Episode 118.2


ఇంతకాలంగా నేను వాడిని ఎంత ద్వేషించినా వాడు ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. చిన్నతనంలో నువ్వు చెప్పిన కథలు మాటలు సైతం వాడికి ఇంకా గుర్తున్నాయి. చివరికి వాడు తన ప్రాణాలను సైతం ఈరోజు నా చేతిలో పెట్టాడు. ఎందుకమ్మా,, వాడు ఎందుకు ఇలా చేశాడు? మేము వాడి పట్ల వ్యవహరించిన తీరు సరైనదేనా? లేదంటే నిజంగానే వాడి కారణంగానే నువ్వు మాకు దూరం అయ్యావా? నాకిప్పుడు ఏది నిజమని నమ్మాలో అర్థం కావడం లేదమ్మ. ఈరోజు వాడు అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదనిపిస్తోంది. ఇప్పుడు పెద్ద దానివి అయ్యావు అయినా ఇంకా ఆలోచించలేక పోయావా? అని వాడు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలమ్మ? అంటూ అలా తన తల్లి ఫోటో పట్టుకొని రోదిస్తూ ఉంది.
**********​

ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక పెద్దమనిషి దిగి హడావిడిగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు. రిసెప్షన్ దగ్గర వాకబు చేసి లోపలికి నడిచాడు. అక్కడ మరొక వ్యక్తి మరికొంత మంది అనుచరులు ఉన్న చోటికి వెళ్తూనే, ఎక్కడున్నాడు నా బిడ్డ? అని ఆదుర్దాగా అడిగాడు. .... అక్కడున్న వ్యక్తి మాట్లాడుతూ, డాడ్ వాడికి లోపల ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పాడు. .... ఎవరు చేశారు ఇదంతా? అని అడిగాడు ఆ పెద్దమనిషి. .... పక్కనే ఉన్న అనుచరులలో ఒకరు మాట్లాడుతూ, అనిల్ అన్న కాలేజీలో గొడవ జరిగింది. అక్కడ జరిగిన కొట్లాటలో,,, అని ఆగిపోయాడు. ఆ పెద్దమనిషి అనిల్ గాడి తండ్రి అలాగే ఇంతకు ముందు మాట్లాడిన వ్యక్తి అనిల్ గాడి అన్న.

నా కొడుకు మీద చెయ్యి చేసుకునేంత ధైర్యం ఎవడికి వచ్చింది? అని అడిగాడు. .... నా మనుషులు అదే విషయం కనుక్కునే పనిలో ఉన్నారు అని అన్నాడు అనిల్ అన్నయ్య. .... తొందరగా తెలుసుకో,, వాడు ఎవడైనా సరే నేనే స్వయంగా వాడిని నా చేతులతో చంపాలి అని ఉక్రోషంగా అన్నాడు అనిల్ గాడి బాబు. .... డాడ్ తొందరపడి ఏదో ఒకటి చేయడం వలన మనకే భారంగా మారుతుంది. ఈ విషయంలో మనం కొంచెం ఆలోచించి అడుగులు వేయాలి. అంతేకాదు మన చిన్నోడికి ఈ గతి పట్టించిన వాళ్ళ మీద మన చిన్నోడే ప్రతీకారం తీర్చుకోవాలి. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో, ఇప్పుడు అనిల్ కి ఎలా ఉంది? అని అడిగాడు అనిల్ గాడి అన్నయ్య.

చూడండి అతనికి ఒక చెయ్యి విరిగింది. అలాగే తలమీద చాలాచోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది అని మాత్రం చెప్పగలను. కానీ ఎప్పటికి స్పృహలోకి వస్తాడు అన్న విషయం మాత్రం చెప్పలేము అని అన్నాడు డాక్టర్. .... తొందరగా నా కొడుకుని స్పృహలోకి తీసుకురండి డాక్టర్ అన్నాడు అనిల్ గాడి బాబు. .... మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్పి డాక్టర్ తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. .... డాడ్ మీరు ఇంటికి వెళ్ళండి అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను అని అన్నాడు అనిల్ గాడి అన్నయ్య. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనిల్ గాడి బాబు.
**********​

