Episode 129.2
అది గమనించిన తాతయ్య, ఏమయింది పండితులు గారు, ఏమైనా దోషం లాంటివి ఉన్నాయా? అని అడిగారు. .... అవునండయ్య,, ఈ పిల్లాడు పుట్టిన ఘడియలు రాహుకాలంలో సంభవించాయి. అందువలన రాహువు వక్ర దృష్టి ఈ పిల్లాడి మీద ఉంది. దాని కారణంగా ఈ కుర్రాడి జన్మ రాక్షసజాతికి చెందినదిగా అంటే నష్టజాతకుడుగా చెప్పవచ్చు. ఈ కుర్రాడి కారణంగా మీ కుటుంబాల్లో ఎల్లప్పుడూ ఏదో ఒక కీడు సంభవిస్తూనే ఉంటుంది అని చెప్పారు. .... వెంటనే సుప్రియ వర్మ మాట్లాడుతూ, అలా అనకండి పండితులు గారు, ఏదో ఒక ఉపాయం ఉండకపోదు కదా? కొంచెం చూసి చెప్పండి అని అంది. .... అవునండి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా కొంచెం చూడండి అని అన్నాడు తాతయ్య. .... చూడండి ఇటువంటి వాటికి పెద్దగా ఉపాయాలు అంటూ ఏమీ ఉండవు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకసారి శాస్త్రం చూసిన తర్వాతే ఏదైనా చెప్పగలము అని తమ వద్ద ఉన్న ఏవో పుస్తకాలు తీసి అధ్యయనం పేరుతో కొంతసేపు నటించారు.
కొంతసేపటి తర్వాత, ఆఆఆఆ,,, ఒక ఉపాయం దొరికింది. ఇప్పుడే మనం ఒక పూజ జరిపిద్దాం, దానివలన ఒక ఆరేళ్ల వరకు ఆ అబ్బాయి నష్ట జాతకపు చాయల ప్రభావం మీ కుటుంబం మీద తక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ తర్వాత మాత్రం మళ్లీ ఆ నష్టజాతకపు ప్రభావము మీ కుటుంబం మీద ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం ఇటువంటి పూజ జరిపించాల్సి ఉంటుంది. అలా ఆరేళ్లలో మూడు సార్లు పూజ చేసిన తర్వాత ఆ అబ్బాయికి ఉన్న దోషము పూర్తిగా తొలగిపోతుంది. కాకపోతే ఈ పూజ చేయడానికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పారు. .... వెంటనే తాతయ్య మాట్లాడుతూ, మీరు ఖర్చు విషయమై ఏమి ఆలోచించవద్దు, ఎంత ఖర్చయినా పర్వాలేదు మీరు పూజ జరిపించండి అని చెప్పాడు. ఆ తర్వాత పండితులు తాము అనుకున్నట్టే పూజ జరిపించగా ఇంట్లో అందరూ సంతోషించారు.
అంతా పూర్తయిన తర్వాత జగదీష్ వర్మ వెళ్ళిపోతున్న పండితుల దగ్గరకు వెళ్లి, ఏంటి ఇలా చేశారు? నేను చెప్పినట్టు చేయకుండా మధ్యలో మీ సొంత నాటకం ఏమిటి? ఛ,,, వేసుకున్న ప్లాన్ మొత్తం చెడదొబ్బారు అని విసుక్కున్నాడు. .... ఏం చేస్తాం చెప్పండి వర్మ గారు ఇది కలియుగం, మేము కూడా మనుషులమే మాకు కూడా డబ్బులు కావాలి కదా, అవకాశం ఉన్నప్పుడే వీలైనంత పిండుకోవాలి అని నవ్వుకుంటూ వెళ్లిపోయారు పండితులు. అంతా పూర్తి అయిన తర్వాత కొంతకాలానికి జగదీష్ వర్మ ఎవరికీ తెలియకుండా తన తండ్రిని పీక నులిమి చంపేసి దానికి దీపు నష్టజాతకమే కారణం అని అందరి మనసులలోని అనుమానపు బీజం నాటాడు. ఆ తర్వాత మరి కొద్ది కాలానికి కార్తీక మీద ఇంట్లో ఉన్న గాజుతో చేసిన పెద్ద షాండ్లియర్ పడినట్టు చేసి దానికి కూడా కారణం దీపు నష్టజాతకమే అని నమ్మబలికాడు. కానీ అప్పుడు ఆ విషయాలను ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.
