Episode 115.1
అను నన్ను కార్లో కూర్చోబెట్టుకుని తనే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. దారిలో ఒక ఫుట్ పాత్ పక్కన పూలదుకాణం దగ్గర కారు ఆపి తనే దిగి వెళ్లి తులిప్ రోజెస్ కొనుక్కొని వచ్చి స్టీరింగ్ ముందు డాష్ బోర్డ్ మీద పెట్టి మళ్లీ డ్రైవ్ చేయడం మొదలు పెట్టింది. నాకెందుకో కొంచెం తేడాగా అనిపించి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? అని అడిగాను. .... నిన్ను తీసుకెళ్లి అమ్మేద్దామని,, కొంచెం సేపు ఓపిక పట్టలేవా? అని ఎగతాళి చేసి తనలో తాను నవ్వుకుంటూ కారు స్పీడ్ గా పోనిచ్చింది. కొంతసేపటికి హైవేలో డ్రైవ్ చేసి తర్వాత ఒక కొండ పక్కన ఉన్న ఎడమవైపు రోడ్డులోకి పోనిచ్చింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళుతున్నామో అప్పుడు నాకు అర్థమయింది. కొంచెం లోపలికి ఒక లవర్స్ పార్క్ ఉంది. సాధారణంగా అక్కడకి లవర్స్ మాత్రమే వస్తారు. మేము వెళ్లి కార్ పార్క్ చేసేసరికి అక్కడ సోము, తార వచ్చిన కార్ పార్క్ చేసి ఉండడం కనబడింది.
అది చూడగానే, ఓహో,,,, వీళ్ళు కూడా ఇక్కడికే వచ్చారా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో? అని మనసులో అనుకొని అను తో కలిసి ముందుకు అడుగులు వేశాను. సోము తారల ఆలోచనలో పడి అను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చింది అన్న విషయం మర్చిపోయాను. లోపలికి వెళ్లగా అక్కడ ఒక కార్నర్ రింగ్ కి ఆనుకొని సోము తార ఎదురుగా నిల్చుని మాట్లాడుకుంటున్నారు. బహుశా కొంచెం సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు కాబోలు మా వైపు చూడలేదు. నేను మాత్రం వాళ్ళని చూస్తూ నడుస్తుండటంతో అను కూడా అటువైపు చూసి ఒక్కసారి నా వైపు అనుమానంగా చూసింది. అను నన్ను చూడటం గమనించి నా భుజాలు ఎగరేస్తూ నాకేమీ తెలీదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఇద్దరం కలిసి వాళ్లకి సుమారు ఒక ఇరవై అడుగుల దూరంలో రింగ్ కి ఆనుకొని నేను నిల్చోగా అనూ చేతిలో పువ్వులతో చేతులు కట్టుకుని నాతోపాటు వాళ్ళిద్దరి వైపు చూస్తు నిల్చుంది.
కొద్దిసేపటికి సోము చిరునవ్వు నవ్వుతూ ఒక కాలు మడిచి మోకాళ్లపై నిల్చొని తన జేబులో నుంచి ఒక చిన్న బాక్స్ అందులో నుంచి రింగ్ తీసి తారకు ప్రపోజ్ చేస్తుండడం అందుకు తార కొంచెం సిగ్గుపడుతూ తన తల ఊపి చెయ్యందించడం జరిగింది. తారని అలా సిగ్గుపడుతూ చూడటం ఇదే మొదటిసారి కావడంతో నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి నాలుగడుగులు అటువైపు వేసాను. అంతలో సోము తారకు రింగ్ తొడగడం ఆ తర్వాత తార సోముని పైకి లేపి కౌగలించుకొని ఒక లిప్ కిస్ పెట్టడం జరిగిపోయింది. అది చూసి నేను చప్పట్లు కొడుతూ, నేను చెప్పినట్టే జరిగింది కదా? అని తారను ఉద్దేశించి నవ్వుతూ అన్నాను. అప్పటిదాకా వాళ్ళ లోకంలో ఉన్న వాళ్లు ఇద్దరూ నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు. ఇంతలో అను నా వెనకాల వచ్చి నా చెయ్యి పట్టుకుని ఆపి తార వైపు చూసి క్యారీ ఆన్ అన్నట్టు చేతితో థంసప్ సింబల్ చూపించి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మధ్యలో నువ్వెందుకు? రా నీతో పనుంది అంటూ నన్ను మళ్ళీ వెనక్కి లాక్కెళ్లింది.