అను కార్ డ్రైవ్ చేస్తుంటే నేను పక్కన కూర్చుని అను వైపు చూస్తూ ఉన్నాను. మనసులో ఇంకా ఏదో తెలియని భయం కలవరపెడుతోంది. ఇప్పుడు నేను తనను ప్రేమిస్తున్నానని నా ప్రేమను అందరిముందు వ్యక్తపరిచాను. కానీ ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మేము విడిపోవాల్సి వస్తే? లేదంటే నా కారణంగా అనుకి ఏదైనా జరిగితే? అన్న ఆలోచన నన్ను కుదురుగా ఉండనివ్వడంలేదు. లేదు లేదు,,, ఇకమీదట నా కారణంగా అనుకి ఏమీ కానివ్వను అని మనసులో అనుకున్నాను. అంతలో మేము నా రూంకి చేరుకున్నాము. రూమ్ లోకి వెళ్ళగానే నేను నా షర్ట్ తీసి మార్చుకున్నాను. అను నా రూమ్ కి రావడం ఇదే మొదటిసారి కావడంతో మంచం మీద కూర్చుని నా రూమ్ చుట్టూ పరిశీలనగా చూస్తోంది.

ఏం చూస్తున్నావు అను? .... నీ ప్యాలస్ చూస్తున్నాను అని అంది. .... నేను చిన్నగా నవ్వుతూ, ఏంటీ,,,? అని అడిగాను. .... ఎప్పుడు చూసినా కొంపలంటుకు పోయినట్టు నా రూమ్ కి వెళ్ళాలి అని పరిగెడుతుంటావు కదా ఇక్కడ అంత గొప్ప రహస్యమైన విషయం ఏముందా అని చూస్తున్నాను అని సరదాగా జోక్ చేసి, అది సరేగాని నిన్ను ఒక మాట అడగనా? అని అంది. .... మ్,, అడుగు. .... ఇంతకు ముందు నువ్వు నన్ను ఎందుకు కాదన్నావు? అని అడిగింది. .... ఈ ప్రశ్నకు సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పద అక్కడే అందరి ముందు చెబుతాను అంటూ అను ని తీసుకుని వర్క్ స్టేషనుకి వెళ్ళాను.

లోపలికి వెళ్ళేసరికి అందరూ హాల్లో కూర్చున్నారు. మేము కూడా వాళ్లతో పాటు కూర్చుని, ఇప్పుడు మళ్లీ అడుగు అని అనుతో అన్నాను. .... అను మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో నేను అందరి వైపు చూసి, మీకు కూడా సమాధానం తెలుసుకోవాలని ఉంది కదా అని అడగగా అందరూ అవును అని తలాడించారు. సరే అయితే వినండి. చిన్నతనం నుంచి నన్ను అందరూ నష్టజాతకుడు రాక్షసుడు అని అనేవారు. నా నష్టజాతకం కారణంగానే నా తల్లి చనిపోయిందని అన్నారు. అలాగే నా జీవితంలో జరిగిన మరికొన్ని సంఘటనల వలన నేను కూడా నిజంగానే నష్టజాతకుడిని రాక్షసుడిని అని మనసులో ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే జీవితంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి. అందుకే నిజాన్ని బయట పెట్టడానికి ధైర్యం చేయలేకపోయాను.

కానీ ఆరోజు టెర్రరిస్టుని పట్టుకున్నప్పుడు మళ్లీ ఈరోజు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అనుకోకుండా నా మనసులోని నిజం బయటకి వచ్చేసింది. అందుకే ఆ నిజాన్ని అంగీకరించి ముందుకు సాగడమే మంచిది అనిపించింది. ఎంతకాలమని ఈ నిజాన్ని నాలోనే దాచుకోగలను. పైగా అను ని ఎవరైనా ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆరోజు క్యాంటీన్ లో గొడవ మొదలైంది కూడా అందుకే. ఆ గొడవే ఈరోజు ఈ సంఘటన జరగడానికి దారి తీసింది. నేను దగ్గర ఉండగా అను ని కాపాడుకోలేకపోతే ఎలా? ఆరోజు వద్దనడానికి ఈరోజు బాహాటంగా ఒప్పుకోవడానికి ఇది కారణం అని అన్నాను. .... ఈ మాట విన్న ముగ్గురు నా దగ్గరకు వచ్చి హగ్ చేసుకుని అభినందించారు. అను నా కళ్ళలోకి ప్రేమగా చూస్తూ తన మీద నాకున్న ప్రేమకు పొంగిపోతూ నా చెయ్యి పట్టుకుని కూర్చుంది.

