Episode 113.2


మేము నలుగురం మాస్కులు వేసుకుని ఉండటం, ఇంకా ఈ తతంగం జరుగుతున్నంతసేపు మేనేజర్ మౌనంగా ఉండడంతో డ్రైవర్ గాని క్లీనర్ గాని నన్ను గుర్తు పట్టే అవకాశం ఎంతమాత్రం లేదు. పని పూర్తి అయిన వెంటనే డ్రైవర్ తో మాట్లాడుతూ, మీరు కామ్ గా ఇక్కడ జరిగింది ఏమీ తెలియనట్టే బండి తీసుకుని వెళ్లిపోండి లేదంటే మీరు కష్టాల్లో పడతారు అని చెప్పేసరికి డ్రైవర్ చేతులెత్తి దండం పెడుతూ, చాలా థాంక్స్ సార్,, అని చెప్పి, ఒరేయ్ తొందరగా పద ఈ భూమ్మీద మనకి ఇంకా నూకలు ఉన్నాయి అని క్లీనర్ తో అంటూ గబగబా బండెక్కి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయారు. .... మరి ఈడి సంగతేంటి? అని అడిగింది తార? .... నేను నా జేబులో ఉన్న వాడి మొబైల్ తీసి జాగ్రత్తగా వాడి షర్టు తోటే ఫింగర్ ప్రింట్స్ లేకుండా తుడిచి వాడి జేబులో పెట్టి, నీ ఇష్టం తార,,, అని అన్నాను. అంతే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మేనేజర్ తలలో బుల్లెట్ దింపేసింది.

నువ్వు రాక్షస జాతిలో పుట్టి యమలోకంలో ఉండాల్సిన దానివే అని నవ్వుతూ అన్నాడు జెస్సీ. .... ఎక్కడైతే నేమి చేసే పని మాత్రం అదే కదా అని నేను కూడా సరదాగా జోక్ చేశాను. ఈ టైం లో హెవీ వెహికల్స్ ఘాట్ రోడ్ లో తిరగడానికి అనుమతించరు అందువలన ఈ రోడ్ లో ట్రాఫిక్ లేకపోవడంతో మా పని కూడా సులువుగా అయిపోయింది. ఇక నా ఆలోచనలో భాగంగా చివరి ఘట్టం మిగిలి ఉంది. దించిన లోడ్ దగ్గర ఒక పేపర్ మెద DD అని రాసి పెట్టమని సోముతో చెప్పగా సోము వెంటనే ఆ పని చేశాడు. మేమంతా అక్కడినుంచి నడుచుకుని కార్ దగ్గరికి చేరుకొని కార్ లో ఉన్న నా లాప్టాప్ తీసి మొట్టమొదటిసారి పప్పీ నాకు నేర్పిన టెక్నికల్ స్కిల్ ఉపయోగించడానికి రెడీ అయ్యి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో సోముకి ముందుగానే చెప్పి సెక్యూర్ లైన్లో రుద్రకి కాల్ చేశాను.

నంబర్ లేని కాల్ కావడంతో రుద్ర నిద్రనుంచి మేలుకొని చాలా సేపటి తర్వాత కాల్ లిఫ్ట్ చేసాడు. ఇప్పుడు సోము DD పాత్ర పోషిస్తూ, మిస్టర్ రుద్ర,,, నేను DD మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయం కొంచెం జాగ్రత్తగా ఉంటే నీకు కూడా ఉపయోగంగా ఉంటుంది అని అన్నాడు. .... ఆటునుండి రుద్ర తన సెక్యూరిటీ అధికారి అహంకారం చూపిస్తూ, ఎవడ్రా నువ్వు నా ఫోన్ కి కాల్ చేసి నాకే సలహాలు ఇస్తున్నావ్? అని ఫైర్ అయ్యాడు. .... నీతో ముచ్చట్లు పెట్టుకోవడానికి నాకు టైం లేదు నేను చెప్పేది వింటే నీకే మంచిది అని అన్నాడు సోము. .... ఆటునుంచి రుద్ర కొంచెం తగ్గి, నువ్వు నిజంగా DD వేనా? నువ్వు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావ్? అయినా నువ్వు నాకు ఉపయోగపడేది ఏంటి? అని అడిగాడు.

నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీకు కాల్ చేయలేదు. నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి. నేను చేసే పనులతో నీ పై అధికారుల నుంచి నీ మీద బాగా ప్రెజర్ ఉందని నాకు తెలుసు. దాని నుంచి నీకు కొంచెం ఉపశమనం కలగాలంటే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. సాలూరు సుంకి ఘాట్ రోడ్లో డ్రగ్స్ తో వెళ్తున్న కొంత మందిని అటాక్ చేశాను. వాళ్లందరూ ఫినిష్ అయిపోయారు అలాగే వాళ్లు తీసుకెళ్తున్న డ్రగ్స్ కూడా రోడ్డు పక్కనే ఉన్నాయి. నువ్వు తొందరగా వచ్చి ఇవన్నీ రికవరీ చేసుకుని ఈ ఆపరేషన్ నువ్వే చేసినట్టు చెప్పుకుంటే నీ మీద కొంచెం ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. లేదంటే ఎప్పటిలాగే ఇక్కడ DD అనే మార్క్ వదిలి వెళ్తున్నాను. నువ్వు తొందరగా వచ్చి ఆ మార్కు తీసేసి ఈ ఎన్కౌంటర్ నీ అకౌంట్లో వేసుకుంటే నీకే మంచి పేరు వస్తుంది బాగా ఆలోచించి తొందరగా సరైన నిర్ణయం తీసుకో గుడ్ బై అని చెప్పి కాల్ కట్ చేశాము.

గుడ్ జాబ్ సోము,,, అంటూ నేను సోముకి హగ్ ఇచ్చాను. .... సూపర్ ఐడియా వేశావు మావ అని తార నాకు హాగ్ ఇచ్చి ఆ తర్వాత సోముకి కూడా ఒక హాగ్ ఇచ్చి, పర్వాలేదు మనోడు బాగా పనికొస్తాడు అని మెచ్చుకుంది. తార తన గురించి పాజిటివ్ గా మాట్లాడటంతో సోము కూడా పొంగిపోయాడు. జెస్సి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, బ్రిలియంట్ దీపు,,, ఈ దెబ్బతో రుద్రకి నీ మీద అనుమానం పోవడంతో పాటు వాడి నిజస్వరూపం ఏంటో మనకు తెలుసుకునే అవకాశం కూడా ఉండొచ్చు అని అన్నాడు. .... అవును జెస్సి లక్కీగా ఈ మిషన్ మొత్తం అవుట్ డోర్ లో జరగడం మనకు బాగా కలిసి వచ్చింది. ఇదే పని కంపెనీ దగ్గర జరిగి ఉంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వచ్చేది అని చెప్పి లొకేషన్ మొత్తం ఫోటోలు వీడియోలు తీసుకుని, ఈపాటికి రుద్ర గాడు లోకల్ సెక్యూరిటీ అధికారి కి ఆర్డర్స్ వేసి ఉంటాడు మనం తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని చెప్పి నలుగురం కారులో కూర్చుని తొందరగా ఘాట్ రోడ్డు దిగి సాలూరులో ఒక పెట్రోల్ బంకు దగ్గర మా బండి పార్క్ చేసి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక టీ స్టాల్ దగ్గరకు వెళ్లి టీ తాగుతూ సెక్యూరిటీ అధికారి వెహికల్స్ కాన్వాయ్ స్పాట్ కి వెళ్ళడం చూసిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి తెల్లవారే సమయానికి వర్క్ స్టేషనుకి చేరుకుని ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లి రెస్ట్ తీసుకున్నాము.