అవును,, అను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చింది? అన్న విషయం అప్పుడు గుర్తుకువచ్చింది. తను నన్ను మరికొంచెం దూరం తీసుకెళ్లి నాకు ఎదురుగా నిల్చుని కొంచెం సిగ్గుపడుతూ, నేను నీతో కొంచెం మాట్లాడాలి,, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు సరిగ్గా తెలియడం లేదు కానీ ఈ విషయము నేను చెప్పే తీరాలి అని అంది. ఇంతలో బయట నుంచి లోపలికి నడుస్తూ వచ్చిన జెస్సీ తార మరియు సోముల వైపు వెళ్లి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం చూసి కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాడు. ఇక్కడ అను అక్కడ జరుగుతున్నది ఏమీ పట్టించుకోకుండా తన మానాన స్వరం తగ్గించుకొని నాతో మాట్లాడుతూ, నువ్వంటే నాకిష్టం. నిన్ను చూసిన మొదటి రోజు నుంచే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను. మొదట్లో అది అట్రాక్షన్ అని అనుకున్నాను కానీ అది నిజమైన ప్రేమే అని ఒక సంవత్సర కాలం క్రితమే నాకు తెలిసింది. ఎప్పుడెప్పుడు నీతో ఈ విషయం చెబుదామా అని చాలాకాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇక నా వల్ల కావడం లేదు, "విల్ యు బి మై ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్?" అంటూ తన చేతిలో ఉన్న రోజెస్ నాకు అందిస్తూ అడిగింది.
అను అంత సడన్ గా నా ముందుకు లవ్ ప్రపోజల్ తీసుకురావడంతో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంతసేపు అను ఎందుకు తీసుకు వచ్చిందో అనే అనుమానం ఉంది గాని ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. కానీ కొద్ది క్షణాల్లోనే నన్ను నేను సంభాళించుకుని షాక్ నుంచి తేరుకుంటూ కొంచెం వాయిస్ తగ్గించి నెమ్మదిగా మాట్లాడుతూ, ఏంటిది అను,,, నన్ను ఇందుకోసమే ఇక్కడికి తీసుకొచ్చావా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నేను నిన్ను కేవలం ఒక స్నేహితురాలు లాగా చూశాను అంతకుమించి నా మనసులో ఏమీ లేదు. కానీ నువ్వేంటి ఇలాంటి పని చేశావు? దీని కోసమే ఇక్కడికి వచ్చినట్లయితే పద ఇంటికి వెళ్దాం అని అన్నాను. నా నుంచి ఇటువంటి సమాధానం ఊహించని అను కళ్ళమ్మట నీటిపొర చేరింది.
తన చేతిలో ఉన్న రోజెస్ కింద పడిపోయాయి. దుఃఖం ముంచుకొస్తూ ఎరుపెక్కిన చెక్కిళ్ళ పైకి కంట్లో నుంచి నీళ్లు జాలువారాయి. కానీ అను మాత్రం కొంచెం ధైర్యంగా ఏడుస్తూనే మాట్లాడుతూ, ఏం నాకేం తక్కువ? చదువుకున్నాను, అందంగా ఉంటాను, నా బాడీ కూడా ఫిట్ గా మెయింటెయిన్ చేస్తున్నాను, అన్నిటికీ మించి నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదు? అని కొంచెం గట్టిగానే అడిగింది. .... ఈ సమయంలో ఇక్కడ ఇలాంటి సంఘటన అస్సలు ఊహించలేదు. అనవసరంగా ఇక్కడ గొడవ పెంచుకోవడం మంచిది కాదని మళ్లీ అంతే నెమ్మదిగా మాట్లాడుతూ, అను నువ్వు నాకు కేవలం స్నేహితురాలివి అని చెప్పాను కదా? నాలాంటి వాడికి ఈ లవ్వు గివ్వు లాంటివి సరిపడవు. అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేసుకొని బాధపడకు అని చెప్పి అక్కడినుంచి మిగిలిన వాళ్ళ వైపు అడుగులు వేశాను.