ఆ తర్వాత దీపుకి 3 ఏళ్ల వయసున్నప్పుడు రాజేశ్ వర్మ దీపుని మేడ మెట్ల మీద నుంచి తోసేసాడు. కానీ సుమతి దయవల్ల దీపు ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఆ తర్వాత మరో రెండేళ్ళకి కార్తీక, దీపు కలిసి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు కార్తీక చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుని బయటపడింది కానీ దీపు ఒక నెల రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యాడు. ఆ యాక్సిడెంట్ జరిపించింది కూడా జగదీష్ మరియు రాజేష్ ల ద్వయమే. అది చాలదు అన్నట్లు దీపు ఆసుపత్రిలో ఉండగా తన అనుచరుడు భానుతో దీపు ముక్కుకి తగిలించిన ఆక్సిజన్ మాస్క్ తొలగించాడు. అప్పుడు మొదటిసారిగా దీపు హార్ట్ బీట్ పడిపోయింది. కానీ దాని ప్రభావం రివర్స్లో జరిగి కోమాలో ఉన్న దీపు తిరిగి లేచాడు. అలా అన్ని సార్లు కూడా జగదీష్ వర్మ పథకాలు బెడిసి కొడుతూనే ఉన్నాయి. అందుకు కారణం తమ చేతికి మట్టి అంటకుండా ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని కొంతకాలం గ్యాప్ ఇస్తూ ప్రయత్నించడం వల్ల ఏమీ సాధించలేక పోయారు.
దీపుకి ఆరేళ్లు నిండిన తర్వాత ఒకరోజు రాజేశ్ వర్మ సుప్రియ వర్మ వెళ్తున్న కారు బ్రేకులు ఫెయిల్ అయినట్టు చేశాడు. ఆరోజు సుప్రియ వర్మ ఏదో పని మీద దగ్గర్లో ఉన్న మరో ఊరికి వెళుతూ యాక్సిడెంట్ కి గురయింది. అక్కడ నుంచి మరో నాటకం మొదలైంది. ఆ యాక్సిడెంట్ లో సుప్రియ వర్మ చనిపోయినట్టుగా చిత్రీకరించడం కోసం జగదీష్ వర్మ మనుషులు ఆమె బాడీని తప్పించి అలాగే ఉండే మరో బాడీని ఏర్పాటు చేసి అక్కడే కారుని తగలబెట్టేశారు. దాంతో అందరూ సుప్రియ వర్మ యాక్సిడెంట్ కి గురై కాలిపోయి చనిపోయిందని నమ్మారు. ఆ తర్వాత జగదీష్ వర్మ తన పథకం అమలు చేయడం మొదలు పెట్టాడు. నకిలీ సుప్రియ వర్మ అంతిమ సంస్కారాలు పూర్తయిన తర్వాత దీపు బెంగతో మంచం పట్టాడు. ఆ సమయంలో అందర్నీ ఒక దగ్గరకు చేర్చి, ఈ పిల్లాడి నష్టజాతకం వలనే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ముందు నా తండ్రిని పొట్టన పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇంట్లో ఎన్నో అనర్ధాలు జరిగాయి. ఇప్పుడేమో నా చెల్లెలు కూడా పోయింది అని అన్నాడు.
