Episode 122.1
జెస్సీ నమ్మలేనట్టు పరిగెత్తుకొని వస్తున్న జాహ్నవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. జాహ్నవి మాత్రం అక్కడి నుంచి తప్పుకో జెస్సీ,,, అని అరుచుకుంటూ జెస్సీ వైపు దూసుకొస్తోంది. మరోపక్క నుంచి మేము కూడా ఏం జరుగుతుందో అర్థంకాని స్థితిలో ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉన్నాము. జాహ్నవి జెస్సీకి మరో పది అడుగుల దూరంలో ఉందనగా హఠాత్తుగా కుప్పకూలిపోయింది. దాంతో జెస్సీ మైకం తొలగి ఆశ్చర్యంలో నుంచి బయటికి వచ్చి, జాజాజాను,,, అని అరుస్తూ కూర్చున్న చోటు నుండి లేచి ముందుకు పరిగెత్తి జాహ్నవిని అందుకున్నాడు. జాహ్నవి ఎందుకు అలా కుప్పకూలిపోయిందో అర్థం కాని నాకు తన వీపు మీద బట్టలపై పెరుగుతున్న రక్తపు మరక కనపడటంతో ఎవరో షూట్ చేశారు అని అర్థమై అక్కడే కారు డాష్ బోర్డు క్యాబిన్లో ఉన్న మా టీం ముగ్గురి గన్స్ తీసి సోము మరియు తార వైపు విసిరి అందించి నేను జెస్సీ గన్ పట్టుకొని, గగగయ్స్,, ఎవరో జాహ్నవిని షూట్ చేశారు బి అలర్ట్,,, అని కేకలు వేస్తూ ముందుకు ఉరికాను.
జాహ్నవి పరిగెత్తుకొని వచ్చిన దిశలో వెనకవైపు చూడగా కొంచెం దూరంగా పొదలు మాత్రమే కనపడ్డాయి. ఇటువైపు బులెట్ తగిలి అరుస్తూ పడిపోయిన జాహ్నవిని చూసి ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న జెస్సీ పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి జాహ్నవిని పొదివి పట్టుకుని, జాను,, జాను,, లే జాను,, ఎవరు చేశారు ఈ పని,, జాను,,, అని బాధపడుతున్నాడు. .... జాహ్నవి మాత్రం జెస్సీ,,, అని మాత్రమే అనగలిగింది. .... జెస్సీ ఏడుస్తూ, చెప్పు జాను,,, అని ఆతృతగా అడిగాడు. .... జాహ్నవి మాట్లాడలేక తన చేతిని వెనకవైపు దూరంగా ఉన్న పొదల వైపు చూపించి సైగ చేస్తూ ఓపిక లేక కళ్ళు మూసి స్పృహ తప్పింది. నేను మరో నాలుగు అడుగులు ముందుకు వేసి నిశితంగా పరిశీలించగా స్నైపర్ తాలూకా లెన్స్ చిన్నగా నల్ల చుక్కలాగా కనబడింది.
వెంటనే నేను సోముని అలర్ట్ చేస్తూ అటు వైపు వెళుతుండగా మరో బుల్లెట్ ఫైర్ అయ్యింది. ఈసారి అది సోము వైపు దూసుకు రాగా సోము ముందుగానే అలర్ట్ అయ్యి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇంతలో నేను నా పని పూర్తి చేశాను. ఆ బుల్లెట్ వచ్చిన దిశలో షూట్ చేసేసరికి అది వెళ్లి ఆ షూటర్ చేతికి తగిలింది. దాంతో అతని చేతి నుంచి స్నైపర్ జారిపోగా ఆ షూటర్ అక్కడి నుంచి వెనుతిరిగి పరిగెత్తబోయాడు. కానీ నేను సోము వెంటనే అలర్ట్ అయ్యి అతని కాళ్ళ మీద సూట్ చేసేసరికి వాడు కిందపడ్డాడు. మేమిద్దరం పరిగెత్తుకొని వాడి దగ్గరకు వెళ్లి వాడిని పైకి లేపి పట్టుకుని, చెప్పరా ఎవరు పంపించారు నిన్ను? అని అడిగాను. .... నాకు కేవలం ఈ పని చేయమని సుపారీ ఇచ్చారు అంతే అని అన్నాడు. .... సుపారీ ఇచ్చినవాడు ఎవడు వాడి పేరేంటి? అని అడిగాను.