అను అలాగే ఏడుస్తూ దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో కొంచం గట్టిగానే మాట్లాడుతూ, ఆఆ,,, అలా ఎంత దూరం పారిపోతావో పారిపో,, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. ఏదో ఒక రోజు నువ్వు నా ప్రేమను అంగీకరించి తీరుతావు. నువ్వే వచ్చి నాకు "ఐ లవ్ యు" చెబుతావు. నిన్ను నా వాడిని చేసుకోకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటోంది. నేను మాత్రం పట్టించుకోలేనట్టు నెమ్మదిగా అడుగులు వేస్తూ సోము తార జెస్సీల వైపు కదిలాను. అను గట్టిగా మాట్లాడటం విన్న ముగ్గురు మా వైపు క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టుకొని చూస్తున్నారు. అను అలా మాట్లాడుతూనే కోపంగా బయటి వైపు నడిచి వెళ్లిపోతుంది. అది చూసి సోము తార నా దగ్గరికి వచ్చారు. నేను కూడా అను వెళ్ళిపోవడం చూసి పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ, తార నువ్వు కూడా అను తో పాటు వెళ్ళి తన ఇంటి దగ్గర జాగ్రత్తగా దించేయ్. చాలా కోపంగా ఉంది దారిలో ఏదైనా జరగరానిది జరిగితే అనవసరమైన రచ్చ జరుగుతుంది అని అన్నాను.
డోంట్ వర్రీ మావ,,, నేను చూసుకుంటాలే అంటూ తార అను వెనకాల పరిగెత్తింది. .... సారీ సోము,,, అనవసరంగా ఇక్కడికి వచ్చి మీ మంచి టైం చెడగొట్టాను. నువ్వు కూడా వాళ్లను ఫాలో అయ్యి అను జాగ్రత్తగా ఇంటికి చేరుకున్న తర్వాత తారని పిక్ చేసుకొని వెళ్ళండి అని చెప్పగా సోము కూడా సరే అంటూ వెళ్ళాడు. ఆ తర్వాత నేను కూడా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడి నుంచి బయట వైపు నడిచాను. పార్కింగ్ ఏరియాకు చేరుకునే సరికి రెండు కార్లు అక్కడ నుంచి కదిలాయి. నేను అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి జెస్సీ బైక్ మీద వచ్చి నా పక్కన ఆగుతూ, కమాన్ దీపు,,, అని అన్నాడు. .... లేదు జెస్సి నువ్వు వెళ్ళు,, నన్ను కొంతసేపు ఒంటరిగా వదిలేయ్ అని అన్నాను. .... వర్షం పడేటట్టు ఉంది తడిసిపోతావు నా మాట విని వచ్చేయ్ అని అన్నాడు జెస్సీ. .... ప్లీజ్ జెస్సి,, చెప్పిన పని చెయ్ అని కొంచెం చిరాకుగా చెప్పడంతో జెస్సీ ఇంకేం మాట్లాడకుండా బైక్ మీద వెళ్ళిపోయాడు.
కొద్ది క్షణాల్లోనే చిన్న చినుకులు మొదలయ్యాయి. మూడు బళ్ళు నా కంటికి కనబడకుండా దూరం అయ్యాయి. వర్షం పెద్దదవుతూ ఉండగా నా కంట్లో నుంచి నీళ్లు కూడా దార కట్టాయి. మనసులో ఉన్న దుఃఖం పొంగుకు వచ్చి ఆ జోరువానలో గట్టిగా అరుస్తూ ఏడ్చాను. చాలా కాలం తర్వాత నా గురించి నేను ఏడుస్తున్నాను. అలా ఏడుస్తూనే, నన్ను క్షమించు అను ఈరోజు నేను నీ మనసు నొప్పించాను. కానీ ఏం చేయమంటావు? నీ ప్రేమను పొందే అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను ఒక రాక్షసుడిని. నిన్ను నా దగ్గరకి చేరనిచ్చి ఆ తర్వాత ఏదైనా జరిగి నిన్ను కోల్పోయే శక్తి నాకు లేదు. నీ ప్రేమ గురించి నీకంటే నాకే బాగా తెలుసు కానీ జరగరానిది జరిగి నిన్ను దూరం చేసుకోగలిగేంత ధైర్యం నాకు లేదు అంటూ పైకి చూస్తూ, భగవంతుడా ఏంటి నా రాత ఇలా రాశావు? నన్ను కూడా చిన్నప్పుడే నీ దగ్గరికి తీసుకుని పోయి ఉంటే ఇప్పుడు ఇలా బాధపడే పరిస్థితి ఉండేది కాదు కదా అంటూ అలాగే నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీద మోకాళ్ళపై కూర్చుని ఏడ్చాను.