మధ్యాహ్నం 12:30 సమయంలో మొబైల్ మొగుతూ ఉండడంతో మెలుకువ వచ్చి ఫోన్ తీసి చూశాను. తార కాల్ చేస్తుండటంతో లిఫ్ట్ చేసి హలో,,, అని అన్నాను. .... మావ అర్జెంటుగా ఇక్కడికి రా,,, అని ఫోన్ పెట్టేసింది. నేను టైం చూసుకుని ఏమై ఉంటుందబ్బా అని అనుకుంటూ లేచి గబగబా టీ షర్ట్ వేసుకుని వర్క్ స్టేషనుకి వెళ్లాను. ఆ టైంకి ముగ్గురు అప్పుడే లేచినట్టు నిద్ర మొహాలతో సీరియస్ గా టీవీ చూస్తున్నారు. నేను కూడా వెళ్లి వాళ్లతో పాటు కూర్చుని చూడటం మొదలు పెట్టాను. ఈ రోజు తెల్లవారి జరిగిన సంఘటనలకు సంబంధించి వార్తలు చెబుతున్నారు. స్పాట్ లో పడివున్న మృతదేహాల కవరేజ్ అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ల హడావుడి ఆ తర్వాత మృతదేహాల తరలింపు ఇవన్నీ చూపిస్తూ చివరిగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రుద్ర సమాధానం చెప్పడం ఇవన్నీ చూపించారు.

కానీ ఎక్కడా DD విషయం ప్రస్తావనకు రాకపోవడంతో రుద్ర ఈ కేసుని తన అకౌంట్ లో వేసుకోవడానికి అంగీకరించినట్టు అర్థమైపోయింది. కానీ మాకు సంబంధించినంతవరకు సంతోషకరమైన విషయం ఏమిటంటే రుద్ర ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అక్కడ దొరికిన డ్రగ్స్ విషయంలో అబద్ధం చెప్పాడు. దాదాపు రెండున్నర టన్నులు సరుకు దొరికితే రుద్ర మాత్రం 500 కేజీలు మాత్రమే దొరికినట్టు చెప్పాడు. ఆ విషయం విన్న మా నలుగురి మొహాల్లో నవ్వు మెరిసింది. తీగను పట్టుకొని లాగితే డొంక కదిలినట్లు మేము ఈ కేసులో రుద్రని ఇన్వాల్వ్ చేయడంవల్ల ఇంత కాలం మేము అనుమానిస్తున్న రుద్ర క్యారెక్టర్ బయటపడింది. అంటే రెండు వేల కేజీలు సరుకు మాయం చేసినట్టు కన్ఫామ్ అయ్యింది. అంటే రుద్రకి డ్రగ్ డీలర్స్ తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని ఒక క్లూ దొరికినట్లయింది.

వెంటనే నేను లేచి పార్వతి అమ్మ రూమ్ లోకి వెళ్లి డిపార్ట్మెంట్ ఇచ్చిన ల్యాప్టాప్ బయటకు తీసుకు వచ్చి సెక్యూర్ లైన్లో చీఫ్ ని కాంటాక్ట్ చేశాను. అట్నుంచి చీఫ్ లైన్ లోకి రాగానే నలుగురం కలిసి ఆయనకు సెల్యూట్ చేసి ఆ తర్వాత జరిగిన విషయం గురించి చీఫ్ తో డిస్కస్ చేసి ఈ విషయాన్ని వివరించాను. వెరీ గుడ్ బోయ్స్,,, వెల్ డన్ అంటూ, ఓ,,, తార కూడా ఉంది కదా వెల్ డన్ మై గర్ల్,, అని అన్నారు. .... ఆ మాటకు మేమందరం నవ్వుకుని, పర్వాలేదు సార్ దాన్ని కూడా బోయ్ అనొచ్చు అని అన్నాడు జెస్సి. .... వెంటనే తార జెస్సీ డిప్ప మీద ఒకటి కొట్టడంతో అటు నుంచి చీఫ్ కూడా నవ్వుతూ, మొత్తం మీద మీ టీం కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఇంతకీ ఈ సమాచారం నీకు ఎలా తెలిసింది అని నన్ను అడిగారు. .... సారీ సార్,, మీకు ఈ విషయం ఇంతకు ముందే చెప్పి ఉండాల్సింది. ఆ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ నాదే అందుకే ఇందులో నా కంపెనీకి చెడ్డపేరు రాకుండా ఉండాలన్న నా స్వార్థం కూడా ఉంది అందుకు మీరు నన్ను క్షమించాలి అని అన్నాను.