** కానీ దీపు అండ్ టీం కి తెలియకుండా అక్కడికి మరికొంచెం దూరంలో ఉన్న మరో మనిషి ఫోన్లో మాట్లాడుతూ, సార్ ఆ షూటర్ ఫెయిల్ అయ్యాడు. ఆ కుర్రాళ్ళకి దొరికిపోయాడు అని చెప్పాడు. .... అటు నుంచి ఫోన్ లో ఉన్న వ్యక్తి, అయితే వాడిని లేపేయండి అని అన్నాడు. .... సరే సార్,,, అని ఫోన్ కట్ చేసి శబ్దం రాకుండా సైలెన్సర్ బిగించి ఉన్న గన్ పొజిషన్ లో పెట్టుకొని అక్కడ దీపు మరియు సోము ఆ షూటర్ ని ప్రశ్నిస్తున్న సమయంలో షూట్ చేసి అక్కడి నుంచి తమ మనుషులతో పరారయ్యాడు.**
తొందరగా పేరు చెప్పరా,, అని నేను గద్దించి అడగడంతో ఆ షూటర్, వాడి పేరు,,,, అని చెప్పబోతున్నంతలో ఒక బుల్లెట్ నేరుగా వాడి తలలోనుంచి దూసుకుపోయి వాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే మాకు షాక్ తగిలి అలర్ట్ అయ్యి చుట్టూ చూసేసరికి ఏమీ కనబడలేదు. ఇప్పుడు మేము చాలా పెద్ద ఆపదలో ఉన్నాము అని అనిపించడంతో, సోము,, నువ్వు జెస్సీ కలిసి అమ్మాయిలందరినీ తొందరగా ఇక్కడ నుంచి తీసుకుని బయలుదేరండి. నేను ఇక్కడి సంగతి చూసుకుంటాను మీరు జాహ్నవిని తొందరగా మనం రెగ్యులర్ గా వెళ్లే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి. నాకు మన కారు వదిలేసి మీరందరూ నా SUVలో వెళ్ళండి అని చెప్పాను. .... సోము సరే అని చెప్పి మిగిలిన వాళ్ళ దగ్గరకు వెళ్లి, జెస్సీ తొందరగా పద జాహ్నవిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలి. తార, అను మీరందరూ కూడా తొందరగా కారెక్కండి అని అన్నాడు సోము.
జరిగిన సంఘటనతో భయపడుతున్న అను మాట్లాడుతూ, మరి దీపు ఎక్కడ? అని అడిగింది. .... దీపు వచ్చేస్తాడు ముందు మీరు తొందరగా కారెక్కండి లేదంటే దీపు కోప్పడతాడు అని తొందరపెట్టాడు. అందరూ కలిసి జాహ్నవిని కార్ లోకి ఎక్కించి మిగిలిన వాళ్ళు కూడా ఎక్కి సర్దుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. నేను మాత్రం ఆ చుట్టుపక్కల కొంచెం దూరం వరకు వెతికి చూసినా ఎవరూ కనబడకపోవటంతో తిరిగి ఆ షూటర్ బాడీ దగ్గరకు వచ్చాను. ఇంతలో ఏదో అనుమానం రావడంతో వెంటనే ఫోన్ తీసి తారకి కాల్ చేశాను. తార కాల్ లిఫ్ట్ చేయగానే సోము డ్రైవ్ చేస్తున్నాడు అని తెలుసుకొని, వెనక నుంచి తమను ఎవరైనా ఫాలో అవుతున్నారేమో జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండమని తారతో చెప్పాను. అలాగే తమ కంటే ముందుగా వెళ్తున్న ఏదైనా అనుమానాస్పద వెహికల్ కనబడితే నోట్ చేసుకోమని చెప్పి కాల్ కట్ చేశాను.
ఆ తర్వాత నేను షూటర్ దగ్గర వెతకగా వాడికి సంబంధించి ఒకటి రెండు ఐడి ప్రూఫ్ లు తప్ప మరేమీ దొరకలేదు. వాడి దగ్గర మొబైల్ కూడా లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. వెంటనే నేను చీఫ్ కి కాల్ చేశాను. చీఫ్ కాల్ కనెక్ట్ అయి, యస్ దీపు,, అని అన్నారు. .... సార్ మా మీద ఎటాక్ జరిగింది అని వివరంగా జరిగింది చెప్పాను. .... ఉఫ్,,, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ముందే చెప్పాను. ఎనీవే,, నేను లోకల్ సెక్యూరిటీ అధికారి తో మాట్లాడి అక్కడికి పంపిస్తాను నువ్వు వాళ్లకి బాడీ హ్యాండోవర్ చేసి అక్కడినుంచి వచ్చేసేయ్ అని చెప్పి కాల్ కట్ చేశారు. కొంతసేపటికి ఒక ఎస్సై కానిస్టేబుల్ తో సహా జీపులో అక్కడికి వచ్చాడు. వారి వెనకాలే ఒక అంబులెన్స్ కూడా వచ్చింది. నేను వాళ్లకు బాడీ చూపించి దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించి వాడి స్నైపర్ కూడా ఆంబులెన్స్ లో పెట్టించి, మీకు ఫోన్లో ఏం చెప్పారో అలా చేయండి అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాను.