అలా కొంత సేపు అక్కడే కూర్చుని ఏడ్చి పైకి లేచాను. వర్షం చాలా హోరుగా కురుస్తుంది. నేను అలాగే వర్షంలో నడుచుకుంటూ హైవే రోడ్డు మీదకి చేరి సిటీ వైపు నడక మొదలుపెట్టాను. ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. కానీ అలాగే అనాలోచితంగా నడుస్తూ పోతున్నాను. కొంతసేపటి తర్వాత ఆలోచనల నుంచి తేరుకొని మొహం పైకెత్తి కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసి మొహం తుడుచుకుని స్పీడ్ గా నడవడం మొదలు పెట్టాను. భారీగా వర్షం కురుస్తూ ఉండటంతో రోడ్డు మీద వాహనాలు కూడా ఏమీ నడవడం లేదు. అలా కొంచెం దూరం నడిచి వచ్చి అక్కడ ఒక ఆటో కనబడటంతో అందులో కూర్చుని సిటీలోకి పోనివ్వమని చెప్పాను. నా రూమ్ కి వెళ్లాలని అనిపించడం లేదు. అమ్మ దగ్గరికి వెళ్లాలని ఉన్నా ఈ పరిస్థితుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను. పోనీ అరుణ, పుష్ప వదిన అని కూడా ఆలోచన వచ్చినా ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి వాళ్లకు కూడా తెలియడం నాకు ఇష్టంలేక చివరికి ఆఫీసుకి వెళ్దామని నిర్ణయించుకొని ఆటో డ్రైవర్ తో చెప్పాను.
భారీ వర్షంతో సిటీ అంతా నిర్మానుష్యంగా ఉండి బాగా చీకటి పడిపోయింది. ఆఫీసు ముందు ఆటో దిగి పర్సులో నుంచి డబ్బులు తీసి ఇచ్చి లోపలికి నడిచాను. లిఫ్ట్ లో నేరుగా పై ఫ్లోర్ కి చేరుకొని రెగ్యులర్ గా వెళ్లినట్టు నా ఆఫీస్ వైపు వెళ్లకుండా లిఫ్ట్ కి కొంచెం పక్కకి ఉన్న ఫ్లాట్ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాను. దాంతో నేను వచ్చినట్టు కింద వాచ్ మెన్ కి తప్ప ఎవరికీ తెలియకుండా పోయింది. బహుశా ఈపాటికి అందరూ వెళ్ళిపోయి ఉంటారు అని కూడా అనిపించింది. నేను లోపలికి వెళ్లి డ్రెస్ తీసేసి స్నానం చేసి ఇక్కడ వేరే డ్రెస్ లు ఏమీ లేక పోవడంతో టవల్ కట్టుకొని బట్టలు పిండి హ్యాంగర్ కి తగిలించి ఆరడానికి బాత్రూమ్ కిటికీ దగ్గర తగిలించి బయటికి వచ్చి మంచం మీద వెనక్కి వాలి ఇందాక జరిగిన విషయాన్ని తలుచుకుంటూ ఆలోచనలో పడ్డాను.