అది సరే గానీ జెస్సీ, సోము అసలు ఆ అనిల్ గాడికి మీకు మధ్య ఉన్న గొడవ ఏంటి? అని అడిగాను. .... జెస్సి మాట్లాడుతూ, ఇది కొంచెం పాత కథ. మేము కూడా అదే కాలేజీలో చదువుకున్నాము. అనిల్ గాడు మేము ఒకే క్లాస్. వాడికి మాకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఎప్పుడూ వాడు ప్లాన్ చేసి ఏదో ఒక వెధవ పని చేయడం మేము దానిని అడ్డుకుని జరగకుండా చేయడం జరిగేది. ఆ గొడవలు చాలా పర్సనల్ లెవెల్ వరకు చేరుకొని మా మధ్య శత్రుత్వం పెరిగింది. కొంతకాలం క్రితం నీ కళ్ళ ముందే ఒక యాక్సిడెంట్ జరిగింది గుర్తుంది కదా. ఒక ట్రక్కు వచ్చి కారును ఢీ కొట్టడం ఆ తర్వాత ట్రక్కు తగలబడిపోవడం. .... ఆ గుర్తుంది,,, ఆ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. అయినా దానికి ఈ అనిల్ గాడితో గొడవకి సంబంధం ఏమిటి? అని అన్నాను.

అసలు ముందు పూర్తి కథ విను. ఆరోజు ట్రక్కు కారుని ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయింది. ఆ కారు ఎగిరిపడి అందులో నుంచి రక్తం ఓడుతున్న ఇద్దరు వ్యక్తులను అంబులెన్స్ పిలిపించి నువ్వు రక్షించావు. ఆ ఇద్దరం మేమే. ఆరోజు మేము రక్తంతో తడిసి ఉండడంవల్ల నువ్వు మమ్మల్ని గుర్తు పట్టలేకపోయి ఉండొచ్చు కానీ నువ్వు మమ్మల్ని రక్షిస్తునప్పుడు జెస్సి కొంచెం స్పృహలోనే ఉండడంతో నిన్ను గుర్తు పెట్టుకోగలిగాడు. ఆ తర్వాత మేము ఎంత ప్రయత్నించినా నిన్ను కలుసుకోలేకపోయాము. ఆ తర్వాత ట్రైనింగ్ బిజీలో పడి మళ్లీ మేము నీ దగ్గరికి ఇలా వచ్చేసరికి చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఆ రోజు ఆ ఆక్సిడెంట్ జరగడానికి కారణం అనిల్ గాడే. ఎందుకంటే వాడు కాలేజీలోకి డ్రగ్స్ తీసుకురావడంతో వాడిని పట్టుకుని కొట్టాము. వాడితో అంతకు ముందు నుండే ఉండే గొడవలు ఇప్పుడు వాడి డ్రగ్స్ బిజినెస్ కి అడ్డుపడుతున్నామన్న కోపంతో మమ్మల్ని చంపడానికి వాడు వేసిన ప్లాన్ అది అని అన్నాడు సోము.