**********
ఇక్కడ దీపు అండ్ టీం కి తెలియని విషయం ఏమిటంటే, ఆ రోజు కాలేజీలో గొడవ జరిగిన తర్వాత వాడు అంత తొందరగా కోలుకోలేడని ఆ అనిల్ రాజు గాడి మీద దీపు టీం పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఈ వారం పది రోజుల గ్యాప్ లో హాస్పిటల్ లో ఉన్న అనిల్ గాడు మంచం మీద నుంచి లేచే పరిస్థితిలో లేడు కానీ స్పృహలోకి రావడం జరిగింది. వాడు మాట్లాడే స్థితిలో లేడు గాని ఇకపై ప్రమాదమేమీ లేదని చెప్పి రూమ్ లోకి షిఫ్ట్ చేశారు. తన కొడుకు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అని తెలియగానే అప్పటికే దీపు అండ్ టీం మీద నిఘా పెట్టిన అనిల్ గాడి బాబు వాళ్లను లేపేయడానికి ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ని ఏర్పాటు చేశాడు. ఈ ఆదివారం దీపు అండ్ టీం ఇక్కడికి పిక్నిక్ కి వస్తున్నారని తెలుసుకుని షూటర్ కి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడంతో వాడు పొద్దున్న వాళ్ళు వచ్చిన రెండు కార్లను ఫాలో అవుతూ వచ్చాడు.
అదే సమయంలో వీళ్ళెవ్వరికి తెలియకుండా మరో టాక్సీ కూడా వీళ్లను వెతుక్కుంటూ వచ్చింది. ఆ టాక్సీలో వచ్చిందే జాహ్నవి. అంతేకాకుండా చివరిగా మరో వెహికల్ లో అనిల్ గాడి బాబు మనుషులు కూడా ఆ ప్రదేశానికి వచ్చి కొంచెం దూరంలో మకాం వేశారు. ఎందుకంటే పని సక్రమంగా జరుగుతుందో లేదో ఎప్పటికప్పుడు అనిల్ గాడి బాబుకి సమాచారం ఇవ్వడమే కాకుండా ఒకవేళ అనుకోకుండా తమ ప్లాన్ బెడిసికొడితే ఆ షూటర్ ని అక్కడికక్కడే లేపేయమని వాళ్లను పంపించాడు. మొత్తానికి ఆ షూటర్ దీపు అండ్ టీం ని షూట్ చేయడంలో విఫలం కావడంతో వాడిని చంపేసి వాళ్లు అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తప్పించుకున్నారు.
షూటర్ ని లేపేసి అక్కడినుంచి బయలుదేరిన వాళ్లు నేరుగా అనిల్ గాడి బాబు దగ్గరకు చేరుకొని అతని ఎదురుగా నిల్చున్నారు. జరిగింది తెలుసుకున్న అనిల్ గాడి బాబు, ఛ,,, ఈ రోజు మళ్ళీ తప్పించుకున్నాడు అని అసహనంగా ఉన్నాడు. .... తన మనిషి ఒకడు మాట్లాడుతూ, కానీ సార్ మీరు ఆ షూటర్ ని ఎందుకు పిలిపించారు? మేమే ఆ స్నైపర్ గన్ తో వాళ్లని చంపేసేవాళ్లం కదా? అని అన్నాడు. .... మీరొక బుద్ధిలేని పనికిమాలిన ఎదవలు, జరిగింది చూశారుగా,, వాళ్లు అంత ఈజీగా మీ చేతికి దొరుకుతారని మీకు అనిపిస్తుందా? చూశారుగా ఆ షూటర్ ఎలా దొరికిపోయాడో. అదే ప్లేస్ లో మీరు వాళ్ల చేతికి చిక్కి ఉంటే ఈ పాటికి వాళ్లు నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు. అందుకే నేను ఆ షూటర్ ని ఏర్పాటు చేసి వాడి దగ్గర నుంచి వాడి మొబైల్ కూడా తీసుకుని ఒకవేళ వాడు దొరికిపోతే ఎటువంటి ఆధారం దొరక్కుండా జాగ్రత్త పడ్డాను. అర్థమైందా?? ఇక నా కళ్ళ ముందు కనబడకుండా ఇక్కడనుంచి దొబ్బెయండి లేదంటే నాకు ఎక్కుతున్న మంటకి నేనే మిమ్మల్ని చంపి పడేస్తాను అని గట్టిగా కేకలేయడంతో వాడి మనుషులు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒరేయ్ దీపుగా నువ్వు మళ్ళీ తప్పించుకున్నావురా, కానీ ఇకమీదట ఎక్కువ కాలం నా నుంచి తప్పించుకోలేవు అని పళ్ళు నూరాడు అనిల్ గాడి బాబు.
