Episode 110.1


మరుసటి రోజు పొద్దున్న జాగింగ్ జిమ్ అంతా పూర్తయిన తర్వాత రుద్ర ఇచ్చిన ఫైల్ లోని మిగిలిన రెండు కేసుల గురించి జెస్సీ, సోము లకు వివరించి వారిద్దరి గురించి రెక్కీ చేయమని చెప్పాను. అన్నీ కుదిరినప్పుడు మూడో కంటికి తెలియకుండా వాళ్లను లేపేయమని చెప్పాను. కానీ పొరపాటున కూడా ఇద్దరినీ ఒకేసారి చంపొద్దని కనీసం ఒక్క రోజైనా గ్యాప్ ఉండేటట్టు చూసుకోమని, పని పూర్తి అయిన వెంటనే డీటెయిల్స్ మొత్తం నాకు వెంటనే చెప్పమని వాళ్లతో చెప్పాను. ఆ తర్వాత నిన్న చెప్పిన పని గురించి ఏం చేశారు? అని అడిగాను. .... ఆల్రెడీ డిటెక్టివ్స్ ఆ పనిలోనే ఉన్నారు సాయంత్రం వరకు మనకి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి అని చెప్పాడు జెస్సీ. .... ఓకే గుడ్,, నేను కాలేజీకి వెళ్తాను మళ్లీ మనం సాయంత్రం కలుసుకుందాం అని చెప్పి నేను నా రూమ్ కి వచ్చి తయారయ్యి కాలేజీకి వెళ్లాను.

ఈ రోజు కూడా అను మాటిమాటికి నన్నే చూస్తూ గమనిస్తూ వుంది. జ్యోతి మాత్రం మామూలుగానే శ్రద్ధగా క్లాసులు వింటోంది. బ్రేక్ టైంలో నాకు అరుణ దగ్గర నుంచి కాల్ వచ్చింది. నేను కొంచెం పక్కకు వెళ్లి కాల్ లిఫ్ట్ చేసి అరుణతో మాట్లాడగా, కర్మకాండలు సజావుగా పూర్తయ్యాయి ఈరోజు ఆచారాల ప్రకారం మూలకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందని మరో రెండు రోజులు అక్కడే ఉండి చిన్న చిన్న పనులు పూర్తిచేసుకుని ఆదివారం సాయంత్రానికి వైజాగ్ వస్తాను అని చెప్పింది. తనకు ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయమని బాయ్ చెప్పి తిరిగి అను జ్యోతిల దగ్గరకు వచ్చాను. నేను ఫోన్ మాట్లాడుతున్నంత సేపు అను నా వైపు చూస్తూనే ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. ఓయ్ ఏంటది?? రెండు రోజుల నుంచి చూస్తున్నాను మాటిమాటికి నా వైపే చూస్తున్నావు నేను చూస్తే మొహం తిప్పుకుంటున్నావు ఏం సంగతి? అని అనుని ఉద్దేశించి అడిగాను.

నేనేమీ నిన్ను చూడలేదు నీకే అలా అనిపిస్తుంది కాబోలు ఈమధ్య కొత్త కొత్త స్నేహాలు కొత్తవారితో తిరుగుళ్ళు పాత వారితో ఫోన్లు,,, సార్ చాలా బిజీ అయిపోయారు కదా అందుకే లేనివి ఉన్నట్టు ఊహించుకుంటున్నారు అని కొంచెం ఎటకారంగా అంటూ ఎద్దేవా చేసింది. .... తనకి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు అని అను ఫీల్ అవుతున్నట్టు నాకు అర్థమైంది. పైగా పాత వారితో ఫోన్లు అన్న పదాన్ని కొంచెం నొక్కి పలికింది అంటే నేను ఇప్పుడు అరుణతో ఫోన్లో మాట్లాడిన విషయం బాగానే పసిగట్టింది అని కూడా అర్థమైంది. నేను చిన్న స్మైల్ ఇచ్చి, ఏం చేయమంటావు చెప్పు పరిస్థితులు అలా డిమాండ్ చేస్తున్నాయి మరి అని సరదాగా అన్నాను. .... అవునవును నీ గురించి డిమాండ్ బాగా పెరిగింది అందుకే మా లాంటి వాళ్ళం అస్సలు కనబడటం లేదు నీకు అని మళ్ళీ దీర్ఘం తీసింది. .... అబ్బా,, మళ్లీ మొదలెట్టారా మీరిద్దరూ, ఏంటి అన్నయ్య నువ్వు కూడా అప్పుడప్పుడు దీనికి ఫోన్ చేస్తే ఏం పోయింది అని అంది జ్యోతి.

