Episode 124.1


దినేష్ వర్మ ఇంట్లో............

రాజేశ్ వర్మ, లాయరు ఇంకా ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. అంతలో పవిత్ర తన రూమ్ లో నుంచి బయటకు వచ్చి, అమ్మ ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేశాడు. పెదనాన్న గారికి బెయిల్ దొరుకుతుందట మరో గంటలో బయటికి వచ్చేస్తారు మీరేమీ కంగారు పడొద్దని చెప్పాడు అని అంది. .... సుమతి మాట్లాడుతూ, హమ్మయ్య,,, మంచి వార్త చెప్పావురా తల్లి. బావగారు ఇంటికి వచ్చేస్తే ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం అయిపోతుంది అని అంది. .... ఆ వార్త విని రాజేశ్ వర్మ ఆశ్చర్యపోతూ, అదెలా సాధ్యం,,, ఏంటి లాయర్ గారు బెయిల్ దొరకడం కష్టమని మీరే చెప్పారు కదా? అని అడిగాడు. .... అవును సార్ నేను చెప్పేది నిజం. మరి ఆ అబ్బాయికి ఎలా సాధ్యమయిందో నాకు అర్థం కావడం లేదు. ఆ మందులు తిని చాలా మంది చనిపోవడం వల్ల పెద్దాయనకి బెయిల్ దొరకడం చాలా కష్టం అని అన్నాడు. .... అక్కడే కూర్చున్న కార్తీక మాట్లాడుతూ, సరే ఎలా దొరికితేనేమి నాన్న ఇంటికి వస్తున్నారు అంతే చాలు అని అంది.
**********​

తారను అక్కడే హాస్పిటల్ దగ్గర ఉండమని చెప్పి జెస్సీ చెప్పిన లొకేషన్ కి బయలుదేరిన నేను తొందరగానే ఆ లొకేషన్ కి చేరుకొని బైక్ పార్క్ చేసి గేటు తీసుకుని లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసి ఉండడంతో బెల్ కొట్టాను. కొంత సేపటికి ఒకామె వచ్చి డోర్ తెరిచింది. ఆమెతో పాటు లోపలికి నడిచాను. లోపల ఇద్దరు వ్యక్తులతో పాటు సోము మరియు జెస్సీ సోఫాలో కూర్చుని ఉన్నారు. కమాన్ దీపు,,, మీ నాన్న గారిని ఈ కేసులో ఇరికించిన పెద్ద మనుషులు వీళ్లే అని అన్నాడు జెస్సీ. .... నేను వాళ్ళను చూస్తూ, అసలు మొత్తం మ్యాటర్ ఏంటో చెప్పు? అని అడిగాను. .... వీడి పేరు అనుజ్ వర్మ, వాడి పేరు మనోజ్ వర్మ వీళ్లిద్దరూ మీ పిన్నిగారి తమ్ముళ్ళు. వీళ్ళందరూ ఏదో బయట డబ్బుకి ఆశపడి ఇదంతా చేశారు. అంతేకాదు వీళ్ళకి మీ ఆస్తుల మీద కూడా కన్నుంది. ఇకపోతే ఈ మేడం గారి పేరు దీక్ష. ఈవిడే ఈ గ్యాంగ్ కి లీడర్ ఈ అనుజ్ వర్మకి వైఫ్ అని చెప్పాడు సోము.

నేను వాళ్ళని చూసి, అసలు సిగ్గుందా మీకు? డబ్బులకి ఆశపడి అంత మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటారా? ఆ చనిపోయిన వారి కుటుంబాలు ఎంత బాధపడుతూ ఉంటాయో తెలుసా మీకు? అని సీరియస్ గా అన్నాను. .... ఇదిగో దీపు,, అంటూ సోము కెమెరా నా చేతికి అందించి, వీళ్లు తమ నేరాన్ని అంగీకరిస్తూ చెప్పిన విషయాన్ని రికార్డు చేశాము అని చెప్పాడు. .... సరే వీళ్ళను తీసుకొని అక్కడికే వెళ్దాం. ఈ ప్రబుద్ధుల మొహాలు వాళ్లకు చూపిస్తే వీళ్ళు చేసిన ఘనకార్యం గురించి తెలుసుకుంటారు. పదండి దారిలో తారను పికప్ చేసుకుని వెళ్దాం అని చెప్పి అందరం అక్కడ నుంచి బయల్దేరాం. సోము మరియు జెస్సీ వాళ్లందర్నీ తీసుకుని కారులో బయలుదేరగా నేను బైక్ మీద వస్తుండగా లాయర్ అంకుల్ కాల్ చేసి దినేష్ వర్మ గారికి బెయిల్ వచ్చేసింది ఆయన బయటికి వచ్చారు అన్న సమాచారం ఇచ్చారు.
**********​

దినేష్ వర్మ ఇంట్లో.........