ఆ సమయంలో సుమతి మాట్లాడుతూ, అదేంటి అన్నయ్య గారు అలా మాట్లాడతారు? ఈ రోజుల్లో కూడా అలాంటివి నమ్ముతారా? వాడు ఇంకా చిన్న పిల్లాడు అని దీపు మీద సానుభూతి చూపించింది . .... నేనేమీ అక్కడ ఇక్కడ విన్న చెప్పుడు మాటలు తీసుకొచ్చి మీకు చెప్పడం లేదు. అప్పుడు వాడి జాతకచక్రం తయారుచేసిన పండితులను నేను మళ్ళీ వెళ్ళి కలిశాను. ఆరేళ్లలో చేయవలసిన పూజలు చేయలేదు. దానికి ఫలితంగానే ఇప్పుడు నా చెల్లెలు పోయింది. ఇక మీదట పూజ జరిపించినా ఏమి ఉపయోగం లేదని చెప్పారు అని అన్నాడు. .... అప్పటికి తమ్ముడి మీద విపరీతమైన ప్రేమ కలిగిన కార్తీక మాట్లాడుతూ, మామయ్య అది అంతా అబద్ధం అని అమాయకంగా అంది. .... లేదమ్మా అదే నిజం. మీ అమ్మమ్మ తాతయ్య చనిపోవడానికి వాడి నష్టజాతకమే కారణం. ఇంతకుముందు నీకు జరిగిన యాక్సిడెంట్ కి కారణం కూడా వాడే అని అన్నాడు జగదీష్ వర్మ.
ఆ సమయంలో అందరికీ అదే నిజం అని అనిపించింది. అంతకుముందు జరిగిన ప్రతి కీడుకి దీపు జాతకమే కారణం అని జగదీష్ వర్మ అందర్నీ నమ్మిస్తూ రావడమే అందుకు కారణం. దినేష్ వర్మ కూడా భార్య పోయిన దుఃఖంలో ఒకపక్క తమ్ముడు మరోపక్క బామ్మర్ది చెప్పిన మాటలు విని అన్నిటికీ కారణం దీపు నష్టజాతకమే అన్న నిర్ణయానికి వచ్చాడు. ఆ తర్వాత వెంటనే దీపుని ఇంట్లో నుంచి పంపించేయాలి అనే నిర్ణయం కూడా జరిగిపోయి వెంటనే అమలు చేసేసారు కూడా. జగదీష్ వర్మ అంతటితో ఆగలేదు దీపుని చంపాలనే పథకంలో భాగంగా దీపుని చంపాలని వచ్చి పార్వతి కుటుంబం మొత్తాన్ని చంపేశారు. ఆ తర్వాత దీపు మీద కాలేజ్లో ఎటాక్ చేసి రవి చావుకి కారణం అయ్యారు. కాలేజ్లో అటాక్ జరగడం వల్ల మళ్లీ ఎవరికీ అనుమానం తలెత్తకుండా కొంతకాలం జాగ్రత్తపడి దీపు వైపు రాలేదు.
ఆ సమయంలోనే అభి, దేవి ల పెళ్లి జరిగింది. అంతేకాదు దీపు మొట్ట మొదటిసారి అభిని కలిసినప్పుడు జరిగిన అటాక్ కూడా జగదీష్ వర్మ చేయించినదే. ఎందుకంటే ముందు అభిని చంపేసి ఆ తర్వాత అనుని కూడా లేపేసి తన కూతురు అయిన దేవిని తన చేతిలో కీలుబొమ్మని చేసుకొని అభి ఆస్తులు మొత్తం కొట్టేయాలని పథకం రచించాడు. కానీ ఆ రోజు దీపు కారణంగా ఆ పథకం అమలులో ఫెయిల్ అయ్యాడు. అలాగే కాలేజీలో కార్తీక మీద కిషోరీ లాల్ కి కాంట్రాక్ట్ ఇచ్చి అటాక్ చేయించాడు కానీ అప్పుడు కూడా దీపు అడ్డుపడ్డాడు. ఇలా జగదీష్ వర్మ చాలా ప్లాన్లు వేసి చాలా మంది మీద అటాక్స్ జరిపించాడు. అంతేకాదు ఇక్కడ జగదీష్ వర్మ గురించి ఎవరికీ తెలియని మరొక రహస్యం దాగి ఉంది. అతనికి గాయత్రి వర్మ కాకుండా మరొక భార్య కూడా ఉంది. ఆమెకు పుట్టిన వారే రుద్ర రాజ్ మరియు అనిల్ రాజ్. అవును ఇన్స్పెక్టర్ రుద్ర జగదీష్ వర్మ పెద్ద కొడుకు. వాడిని తాను చేసే కార్యకలాపాలు అన్నింటికీ దూరంగా ఉంచి భవిష్యత్తులో తన అవసరాలకు ఉపయోగపడే విధంగా ఐపీఎస్ ని చేశాడు.
