వెంటనే వాడు ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో జెస్సీ ఒక మొగ్గ వేసి బుల్లెట్ తగలకుండా తప్పించుకున్నాడు. ఇంతలో సోము షూట్ చేసి ఆ ఫైరింగ్ చేస్తున్న వ్యక్తిని లేపేసాడు. కానీ వాడు ఫైర్ చేసినప్పుడు వచ్చిన శబ్దం విని పైన మేడమీద గస్తీ కాస్తున్న ఒక వ్యక్తి చివరికి వచ్చి కిందకి చూశాడు. పైన కూడా గస్తీ తిరిగే వ్యక్తులు ఉంటారని నాకు ముందే తెలుసు కాబట్టి నేను అలర్ట్ అయ్యి పై నుంచి కిందకు చూస్తున్న వ్యక్తిని షూట్ చేశాను దాంతో వాడు అక్కడే కుప్పకూలాడు. కానీ నేను ఊహించని విధంగా మరో వ్యక్తి పై నుండి నావైపు షూట్ చేయడంతో వెంటనే నేను గోడ చాటున నక్కి బుల్లెట్ నుంచి తప్పించుకున్నాను.
కానీ అంతలోనే మా వైపు నుంచి మరో బుల్లెట్ పేలిన శబ్దం విని చూసేసరికి జెస్సీ పైనుంచి నా వైపు కాల్పులు జరుపుతున్న వ్యక్తిని షూట్ చేసి పని పూర్తి చేశాడు. కానీ బయట జరుగుతున్న ఈ ఫైరింగ్ శబ్దానికి లోపల ఉన్న కిషోరీ లాల్ గాడు ఉలిక్కిపడినట్టున్నాడు. ఈ టైంలో తన అడ్డా పైకి అటాక్ చేయగలిగినంత దమ్ము ఎవరికుంది అని తన ప్రధాన అనుచరుడు చాంగ్ ని పిలిచి బయట ఏం జరుగుతుందో చూసి రమ్మని పంపినట్టున్నాడు. ఈ లోపల మేము కిందపడిన నాలుగు శవాలను గేటు లోపలికి లాక్కొచ్చి పడేసి ప్రధాన ద్వారం వైపు వెళ్తుండగా లోపల ఎక్కడో దూరం నుంచి డోర్ క్లోజ్ చేసుకుంటూ ఎవరో బయటికి వస్తున్నట్టు అనిపించింది. జెస్సి,, నువ్వు తార కలిసి బయటనుంచి బిల్డింగ్ పైకి వెళ్ళి పై నుంచి నరుక్కురండి. నేను సోము కిందనుండి చూసుకుంటూ వస్తాము అని చెప్పాను.
వెంటనే జెస్సి తార గేట్ లో నుంచి బయటికి పరుగెత్తి ఈ బిల్డింగ్ పక్కన ఉన్న మరో బిల్డింగ్ లోకి వెళ్లి ఆ బిల్డింగ్ మేడ మీదకి చేరుకుని ఈ బిల్డింగ్ మీదికి దూకారు. కానీ అక్కడ మరో వ్యక్తి కింద కాల్పులు విని తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో పిట్టగోడ దగ్గర నక్కి జెస్సీ, తార ఈ మేడ మీదికి దూకడం వాళ్ల మీద ఫైరింగ్ ఓపెన్ చేసేటప్పటికి అది గమనించిన జెస్సీ వెంటనే వాడిని సూట్ చేశాడు. జెస్సి పిట్టగోడ దగ్గరకు వచ్చి మేము ఓకే,, అని చెప్పడంతో నేను సోము వైపు చూసి గేటు క్లోజ్ చేయమని చెప్పాను. వెంటనే సోము గేటు క్లోజ్ చేసి ఇద్దరం ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకొని నేను సోము బ్యాక్ కవర్ చేస్తూ డోర్ ఓపెన్ చేయమని చెప్పాను. సోము ప్రధాన ద్వారాన్ని ఇలా ఓపెన్ చేసాడో లేదో వెంటనే సోము చాతిమీద ఒక గట్టి కిక్ తగిలి వెనక్కి తూలి నా మీద పడ్డాడు వెంటనే నేను సోము కింద పడకుండా పట్టుకున్నాను. కానీ నా చేతిలో ఉన్న గన్ కింద పడింది.