ఓహో,, అదన్నమాట సంగతి? అని అన్నాను. .... అవును దీపు వాడిది మాది పాత శత్రుత్వం. అందుకే నువ్వు ఆరోజు క్యాంటీన్ లో జరిగిన గొడవ గురించి చెప్పినప్పుడు మాకు ఎందుకో డౌట్ వచ్చింది. అంత ధైర్యంగా నీ మీద ఎటాక్ చేయడానికి ప్రయత్నించారు అంటే అది ఖచ్చితంగా వాడి మనుషుల పనే అయి ఉంటుందని మేము అనుకున్నాము. అందుకే నువ్వు మళ్లీ కాలేజీకి వెళ్ళినప్పుడు నిన్ను ఫాలో అవుదామని ఆ రోజే నిర్ణయించుకున్నాము. అనుకున్న విధంగానే ఈరోజు నువ్వు బయలుదేరిన తర్వాత నీకు తెలియకుండా వెనకాల ఫాలో అవుతూ వచ్చాము. మేము ఊహించినదే నిజమైంది అని అన్నాడు జెస్సీ. .... ఆ తర్వాత మేమంతా కొంత సేపు సరదాగా మాట్లాడుకుని నేను అను బయటకు వచ్చాము. అను మాత్రం బయలుదేరకుండా అక్కడే తన కారుకు చేరబడి నిల్చొని నా వైపే చూస్తూ ఉంది. .... హేయ్,, ఏంటలా చూస్తున్నావు,, ఇంటికి వెళ్ళవా? అని అడిగాను. .... అను కొంచెం గారాలుపోతూ, నాకు నిన్ను వదిలి వెళ్లాలని అనిపించడంలేదు అని ముద్దు ముద్దుగా అంది. .... ఊహుం,,, ఎందుకలాగా? అంటూ నేను కూడా తనకు మరింత దగ్గరగా జరిగి తన భుజాల మీదుగా కారు మీద చేతులు పెట్టి చిన్న నవ్వు నవ్వుతూ అడిగాను. .... అను సిగ్గుపడుతూ, ఏమో తెలీదు,, నీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది నీతో కలిసి తిరగాలి అనిపిస్తుంది పద నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు అంటూ నన్ను వాటేసుకుంది. .... మేము రోడ్డుమీద ఉండడంతో నేను తనని నా నుంచి దూరం చేస్తూ, ఇది టైం కాదు,, మరోసారి నేనే తీసుకొని వెళ్తాను అని అన్నాను. .... తను నా కళ్ళలోకి చూస్తూ, నిజంగా?? అని అడిగింది. .... యస్,, మరోరోజు తీసుకెళ్తాను ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు అని కారులో కూర్చోబెట్టి బాయ్ చెప్పి ఇంటికి పంపించాను.
**********​

అను కార్లో ఇంటికి వెళ్తుంది. ఈరోజు జరిగినది భయంకరమైన సంఘటన అయినప్పటికీ అనుకి మాత్రం తన కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. తన మొహంలో ఒక తీయని చిరునవ్వు మెరుస్తూ తన అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఇంటికి చేరుకోగానే కార్ లో నుంచి దిగి చెంగు చెంగున ఎగిరుకుంటూ మరింకే విషయం పట్టించుకోకుండా హుషారుగా పరిగెత్తుకుంటూ మెట్లెక్కి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. అను అయితే పరిసరాలను పట్టించుకోలేదు కానీ వంటగదిలో ఉన్న దేవి అను చాలా హుషారుగా గెంతుకుంటూ వెళ్లడం చూసింది. అను తన రూమ్ లోకి వెళుతూనే బెడ్ మీదకి దూకి తలగడను గట్టిగా హత్తుకొని ఆనందంతో మంచం మీద పొర్లుతోంది.

తనలో తానే మురిసిపోతూ, మొత్తానికి ఈ రోజు నా ప్రేమ నాకు దక్కింది. ఇంతకాలం నా నిరీక్షణ ఫలించింది. ఇంతకాలం నా దీపు ఎంత దుఃఖాన్ని సహించాడో ఇప్పుడు అంతకు మించి సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటాను. తన మనస్సులోని బాధ ఎంత లోతయినదో ఈ రోజు తన మాటల ద్వారా తెలిసింది. ఎన్నో సంవత్సరాల నుండి తన మనసులో గూడుకట్టుకున్న విషాదం మొత్తం ఈరోజు బయటపెట్టాడు. అయినా వాళ్లేం కుటుంబ సభ్యులు,, దీపు పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా? ఇక మీదట నా దీపుకి తను కోరుకున్న అన్ని సంతోషాలను ఇస్తాను. లవ్ యూ దీపు,,, ఐ లవ్ యు సో మచ్,,, అంటూ తనలో తానే అనుకుంటున్నట్టు బయటికే అంటున్న సమయంలో డోర్ దగ్గర నిల్చున్న దేవి ఇదంతా చూస్తుంది.