నేను చేసిన పని మంచిదేనా? పాపం అను నన్ను చాలా కాలంగా ఎంతో ప్రేమిస్తుంది. నేను తన ప్రేమను అంగీకరించి ఉంటే బాగుండేదా? లేదు లేదు,, ఒకవేళ నా వలన తనకు ఏదైనా జరగరానిది జరిగితే? అలాంటిది ఏదైనా జరిగితే తట్టుకోవడం నావల్ల కాదు. ఇంతకాలం నేను కోల్పోయిన వ్యక్తులు చాలు. ఇప్పుడు నాకు ఇంతమంది దగ్గరైనా, అమ్మ నాకు ఎంత ధైర్యం చెప్పినా ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు భయం కలుగుతూనే ఉంటుంది. అను లాంటి మంచి అమ్మాయికి నావల్ల ఏమీ జరగకూడదు. ఆ మాటకొస్తే ఇకమీదట ఎవరికీ నా వల్ల ఏమి జరగకూడదు. నాకు దగ్గరైన వాళ్లందర్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. నా మీద ఇంత ప్రేమ కురిపిస్తూ నా జీవితంలోకి సుఖసంతోషాలను తీసుకువచ్చిన అందర్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆలోచనలలో మునిగిపోయాను.
**********
అక్కడ తార అను ని తీసుకొని వాళ్ళ ఇంటికి చేరింది. ఆ సమయంలో ఇంట్లో కేవలం దేవి మాత్రమే ఉంది. అను లోపలికి వెళ్తూనే దేవిని వాటేసుకుని ఏడవటం మొదలు పెట్టింది. దేవి కొంచెం కంగారు పడుతూ, ఏమైందిరా అను,,, ఎందుకలా ఏడుస్తున్నావు? అని అడిగింది. .... ఈరోజు నా ఆశలు అన్నీ తలకిందులయ్యాయి. నా ప్రేమ నాకు దూరం అయింది అని ఏడుస్తూ చెప్పింది. .... అసలు ఏమైందిరా? అని అడిగింది దేవి. .... పక్కనే ఉన్న తార మాట్లాడుతూ, అసలు ఏమైంది అంటే,,, అను దీపుకి ప్రపోజ్ చేసింది అని కొంచెం బెరుకుగా చెప్పింది. .... అయితే దీపు ఏమన్నా అన్నాడా దీన్ని? అని అడిగింది దేవి. .... దీపు పెద్దగా ఏమీ అనలేదు కాకపోతే,,, అను ప్రేమని అంగీకరించలేదు. అందుకే ఇలా మనసు నొచ్చుకుని ఏడుస్తుంది అని అంది తార. .... అది విని దేవి అను ని సముదాయిస్తూ, అంతేనా,,, పిచ్చి మొహమా ఆ మాత్రం దానికి అంతలా ఏడవాలా? వాడు ఎందుకు అలా చేశాడో ఏంటో నేను వాడితో మాట్లాడతాలే ఇక నువ్వు ఊరుకో అని సర్దిచెప్పింది.
తార మాట్లాడుతూ, మీరు ఏమి అనుకోకపోతే నేనొక మాట చెబుతాను. అసలు దీపు ఏ పరిస్థితుల్లో అలా వ్యవహరించాడో దానికి ఏదైనా కారణం కూడా ఉండి ఉండొచ్చు కదా? పైగా అను మీ మరదలు ఇంతకు ముందు దీపు మీ దగ్గర పని చేశాడు కూడా అందుకే తను అను ప్రేమని అంగీకరించకుండా వెనకడుగు వేసాడేమో? అందుకే మీరు ఇప్పుడే ఈ విషయం గురించి దీపు దగ్గర ప్రస్తావించడం మంచిది కాదని నా అభిప్రాయం. మరొక విషయం ఏమిటంటే ఇప్పటికైతే దీపు అను ప్రపోజల్ ను మాత్రమే అంగీకరించలేదు. పైగా దీపు ఇంకెవరిని కూడా ప్రేమించడం లేదు కదా? అంటే అనుకి ఇంకా ఛాన్స్ ఉన్నట్టే కదా? అని అంది. .... ఆ మాట వినగానే అను వెంటనే ఏడవడం ఆపేసి, నిజంగా దీపు నా ప్రేమను అంగీకరిస్తాడంటావా? అని అంది.