దినేష్ వర్మ బెయిల్ మీద రిలీజ్ అయ్యి ఇంటికి చేరుకోగా అందరూ అతని చుట్టూ చేరి కూర్చున్నారు. ఒరేయ్ రాజేష్ నాకు బెయిల్ దొరకడం కష్టం అని చెప్పావు నువ్వు? అని అడిగాడు. .... అవును అన్నయ్య మన లాయరు నాతో అదే చెప్పాడు అని అన్నాడు రాజేశ్ వర్మ. .... మరయితే నాకు బెయిల్ ఎలా దొరికింది? ..... పవిత్ర మాట్లాడుతూ, పెదనాన్న నీకు బెయిల్ రావడానికి కారణం అన్నయ్య అని అంది. .... వెంటనే రాజేశ్ వర్మ, నువ్వు నోర్ముయ్ పవిత్ర అని అన్నాడు. .... ఏం అదెందుకు నోరుముయ్యాలి,, అది చెప్పేది నిజమే కదా? అవును బావగారు మీకు బెయిల్ ఇప్పించింది దీపు బాబే. కానీ ఎలా? ఏంటి? అన్న విషయం మాత్రం తెలీదు అని అంది సుమతి. .... ఆ మాట వినగానే దినేష్ వర్మ అసహనంగా కదులుతూ, వీడు మళ్లీ మాటిమాటికీ మన జీవితంలోకి ఎందుకు వేలు పెడుతున్నాడు? అని అన్నాడు. .... కానీ మీకు బెయిల్ వచ్చింది వాడి వల్లనే కదా అని అంది కార్తీక. .... అయితే మాత్రం?? కావాలంటే ఈ దేశంలో ఇంకా పెద్ద పెద్ద లాయర్లు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు నాకు బెయిల్ ఇప్పించేవారు అని దినేష్ వర్మ అనడంతో అందరూ కొద్దిసేపు కామ్ అయిపోయారు.

దినేష్ వర్మ మళ్లీ మాట్లాడుతూ, రాజేష్ అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏమైనా తెలిసిందా? అని అడిగాడు. .... లేదన్నయ్యా,,, వివరాలు తెలుసుకోమని అనుజ్ కి చెప్పాను. ఇంకా ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా తమ ఎంక్వైరీ చేస్తున్నారు. పొద్దున్నుంచి వాళ్ళ పని వాళ్లు చేస్తున్నారు కానీ ఇంకా ఏ విషయం కూడా తెలియరాలేదు అని అన్నాడు రాజేశ్ వర్మ. .... సరే ఏం జరుగుతుందో చూద్దాం? ఏం జరిగినా చూసుకుందాం అని సాలోచనగా అన్నాడు దినేష్ వర్మ.
**********​