ఫోనా,, ఎందుకు? అని సరదాగా అడిగాను. .... దాంతో అనుకి చిర్రెత్తుకొచ్చింది. చెప్పాను కదా మనం అసలు లెక్కలోకే రాము అయ్యగారికి అని నా వైపు కోపంగా చూసింది. .... నేను ఇంకా నవ్వుతూ, ఏంటిది అను చిన్న పిల్లలాగా? ఫోన్ చేయలేదు అని అలుగుతున్నావా? ప్రతిరోజు కలుస్తున్నాం కదా మళ్లీ ఫోన్ ఎందుకు? పొద్దున్న పార్కులో కలుస్తావు, ఈ టైంలో కాలేజీలో కలుస్తావు, ఇంచుమించుగా కొద్ది రోజుల నుంచి మధ్యాహ్నం కలిసి భోజనం చేస్తున్నాం ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది? అని కావాలనే కెలికాను. .... నా వైపు గుడ్లురిమి చూస్తూనే మనసులో నన్ను తిట్టుకుంటూ మళ్లీ తనే కొంచెం కూల్ అయినట్టు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఏమీ ఉండవులే నువ్వు లైట్ తీసుకో, పదవే జ్యోతి క్లాస్ కి టైం అయింది అని చెప్పి క్లాస్ లో దూరింది. నేను కూడా నవ్వుకుంటూ వాళ్ల వెనకాలే క్లాస్ లోకి వెళ్ళాను.

క్లాస్ పూర్తయిన తర్వాత ఈరోజు క్యాంటీన్లో భోజనం చేయకుండా ముగ్గురం కలిసి పార్కింగ్ ఏరియాకి వచ్చాము. నా కార్ అక్కడ ఉండడం చూసి, ఎంటన్నయ్య ఈరోజు కార్ లో వచ్చావు కాలేజికి అని అడిగింది జ్యోతి. .... నిన్నంతా కొన్ని పనులతో బిజీగా ఉండడం వలన ఇంటికి వెళ్లే తీరిక లేక కార్ నా దగ్గరే ఉండిపోయింది. బహుశా ఇకమీదట ఎక్కువగా కార్లోనే తిరగాల్సి వస్తుందేమో అని అన్నాను. .... ఇంతలో అను జ్యోతిని వెనకనుంచి గోకుతూ నన్ను ఏదో అడగమంటున్నట్టు సిగ్నల్ ఇస్తోంది. వెంటనే జ్యోతి మాట్లాడుతూ, సరే గాని అన్నయ్య మమ్మల్ని నీ ఆఫీసుకి ఎప్పుడు తీసుకెళ్తున్నావు? అని అడిగింది. .... ఈ ప్రశ్న జ్యోతిది కాదు అని నాకు అర్థం అయ్యి అను వైపు చూసి చిన్న నవ్వు నవ్వుతూ, నా ఆఫీసు చూడటానికి అంత తొందర ఏమిటో? అని అడిగాను. .... అను ఏమీ మాట్లాడలేదు గానీ, అదేంటి అన్నయ్య నువ్వే కదా తీసుకుని వెళ్తాను అని చెప్పావు? అని అంది జ్యోతి. .... మ్,, అన్నాననుకో,,, అని కొంచెం ఆలోచించి, శనివారం సాయంత్రం వెళ్దాం అని అన్నాను. ఆ మాట విన్న వెంటనే అను లోలోపల నవ్వుకోవడం నా కంట పడింది. నేను కూడా మనసులోనే నవ్వుకొని ఇద్దరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి బయల్దేరాను.