మాకు ఎదురుగా మంచి బాడీతో ఒక చైనీస్ ఫైటర్ ప్రత్యక్షమయ్యాడు. వాడి అవతారం చూస్తే ఎదుటి వ్యక్తులను ఏ కీలుకి ఆ కీలు ముక్కలుముక్కలుగా విరుచి పడేసే స్ట్రీట్ ఫైటర్ అని తెలిసిపోతుంది. వీడే కిషోరీ లాల్ గాడి ప్రధాన రక్షకుడు చాంగ్. వాడిని చూస్తూనే నేను సోముని పక్కకి జరిపి నిల్చోబెట్టాను. ఇప్పుడు నేను ఆ చాంగ్ గాడికి ఎదురుగా ఉండడంతో వాడు వెంటనే తన వేగాన్ని చూపిస్తూ నామీద ట్విస్టింగ్ కిక్ లతో విరుచుకుపడ్డాడు. కానీ లోపల జెస్సి తార ఎటువంటి స్థితిలో ఉన్నారో అన్న ఆలోచన రావడంతో నేను వీడు విసురుతున్న ప్రతి కిక్ నుంచి తప్పించుకుంటూ పోతున్నా కూడా వాడు మాత్రం ఆపకుండా నా మీద కిక్ ల వర్షం కురిపిస్తున్నాడు. వెంటనే నేను సోముని అలర్ట్ చేస్తూ, సోము నువ్వు లోపలికి వెళ్లి జెస్సి తారలకు హెల్ప్ చెయ్ నేను వీడి సంగతి చూసుకుంటాను అని చెప్పాను. .... సోము మాట్లాడుతూ, కానీ నువ్వు ఒక్కడివే వీడిని,,, అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా, నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళు అని గట్టిగా చెప్పడంతో ఓకే ఓకే,, అంటూ లోపలికి పరిగెత్తి వెళ్ళాడు.
**********
అక్కడ జెస్సీ తార పైనుంచి మెట్లు దిగుతూ కింద కనబడ్డ మరో ఇద్దరిని షూట్ చేయడంతో వాళ్లు అక్కడే కుప్పకూలారు. ఆ తర్వాత జెస్సి తార కలిసి ఆ ఫ్లోర్ లో ఉన్న ప్రతి రూమ్ చెక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే మరో ఇద్దరు వ్యక్తులు జెస్సీ మరియు తారల బుర్రలకు వెనుక నుంచి గన్ ఆనించి పెట్టి, మీ చేతిలో ఉన్న గన్స్ కిందపడేయండి లేదంటే పిట్టలు రాలినట్టు రాలిపోతారు అని వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా అదే సమయానికి ఆ ఫ్లోర్ కి చేరుకున్న సోము దూరం నుంచి ఆ సీన్ చూసి చప్పుడు చేయకుండా దగ్గరకు వెళ్లి గన్స్ గురిపెట్టి ఉన్న ఇద్దరు వ్యక్తుల మీదకి దూకి గట్టి ఫ్లయింగ్ కిక్ లు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ కింద పడటంతో, నీ యబ్బ,, నా తార, నా బెస్ట్ ఫ్రెండ్ జెస్సీలకే గన్స్ పెడతారా? ఉండండిరా మీ పని చెప్తాను అని ఆవేశంతో ఊగిపోతూ వాళ్ళిద్దర్నీ తన గన్ తో షూట్ చేశాడు.
తార నువ్వు ఓకే కదా? ఏరా జెస్సీ నువ్వు? అని అడిగాడు సోము. .... మేము ఓకే,,, అని ఇద్దరూ ఒకేసారి సమాధానం చెప్పారు. సోము మాట విని జెస్సీ తనలో తానే నవ్వుకుంటూ ఉండగా తార మాత్రం కొంచెం షాకింగ్ రియాక్షన్ తో సోము వైపు చూసింది. ఎందుకంటే ఇందాక సోము ఆవేశంతో ఊగిపోతూ కాల్చి పడేసిన వారితో "నా తార" అని అన్నాడు. కానీ అంతలోనే, తొందరగా పదండి ఆ కిషోరీ లాల్ గాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. కింద DD ఆ చైనీస్ ఎదవతో తలపడుతున్నాడు అని సోము అనడంతో ముగ్గురు అక్కడి నుంచి కదిలి ప్రతి రూమ్ చెక్ చేయడం మొదలుపెట్టారు. రూములు వెతుకుతూ ఒకరినొకరు కవర్ చేసుకుంటూ అక్కడక్కడ నక్కి బయటికి వస్తున్న రౌడీలు అందర్నీ లేపేస్తున్నారు. పై ఫ్లోర్ అయిపోగానే కింద ఫ్లోర్ కి చేరుకొని అన్ని రూములు పూర్తి చేశారు. ఇంతవరకు కిషోరీ లాల్ గాడు ఎక్కడా కనపడలేదు.