అక్కడినుంచి బయలుదేరిన మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చి తారను కలిసి నా బైక్ అక్కడ వదిలేసి రెండు కార్లలో దినేష్ వర్మ ఇంటికి బయలుదేరాము. ఆ సమయానికి అభికి కూడా తెలివి రావడంతో అనుకి ఏమీ జరగలేదని తెలుసుకొని తన ఎదురుగా ఉన్న అను ని చూసి సంతోషించాడు. అభి బాగానే ఉండటంతో అమ్మ అంకుల్ అక్కడినుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రీతి, అను మరియు దేవి అక్క మాత్రమే హాస్పిటల్ లో ఉన్నారు. మేము కొంతదూరం వచ్చిన తర్వాత జరిగిన ఉదంతం మీద నాకెందుకో సందేహం కలిగి కార్లు పక్కకి తీసి ఆపమని చెప్పాను. సోము ఇచ్చిన కెమెరాలో ఉన్న వీడియోని ల్యాప్టాప్ లోకి కాపీ చేయమని తారకు ఇచ్చాను. సరిగ్గా నేను ఆ మాట చెబుతున్న సమయానికి ఒక వెహికల్ మమ్మల్ని దాటుకొని ముందుకు వెళ్లి ఆగి అందులో నుంచి ఒక ఆరుగురు వస్తాదులు లాంటి మనుషులు దిగారు. అందులో ఒకడు మాట్లాడుతూ, ఓయ్ కుర్ర బచ్చాలు అన్నీ మూసుకుని మర్యాదగా మా బాస్ ని వదిలేయండి లేదంటే తేడాలు జరిగిపోతాయి అని ధీమాగా ఎటకారంగా అన్నాడు. .... అది విని నేను ఒకసారి అనుజ్ వర్మ వైపు చూడగా వాడి మొహం నవ్వుతో వెలిగిపోతుంది. వాళ్ళందరూ వీడి మనుషులే అని అర్థమై నాకు కూడా చిన్నగా నవ్వు వచ్చింది.

వెంటనే నేను ఏమాత్రం లేట్ చేయకుండా గన్ తీసి ఆ కార్లో నుంచి దిగిన అందరిమీద మేము కాల్పులు మొదలుపెట్టాము. నడిరోడ్డు మీద అటువంటి పని చేస్తామని ఊహించని వాళ్లు కార్లో ఉన్న తమ ఆయుధాలు అందుకోవడం కోసం వెనక్కి పరిగెత్తారు. ఆ గ్యాప్ లో అందరి తలలలో బుల్లెట్లు దింపేసాము. అనుకోని విధంగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి కార్ లో కూర్చున్న అనుజ్ వర్మ, మనోజ్ వర్మ మరియు దీక్ష మమ్మల్ని చూసి వణకడం మొదలుపెట్టారు. ఇంతలో తార ఆ వీడియో ఫైల్ కాపీ చేయడం పూర్తయింది. సరే వెళ్దాం పదండి అని చెప్పి, తార ఆ ఫైల్ ని మన చీఫ్ కి పంపించు అలాగే సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ కూడా అని చెప్పాను. తార ఓకే అని తన పని మొదలు పెట్టగానే మేమంతా ముందుకు కదిలాము.
**********​

ఇక్కడ అనిల్ గాడి బాబు ఆ అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్నాడు. అప్పటికే వాడి మనుషులు అక్కడకు చేరుకుని ఇనుప చువ్వలపై వేలాడుతున్న అనిల్ రాజ్ శవాన్ని కిందికి దించారు. అనిల్ గాడి బాబు అక్కడ జరిగిన ఊచకోతను చూసి ఒక్కసారిగా అదిరిపడి తర్వాత అనిల్ గాడి శవాన్ని హత్తుకుని తన ముద్దుల కొడుకు చనిపోయినందుకు హృదయవిదారకంగా ఏడుస్తున్నాడు. కొంత సేపటికి విచారం నుంచి తేరుకుని, ఒరేయ్ చిన్నోడా నిన్ను ఇంత కర్కశంగా చంపినందుకు ఖచ్చితంగా వాడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ దీపు గాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడికి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయి. వాడిని ఎలా చంపుతానంటే ఆ చావుని చూసిన ప్రతి ఒక్కరికి పై నుండి కింది వరకు అన్ని వణికేలా చంపుతాను. ఒరేయ్ దీపుగా నా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండు అని గట్టిగా అరిచి శపథం చేసి తన కొడుకు శవాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు.
**********​