చిన్న కొడుకు అనిల్ రాజ్ ని మాత్రం తన చీకటి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా తయారు చేసుకుంటున్నాడు. అనిల్ రాజ్ గాడితో గొడవపడినప్పుడే దీపుని చంపే విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకున్నాడు జగదీష్ వర్మ. అందులో భాగంగానే అవకాశం దొరికిన వెంటనే దీపు తినే టిఫిన్ లో మత్తుమందు కలిపి కిడ్నాప్ చేయించి ఏజెన్సీ ప్రాంతంలో ఒక లోయ దగ్గరకు తీసుకువెళ్లి తన మనుషులతో కొట్టించి పోయే ముందు అన్ని విషయాలు తెలుసుకో అని గొప్పగా తాను చేసిన అక్రమాలు, అరాచకాలు అన్నింటినీ దీపుతో చెప్పి ఆ తర్వాత అక్కడికి వచ్చిన రాజేష్ వర్మతో కలిసి దీపుని షూట్ చేసి లోయలో పడేశారు. బుల్లెట్ గాయాలు తగిలే ముందు రాజేష్ వర్మ కూడా తన కుతంత్రాలు అన్నింటిని దీపుతో చెప్పాడు. అది విన్న దీపు రాజేష్ వర్మతో మాట్లాడుతూ, నేను మాత్రమే కాదు నిన్ను మన కుటుంబం మొత్తాన్ని కూడా ఈ దుర్మార్గుడు(జగదీష్ వర్మ) అంతం చేసేస్తాడు అని హెచ్చరించాడు. కానీ రాజేశ్ వర్మ ఆ మాటలను చెవికి ఎక్కించుకోక అదే రోజు శవమయ్యాడు. కానీ ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులు ముందు కూడా అను మరియు అభి ల మీద మరొక ఎటాక్ జరగడం కూడా జగదీష్ వర్మ పథకమే. వాళ్ల ద్వారా నన్ను దగ్గరకు రప్పించుకొని చంపడానికి ప్రయత్నం చేశారు. అది వర్కవుట్ అవ్వక కొడుకుని పోగొట్టుకున్నాడు. (ఫ్లాష్ బ్యాక్ పూర్తయింది)
ఇది జరిగింది అన్నట్టు మాట్లాడటం ఆపి ఆయాసపడుతున్నాడు జగదీష్ వర్మ. అతని మాటలు విని ఇంతకాలంగా అంత పెద్ద పధక రచన చేశాడా! అని అందరూ షాక్ అయ్యి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అందరూ ఆ షాక్ లో ఉండగానే జగదీష్ వర్మ మళ్లీ ఒకసారి తన వక్రబుద్ధి చూపించాడు. పక్కనే ఉన్న తార చేతిలో నుంచి గన్ లాక్కొని నా మీదకి షూట్ చేశాడు. అది గమనించి నేను తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఒక బుల్లెట్ నా పక్కలో దిగింది. వెంటనే అలర్ట్ అయిన సోము మరియు జెస్సీ జగదీష్ వర్మ మరో బుల్లెట్ కాల్చే లోపు అదుపులోకి తీసుకున్నారు. ఎంతైనా చీకటి వ్యాపారాలు చేసే మాఫియా లీడర్ కదా ఆమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఉంటాడా ఏంటి? నాకు బుల్లెట్ తగలడంతో ప్రీతి, పవిత్ర, కార్తీక, కవిత అమ్మ, సుమతి పిన్ని వెంటనే నా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చారు.