నేను నీకు చీఫ్ ని నువ్వు చెప్పకపోతే నాకు ఆ విషయాలు తెలియవు అని అనుకుంటున్నావా? అని నవ్వుతూ, ఇట్స్ ఓకే మనకు కేస్ చేదించడం ముఖ్యం సోర్సెస్ కాదు. సోర్సెస్ ఎప్పుడూ కాన్ఫిడెన్షియల్ గానే ఉంచాలి ఆ సదుపాయం మనకి ఉంది అని అన్నారు. .... థాంక్యూ సార్,, ఇకపోతే అక్కడ జరిగిన సంఘటన తాలూకా ఫొటోస్ అండ్ వీడియోస్ మీకు పంపిస్తున్నాను బహుశా ఇక మీదట మీరు రుద్ర మీద డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టొచ్చు అనుకుంటున్నాను అని అన్నాను. .... యస్ యు ఆర్ రైట్,,, కానీ రుద్ర దృష్టిలో ఇంకా నువ్వు ఇన్నోసెంట్ కాబట్టి మీ వైపు నుంచి ఈ లైన్ ఇలాగే కంటిన్యూ చేయండి. నా వైపు నుంచి చేయవలసిన ప్రయత్నాలు నేను చేస్తాను. కేసు పట్టు బిగిస్తోంది కాబట్టి మిమ్మల్ని కూడా ట్రాక్ చేసే పనిలో పడతారు అందువలన ఇకమీదట మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. టేక్ కేర్,,, బాయ్ అని చెప్పి వీడియో కాల్ కట్ చేశారు.

నేను లాప్టాప్ కిట్ లోపల పెట్టి డోర్ లాక్ చేసి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ, ఓకే గయ్స్ లేచి ఫ్రెష్ అవ్వండి భోజనం చేద్దాం చాలా ఆకలిగా ఉంది నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి నా రూమ్ కి వచ్చాను. బట్టలు విప్పి బాత్రూం లోకి వెళ్లబోతుండగా మళ్లీ నా మొబైల్ మోగడంతో తీసి చూడగా అది ఆడిటింగ్ ఆఫీస్ చీఫ్ దగ్గర్నుంచి వస్తుండడంతో కాల్ లిఫ్ట్ చేసి, హలో సార్,, హౌ ఆర్ యు అని పలకరించాను. .... హలో మిస్టర్ దీపు,, నేను బాగానే ఉన్నాను హౌ ఈజ్ గోయింగ్ యువర్ సైడ్? అని అడిగారు. .... ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్,,, చెప్పండి ఇంకేంటి సంగతులు? అని అడిగాను. .... అదే నువ్వు అకౌంటెంట్ కావాలని అడిగావు కదా, ఇది వరకు ఢిల్లీలో ఒకతను ఉన్నాడు అని చెప్పాను కదా అతనికి నీ కంపెనీ గురించి చెప్పాను అతను కూడా ఇక్కడ పని చేయడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు. ప్రస్తుతం సిటీలోనే ఉన్నాడు నువ్వు టైం ఇస్తే నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పారు. .... అతను ఈ రోజు కలవాలి అనుకుంటే మరొక రెండు గంటల్లో నేను ఆఫీస్ లో ఉంటాను అతన్ని వచ్చి కలవమని చెప్పండి అని అన్నాను. .... దట్స్ గుడ్,,, అయితే అతన్ని ఈవినింగ్ 4:00 కి నీ ఆఫీసులో కలవమని చెప్తాను. మీ ఇద్దరూ మాట్లాడుకుని డిసైడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ యంగ్ మాన్,, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశారు.