అను సంతోషంగా కనిపించడంతో దేవి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. దేవి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్లి బెడ్ మీద కూర్చుంది. తనను గమనించకుండా తన ఆలోచనలలో ఉన్న అను తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది. వెంటనే అను వెనక్కి తిరిగి చూసి తన వదిన మరియు బెస్ట్ ఫ్రెండ్ అయిన దేవి ఒడిలో తల పెట్టుకుని, వదిన ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంది. .... ఆహా అలాగా,, మా డార్లింగ్ ఎందుకంత సంతోషంగా ఉంది? అంటూ ముద్దు చేసింది. .... వదిన,, మొత్తానికి ఈ రోజు దీపు నాకు ప్రపోజ్ చేశాడు అది కూడా కాలేజీలో అందరిముందు అని మురిసిపోయింది. ఓఓహ్,, వావ్,,, నా తమ్ముడు చాలా డేరింగ్ ఫెలో,, అని అంది.

అంతేకాదు ఎవరైనా నా వైపు కన్నెత్తి చూసినా ప్రాణాలు తీసేస్తానని అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాడు. .... ఆహా,, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు అని అడిగింది దేవి. .... అయితే విను,, అంటూ అను కాలేజీలో జరిగిన మొత్తం సంఘటన వివరంగా చెప్పింది. .... ఏంటి,,, అలాంటి అక్కలు కూడా ఉంటారా? అంటే జరిగిన సంఘటన వెనుక ప్లాన్ మొత్తం దీపు వాళ్ళ అక్కదా? ఆ అనిల్ గాడు ఒక మీడియేటర్ మాత్రమేనా? అని అడిగింది దేవి. .... నాకైతే అలాగే అనిపిస్తుంది వదిన. పాపం దీపు చాలా ఏడ్చాడు అని అంది అను. .... సరేలే మీ అన్నయ్య భోజనానికి వచ్చే టైం అవుతుంది నేను వెళ్లి భోజనం ప్రిపేర్ చేయాలి అంటూ దేవి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అను మళ్ళీ తన మధుర భావనలలో మునిగిపోయింది.
**********​

మరుసటి రోజు పొద్దున్న మా టీం అందరం జాగింగ్ మరియు జిమ్ పూర్తి చేసుకుని తయారయ్యి కాలేజీకి వచ్చాము. నిన్న జరిగిన సంఘటన సాధారణ విషయం కాదు కాబట్టి ఎందుకైనా మంచిదని నా టీం కూడా నాతో పాటు కాలేజీకి వచ్చారు. నిన్న జరిగిన సంఘటన కారణంగా కాలేజీలో అందరూ మా వైపు విచిత్రంగా చూస్తున్నారు. కానీ మేము దాన్నేమీ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత కొంత సేపటికి అను, జ్యోతి, మోహిత్ కూడా వచ్చి మాతో కలిశారు. మేమంతా క్లాస్ కి అటెండ్ అవ్వగా నా టీం బయట గ్రౌండ్ లో కూర్చుని కాలక్షేపం చేశారు. కొన్ని పీరియడ్లు తర్వాత బ్రేక్ లో అందరం కలిసి వెళ్లి క్యాంటీన్ లో కూర్చున్నాము. ఆ సమయంలో కార్తీక కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి క్యాంటీన్ లో కూర్చుంది. తన చూపు మాత్రం మా వైపే ఉంది. అది చూసి అను సడన్ గా నా చెయ్యి పట్టుకుని కూర్చుంది. నేను అను వైపు చూడగా తను నా వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చింది. నేను కూడా ఒక స్మైల్ ఇచ్చి ఊరుకున్నాను.