ఏం పర్వాలేదు,,, నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మీరు కంగారు పడకండి అని వాళ్లకు చెప్పి, ఇదిగో ఈ నీచుడుకి ఇంకొద్ది గంటలు మాత్రమే ఈ భూమి మీద టైం ఉంది. మీలో ఎవరికైనా వాడితో ఏదైనా పని ఉంటే చూసుకోండి అని అన్నాను. కానీ ముందుగా అను నా దగ్గరికి వచ్చి తన చున్నీ తీసి నాకు దెబ్బ తగిలిన చోట గట్టిగా బిగించి కట్టింది. ఇప్పుడు తన కళ్ళలో భయం లేదు కానీ నా మీద ఉన్న ప్రేమతో కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న వారిలో చాలా మంది చేతులతోనూ చెప్పులతోనూ నా కంస మామకి దేహశుద్ధి చేసి వదిలిపెట్టారు. నాన్న, అత్తయ్య, దేవి అక్క, వాళ్ళమ్మ గాయత్రి ఇదంతా చూస్తూ కూడా కదలకుండా అక్కడే ఉన్నారు. మరో పక్క కవిత అమ్మ మౌనంగా రోదిస్తుంది.
అంతవరకు మౌనంగా ఉన్న దినేష్ వర్మ మాట్లాడుతూ, కానీ నా తమ్ముడు రాజేష్ వర్మకి వీడితో చేతులు కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? అని అన్నాడు. .... మిస్టర్ దినేష్ వర్మ గారు మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. మీ తమ్ముడికి మీ ఎదుగుదలను చూసి మీ మీద అసూయ. అంతేకాదు మీరు స్థాపించిన వ్యాపార సామ్రాజ్యంలో తనని వాడుకుంటున్నారు అని భావించేవాడు. నేను పుట్టనంతవరకు ఈ ఆస్తి తనదే అని భావించాడు. కానీ నేను పుట్టిన తర్వాత ఈ ఆస్తి మొత్తం తనకు దక్కదు అని అర్థం అయిపోయి ఆస్తిని చేజిక్కించుకోవడం కోసం కుటుంబం మొత్తాన్ని లేపేయడానికి ఈ నీచుడుతో చేతులు కలిపాడు. కానీ తాము వేసిన పథకానికి తను కూడా బలి అవుతాడని తెలుసుకోలేకపోయాడు. అంతేకాదు ఈ నీచుడు చేసే చీకటి వ్యాపారాలకు మీ కంపెనీని వాడుకోవడానికి సహకరిస్తుంది మీ తమ్ముడే. ఈ నీచుడి ఆద్వర్యంలొనే మీ తమ్ముడి బామ్మర్దుల ద్వారా నకిలీ మందుల సరఫరా పేరుతో మాదకద్రవ్యాల సరఫరా యధేచ్చగా సాగిపోతుంది.