ఈ సంఘటన జరిగిన కొంతసేపటి తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తమ పెంట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న అనిల్ గాడికి తన దగ్గర కేర్ టేకర్ గా ఉన్న తమ ఇంటి పనిమనిషి సుబ్బన్న ద్వారా జరిగిన విషయం తెలిసింది. తన బాబు దీపు అండ్ టీం మీద నిఘా పెట్టడం, వాళ్లను చంపడానికి స్నైపర్ షూటర్ ని ఏర్పాటు చేయడం, వాడు పనిలో విఫలమై తమ మనుషుల చేతిలో చావడం ఇదంతా విని కోపంతో రగిలిపోతూ, సుబ్బన్న నువ్వు డాడ్ దగ్గరికి వెళ్లి ఇక మీదట ఎటువంటి ప్రయత్నం చేయకుండా శాంతంగా ఉండమని చెప్పు. నేను పూర్తిగా కోలుకున్న తర్వాత వాళ్ళందరి పని నేనే చూసుకుంటాను అని చెప్పడంతో సుబ్బన్న అక్కడినుంచి వెళ్ళాడు. ఒరే దీపు మీ అందరి చావు దగ్గర్లోనే ఉంది. ఈసారి స్వయంగా నేనే మీ అందరి లెక్కలు తేలుస్తాను. జస్ట్ నేను కొంచెం పూర్తిగా కోలుకునే వరకు వెయిట్ చేయండి అని ఒక విలనీ నవ్వు నవ్వాడు అనిల్ గాడు.
అఅహ్రాహ్రా,,,, వీడు మళ్లీ తప్పించుకున్నాడు. ఈ నాకొడుకు చాలా అదృష్టవంతుడు ప్రతిసారీ ఏదో విధంగా తప్పించుకుంటున్నాడు అని కోపంతో రగిలిపోతున్న అనిల్ గాడి బాబు అక్కడికి వచ్చిన సుబ్బున్నను చూసి, ఏంటి సుబ్బన్న నువ్వు చినబాబు దగ్గర ఉండకుండా ఇక్కడికి వచ్చావేంటి? అని అడిగాడు. .... అయ్యా చినబాబు పంపితేనే వచ్చాను. మిమ్మల్ని ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉండమని, తను పూర్తిగా కోలుకున్న తర్వాత అంతా తానే సెట్ చేస్తానని మిమ్మల్ని కంగారు పడొద్దు అని చినబాబు చెప్పమన్నారు అని చెప్పాడు. .... అది విన్న అనిల్ గాడి బాబు, సరేలే,, వాడు అలా అన్నాడంటే ఏదో ప్లాన్ వేసుకుని ఉంటాడు. నువ్వెళ్లి బాబుని జాగ్రత్తగా చూసుకో అని సుబ్బన్నని పంపి తను సోఫాలో కూర్చుని రిలాక్స్ అయ్యాడు.