కార్లో వెళ్తూ, అను రాను రాను నా మీద ఆశలు పెంచుకుంటుంది. తనకు నా మీద ఆశలు కలగకుండా ఎంత దూరంగా ఉందామని ప్రయత్నించినా ఏదో ఒక విధంగా దగ్గరగానే ఉండాల్సి వస్తోంది. ఒకవేళ నేను దూరంగా ఉన్నా అను మాత్రం నన్ను నా నీడలా నా వెంటే ఉంటుంది. ఒక్కొక్కసారి తనకి దూరంగా ఉండి నేనే తప్పు చేస్తున్నానేమో అని నాకే అనిపిస్తుంది. మంచి అమ్మాయి నా మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంది తనంటే నాకు కూడా ఇష్టమే కానీ నేను చేసే పనులకి అను ప్రేమకి నేను అర్హుణ్ణి కాను అని నా మనసు నన్ను హెచ్చరిస్తుంది. దానికి తోడు నేను ఎప్పుడు ఎటువంటి సంకట స్థితిలో ఉంటానో నాకే తెలీదు అటువంటప్పుడు ఆ అమ్మాయికి తోడుగా ఎలా ఉండగలను? ఇలా మనసులో పరిపరివిధాల ఆలోచనలు పరిగెడుతుంటే నా మొబైల్ రింగ్ అవడంతో కార్ పక్కకి ఆపి కాల్ చూడగా ఆడిటింగ్ ఆఫీస్ చీఫ్ నంబర్ కావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశాను.

తమ పని ముగిసిందని ఒకసారి ఆఫీసుకు వస్తే ఫైనల్ రిపోర్ట్ గురించి మాట్లాడుకోవచ్చు అని చెప్పడంతో సాయంత్రం ఆఫీసుకు వస్తానని చెప్పి కాల్ కట్ చేశాను. వెంటనే వాళ్లకు చెల్లించాల్సిన పది లక్షలు అమౌంట్ గుర్తొచ్చి నేరుగా వర్క్ స్టేషనుకి వెళ్లాను. లోపలికి వెళ్ళేసరికి ఎవరూ కనపడలేదు బహుశా నేను చెప్పిన పనిలో బిజీగా ఉన్నట్టున్నారు అనుకొని పార్వతి అమ్మ రూమ్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి లాకర్ లో ఉన్న రుద్ర ఇచ్చిన డబ్బులలో నుంచి 10 లక్షలు తీసి మళ్లీ అన్ని క్లోజ్ చేసుకుని బయటికి వచ్చి కార్లో పెట్టుకొని ఆకలిగా అనిపించడంతో ఒకసారి టైం చూసుకున్నాను. అమ్మ ఇంటికి వచ్చే టైం కావడంతో ఇంటికి వెళ్లి అమ్మతో కలిసి భోజనం చేద్దామని ఇంటికి బయలుదేరాను. అనుకున్నట్టుగానే ఇంటికి వెళ్లే టైంకి అమ్మ కూడా అప్పుడే వచ్చి భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది.

నేను రావడం చూసి లేచి నాకు ఎదురొచ్చి కౌగలించుకుని ముద్దు పెట్టి, బోంచేసావా నాన్న? అని ప్రేమగా అడిగింది. .... నేను కూడా అమ్మకి ముద్దు పెట్టి, నీతో కలిసి భోజనం చేయడానికే వచ్చాను అని అనడంతో, సరే అయితే తొందరగా వెళ్లి ఫ్రెష్ అయి రా ఈలోపు నేను వడ్డించేస్తాను అని అమ్మ కిచెన్ లోకి వెళ్ళింది. నేను కూడా రూమ్ లోకి వెళ్ళీ ఫ్రెష్ అయి వచ్చి అమ్మతో కలిసి భోజనం తినడం పూర్తిచేసి అమ్మ హాల్లోని సోఫాలో కూర్చోగా నేను అమ్మ ఒడిలో తల వాల్చాను. కొంతసేపు అమ్మతో కలిసి ఈ మధ్య జరిగిన చిన్న చిన్న విషయాలను మాట్లాడుకుంటూ గడిపేసరికి నా చిట్టి బంగారం కాలేజ్ నుంచి వచ్చేసి మా మీద పడింది. మరో పావుగంట సేపు ఇద్దరితో కలిసి సరదాగా గడిపి, బంగారం శనివారం సాయంత్రం నా ఆఫీసుకి తీసుకెళ్తాను రెడీగా ఉండు అని అన్నాను. .... ఓకే అన్నయ్య,, అంటూ నాకు ముద్దు ఇచ్చింది. ఆ తర్వాత నేను ఇద్దరికీ బాయ్ చెప్పి ఆడిటింగ్ ఆఫీసుకి బయల్దేరాను.