ఆ తర్వాత మేము అంతా అక్కడే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాము. నిన్న అను బయటికి వెళ్దాం అని అడిగిన విషయం గుర్తొచ్చి, గయ్స్,, మనం ఒక రోజు బయటికి వెళ్లి సరదాగా తిరిగి వద్దామా, ఏమంటారు? అని అడిగేసరికి అను తప్ప అందరూ నా వైపు కొంచెం విచిత్రంగా చూశారు. .... తార మాట్లాడుతూ, అదిగో చూడండి నేను చెప్పానా,, ఈడు మారిపోయాడు అని అంది. .... అవునే తార,,, ఎప్పుడూ చాలా సీరియస్ గా ఉండే కుర్రాడు చాలా మారిపోయాడు. నిన్న అలా తన ప్రేమను బయట పెట్టాడో లేదో ఒక్కరోజులో ఎంత మార్పు? అంటూ నా మీద జోక్ వేశాడు జెస్సీ. వాళ్ళిద్దరి మాటలకి మిగిలిన వారంతా నవ్వుకున్నారు. నేను మాత్రం నెత్తి మీద చెయ్యి వేసుకుని కొట్టుకుంటూ, ప్చ్,, ష్,, అలాంటిదేమీ లేదురా బాబు. బయటకు తీసుకువెళతాను అని నిన్న అనుకి మాటిచ్చాను అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అని అన్నాను.

అవున్రా,, దీపు చెప్పింది బాగుంది. ఇప్పుడు మనం ఎలాగూ ఖాళీగా ఉన్నాము కదా సరదాగా అందరం బయటికి వెళితే బాగుంటుంది అని అన్నాడు సోము. .... వెంటనే తార కూడా ఓకే అని అంది. ఇటు జ్యోతి కూడా ఓకే అంది. నేను అనుతో మాట్లాడుతూ, అను నీకు గుర్తుందా మన ఫ్యామిలీ అంతా పిక్నిక్ కి వెళ్ళాం కదా ఆ ప్లేస్ కి వెళ్తే బాగుంటుంది కదా? అని అన్నాను. వెంటనే అను ఓకే అనడంతో, అయితే నెక్స్ట్ సండే వెళ్దాం ఈ లోపు నాకు కొంచెం ఆఫీస్ పనులు ఉన్నాయి అని చెప్పాను. అందరూ అందుకు ఓకే అన్నారు. ఆ తర్వాత మేము మిగిలిన క్లాసులు చూసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాము. మధ్యాహ్నం నేను నా టీం తో కలిసి భోజనం చేసి ఆఫీసుకి బయలుదేరాను.
**********​

అనిల్ గాడి ఇంట్లో వాడి బాబు తన చేతిలో ఉన్న ఫోటోలు చూస్తూ, నా కొడుక్కి ఈ గతి పట్టించింది వీళ్ళు ముగ్గురేనన్నమాట? వీళ్లలో ఒకడు దీపక్ వర్మ కదా? వీడిని నేను ఎంతో కాలంగా చంపాలని చూస్తున్నాను. కానీ ప్రతిసారీ తప్పించుకొని పోతున్నాడు అని మనసులోనే అనుకున్నాడు. .... అంతలో అనిల్ గాడి అన్నయ్య సోము, జెస్సీల ఫోటోలు చూపించి మాట్లాడుతూ, వీళ్ళిద్దరిని మన చిన్నోడు కొంతకాలం క్రితం ట్రక్కుతో యాక్సిడెంట్ చేయించి చంపడానికి ప్రయత్నించాడు. మన చిన్నోడికి వీళ్ళిద్దరితో పాత శత్రుత్వం ఉంది. మన చిన్నోడికి ఈ గతి పట్టడానికి కారణం వాళ్ళిద్దరే. ఇక ఆ మిగిలిన వాడు దీపక్ వర్మ. మన చిన్నోడే వాడిని కొట్టాడు అని ఇన్ఫర్మేషన్ అని అన్నాడు. .... సరే సరే,,, ఒక్కసారి మన చిన్నోడ్ని స్పృహలోకి రానివ్వు ఆ తర్వాత వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అన్నాడు అనిల్ గాడి బాబు. .... సరే అయితే నా పని పూర్తయింది ఇకమీదట ఈ విషయంలో నేను తలదూర్చను. ఏం చేయాలో మీ ఇష్టం మీరు చూసుకోండి అని చెప్పి తన తండ్రికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అనిల్ గాడి అన్నయ్య. .... అనిల్ గాడి బాబు అక్కడే ఉన్న తన అనుచరులను చూసి, మీరు వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి ఫోటోల వైపు తీవ్రంగా చూస్తూ పళ్ళు నూరాడు.

Next page: Episode 119.1
Previous page: Episode 118.1