మీ తమ్ముడు అంటే మీకు చాలా ఇష్టం కదా కానీ మీ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించాడని మీకు తెలుసా? కానీ మీరేమో మీ తమ్ముడు జీవితం బాగుండాలని ఒక మంచి అమ్మాయిని వెతికి ఆయనకి ఇష్టంలేని పెళ్లి చేశారు. అందువలన ఎన్నో ఆశలతో ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన పిన్ని జీవితాన్ని మీరు నాశనం చేశారు. బాబాయ్ పిన్నితో సంసారం చేయనేలేదు, కానీ ఈ పిచ్చిదేమో కుటుంబం పరువు ప్రతిష్టలు, గౌరవం కాపాడటం కోసం తన సుఖసంతోషాలను త్యాగం చేసి పిచ్చిదానిలా ఈ ఇంట్లో అందరి అవసరాలను కనిపెట్టుకొని నీ తమ్ముడు పెట్టే చిత్ర హింసలను భరిస్తూ కొవ్వొత్తి లాగా కరిగిపోతుంది. అందరూ తనని గొడ్రాలు అని నిందలు వేస్తున్నా భరిస్తూ కుమిలి కుమిలి జీవతం వెళ్ళదీస్తోంది. మీ అందరికీ తెలియని ఇంకో విషయం చెప్పనా? ఈ ఇంట్లోకి వచ్చిన పవిత్ర బాబాయ్ మరియు ఆయన ప్రేమించిన ఆడదానికి పుట్టింది. పిన్ని పవిత్రని దత్తత తీసుకొని ఇంట్లోకి తీసుకొని రావడానికి బాబాయ్ అంత సులువుగా ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసా? పవిత్ర తన సొంత కూతురు అని బాబాయ్ కి ముందే తెలుసు. లేదంటే భార్యతో సంసారం చేయటానికి ఒప్పుకోనివాడు అనాధ పిల్లను ఈ ఇంట్లోకి తీసుకువస్తాను అంటే ఎలా ఒప్పుకుంటాడు అనుకున్నారు?
ఇదిగో ఈ నీచుడే పవిత్ర తల్లిని కూడా చంపేశాడు. పవిత్ర అమ్మమ్మ దయవల్ల ఈ నీచుల నుంచి తప్పించబడి అనాధ ఆశ్రమానికి చేరింది. దైవ సంకల్పబలం వల్ల తిరిగి నా ద్వారా పిన్ని సహాయంతో ఈ ఇంట్లోకి చేరింది. కానీ ఈ విషయాలు అన్నీ ఆరోజు నేను వీళ్ళ చేతిలో చచ్చే ముందు మాత్రమే వాళ్ల నోటి ద్వారానే విన్నాను. బహుశా నేను బతుకుతానని వీళ్ళు ఆరోజు అనుకొని ఉండరు. అంతేకాదు ఈ నీచుడి పథకంలో భాగంగా తర్వాత టార్గెట్ నా బంగారం. తన ఆస్తికే కాదు మిగిలిన మూడు కుటుంబాల్లోని ఆస్తి కోసం కూడా పక్కా ప్లాన్ వేసుకుని ఉన్నాడు. వారసులు అందర్నీ చంపేసి మిగిలిన ఆడవాళ్లలో తన మాట వినని వారిని కూడా చంపేసి వినే వారిని మాత్రం చేతిలో పెట్టుకుని అందరి ఆస్తులను కొట్టేసే ప్లాన్ వేసాడు. అందులో మీరు కూడా పోతారండోయ్ దినేష్ వర్మ గారు.
ఆ మాట విన్న వెంటనే సుమతి పిన్ని పవిత్రను కౌగిలించుకుని ఏడ్చింది. పవిత్ర కూడా పిన్నిని కౌగలించుకుని అమ్మ,,, అని ఏడుస్తుంది. ఇటువైపు అప్పటి దాకా మౌనంగా రోదిస్తున్న కవిత అమ్మ నెక్స్ట్ టార్గెట్ బంగారం అని తెలిసిన వెంటనే కోపంతో రగిలిపోతూ ముందుకు వచ్చి తన అన్న అయిన జగదీష్ వర్మ రెండు చెంపల మీద ఫటా,,ఫటా,, మని నాలుగు పీకి మొహం మీద ఉమ్మి,,, ఛీ,,, దుర్మార్గుడా,,, తోడబుట్టిన చెల్లెళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గు లేదురా నీకు. ఏం పాపం చేశారురా ఈ కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ నీకు. ఆస్తులే కావాలి అనుకుంటే మా ముందుకు వచ్చి చేతులు చాచి అడుక్కుంటే బిచ్చం వేసేవాళ్ళం కదరా నీకు? కన్నకూతురి మాంగల్యాన్ని కూడా తుంచేయడానికి ఒడిగట్టిన నీలాంటి నీచుడిని తోడబుట్టిన వాడు అని చెప్పుకోవడానికి కూడా కంపరంగా ఉంది. నీలాంటి వాడు చచ్చినా ఎవ్వరూ బాధపడరు అని ఆవేశంతో ఊగిపోయింది. వెంటనే దీపక్ అంకుల్ ముందుకు వచ్చి అమ్మను పట్టుకుని పక్కకు తీసుకువెళ్లారు.