నేను స్నానం చేసి తయారయ్యి వర్క్ స్టేషనుకి వెళ్లి నలుగురు కూర్చుని భోజనం చేసాము. ఆ తర్వాత వాళ్లను రెస్ట్ తీసుకోమని ఆఫీసులో చిన్న పని ఉంది చూసుకుని వస్తాను అని చెప్పి కార్లో బయల్దేరాను. ఆఫీసుకు చేరుకునే సరికి రజిని చాంబర్లో మరియు వెయిటింగ్ రూమ్ లో ఒకతను కూర్చుని ఉన్నాడు. రజినీ పైకి లేచి నన్ను విష్ చేసి నాతోపాటు నడుస్తూ, సార్ మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చారట అని అతని వైపు చూపించింది. అతను కూడా నన్ను చూసి లేచి మా దగ్గరికి వచ్చి ఆడిటింగ్ చీఫ్ పంపించినట్టు తన పేరు గంగాధర్ అని పరిచయం చేసుకున్నాడు. నేను కూడా అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేసి, రండి లోపలికి వెళ్లి మాట్లాడుకుందాము అని ముగ్గురు కలిసి ఆఫీస్ లోకి నడిచాము. అతనికి కూర్చోడానికి సీట్ చూపించి నేను నా సీట్లో కూర్చుని టీ ఆర్ కాఫీ? అని అతని వైపు చూడగా, ఎనీథింగ్ ఓకే,, అని అతను అనడంతో రజిని వైపు చూసి కాఫీ అరెంజ్ చేయమని చెప్పడంతో తను బయటకి వెళ్ళిపోయింది.

చెప్పండి గంగాధర్ గారు మీరు ఇక్కడ పనిచేయాలని అనుకుంటున్నారని ఆడిటింగ్ చీఫ్ చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్ అది,,, అని నేను అనగానే అతను తన గురించి చెప్పడం మొదలు పెట్టి ఇంతకుముందు ఇదే ఆడిటింగ్ ఆఫీసులో పని చేసినట్టు ఆ తర్వాత మంచి అవకాశం రావడంతో ఢిల్లీలోని ఒక కంపెనీకి అకౌంటెంట్ గా పని చేశానని ఇప్పుడు కొన్ని కుటుంబ కారణాల వల్ల తిరిగి నా సొంత సిటీలోనే స్థిరపడాలని తిరిగి రావడం జరిగింది అని చెప్పాడు. నేను కూడా నా కంపెనీ వివరాలు అతనితో డిస్కస్ చేసి నా కంపెనీ ప్రతి వింగ్ కి అకౌంటెంట్లు ఉన్నారు వీరందరినీ సమన్వయం చేసుకుంటూ మీరు ఇక్కడ హెడ్ ఆఫీస్ లో చీఫ్ అకౌంటెంటుగా పని చేయాల్సి ఉంటుంది. మీకు అది అంగీకారం అయితే మీకు ఏమైనా డిమాండ్స్ ఉంటే చెప్పండి అని అన్నాను. .... మీ కంపెనీ స్ట్రక్చర్ బాగుంది మీ ప్రపోజల్ కూడా నాకు నచ్చింది. నాకంటూ పెద్దగా డిమాండ్స్ ఏమీ లేవు. నేను ఇక్కడే నా సొంత సిటీలో పని చేయాలని అనుకుంటున్నాను మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు హ్యాపీగానే ఉంది అని అన్నాడు.