**********
**ఇక్కడ అందరూ హాస్పిటల్ కి చేరుకున్నారు. జాహ్నవికి ట్రీట్మెంట్ కూడా మొదలైంది. బయట కూర్చున్న జెస్సీ కళ్ళల్లో కన్నీళ్లు ఆగడంలేదు. అది చూసి సోము, తార జెస్సిని సముదాయిస్తూ ఊరుకోమని చెబుతున్నారు. జెస్సీ ఏడుస్తూనే, చూడరా సోము నా జాను ఇంకా బతికే ఉంది. మనమేమో తను చనిపోయి ఉంటుందని అనుకున్నాము. ఇప్పుడు చూస్తే తను తిరిగి వచ్చి నా ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసి నన్ను కాపాడింది. ఒకవేళ ఇప్పుడు గనుక జానుకి జరగరానిది జరిగితే నన్ను నేను క్షమించుకోలేనురా అని బాధపడుతున్నాడు. .... జాహ్నవికి ఏమీ కాదురా జెస్సీ కొంచెం ధైర్యంగా ఉండు అని అంది తార. .... అవున్రా జెస్సీ నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు ఆ భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయడు అని ధైర్యం చెప్పాడు సోము. కొంతసేపటి తర్వాత దీపు హాస్పిటల్ కి చేరుకొని అందర్నీ కలుసుకున్నాడు.**
ఏమైంది,,, జాహ్నవి బాగానే ఉంది కదా? అని అడిగాను. .... తనకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నయ్య అని అంది జ్యోతి. అను వచ్చి నా చెయ్యి పట్టుకొని పక్కన నిల్చుంది. కొంతసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగా నేను అతని దగ్గరికి వెళ్లి, ప్రోగ్రస్ ఏంటి డాక్టర్ గారు,,, తను ఇప్పుడు బాగానే ఉంది కదా? అని అడిగాను. .... యా యా,,, ఆమె బాగానే ఉంది డోంట్ వర్రీ. బుల్లెట్ తీసేసాం లక్కీగా ఇంటర్నల్ పార్ట్ కి గాని బోన్స్ గాని ఎటువంటి డ్యామేజ్ లేదు. కొద్దిసేపట్లో ఆమెకు తెలివి వస్తుంది. ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు ప్రాణం మీదికి వచ్చిన తన మొహంలో మాత్రం చిరునవ్వు చెదరలేదు. తను ఏదో సాధించినట్లు చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడింది. అమ్మాయిలు అంత ధైర్యంగా ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది అని చెప్పారు. .... ఓకే,,, చాలా థాంక్స్ డాక్టర్ గారు అని చెప్పగా డాక్టర్ గారు నవ్వుతూ నా భుజం తట్టి వెళ్లిపోయారు.
నేను జెస్సీ దగ్గరికి వచ్చి, ఓయ్ పిచ్చోడా ఇక ఆ ఏడవడం ఆపు, నీ జాహ్నవికి ఏం కాలేదు తను ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ కొద్ది సేపట్లో తనకి తెలివి వస్తుందట ముందుగా నువ్వే వెళ్లి చూద్దువు గాని అని అన్నాను. .... నా మాట వినగానే జెస్సీ సంతోషంతో పైకి లేచి నన్ను హాగ్ చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత జాహ్నవికి తెలివి వచ్చి జెస్సీ పేరు పలవరిస్తూ ఉండటంతో అక్కడ ఉన్న నర్స్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి డాక్టర్ని పిలుచుకొని వెళ్ళింది. డాక్టర్ లోపలికి వెళ్లి జాహ్నవిని చెక్ చేసి బయటికి వచ్చి, షి ఈజ్ ఆల్ రైట్,, మీరు వెళ్లి చూడొచ్చు అన్నారు. .... థాంక్యూ డాక్టర్,, అని చెప్పి, జెస్సీ ముందు నువ్వు వెళ్లి కలువు అని అన్నాను. జెస్సీ గబగబ అడుగులు వేసుకుంటూ రూమ్ లోకి వెళ్ళాడు.
జాహ్నవి కళ్ళు మూసుకుని బెడ్ మీద పక్కకు తిరిగి పడుకొని ఉంది. జెస్సీ నడుచుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్లి జాహ్నవిని చూస్తూ నిల్చున్నాడు. నెమ్మదిగా మళ్లీ జెస్సీ కళ్ళలో నీళ్లు కారుస్తూనే, స్వీటీ,,,, అని నెమ్మదిగా పిలిచాడు. ఆ చిన్న పిలుపుతోనే జాహ్నవి కళ్ళు తెరిచింది. ఎదురుగా జెస్సీని చూసిన వెంటనే తన కళ్ళ నుంచి కూడా నీరు కారడం మొదలైంది. కానీ తన మొహంలో చిరునవ్వు మాత్రం మెరిసింది. జెస్సీ,,, అని జాహ్నవి పిలవగానే, హ,, స్వీటీ,,, అంటూ పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న జాహ్నవి దగ్గరికి వెళ్లి, ఏం చేస్తున్నావ్ స్వీటీ?? అంటూ తనను పట్టుకున్నాడు. .... నా జెస్సీని పట్టుకోవాలని ఉంది అని అంది జాహ్నవి. .... పిచ్చిదానా,, అలా కదలకుండా పడుకుని ఉండు అంటూ తన చెయ్యి పట్టుకుని, నిన్ను చాలా మిస్ అయ్యానురా స్వీటీ. నువ్వు నా దగ్గరికి తిరిగి రావడానికి చాలా టైం తీసుకున్నావు అని అన్నాడు జెస్సీ.