మేమంతా ఇంటికి చేరుకుని వాళ్లను తీసుకొని లోపలికి నడిచాము. ఈసారి నన్ను చూసిన వాచ్మెన్ లోపలికి పోనీయకుండా ఆపలేదు. మేము లోపలికి వెళుతూనే వాళ్ల ముగ్గురిని ముందుకు తోసేసరికి వెళ్లి కూర్చున్న వాళ్ళ కాళ్ళ ముందు పడ్డారు. అది చూసి అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోతూ అయోమయంగా చూస్తున్నారు. తన తమ్ముళ్ళను ఆ స్థితిలో చూసిన పిన్ని తను కూర్చున్నచోట నుంచి లేచి వాళ్ల దగ్గరకు వెళ్లబోయింది. అక్కడే ఆగిపో పిన్ని,,, వాళ్లకి ఆ స్థానమే కరెక్ట్ అని అన్నాను. .... వెంటనే బాబాయ్ మాట్లాడుతూ, ఒరేయ్,, ఏంటి నువ్వు చేస్తున్న పని మంచి మర్యాద ఉండక్కర్లేదా? అని కోపంగా అన్నాడు. .... ఒక్క నిమిషం సార్,, ముందు మీరు ఈ వీడియో చూడండి అని చెప్పి సోముని వాళ్లు తమ నేరాన్ని అంగీకరించిన ఆ వీడియో ప్లే చేయమని చెప్పాను. ఆ వీడియో చూడగానే నాన్న మరియు బాబాయ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. మరోపక్క పిన్ని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి.

కానీ కొద్దిసేపటి తర్వాత పిన్ని ముందుకు కదిలి తన తమ్ముళ్ళ దగ్గరికి వెళ్లి ఇద్దరి చెంపలపై లాగిపెట్టి కొట్టింది. ఆ తర్వాత ఏడుస్తూ ఆపకుండా వాళ్లను మరిన్ని దెబ్బలు కొట్టింది. ఆ తర్వాత మాట్లాడుతూ, చీ,, ఇంత నీచానికి ఎలా ఒడిగట్టారురా? డబ్బు కోసం మరీ ఇంత దిగజారిపోయారా? మీ ధనదాహం కోసం అంత మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటారా? అని దీక్ష దగ్గరకు వెళ్లి ఆవిడని కూడా చెంప చెల్లుమనిపించి, ఏంటే రాక్షసి నువ్వు చేస్తున్న పని? నా తమ్ముడు కోసం నీతో సంబంధం కలిపింది నేనే కదే? అలాంటిది నువ్వు నా కొంపనే తగలెట్టాలని చూస్తావా? అని కోపంగా అడిగింది. .... అక్కా,,, అని దీనంగా అన్నాడు అనుజ్ వర్మ. .... నోర్ముయ్ ఎదవ,,, ఆ నోటితో నన్ను మళ్ళీ అక్క అని పిలవద్దు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కంపరమెత్తిపోతుంది. ఈరోజు నుంచి మీరంతా నా దృష్టిలో చచ్చినోళ్ళతో సమానం అని కోపంతో రగిలిపోయింది.

అది చూసి నేను ముందుకు వెళ్లి పిన్నిని దగ్గరకు తీసుకుని సముదాయిస్తూ, చాలు పిన్ని ఊరుకో ఇంకేమీ మాట్లాడొద్దు కొంచెం శాంతంగా ఉండు. ఇలాంటి నీచులు కోసం అనవసరంగా నువ్వు బాధపడడం వేస్ట్. బుజ్జమ్మ వెళ్లి అమ్మకు నీళ్లు పట్రా అని చెప్పి పవిత్ర నీళ్లు తెచ్చిన తరువాత పిన్నితో తాగించి పిన్ని కొంచెం శాంతించడంతో తనను సోఫాలో కూర్చో పెట్టి, చూడండి వర్మ అండ్ ఫ్యామిలీ,,, వీళ్ళు మీ కంపెనీలో తప్పు జరగడానికి కారణమైన నిందితులు, ఇది వారు నిజాన్ని ఒప్పుకున్న సాక్ష్యం అంటూ ఆ వీడియో ఉన్న కార్డ్ తీసి అక్కడ పెట్టి, బహుశా మరికొద్దిసేపట్లో సెక్యూరిటీ ఆఫీసర్లు ఇక్కడకు చేరుకుంటారు. నమస్కారం,,, ఇక మేము వెళ్తాము అని అక్కడి నుంచి వెనుదిరిగి రెండు అడుగులు వేసేసరికి వెనక నుంచి నాన్న గొంతు వినబడింది.

అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇలాంటి డ్రామాలు అన్ని ప్లే చేసి మా మనసులు కరిగించి మళ్లీ ఈ ఇంట్లోకి అడుగు పెడదామని అనుకుంటున్నావా? అని అన్నారు. .... (నేను నవ్వుతూ వెనక్కి తిరిగి) మిస్టర్ దినేష్ వర్మ గారు నాకు అలాంటి ఉద్దేశ్యాలు ఏమీ లేవండి. అయినా నేను ఈ ఇంట్లోకి రావాలి అనుకుంటే ఇలాంటి చిల్లర డ్రామాలు ప్లే చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే డైరెక్టుగా న్యాయస్థానాల సహాయంతో రాగలను. కానీ నేను అలాంటి పని చేయను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ ఇంటికి రావాలన్న ఇంట్రెస్ట్ గాని మీ ఆస్తిపాస్తులు మీద వ్యామోహం గానీ లేవు. నా దగ్గర నా అవసరానికి మించి అన్నీ ఉన్నాయి. అలాగే నాకంటూ ఒక కుటుంబం కూడా ఉంది. ఇకపోతే ఈ ఇంట్లో నా కోసం తపించే పిన్ని మరియు బుజ్జమ్మలను నేను బయట కూడా కలవగలను. అందువలన ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మీ బుర్రలో నుంచి శాశ్వతంగా తొలగించుకోండి అని అన్నాను.

వెంటనే కార్తీక అక్క నా దగ్గరకు వచ్చి, మా నాన్నతో ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యంరా? అంటు నన్ను కొట్టడానికి చెయ్యి పైకి లేపింది. .... కానీ అంతలోనే తార ముందుకు వచ్చి అక్క ఎత్తిన చేతిని గాల్లోనే పట్టుకుని ఆపి, నో నో నో,, వద్దు మేడం మీరు మళ్లీ అలాంటి తప్పు చెయ్యొద్దు అని అంది. .... నా చెయ్యి పట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం? అని కోపంగా అంది అక్క. .... అతనితో మీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు అనుకున్నప్పుడు మీ చేతులు కాళ్ళు ఆడించకుండా ఉంటే మంచిది అని స్ట్రాంగ్ గా చెప్పింది తార. .... నేను ఏం చేస్తే నీకేంటి? వాడితో నీకేం సంబంధం? అని అడిగింది అక్క. .... వాడితో మాకు సంబంధం ఉందండి. మాది స్నేహబంధం,,, ఆ బంధాన్ని ఎలా నిర్వర్తించాలో కూడా మాకు బాగా తెలుసు. కానీ మీకు లాగా సంబంధాలు తెంచుకోవడం మాత్రం తెలీదు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే మంచిది అని తార చెప్పిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి నేను మళ్ళీ వెనక్కి తిరిగాను.

ఆ,, మిస్టర్ దినేష్ వర్మ గారు ఇంకో విషయం చెప్పాలి. మీరు నన్ను ఏదో ఉద్ధరించేశానని అనుకుంటూ నాకు ఏదో ఉపకారం చేసినట్టు ఇచ్చిన వాటిని తిరిగి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు వాటిలో నేను ఒక్క రూపాయి కూడా వాడలేదు అవి అలాగే బ్యాంకులో పడి ఉన్నాయి. ఇక పోతే ఆ ఇల్లు నా పేరునే ఉంది కాబట్టి దానికి బదులుగా ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఆ డబ్బు కూడా తిరిగి ఇచ్చేస్తాను. మొత్తం అంతా కలిపి వడ్డీతో సహా సుమారుగా కోటి రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి చూసుకోండి. మీ దయదాక్షిణ్యాల మీద బతకవలసిన అవసరం నాకు లేదు. ఇంకెప్పుడూ పొరపాటున కూడా ఆ విషయం గురించి ఆలోచించొద్దు. ఆ మాట చెప్పి మేము వెనుదిరిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి సెక్యూరిటీ ఆఫీసర్లు మరియు మీడియా అక్కడికి చేరుకున్నారు. ఆ వెనకాలే సెక్యూరిటీ అధికారి కమిషనర్ కూడా వచ్చారు. మేము మాత్రం కామ్ గా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము. అక్కడినుంచి హాస్పిటల్ కి బయలుదేరి వెళుతూ ఫోన్ తీసి రజినికి కాల్ చేసి ****** ఫార్మా చైర్మన్ దినేష్ వర్మ గారి అకౌంట్ నెంబర్ కి నా పర్సనల్ అకౌంట్ నుంచి కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి కాల్ కట్ చేశాను.
**********​

దీపు అండ్ టీం వెళ్లిపోయిన తర్వాత దినేష్ వర్మ ఇంట్లో..........