ఇంతలో రజిని సర్వెంట్ తో పాటు లోపలికి వచ్చి మా ఇద్దరికీ కాఫీ అరేంజ్ చేసింది. నేను రజినీని కూడా అక్కడే కూర్చుని కాఫీ తీసుకోమని చెప్పాను. రజనీ కూడా మాతో పాటే కూర్చున్న తర్వాత కాఫీ తాగుతూ, మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అని గంగాధర్ ని అడిగాను. .... నేను ఢిల్లీలో ఉండగా 10 లక్షల ప్యాకేజ్ కి వర్క్ చేశాను అది దృష్టిలో పెట్టుకొని మీరే డిసైడ్ చేయండి అని అన్నాడు. .... ఓకే గంగాధర్ గారు మీకు అదే ప్యాకేజ్ ఇక్కడ కంటిన్యూ చేస్తాను అది మీకు ఓకేనా? అని అడిగాను. .... గంగాధర్ కొంచం ఆలోచించుకొని, ఓకే సార్,, ఐయామ్ రెడీ టు వర్క్ విత్ యు,, అని అన్నాడు. .... నేను రజిని వైపు చూసి అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసి పట్టుకుని రమ్మని చెప్పడంతో గంగాధర్ గారి వివరాలు కనుక్కొని తను బయటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత నేను మరి కొంచెం సేపు కంపెనీ లోని పరిస్థితుల గురించి అతనితో మాట్లాడుతూ కూర్చున్నాను.

రజనీ లెటర్ పట్టుకొని వచ్చిన తర్వాత నేను సంతకం చేసి దాని మీద అధికార ముద్రవేసి గంగాధర్ గారికి అందిస్తూ, వెల్కమ్ టు పార్వతీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని విష్ చేసి, ఈరోజు నుంచి నా కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీ చేతిలో పెడుతున్నాను. ఎప్పుడూ నిజాయితీగా నా కంపెనీ అకౌంట్స్ లో ఎటువంటి పొరపాట్లు లేకుండా చట్టబద్ధంగా న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను అని అన్నాను. .... ఆడిటింగ్ చీఫ్ మీ గురించి చెబితే ఏదో అనుకున్నాను కానీ రెండు గంటల పరిచయంలోనే మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు నచ్చింది. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకునే క్యారెక్టర్ కాదు నాది. నా పని విషయంలో ఇప్పటిదాకా ఎక్కడా చిన్న రిమార్క్ కూడా తెచ్చుకోలేదు ఇక్కడ కూడా అలాగే నిజాయితీగా పని చేస్తూ మీకు అనుకూలంగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను అని అన్నాడు. .... బై ద వే,, ఈమె రజిని నా పర్సనల్ సెక్రెటరీ, మిగతా విషయాలన్నీ ఆమె మీకు వివరంగా చెబుతుంది అని ఇద్దరికీ పరిచయం చేశాను. .... నాకు కొంచెం షిఫ్టింగ్ పనులు ఉన్నాయి అవి పూర్తి చేసుకుని సోమవారం నుంచి డ్యూటీలో జాయిన్ అవుతాను అని చెప్పి గంగాధర్ మా దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్లిపోయాడు.