కాలాన్ని ఎవరూ మార్చలేరు అంటారు కదా అందుకు మనం కూడా ఏమి అతీతులం కాదు అందుకే మళ్ళీ మనం కలుసుకోవడానికి ఇంత టైం పట్టింది అని అంది జాహ్నవి. .... నీకేమైనా పిచ్చి పట్టిందా,, ఇలాంటి పిచ్చి పని చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అని అడిగాడు జెస్సీ. .... నువ్వు నా ప్రాణం, మరి నీకు ఏమైనా అయితే? అని అంది జాహ్నవి. ఆ మాట వింటూనే జెస్సీ జాహ్నవిని దగ్గరకు తీసుకొని కౌగిలించుకుని ఏడవడం మొదలు పెట్టాడు. జాహ్నవి కూడా తన చేతులతో జెస్సీని చుట్టేసి అల్లుకుపోయింది. ఒకసారి నిన్ను దూరం చేసుకున్నందుకు రెండు సంవత్సరాలుగా క్షోభను అనుభవిస్తున్నాను. ఈ సారి నిన్ను మళ్ళీ దూరం చేసుకుంటే నేను బ్రతకలేను అని అన్నాడు జెస్సీ. .... ఛ,, అలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు నా ప్రాణానివి నీకేమైనా అయితే నేను బతికి ఉండగలనా? అని అంది జాహ్నవి.
నువ్వు పిచ్చిదానివే,, అస్సలు ఏం మారలేదు. ఇంతకు ముందు కూడా అంతే నాకు దెబ్బ తగిలితే నువ్వు ఏడ్చేదానివి అని అన్నాడు జెస్సీ. .... అవునుమరి నా మనసు ప్రాణం నీవైనప్పుడు వాటికి దెబ్బ తగిలితే నేను కాకపోతే ఇంకెవరు ఏడుస్తారు? అని అంది జాహ్నవి. .... ఐ లవ్ యు జాను,, ఐ లవ్ యు సో మచ్,, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. .... ఐ లవ్ యు టూ జెస్సి అని ఇద్దరూ మరింత గట్టిగా కౌగలించుకున్నారు. .... నీకో విషయం తెలుసా? ఆరోజు నువ్వు లోయలో పడిపోయినప్పుడు నేను కూడా నీ వెనకే వచ్చేవాడిని కానీ అక్కడున్న మనుషులు నన్ను పట్టుకొని ఆపేశారు. అది సరే గానీ ఇంత కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ తిరిగి ఎలా వచ్చావు? అని అడిగాడు జెస్సీ. .... జాహ్నవి కౌగిలి నుంచి విడిపడి జరిగిన కథను చెప్పడం మొదలు పెట్టింది.
**జాహ్నవి ఫ్లాష్ బ్యాక్ తన మాటల్లో,,,,,,
ఆరోజు నేను లోయలో కింద పారుతున్న నదిలో పడినప్పుడు నా తలకు ఒక రాయి తగులుకుంది. ఆ తర్వాత నాకు మళ్ళీ తిరిగి తెలివి వచ్చేసరికి నేను ఒక ఇంట్లో ఉన్నాను. ఆ ఇల్లు ఆ ప్రాంతంలో ఉన్న ఒక నాటు వైద్యుడిది. నేను నదిలో కొట్టుకుపోతుంటే తమకు దొరికానని అప్పుడు వారు నన్ను రక్షించి తీసుకుని వెళ్లారని నాతో చెప్పారు. నాకు తెలివి వచ్చే నాటికి నేను వాళ్లకు దొరికి ఆరు నెలలు గడిచిందని అంతవరకు నేను కోమాలో ఉన్నానని తెలిసింది. ఆ తర్వాత ఆ వైద్యుడు నేను ఆ నదిలో ఎలా పడ్డాను, నా పేరు చిరునామాల గురించి అడిగారు. అక్కడే సమస్య మొదలైంది. ఎందుకంటే ఆయన అడుగుతున్న ప్రశ్నలకు నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. రాయి తగిలి నా తలకు దెబ్బ తగలడం వల్ల నాకు గతం గుర్తు లేకుండా పోయింది. దాంతో నేను ఎంత తీవ్రంగా ఆలోచిస్తే అంత తలనొప్పిగా ఉండేది.