ఇక మిగిలింది ఒక్క రూమ్ మాత్రమే కావడంతో ముగ్గురు అలర్ట్ అయ్యి ఆ రూము ద్వారానికి అటూ ఇటూ నిల్చున్నారు. సోము చప్పుడు చేయకుండా ఆ రూమ్ డోర్ హ్యాండిల్ పట్టుకొని నెమ్మదిగా తిప్పి డోర్ ని గట్టిగా కాలితో తన్ని పక్కకి జరిగాడు. డోర్ తెరుచుకున్న వెంటనే లోపల నుంచి వరుసగా బుల్లెట్ల వర్షం కురిసింది. దాదాపు పది పన్నెండు బుల్లెట్లు వరుసగా వచ్చి ఆగిన తర్వాత వీళ్లు ముగ్గురూ ఒకేసారి లోపలికి ఎంటర్ అయ్యి టపటపా నాలుగు బుల్లెట్లు ఫైర్ చేసి కిషోరీ లాల్ కి రక్షణగా ఉన్న నలుగురు రౌడీలను లేపేశారు. వెంటనే మరో రెండు బుల్లెట్లు ఫైర్ చేసి సరిగ్గా కిషోరీ లాల్ కాళ్లు షూట్ చేసి వాడిని కదలకుండా చేశారు. వెంటనే జెస్సి మరియు సోము క్లోరోఫామ్ నాప్కిన్ తో వాడు స్పృహ కోల్పోయేలా చేశారు. వెంటనే గబగబా వాడిని ఒక దుప్పట్లో చుట్టి జెస్సి తన భుజం మీద ఎత్తుకోగా ముగ్గురు బయటికి నడిచారు.
**********
అక్కడ ముగ్గురు వాళ్ళ పనిలో ఉండగా ఇక్కడ చాంగ్ గాడు నాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసబెట్టి కిక్కుల మీద కిక్కులతో విరుచుకుపడుతున్నాడు. నేను వాడి కిక్కులను బ్లాక్ చేస్తున్నాను కానీ తిరిగి వాడి మీద దాడి చేయడానికి టైం దొరకడం లేదు. ఇలాగే సాగుతూ పోతే దీనికి అంతం ఉండదు తొందరగా వీడి పని ముగించాలి అని అనుకున్నాను. వాడు మాత్రం కంటిన్యూగా నా మొహం మరియు ఛాతి మీద పంచులు కిక్కులతో నన్ను టార్గెట్ చేస్తూ పోతున్నాడు. మరి కొంతసేపు వాడి అటాక్ ని బ్లాక్ చేస్తూ పోయి ఒకసారి వాడు విసిరిన కిక్ తప్పించుకుని ఒక అడుగు వెనక్కి వేసి వెంటనే ముందుకు కదిలి వాడి కడుపులో ఒక బలమైన కిక్ ఇచ్చాను. ఆ దెబ్బతో వాడు వెనక్కి పడ్డాడు. కానీ వెంటనే మరింత వేగంగా చేతులు వెనక్కి నేల మీద పెట్టి ఎగిరి లేచి నిల్చున్నాడు.