కమాన్,, చీర్ అప్ అను,,, దీపుకి ఈ ప్రేమ లాంటి వ్యవహారాలు కొత్త. అయినా రోజూ తనతో కాలేజీకి వెళ్లి వస్తున్న నీకు ఎంత మంది అమ్మాయిలు దీపును చూసి లైన్ వేస్తుంటారో తెలీదా? అయినా ఏరోజైనా ఇంకే అమ్మాయినైనా కన్నెత్తి చూసాడా? అంతెందుకు నేనే తనతో బయటికి వెళ్ళినప్పుడు తనకు లైన్ వేసే అమ్మాయిలను చాలామందిని చూశాను. అయినా సరే దీపు ఎప్పుడూ ఎవరి వంక చూడటం నా కంట పడలేదు అని అంది తార. .... అవును ఆ విషయం నాకు కూడా తెలుసు. ఓకే,,, ఇక ఈ దొంగ సచ్చినోడుకి నా ప్రేమ అంటే ఏంటో తెలిసొచ్చేలా చేస్తాను. నాకు ఎంత దూరంగా పరిగెడతాడో నేను కూడా చూస్తాను. ఏ రోజుకైనా నా ప్రేమను అంగీకరించి తీరాల్సిందే అని అనడంతో దేవి మరియు తార నవ్వుకున్నారు. .... సరే అయితే నాకు టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పి తార అక్కడ్నుంచి బయలుదేరుతుంటే, ఇంతకీ మీరు,, అని దేవి అడగడంతో తార దీపుకి ఫ్రెండ్ అని అను పరిచయం చేసింది. ఆ తర్వాత తార అక్కడి నుంచి బయటకు వచ్చి సోముతో కలిసి వర్క్ స్టేషనుకి వెళ్లిపోయారు.
**********
నేను అలా ఆలోచిస్తూ బెడ్ మీద ఎంత సేపు పడుకున్నానో తెలీదు కానీ ఆలోచనలతో బుర్ర వేడెక్కి ఇష్టం లేకపోయినా అను తో అలా వ్యవహరించినందుకు నామీద నాకే కోపం పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక చాలా చిరాకుగా అనిపిస్తోంది ఆలోచనలతో నిద్ర పట్టేటట్టు కనిపించడం లేదు. ఎందుకో తెలియదు గాని నా ఆలోచన మందు వైపు మళ్ళింది. కానీ ఇప్పుడు బయటికి వెళ్లి తెచ్చుకునేంత ఓపిక లేదు. సరే కింద ఎవరైనా సర్వెంట్ ఉంటే వాళ్లతో తెప్పించుకుందాం అని అనుకొని బెడ్ రూమ్ లో నుంచి బయటికి వచ్చి ఆఫీస్ లోకి ఉండే డోర్ ఓపెన్ చేసి ఆఫీస్ లోకి వచ్చాను. ఊహించని విధంగా అక్కడ రజనీ నా టేబుల్ మీద చైర్ లో కూర్చుని ఏవో ఫైల్స్ చూస్తుంది. డోర్ తెరుచుకున్న శబ్దం వినపడటంతో నా వైపు చూసింది.
అదే సమయంలో నేను కూడా రజినీని చూసి నా ఒంటి మీద కేవలం టవల్ మాత్రమే ఉందని గుర్తొచ్చి కంగారు పడుతూ టవల్ జారిపోకుండా చేతులతో పట్టుకుని, అయ్యో,, సారీ,, సారీ,, సారీ,, రజిని,,, అని అన్నాను. .... నన్ను ఈ అవతారంలో చూసిన రజిని కూడా కొంచెం కంగారుపడుతూ లేచి నిల్చుని, సారీ సార్,,, మీరు ఎప్పుడు వచ్చారు? మీరు రావడం నేను చూడలేదు అని అంది. .... ఇట్స్ ఓకే,,, నేను తడిచిపోయి రావడంతో డైరెక్ట్ గా ఫ్లాట్ లోకి వెళ్ళిపోయాను. ఈ పాటికి అందరూ వెళ్ళిపోయి ఉంటారని,,, నాకు వేరే డ్రస్సులు లేవు ఇక్కడ,,, సారీ,, నేనే చూసుకొని రావాల్సింది అని అన్నాను. .... ఇట్స్ ఓకే,,, నో ప్రాబ్లం సార్,,, మీకు ఏమైనా కావాలా? అని అడిగింది. .... నో ఇట్స్ ఓకే,, నేను చూసుకుంటాను. అవునూ,,, నువ్వేంటి ఇంకా ఇంటికి వెళ్లకుండా ఈ టైం వరకు ఆఫీసులో ఉన్నావు? అని అడిగాను.