ఆడిటింగ్ ఆఫీసుకి చేరుకొని లోపలికి వెళ్ళేసరికి ఆడిటింగ్ చీఫ్ నన్ను అక్కడ ఒక ప్రత్యేకమైన రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ ప్రొజెక్టర్ ఒక పెద్ద టేబుల్ చుట్టూ కుర్చీలు అన్ని ఏర్పాటు చేసి ఉన్నాయి. మా ఇద్దరితో పాటు మరో వ్యక్తి కూడా ప్రాజెక్టర్ ఆపరేట్ చేయడానికి అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత సుమారు ఒక గంటపాటు మా కంపెనీ తాలూకా అకౌంట్స్ కి సంబంధించి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నాయో ఆ వివరాలు అన్నింటిని వివరంగా చెప్పారు. ఆ తర్వాత వాళ్లు గుర్తించిన కీ పాయింట్స్ గురించి కూడా చెప్పారు. ముఖ్యంగా వారు ఎంత తెలివిగా దోచుకున్నది కూడా చెప్పారు. వజ్రాల కంపెనీకి సంబంధించినంతవరకూ ఎక్కడ ఎటువంటి పొరపాట్లు చేసినట్టు కనబడకుండా ముడి సరుకు దిగుమతి, ఆ తర్వాత ప్రాసెసింగ్ మరియు ప్రొడక్షన్ చివరిగా ఎగుమతుల వరకు అన్ని ఎప్పటిలాగే ఉన్నట్టు జాగ్రత్తపడుతూ తరుగు విషయంలో మాత్రం మొదటి నుంచి కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వస్తూ చివరికి కొన్ని సంవత్సరాల నుంచి తరుగు లేనట్టు లెక్కలు చూపిస్తూ కోట్ల రూపాయలు మాయం చేసినట్టు తెలుస్తోంది.

అలాగే కాటన్ మిల్లుకి సంబంధించి సేల్స్ సెక్షన్ పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకొని తమకు అనుకూలంగా ఉండే కస్టమర్లకు డిమాండ్ సాకుగా చూపించి ప్రోడక్ట్ ని తక్కువ ధరలకు అమ్ముతున్నట్టు చూపిస్తూ డబ్బులు బాగా మళ్లించి ఉంటారని తెలుస్తుంది. అలాగే జువెలరీ షాప్ కి సంబంధించి అమ్మకాలలో మరియు నగల తయారీ కాంట్రాక్ట్ లో చాలా సొమ్ము నొక్కేసినట్టు కూడా తెలుస్తుందని వివరంగా చెప్పారు. ప్రజెంటేషన్ ముగిసిన తర్వాత ఆ వ్యక్తిని బయటకు పంపించి ఆడిటింగ్ చీఫ్ నాతో ప్రైవేట్ గా మాట్లాడుతూ, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ట్రాన్స్ పోర్ట్ కంపెనీకి సంబంధించి లెక్కలలో చాలా పెద్ద తేడాలు గమనించాము. వాళ్లు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం వెహికల్స్ కి పెద్ద గిరాకీ లేకపోవడంతో చాలావరకు వాహనాలు గ్యారేజ్ కే పరిమితం అవుతున్నట్టు చూపించారు.

ఆ విషయంలో మాకు చాలా డౌట్లు రావడంతో లెక్కలలో చూపించిన వెహికల్స్ నెంబర్ ప్లేట్ల ఆధారంగా వాటి రాకపోకలకు సంబంధించి టోల్గేట్ల సమాచారం ఆర్టీవో ఆఫీస్ లో మాకు తెలిసిన సోర్సెస్ నుంచి రికార్డ్స్ తెప్పించుకుని చూడగా వీళ్ళు రికార్డ్స్ లో చూపించిన గ్యారేజ్ లో నిలిచిన వాహనాలు అన్నీ సరిహద్దు రాష్ట్రాల మధ్య తిరుగుతున్నట్టు తెలిసింది. మా అంచనా కరెక్ట్ అయితే వీళ్ళు ఆ వాహనాలను ఏదో అక్రమ రవాణా కోసం వినియోగించుకుని ఉంటారని అనిపిస్తుంది. అవి మాదక ద్రవ్యాలు కావచ్చు లేదంటే ఇంకేమైనా అతి విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ దాని ద్వారా బాగా డబ్బు వెనకేసుకుని ఉండొచ్చు. అదేగనక జరిగి ఉంటే వాళ్ళు వందల కోట్ల రూపాయలు సంపాదించి ఉంటారు. లెక్కల ప్రకారం వాహనాలు తిరగలేదు అన్నది చాలా చిన్న విషయం కావచ్చు కానీ వాటితో వాళ్లు చేసిన పని వాళ్లకు బాగా డబ్బు తెచ్చిపెట్టి ఉండొచ్చు. ఈ విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవాలి అని చెప్పి ముగించారు.