మీడియా మరియు సెక్యూరిటీ ఆఫీసర్లు లోపలికి ఎంటర్ అయి నిందితుల ముగ్గురు చుట్టూ చేరారు. ఆ తర్వాత అక్కడ కొంతసేపు ప్రశ్నల పరంపర కొనసాగింది. సెక్యూరిటీ అధికారి కమిషనర్ తో దినేష్ వర్మ మరియు రాజేశ్ వర్మల మంతనాలు కూడా జరిగాయి. ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు మనోజ్, అనుజ్ మరియు వాడి భార్య దీక్ష లను అరెస్టు చేసి తమతో పాటు తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత మీడియాతో కొంతసేపు ప్రశ్నోత్తరాలు నడవగా దినేష్ వర్మ మరియు రాజేశ్ వర్మ వారికి సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చిన తర్వాత మీడియా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్లి కూర్చున్నప్పుడు దీపు పిన్ని సుమతి ఏడుస్తూ రెండు చేతులు జోడించి దినేష్ వర్మ ఎదురుగా నిల్చుని, బావగారు ఈరోజు నా తమ్ముళ్ల మూలంగా మీరు తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది అందుకు నేను క్షమాపణ చెబుతున్నాను. ఈ కుటుంబం తలదించుకునే విధంగా ఇంత నీచానికి ఒడిగడతారని అనుకోలేదు. వాళ్లు ఈ స్థాయికి దిగజారతారని అస్సలు ఊహించలేదు అని అంది.

లేదు లేదు,, సుమతీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇందులో నీ తప్పు ఏముంది? తప్పు చేసింది నీ తమ్ముళ్ళు నువ్వు ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు? జరిగిందేదో జరిగింది నువ్వు అంతా మర్చిపో. ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉండు చాలు అని అన్నాడు దినేష్ వర్మ. .... ఆ తర్వాత కొంతసేపు ఆ ఇంట్లో అంతటా నిశ్శబ్దం ఆవరించింది. జరిగిన విషయం నుంచి అందరూ కొద్దిగా తేరుకున్నారు. అప్పుడు రాజేష్ వర్మ మాట్లాడుతూ, అన్నయ్య ఇంతకీ వాడు ఇదంతా ఎందుకు చేసుంటాడు అంటావు? అని అడిగాడు. .... నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వాడు ఎందుకు చేశాడో వాడికి ఇది ఎలా సాధ్యం అయ్యిందో ఆలోచిస్తున్నాను. బహుశా వాడు మళ్ళీ ఇంట్లోకి రావడానికే ఇదంతా చేసి ఉండవచ్చు అని అన్నాడు దినేష్ వర్మ.

అంతలో దినేష్ వర్మ ఫోన్ కి తన అకౌంట్లో కోటి రూపాయలు జమ అయినట్టు మెసేజ్ రావడంతో దానిని రాజేష్ వర్మకి చూపించాడు. అది చూసి కార్తిక మాట్లాడుతూ, వాడు మన అందరితో ఎలా ప్రవర్తించాడో చూశారా? వాడి పొగరు చూడండి చేతిలోకి నాలుగు డబ్బులు వచ్చేసరికి వాడి బలుపు చూపిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు మనం పడేసిన డబ్బులతో బతికినవాడు ఇప్పుడు తన దర్పం చూపిస్తున్నాడు అని అంది. .... నాకైతే వాడిని అక్కడికక్కడే షూట్ చేసి పడేయాలి అనిపించింది అని అన్నాడు రాజేష్ వర్మ. .... చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు చాలు ఇక ఆపండి. మా అన్నయ్య గురించి ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడకూడదు. అసలు మీరు ఏం మనుషులు? మీ కోసం ఇంత చేసిన వ్యక్తిని పట్టుకుని తీరికగా కూర్చుని తిడుతూ చంపేయాలని మాట్లాడుకుంటున్నారా?

Next page: Episode 124.2
Previous page: Episode 123.2