కొంచెం వర్క్ పెండింగ్ లో ఉంది అది పూర్తి చేసి వెళ్దామని,,, .... పని ఉంటే రేపు చూసుకోవచ్చు అంతే గాని ఇంత రాత్రి వరకు ఆఫీసులో ఉండడం ఏంటి? క్లోజ్ చేసి తొందరగా ఇంటికి వెళ్ళు అసలే రోజులు బాగాలేవు. .... పర్వాలేదు సార్ మీరు ఉండగా నేను వెళ్లిపోవడం,,,, మీకేం కావాలో చెప్పండి నేను అరేంజ్ చేసి వెళ్తాను అని అంది రజని. .... నో నాకు కావాల్సింది నువ్వు చేయగలిగే పని కాదు. అయినా నాకేం కావాలో నేను చూసుకోగలను నువ్వు బయల్దేరి వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావ్? అని అడిగాను. .... మామూలుగా అయితే బస్సులో వెళ్తాను కొంచెం లేట్ అయింది కాబట్టి ఆటోలో వెళ్తాను. మీరు చెప్పండి సార్ నేను అన్ని అరేంజ్ చేసి వెళ్తాను అని మళ్ళీ అడిగింది. .... ఈసారి నేను తన వైపు కొంచెం కోపంగా చూస్తూ టేబుల్ మీద ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసి ఇంటర్ కం లో మాట్లాడుతూ, వాచ్మెన్ ఒకసారి పైన నా ఆఫీస్ లోకి రండి అని చెప్పి పెట్టేశాను.
ఒకసారి రూమ్ లోకి వెళ్లి పర్స్ లో నుంచి డబ్బులు తీసి మళ్లీ ఆఫీస్ రూమ్ లోకి వచ్చాను. మరో రెండు నిమిషాలకి వాచ్మెన్ డోర్ కొట్టి లోపలికి తొంగి చూసాడు. నేను అతని వైపు చూసి సిగ్నల్ ఇవ్వడంతో ఆఫీస్ రూమ్ లోకి రాగా అతని చేతిలో డబ్బులు పెట్టి, నాకు రెండు బీర్లు తీసుకురండి, అలాగే మేడం ఇంటికి వెళ్తున్నారు దగ్గరుండి ఆటో ఎక్కించి నంబర్ నోట్ చేసుకోండి అని చెప్పడంతో, సరే సార్,, అనుకుంటూ వాచ్మెన్ బయటికి వెళ్లిపోయాడు. నేను రజనీ వైపు చూసి, ఇప్పుడు అర్థమైందా నాకు ఏం కావాలో? ఇంకెప్పుడు అవసరమైతే తప్ప ఇంత టైం వరకు ఆఫీసులో ఉండద్దు. నేను లేకపోతే టైం ప్రకారం నువ్వు ఇంటికి వెళ్లిపోవాలి అర్థమైందా? అని కొంచెం సీరియస్ గా చెప్పేసరికి రజిని బుద్ధిగా తల దించుకుని అప్పుడప్పుడు కళ్ళు పైకి లేపి నా వైపు చూస్తూ సరే అన్నట్టు తల ఆడించింది. రజినీ అలా దొంగ చూపులు చూస్తూ ఉండడంతో నేను ఇంకా కేవలం టవల్ చుట్టుకుని మాత్రమే ఉన్నాను అన్న విషయం గుర్తొచ్చి, గుడ్ నైట్,, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి నేను రూమ్ లోకి వెళ్ళిపోయాను.