ఆ తర్వాత నేను గంగాధర్ ని అపాయింట్ చేసుకున్న విషయం గురించి ఆడిటింగ్ చీఫ్ కి ఫోన్ చేసి చెప్పాను. అతను కూడా గంగాధర్ విషయంలో చాలా మంచిగా చెప్పి అతను నీకు బాగా ఉపయోగపడతాడు డోంట్ వర్రీ,, అని నాకు భరోసా ఇచ్చి కాల్ ముగించాడు. ఆ తర్వాత నేను అక్కడే కూర్చున్న రజినీతో మాట్లాడుతూ, ఆల్మోస్ట్ అన్ని రిక్రూట్మెంట్స్ పూర్తయ్యాయి ఇంకా చీఫ్ మేనేజర్ పోస్టు ఒకటే ఖాళీగా ఉంది తొందర్లోనే అది కూడా భర్తీ చేయాలి అని చెప్పి అంతలోనే ఏదో ఆలోచన వచ్చి, రజిని,, ఇన్ని రోజుల నుంచి మేనేజర్ చేసే పనులను నువ్వే చూసుకుంటున్నావు కదా నీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? అని అడిగాను. .... లేదు సార్ అలాంటిదేమీ లేదు అని అంది. .... అయితే మన కంపెనీ చీఫ్ మేనేజరుగా నువ్వే ఎందుకు ఉండకూడదు? ఇటు నా పర్సనల్ సెక్రెటరీగా మరియు మేనేజరుగా రెండు పోస్టులు నువ్వే చూసుకోవచ్చు కదా? అని అన్నాను.

రజనీ కొంచెం సాలోచనగా నా వైపు చూసి, సార్,,, అది ఒక పెద్ద బాధ్యత. నాకు ఎక్స్పీరియన్స్ తక్కువ కానీ మీరు నా మీద నమ్మకం ఉంచి ఆ పని చేయమంటే చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో? అని అంది. .... డోంట్ వర్రీ రజిని,, నువ్వు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఇంతవరకూ నా దగ్గరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నావు. ఐ థింక్ యు ఆర్ కేపబుల్ ఇనఫ్,,, అని నాకు అనిపిస్తుంది. నాకు నీ మీద నమ్మకం ఉంది లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ చాలెంజ్ అని అన్నాను. .... నేను తన గురించి పొగడటంతో రజినీ మొహంలో సంతోషం కనపడింది. థాంక్యూ వెరీ మచ్ సార్,,, మీరు కలిసిన తర్వాత కొద్దిరోజుల్లోనే నా లైఫ్ ని పూర్తిగా మార్చేశారు. అందుకు మీ పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటాను. మీరు ఏ పని అప్పజెప్పినా అది చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అని అంది. .... థాంక్యూ రజిని,,, ఇక మీదటి నుంచి నీ సాలరీ నెలకి లక్ష చొప్పున 12లక్షల ప్యాకేజ్ గా మార్చుకో అది ఎలాగూ నీ చేతిలో పనేగా అని సరదాగా నవ్వుతూ అన్నాను. అందుకు రజిని కూడా సరదాగా నవ్వింది.

ఆ తర్వాత మరికొంతసేపు ఆఫీసులోనే కూర్చుని రజనీ చెప్పిన ఫైల్స్ మీద సంతకాలు పెట్టి సుమారు 8:00 గంటల ప్రాంతంలో ఆఫీస్ నుంచి బయలుదేరాను. కారులో వెళుతుండగా నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి ఒక స్టోర్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళాను. ఓ ఐదు నిమిషాలు అక్కడే గడిపి రెండు చాక్లెట్లు కొనుక్కొని తిరిగి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి బయలుదేరాను. రియర్ వ్యూ మిర్రర్ లో జాగ్రత్తగా పరిశీలిస్తూ నెమ్మదిగా కారు నడుపుతున్నాను. నా అనుమానం నిజమే రెండు కార్లు నా వెనకాల కొంచెం దూరంగా ఫాలో అవుతున్నాయి. ఊహించిన ప్రమాదం కొంచెం తొందరగానే వచ్చింది అనుకుని నా ఫోన్ తీసి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని జెస్సీకి కాల్ చేశాను. జెస్సి కాల్ లిఫ్ట్ చేయగా, జెస్సి మనకు ఒక చిన్న పని పడింది మీరు నా మొబైల్ ట్రాక్ చేస్తూ నన్ను ఫాలో అవ్వండి. తారని అక్కడే ఉండి ఆ ముగ్గురి నెంబర్లు ట్రాక్ చేస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేశాను.

Next page: Episode 114.1
Previous page: Episode 113.1