ఆయన చెప్పిన వివరాలన్నింటినీ విన్న తర్వాత అన్ని రకాల ఫ్రాడ్స్ అంత తెలివిగా చేయొచ్చు అని నాకు మొట్టమొదటిసారి తెలిసింది. కాటన్ మిల్ మేనేజరు అంబిక గారు అనుమాన పడింది నిజమే అని ఈ రిపోర్టు చెబుతుంది. వజ్రాల కంపెనీ గురించి నాకు పెద్ద అవగాహన లేకపోవడంతో ఎంత సొమ్ము దారి మళ్ళి ఉంటుందో ఊహించుకోవడం కష్టమయ్యింది. ఇక పోతే నన్ను బాగా కలవరపెట్టిన అంశం ట్రాన్స్పోర్ట్ కంపెనీ. రికార్డుల్లో లేకుండా వాహనాలు వాడుకొని అక్రమ రవాణా ద్వారా వారు వందల కోట్లలో సంపాదించుకుంటారు అన్న విషయం నాకు మింగుడు పడడం లేదు. వాహనాలు వాడుకుంటే వాడుకున్నారు సరే ఒకవేళ ఆడిటింగ్ చీఫ్ చెప్పినట్టు వాటిని మాదకద్రవ్యాలు తరలించేందుకు వాడి ఉంటే కంపెనీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏ విధంగానూ ఉపేక్షించడానికి వీల్లేదు. ఈ మేనేజర్ మరియు అకౌంటెంట్ లకు బాగా బుద్ధి చెప్పాల్సిందే అని నిర్ణయించుకున్నాను.

ఆ తర్వాత ఆడిటింగ్ చీఫ్ తో మాట్లాడుతూ, థాంక్యూ వెరీ మచ్ సార్,, ఇంత తక్కువ టైంలో అన్ని పనులు పూర్తిచేసి నాకు చాలా పెద్ద సహాయం చేశారు. మీ మేలు ఎప్పటికీ మరువలేను అని అన్నాను. .... భలేవాడివి,, నీకు ఇంకా ఈ వ్యాపారాలు కొత్త కాబట్టి ఇది చాలా పెద్ద విషయంలా అనిపిస్తూ ఉండొచ్చు. మాకు ఇవన్నీ మామూలే. కాకపోతే నీది ఒక ప్రత్యేకమైన కేసు. వాళ్లు చాలా తెలివిగా కోర్టును కూడా బోల్తా కొట్టించగలిగారు. మనం వాళ్ల మీద కేసు వేసేవరకు కోర్టు కూడా ఈ లెక్కలను సరిగ్గా పట్టించుకోదు. వాళ్లు సమయానికి కోర్టుకు అన్ని సమర్పిస్తున్నారు అని మాత్రమే చూసి ఉంటుంది. ఇప్పుడు ఈ రిపోర్టు ఆధారంగా నువ్వు తిరిగి కోర్టుకు వెళ్లి మనకు అనుమానం ఉన్న ఇన్ని సంవత్సరాల లెక్కల మీద ఒక ఎంక్వయిరీ వెయ్యమని కోరవచ్చు. అయితే అటువంటి ఎంక్వయిరీలు ఎంత కాలానికి ఇటువంటి మోసాన్ని బయటపెడతాయి అన్నది మన చేతుల్లో లేదు. వాళ్లు కూడా చాలా తెలివైనవారు కాబట్టి డబ్బులు ఇచ్చి ఎంక్వయిరీ టీంని కొనేసి తమకు అనుకూలంగా మార్చుకొనే ఛాన్స్ కూడా లేకపోలేదు అని అన్నారు.

నేను కొంచెం ఆలోచించి, లేదు సార్ అనవసరంగా కోర్టులకు వెళ్లి సమయం వృధా చేసుకోవడం వేస్ట్ అని అనిపిస్తుంది. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది ఇకమీదట ఏం జరగాలో నేను స్వయంగా చూసుకోవాలి. అటువంటి వాళ్లను ఏం చేయాలో నేను చూసుకుంటాను. కానీ మీ నుంచి నాకు మరొక సహాయం కావాలి. మీరు ఒక పెద్ద ఆడిటింగ్ కంపెనీ చీఫ్ అందువలన మీకు తెలిసిన ఒక మంచి అకౌంటెంట్ ని నాకు రికమండ్ చేయగలరా? అని అడిగాను. .... దాందేముంది మీరు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే చాలా మంచి అకౌంటెంట్లు దొరికే అవకాశం ఉంది అని అన్నారు. .... నాకు అంత అనుభవం లేదు సార్ అందుకే మీకు తెలిసిన ఎవరైనా మంచి అకౌంటెంట్ ని నాకు ఏర్పాటు చెయ్యండి అని అడిగాను. .... ఆయన కూడా కొంచెం ఆలోచించి, సరే నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఆ మధ్య అతను తన వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నట్టు నాకు తెలిసింది నేను అతనితో ఒకసారి మాట్లాడి ఏ విషయం నీకు చెప్తాను అని అన్నారు.