** రజిని ఈరోజు కొంచెం విచిత్రంగా కనిపించిన దీపుని చూసింది. కళ్ళు బాగా ఎర్రబడి చింపిరి జుట్టు సిక్స్ ప్యాక్ బాడీతో విశాలంగా ఉన్న ఛాతి, మొలకు టవల్ చుట్టుకుని మోకాళ్ళ కింద బలంగా ఉన్న పిక్కలు మొత్తం వెరసి ఒక హీమాన్ ని చూస్తున్నట్టు అనిపించింది తనకి. ఎప్పుడూ చాలా హుందాగా ఒదిగి ఉండే దీపుని చూడటానికి అలవాటు పడిన రజనీకి ఈరోజు దీపులో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ చూసినట్టుగా అనిపించింది. కానీ దీపు ఎందుకో సీరియస్ గా ఉన్నాడు అని గ్రహించిన రజిని ఇంకేమీ మాట్లాడకుండా తన సామాను సర్దుకుని ఇంటికి బయలు దేరింది.**
కొంతసేపటి తర్వాత వాచ్మెన్ వచ్చి డోర్ కొట్టి బీర్లు అందించి, మేడంని ఆటో ఎక్కించాను సార్,, ఇంకేమైనా అవసరమైతే కాల్ చేయండి సార్,, అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను హాల్లో కూర్చుని సాయంత్రం జరిగిన సంఘటన తలుచుకుంటూ అను ని బాధ పెట్టినందుకు నాలో నేనే చింతిస్తూ దాదాపు చాలా రాత్రి వరకు అలాగే కూర్చుని రెండు బీర్లు ఖాళీ చేసేసి ఎప్పుడు లేచి వెళ్ళానో తెలీదుగానీ బెడ్రూంలోకి వెళ్లి పడుకున్నాను.
సార్,, సార్,, సార్,,,, అన్న పిలుపు లోతుగా వినబడుతూ చిన్నగా నా భుజం మీద తడుతున్నట్టు అనిపించడంతో తెలివి వచ్చింది. కానీ కళ్ళు మంటగా ఉండి తెరుచుకోవడానికి ఇబ్బందిగా అనిపించడంతో ఓ పక్క బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ మరో చేతితో కళ్ళు తుడుచుకొంటూ, హ హ,, ఎవరు? అని అన్యాపదేశంగా అంటూ బోర్లా పడుకున్న వాడిని వెల్లకిలా తిరిగి, మసకగా కనబడుతున్న రజినీని చూసి నేను ఆఫీసు ఫ్లాట్ లో ఉన్నాను అన్న విషయం గుర్తొచ్చి ఒకసారి నా నడుముకి చుట్టుకున్న టవల్ తడుముకుని పక్కనే ఉన్న దుప్పటి పైకి లాక్కుని లేచి కూర్చున్నాను.
ఏంటి నువ్వు అప్పుడే డ్యూటీకి వచ్చేసావా,, టైం ఎంతయింది? అని కొంచెం మత్తుగానే అడిగాను. .... గుడ్ ఈవెనింగ్ సార్,,, ఇప్పుడు టైం సాయంత్రం నాలుగు అవుతుంది. ఇంతసేపు మీరు నిద్ర లేవకపోయేసరికి నేనే లోపలికి రావాల్సి వచ్చింది. సారీ సార్,, అని అంది రజిని. .... ఆ మాట వినగానే దెబ్బకి నా మత్తు వదిలిపోయి తల విధుల్చుకున్నాను. రాత్రి రెండు బీర్లు తాగి ఏమీ తినక పోవడం వలన కొంచెం నీరసంగా హ్యాంగోవర్ తో తల నొప్పిగా అనిపించి రెండు చేతులతో తల పట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం తేరుకొని, ఏంటి సాయంత్రం అయ్యిందా? నేను ఇంతసేపు పడుకున్నానా? సరేలే నన్ను లేపి మంచి పని చేశావు. నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను నాకు చాలా ఆకలిగా ఉంది కొంచెం కాఫీ టిఫిన్ ఏర్పాటు చెయ్ అని చెప్పగా, ఓకే సార్,, అంటూ రజిని బయటికి వెళ్లి పోయింది.