వెంటనే వాడు మళ్ళీ రెడీ అయ్యి నామీద ఎటాక్ ప్రారంభించాడు. కానీ ఈ సారి నేను అందుకు సిద్ధంగా ఉన్నాను. వాడు నా మీదకు ఉరికి ఫ్లయింగ్ కిక్ ఇస్తుంటే నేను పక్కకు జరిగి దాని నుంచి తప్పించుకొని వెనక్కి తిరుగుతూ వాడి వీపు మీద ఒక కిక్ ఇచ్చేసరికి వేగంగా ముందుకు వెళ్లి గేటు మీద పడ్డాడు. ఆ సమయాన్ని అనుకూలంగా తీసుకుని నా కాలి దగ్గర సాక్స్ లో పెట్టుకున్న నైఫ్ బయటకు తీసి రెడీగా ఉన్నాను. తిరిగి చాంగ్ గాడు నా దగ్గరికి వచ్చి నా మీద ఒక పంచ్ విసిరాడు. అందుకు సిద్ధంగా ఉన్న నేను వాడి చేతిని పట్టుకొని మెలిపెట్టి తిప్పి మరో చేతిలో ఉన్న చాకుతో వాడి మెడ మీద పొడిచాను. ఆ తర్వాత వాడి చేతి కింద రిబ్స్ లో ఒకటి మరొకటి వాడి కిడ్నీ భాగములోను చివరిగా వాడి ముందర భాగం గుండె దగ్గర వరుసగా పొడిచాను. అంతవరకు అరవీరభయంకరంగా నాతో తలపడిన వాడు వెంటనే పైకి టికెట్టు తీసుకున్నాడు.
అంతవరకు పైన జరుగుతున్న బాగోతం బ్లూటూత్ లైవ్ లో వింటున్న నేను, గయ్స్ తొందరగా వాడిని తీసుకువచ్చే పని చూడండి నేను వెళ్లి కార్ తీసుకొస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుకొని వెళ్లి కార్ తీసుకొచ్చి కిషోరీ లాల్ ఇంటి గేటు ముందు రెడీగా ఉంచాను. సరిగ్గా అదే సమయానికి దుప్పటిలో చుట్టిన వాడివి మోసుకుంటూ ముగ్గురు కార్ దగ్గరికి చేరుకున్నారు. సోము డిక్కీ ఓపెన్ చేయగా జెస్సీ కిషోరీ లాల్ గాడి బాడీని డిక్కీలో పడేసి క్లోజ్ చేసాడు. ఇంతలో తార అక్కడ పడి ఉన్న నా గన్ మరియు చాకు తీసుకుని ఒకసారి చుట్టూ పరికించి చూసి ముగ్గురు వచ్చి కార్లో కూర్చున్నారు. వెంటనే నేను కారును అక్కడి నుంచి ముందుకు ఉరికించాను. ఇంతవరకు జరిగిన కాల్పుల మోతకి ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో నుంచి జనం బయటికి వచ్చి తమాషా చూస్తున్నారు. కానీ మేము మాస్కులతో ఉండడంతో మమ్మల్ని ఎవరూ గుర్తు పట్టే అవకాశం లేదు. తార నేను చెప్పిన పని అయిందా? అని అడగగా, అంతా ఓకే DD డోంట్ వర్రీ,,, అని అంది.
మేము అక్కడి నుంచి కిషోరీ లాల్ గాడిని ఎత్తుకొచ్చేసాం కానీ మమ్మల్ని అడ్డగించే ధైర్యం ఎవరూ చేయలేదు. వేగంగా డ్రైవ్ చేసుకుంటూ మేము ఆ ఏరియా నుంచి బయటపడి నేరుగా వర్క్ స్టేషనుకి వచ్చేసాము. తార దిగి గేట్ ఓపెన్ చేయగా నేను కారుని లోపలికి పోనిచ్చాను. వెంటనే అందరం కిందకి దిగి గబగబా డిక్కీ ఓపెన్ చేసి కిషోరీ లాల్ గాడి బాడీని మోసుకుని లోపలికి తీసుకెళ్ళాము. నేరుగా సౌండ్ ప్రూఫ్ టార్చర్ రూమ్ లోకి తీసుకువెళ్లి కిషోరీ లాల్ గాడిని దుప్పట్లో నుంచి విముక్తి చేసి కింద పడేసాము. వాడి కాళ్ళ మీద తగిలిన బుల్లెట్లు బయటకు కనబడుతూ ఉండడంతో వెంటనే మేము మెడికల్ కిట్ తీసుకొని ఆ బుల్లెట్లు బయటకు తీసి పడేసాము. వాడు క్లోరోఫామ్ మత్తులో ఉండడంతో మేము బుల్లెట్లు తీసిన సంగతి కూడా వాడికి తెలియకుండా సునాయాసంగా జరిగిపోయింది. ఆ తర్వాత తార వాడికి ఎక్కువ రక్తం పోకుండా రెండు కాళ్ళకి బ్యాండేజి గట్టిగా చుట్టింది.