అంతలో జగదీష్ వర్మ మళ్లీ తన తెలివితేటలు ప్రదర్శిస్తూ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ బాగా దెబ్బలు తగిలి ఉండటంతో కదలలేక పోయాడు. అది చూసి నాకు రక్తం మరిగిపోయి వాడి గెజం కింద ఒక గట్టి పంచ్ ఇచ్చేసరికి మెడ వెనక్కి వంగి బయట గార్డెన్ లోకి వెళ్లి పడ్డాడు. గయ్స్,,, వాడు చచ్చాడో లేదో చూసుకుని తీసుకువెళ్లి బండిలో పడేయండి అని చెప్పగానే సోము, జెస్సీ, తార ముగ్గురు బయటికి వెళ్లారు. నేను దేవి అక్క వాళ్ళ అమ్మ గాయత్రీ దగ్గరకు వెళ్లి, సారీ అత్తయ్య ఆయన మళ్ళీ ఇంటికి వస్తాడు అని ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే వాడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కేవలం మన కుటుంబానికి చేసిన ద్రోహం మాత్రమే కాదు. ఇన్నేళ్ళలో వాడు మారణాయుదాలు, డ్రగ్స్ సరఫరా చేస్తూ పెద్ద మాఫియా నాయకుడిగా ఎదిగాడు. ఈ రోజు వాడు చేసే కార్యకలాపాలు అన్నీ బట్టబయలు అయ్యి దేశద్రోహిగా మిగిలాడు. ఇప్పుడు నేను వాడిని డిపార్ట్మెంట్ కి అప్పజెబుతున్నాను బతికుంటే జీవితాంతం జైల్లో మగ్గిపోతాడు లేదంటే వాడి బాడీ మీ ఇంటికి చేరుతుంది. ఇంతకాలం ఈ విషయాలు అన్నీ మీకు తెలిసి కూడా మౌనంగా ఉండడం మీరు చేసిన తప్పు. దేవి అక్క వైపు చూసి, సారీ అక్క,,, ఇకమీదట నీకు తండ్రి లేడనుకో అని అన్నాను. .... లేదురా తమ్ముడు ఇంత విన్న తర్వాత ఇంకా నేను ఆయన కోసం బాధపడటంలో అర్థం లేదు. నా కుటుంబాన్ని కూడా నాశనం చేయాలి అనుకున్నాడంటే అసలు వాడు నా తండ్రి కాదని అనుకుంటాను. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంది దేవి అక్క.