థాంక్యూ వెరీ మచ్ సార్,,, ఐ థింక్,, మరిన్ని అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా రేపే నా కంపెనీ మేనేజర్ మరియు అకౌంట్లను కంపెనీ నుంచి సాగనంపేయాలి. .... నువ్వు మరీ అంత తొందర పడొద్దు. వాళ్ళు చాలా తెలివైన వారు వాళ్లకు చాలా మందితో సంబంధాలు ఉండవచ్చు. సో,, అటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయడం మంచిది లేదంటే నువ్వు అనవసరంగా ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది అని అన్నారు. .... డోంట్ వర్రీ సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్,, అలాంటి వాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అని అన్నాను. .... ఆయన కూడా నవ్వుతూ, వెరీ గుడ్,, నీ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది తొందర్లోనే ఒక మంచి బిజినెస్ మాన్ అయిపోతావ్ అనిపిస్తుంది అని అన్నారు. .... ఇకపోతే మీ ఫీజ్,, అంటూ తీసుకు వచ్చిన పది లక్షలు అతని చేతిలో పెట్టాను. .... మ్,, పర్ఫెక్ట్,,, నీ స్పీడ్ నాకు చాలా బాగా నచ్చిందయ్యా,, తొందర్లోనే నీకు ఎకౌంటెంట్ ని ఏర్పాటు చేస్తాను. నీ కంపెనీకి సంబంధించి మేము కాపీ చేసి పెట్టుకున్న రికార్డ్స్ అంటూ ఒక హార్డ్ డిస్క్ నా చేతికి ఇచ్చి ఇది నీకు బ్యాక్అప్ గా పనికొస్తుంది జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరం బాయ్ చెప్పుకొని నేను అక్కడి నుంచి బయల్దేరి రూముకి వచ్చేసాను.

వర్క్ స్టేషనుకి వెళ్లేసరికి ముగ్గురు సోఫాలో కూర్చుని కనబడ్డారు. నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి, వాట్ గయ్స్,,, ఏంటి ఈ రోజు ప్రోగ్రస్ అని అడిగాను. .... పెద్దగా ఏమీ లేదు జస్ట్ అలా క్యాజువల్ గా గడిచింది అన్నాడు సోము. .... ఓకే,, నేను చెప్పిన పని ఏమైంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అని అడిగాను. .... వచ్చింది దీపు,,, వాళ్ళిద్దరూ రెగ్యులర్ గా బయట కలుసుకుంటారు. వాళ్ల ఫ్యామిలీస్ కూడా రిచ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఇకపోతే వీళ్ళకి చిన్న చిన్న సైడ్ బిజినెస్లు ఉన్నాయి. వాటిని వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇద్దరికీ స్విస్ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. ఇదిగో వాళ్ళ అకౌంట్ నంబర్స్ అని తన మొబైల్ తీసి చూపించాడు జెస్సి. .... ఇందాక ఆడిటింగ్ చీఫ్ అనుమానించినట్టుగానే వీళ్ళు చాలా బాగానే డబ్బు మూటకట్టుకున్నారని ఈ స్విస్ బ్యాంక్ అకౌంట్లు నిరూపిస్తున్నాయి.

నిన్నటి ఆ జ్యువెలరీ షాప్ మేనేజర్ సంగతేంటి? అని జెస్సిని అడిగాను. .... నువ్వు చెప్పినట్టే ఒక సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకువెళ్లి ఉమెన్ హరాస్మెంట్ కేసు పెట్టి ఫుల్లుగా కోటింగ్ ఇప్పించాను. ఈపాటికి స్టేషన్ బెయిల్ తో బయటపడి వాడి ఇంట్లో బెడ్ మీద ఉండుంటాడు. వాడు ఇంకో వారం రోజులు మంచం దిగడం కష్టం అని అన్నాడు. .... సరే,, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను కానీ వీళ్లిద్దరి యాక్టివిటీస్ మీద నిఘా పెట్టి ఉంచాలి. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది తెలిస్తే మనకు అవసరమైనప్పుడు వాళ్లను లేపుకురావడానికి వీలుగా ఉంటుంది అని అన్నాను. .... ఇంతకీ వాళ్లను ఏం చేద్దాం అనుకుంటున్నావ్? అని అడిగాడు సోము. .... వాళ్ళు కంపెనీ సొమ్ము ఎంత నొక్కేశారు అన్న విషయం తెలిసిన తర్వాత డిసైడ్ చేస్తాను. అంతవరకు వాళ్ల మీద నిఘా ఉండాలి. .... డోంట్ వర్రీ,, ఆ విషయం డిటెక్టివ్స్ చూసుకుంటారు. వాళ్ళిద్దర్నీ వాచ్ చేయమని నేను చెప్తాను అని అన్నాడు సోము.

ఓకే గయ్స్ మీరు రెస్ట్ తీసుకోండి నేను కొంచెం అలా ఆఫీస్ దాకా వెళ్లి వస్తాను అని చెప్పి నేను తిరిగి ఆఫీసుకు బయలుదేరాను. ఆఫీసుకు చేరుకొని లిఫ్ట్ లో పైకి వెళ్ళేసరికి బయట క్యాబిన్ లో కూర్చున్న రజిని నన్ను చూసి పైకి లేచి, గుడ్ ఈవెనింగ్ సార్,, అని పలకరించింది. .... గుడ్ ఈవెనింగ్ రజిని,,, కం టు మై రూమ్ అని చెప్పి ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి నా సీట్లో కూర్చున్నాను. రజనీ నా దగ్గరకు రాగానే కూర్చోమని చెప్పి, రజిని రేపు మన చీఫ్ మేనేజర్ మరియు చీఫ్ అకౌంట్లను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాను. అలాగే జువెలరీ షాప్ మేనేజరుని కూడా తీసేస్తున్నాను. వీళ్ళిద్దరూ తమకు తాముగా రిజైన్ చేస్తున్నట్టు, జువెలరీ షాప్ మేనేజరుని నేనే ఎలిమినేట్ చేస్తున్నట్టు పూజ దగ్గరికి వెళ్లి దగ్గరుండి లెటర్స్ ప్రిపేర్ చేయించి రెడీగా పెట్టు అని చెప్పి పంపించాను.

రజిని బయటికి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఫోన్ తీసి ఫ్లోరిడాలో ఉన్న పప్పీకి ఫోన్ చేశాను. కాల్ లిఫ్ట్ చేస్తూనే, హలో మై స్వీట్ రాస్కెల్ హౌ ఆర్ యు,,, ఏంటి ఇంత కాలానికి గుర్తొచ్చామా మేము? అని అంది. .... హాయ్ పప్పీ,, ఏం చేయమంటావు వర్క్ బిజీ అలా ఉంది. నువ్వు ఎలా ఉన్నావు? బెంజి మరియు వదిన ఎలా ఉన్నారు? అని అడిగాను. .... అందరూ బాగానే ఉన్నారు. ఇదిగో నీ వదిన గారు వచ్చారు అంటూ వెటకారం చేసింది. హాయ్ దీపు,, హౌ ఆర్ యు? అంటూ కావ్య వదిన పలకరించింది. .... ఐ యాం గుడ్ వదిన నువ్వెలా ఉన్నావ్? అని అడిగాను. .... కొంతసేపు ముగ్గురం మాట్లాడుకున్న తర్వాత బబ్లు గురించి కూడా అడిగి తెలుసుకున్నాను. ఆ తర్వాత పప్పీతో ఒక విషయం మీద డిస్కస్ చేయాలి అని అనడంతో వదిన అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

చెప్పు దీపు ఏంటి విషయం? అని అడిగింది పప్పీ. .... పప్పీ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఇది కొంచెం నా పర్సనల్ మేటర్ అంటూ రెండు స్విస్ అకౌంట్ల నంబర్లు తనకి ఫార్వర్డ్ చేసి, వీటిలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవాలి అని చెప్పాను. .... ఓస్ ఇంతేనా,, జస్ట్ ఎ మినిట్ అంటూ తన లాప్టాప్ లో ఏదో చేస్తున్నట్టు శబ్దాలు వినపడగా మరో రెండు నిమిషాల తర్వాత పప్పీ మాట్లాడుతూ, ఒక ఎకౌంట్లో 250 కోట్లు మరొక ఎకౌంట్లో 190 కోట్లు ఉన్నాయి అని చెప్పింది. .... అది వినగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆఫ్ట్రాల్ మేనేజర్ మరియు అకౌంటెంట్ గా పనిచేస్తున్న వీళ్ళకి స్విస్ బ్యాంకులో ఎకౌంటు ఉండడమే కాకుండా ఇంత సొమ్ము డిపాజిట్ అయి ఉండటం నిజంగానే చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ రెండుసార్లు పప్పీ పిలిచిన పిలుపుకి తేరుకుని, నిజంగా అంత డబ్బు ఉందా? అని ఆశ్చర్యంగా అడిగాను.

ఓయ్,, నేను నీతో అబద్ధం చెబుతున్నాను అనుకున్నావా? నువ్వు ఇచ్చిన అకౌంట్ నెంబర్లలో అంతే ఉంది అని అంది పప్పీ. .... పప్పీ ఆ అకౌంట్లలో ఉన్న డబ్బు మనం మాయం చేయొచ్చా? అని అడిగాను. .... పప్పీ చాలా ఉత్సాహంగా, ఏంటి సంగతి హీరో,, ఎవరిది ఈ డబ్బు? అని అడిగింది పప్పీ. .... అప్పుడు నేను జరిగిన కథను కొంచెం షార్ట్ కట్ చేసి పప్పీకి వివరించాను. .... ఓకే ఓకే,, నాకు అంతా అర్థమైంది. మరి ఈ డబ్బు ఎక్కడికి ఎలా కావాలి అనుకుంటున్నావు? అని అడిగింది. .... ఆ డబ్బు మీద నాకేమీ ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ డబ్బు వాళ్లకు దక్కకూడదు. ఈ డబ్బంతా ఎవరైనా లేని వాళ్లకు ఉపయోగపడితే బాగుంటుందని అనుకుంటున్నాను. .... ఓకే,, వెరీ గుడ్,, అయితే నేను ఏం చేయాలో చెప్పు అని అడిగింది పప్పీ. .... ముందయితే ఆ అకౌంట్లు ఖాళీ చేయాలి అని అన్నాను. .... సరే అయితే వాటిని మన బబ్లు గాడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెడతాను ఆ తర్వాత నువ్వు ఏం డిసైడ్ అయితే అది చేద్దాం అని అంది పప్పీ. .... థాంక్యూ పప్పీ కానీ నేను రేపు చెప్పిన వెంటనే ఈ పని చేయాలి నీకు వీలవుతుందా? అని అన్నాను. .... ఓ యా,,, నాకేమీ పెద్ద పనులు లేవులే ఎనీ టైం యు కెన్ కాల్ మీ అని చెప్పడంతో తనకు బాయ్ చెప్పి కాల్ కట్ చేశాను.

కొంతసేపటి తర్వాత రజనీ నా రూంలోకి వచ్చి లెటర్స్ రెడీ అయినట్టు చెప్పి నా ముందు పెట్టింది. నేను వాటిని పరిశీలించి తిరిగి రజినీకి ఇస్తూ, రేపు మధ్యాహ్నం నేను ఆఫీసుకి వస్తాను ఆ టైంకి మేనేజర్ మరియు అకౌంటెంట్ నా దగ్గర ఉండాలి అని అన్నాను. .... ష్యూర్ సార్,, అంటూ నా దగ్గర లెటర్లు అందుకని ఫైల్ లో పెట్టుకుంది. .... ఆ,, రజిని,, మరో విషయం, పాత రికార్డులు చూసి మన కంపెనీకి సంబంధించి ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ లాంటివి నడిచాయో లేదో తెలుసుకోవాలి. వీలైనంత తొందరగా ఆ పని చూడు అని చెప్పాను. .... ఓకే సార్,, అని చెప్పి రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయి తన చాంబర్ లో కూర్చుని పని చేసుకుంటుంది. నేను మరి కొంచెం సేపు ఆఫీసులో కూర్చుని రేపు ఏం చేయాలి ఎలా చేయాలి అన్న విషయం గురించి ఆలోచించుకుని లేచి రూమ్ లో నుంచి బయటకు వచ్చి, ఈ విషయం రేపటి వరకు సీక్రెట్ గా ఉండాలి అని రజినీతో చెప్పి అక్కడినుంచి బయలుదేరి రూముకి వచ్చేసాను.

Next page: Episode 110.2
Previous page: Episode 109.2