**********
ఇక్కడ వీళ్ళు ఈ పనిలో ఉండగా అక్కడ ఇన్స్పెక్టర్ రుద్ర కిషోరీ లాల్ గాడి అడ్డా దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ జరిగిన కాల్పుల హడావిడికి ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయడంతో కిషోరీ లాల్ ని అరెస్టు చేయడానికి రుద్ర అక్కడకు చేరుకున్నాడు. కానీ అక్కడ జరిగిన బీభత్సాన్ని చూసి షాక్ తో మైండ్ బ్లాంక్ అయిపోయింది. దానికితోడు అక్కడ కూడా DD అనే సిగ్నేచర్ చూసి, ఇంతకీ ఈ DD ఎవడ్రా బాబు నాకు రంకుమొగుడు లాగా తయారయ్యాడు అని మనసులోనే అనుకున్నాడు. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని అంబులెన్సులను పిలిపించి అక్కడ పడి ఉన్న శవాలను గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించి ఒకసారి ఆ అడ్డా మొత్తాన్ని శోధించి ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో తిరిగి అక్కడి నుంచి బయల్దేరాడు.
**********
మేము కొంచెం ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్లీ లోపలున్న కిషోరీ లాల్ దగ్గరకు చేరుకున్నాము. నేను వాడిని స్పృహలోకి తీసుకు రావడానికి ప్రయత్నం చేశాను. వాడి మొహాన నీళ్లు కొట్టి అటు ఇటు రెండు దవడల మీద నాలుగు పీకి కిషోరీ లాల్,,, కిషోరీ లాల్,,, అని పిలచాను. .... ఒంటిపైన గాయాల నొప్పికి తాళలేక కొంచెం బాధగా అరుస్తూ భయంగా నా వైపు చూసి, ఎవరు నువ్వు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? అని అడిగాడు. .... నేను కొంచెం కోపంగా, చుప్,, చుప్,, నోర్ముయ్,,, ఇక్కడ నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే నువ్వు సమాధానం చెప్పాలి అని అన్నాను. .... అసలు ఎందుకు ఇదంతా? అని అడిగాడు. .... నేను మళ్ళీ వాడికి దగ్గరగా వెళ్లి చాచిపెట్టి వాడి చెంప మీద గట్టిగా ఒకటి పీకాను. ఆ దెబ్బకి వాడు కుర్చీతో సహా కిందపడ్డాడు. నేను వాడి దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చున్నాను.
నేను కొంచెం కోపంగా గట్టిగా మాట్లాడుతూ, ఇక్కడ నేను అడిగిన ప్రశ్నలకు మాత్రమే నువ్వు సమాధానం చెప్పాలి అని చెప్పానా? అది తప్ప నీ నోట్లో నుంచి ఒక్క ముక్క కూడా బయటికి రావడానికి వీల్లేదు. నేను అంత సీరియస్ గా వ్యవహరించడంతో పక్కన నిలుచుని చూస్తున్న ముగ్గురు కూడా కొంచెం షాక్ తిన్నారు. ఎందుకంటే ఇంతకుముందెప్పుడూ వాళ్లు నన్ను అంత సీరియస్ అవ్వడం చూడలేదు. వెంటనే సోము, జెస్సీ వచ్చి చైర్ తో సహా వాడిని పైకి లేపి సరిచేశారు. వెంటనే నేను వాడి ఎదురుగా నిల్చుని, ఓకే,, ఇప్పుడు నేను అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పు, నువ్వు కార్తీకవర్మని ఎందుకు చంపాలనుకున్నావు? అని అడిగాను. .... కార్తికవర్మ ఎవరు? అని అన్నాడు కిషోరీ లాల్. .... టాప్ 10 బిజినెస్ మ్యాన్ లలో ఒకరైన దినేష్ వర్మ గారి కూతురు కార్తీకవర్మ అని అన్నాను. .... కానీ ఆ విషయంతో నీకేం సంబంధం? అని అడిగాడు.