నేను ఎవర్నో ఏంటో అనే విషయాలు అస్సలు గుర్తు లేకుండా పోయాయి. అది గుర్తించిన ఆ వైద్యుడు నాకు ధైర్యం చెప్పి నీకు పూర్తిగా నయమయ్యేవరకు ఇక్కడే మా అందరితో కలిసి ఉందువుగాని అని భరోసా ఇచ్చి నన్ను తన కూతురులాగా చూసుకున్నాడు. అది ఒక మారుమూల అటవీ ప్రాంతం. అక్కడికి కనీసం రోడ్డు గాని ఇతర సౌకర్యాలు గాని ఏమీ లేవు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్లంతా ఈ ప్రపంచానికి దూరంగా బతికే అడవి జాతికి చెందిన ట్రైబల్స్. చుట్టుపక్కల ఎక్కడో దూరంగా ఉండే రెండు మూడు గిరిజన తండాలు తప్ప వాళ్లకు మరెవరితోనూ సంబంధాలు కూడా ఉండవు. అటవీ సంపద మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఎవరో ఒకరిద్దరు మాత్రమే నడుచుకొని బయలుదేరి కొద్దిరోజులు ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్లి వాళ్లకు కావలసిన చిన్న చిన్న వస్తువులు తీసుకొని మళ్లీ కొద్దిరోజులకు అక్కడికి చేరుకునేవారు.
అటువంటి ప్రాంతంలో గతం మర్చిపోయిన నేను వాళ్లతో కలిసి వాళ్లలో ఒకదానిలా మారిపోయి సుమారుగా 13 నెలలపాటు అక్కడే ఉన్నాను. అక్కడ అందరూ కూడా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్లు ఎంత బాగా చూసుకున్నప్పటికి నేను అక్కడ సంబంధించిన మనిషిని కాను అనే విషయం నాకు పదే పదే తలంపుకు వచ్చి చాలా ఇబ్బంది పెట్టేది. కానీ అలాగే కాలం వెళ్లదీస్తూ వచ్చాను. ఒక మూడు నెలల క్రితం ఆ తండాలో ఒక పెళ్లి జరుగుతుండటంతో అక్కడి వాళ్లంతా ఒక సంబరంలాగా జరుపుకోవడం మొదలుపెట్టారు. అందుకుగాను మరొక తండా నుంచి కొంతమంది మనుషులు ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరి కంటే భిన్నంగా ఉండటంతో అందులో ఒక కుర్రాడి కన్ను నా మీద పడింది.
తండా మొత్తం ఆ రోజు రాత్రి సంబరాల్లో మునిగి ఉండగా ఆ కుర్రాడు నేను ఉన్న గుడిసె దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకొని పారిపోయాడు. కానీ వాడు నన్ను తీసుకెళ్లడం చూసిన మా తండా కుర్రాడు ఒకడు మరి కొంతమంది కుర్రాళ్లను వెంటేసుకొని మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు. నన్ను ఎత్తుకెళ్లిన వాడు అడవిలో కొంత దూరం తీసుకువెళ్లి అక్కడ నాపై బలాత్కారం చేయబోతుండగా నేను వాడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ క్రమంలో వాడికి తోడుగా వచ్చిన మరో ఇద్దరు కుర్రాళ్ళు కూడా తప్పించుకు పోతున్న నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ దారిలో దొరికిన ఒక రాయి తీసి నా మీదకు విసరడంతో అది నా తలకు తగిలి నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు నన్ను ఏదన్న చేయబోయే లోపు మా తండా కుర్రాళ్ళు అక్కడకు చేరి వాళ్లను పట్టుకొని బాగా కొట్టారు.
ఆ తర్వాత స్పృహతప్పిన నన్ను మరియు నన్ను బలవంతం చేయబోయిన కుర్రాళ్లను తిరిగి ఊళ్లోకి తీసుకుని వెళ్లారు. నా పరిస్థితి చూసిన వైద్యుడు వెంటనే నాకు వైద్యం చేశారు. ఆ తర్వాత రెండు తండాల పెద్దలు కూర్చొని జరిగిన విషయం గురించి పంచాయతీ పెట్టుకుని వాళ్ల ఆచారాల ప్రకారం అటువంటి పని చేసినందుకు వేరొక తండా నుండి వచ్చిన ఆ ముగ్గురి కుర్రాళ్లను చంపి పూడ్చి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ విషయం నాకు నెల రోజుల తర్వాత తెలిసింది. ఎందుకంటే ఆ రోజు రాత్రి తలకు దెబ్బతగిలిన నేను తిరిగి నెల రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాను. కానీ నాకు స్పృహ వస్తూనే కళ్లముందు మసక మసకగా నువ్వే కనబడ్డావు. దాంతో నేను పైకి లేస్తూనే జెస్సీస్సీస్సీ,,,, అని అరవడంతో బయట ఉన్న వైద్యుడితో సహా నాకు దగ్గరయిన కొంతమంది లోపలికి వచ్చారు.
వాళ్ళందరితో ఏదో పరిచయం ఉన్న భావన కలుగుతున్నా నేను అక్కడ ఎందుకు ఉన్నానో నాకు అర్థం కాలేదు. దాంతో నాకు కొత్తగా వింతగా అనిపించి ఏడుస్తూ కూర్చున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్యుడు నన్ను సముదాయించి నాకు గతం గుర్తుకు వచ్చిందని కొద్ది రోజులు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని నాకు వైద్యం చేసి నిద్రపుచ్చాడు. ఆ తర్వాత నాకు పూర్తిగా అన్ని విషయాలు గుర్తుకు రావడంతో నేను లేకుండా నా జెస్సీ ఏమైపోతాడో అని పదే పదే నువ్వు గుర్తుకు రావడంతో నేను వెంటనే నీ దగ్గరికి వెళ్ళాలని ఎలాగైనా నన్ను అక్కడ్నుంచి పంపించమని ఆ వైద్యుడిని బతిమాలుకున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ వైద్యుడు గారు రెండు రోజుల్లో నన్ను అక్కడినుంచి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఒక ఇద్దరిని తోడు పంపించి బస్సు తిరిగే ఒక గ్రామానికి తీసుకువెళ్లి అక్కడ నన్ను బస్సు ఎక్కించి పంపించారు.
నేను ఇక్కడికి వచ్చి ఇంటికి చేరుకున్న తర్వాత నన్ను బయటకి కదలనివ్వలేదు. నెమ్మదిగా అన్నీ సర్దుకున్న తర్వాత నీ గురించి వెతుకుతూ కాలేజీ దగ్గరికి వచ్చాను. కానీ మీరు ఇప్పుడు కాలేజీలో లేరు కానీ కొంతకాలం క్రితం మీకు యాక్సిడెంట్ అయ్యింది అని ఎవరో చెప్పగా తెలిసింది. ఆ తర్వాత మీరు ఎక్కడా కనపడలేదని అసలు మీరు ఉన్నారో లేదో కూడా తెలియదని చెప్పడంతో నాకు చచ్చిపోవాలని అనిపించింది. కానీ ఎక్కడో చిన్న ఆశ నన్ను ఆ పని చేయనివ్వలేదు. ఏరోజుకైనా మీరు కనబడకపోతారా అని అప్పుడప్పుడు కాలేజీ పరిసరాల్లో చూసి వెళ్ళిపోయేదాన్ని. అనుకోకుండా ఒకరోజు మీరంతా కార్లో వెళ్లిపోతూ కనబడ్డారు. కానీ నేను మిమ్మల్ని కలవలేకపోయాను. కానీ మీతో ఉన్న అమ్మాయిలు తమ కారులో కూర్చుంటూ ఈరోజు మీరు పిక్నిక్కి వెళ్తున్న సంగతి గురించి మాట్లాడుకోవడం విన్నాను. కానీ నేను వాళ్లను కూడా అందుకోలేక పోయాను. కానీ ఆ తర్వాత అక్కడే ఉన్న మరి కొంతమంది స్టూడెంట్స్ ని అడగగా మీరంతా ఒక బ్యాచ్ అని ఈ మధ్య కాలేజీలో పెద్ద గొడవ జరిగిందని కానీ మీరు ఈ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పారు. అందుకే ఈరోజు టాక్సీలో బయలుదేరి నిన్ను వెతుక్కుంటూ అక్కడికి రాగలిగాను. మీరు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉండడంతో నేరుగా నీ దగ్గరికి వచ్చి కలవడానికి కొంచెం సంశయించాను కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది అని ముగించింది జాహ్నవి.**
నిజానికి జెస్సీ రూమ్ లోకి అడుగుపెట్టిన వెంటనే మేము కూడా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చి కొంచెం దూరంగా డోర్ దగ్గర నిల్చొని వాళ్ళిద్దరి సంభాషణ వింటున్నాము. జాహ్నవి చెప్పింది విన్న తర్వాత జెస్సీ ఏడుస్తూ, నువ్వు దూరం అయిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? మూడు నెలలపాటు పిచ్చివాడి లాగా బతికాను. అది కూడా నాకు సోము చెబితేనే తెలిసింది. వాడే దగ్గరుండి నన్ను మళ్ళీ మామూలు మనిషిలాగా మార్చాడు. అవును ఆ తర్వాత మాకు యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవమే కాని దాని నుంచి మేము తప్పించుకోగలిగాము. అప్పుడే డిగ్రీ కూడా పూర్తవడంతో కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోయాము. కానీ జరిగిన కొన్ని సంఘటనల వలన ఇక మీదట చదువుకు స్వస్తి చెప్పి సెక్యూరిటీ అధికారి సెలక్షన్స్ కి వెళ్లి చివరికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ కావాల్సి వచ్చింది. అందుకే మా గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. మేము చేసే పని అలాంటిది మరి.