ఆ తరువాత నేను అక్కడ నుంచి బయలుదేరుతుంటే, "నువ్వు ఇక్కడే ఉండుపోరా ఇది నీ ఇల్లే" అని అన్నారు దినేష్ వర్మ. ఇంత కాలం తర్వాత నన్ను మొదటిసారిగా కొడుకుగా గుర్తించినందుకు మనసులో ఎక్కడో దాగి ఉన్న బాధ బయటకి పొంగుకొచ్చి వెళ్తున్న వాడిని ఆగి కళ్లు మూసుకున్నాను. ఆ తర్వాత వెనక్కి తిరిగి, ఏ హక్కుతో ఉండాలి దినేష్ వర్మ గారు? ఇక్కడ నేను ఉండలేను, అసలు నేను ఇక్కడికి ఎందుకు తిరిగి రావాలో అర్థం కావడం లేదు. అసలు కథ తెలిసేటప్పటికీ ఇంతకాలం మీకు నా మీద ఉన్న ద్వేషం 30 నిమిషాల్లో ఎగిరిపోయింది. మీరు పశ్చాత్తాపంతో నన్ను ఇక్కడ ఉండిపొమ్మని చెబుతున్నారు కాబోలు. కానీ నన్ను కన్న తల్లి నన్ను మర్చిపోయిందండి అని అన్నాను. .... కానీ తమ్ముడు కనీసం పిన్ని, పవిత్ర, నాకోసం అయినా ఇక్కడ ఉండిపోరా అని అంది కార్తీక అక్క. .... వద్దులే అక్క నీ తల్లి నిన్ను గుర్తు పెట్టుకుంది. తల్లితో కలిసి సంతోషంగా ఉండు. ఒకవేళ ఎప్పుడైనా నీకు నన్ను చూడాలనిపిస్తే తప్పకుండా వచ్చి నన్ను కలవచ్చు. .... ఒకవేళ మీ అమ్మకి జ్ఞాపకం వచ్చి నీ గురించి అడిగితే? అని అన్నారు దినేష్ వర్మ. .... నాకు మళ్లీ కన్నీళ్లు ఆగలేదు.
దుఃఖంతో నోరు పెగలడం లేదు. అయినా సరే నన్ను నేను సంభాళించుకుని, అసలు ఏ తల్లైనా తన కన్న బిడ్డని ఎలా మర్చిపోతుంది? కానీ ఇప్పుడు నా పరిస్థితి చూస్తుంటే నేను ఎవరికి పుట్టానో కూడా తెలియని స్థితిలో ఉన్నాను. ఎవరో కని బజార్లో పడేస్తే మీ అందరూ కనికరించారేమో అన్నట్టు తయారయింది నా బతుకు. జరిగిందంతా తలుచుకుంటే ఇంతకాలం నేను తల్లి కోసం పడ్డ ఆవేదన అంతా వృధా అని అనిపిస్తుంది. బిడ్డని గుర్తుపట్టని తల్లికి పుట్టిన భాస్టర్డ్ ని నేను,,, అని గట్టిగా అరిచి అక్కడినుంచి గబగబ అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్లిపోయాను. కానీ నా వెనుక భోరున ఏడుస్తూ నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన కవిత అమ్మను చూసుకోకుండా కారు స్టార్ట్ చేసి నా టీం తో కలిసి వెళ్ళిపోయాను.
నేను ఐబి డిస్పెన్సరీ లో నాకు తగిలిన బుల్లెట్ తీయించుకుని అక్కడి పనులతో బిజీగా ఉన్న సమయంలో ప్రీతి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ముందు నేను లిఫ్ట్ చేయలేదు కానీ మళ్లీ మళ్లీ కాల్ చేస్తూ ఉండడంతో పక్కకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటిరా బంగారం,,, అన్ని సార్లు ఫోన్ చేస్తున్నావ్ ఎందుకు? అని అడిగాను. .... అటు నుంచి ప్రీతి భోరున ఏడుస్తూ, అన్నయ్య,,, అమ్మ కళ్లు తిరిగి పడిపోయింది. హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకొచ్చాము కానీ నీ గురించే ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య నువ్వు తొందరగా ఇంటికిరా,,, అని ఏడుస్తూ చెప్పింది. .... వెంటనే నా గుండెల్లో రక్తం అంతా ఇంకిపోయినట్టు విపరీతమైన నీరసం ఆవహించింది. ఇంతవరకు నేను కవిత అమ్మ గురించి ఆలోచించలేదు నామీద నాకే కోపం పెరిగిపోయి పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడను కొట్టి, నేను వస్తున్నాను బంగారం,,, నువ్వేమీ కంగారు పడొద్దు అని చెప్పి కాల్ కట్ చేసి, మిగిలిన పని నా టీం ని చూసుకోమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను.